16, మార్చి 2021, మంగళవారం

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

 

15.03.2021 సోమవారం దత్తపది -87

హిమము -సుమము -సమము -భ్రమము

మనోహరమైన పద్య/ వచన కవితలు

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

నిన్ను నేను సాధారణ వ్యక్తి అని బ్రమము 

నొందితినిగాని నీ మహోన్నతమైన

మహోత్కృష్టమైన మేరు సమము నీ

మృదు మధుర వాక్కులు దరహాస

ముఖారవిందం విరజాజి సుమం

నీ హృదయము నీ మానసము 

నీ ఆలోచన పరంపరలు పరుల

మేలు కొరకు నిరంతరం అన్వేషణ చేసే

శరదృతువు లోని చల్లని హిమము గాన

నీ స్నేహం నాకు మిక్కిలి అపూర్వ

అనిర్వచనీయ ఆనందదాయకం

మంజూష నిజామాబాద్

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

కందము

చల్లని స్పర్శను నిచ్చెడి

తెల్లని వర్ణపు హిమమును తిలకించినచో

ఉల్లము సుమముల సమముగ

జిల్లని మురియును మృదువుగ శిశిరపు భ్రమమున్.

హేమలత

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

సీసము

హిమమునై నీపాద హేమంబు క్రిందను నలిగి పోయిననాడు నాకు సుఖము

సుమమునై నీపాద సుందర ద్వయముపై క్షణమైన నిలువగా కాంక్ష నిడుదు

సమముగా నీపద స్మరణంబు నందున మనసు నిల్పగలేక మథన పడుదు

భ్రమముజేయుచు నీదు పాద పద్మముజుట్టు వాలు సౌభాగ్యంపు భ్రమము బడుదు

 

తే.గీ.

నాదు చంచల చిత్తంబు నవధరించి!

నీవె యదుపులోనుంచుమా నీలకంఠ!

నాదు తనువును మనమును నీదు సృష్టి!

నీదు సృష్టికి పరిపుష్టి నీవె యీవె!

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

 హిమము గురిసెడు వేళలో హిమగిరి నల

రించు సుమములను స్పృశించు మంచు శోభ

అసమమౌ భ్రమమును గూర్చి, గుసగుసలిడు

భ్రమరముల రాగముల తోడ పరిఢవిల్లు

ఆర్. శాయిలక్ష్మి

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

సుమము లు విరిసెడు వేళన్

సమమగు తలపుల సుగంధ సౌరభ శ్వాసల్

హిమమై హృదయము కరిగిన

భ్రమయే మనసున కదలగ వదలవు వాంఛల్

రమ

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

 గీ.

హిమము దీర్చిన నగపు దుహిత, సుమముల

కెన్నగ సమముగానీసు గేహిని, సక

లమును విడనాడి జేసి సంభ్రమము గల్గు

నటు తపము, ప్రాణపతి జేరె నసురవధకు

వారణాశి శ్రీలేఖ

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

సుమము శరముగ గొనిన యసమశరుండు

సరస విరహప్రదాత; యసమము వాని

చెఱకువింటి తూపుల బుట్టు *చురుకు దెబ్బ;

హేమపు నులివేడికె జారు హిమము వోలె,

కరుగు దనువుమనసనంగు **చురుకు సోక;

వెల్లువలె, విరివిల్తుని వి భ్రమము లు !

 

అసమశరుడు... మన్మథుడు (బేసి శరముల జోదు)

అసమము....సాటిలేనిది (మన్మథుని పుష్పబాణ ఘాతము)

తూపులు..బాణములు

హేమము.. హేమంతము, మంచుకాలము

ఆనంగుడు.మన్మథుడు

చురుకు(2).. (*) పదునైన  (**) తాపము, వేడిమి

విరివిల్తుడు.. మన్మథుడు

విభ్రమము.. శృంగార చేష్ట

వట్టెం వెంకట రమణ

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

పరమేశ్వరుని స్తుతి

తే.

బసుమము ధరించి సంచరించు సుబలుడ! స

కల చరాచర సృష్టిని గాంచు నీదు

మహిమ ముమ్మడించు భువినందు హర! యసమ

మైన దీవెన సంభ్రమమౌ నటు లిడు

వెంకట్.సి హెచ్

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

అవ్విధంబుగా

గురువుగారు చెబుచుండె పాఠము

 శ్రద్ధగ  చదువుచు నేర్చుకొనుమ

సవ్యముగా విజ్ఞానంబును, చేయుచు ఉద్యోగము

అందించుమ  న్యాయమును సమముగా నందరికి ననుచు

 

 పరధ్యాన విద్యార్థుల నుద్దేశించుచు

హిమము,సుమముల గురించే పగటి కలలతో భ్రమము చెందక

 ఏకాగ్రతతో పాఠ్యంశము నభ్యసించవలె నని పదే పదే నొక్కి చెప్పే !

