11.03.2021 - శివరాత్రి పర్వ దినము
భక్త వరదుడ! శంకర! పార్వతీశ! అను మకుటముగా
శతక రచనకు, శివరాత్రి పర్వ దినమున ఇదియే శ్రీకారము.
**********
శివునకు అక్షరార్చన
శివుడు శివుడేరా శిశువూ శిశువేరా శివుడూ.....
వాడి కేరింతలె కైలాసం తారంగమె ఢమరుకం
బజ్జుంటే ఓంకారం కెవ్వుమంటె... ప్రళయమేర!
శివుడేరా శిశువూ శిశువేరా శివుడూ.....
అనుబంధాలెరుగనోడు స్వార్ధాలకు లొంగనోడు
ఆకలేస్తే నందివాడు అమ్మను కుమ్మేస్తాడు!
శివుడేరా శిశువూ శిశువేరా శివుడూ.....
వెండి గిన్నె పాయసాలు ఎక్కువై కక్కినోడైనా
మురికివాడ గరళాలూ దిగమింగి ఎదిగినోడైనా......
తల్లి వొడిగుడిలో వున్నంత వరకు.... వాడు వాడు వాడొక్కడు
శివుడేరా...శివుడేరా... శివుడేరా శిశువూ
శిశువేరా శివుడూ!
----అ.అ----
అత్తిలి అనంతు
శిరమున గంగను దాల్చియు
గరళము మ్రింగిన మహేశ కైమోడ్పులయా
హరుసము తోడన గొల్వగ
వరమీయగ తరలివచ్చు భక్తదయాళూ!
నిరతము స్మరణము జేయగఁ
గరుణను గురిపించి ప్రోచు కాలాత్మకుడే
శరణము గోరిన భక్తులఁ
నరయక చిక్కులను ద్రుంచు నంగజహరుడే!
పురహరుని దలచినంతట
దురితంబులను త్వరితగతిఁ దొలఁగద్రోయున్
పరుగున వచ్చు త్రినేత్రుడు
హరియించగ క్లేశములను హర్షము తోడన్!
ఓం నమః శివాయ
..పద్మజ చెంగల్వల
శివ స్తుతి
తే.గీ.
గంగగౌరీశ!శంకర!గరళకంఠ!
సంగమేశ్వర!హర! శివ!లింగరూప!
నందివాహన! నటరాజ! నాగభూష!
పాహి!స్వరకలాపి!మహేశ పాహి! పాహి!
మహేష్ ముత్యాల
మనవాడే శివుడు
ఉన్నారు శివరాం శివవంశీ ,
శివశంకర్ లలాగా పేరుగల మిత్రులెందరో
వారిని పిలుచుకున్నకొద్దీ వినిపించు పదే పదే
ఓం నమః శివాయా అనుచు
ఆ మహా శివయ్య తోనే చేసుకుంటూ నేస్తం
పిలుచుకుంటూ ప్రతిరోజూ
చెప్పుకుంటూ కబుర్లు సాధించుకోవచ్చు
మనలో పరిపూర్ణత ,పవిత్రత
నిర్మలత్వం ,నిజాయితీనూ !
జి మురళీ మోహన రావు
సీ"
గర్భము నందున గట్టివేయదలచి గట్టి పేర్మికి లొంగునట్టి నెమ్మి,
మాయనేరక పెట్టు మాంసమాహారించి యక్కున జేర్చుకొన్నట్టి యనుగు,
ఘనత నొప్పెడివాని ఘన భక్తికిన్ మెచ్చి యాత్మలింగము నిడునట్టి యెలమి
నిండు శ్రద్ధన్ గొల్చు నిశ్చల మతుల కీ వక్షి కొనల జార్చునట్టి చూడ్కు
లడిగెద నిను శిరమువంచి యార్తితోడ
భవభయ హరమునొసగెడి భవుడవీవు
భక్తవత్సల!నమ్మితి భక్తిమీర
పర్వదినమున స్తుతియింతు పాపముడుగ
భావం: శివుని గర్భమందు దాచుకున్న గజాసురుని భక్తికి లొంగిపోవునంతటి ప్రేమ, అమాయకుడైన భక్తకన్నప్ప పెట్టిన మాంసం తిని అతన్ని అక్కున చేర్చుకునే టంతటి ప్రేమ, శివ భక్తులలో అగ్రగణ్యుడుగా ఘనత సాధించిన రావణునికి ఆత్మలింగాన్ని ఇచ్చే టంతటి ప్రేమ, పూర్తి శ్రద్ధతో కొలిచే వారికి నీ కనుల చివర నించి జార్చే చూపు(కటాక్ష వీక్షణ) లు నా శిరసు వంచి ఆర్తితో నిన్ను కోరు తున్నాను. భవభయాలను తొలగించే వాడివి, భక్తవత్సలుడవు అయిన నిన్ను పాపాలు పోయేలా ఈ పండుగ రోజు స్తుతిస్తాను.
