13, మార్చి 2021, శనివారం

పుస్తక సమీక్ష , ఆదివారము, 07.02.2021

 

పుస్తక సమీక్ష , ఆదివారము 

సమీక్ష / వ్యాసం

రావి కొండలరావు:   జననం ఫిబ్రవరి 11, 1982 - మరణం జూలై 20, 2020

రావి కొండలరావు సినీ నటుడు గానే గుర్తున్నప్పటికీ  ఆయన ఒక మంచి రచయిత...బహుముఖ ప్రజ్ఞాశాలి..

 

60కి పైగా కథలు మరెన్నో నాటకాలు నాటికలు రాశారు

నాగావళి నుండి మంజీర వరకు అన్న శీర్షికతో తన ఆత్మ కథను రాశారు

ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్ గా శ్రీశ్రీ, ఆరుద్ర ల తో కలిసి పనిచేశారు.


రావి కొండలరావు గారి కి చిన్నతనం నుంచి నాటకాలంటే సరదా. కథలు రాయడమంటే చాలా ఇష్టం. ఆయన రాసిన తొలి కథ 'దైవేచ్ఛ' 1949లో 'యువ'లో వచ్చింది. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు సంపాదకత్వంలోని 'బాల' పత్రికలో ఆయన  కథలు వెలువడేవి. ఆ సమయంలో ,  పత్రికలో కథలు రాసే ముళ్లపూడి, బొమ్మలు గీసే బాపుతో కొండలరావుకు స్నేహం ఏర్పడింది.

 

'స్వయంవరం', 'కుక్కపిల్ల దొరికింది', 'నాలుగిళ్ల చావిడి', 'పట్టాలు తప్పిన బండి', 'ప్రొఫెసర్‌ పరబ్రహ్మం' లాంటి నాటికలు, నాటకాలూ రాశారు.  సుకుమార్‌ పేరుతో కొన్ని గీతాలూ రాశారు.  సినిమాల్లో నటిస్తూనే ఆయన 'హ్యూమరథం', 'మాయా బజార్‌', 'మల్లీశ్వరి' (సినిమా నవలలు), 'రావి కొండలరావు కథలు', 'వాహిని' లాంటి రచనలు చేశారు.

 

'బ్లాక్‌ అండ్‌ వైట్‌' పేరుతో రావి కొండలరావు సినీ సంకలనం రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించేవారు. తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది. అలాగే కళలకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది.

ప్రజాదరణ పొందిన వారి నాటికలలో ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను...

 

కుక్కపిల్ల దొరికింది

1956 నాటి ఈ నాటిక యిప్పటికీ పాప్యులరే. ఓ పెద్దమనిషి పెంచుకునే కుక్కపిల్ల తప్పిపోయింది. దాన్ని వర్ణిస్తూ, పట్టి తెచ్చినవారికి నూటపదహార్లు యిస్తానని  పత్రికలో ప్రకటన యిచ్చాడు. ఇక దానితో మొదలవుతాయి అతని కష్టాలు. ప్రతీవాడూ రోడ్డు మీద దొరికిన ఊరకుక్కపిల్లను తీసుకువచ్చి ‘ఇదే మీ కుక్కపిల్ల, బహుమతి యివ్వండి’ అని పేచీ పెట్టారు. తెల్లరంగు అని రాశారు కాబట్టి నల్లదానికే సున్నం కొట్టి ఒకడు తెచ్చాడు. పొట్టితోక అన్నారు కాబట్టి వున్న తోకను కత్తిరించి తెచ్చాడు మరోడు. ఇదేమిటయ్యా అంటే నేనేం కత్తిరించలేదు, ఆకలేసి అదే కొరుక్కు తినేసిందని దబాయించాడు. బహుమతి యివ్వకపోతే తంతామన్నాడు. చివరకు యి బాధ భరించలేక ‘కుక్కపిల్ల దొరికింది, ఇంకేమీ తీసుకురావద్దు’ అని మరో ప్రకటన యిచ్చాడు... నేటి వాస్తవాన్ని వ్యంగ్యంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ నాటిక...

 CA కె మల్లికార్జునరావు


 

ప్రహేళిక సంఖ్య - 45

ది. 07.02.2021 ఆదివారం

జవాబులు

అంశము: తెలుగు జాతీయాలు

1. అతి చిన్న విషయానికి నానా రబస చేయు వారినుద్దేశించి ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

జ:

ఇల్లు పీకి పందిరి వేయడం.

2.  ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా, పొరుగు వారికి ఉపయోగపడే పనులు చేస్తుండే వారిని గురించిన జాతీయం తెలుపండి.

జ:

ఇంటికి జ్యేష్టాదేవి పోరుగుకు లక్ష్మీదేవి

3. మాయమాటలు చెప్పి ఎదుటివారికి ఏ కొద్దిగానో ఇచ్చి వారి నుంచి ఎక్కువ కాజేయటం అనే భావనను తెలుపు జాతీయం తెలుపండి

జ:

ఈతాకిచ్చి తాటాకు గుంజినట్టు

4. పనికి మాలిన కబుర్లు చెపుతూ ఏదైనా చేసేస్తాను అని పలుకులు పలికే వారిని ఉద్దేశించి తెలుపు జాతీయం ఏమిటి

జ:

ఉత్తర కుమార ప్రగల్భాలు

5. లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం భావనకు వాడే జాతీయం తెలుపండి?

జ:

ఎత్తిన కత్తి దించక పోవడం

6. ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం వారిని ఉద్దేశించి వాడే జాతీయం ఏమిటి?

