19, ఆగస్టు 2020, బుధవారం

18.08.2020, మంగళవారము, చిత్రం పై పద్యం - 39, పై చిత్రానికి తగిన పద్యకవిత / వచనకవిత అందించగలరు

 



18, ఆగష్టు 2020, మంగళవారము

చిత్రం పై పద్యం  - 39

పై చిత్రానికి తగిన పద్యకవిత / వచనకవిత అందించగలరు

శుభోదయం


రామ చంద్రుని పదములు రమ్య గతిని                                                  
బట్టి సుగ్రీవునికి తెల్పి పవన సుతుడు
స్నేహ హస్తము నందించె చెలిమి తోడ
భూతినిడు శుభోదయమనె పూసపాటి
****

ఉత్పలమాల
క్షేమమొసంగ విశ్వమున జీవనయానపు రూపమీయగన్
ధామమునై వెలుంగులిడె ధాత్రిని చేతనమిచ్చి బ్రోవ నా
రామపదమ్ము నమ్మి జయరామ యటంచు సదా మనమ్ములో
కోమల రూపమున్ నిలుపగోరినచాలును జన్మధన్యమౌ
మహేశ్ ముత్యాల
****

భావ కవిత
అభిమన్యు శశిరేఖల పరిణయ,
ప్రణాళికనన్ నందనందనుండు,
భీమ సుతుడు ఘటోద్గజుని చేరి,
మాయా శశిరేఖగ కమ్మని చె ప్పె.
నా మహాకాయుడంత తన విద్యా,
పరిశీలనకని  లలన గ మారి పోయే,
నేలపైన చూడగా అట శునకములు,
మరుగుజ్జులుగా అల్పమై కనిపించె.
ఒకింత బ్రాంతికి లోనై  రయమున,
బోధపడె, రూపము మారినది కానీ,
పర్వతాకారము అటులే ఉన్నదని,
తప్పిదము తెలుసుకొనెన్, తనదు,
మాయాజాల శక్తినీ పరీక్షించుకొనెన్,
వేగిరముగా ద్వారక దిశగా సాగెన్
కె మల్లికార్జున రావు
****
గేయ కవిత
కుక్కలు ఎంత మొరిగినా,
సాగిపో ధైర్యంగా ముందుకు,
అరిచే కుక్కలు కరవ్వు,
లక్ష్యం సాధించే దాక ఆగకు !!!
గాంగేయ శాస్త్రి
****
కందము
 బావురుమని రోదించిగ 
కావక నీ కార్యగరిమ కైవడిసొబగుల్ 
ఠేవని సతతము జూపగఁ  
చేవని, ఠీవిని, జనులకు జీవనమందున్ 
కందము
అలుపెరుగక రయముగనే
పలురీతుల కార్యదీక్ష ప్రభవించగనే   
పలుకులతో దూషించిన  
కలవర పడవలదు నీవు కార్యోన్ముఖుడై     
ఉత్పలమాల
ధ్యేయము కోసమై చెలగు ధీరులతత్వము స్ఫూర్తియై సదా  
ఖాయము; సత్యమౌ జయము కార్యములన్నిటిలోను సత్వరమ్ 
కాయము కష్టపెట్టవలె ! ఖచ్చితమైన జయంబు సాధ్యమే !
సాయము చేసి, దక్షతను, శక్తిని, సంగ్రహరీతి జూపుమా 
న్యాయము లక్ష్యమైన విజయంబులధామము చేరకోవలెన్ !
కస్తూరి శివశంకర్
****
కందము
నీకను నా కర్తవ్యము
నే కష్టము వచ్చు నేమి నెంచక దిగులే
పోకడలను మార్చు జనుల
సాకారము వీడినపుడె సాధ్యము నిలలో!!
 