వాణిశ్రీ నైనాల
వచనం,
జంగమదేవర శంఖము ఊదెరా,
సిగ నున్న గంగమ్మ నేలకు ఉరికెరా,
మెడ లోని ఫణి రాజు తలపై ఆడేరా,
మేఘాలు పులకించి జడివాన కురిసెరా !!!
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
సీ"
గర్భము నందున గట్టివేయగ దల్చు గట్టి పేర్మికి లొంగునట్టి నెమ్మి,
మాయనేరక బెట్టు మాంసమాహారించి యక్కున జేర్చుకొన్నట్టి యనుగు,
ఘనత నొప్పెడివాని ఘన భక్తికిన్ మెచ్చి నాత్మలింగము నిడునట్టి యెలమి
నిండు శ్రద్ధన్ గొల్చు నిశ్చల మతుల కీ వక్షు కొనల జార్చునట్టి చూడ్కు
లన్నడిగెద శిరమువంచి యార్తితోడ
భవభయ హరమునొసగెడి భవుడవీవు
భక్తవత్సల!నమ్మితి భక్తిమీర
పర్వదినమున స్తుతియింతు పాపముడుగ
వాణిశ్రీ నైనాల
చిత్రానికి పద్యం - సీసము
అమృతమ్ము బడయంగ నా దేవ దానవుల్ క్షీరాబ్ధి మథనంబుఁజేయుచుండ
నిఖిలలోకమ్ముల నిర్మూలనముఁ జేయు నుగ్రమైనగరళ ముద్భ వించె
సకలలోకమ్ముల సంరక్షఁ జేయంగ విశ్వమాత విభుని వేడుకొనగ
నీలకంఠుడగుచు నిలిపెఁ గరళమ్మును కంఠమధ్యంబునఁ గష్టమనక
తే.గీ.
లోక కల్యాణ కార్యైక లోలు రగుచు
పార్వతీశులు నిరతంబుఁబాటు పడుచుఁ
గాచు చుందురు మనలను కరుణ తోడ
లేరు సాటిగ దేవత లెంచి చూడ
ఆదిభట్ల సత్యనారాయణ
సీ.
సర్వలోకంబుల సంరక్షణ కొరకు నెదురునిల్చి రహిగ నెసగమొసగి
గరళము మ్రింగి మంగళకరునిగ పూజలందుకొనుచు, భువి నాత్మలింగ
ముగ సంజనించి సమ్మోహన పరచిన సర్వేశ్వరుడ! సమస్త జగతి బహు
మానించి, ధ్యానించు సేనాపతి!కరుణ జూపి పాలించెడు శూలధరుడ!
గీ.
శరణు వేడిదమోయి శశాంకమౌళి!
భువిజనుల పాపపుణ్యముల్ బోహణించి
నీదు ధ్యానపథము గూర్చి నివ్వటిల్లు
శక్తి నొసగుమోయి పినాకి! సన్నుతులివె
వెంకట్.సి హెచ్
శివస్తుతి
తేటగీతులు:
శ్రీమహాదేవ! గౌరీశ! శివ! మహేశ!
ప్రణవ రూప! సదానంద! భవ విదూర!
భూత నాథ! సనాతన! బుద్ధ! శుద్ధ!
పార్వతీ వల్లభ! వరద! భర్గ! శంభు!
చంద్ర శేఖర! పరమేశ! శాశ్వత! హర!
దీక్షిత! త్రిణయన! దివ్య! దివిజ వంద్య!
కామిత ఫలద! కామేశ! కామ నాశ!
దుష్ట శిక్షక! శ్రితపక్ష! శిష్ట రక్ష!
దక్షజా వర! దీక్షిత! దక్ష హంత!
త్రిపుర హంత! పరాత్పర! త్రిభువన నుత!
మౌని సంభావ్య! సుర హిత! మాధవ సఖ!
వేద వేద్య! శుభంకర! విశ్వరూప!
