29, ఆగస్టు 2020, శనివారం

"తెలుగు భాషా దినోత్సవం" 29 ఆగష్టు 2020

 


శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా  "తెలుగు భాషా దినోత్సవం"
 తెలుగు భాష మీద కవనాలు, వ్యాసాలు, చిట్టి చిట్టి కధలు.



తెలుగు భాష వైభవములు వెలుగుపంచి 
సుధలు చిందించు మకరంద సొబగుపంచి
తావులందించు కవనమ్ము ఠేవజూపి 
తెలుగు తేనెలు పొంగంగ తీయగాను  !
 
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
 
*******************************************
 
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా..ఆఅ..
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది..... పలికినది.... పలికినది
చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా
 
ఎంత చిక్కగా చెప్పారండీ #ఆత్రేయ గారు...
ప్రబంధకన్యలని వర్ణించినట్టు అటెటో వెళ్ళకుండా ఇటు ఇక్కడే తెలుగు గడ్డమీదే చూపెట్టారు అన్ని ఉదాహరణలు...
మొదటే పట్టేశారు....తెలుగులో తేటదనాన్ని...
ఆ తెల్లవారే వెలుగులో ప్రశాంతతని నిర్మలత్వాన్ని...
అక్కడితో ఆగకుండా సెలయేటి పరుగులతో గలగలలతో పోల్చారు...
అక్కడితో ఆగిపోలేదు.... ఇప్పటికీ పడుచుగానే ఉన్న  తెలుగాడపడుచు ఎంకిని నిలబెట్టారు...ఇంతి ముద్దరాలి సొగసును ముద్దబంతి తో కలిపారు...
మరి ఆ చిగురు నుంచి ఈ చివరదాకా తెలుగు గడ్డ పై పారుతూ సస్యశ్యామలం చేస్తున్న గోదారి కెరటాల గీతాలన్నారు.... చూడండి...అక్కడ చల్లగా చిరుజల్లు లా ...జల జల గల గలా....అంటూ...
ఆ కన్నె అప్సర ప్రేమ్ నగర్ దే ఐనా....ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో తెలుగులాగే నిలిచి ఉంది...
అప్సరసని మీ గుండెల్లో ఉంచండి నేనేం అనుకోను...
కొంచెం తెలుగు ని బయటకు వదలండి...
#తెలుగు లో మాట్లాడండి...
తెలుగు లో వ్రాయండి.....
తెలుగు లో పాడండి.....
తెలుగు వాడండి....
 
 పంచినది. . .  కన్నాజీరావు 
***********************************
 
గిడుగు రామ్మూర్తియే గెలిపించి నోయి
       ఘీంకరించి తెలుగున్ కీర్తింప జేసె
పడుబాటు యయ్యెడి వ్యవహార భాష
       ప్రాభవంబున్ గూర్చి ప్రష్టుడుయయ్యె
కడుదు జూపెనితండు గ్రంథ భాష వలె
       గగనమున నిలిపి గరువము వొందె
బడిభాష వలె మార్చి వాడుక భాష
       పాఠ్యాంశముగ  జేసి వాక్పతియయ్యె
 
తేటగీతి 
గృహమునందు మాట్లాడెడి తెలుగు భాష
తేనె జిందించు చుండగా తేనె ద్రావ
వలసిన యవశ్యమేమి నపరిమితమగు
మధువులూరు తెలుగుభాష మహిమయిదియె.
 
వెంకట్.సిహెచ్ 
******************************
 
ఆంధ్రుడి కంటివెలుగు అచ్చ తెనుగు
 
సేకరణ : జి. రామ్మోహన్ రావు 
రచన:డి.కుమార స్వామి రెడ్డి
ఊరు: పలమనేరు
 
అమ్మతో మొదలై  
చేత వెన్నముద్దతో
చెంగల్వపూదండలతో
భావపరిమళం గుబాళించే
పూదోట తెలుగుభాష
అమ్మదనం కమ్మదనం
నిండుగా మెండుగా
జాలువారు తీయతేనియల 
సెలయేరు తెలుగు!!! 
 
సకల భాషల సాహితీ రీతులను
నవరస విరచిత ప్రభందాలను
ఆధునిక భావధార ఝరులను
అక్షరబధ్ధం చేసే 
అక్షరశిల్పుల ఆధారశిల ,
రచయితల చేతి ఉలి తెలుగు!
సకల భావధునల రూపకర్తల
ఆలోచనలకు చైతన్యధార తెలుగు
 
ఆంధ్రుడి అనంత శ్వాస,
అజంత భాష అచ్చ తెనుగు
సమస్త అవధాన ప్రక్రియల
విశ్వభాషా కోటిలో మాతృక...
ఒకటే ఒకటి మన తెలుగు!!!
సిరిసిరి మువ్వలు లిమిరిక్కులు
ఋక్కులు హైకులూ
 నానీలూ అనంతం....
పెక్కుసాహితీ రీతులు 
మహాప్రస్థానంలా అలరారి
మరో ప్రస్థానంగా జూలుదుల్పి జాలువారును మన తెనుగు!!!
 
అమరకోశం  పద కమనీయం
పూల వనంలా  సదా రమణీయం
ప్రాకృతం సంస్కృతం 
కవలపిల్లలై అద్వైతంలా 
భాసిల్లి మురిపించే మైమరిపించే
సజీవధారా పదకోశం
నిత్యం చిరంజీవం అజరామరం
ఒక తెలుగుకే స్వంతం
నరుడి నరనరంలో లావాలా
ఉరకలెత్తే  నవరస భావాల 
ఝోషకు చేతనకూ
సాక్షర శబ్ద జలపాతం
 మన తెలుగు భాష!
 
ఖేదం- మోదం ,భేదం -ఆమోదం
సమస్తం అక్షరాలా అక్షరాల్లో
విలసిల్లీ సజీవకవనంగా
వికసించే విద్వత్కవనం
వాడని వడలిపోని 
నిత్యం నవనవలాడే
దివిజ సుమం తెలుగు!
 
అన్య భాషల చీడలు 
చుట్టూరా చేరి ఉరకలెత్తుతూ
ఊడలతో ఊయలలూగినా
ప్రతి పీడనల ఎదురు గాలికీ
ప్రతిఝటనలా హోరెత్తుతూ
తలఎత్తుకు ఉర్రూతలూగే 
మహవృక్షం మన తెలుగు
అఙ్ఞాన తిమిరాన్ని పారద్రోలే
ఙ్ఞానకాంతులు విరజిమ్మే
ఆంధ్రుల చేతిదివిటీ తెలుగు!! 
 
