15, మార్చి 2021, సోమవారం

చిత్ర కవనం 87, మంగళ వారం, 09.02.2021

 



09.02.2021 మంగళ వారం

చిత్ర కవనం 87

పై చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

మన తెలుగు తేనియల పద్య కవితా విభావరి కి

ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుర వచోధురీణ, ఉపన్యాస సుధాకర,సాహిత్య రత్న బిరుదాంకితులు,  గౌరవనీయులు బ్రహ్మశ్రీ  ఓలేటి పార్వతీశం గారికి  కృతజ్ఞతాంజలి.

 

తే. గీ.

తెలుగు తేనియ వితతి నాత్మీయ చిహ్న

'పద్య కవితావిభావరీ' హృద్య సభకు

మా యదృష్టమై యమరిన మాన్య, ముఖ్య

యతిథి, ఓలేటి పార్వతీశాఖ్యులు, రస

నవ్య మధురవచోధురీణ, యననొప్పు

వారు,, సాహిత్యరత్న యై ప్రజ్ఞ గనిరి;

దూర దర్శన్ యు, రేడియో ద్వార పరగి,

యాంధ్రుల మహిత సమ్మానమందుకొనిరి;

చిరు కవులమైన మముల నాశీర్వదించు,

వారికివె - మా కృతజ్ఞతా వందనములు !

 

ఆత్మీయ అతిథి గా నరుదెంచి, మనల నాశీర్వదించిన గౌరవ నీయులు బ్రహ్మశ్రీ వాడ్రేవు వేంకట సత్యప్రసాదు గురువరేణ్యులకు నమస్కారములతో...

 

తెలుగు జుంటీగలగు మాకు దీవెనల నొ

సంగ, విచ్చేసి, సత్య ప్రసాదుగారు

పూర్వ కవుల పద్యములనపూర్వ గరిమ

నుదహరించి, వ్యాఖ్యానంబులొసగుచునిట,

నద్భుత కవన రాగంబులలదినారు;

వందనీయులు ; వాడ్రేవు వార్కి ప్రణతి !!

( జుంటీగలు... తేనెటీగలు)

 

వట్టెం వేంకట రమణ

 

 

తేటగీతి.

మమత సుధలను ప్రాణుల మదినినింపి

బ్రహ్మ యాడించు నాటకరాజ మిదియె

పక్షి , జంతువుల వరుస బ్రతుక వలయు

మనిషి , మనిషిగ బ్రతుకగ మారవలయు...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

 

తేటగీతి

జాతి వైరమును మరచి జతగ గూడి

స్ఫూర్తి నిచ్చె నీ జీవులు చోద్య మిదియె !!

మానవత్వము విడనాడి మసలు చున్న

మనుజులెపుడు చూపింతురో మమత లిటుల !!

రమ

 

 

తే.గీ.

మూడు వైరి జాతుల నిద్ర ముచ్చట వలె

శత్రు భావమ్ము విడచుచు సకల జనులు

కలిసి యోకమాట నొకబాటగాను సాగ

స్వర్గ లోకమ్మె దిగిరాగ వసుధ వెలుగు.

డి.రామ నాగేశ్వరరావు

 

 

వచనము,

స్నేహ బంధము ఎంత మధురం,

గుర్తు కు రాదు జాతి వైరము,

మరపురాదు ఆ స్నేహ మాధుర్యము,

తలపులోనే నిలిచి పోవు జీవితాంతము...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

ఆటవెలది

వైరమున్నగాని వైదొలగక యేను

స్నేహపూరితముగ చేరువైన

చెలిమి బలిమగుననుజీవిత సత్యంబు

తెలిపె చిత్ర మేను తీరు గాను. 

హేమలత

 

 

తే"

క్షమయు,క్రోధము, శాంతము, మమతలవియె

దేవుడొసగిన తత్వము ల్దేహమునకు

యేమి యిత్తురదియె తుదకెదురువచ్చు

వైరి ప్రాణుల సహవాస తీరుగనుమ!

వాణిశ్రీ నైనాల

 

 

సమిష్టి గా

చిత్రములో వలె కొన్ని పంచతంత్ర కధలు

వివరించు మిత్రలాభము గురించి

 

జట్టు కృషి తో చేయుదురెందరో

అనేక సేవలు , వివిధ కార్యక్రమములు

అటువంటి సముహ కార్య చరణలే కలిగించు ప్రజలకు ఉపశమనము

 

అటులనే పిల్లలకు తల్లిదండ్రులు గురువులు

విషయములన్నియు వివరించుచూ తమ పిల్లలు

సన్మార్గములో సమిష్టిగా నడుచుకొను మార్గము చూపవలె !

జి మురళీ మోహన్ రావు

 

 

పిల్లియు నెలుకయు కుక్కయు

చల్లగ జాతుల మరచిట చక్కటి నటనన్

ఎల్లరకూమైమరపుల

జల్లులఁ బ్రసరిం పఁజేయు చక్కని రీతిన్.

