13, మార్చి 2021, శనివారం

దత్తపది_76, చింత, వింత, కొంత, ఎంత, 08.02.2021 సోమవారం

 


08.02.2021 సోమవారం దత్తపది_76

చింత, వింత, కొంత, ఎంత

 

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

శార్దూలము (వరూధిని ప్రవరునితో)

 

చింతాక్రాంతము నొందనేల వరుడా!సౌందర్య వారాసినై

వింతల్ జూపగ నేను సిద్ధముమనో భీష్టమ్ము లీడేర్చగా!

నెంతోప్రేమను గోరుచుంటి మదిలో నీరూపమే సాక్షిగా!

కొంతైనన్ శ్రమదీర్చుమా! కరుణఁ నేఁగోరంగ కాదందువే?

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

తెలుగు పద్య విభావరి వెలుగు జిమ్మి

జుంటి తేనెల సోనలు  జొబ్బటిల్ల

కనిన ప్రేక్షకుల మనముల్ కౌతుకముగ

పాటవమును జూపుచు తేనె పంచిన కవి

వరులకు శత సహస్ర దీవనలనిత్తు

అవళూరు సీత

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

తేట గీతి

"కొంత" సంపద యున్నను" చింత" లేక

తృప్తిగ బ్రతుకు సాగింత్రు తెలివి గలిగి

"ఎంత" సంపద యున్న నిశ్చింత పొంద

రేల? కడు" వింత" యే కదా! ఇందుమౌళి!

డి.రామ నాగేశ్వరరావు

 

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

చింత సేయ బద్య రుచులు సుంత జూప

కొంత నేర్చిన పండితు లంతజేరి

రెంత! సంతస మతిథిలు వంతపాడ

వింత యేమి! యిది శివుడు చెంతనుండ!!

వాణిశ్రీ నైనాల

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

కం ll

పద్యమ్ము తెలుగుహృదయము

హృద్యముగా పలకరించి హేలామయమై

విద్యావేణిని గొల్వగ !

నాద్యంతము హృదిని దోచి నందనవనమై !

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

శా ll

అంతర్జాలమునీ విభావరియె, మాయామంజుయానమ్ములై 

కాంతుల్ సంతసమైన రీతిగను సౌగంధమ్ము జాల్వారగన్   

స్వాంతంబున్ మధురోహ మాలికలతో వాగర్ధ రాగమ్ములై 

చింతాకంతయుచింత లేక పదమంజీరంబులన్ రువ్వగన్ !     

కస్తూరి శివశంకర్

 

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

తేటగీతి

కొంత మంది తెలుగువారు కూడి రిచట !!

ఎంత ని పొగడను ??పలుకు జిలుకులమ్మ

పరవశించి మెచ్చును వీరి ప్రతిభ జూసి !!

వింత యేమిగాదు తెలుగు వెలుగు నెపుడు !!

చింత దీరిన వాగ్దేవి  సిరుల నొసగు !!

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

ఉత్పలమాల

చింతలు దీర్చుమా యనుచు శ్రీహరి సన్నిధి చేరి వేడగన్ !!

వింతగ జూచి ,  యీ జనులు భీరువు నేనని వెక్కిరింతురే !!

ఎంతగ వేడినా శమము నీయక శోధన జేతువా హరీ !!

కొంతయె చాలుగా కరుణ ! గోకుల కృష్ణునిప్రీతి  బొందగన్ !!

రమ

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

కం ll 

భావకవితల బరువులో 

భావాంభర విసృతమౌ విభావరుల సిరుల్

జావళిరాగముల హొయలు

సేవంతికమై మనసులు సృజయుంచవలెన్  !

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

ll  

కవితావేశము పొంగిరాగ హృదిలో గారాబు భావంబులై

కవితారూపములైన వాకృతులతో కామోడ్చు నెల్లప్పుడున్

కవులై గాంచిన భావమాలికలతో కవ్వింతలన్ నింపగన్

కవితాకాంతులు నిత్యమై కురియగన్ గంధమ్ములన్ పంచుమా !