యుగ కవి నుండి యువకవి వరకూ
ఆంధ్రుడి కంటివెలుగు అచ్చ తెనుగు
ఆంధ్రులఠీవి  మన చేతిదివిటీ తెలుగు!! 
నిజజీవిత కుడ్యంపై
అనంత సంఖ్యాకులందరికీ 
అమ్మఒడి గుండెతడి 
ఝనతగల మన తెలుగునుడి
వీరుడికి స్థూపంలా
చీకటిలో మణిదీపంలాశోభిస్తూ
 సకల శోకాలను రూపుమాపు
మన కంటి వెలుగు తెలుగు 
 
రచన:డి.కుమార స్వామి రెడ్డి
 
చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ ...
నీవే తల్లివి తండ్రివి నీవే గురుడవు దైవము..
అ...అమ్మ అను !!
ఆ...ఆకలేస్తోంది ...
ఇ ... ఇంట్లో ఏమున్నాయ్?
ఈ ..ఈ కూర వద్దు
ఉ..ఉప్పు తక్కువైంది
ఊ ....ఊయల గట్టిగా ఊపు!
ఋ .. ఋషి అంటే ఎవరు?
 
ౠ....ౠ..ౠ అని బండిపై పోదామా?
ఎ.. ఎక్కడికి వెళదాం ?
ఏ ...ఏదోక చోటుకి
ఐ...ఐదు రూపాయలు కావాలి
ఒ... ఒక్క రూపాయి ఉంది !
ఓ...ఓడ మీద వెళదామా?
ఔ...ఔట్లు దీపావళికి కొందామా?
అం ... అంతకుమించి అడగొద్దు...
అః... అః... అః.. నాక్కావాలి...
 
పుట్టాకా ఏడుపు, నవ్వు తప్ప వేరే భాష తెలియని మనకి ..
 
'అమ్మ' అనే పలుకుతో మొదలై మన బాధ , ఆనందం, ఇష్టం ,కోపం , సరదా అన్ని రకాల భావాలను వ్యక్తం చేయటానికి మనం నేర్చుకునే కొత్త భాష , అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష,మన మాతృభాష ... దేశభాషలందు తెలుగు లెస్స అని పలికే మన  తెలుగు .
 
కోపమో-భయమో , నవ్వో-ఏడుపో ఉత్సాహమో - ఉద్రేకమో, ఆత్రమో ..ఏదొచ్చినా గుర్తుకొచ్చేది 'అమ్మ' తోడుగా తను నేర్పిన భాష , దేశాన్ని ఉద్ధరించడానికి ఎన్ని భాషలు నేర్చుకున్నా , మనలో కలిగే భావోద్వేగాలకి ఆయువు పోసి అక్కున చేర్చుకుంటుంది , పరభాషలో ఎంత నవ్వుకున్నా .. ఏడుపొస్తే మాత్రం నేనున్నాను దా'యని' తన ఒడిలో జోలపాడుతుంది ,  తనకి మనం దూరమైనా తాను మనని వీడదు .. అమ్మ ఎంత మంచిదో , తానూ అంత మంచిది
 
2025 నాటికి " మరాఠీ, హిందీ, తమిళం, మలయాళం " తప్ప వేరే భాషలు ఉండవని నిపుణులు తేల్చేసారు(ట)!!
 
అందుకే ఉన్న కొన్నాళ్ళైనా మన భాషలోనే నవ్వి,ఏడుద్దాం !!
 
నాకు అమ్మ-నాన్న లేరు, మమ్మీ-డాడీ మాత్రమే ఉన్నారు అని మన పిల్లలు ఏడవకుండా చేయగలిగితే ...కనీసం 2026 వరకు తెలుగుని బ్రతికించవచ్చు...
 
పులులు,సింహాల బొమ్మలని చూసినట్టు తెలుగుని మ్యూజియంలో మాత్రమే చూసే అవకాశం రాకుండా చేద్దాం !
 
నాలోని ప్రతీ భావనకి ప్రాణమిచ్చే నా  తెలుగుభాషకి నా ప్రణామం
అందరికీ ...
"తెలుగుభాషా దినోత్సవ" శుభాకాంక్షలు
మా తెనుగు తల్లికీ  అక్షరసుమాల మాల !!
 
 తెలుగు భాషలోన తేనలు ప్రవహించు
తీపిరుచుల భాష తెలుగు భాష
తెలుగు మాట వలన తేజమ్ము పెరుగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల
 
ఝాన్వి
***************************
 
తెలుగు భాష మీద నాలుగు ఏళ్ళ  క్రితం రాసిన గేయ కవిత
*పలుకు తేనె  తెలుగు ఇది
తేట తేట తెలుగు*
తల్లి ప్రేమ తెలుగు ఇది
భావ గీతం తెలుగు
వెలుగు
 
చ:
చదువులమ్మ వాకిట
సాహిత్య పూదోట
అన్నమయ్య త్యాగయ్య
నోట సూదలొలికిన తెలుగు
పాట.
నన్నయ్య భావుకత శ్రీనాధ
చతురత
రాయల భువన విజయ
ఆముక్తమాల్యద
పలుకు తేనె తెలుగు.......
 
చ:
అవధానం నీకు ఆభరణం
పద్యం,శతకం అలంకారం
తొలి అక్షరం లో
అమ్మతనం చందస్సున
జానతనం
గద్యం లో
గాంభీర్యం సిరులొలికే సీస
పద్యం.
అనితరం ఆటవెలది,తేటగీతి
తీయనిది
 
కమ్మని తెలుగుని మరవద్దు
అది మనకు ఎంతో ముద్దు
తెలుగు తనం మనకు ధనం
పదం పదం లో ఉంది
వన్నెతనం
భాషలు ఎన్నున్నా
మన తెలుగు భాష మిన్న
దేశ భాషలందు తెలుగు లెస్స
అనండి అందరు హైలెస్సా
పలుకు తేనె తెలుగు.......
 