ఆటవెలది
 
నీదు మనసు నిండు నిర్మలత్వముగాను
తప్పు జేయ నపుడు మెప్పు బొందు
నెవరు నెచట నెంత నేమియు నరిచిన
మొక్కవోని తెగువ మోము నిలుపు
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
****
కుక్క లనుచూచి నిలువకు కూల బడకు
నీవు ముందుకు సాగుము నిలువ రించి
తరిమి కొట్టుము కుక్కలు తరలి పోగ
నీదు ప్రయత్న మునెపుడు నీవు మరకు
లలితారెడ్డి
****
మెరిసే మెరుపులు ఉరిమే మేఘర్జనలు
అపశకునపు శునక ధ్వనులు
ఆలకించి  అలజడి చెందక
అవరోధములను అధిగమించుచు
నీ పద మంజీర ధ్వనులే
మంగళ గీతములగా భావించి
అడుగు ముందుకేసి చేరుకో
నీ గమ్యస్థానం అతివా
అందుకో అవకాశాలను
అవలీలగా
 
సరికొత్త రోజుకి స్వాగతం పలుకుతూ
దిద్దుకో, పొద్దుపొడుపునే
నీ నుదుటి తిలకంగా
రమ, కంకిపాడు.
****
కందము
పలువురు సిద్దము నీవిక
తలపోసిన కార్య మందు తప్పుల నెంచన్
బలమగు నీ సంకల్పమె
గెలిపించును  సడలనట్టి కృషి సల్పితివెన్
 
వాణిశ్రీ నైనాల
****
నీ కోమల పాదం కలిలో కదిలితె ఓ యమ్మా
చుట్టూతా వీదికుక్కలు మొరుగుతుంటయే మాయమ్మా
ఉన్నత లక్ష్యంతో నీవు కదిలితె చెల్లెమ్మా
కుక్కల మెరుగులు కమ్ముతుంటాయి చూడమ్మా
శ్రమైక జీవన బాటసారివై మాయమ్మా
కలిలో కరి గా నువ్వు కదులుతుంటివే చెల్లెమ్మా
కుక్కల కూతలు కామనేగా మాయమ్మా
నీ లక్ష్యం వదలక గమ్యం చేరవే గౌరమ్మా
 
