ప్రశ్నల ప్రహేళిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రశ్నల ప్రహేళిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఫిబ్రవరి 2021, శనివారం

ప్రహేళిక సంఖ్య - 44, ది.31.01.2021

 


ప్రహేళిక సంఖ్య - 44

ది.31.01.2021

 

అంశము: శ్రీకాళహస్తీశ్వర శతకము 

 

1.

"సాలెపురుగు ఏ వేదములు పఠించినది?" అనే భావమున్న పద్యము వ్రాయండి.

జవాబు:

ఏ వేదంబు బఠించె లూత భుజంగం బేశాస్త్రముల్సూచె దా

నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి చెంచేమంత్ర మూహించె బో

ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం

సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!

 

2.

"మును నేఁ బుట్టినపుట్టులెన్ని గలవో మోహంబుచే నందుఁ జే

  సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతిచినన్ గాన నీ"

ఈ పద్యములో ధూర్జటి మహాకవి భావన ఏమిటి?

జవాబు:

శ్రీ కాళహస్తీశ్వరా! ముందు ఎన్ని జన్మములెత్తానో ఎన్ని పాపాలు పోగుచేసుకున్నానో తెలీదు,  ఇదే ఆఖరు జన్మ అని అనుకుంటున్నాను. అలాగే అనుకొని నాకు మోక్షము ప్రసాదించు!

 

3.

కావ్యరసములే స్నానముగా, పద్యములే పూలుగా,  అలంకారములు వస్త్రములుగా, కవితాసౌందర్యమే దీపములుగా, మాధుర్యమే నైవేద్యముగా కూర్చి నా చేతనయినట్టుగా నీ కైంకర్యము చేసెదను స్వామీ. అని కవి ఏ పద్యములో తెలుపుతున్నారు.

జవాబు:

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము

ల్కలశబ్దధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తుల్మెఱుం

గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నిన్నున్ భక్తిరం

జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!

 

 

4.

ధూర్జటి మహాకవి రచించిన శతకము ఏ ఛందస్సు లో ఉంది? పద్య మకుటము లో ఉన్న జీవుల పేర్లు తెలుపండి?

జవాబు:

ఛందస్సు: శార్దూలవిక్రీడితము, మత్తేభవిక్రీడితము

పద్య మకుటము లో ఉన్న జీవుల పేర్లు  శ్రీ = సాలెపురుగు;  కాళ = పాము; హస్తి = ఏనుగు

 

5.

అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబే లో

   నంతా దుఃఖపరంపరాన్వితమే........

............. .............   ..

 ............. ...........శ్రీకాళహస్తీశ్వరా

ఈ పద్యాన్ని పూరించండి

జవాబు:

అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో

నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే

యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్

జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

 

6.

శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో

కాశీవల్లభుఁ గొల్వబోదునో మహాకాళేషుఁ బూజింతునో................

ఈ పద్యములో కవి ఏయే శైవ క్షేత్రములను ప్రస్తావన చేశారు?

జవాబు:

శ్రీశైలము, కాంచీనగరము, కాశీ నగరము, ఉజ్జయినీ, శ్రీకాళహస్తి

 

7.

గుమ్మడికాయలోని ఆవగింజంత విజ్ఞానము చేకూరలేదు. అంతమాత్రమైనా భోదించి నాకు దారి చూపుము ప్రభో అని కవి ఏ పద్యములో పరమేశ్వరుని  వేడుకుంటున్నారు?

జవాబు:

పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో

గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో

దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మించి సు

స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!

 

8.

రోసీరోయదు, బాసీపాయదు, కోసీకోయదు, చేసీచేయదు అనే పాదారాంభ పదాలతో ఉన్న పద్యము ఏ ఛందస్సులో ఉన్నది? పద్య భావము ఏమిటి?

జవాబు:

ఛందస్సు: శార్దూలము

భావము: మనసు చంచలము, స్త్రీ సౌఖ్యములను విడనాడదు,  పుత్రులు, మిత్రులు, సంపదలు మీది భ్రమను, కోరికలను విడువదు. ఇష్టంగా నీకు  సేవ చేసేందుకు సహకరించదు. అలాగని పూర్తిగా నిన్ను విస్మరించదు. అట్టి  చంచలమైన (నా)  మనసుకు స్థిరత్వమును ప్రసాదించు !

 

9.

ప్రతి దినమూ నా చిత్తమున సువర్ణముఖనదీ వాసివైమామిడితోటల మధ్యన ఉన్నత వేదికపై  నీ రూపము చూడుట సౌఖ్యము గానీ, ఈ చంచలమైన ధనమా ప్రభో! అని కవి ఏ పద్యములో తెలుపుతున్నారు?