ఎం.పద్మలత
*********************
 
 
గిడుగు రామమూర్తి -నిత్య చైతన్య స్ఫూర్తి
 
తెలుగు భాషకు తాను 
కొండంత అండయై
నిండు మనమున  సేవించె
గిడుగు యను పిడుగు..
అంతరిక్షమంత కడు దూరమున్న
కాఠిన్య గ్రాంథికమును
అమృతభాషగా మార్చి
అవనీతలముకు నడిపించిన
అమేయ సంకల్ప బలమున్న
అపర భగీరథుడితడు..
సవరజాతి జన హృదయాలలో 
అక్షర జ్యోతులు వెలిగించి
మానవతను చాటుకున్న
మహనీయుడితడు...
సవర వ్యాకరణమునకై
నిఘంటువులు సృజియించి
సామాన్యులకు చేరువ చేసిన
అసామాన్యుడితడు..
శిష్టజన వ్యవహార భాషోద్యమ
శంఖమునే పూరించి
జీవద్భాషకై పోరాడిన
సమరశీలి యితడు..
ఆంధ్రసాహిత్య పరిషత్తు నందున
అనర్గళముగ అద్భుతముగ వాదించి
మెప్పించి ఒప్పించిన
మేరుగిరి శిఖరమితడు..
మహాకవుల తిరస్కార దూషణలకు
వెరవక మున్ముందుకు సాగిన
కార్యశీలి యితడు..
ఆంధ్ర పండిత భిషక్కుల
భాషా భేషజమును
ఉద్యమించి ఛేదించిన యోధుడితడు..
తెలుగు మాసపత్రికను
తెగువతో నడిపించి
వ్యవహార భాషకు ఊతమిచ్చిన
వటవృక్ష మితడు..
బహుభాషావేత్తయై
పరిశోధనలు గావించి
గ్రంథకర్తగా గణుతికెక్కిన
కీర్తి శిఖరమితడు..
కావ్య భాష కన్న
కమనీయము వాడుకభాషని
నీరాజనం పట్టిన నిస్వార్ధశీలి యితడు..
పాఠ్య గ్రంథాలలోన ప్రజలభాష కొరకై
అలుపెరుగని కృషి సల్పిన
అక్షర హాలికుడితడు..
ఆధునిక వ్యవహార భాషకు
ఆలంబనగ నిల్చి
అక్షరాస్యతను పెంచిన
ఆరాధ్యుడితడు..
కైజర్ ఎ హింద్ గా రావుబహదూర్ గా
కళా ప్రపూర్ణునిగ వెలిగిన
అనర్ఘ రత్నమితడు..
తెలుగు భాషా దినోత్సవ వేడుకకు
మూలకారకుడైన పరమపూజ్యుడు
పావనుండు ధన్యుడితడు..
గిడుగు రామమూర్తి యను
కారుణ్య మూర్తి..
నిత్య వ్యవహార భాషా దీప్తి
నేటి తరానికి చైతన్య స్ఫూర్తి..
అంజలింతము రండి..
అమ్మలార..అయ్యలార!
అందరూ తరలిరండి..
అంజలింతము రండి..!!
********
చల్లా దేవిక.
 
శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఒక చిన్న గేయం.
 
తెలుగు పలుకు తేనె లొలుకు
 తెలుగు వెలుగు దిశలచిలుకు
తెలుగు కన్నలేదు మిన్న
దేశ భాషలెన్ని ఉన్నా
 
కవి పోతన నవ చేతన కవితా మయ జలధిలో
విశ్వదాభిరామ వేమ వినిపించిన శైలిలో మువ్వగోపాలుని పద మువ్వల సవ్వడులలో
 త్యాగరాయ కృతిలో సంయోగ రాగ లయలలో
 
మొల్ల రామ భక్తి గాధ రామదాస భక్తి భోధ
రాణి రుద్ర మాంబ, నాగ మాంబ వంటి వని తలలో
తిక్కన కవితాత్మ ఖడ్గతిక్కన వీరాత్మల లో
హంపి అమరావతీల సొంపగుశిల్పాలలో
 
సర్కారు తెలంగాణ రాయలసీమల ఒడిలో తొడిగిన తొలి తెలుగు మొగ్గవికసించిన వేళలో
కలతలు కలహాలు మాని కలిసిన శుభ ఘడియలో
వెలితి కానరాని తెలుగు
వెలుగుల నవ జగతిలో
 
డి నాగమణి.
************************************
 
వ్యావహారిక భాషా ఉద్యమానికి గిడుగు,
తాను రధ  సారధిగా వేసాడు తొలి అడుగు,
గురజాడ, కందుకూరి, అందుకు పట్టారు గొడుగు,
అయ్యాడుగ్రాంధిక భాషావాదుల పాలిటి పిడుగు....
 
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
*************************************
 
పరభాషా జోరువానలో తెలుగు తల్లి తడవకుండా గొడుగు పట్టెను
మన గిడుగు.
అచ్చ తెలుగు చిచ్చర పిడుగు
మన గిడుగు
గడపకు కట్టిన చివురు మామిడి తోరణం తెలుగు
ముంగిట దిద్దిన ముగ్గుల సోయగం తెలుగు
అమ్మ చేతి గోరుముద్దల రుచి తెలుగు
అట్లతద్ది ఊయల వేగం తెలుగు
హరిదాసుల హరినామ సంకీర్తన తెలుగు
వెన్నెల మడుగు మన తెలుగు
కోయిల పాట
మన తెలుగు
 
తెలుగు తల్లికి
పద్యముల
పట్టు చీర కట్టి
తెలుగు పాటను
నుదుట తిలకముగా
దిద్ది
సాహితీ సుమగంధములద్ది
తెలుగు అక్షర సుమమాల సిగలోన
తురిమి
తెలుగు గజళ్ళ
మణిహరముతో
తల్లి కంఠ సీమను
అలంకరించి
అందరం కలిసి
పాడెదము
మా తెలుగు తల్లికి
మల్లెపూదండ
మముగన్న తల్లికి మంగళారతులు
అనుచు.
 