శార్ఙ్గ హస్త! సద్గురువర! శర్వ! సాంబ!
త్ర్యక్ష! మృత్యుంజయ! దిగంబర! సుర సేవ్య!
సింధురాస్య షడాస్యాధిసేవిత పద!
పూర్ణ! నటరాజ! శంకర! బుధ్న! రుద్ర!
నాగభూషణ! భూరి! పినాకపాణి!
తాండవ విలోల! దేవేశ! దహన నయన!
పాపనాశక! శాస్త! తాపత్రయఘ్న!
దక్షిణామూర్తి! సాంఖ్య! నృత్యప్రియ! భవ!
నీలకంఠ! భస్మాంగ! త్రిశూలధారి!
వ్యోమకేశ! ఋతధ్వజ! యోగివంద్య!
శైలకార్ముక! లయకారి! శక్రవినుత!
నందివాహన! హింస్ర! పినాకపాణి!
రుద్ర! జగదేక భద్ర! విరూప నయన!
జలధి తూణీర! హీర! శ్మశాన వేశ్మ!
దక్షయజ్ఞ విధ్వంసక! త్ర్యంగట! భగ!
ధూర్జటి! హిరణ్యరేతస! ద్రుహిణ! సోమ!
వామదేవ! స్వయంభూత! ఫాలనేత్ర!
విషమ నేత్ర! విశ్వాత్మక! విశ్వనాథ!
మంగళప్రద! భీషణ! మందర మణి!
శేష కటక! గంగాధర! చేకితాన!
మృగధర! క్ష్వేళగళ! సర్గ! మృడ! కపర్ది!
మేరు ధామ! వృషాకపి! మేరు ధన్వ!
కృత్తివాస! కాలాంతక! లింగమూర్తి!
ప్రమథనాథ! పింగళ! హీర! శమన వైరి!
మలహర! భువనేశ! కరిచర్మాంబరధర!
ధ్రువ! జటాజూటధర! కపాలి! విధు! సూక్ష్మ!
మేచకగ్రీవ! వృషపర్వ! మృత్యునాశ!
దేవదేవ! మహానట! తే నమోఽస్తు!
మధురకవి గుండు మధుసూదన్
ఉరగమునీకాభరణము
శిరమందున గంగ నీకు శిశిరము శ్రీకిన్
దురితము జేసిన నేమిట
పురహర నీవేయనంగ పుణ్యము నొసగున్
ఆత్రేయ
శివోహం
చేతులెత్తి శంకరుని పూజించు చున్న
పద్యరచన సేయుటకు నా పక్కనుండి
అక్ష రముల నందించుచు యతులు జూపు
మల్లికార్జునుని కొలువ మంచి కలుగు
CA కె మల్లికార్జునరావు
ఆ.వె.
ప్రళయకాలమందు విలయ కారుడవీవు
సకలజీవమోక్ష శాసకుడవు !
శాంతమొంది నీవు సకలజీవతతికి
శుభములొసఁగు మయ్య శూలధరుడ !!
డా .నాగులపల్లి
వచనకవిత
జటన గంగనుధరించి జలము విడిచి
శంఖున తీర్థంబుగ సేవించుచుండి
ఫణులను ధరియించి ఫణిభూషణునిగా నిలిచిన
పరమశివా ! నిను స్మరియించి ప్రణతులిడుతు.
హేమలత
నీ పలుకే ఆజ్ఞ నీ చూపులే అనుజ్ఞ
పాత దారి లో నువ్వే కొత్త దారి లో నువ్వే
పాత కొత్త తేడా లేదా నీకు? దారిలోన కనపడు వెలుగు నువ్వే
వెలుగులోన సుడులు తిరిగే మిణుగురు నువ్వే
సారంగధర సారంగపాణి నువ్వే అది వినిపించే శబ్దం లోనా నువ్వే
లయకారుడు నువ్వే లయవిన్యాసం నువ్వే
భోళాశంకరుడు నువ్వే భోళాతనము నువ్వే
నీ అనుజ్ఞ కోసం చీమ నీ ఆకలి కోసం కన్నప్ప
నీ నిలయం కైలాసం నీ విలయం భూకైలాసం
దారి తెన్నులు లేనివారికి నీవే ఒక అభయం
మాట వినని సతి ప్రయాణం నీ మౌనం
దక్షయజ్ఞంన ఆగుపించిన నీ ప్రణయావేశం
నీ స్వేదంన ఆవిర్భవించిన వీరభద్రుడి రౌద్రం
అన్నీ రూపాల్లో నీ అంతర్లీనం
అయినా ఆగుపించని కాఠిన్యం
మహాశివరాత్రి నీ జాగరణ జరిగేను లోకకల్యాణం
కోవూరి
శివోహం
**********
శివ శివా అని శ్రీకరముగ తలచిన
సర్వ శుభముల సంతసమున గూర్చేవు..!
