26, ఆగస్టు 2020, బుధవారం

ప్రణాళిక సమస్యా పూరణ : పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు ! 26.08.2020, బుధవారము

 

 

పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు !


శుభోదయం 

సీత మనసులో రాముడు చెదర కుండె,

రాముని మదిలో  జానకి భామ యొకతె,

నట్టి వారికి సరిలేరు యవని లోన

భూతి నిడుశుభోదయమనె పూసపాటి



26 - 08 - 2020 ; ప్రణాళిక (సమస్యా పూరణ)

సమస్యా పాదం తేటగీతి లో.. ఇదే పంక్తితో భావంలో పద్య / వచన కవిత పంపించగలరు

సమస్య :  పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు !

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

మండు టెండలో తిరిగొచ్చి

భోజనానంతర సేద తీసుకుందామని

నా పక్కనే,పక్కలోనే ఉన్న పత్రిక పఠనం లో నిమఘ్న మయ్యాను.

పండు వెన్నెల చల్లదనం

నిండు వెన్నెల అనురాగం,అనుభూతులతో

నా పైన వెన్నెల వర్షం కురిపిస్తున్నారు

కధలు,కవితలు రాసిన వారిలో

వున్నారు కొందరు భాస్కరులు-

భాస్కరుడు, భాస్కర రావు,భాస్కర శర్మ,భాస్కర బాబా...

వారి రూపం లొనే,వారి రచనల ద్వారానే

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు.

మురళి

****

 

సూర్యచంద్రు లిరువురు

విశ్వమునకు నేత్ర ద్వయము

సకల జీవులకు శక్తి ప్రదాతలు

నిరతము వారు పరి భ్రమణమే

రే*పండు వెన్నెల కురిపించు

భాస్క రుండు* వేడి వర్షించు

శీతోష్ణముల జగతికందించి

జీవుల ప్రాణము నిలిపెదరు.

(రేపండు - చంద్రుడు.)

కె మల్లికార్జున రావు

****

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

తరణి కిరణాలచే కడు తాపమొంది

భానుభాస్వంత వెల్గులే భాసురమగు

చిరునగవు "వాడి చూపులు" చెలగువాడు

మంజుల మయూఖతంత్రుల మన్మదుండు

పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు

చారు శశిభూషితములైన సందె వేళ  

 కస్తూరి శివశంకర్

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

 గేయ రచన,

 ముసురు పట్టి విడువక జనులు,

విసుగు కొనుచుండ, ఆర

వేసిన బట్టలు ఆరకుండే, అంతలో

భాస్కరుఁడు అరుదెంచి పండువెన్నెల కురిపించే....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

తేటగీతి

మండు టెండన చెమటోడ్చిమాడి పోయి,

నాల్గు రాళ్ల నార్జించి తనకని లేక

నేది , తనవారి కడుపులు నింప, మదిని

పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు!

లలిత దీక్షిత్

**** 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

  రోజు ప్రేమ మూర్తి మదర్ ధెరిస్సా గారి జయంతిని పురస్కరించుకుని

ఈరోజు పూరణ కి

తేట గీతి

ప్రేమనిండిన మనసుతో బేధ మసలు

లేక పేద సాదల చేరి రేయి పగలు

పాటు పడెడి తల్లి థెరిసా వైపు చూసి

పండువెన్నెల కురిపించు భాస్కరుండు

రమ, కంకిపాడు

**** 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

 తేటగీతి

చండ్ర గాడ్పులు వీచు ప్రచండ సూరి

తిమిర మావహించ తొలగె దిశ్వకరుడు

సంధ్య కౌగిలి చేరగ ఛాయ మగడు

పండువెన్నెల కురిపించు భాస్కరుండు

వాణిశ్రీ నైనాల

**** 

 

"పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

ఋతువుల స్వభావాన్ని తెలుపుతూ సమస్యాపూరణ సీసము లో...

 సీసము

హేమంతఋతువున హిమముకురియు మది

    మురిపింప, వర్షము కురియు వర్ష

ఋతువునందు రయతు మేను పులకరింప,

     కమనీయమగు శరత్కాలమందు

వేల్పుభోనము పండు వెన్నెల కురిపించు;

     భాస్కరుండు సతము ప్రజ్వరిల్లి

గ్రీష్మఋతువు నందు కీలలు కురిపించు,

   శిశిరఋతువు నందు చెట్ల యాకు

 

తేటగీతి

రాలునె; వసంత ఋతువున మ్రానులన్ని

చిగురు తొడిగి సుందరముగ క్షేత్రమంత

పచ్చ చీర ధరించునె పావనముగ

నారు ఋతువులన్ గాంచగ నబ్బురంబె!

వేల్పుభోనము = చంద్రుడు 

వెంకట్. సిహెచ్

****

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

 తేటగీతి

కోరి()యజ్ఞానతిమిరాల పారద్రోలి

జ్ఞాన సుధలను పంచుచు శాంతినొసగి

()నాదుకొనుచుండు కడగండ్ల ()నడచు గురువు

పండువెన్నెల కురిపించు భాస్కరుండు

మహేశ్ ముత్యాల

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

తేటగీతి

సరదా పూరణ.... 