ఆ తల్లి నీడలో
మనమంతా
అన్నదమ్ముల ఓలే
అక్క చెల్లెళ్ళ ఓలే
చేయి చేయి కలిపి
తెలుగు భాషకు
పట్టాభిషేకం చేసి
తెలుగుతల్లి
వెలుగులను
నలుదిశలా
వ్యాపింప చేద్దాం
 
రమ, కంకిపాడు.
*******************************
 
గిడుగు  ఆచార్యా  మా తెలుగు జాతిని  నీవే  కాపాడు
చెలి పెదవుల కన్న  తెలుగు భాష యిచట తేనెలు చిందించు దీప్తి గలిగి,
పాలు మీగడలైన పంచదార చిలుక  లైనను సరిపోవు  రామ నామ
మెదట నని పలికె  ముదముతో నానాడు  రామదాస వరుడు రమ్యగతిని.
తెలుగు భాష ఘనత తెలిపెగా రామ్మూర్తి వరుడు ధరణి లోన తిరుగు లేక,
తాతలు తాగారు నేతులు, చూడుము మీసాల వాసనల్  మెచ్చు కొనుచు
నన్న పగిది రా మన తెలుగు వారి పోకడ లెపుడు, తెలుగు గడ్డ పైన,
పండగ రోజున ప్రతి వారు విరివిగా  ప్రతినలు వేయుచు బక్క చిక్కి
న తెలుగు తల్లికి నమసము లిడుచు దండలువేసి ఘనముగా కొలుచు చుండు
మరునాడు నెల్లరి మనమున కరొన క్రిములు చేర ఏడాది తలచ బోరు
భౌతిక దూరము పాటించి మెదడను శాని టైజరుతోడ సంతసముగ  :
కడిగి మమ్మీ భాష యడుగుల నొత్తుచు  తెలుగుతల్లి ముఖము వెలుగు జూప
కుండ వేతురు ముసుగు నొకటి,విడచిన వస్త్రము గిడుగు ముఖము
పై నొక యేడాది పాటుంచి ఘనముగా బూజు  దులిపి తీయు మోజుతోడ :
 కపట నాటకములు కార్చి ,
భాష ప్రేమికుల మది దహించి వికల మొంద :
తెలుగు తల్లికి నేడు తెల్ల వారక ముందె ప్రతిఇంట గోరీలు పౌరు లెల్ల
కట్టుచు నుండెగా కరుణను వీడుచున్ ఘనులము మేమను కధలు చెప్పి,
కలరెంద రిచ్చోట కవులు తెలుగు నాట పది మందిని పిలిచి భాష నేర్ప
జాల బోరెప్పుడు సంతసముగ శతక రచనమును చేయ సరస గతిన
 
కలుగు సన్మానముల్,   కవిరత్న  బిరుదు లొచ్చుననెడి యావతో చనుచు నుండు
 నవధానములు చేయు నాచార్యు లెందరో నుండె తెలుగు నాట నొక్క రొక్క
రు పదిమంది ని బట్టి రూపాయ గొనకుండ నుచితము గా నేర్ప నొల్ల బోరు
 తాము నేర్చిన విద్య తమయొద్ద  నున్నచో  తామే ఘనులమని తలచు చుండు
జనులెల్ల ననునట్టి సంకుచితపు బుద్ధి నున్నచో యేరీతి మన్ననలను
పొందు తెలుగు భాష పొద్దు గడవదుగా వారెల్లరుకు శాలువాలు గళము
పైన చేరక నున్న పైసలు వెదజల్ల దరిచేరు నిచ్చోట బిరుదులన్ని
కవిరత్న,శేఖర,కావ్యశ్రి,కవి తిలక ,కవిసామ్రాట్టులు కాసులుండి
వాసి లేకున్న నీ పంచ జేరు నిచట ,సహజ గంధము లేని సభలు యేల,
ఆత్మశుధ్ది యె లేని  ఆచార  మేలనో,  చిత్త శుధ్దియెలేని శివుని పూజ
లేలనని పలికె కాల మందా వేమ నార్యుడు  నాగొప్ప నాకు లాభ
మిడునని తలచచు మెప్పు కొరకు ప్రాకు లాడుచు  తమ స్వంత లాభ మువిడ
చి నడుము నుబిగించి  చేయూత బడుగు వారికి నిడగ వలయు  సకల జనులు 
 
ఊక దంపుడు ముచ్చట్లు నొదల వలయు
కవియె తెలుగు తల్లికి ఘన గళము లోన
దండ వేసి విద్యను నేర్ప ధరణి లోన
తెలుగు భాష నలు దిశల వెలుగు నిడును
 