జవాబు:

దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా

ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా

నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా

సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!

 

10.

 శ్రీ కారము తో మొదలుపెడుతూ నా మదియందు సద్భావనాంకురములు మొలకలెత్తు విధముగా నీ సేవ చేసెదను. అని కవి తెలుపుతున్న పద్యము వ్రాయండి.

జవాబు:

శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా

రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్

దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

 

వెంకట్.సి హెచ్


5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ప్రహేళిక-43, 24 01 2021 ఆదివారము, భాస్కర శతకము

 


ప్రహేళిక సంఖ్య – 43,  24.01.2020

అంశము: భాస్కర శతకము

 

1. ఈ క్రింది పద్యాన్ని పూరించండి.

...........................

........................జీడపుర్వు తా

జెడ దిను నింతె కాక పుడి సెండు జలంబిడి పెంప నేర్చునే

పొడవగు చున్న పుష్ప ఫల భూరుహ మొక్కటినైన భాస్కరా

 

జవాబు:

ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే

యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు తా

జెడఁ దిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంప నేర్చునే

పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!

 

2. "క్రూరబుద్ధి గల రాజులను సేవించే మంచి వారికి కూడా వారి మంచి గుణములు పోయి క్రూర గుణములు వచ్చును"

 అనే భావమును కవి దేనితో పోల్చారు?

 

జవాబు:

తీయని నీటితో ప్రవహించే గోదావరి మొదలైన నదులన్నీ సముద్రములో కలిసినంతనే తమ తీపితనము కోల్పోయి ఉప్పదనము పొందును.

 

(క్రూర మనస్కులౌ పతులఁ ెల్చి వసించిన మంచివారికిన్

వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో

దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే

క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా!)

 

3. భాస్కర శతకం లో కవి వాడిన అలంకారం ఏది? దాని లక్షణాలు ఏమిటి?

 

జవాబు:

అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం

మరియు

దృష్టాంతాలంకారము.  రెండు వాక్యముల యందు ఉపమానోపమేయముల యొక్క వేరు వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించుట

( ఏది వ్రాసినా మార్కులు ఇవ్వడం జరిగింది)

 

4. "మేఘుడు తనవద్ద జలము లేనప్పుడు సముద్రమునకు వెళ్ళి జలమును తెచ్చి అన్ని ప్రాణుల కోర్కెలు తీరునట్లుగా వర్షించును కదా!" ....ఈ భావమున్న పద్యము వ్రాయండి.

 

జవాబు:

దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో

నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చి యైన నీఁ

బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే

వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!

 

5. "పండితులైన వారు దిగువందగ నుండగ నాల్పు డొక్కడు

ద్దండత బీఠ మెక్కిన బుధ ప్రకరంబుల కేమి యెగ్గగున్"

ఈ పద్యమునకు భావం వ్రాయండి.

 

జవాబు:

పండితులైనవారు దిగువనుండగా ఒక నీచుడు ఉద్దండ పీఠం అధిరోహించినా పండితులకేమి లోటు లేదు. ఎలా అంటే, గండభేరుండము మొదలైన పక్షులు ఉన్న చెట్టు పైకి ఎక్కి ఒక కోతి కూర్చున్నా ఆ పక్షులకేమి లోటు ఉండదు కదా!

 

6. "అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చినప్పుడు గాలిదేవుడు అతనికి స్నేహము చూపుచూ తోడ్పడును. ఆ అగ్ని చిన్నదీపము అయినప్పుడు ఆ గాలిదేవుడే విరోధియై దానిని అర్పును"  అని చెప్పుటలో కవి  లోకానికి ఏమి చెప్పదలచారు?

 

జవాబు:

మానవుడు బలవంతుడు గా ఉన్నప్పుడు అతని చుట్టము అతనికి తోడ్పడును. బలము లేనప్పుడు ఆ చుట్టమే శత్రువై కీడు చేయును.

 

(బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే

బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై

జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా

బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!)

 

7. "రాజు ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు కానప్పుడు మంత్రులు ఎంత తెలివి గల వారైనప్పటికిని కార్యము నెరవేరదు" అని చెప్పుటకు కవి దేనిని ప్రామాణికంగా తీసుకున్నారు?

 

జవాబు:

దుర్యోధనుడు ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు కానప్పుడు  - భీష్మ ద్రోణాదులు (మంత్రులు) ఎంత తెలివి గల వారైనప్పటికిని కార్యము నెర వేర్చ గలిగారా? (లేదు కదా)

 

(భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర

జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై

యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ

క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా!)

 

8. భాస్కర శతకము ఏ ఛందస్సులో రచించ బడింది. రచించిన కవి పేరేమిటి?