కస్తూరి శివశంకర్

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

విజ్ఞానంబును సంపాదించుకొనవలె ఎంతయినను

 ప్రతినిత్యము ఉపయోగించుకొనవలెకొంతయినను 

తొలగించుకొనవలె చిరకాల చింతలను పంచవలె

అందరికీ వింతగా వినోదములు,ఆనందములును

జి మురళీ మోహన్ రావు

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

చక్రవర్తుల వారి దత్తపది తో ఝాన్సీ గారి మనవిని పరిగణన లోకి తీసుకొని నిన్నటి పద్యకవితా విభావరి కార్యక్రమ విశేషాన్ని తెలుపు చిరు ప్రయత్నం

 

సీ.

ఎంత రుచ్యకరమో! వింత గొల్పిన పద్య కవితావిభావరి కార్యమెంత

ఘనతనొందినదో!సుకవుల పద్యమునాల పించి, మధువు లొలికించి, తెలుగు

పద్య వైశిష్ట్యమున్ హృద్యముగ వినుతి కెక్కించిన గవులభీష్ట మిదియె!

కొంతంబుకాని సంకొత్త యొడుపు వోలె  నొక్కొక్క నుత్తేజ ముబ్బతిల్లె.

 

గీ.

ఆధునిక పరిజ్ఞానము నాకళింపు

జేసుకొనిన తేనియలు నిశ్చింతగ కవి

తారచన జేయుచు, సతము తన్మయతన

పద్య కవితా విభావరిన్ బరిఘటించె

 

కొంతముకాడు= ఈటె ధరించిన సైనికుడు

వెంకట్.సి హెచ్

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

ఎంతెంత వెదికినా కానమీ జగతిన

నిశ్చింత జీవనము సాగించు చోటు

కవ్వింతలతో కోర్కెలు కమ్ము కొనగ

ఎంతో కొంత పరులకు మేలు చేయ

అంతరంగమందు చింతలు తొలగు

కాంతి రూపమై మనము శాంతించు.

CA కె మల్లికార్జునరావు

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

తేటగీతి

ఎంత భాగ్యమోరాముని చెంత జేరి

కొంత బ్రోవుమునన్నని కొలుచుచుంటి

వింతగాదుగా నామొర విన్న వించ

చింత తోడను గోపన్న సీత నడిగె.

హేమలత

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

ఆ వె

 

చింత దీరు మనకు చిద్విలాసమ్ముతో

వింత గాదు నిజము విశ్వమందు

కొంత యనెడి తలపు కూతంత విడిచినా

ఎంత తక్కువైన నేమి గాదు

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

కం||

చింతలు దీర్చెద మనవని

వింతగ బల్కంగ నేత విపరీతముగన్!

కొంతయు నాలో చించక

నెంతెంతో తలచు కొనగ నేలెద మనలన్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

కందంలో.....

చింతలు బాపు విభావరి

వింతగు కార్యాచరణలు విభవము గొలుపన్

కొంతయినా యుపశమనము

నెంతని బొందు మది హృష్టి నెఱుఁగము శివుడా!

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

చింత లేని జీవనముకు చింతజేయు జీవులన్

వింత గాను జూసి నవ్వె విశ్వ నాథుడు, భువి లో

ఎంత గోరికలను దీర్ప యేను ముదము బొందరే ?

కొంతయైన దృప్తి బడక కొరత జూపుదురు జనుల్.

ఉష

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

చింత దీరచ వెడలెను చిన్మయ ముగ

వింత గ ముసలి ఎంగిలి విధిగ తినుచు

కొంత కూడను వదలక కోటి వరము

నెంత నిచ్చెను రఘుపతి నెమ్మి తోడ

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

ఉత్పలమాల

చింతను పొందగా తగునె? చేసిన బాసలు వీడనే సఖీ

ఎంతయుపేర్మితో వలచి యింపుగ చేరిన నేస్తికాని నే

కొంతయు ప్రీతిలే దనుచు కోపము దెచ్చుకొనంగనెం తయో

వింతగ తోచునే చెలియ! వీడుము కోపము ప్రాణ వల్లభే

అవళూరు సీత

 

 

దత్తపది: చింత, వింత, కొంత, ఎంత

వచనం

సంపాదన కాంక్ష ఒక వింత వ్యాధి,

ఎంత సంపాదించినా కనీసం,

కొంత అయినా వితరణ చేయకపోతే,

నిశ్చింత ఒనగూడదు, చివరకు చింత మిగులు.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...