పూసపాటి
*********************************
 
తెలుగంటే...గోంగూర
తెలుగంటే...గోదారి
తెలుగంటే...గొబ్బిళ్ళు
తెలుగంటే...గోరింట
తెలుగంటే...గుత్తోంకాయ్
తెలుగంటే...కొత్తావకాయ్
తెలుగంటే....పెరుగన్నం
తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం
తెలుగంటే...పోతన్న
తెలుగంటే...బాపు
తెలుగంటే...రమణ
తెలుగంటే...అల్లసాని పెద్దన
తెలుగంటే...తెనాలి రామకృష్ణ
తెలుగంటే...పొట్టి శ్రీరాములు
తెలుగంటే...అల్లూరి సీతారామరాజు
తెలుగంటే...కందుకూరి వీరేశలింగం
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...శ్రీ శ్రీ
తెలుగంటే...వేమన
తెలుగంటే...నన్నయ
తెలుగంటే...తిక్కన
తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...క్షేత్రయ్య
తెలుగంటే...శ్రీనాధ
తెలుగంటే...మొల్ల
తెలుగంటే...కంచర్ల గోపన్న
తెలుగంటే....కాళోజి
తెలుగంటే...కృష్ణమాచార్య
తెలుగంటే...సిద్ధేంద్ర
తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి
తెలుగంటే...రాణీ రుద్రమదేవి
తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు
తెలుగంటే...రామలింగ నాయుడు
తెలుగంటే...తిమ్మనాయుడు
తెలుగంటే...రామదాసు
తెలుగంటే...ఆచార్య నాగార్జున
తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం
తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి
తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
తెలుగంటే...సింగేరి శంకరాచార్య
తెలుగంటే...అన్నమాచార్య
తెలుగంటే...త్యాగరాజు
తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన
తెలుగంటే...విశ్వేశ్వరయ్య
తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్
తెలుగంటే...చిన్నయ్య సూరి
తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగంటే...పీవీ నరసింహారావు
తెలుగంటే...రాజన్న
తెలుగంటే...సుశీల
తెలుగంటే...ఘంటసాల
తెలుగంటే...రామారావు
తెలుగంటే...అక్కినేని
తెలుగంటే...సూర్యకాంతం
తెలుగంటే...ఎస్.వీ.రంగారావు
తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు
తెలుగంటే...పండుమిరప
తెలుగంటే...సంక్రాంతి
తెలుగంటే...సరోజిని నాయుడు
తెలుగంటే....భద్రాద్రి రామన్న
తెలుగంటే...తిరుపతి ఎంకన్న
తెలుగంటే...మాగాణి
తెలుగంటే...సాంబ్రాణి
తెలుగంటే...ఆడపిల్ల ఓణి
తెలుగంటే...చీరకట్టు
తెలుగంటే...ముద్దపప్పు
తెలుగంటే...ఓంకారం
తెలుగంటే...యమకారం
తెలుగంటే....మమకారం
తెలుగంటే...సంస్కారం
తెలుగంటే...కొంచెం ఎటకారం
తెలుగంటే...పట్టింపు
తెలుగంటే...తెగింపు
తెలుగంటే....లాలింపు
తెలుగంటే...పింగళి వెంకయ్య
తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు
తెలుగంటే....టంగుటూరి ప్రకాశం
తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం
తెలుగంటే...భాస్కరుడు
తెలుగంటే...దేవులపల్లి
తెలుగంటే...ధూర్జటి
తెలుగంటే...తిరుపతి శాస్త్రి
తెలుగంటే...గుఱ్ఱం జాషువ
తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ
తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య
తెలుగంటే...కోరాడ రామచంద్రకవి
తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం
తెలుగంటే...మల్లన్న
తెలుగంటే...నండూరి
తెలుగంటే...పానుగంటి
తెలుగంటే...రామానుజం
తెలుగంటే...రావి శాస్త్రి
తెలుగంటే...రవి వర్మ
తెలుగంటే...రంగనాధుడు
తెలుగంటే...కృష్ణదేవరాయలు
తెలుగంటే...తిరుపతి వెంకటకవులు
తెలుగంటే...విశ్వనాథ
తెలుగంటే...నన్నే చోడుడు
తెలుగంటే...ఆరుద్ర
తెలుగంటే...ఎంకి
తెలుగంటే...ఆదిభట్ల
తెలుగంటే...గాజుల సత్యనారాయణ
తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ
తెలుగంటే...ఆర్యభట్టు
తెలుగంటే...త్యాగయ్య
తెలుగంటే...కేతన
తెలుగంటే...వెంపటి చిన సత్యం
తెలుగంటే...ఉషశ్రీ
తెలుగంటే...జంధ్యాల
తెలుగంటే...ముళ్ళపూడి
తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం
తెలుగంటే...తిలక్
తెలుగంటే...అడివి బాపిరాజు
తెలుగంటే...జక్కన
తెలుగంటే...అచ్చమాంబ
తెలుగంటే...దాశరథి
తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర
తెలుగంటే...ముక్కుపుడక
తెలుగంటే...పంచెకట్టు
తెలుగంటే...ఇంటిముందు ముగ్గు
తెలుగంటే...నుదుటిమీద బొట్టు
తెలుగంటే...తాంబూలం
తెలుగంటే...పులిహోర
తెలుగంటే....సకినాలు
తెలుగంటే....మిర్చి బజ్జి
తెలుగంటే...బందరు లడ్డు
తెలుగంటే....కాకినాడ ఖాజా
తెలుగంటే.....జీడిపాకం
తెలుగంటే...మామిడి తాండ్ర
తెలుగంటే...రాగి ముద్ద
తెలుగంటే...జొన్న రొట్టె
తెలుగంటే...అంబలి
తెలుగంటే...మల్లినాథ సూరి
తెలుగంటే...భవభూతి
తెలుగంటే...ప్రోలయ నాయకుడు
తెలుగంటే...రాళ్ళపల్లి
తెలుగంటే...కట్టమంచి
తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట
తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ
తెలుంగు ఆణమంటే తెలంగాణ
తెలుగంటే..... నీవు నేను మనం
జై తెలుగు తల్లీ
 
తెలుగు వ్యవహారిక బాషా పితామహుడు
గిడుగు రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ..
తెలుగు భాషా ప్రేమికులందరికీ
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో 
విజయ వట్టెం 
*******************************
 
మన తెలుగు ఖ్యాతి
 
చెరుకు తీపిదనం
తెలుగుతనం
తేనె కంటే మాధుర్యం
తెలుగుతనం
అ ఆ లతో మొదలు
కలకండ పలుకులు
పలికే కొలది కలుగు
రసానుభూతి
వినే కొలది కలుగు
కర్ణామృతం
తెలుగు భాష చమత్కారం
తెలుగు భాష జాతీయాలు
తెలుగు భాష విస్తృతి
ఎన్నని పొగడను ఎన్నని చెప్పను
తెలుగు భాష ఖ్యాతి జగద్విఖ్యాతి
 
-కోవూరి
*************************************
 
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు...  
నిత్యం మన మనసుల్లో తెలుగు మాధురీఝరులు, మరిన్ని మరిన్ని సుధలు ప్రసరించాలని ప్రార్ధన.    
 
చం ll
"తెలుగుపదంబు" పల్కిన మదీయసుధాఝరి జాలువారగా         
లలిత సుభాషితమ్ములవి లాస్యములై; సుమపేశలమ్ములై         
పలుకుల పల్లవంబులకు వల్లరిలెన్నియొ కూర్చినట్లుగా       
చెలువము మీర పల్కెడి విశిష్ట కవీంద్ర మనోజ్ఞ ధామమై !!
 
కస్తూరి శివశంకర్
***************************************
 
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు... ఈ ఒక్కరోజే కాకుండా, తెలుగు భాష అభివృద్ధికి మనము ప్రతిరోజు కృషి చేయాలి... ఇప్పుడే మన భాష కీర్తి దశదిశలు వ్యాపిస్తుంది.
 