ఎలుకకు  శునకమె శరణం

నిలుచును మూషికము  కుక్క నీడన భీతిన్

తెలివిగ బండను బెట్టగ

బలువుగ , మార్జాలమెలుకఁ బట్టంగలదే?

(Zoom చేస్తే కనబడుతుంది)

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

జాతి తెగయను బేధముల్ జనము కేను

కులము మతమని వింతగా కుమ్ము లాడ

జన్మ వైరముల్ నిండిన జాడ వీడి

జంతు మిత్రులు జూపిన వింత గనరె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

కం||

కుక్కయు, బిల్లియు, నెలుకయు

చక్కగ నొకచోట జేరి సంతసముగ తా

మొక్కటిగా నుండ దలచి

యక్కున జేరాయి జూడురానందముతో!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

సీ.

మమతాసుగంధముల్ మరచి మానవజాతి వాదులాడ నరుల వాసి చెడునె

జగడమాడు జనుల సాంగత్యమంతయు నరకమై నరజాతి నాసిరిల్ల;

జాతివైరము ద్రుంచి  సహవాస మొనరించు జంతు జాతి నుడివె సామరస్య

భావ విశిష్టతన్, దైవ దీవెనలకై కోవెలకేగు భక్తులకిది యొక

 

గీ.

నివ్వెరపడెడు జిత్రమై నిగ్గు తేల్చి

బోధ చేయు చుండెనె,  పాప పుణ్యము లెరు

గని చతుష్పదముల చెల్మి ఖ్యాతికెక్కి

మహిజనులను జాగృతపరచు  మచలముగను

వెంకట్.సి హెచ్

 

 

అంశం ..  కందంలో జగణము వాడుట ఎలా ?

 కందం..

జగణము వాడుట కంటెను

జగడము లేకయె మసలుట సమ్మతమౌగా

మిగిలిన గణములు వాడుచు

జగణము బదులుగ నలమును సరిపెట్టంగన్..

పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

ఐకమత్యముతో బిడాలము గారముల్ కురిపించగన్ 

స్తోకనమ్రపు మూషకమ్మది ! స్యోనమున్ పవళించగన్ 

నైకభేదములన్ త్యజించిగ నందనంబుల సీమలో   

కాకలీరవమైన స్నేహవికస్వరమ్ములు మోదమై !

కస్తూరి శివశంకర్

 

ఆ...వె:

కుక్క, పిల్లి,ఎలుక, గొప్ప నీతిని చెప్పె,

వదలవలయు  వైరములను..,

ద్వేష,మత్సరములు, వీడి నప్పుడె గదా

ఐక్యభావములను సౌఖ్యమమరు!!

ఝాన్సీ

 

 

ఆ.వె. 1️

పిల్లి యొకతి కుక్కపిల్లను దరిజేర్చి

ప్రేమ మీఱనొకట పెంచుచుండ,

శునకమదియు ముద్దుచూపుల యెలుకను

తనదు పక్కనునిచి తనివి పొందె !

 

ఆ. వె. 2️

ఎట్టి జన్మ ఫలమొ, యే పూర్వ పుణ్యమో,

బద్ధశత్రులైన పరమ మైత్రి

పిల్లి, యెలుక, కుక్క ప్రేమలు దలపోయ,

నుల్లమునకు మోదముల్లసిల్లు !

 

తే.గీ. 3

చిత్రమున కన్పట్టు యతి విచిత్రమైన

యాఖు,మార్జాల,వేపి త్రయంబు, 'నీతి

చంద్రికను,మిత్ర లాభము', చారుతరము

వ్రాసిన మన చిన్నయ సూరివరుల యింటి

పెంపుడు మెకములం;దుచే, పేర్మి మీఱ,

'మిత్ర లాభము' నాలించి మెలుగు కతన,

దాని సారమ్మె  సతతము ద్రాగి పెరిగి,

జాతి వైరము త్యజియించి జ్ఞాతుల వలె

సఖ్యత, సుఖముగని యవి సంచ రించె !

 

ఆఖువు... ఎలుక

జ్ఞాతి... స్వజనుడు, సగోత్రుడు,స్వకులీనుడు,దాయ (తండ్రి)

వట్టెం వెంకట రమణ

 

 

తే గీ

కుక్క బిల్లియు నెలుకలు కులుకు చుండె

వైరి జూపెడి పశువుల వాస మొకటె

వింత గాదె తరచిజూడ విధి తలపున

నీతి పలుకులని దెలిసె నిజము సుమ్మి

పద్మలత

 

 

బుద్ధి బలము కొరవడిన బురక చరులు

జాతి వైరము మరిచిన జంతువులవి

చెలిమి తోడజతను గూడి యెలమినొంది

నరులకు నొకపాఠము నేర్పి కెరలు చుండె

కలతలను వీడి మనుజులు కలసి యున్న

మానవత్వపు పొలుపము మహిన విరిసె

 

అవళూరు సీత

 

 

పిల్లి కుక్కయు ఎలుకయు పిల్ల లేను

చేరి ఆడుచు పాడుచు చెలిమి తోడ

కలసి యుండగ అరమరి కలును లేక

నిదుర నందును కూడగ నివ్వ సుఖము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...