హర హరా యని నోరార పిలిచిన
పుణ్య ఫలమునిచ్చి ధన్యులను చేసేవు..!
పంచాక్షరీ మంత్రమును పరవశాన పఠింప
మంగళ కరమైన మహిమనే చూపేవు..!
నిండు మనముతో నీ విభూతి దాల్చిన
నిర్మలమైన కరుణతో నిరతమూ కాచేవు..!
బిల్వ దళాలతో చెలువార పూజింప
అంతులేని సిరులు అద్భుతముగ ఒసగేవు..!
దీపమే వెలిగించి దిక్కు నీవే ననిన
మది లోని చింతను మొదలంటా బాపేవు..!
కాలకూట విషమును కంఠాన నిల్పి
జీవకోటిని కాచిన శీతకరధరా..
మెడలోన మిన్నాగును మోదమున ధరించి
పాప హరణము చేయు పరమదయాకర..
పరమేశా పార్వతీహృదయేశ కైలాసవాసా...!
చేరి కొలిచినవారి కొంగు బంగారమా..!
కోరిన వరాలిచ్చే కొండంత వేల్పువై..
నీవుండగా చింత నాకేల స్వామీ..!
నీ నామస్మరణమే నిరతమ్ము చేయుచూ..
నీ రూపమే యెడదలో సతతమ్ము నిల్పుచూ..
చిత్తశాంతినే కానుకగ స్వీకరింతునయా..!
సర్వమూ శివోహమని సంతసింతునయా..!!
**********
చల్లా దేవిక.
హరహరయని ధ్యానించగ
హరి రూపమెయెదుటనిల్చె ఆశ్చర్యపడన్
హరి నికొలువ హరుడాయెను
హరిహరులొకటేయని ఆత్మకుదెలిసెన్ !
శివునాజ్ఞకు బద్ధులమై
జవజీవములన్నియతనుజార్చిన కరుణై
భువి భస్మపు చిరుబంతై
భవబంధములన్నియతని భాషైకదిలెన్ !
హరహర మహదేవాయని
స్వరమంతా భక్తినింపి శ్లాఘించితి నీ
దరహాసపు వెన్నెల్లో
స్థిరముగ నను తడువనీయు !
శివశంకరుడా!
ప్రతి గుడియిట కైలాసమె
ప్రతి గుండేపాడునట్టి పంచాక్షరియై
ప్రతిమాటా హరహరయని
ప్రతిఫలనమ్ముగనునిల్చె ప్రతిగ శివునికిన్ !
లింగాకారా!హర! యని
అంగాంగములన్నిగలిసియార్తిగపిలిచెన్
అంగారనేత్ర !శంకర!
పొంగారెడు నీదు కరుణ పొడిగించయ్యా!
కంఠేశ్వర గుడి ముందర
గంటకుపైగా నిలబడి కంటినినిన్నే
పంటై పండెను కనులిట
కంఠేశ్వర హర!కపర్తి!కైలాస పతీ!
తే.
వెండి కొండలందు వసించు విశ్వమూర్తి!
నీదు నామస్మరణ తోడ పాదుకొనెడు
తత్వమంతయు నెరిగించి ధరణి జనుల
సౌఖ్యము బ్రపోషించుమో సర్వకరుడ!
ఉత్పలమాల:
ఆకసమంత లింగమని యచ్చట దేవతలెల్ల గూడుచున్
శ్రీకర పూజసల్పిరట, చిత్రముగాశివరాత్రి వేళనన్
దూకుచు క్షీర, భస్మ, దధి తుంపరలన్నియు వ్యోమవేదికన్
ప్రాకుచు నున్నవౌర ఘనపంక్తులవేయనునట్లు చూడగన్.
గోలి.
యుద్భ వించెను రాత్రిన యున్న తముగ
హాల హలమును పానము హరుడు చేసి
గంగ శిఖనందు దరియించి గరళ కంఠ
జాగ రణనుచే తు, దినము జాగ రుకన
ఆర్. సాయి లక్ష్మీ
శివునికి అక్షరాభిషేకము
విఘ్న హారి!ఎలుక రౌతు! విఘ్నరాజు
పార్వతి సుతుడు!గణపతి !పర్శు పాణి!