తెలుగు భాష విశిష్టత
 
తెలుగు అక్షరాలు
నా జ్ఞానానికి బీజాక్షరాలు
తెలుగు భాష నా శ్వాస
 
తేనె కన్నా తీయనిది మన తెలుగు
చెరుకు గడల కన్నా తీపి మన తెలుగు
 
తేటగీతి తెమ్మెర మన తెలుగు
ఆటవెలది లాస్యము మన తెలుగు
శార్దూలం వీరత్వము  మన తెలుగు
చంపకమాల సౌరభం మన  తెలుగు
 
శ్రీశ్రీ చేతిలో ఖడ్గమయినది తెలుగు
కృష్ణశాస్త్రి కవితలో భావమైనది తెలుగు
కృష్ణరాయల పొగడ్త నందుకుంది తెలుగు
నన్నయ పలుకుల శబ్ద శాసనముతెలుగు
 
కృష్ణమ్మ పరవళ్ళ పరవశించింది తెలుగు
గోదావరి ఘోషలో గళం కలిపింది తెలుగు
నాగావళి తటిలో నాట్యమాడింది తెలుగు
మంజీర నాదంలో అడుగులేసింది తెలుగు
 
అన్నమయ్య త్యాగయ్య కీర్తనలలో
సరిగమలు లెస్స పలికింది నా తెలుగు
 
అవధానాలు సమస్యా పూరణలు
మణిహారాలై అలరారునది నా తెలుగు
 
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడటం భ్రమ, మన భాష ఉన్నతిని మనమే తెలుగు తల్లి పిల్లలమే నిలపాలి..
 
కె మల్లికార్జునరావు
*********************************
 
తెలుగు భాషామతల్లికి  వంద  వందనములు. తెలుగులో  మంచి  పాట విన్నా ,  కవిత చదివిన కలిగే  స్పందన ల  గురించి సమూహ సభ్యులతో పంచుకోవాలనే చిరు  ప్రయత్నము.
 
చెప్ప లేని ఊహలేవో చెవినిల్లు కట్టగా
ఊహలన్నీ  వూసులై మదిని తొలిచివేయగా
ఊసులే పదములై నన్ను పలకరించ సాగే
పదములన్నీ మాలికలై మధుర  వీచికల నూగి
సుమ గంధాల జిమ్ముతూ రాగమాలపించేను
 
పదములవి ఏవో తెలియని మధురిమలు పంచె
భావమది యేమో మనసు వీణియ తంత్రుల కదిలించే
వేయి వేణువులు ఒక్కటై  రాగమాలపించినట్లుగా
కంపన ప్రకంపనలకు లోనై తనువు తల్లడిల్లే
తెలుగు పదముల మాధురీ మహిమ కాబోలు
 
అవళూరు. సీత
**************************************
 
పాలవంటి స్వచ్ఛమైనతెలుపు మన
తెలుగు భాష
 
అమ్మ లోని కమ్మదనం నాన్నలోని తీయదనం మన తెలుగు  భాష
 
ఎన్ని భాషలు ఉన్న
తెలుగు భాష కన్నా లేదు మిన్న
 
నుడికారాలు గజిబిజి అల్లికలు
చంపక ఉత్పల మత్తేభ శార్దూలాలు
తెలుగు వైభవాలు
 
వేమన సుమతీ శతకాలు తెలుపు తెలుగు అక్షర సత్యాలు
 
వర్ణమాలలోని 56 అక్షరాలు మన తెలుగు భాషకు మణి మకుటాలు
 
తె లియని వారికి కూడా తె
లు సుకునే విధంగా తెలు
గు పదముల అల్లిక గు
భా ళిస్తూ తెలుగు భా
  ఔన్నత్యాన్ని సరలత్వాన్ని చాటిచెప్పిన
 
గిడుగు రామ్మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు
 
డి నాగమణి..
***********************************
 
తెలుగు తేనియలు (గిడుగు వారి గురించి )
గేయ  రచన:
 
పుట్టింది పర్వతాల పేట అగ్రహారం,
చదువు నేర్చింది  విజయనగరం,
భాషోద్యమంతో అందుకున్నాడు ఉన్నత శిఖరం,
చివరికి చేరింది రాజమహేంద్రవరం....
బడుగుజీవులసవర భాషకు అక్షరరూపం ఇచ్చాడు,   వారి పిల్లలకు ఆశ్రయమిచ్చి విద్యావంతులుచేసాడు,  వారిభాషకువ్యాకరణం,నిఘంటువులుఅందించాడు,  సవరభాషకుఆద్యుడుతెల్గుభాషకుపూజ్యుడయ్యాడు
 
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
***************************************
 
తెలుగు భాష ఔన్నత్యం
మన తెలుగు భాష
పదములు పదనిసలు
మల్లె పువ్వుల పరిమళాలు
 
తెలుగు సొగసు సుకుమారం
తెలుగు మనసు మమకారం
తెలుగు పదములు నయగారం
తెలుగుదనం మనోహరం
 
మన తెలుగు భాష
విరబూసిన సిరి మల్లె తోట
వసంతంలో తీయనైన కోయిలమ్మ పాట
 
తెలుగు భాష తేనె లాంటిది
మాతృభాష మంచుకొండ లాంటిది
మన తెలుగు మాటల మూట
తెల్లని ముత్యాల మూట
 
విశాల పదధార తెలుగు మాట
సుగుణాల పంచదార తెలుగు పాట
మధుర మకరందం ఇచ్చే తెలుగు తోట
 
అటువంటి తెలుగుతల్లి కీర్తిని
జగతికి చాటి చెప్పరా
"తెలుగోడా"జై జై అంటూ
 
విజయ వట్టెం 
************************************
 
గిడుగు రామమూర్తి వర్యులకు శతాధిక వందనములతో...
 
అడుగునున్న భాషనందలమెక్కించి
అమృతమ్ము పోసియాదరించి
పాఠశాలలందు పారాడు భాషగా
తెగువ చూపె గిడుగు తెలుగు కొరకు.....
 
 జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర
 
*********************************
 
తెలుగు భాషా మహోత్సవం సందర్భంగా నేను రచించిన ఖండికలోని రెండు పద్యాలు
చిన్నయసూరి మా హృదయసీమల నేలుచు పద్యరుచ్యముల్ 
నన్నయతిక్కనాది రచనామృతధారల రాజహంస యీ
వెన్నెల చిన్నెలన్ని సిరివెన్నెల ధారల కావ్యమంజరీ
చిన్నెలు, తెల్గు తేనియల జిల్గులు కాన్కలు వెండి వెల్గులై
 
చం
సురుచిర పద్యసంపదల సూరవరేణ్యులు, సత్కవీశ్వరుల్
నిరుపమ సారసంపదలు నిండిన సత్కవితామృతంబులన్
పరిపరి రీతి మేటి పదవల్లరులెన్నియొ జూడగావలెన్  
వరములు తోడు పల్కవలె వన్నెల రాగము పాడినట్లుగా
శివ శంకర్ కస్తూరి
**********************************
 
ఆ.వె.
అమ్మపాల బోలు యమృత ధార యనగ
తెలుగు భాష మున్ను తేజరిల్లె
రాశి గాను వెలసె రమణీయ సాహితీ
కావ్య సంపదలిట కడిమిగాను!
 
ఆ.వె.
తేటతెలుగు విలువ దెలియని వారలు
పరుల భాష కొరకు పాట్లు పడగ
వాసి గల్గినట్టి వరమగు భాషయె
చిన్న చూపు తోడ శీర్ణమాయె!
 
తే.గీ.
అమ్మ వోలెను దలపోసి యాదరించి
అమ్మ నుడియందు భాషింప ననవరతము
ఆత్మవిశ్వాసమన్నది యద్భుతముగ
పెంపు నొందగ జనులకు నింపు గూర్చు!
 
ఆ.వె.
బాలలకును ప్రజ్ఞ ప్రజ్వరిల్లగ జేసి
చేతనత్వమున్ను చేవ యున్ను
సృజనశీలతయును సుజనత్వమును బెంచ
నిశ్చయముగ తెలుగు నేర్పవలయు!
 
కం.
తెలుగు వెలుగులె తనరుచున్
కనుగొని జదువంగ కోర్కె ఘనతరమవగా
వినుతంబై మన భాషయె
అనువుగ పరభాష లపుడు నాదట నేర్చున్!
 
తే.గీ.
తెనుగు సంస్కృతి యందు ద్యుతి గలదంచు
మాతృభాష యందు సతము మమత జూపి
చాటి చెప్పగా నిత్తరి జగతికెల్ల
తెలుగు భాష యశమ్మున తేజరిల్లు!
 
కం.
నిత్యమ్మెదురౌ భాషా
ప్రత్యూహమ్ము లెదిరించి ప్రాశస్త్యముగన్
ప్రత్యక్షర మచ్యుతమై
అత్యున్నతిగ తెలుగిలను యలరారవలెన్!
 
ఆ.వె.
నలువరాణి మురిసి నగవుల నొలికింప
ప్రవిమల మతులైన ప్రజలు తాము
కడగి మాతృభాష ఘనతను జాటగ
భాష వెల్గునపుడు భాసురముగ!
 
చల్లా దేవిక.
**********************************
 
తేనెవాగుల తాగినట్లు పూలబుగ్గల నిమిరినట్లు
చందమామను చేరినట్లు
చల్లదనమును గ్రోలినట్లు
 
తెలుగు నిన్ను తనివితీర
తెలుసుకుంటుంటే
తెలుగునిన్నె యెదలనిండా
పులుముకుంటుంటే..
 
మంచుకొండను తడిమినట్లు
మధురఫలముల కొరికినట్లు
వానజల్లుల తడిసినట్లు
వజ్రమేదొ దొరికినట్లు..
 
తెలుగునిన్ను కనులలోన
నింపుకుంటుంటే
తెలుగు నిన్నె మనసులోకి ఒంపుకుంటుంటే..!
 
ఆలమందలనేలినట్లు
అలసి చెట్లను చేరినట్లు
కొండరాగం తీసినట్లు
గుండెపాటను పాడినట్లు
 
తెలుగు నిన్ను దోసిలొగ్గి
అందుకుంటుంటే
తెలుగు నిన్నె శ్వాసజేసి
చిందులేస్తుంటే..
 
యెదలనదులె పొంగినట్లు
ఊటచెలిమలు ఊరినట్లు
సప్తవర్ణములమరినట్లు
స్వప్నఫలితము చదివినట్లు
తెలుగు నిన్ను హృదయపీఠికి హత్తుకుంటుంటె
తెలుగు నిన్నె తలచి
తలలు ఎత్తుకుంటుంటే..!
 
(తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా...)మా ప్రియ మిత్రుడు డా కాసర్ల గారు నేను కలిసి చేసిన చిరు ప్రయత్నం....రామ్మోహన్ నిజామాబాద్
*********************************
 
సీసము
నన్నయవాక్కులే నర్తించు నిచ్చోట   
        సొంపుల కైవడి సొబగుపంచి          
తిక్కనామాత్యుని తీయని పద్యము
          ఎఱ్ఱాప్రగడ సుధలేరువాక !     
అల్లసాని శిరీషవల్లరుల్ నిద్దంపు     
    జిగిబిగి అల్లికల్ సిరులు జూచి  
శ్రీనాధ కవిరాయ శృంగార భావాలు   
     సిరుల మంజీరమై వరములొసగె    
 
తేటగీతి
యిట్టి గడ్డపై జనియుంచి యిలను మురిసి;
తెలుగు తీయందనము పీల్చి తీయగాను
తెలుగు నందనవనమందు తిరుగుచుండె  
భాగ్యమదియేను నాకిట్టి పరవశమ్ము      
 
కస్తూరి శివశంకర్
 
నా తెలుగు భాష
ఆటవెలది
 
తెలుగు పలుకు మెపుడు దేశదేశములెల్ల
వెలుగు నీదు భాష వేల యేండ్లు
తెలుగు రాదననుచు తెగులు నీకేలరా
మాతృ భాష మీద మమత బెంచు
 
ఆటవెలది
తెలుగు భాష మనది తేజమై వర్ధిల్లు
తెలుగు పలుకు సతము తేనెలొలుకు
మాతృ భాష లోన మాట్లాడు నప్పుడే
బుద్ది బెరుగు నీదు వృద్ది బెరుగు
 
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
**********************************
 
 
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషా వైభవము గురించి తెలుపు చిరు ప్రయత్నం మధురాక్కర మాలికలో
 