వి.వి.శ్రీనివాస్
****
భావ కవిత
 
గందరగోళంలో  దారి తప్పి,
కొంగొత్త దేశమునకు పోయితివా,
ఓ వెండి గజ్జల "గల్లీ వర్" సుందరీ,
నీ కచటి  శునకముల  గాంచి,
సంభ్రమాశ్చర్యములు  ఆయెనా,
వాటికీ నిను గాంచి భయముతో,
కూడిన ఆశ్చర్యము  ఆయెనే,
తెలియుమది మరుగుజ్జుల రాజ్యం ,
అన్ని జీవులు పొట్టివే  అచ్చోట,
భగవంతుని వింతల నదొకటి,
ముందున కెళ్ళి కనుగొనుము,
"బోన్సాయ్ "మనుజులూ ఉందురు,
కానీ మామూలు  మనుషుల వలె,
కపట మనశ్కులు కారు వారు,
నీలా దేహదారుఢ్యం లేనివారు,
నీ శక్తి ఘన మని భయపెట్టకుము,
స్వచ్ఛమైన మైత్రితో మెలగుము,
నీకు తిరుగు దారి చూపించగలరు.
కె మల్లికార్జున రావు
****
నీ పద మధుర మంజీర నినదములు పె
ను నగరా వోలె ధ్వనియించ నుండ బాల
శునకము లు చేరి మొరగగ శుద్దులు వలె
తలచి నీ గమ్యము వడిగా  దరిని జేరు
డా.సతీష్
****
అంతరంగములో ఎన్నో 
సాధ్యాసాధ్యాలను
ఇముడుచుకున్న
 ఓ స్త్రీ మూర్తి
ఎవరికీ అందనంత ఎత్తులో
ఆకాశానికి చేరువలో
ఎదిగిన ఓఅనంతమూర్తి.
అష్టలక్ష్ముల ప్రతిరూపమైన
ఆ మూర్తి ముందు ఈ భువియందు
ఉన్న జీవు లన్నియు అల్పమే.
నాగమణి
****
కందము
అసమర్థులైన వారలె
ముసురుకొనెడి చింతల గని  మొత్తుకొను ధరన్;
మిసిమి దరుగదెన్నడు నీ
వె సమర్థత తోడ లక్ష్య మెక్కిడు సేయన్!
కందము
అధములు శునకములై పలు
విధములుగను మాటలనుచు వేధించిననూ
అధిగుణముల తోడనెపుడు
అధిరోహింపగ గమించు మత్యున్నతికై !
కందము
ప్రబలమ్మౌ యాత్మబలము
నిబిడీకృతమైన యట్టి నేమివి నీవే;
అబలవని దలంచు జనులె
సబలవని గ్రహించిన తరి సత్కృతి జేయున్!
(నేమి...వజ్రాయుధం)
చల్లా దేవిక.
****
తేటగీతి
చేరవలసిన గమ్యము దూర మయిన
తొలి  అడుగు,  మలి  అడుగుల నలవి యగును
అడ్డుకట్టలెదురయిన నడ్డగించి
ఒడుపు, ధైర్యముల కదలి నడుగు వేయ
ఆటవెలది
పనిని మొదలు పెట్ట ప్రతికూల మెదురగు
ధైర్యము విడువకనె ధారణన్ 
హనము సామరస్య యనువుల సాధింప
తరులు మోయి గెలుపు తథ్య మేను
అవలూరు సీత
****
కందము
మక్కువతో పయనించగ
గ్రక్కున పాదంబు మోపి కదలగ బూనన్
కుక్కలు భౌభౌ మనియెను
నక్కజముగ శంకనొందినాగెను పడతిన్
మహేశ్ ముత్యాల
****
వేదనతో  హృదయమునందు భారమైన
నిస్సత్తువ ఆవహించిన వారికి ప్రేరణ నిచ్చెడి
 భావనగా నా ప్రయత్నం.
సీసము
సాగింప వోయమ్మ సాహసివలె జీవిత పయనము నీవు ధరణి నందు
కారుమబ్బులవియే, కంటకములవియే పక్కకు తొలుగు నీ పదము గాంచ
మెరుపుతీగలవియే, మిగుల వెలుగుజూపు ఘోషలే వినిపించు కోమలముగ
మొరిగెడి శునకాల మోసమును గ్రహించి పరిహరింపు మతివా ప్రకృతి నెరిగి
శోకమాపి మగువా! శోభిల్ల వలెనోయి అబల శక్తిని జూపి నంకురించు
ప్రతికూల స్థితియందు వర్థిల్ల వలెనోయి ప్రతిభ జూపగ నీవు పరిఢవిల్లు
తేటగీతి
ఆత్మ విశ్వాసమే సదా యబ్బురముగ
జయమునిచ్చు కార్యములెల్ల సంతసముగ
పాటవము జూపి సలుప ప్రజ్వరిల్లి
జీవితము పూలబాటయై శ్రేయమగునె
వెంకట్.సిహెచ్
****
నింగి శిఖరాగ్రాన శివుని జటాజూటాన్ని వదిలి
బువిని చేరు జలతరుణి గంగావతి...
పదమని పాదము కదపగ ...
కాలభైరవ కలియతిరుగు కలియుగ ఘడియ తిరుగు ము
హూర్తమనిసరించు వేళయని...
సూర్య
****
ఇది మహా భారత‌సంఘటన
జనమేజయుని  తమ్ములు‌ ఒక‌ కుక్కను  కొడుతారు    అది బాధ పడుతూ తన తల్లి‌ సరమ‌ దగ్గర కు వెళుతుంది  జనమేజయుని శిక్ష వేయమని చెబుతుంది   ఆ సందర్భము లో  తల్లి పాదములకు‌ నమస్కరించి  ఆకుక్క. తోటి కుక్కలను కూడి రోదన చేస్తున్నవి‌ అను  భావన.
 
చిత్రం లో  తాడు కట్టి నట్లు ఉన్నది విస్మరించి వ్రాసిన పద్య ము.
 
మొక్కెద మీ పదంబులకు మోదము తో మహి లోన‌ మేమున్,
గ్రక్కున చేరగా వలయు‌గా జన మేజయు చెంతకున్, మా
కక్కడ లేదు భద్రతయె, కావర మున్ పెరు గంగ రాజుల్
చక్కని పాలనంబుయును సౌఖ్యము నీయగ జాలరే, మా
దిక్కువు నీవెగా జనని,దేహి యనంగ రయంబుగా  నీ
వక్కడికిన్ సుఖం బుగను ,పావనమౌ ఘన పాదము తో
నిక్కము గాను చేరి యిట నెమ్మి‌ ని  పొందుచు  రమ్ము తల్లీ
పూసపాటి
****

x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...