 

జవాబు:

ఉత్పలమాలలో, చంపకమాలలో .  మారయ (మారవి) వెంకయ్య కవి

 

9."నిర్మల మూర్తి యైన చంద్రుడు తాను రాహువుచే మ్రింగబడి కాంతిహీనుడైనా కొద్ది సమయంలోనే ఆ కష్టము తొలగి తిరిగి పూర్వము వలెనే కాంతిని పొందుచున్నాడు కదా".. ఈ భావన ఉన్న పద్యము వ్రాయండి.

 

జవాబు:

సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ

క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా;

యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం

డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా!

 

10. కవి తన కవిత్వము గురించి చెప్పుకొనుచు భాస్కరా నీ కారణము చేత నా పద్యాలకు మిక్కిలి కీర్తి వచ్చినది అని రచించిన పద్యము వ్రాయండి.

 

జవాబు:

ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వమున్

మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్

మంచివివేకి వాని దెరమాటున నుండి ప్రశస్తరీతి నా

డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా!

 

వెంకట్.సి హెచ్


 


28, జనవరి 2021, గురువారం

ప్రహేళిక - 42, 17.01.2021

 


ప్రహేళిక సంఖ్య – 42, ది.17.01.2021 ఆదివారము

 

అంశము: వేమన శతకము

సమాధానాలు

******

 

1."ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా"....ఈ పాదం ఆధారంగా పద్యము వ్రాయండి

జ:

చిప్పలోన బడ్డ చినుకు ముత్యం బయ్యె

నీట బడ్డ చినుకు నీళ్ల గలిసె

ప్రాప్త మున్న చోట ఫలమేల తప్పురా

విశ్వదాభిరామ వినురవేమ!

 

2. స్థాన బలము వలన తన బలము పెరుగుతుంది అనే భావనతో వేమన పద్యము వ్రాయండి

జ:

నీళ్ల లోన మొసలి నిగిడి ఏనుగు పట్టు

బయట కుక్క చేత భంగపడును

స్థాన బలిమి కాని తన బలిమి కాదయా

విశ్వదాభిరామ వినురవేమ!

 

3.సొమ్ములు అందరికీ తీపి కదా అనే భావంతో ఉన్న పద్యము లో ఎవరి సొమ్ములు ఎవరు దొంగిలించారని కవి తెలిపారు?

జ:

పాల సముద్రంలో పవళించిన విష్ణుమూర్తి, గొల్ల వారి ఇళ్లలో పాలు, పెరుగు దొంగిలించాడని కవి అంటున్నారు.

 

4.పిరికి వాని మానసిక స్థితి గురించిన పద్యము తెలుపండి

జ:

మేడి పండు చూడ మేలిమై యుండును

పొట్ట విప్పి చూడ పురుగులుండు

పిరికివాని మదిని బింకమీలాగురా

విశ్వదాభిరామ వినురవేమ!

 

5. వేరు పురుగు చేరి...... పద్యము పూరించండి.

జ:

వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును

చీడపురుగు చేరి చెట్టు చెరచు

కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా

విశ్వదాభిరామ వినురవేమ !

 

6. గంధపు చెట్టు వల్ల అది ఉన్న వనం ప్రకాశిస్తుంది అన్న భావం గల పద్యము తెలుపండి

జ:

కులము లోన నొకడు గుణవంతుడుండిన

కులము వెలయు వాని గుణము చేత

వెలయు వనములోన మలయజంబున్నట్లు

విశ్వదాభిరామ వినురవేమ!

 

7. గంగిగోవు పాలు గంటెడైనను చాలు పద్యభావము తెలుపండి

జ:

మేలైన ఆవుపాలు గంటెడైన సరిపోతాయి. గాడిద పాలు కడివెడైనా వ్యర్థం. భక్తితో పెట్టిన పట్టెడు అన్నం అయిన చాలు.

 

8.భూమి మీద ఉన్న వారందరిలో తప్పులుంటాయి అనే భావం గల పద్యము తెలుపండి

జ:

తప్పులెన్ను వారు తండోపతండంబు

ఉర్వి జనుల కెల్ల నుండు తప్పు

తప్పులెన్ను వారు తమతప్పులెరుగరు

విశ్వదాభిరామ వినురవేమ!

 

9. "కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి".. ఈ భావన లో ఉన్న పద్యము తెలపండి.

జ:

అల్ప బుద్ధి వాని కధికారమిచ్చిన

దొడ్డ వారినెల్ల తొలగ గొట్టు

చెప్పు తిన్న కుక్క చెరకు తీపెరుగునా

విశ్వదాభిరామ వినురవేమ!

 

10. ఈ క్రింది పద్యాన్ని పూరించండి

జ:

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా

విశ్వదాభిరామ వినురవేమ!

*****************


15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...