అమృతధారలు పొంగెడి
                 యమ్మ భాష మధురంబే
సుమ పరిమళభరితమైన
                  సుందర భాషయిదే
అమరిన సొగసు పొంకము
                  లద్భుత పదములివే
విమల మంజులంబైన  
                 కవితలల్లెడి కవి భాషే
కొమరు యక్షరాకృతి గల
                 కోమల భాషయిదే
అమర భాషయే పఠితుల
                 కబ్బుర మిచ్చునిదే
కమలమిత్రుని వెలుగుల
                 కమనీయ భాషయిదే
కుముద బంధుని వెన్నెల
                గుణములుండెడి భాషయే
ప్రమద మిచ్చెడి రమణీయ
                 భాష వైభవమిదియే
భ్రమర నాదము పల్కించు
                 భాష మహిమ కనరే
నమసు లివియే తెలుగుతల్లి
                నమ్రత వందనంబే
 
వెంకట్. సిహెచ్
**********************************
 
 
తెలుగు భాషాభిమానులు అందరికీ శుభాకాంక్షలు.
కీ. శే. గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సమంజసం.  తెలుగును వాడుక భాషగా చెయ్యడానికి , వ్యావహారిక భాషా ఉద్యమం నడిపిన గిడుగు వారిని స్మరించుకోడం అవసరం. గురజాడ వారితో  మైత్రి  యేట్స్ దొరతో స్నేహం గిడుగుని భాషాభ్యుదయం కోసం మరింతగా కృషి చేసేందుకు సహాయపడ్డాయి.
 
వాస్తవానికి గిడుగువారు భాషాపరంగా....గురజాడ , కందుకూరి , శ్రీ శ్రీ లకు స్ఫూర్తి ప్రదాత. అందుకే మహాకవి శ్రీ శ్రీ ఆయన గురించి గిరామ్మూర్తి ఇటీవలి మా ఇన్స్పిరేషన్ అన్నారు గిడుగు వారి భాషా సేవ కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాలేదు. వెనుకబడిన సవర జాతీయుల భాషకు లిపిని , వ్యాకరణాన్ని  రూపొందించారు. ఆ ప్రయత్నంలో మలేరియా బారిన పడి , వినికిడి శక్తి కోల్పోయారు. గిడుగు వారి పేరు చెబితే   ప్రముఖంగా  గుర్తొచ్చే గ్రంధాలు.
 
....ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం , బాలకవి శరణ్యం. గిడుగువారు చెల్లాపిళ్ల వెంకటశాస్త్రి గారి చేత ప్రశంసించబడిన భాషాఉద్యమవేత్త. ఈరోజు మనం వార్తాపత్రికలు హాయిగా చదువుకుంటున్నాము అంటే అందుకు కారణం గిడుగు వారే ! జాతి స్వేచ్ఛగా చరించడానికి స్వాతంత్రం ఎంత అవసరమో....భాష విస్తరిల్లడానికి ....ప్రజల నాలుకలపై స్వేచ్ఛగా         నడయాడ డానికీ భాషా స్వాతంత్రం కూడా అంతే అవసరం అని వాదించి గెలిచిన పిడుగు గిడుగు.
 
ప్రభుత్వం అమ్మ భాషను ఏమేరకు ఆదరిస్తుంది అనే విషయాన్ని పక్కనుంచితే , కనీసం గిడుగు వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం , కొన సాగించడం సంతోషం. గిడుగు వారి  కృషికి గుర్తింపు లభించి గొప్ప  బిరుదులు సమకూరాయి. వారు కళాప్రపూర్ణ. రావు సాహెబ్....కైజర్ -ఇ-హింద్ మొదలైన బిరుదులు పొందారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అంటే....శ్రీ శ్రీ మహాప్రస్థానం రచనలో వాడిన భాషకు , గిడుగు వారే కారణం అని పేర్కొనడం. భాషాశాసన   చణుడై .....పరగినట్టి గిడుగు....తెలుగువారి వెలుగు దారి....తెలివెన్నెల మడుగు..... గిడుగు
 
కొప్పర్తి రాంబాబు , విజయవాడ.
*****************************************
 

సీసము

భాగవతపలుకు భవహరమైనది    
    పోతనసుధలతో పులకరించి
నారికేళ మధురధారలన్ పొంగించె           
     తిక్కన, ఎఱ్ఱనల్ స్థిరత మీర   
వేయిపడగలతో విశ్వనాధ గరిమ  
     జాషువా కావ్యమ్ము జావళీలు   
కృష్ణశాస్త్రి పదముల్ కేయూరహారముల్
         బాలగంగాధర భాసురములు         

 

 తేటగీతి
వేమనకవి బద్దెన సౌరు వెలుగులిచ్చి           
నన్నెచోడుడు కావ్యమ్ము వన్నెజూచి    
మనసు మురిపించె గురజాడ మధురజాడ    
విభవ మొందె విశ్వంభర వెల్లువలన
 
కస్తూరి శివశంకర్
************************************
 
సేకరణ
మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. అమ్మా! బాగున్నావా? అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా, ఎందుకా కన్నీరు?  అంటే ఇలా చెప్పుకొచ్చింది.
కామేశం!
 
అచ్చులలో ఋ ఋ, , ౡ లను ఎప్పుడో తీసేసేరు.ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక  , ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది. "చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.
 
ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా!  బండి  "ఱ" వాడకమే లేదు. అందరూ '' తో సరిపెట్టుకుంటున్నారు.
పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!
 
'' బదులు '', '' బదులు '' వాడేస్తున్నార్రా!
కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ.
ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.
 
ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు! అంటూ వాపోయింది.పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!
 
ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌  మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం.
 
జై తెలుగు తల్లీ!
 
(రచయిత : శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు )
 
 
తెలుగు భాష వింటుంటే సంగీతం లాగా ఉంటుంది అని విశ్వ కవి టాగూర్ గారి శ్లాఘించిన విషయం తెలిసిందే,
ఆ భావాన్ని కవి సామ్రాట్ "విశ్వనాధ" వారి పద్యంలో కూడా దర్శనం ఇస్తుంది
 
సీసము
ఒక్క సంగీతమెదో పాడునట్లు భా
షించునప్పుడు వినిపించు భాష
విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్ప
ష్టోఛ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్పణ శక్తి యందున
నమర భాషకును దీటైన భాష
జీవులలో నున్న  చేవయంతయు చమ
త్కృతి పల్కులన్ సమర్పించు భాష
 
 తేటగీతి
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాష యన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సు లోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష.
 
కస్తూరి శివశంకర్
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...