శాంకరి! కరివదనునకు జనకుడైన
శివుని పూజలు సేయంగ సిరులు కూడు
పూసపాటి
భూనభోంతరాళములన్ని పూర్ణమైన
నీదు యునికి కనుగొనగ నెవరి తరము?
బ్రహ్మ విష్ణువులకయిన బ్రాతి యైన
నిన్ను శరణు గోరితినయ్య నీలకంఠ!
అవళూరు సీతమ్మ
వెండి కొండపై వెలసిన వేల్పు వీవు
మాత పార్వతి తోడుగా మదిని నిలచి
జాగు సేయక బ్రోవుమా జంగమయ్య
కామితార్దముల్ దీర్చుమా గరళ కంఠ
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
పాల కడలి మధనమున పాహి పాహి
యనుచు వేడుకొనగ సురలసురులెల్ల
గరళమును దాచెనట తన గళము నందు
పరమ శివుని పూజలు చేయ ఫలము కలుగు
చుండి రాధిక
జగమునంత చీకటులతో జలము నిండి
యుండగా గొప్ప మిఱుమిట్లనుద్భవించె
విస్ఫులింగమె శివుడయి విస్ఫురించె
విశ్వకళ్యాణ కారక విశ్వనాధ
దుర్భా కృష్ణశాస్త్రి
సృష్టి పరమేశ్వరుని రూపు శివుడుయగుచు
నవతరించె మహాశక్తి నర్ధ భాగ
మగుచు కవియించె హరిబ్రహ్మలమరికగను.
నీదు మహిమలు పొగడెద నీలకంఠ
గాదేపల్లి అపర్ణ
శ్రీకరంబుగ నానంద సిరులనిచ్చు
విఘ్న రాజుని మదిలోన వేడుకొనుచు
శతక రచనకు బూనితీ జయము గల్గ
శరణు జేతును బ్రోవుమా చంద్ర మౌళి
గాండ్ల వీరమణి
నీ విదియనుచు రూఢింప నిన్నెపుడు కను
లార కాన నైతిని; నా తలపుననున్న
రూపమున నిల్చి, స్థిరముగ రూఢి జేసి,
నియతి నేర్పుమా కరుణతో నీలకంఠ!
గౌరి నందన్ టొంపే
పద్య రచన జేయగలుగు పండి తమము
యేది?తత్కార్య మోచుట యేను వింత
గాదె ,ముక్కంటి గురువుగ గతి జూపె,
శివుని నిత్యము కొలువంగ చింత దీర్చు.
ఐ ఉషారాణి
ఆనతిచ్చెను యీశుడే యాదరముగ
గురువు తానే పలుకరించె గుణము కోరి
రచన జేయగ తలపెట్టి రమ్య రీతి
శివుని సన్నుతి జేతునే శిరము వంచి....
జైకర్ విశ్వేశ్వరన్ టొంపే
జలము నుండి తేజ మెగసి జయము గాను
లింగ రూపు దాల్చెనుగద లీలగాను
అవని జనులను గావగా యాదిదేవ
విజయ మొసగుము నిరతము విశ్వనాధ!
జొన్నల గడ్డ రాజ్యలక్ష్మి
జలము నిండిన నిశిలోన జ్వాల బుట్టె
లింగ రూపమై వెలిసెను భంగపడక
సకల సృష్టికి నాందిగా శంఖ మూదె
గంగ నేలెడి స్వామియె కాచు నెపుడు..!!