జ:

ఎనుపోతుపై వాన

7. చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం, చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం గురించి తెలిపే జాతీయం ఏమిటి?

జ:

ఎముకలు మెళ్లో వేసుకు తిరిగి నట్లు

8. ఒకరికొకరు సహకరించు కోకుండా, ఎవరిష్టం ప్రకారము వారు నడుచు కోవడం అనే భావన తెలుపు జాతీయం ఏమిటి?

జ:

ఎవరికి వారే యమునాతీరే

9. నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం అని తెలుపడానికి ఏ జాతీయం వాడతారు?

జ:

ఎల్లయ్య మల్లయ్య చదువు

10. పచ్చి అవకాశ వాది అని తెలిపే జాతీయం ఏమిటి?

జ:

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం

వెంకట్.సి హెచ్

 

ఆదివారం తలంటయ్యాక , తుమ్మడొంకలా ఉన్న జుట్టు ఫ్యాన్ కింద కూర్చుని ఆరబెట్టుకుంటా, బామ్మా !! అంటే.. టా... ఠ్ వీల్లేదు , అయితే సాంబ్రాణీ 💨💨 గియితే అరుగుమీద బైఠాయింపు అని రూల్ పెట్టేది , సాంబ్రాణీ అంటే గేదెల కొట్టంలో దోమలకి పొగ పెట్టినట్టు పెడుతుంది, దానికన్నా ఎండ బెటర్ అని అరుగుమీద కూర్చునే దాన్ని, పిన్నులు పెట్టు 📌 పోనీ అయినా, అనడిగితే , ఛ.... స్ అది మన సంప్రదాయం కాదంటూ, అటోపాయ-ఇటోపాయ తీసి రెండల్లికలు అల్లి, రెండు చేతిలో ఓ మాదిరి కర్ర పెట్టి, ఆరుబయట ఎండేసినవి కాకులెత్తకుండా చూడని పనప్పగించేది.. చేతిలో కర్ర , సత్తెమ్మ చలవ చేసిచ్చిన తెల్లటి గౌను(ఆదివారం తెల్ల బట్టలు కూడా రూలు) , రెండుసార్లు తల విదిలించేసరికి పాయలూడిపోయిన జుట్టు తో ఓ మాదిరిగా తయారయ్యేది నా రూపం !!👻

 

అదే సమయానికి మా బాబాయ్, తన క్రికెట్ బ్యాచ్ కి 🏏 కాఫీలిప్పిస్తా రండని ఇంటికి పిలిచి , వాళ్లకేసి చూసి కన్నుకొట్టి 😉 , నా వైపు చూసి తలెగరేసి ,అక్కడ మీకెవరైనా కనపడుతున్నారా ? 🧐 అని అడిగేవాడు.

 

లేదురా అని కోరస్ లో అరిచేవారు!

అరె సరిగా చూడండి.. ఏదో తెల్లగా నీడలా మర్రిచెట్టు ఊడలు నేలమీద ఆడుతున్నట్టు లేదూ ?? సరిగ్గా చూడండ్రా , అని మళ్ళీ రెట్టించేవాడు!!

అవున్రోయ్ , నువ్వు చెప్తుంటే సరిగ్గా చూసాం, జగన్మోహిని సినిమాలోని కొరివిదెయ్యం లా ఉందిరా, అని ఒకడు, ఛా.. కాదురా , అది పిల్ల పిశాచం అని ఇంకొకడు వెక్కిరించేవారు!!


నేనెవరో మీకు తెలీదా ? అని ఏడుపు మొహమేసుకుని నేనడిగితే ...


అబ్బే, అబ్బెబ్బే అని పెదవి విరిచి, అరె , ఎవత్తిరా ఇది ? లంక ముందు ఉండాల్సింది అయోధ్య ముందు కాపలా కాస్తోంది ? అని అడిగేవారు !

 

కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో అద్భుతం జరిగి, మా పెద్దాడికి పెళ్ళైన చాన్నాళ్ళకి, రాముడి వరంతో లక్ష్మి పుట్టిందని గొప్పలు పోతూ మా అమ్మ జనాలకి చెప్తూ ఉంటుందే ....అదే ఇది !!

 

ఓహ్..ఏకైక పుత్రిక ఈవిడేనా? ఇంటకుముందెప్పుడూ చూళ్లేదే!!

 

ఆ కైక పుత్రిక ఇదే , ఆ అద్ 'భూతం' .... ఆదివారాల్లో ఉదయం మాత్రమే ఇంట్లో ఉంటుందిలే , మధ్యాహ్నం అయితే చింత చెట్లు,.మామిడి చెట్లు, గుడి గోపురాల మీద అటునించి ఇటు దూకుతూ ఉంటుంది, కాస్త దూరంగా ఉండండి రేయ్, ముట్టుకుంటే కరుస్తుంది... వాక్సిన్ లేదు....

 

బామ్మోయ్.... బాబాయ్ గాడు ఏడిపిస్తున్నాడే....

 

పదండ్రా...వచ్చిన పనైంది ,పెసాంతంగా ...కాఫీ తాగుదాం .. తుఫాను హెచ్చరిక చేసేలోపు , వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉడాయించేవాడు !!

 

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... శ్రీ శ్రీ గారి సిప్రాలి లో ఒక సిరిసిరిమువ్వా శతకం లోని పద్యంతో , మా బాబాయ్ చేసిన చిందులు స్ఫురణకొచ్చింది ..

 

"దెయ్యాలను చూపిస్తా

నయ్యా !" , రమ్మనుచూ నొక్క ఆసామి నా

కయ్యో, తన కూతుళ్ళను

చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా!

 

విష్ణుప్రియ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...