జి మురళీ మోహన రావు

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము 

తేటగీతి..

హిమము సొబగుల కాశ్మీరు హితము గోరి

సమము జేయుచు విభజించె జక్కగాను

ప్రక్క రాజుల భ్రమలకు పాతరేసి

ప్రగతి సుమములు బూయించె ప్రభుత నేడు....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

తే గీ

మహిమ ముచ్చట గొల్పగ మనసు నందు

సుమము తోడుగ పూజలు సుందరముగ

సమము నేనని జూపుచు సంతసించి

భ్రమము లెల్లయు వీడగ పరితపించె

 

కం||

హిమమున నద్భుత రీతిగ

సుమములతో బూజ జేసి సుందర రూపున్

సమముగ భక్తిని నింపెన్

భ్రమములనిక దూరముంచు పరమ శివుండా!!

కల్యాణ్ చక్రవర్తి ముంబాయి

 


 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

కం"

భ్రమము ల హిమము లు గరుగన్

సుమము ల్వికసించు నాత్మ శోధన నెరపన్,

సమముగ జూసిన కష్ట సు

ఖములన్ ఘనులౌ బ్రతుకున కాంతులు గాంచన్

వాణిశ్రీ నైనాల

 

 

దత్తపది : హిమము సుమము సమము భ్రమము

వచనం,

హిమము కురిసే వేళ,

సుమము విరిసే వేళ,

చిత్త భ్రమములు తొలగే వేళ,

కైలాస వాస, మము కరుణించవా !!!

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి


 

స్వేచ్ఛా సమర్పణ

 



ఆలు గడ్డల నుడికించి చాలి నంత

కారముప్పులను కలిపి కూర చేసి

ఉల్లి పాయ,బఠానీలు పల్లి విత్తు

లన్ని‌ కలిపి బాణలిన తైలమును పోసి

దోరగా ను వేయించి ముందుగ తయారు

చేసినట్టి యా కూరలో చిదిపి చిదిపి

మొత్త మొక్క ముద్దగ జేసి యొత్తినట్టి

గోధుమ చపాతి లందుంచి కూర జార

కుండ త్రిభుజ రూపమ్మున కొసలు‌ మడిచి

భాండిలో గల నూనెలో వదలి యెర్ర

డాలుగా వేగినంత నా కాలినట్టి

ఘనత నొప్పు సమ్మోసాలు కడుపు నిండు

గాతినగ లేని ప్రజలను‌ కాంచ తరమ

 

అమ్మానా  కొలదీ  ఫలమ్ము, తినగన్ యారోగ్యమున్ పొంది‌ మో

దమ్మున్ నామదికిన్ కలుంగు నని పంతంబున్ వచింపంగ భా

వ్యమ్మా వేడుచు నుంటిగా వడిగ తే వమ్మా త్రి కోణాకృతిన్

సమ్మోసాలను,  కల్గుగా మనముకున్ సంతోష మెల్లప్పుడున్

పూసపాటి

 

 

కం"

చిరుతిళ్లకు రారాజిది

కరకర లాడి, చవులూర కంటికి నింపౌ

మరిమరి నోరూరించుచు

వరమౌ, నాకొన్న జిహ్వ వందన మిడగన్

వాణీశ్రీ నైనాల

 

 

తేటగీతి....

సవ్య రీతిని జేయగ సమొస , కూర

వేడి నూనెను కరకర వేచి, దించి

భార్య , భర్తయు భుజియింప బంచుకొనుచు

ప్రణయ సౌధాన విహరించు పగలు రేయి

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

స్వేచ్ఛా సమర్పణ

జీవిత మొక తక్కెడ

జీవితమంతా ఒక తక్కెడ క్షణం క్షణం 

కదలగ కదలగ సంతులనమగు ఒక తక్కెడ

దీనులపై కరుణ చూపించాలి కానీ దుర్వినియోగానికి తావివ్వద్దు

తోటి వారిపై నమ్మకముంచాలి కానీ మోస పోవడానికి అలుసివ్వద్దు

సంతృప్తితో బతుకు సాగించాలి కానీ ఉద్ధరింపు ప్రయత్నం ఆపవద్దు

CA కె మల్లికార్జున రావు

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...