 అడ్డ దిడ్డముగా రాసి యాటలాడి

ఎగిరి గెంతులతోపాటు యేడిపించి

యేమి చేసినా గానిమారేమి యనక

అందరి కవనములు జూచి యాదరించి

శివుడు పద్యము దిద్దంగ సింగమువలె

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు.....

 జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

నడి వేసవి గాలి విసిరినా

కలిసిన ఇరు హృదయాల లోన

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు

మంచు కురిసినా మబ్బు కమ్మినా

దూరమైన ప్రేమికుల మది లోన

విరహ వేదన రగిల్చు చందురుండు

కె మల్లికార్జునరావు

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

తేట గీతి

వాణి దీవెనలున్నచో వాక్కు  విరియు

తలపులున్న మదిన భావ ధార  మెరియు 

పదుగురికి నచ్చిన రచన వ్రాసినపుడె

పండువెన్నెల  కురిపించు భాస్కరుండు

అవళూరు సీత

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

వర్షాకాలము

సూర్యాస్తమయము

భగ భగ మండే భానుడు

తన తుషార కిరణాలతో

మా ఇంటి ముంగిట

పండు వెన్నెలను కురిపించగా

పారిజాతపు చెట్టు నుంచి రాలిపడిన

తెలుపు ఎరుపు వర్ణపు

పారిజాత పువ్వుల పరిమళము

వెన్నెల విన్యాసముతో

పోటీపడుతున్న వేళ

వెన్నెల్లో  నా నీడ

నా నీడలో  వెన్నెలను

ఆస్వాదిస్తూ మైమరిచిన

  వేళ

నా తీయని మదిలో ఎన్నెన్నో ఊహలు ఉదయించే

నా ఊహలకు

కొత్త రెక్కలు రాగా

రంగు రంగుల ఇంద్ర ధనుస్సు

నా హృదిలో మెరవగా

నా మనసు  

కొత్త పుంతలు తొక్కగా

తుషార కిరణాల

వెన్నెల రాజా

కలనైనా కలవర మందైనా

నీ తలపే ...

విజయ

మిట్టమధ్యాహ్నం భగ

భగ మండే సూర్యుడు

జనులందరూ వేడికి తట్టుకోలేక

ఇంటికిపరుగుతీసే సమయమున

ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై

చిటపట చినుకులతో పుడమి తల్లి పులకరించె

తరు లన్నియు ముత్యపు  బిందువులు

ముద్దిడగా పరవశించి పోయె

విరులన్నియు ప్రేయసి చిరునవ్వులాగా విచ్చుకొనె

పక్షులన్నీ యు కిలకిల రావములు చేసే

జనులందరు ఉష్ణతాపమునకు

తల్లడిల్లు వేళ వరుణదేవుడు కనికరింప

పండు వెన్నెల కురిపించే భాస్కరుండు

డి. నాగమణి

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు."

 దైవ దర్శనమున కేగ త్రోవ నున్న

నుష్ణ మెల్ల తట్టుకొని తా నుష్ణకరుని

వేడ, మొయిలు నంపగ దైవ విధిన మదియె

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు

(మొయిలుమబ్బులు)

ఎం.పద్మలత

****

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

తేటగీతి

దహన సూర్యతపమ్ముచే తాపమొంది

యలసి; నిశిలోన వేడుకలావహిల్లు            

తెలి సొగసులలో నగుమోము వలపునింపి    

పండు వెన్నెల కురిపించె భాస్కరుండు

కస్తూరి శివశంకర్  (కె మల్లికార్జునరావు)

**** 

 

సమస్య: "పండు వెన్నెల కురిపించు భాస్కరుండు." 

సమస్యా పాదం తేటగీతి లో.. ఇదే పంక్తితో భావంలో పద్య / వచన కవిత పంపించగలరు

నా పూరణ యత్నం..

తేటగీతి

సుందరి యొకతి వీధిన సుందరముగ

హొయ లొలుకుచు వెడలుచుండ రమ్యముగను

నంబరమునుండి గాంచగ సంబర పడి

పండువెన్నెలఁ కురిపించు భాస్కరుండు

 

తేటగీతి

చమట నోడ్చుచు నిరతము సాగు చేయు

పొలము దున్ను వానిని జూచి పుడమి యేడ్వ

బాధ గల్గిన చాలును వరము లిడుచు

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

****

తేటగీతి

తెలుగు తేనియ సభ్యుల కలుపెరగని

పద్య  రచన వ్యాపకమందు వాస్తవముగ

మెండు వేసంగిభావన నిండు మదిన

పండు వెన్నెల కురిపించు భాస్కరుండు

 వెంకట్ సి.హెచ్

****   

1 కామెంట్‌:

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...