జూపూడి సుధారాణి
చేతులెత్తి శంకరుని పూజించు చున్న
పద్యరచన సేయుటకు నా పక్కనుండి
అక్షరముల నందించుచు యతులు జూపు
మల్లికార్జునుని పొగడ మంచి కలుగు
కె మల్లికార్జున రావు
నీల కంఠుడా నిత్యము నిన్ను చేరి
నీళ్ళు తీసుకు వస్తిమి నీకు ఈశ
జాగు చేయక పరమేశ జలక మాడు
సేవ చేయగ వస్తిమి కావు మయ్య
లలితా రెడ్డి
ముక్తి మార్గము చూపేటి ముక్తి ధరుణి
అనుదినం కొలిచితినయ్య యాత్మ లోను
నాదు మనసును యెరిగి నా యందు నిలిచి
మంచి మార్గము జూపించు మంజు నాథ
మంతా సక్కుబాయి
మూడు కన్నులు గలవాడు మొదటి వాడు
మేన బూడిద నలుముకు మెసలు వాడు
నెత్తి నెక్కిన గంగకు నేస్త మితడు
భవుడు సతతము భక్తుల బాంధవుండు
పుట్రేవు నాగేశ్వర రావు
పాప పుణ్యము లన్నియు వదలి బెట్టి
మదిని బట్టుకు వీడని మాయలన్ని
దుంచి మోక్షమార్గము వైపు త్రోవ జూపు
విశ్వనాధుని పూజింప విభవ మిడును
రామిరెడ్డి రమాదేవి
రాయకోడులో వెలసిన రౌద్రమూర్తి
ఇంటి దైవమా కొలువైన కంటి వెలుగ
ముక్తి కోసము కొలుతును భక్తి తోడ
వీరభద్రానిను శరణువేడు చుంటి
రుక్మిణి గడ్డంవార్
సోమ వారము వెలుగు చు శోభ తోడ
పూజ చేయగ భక్తిగ పుణ్య మబ్బు
పాప పుణ్యము తెలియక పాదు కొంటి
గిరిజ వల్లభా శరణంటి కినుక విడుమ
అఱ్ సాయిలక్శ్మి
పాల కడలిలో పుట్టిన బ్రహ్మ ఘోష
మును కనిన సురాసురులెల్లపోలివోవ
దయను కలిగి గళములోన దాచి నట్టి
కాల కంఠుడా వేడెద కరుణ జూపు
అయితి సుమలత
అనుదినము వదలక శివ యర్చన సల
పగ సమగుడు యా ఫలితము పవలు రేయి
యుపవశించి ఓ శివరాత్రి యున్న యిచ్చు
భవుని యండ మనకి యుండ పంతుయేల
కొంపెల సతీష్ కుమార్
స్రష్ట సృష్టికి ప్రత్యక్ష సాక్ష్య మీవు
హరికి తోడై స్థితిగతుల హవము సలుపు
లయకరునకు బాసటయయి క్షయమునందు
మువ్వురొక్కరై యిలనిల్చు మూర్తివీవు
భావం: బ్రహ్మ సృష్టికి ప్రత్యక్ష సాక్షం నీవు, స్థితి గతులను యంజ్ఞంగా చేసే శ్రీహరి తోడుగా ఉంటావు, లయకారుడైన శివునికి క్షయం చేయటంలో బాసటగా ఉంటావు. త్రిమూర్తులు ఒక్కటై సూర్యభగవానుడిగా నిలిచావు🙏
వాణిశ్రీ నైనాల
కం ll
కవిమిత్రబృందమునకును
శివముల జేకూర్చు నట్టి "శివరాత్రి మహో
త్సవ శుభకాంక్షలు" ! మహిలో
కవనము వర్ధిల్లు గాత కాంతులమయమై !
కం ll
శివ! శివ! శివ! ప్రమథాధిప!
శివ తాండవ చిద్విలాస! శితికంఠేశా!
భవ! భవ! భవ! బ్రహ్మాత్మజ
భవభావుక భక్తవరద! భద్రేశుడవై !
ఉ ll
కన్నులు మూడు గల్గినను గాంచవదేలర లోకరీతులన్ !
మిన్నగ బూజలెన్నిటినొ మిక్కిలి శ్రద్ధగ జేసితిన్ గదా!
నన్ను బరీక్ష జేయ దగునా పరమేశ్వర! పార్వతీప్రియా!
పన్నగభూషణా! పతితపావన! పాపవిమోచనా! భవా!
కం ll
శుభకర వదన త్రిలోచన
అభయంకర కాలకంఠ ఆనందమయా
త్రిభువన సన్నుత చరణా
అభవా! కరుణాలవాల అంజలి గొనుమా !
మ ll
ఉపవాసంబులు జాగరంబు కడుమంత్రోపాసనాసత్క్రియల్
జపముల్ పూజలు యజ్ఞయాగముల సంజాతంబు శూన్యంబుగా
ఉపకారంబులు జేసి సాంత్వమున వ్యామోహమ్ము పోకార్చగా
చపలత్వంబు, విలాసముల్ విడిచి నీ ధ్యానంబునన్ శంకరా !
కస్తూరి శివశంకర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి