1, అక్టోబర్ 2020, గురువారం

శీర్షిక : అన్నదాత , చిత్రం పై పద్యం - 51, 29.09.2020

 

29.09.2020 

 శీర్షిక : అన్నదాత ,  చిత్రం పై పద్యం  - 51 

ఆటవెలది

చినుకు రాలినంత చిగురించు నాశలు

పొలము బాట నడిచి హలము బట్టి;

శ్రమని ధారపోయు రైతన్నకు జయము

రైతు జూపుబాట రాచబాట

 

వై. శ్రీదేవి‌‌‌ తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాలలో 

 

కాలరధమ్ముపైన తన కష్టము, స్వేదము చిందువేళలో   

నేలను నమ్ముకుంటు తపనీయము జేయుతలంపు తీవ్రమై    

హాలికులెందరో మనకి హాయిగ బువ్వని పంచుచుండగా

పాలనజేయు నాయకుల బాసటలేకయు తల్లడిల్లగా !!!

 

కస్తూరి శివశంకర్తెలుగు తేనియలు

 

 

అన్నీ వాడే


రోజంతా నేను నా చరవాణి తో సావాసం , ఆకాశాన్నంటే ఊహలు , కోరికలతో భేటీ పడటం .

వాడు .... అన్నీ వాడే  చిన్న పొలం తో  ఇష్టపడుతూ , కష్టపడి ప్రకృతి దేవుళ్ళని

ఆరాధిస్తూ, ఆహ్వానిస్తాడు ।

ఆలోచించిన వన్నీ అమలు పరిచి పళ్ళు,  పూలు ధాన్యం , పప్పులు , కూరలు

పుష్కలంగా పండిస్తాడు .అన్న దాతగా అందిస్తాడూను ।

మురళిమోహన్ తెలుగు తేనియలు

 

 

అందరికి నమస్సులు.ఈనాటి దత్తపది కి నా చిరు ప్రయత్నం...


అన్న దాతా ఈ జనులకు తెలియదా.......?

నీవే వెన్నెముక దేశానికని,

నీ స్వేదబిందువులే పెట్టుబడి

మా ఆహారానికనినీకష్టము వలనే కదా

భారతమాత ని అన్నపూర్ణ అని అంటున్నారని,

నీవు లేనిదే మా మనుగడ లేదని,

నీకై నాలాటి వాళ్ళు కన్నీరు కార్చిన

వ్యర్థమని.... అందుకే

నీకై, నే వేడుకొంటున్నా దేవుడిని,

నీకై నాయకులకు అండగా

నిలిచే శక్తి నిమ్మని. నీకివే నా ప్రణామములని చెబుతున్నా

ఇంతకంటే నీకింకేమి  ఇవ్వలేమని..............

 

ఉషారాణితెలుగు తేనియలు

 

 

పంచె కట్టి చొక్కా విప్పి హలము పట్టి

ఏరువాక సాగక, ధనము అందక ఎండనక    వాననక  దిగులు పడే

 క్షణాలు రైతు జీవితం లో కోకొల్లలు అలాంటి

రైతన్న క్షేమం గా ఉండాలని ఆకాంక్షిస్తూ

 

చిన్న అంజలి తో  తేటగీతి

 

ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ది

రస్తు దిగ్విజయోస్తు శ్రీ రస్తు నీకు

మానవోత్తమా ఆకలి మాపు ధీర

అందుకొనుము మా ఆర్ద్రపు యంజలలును  !

 

మాదిరెడ్డి సురేశ్తెలుగు తేనియలు


 

మొలకల పున్నమి మొదలవగానే

అందరికీ కడుపు నింపే అన్నదాత

హలము పట్టి కాడెద్దులు తోడురాగ

 

పొలము నందు దున్ని దుక్కి

విత్తులునాటి

తొలకరి చినుకులు కై ఎదురు చూసే

 

డి. నాగమణితెలుగు తేనియలు

 

 

ఆటవెలది


హలము పట్టి నడిచె యన్నదాత యిలన

పొలము దున్ని తాను పోరు సల్పి

పాడి పశువులన్ని పదసంపదగ కొల్చె

పరవశముగ తాను పథము చూపె

 

సి.హెచ్. రజిత

 

 

రైతన్న

 

ఎండనక, వాననక, రాత్రనక, పగలనక

పురుగు - పుట్రకు భయపడక

క్రూరమృగములకు వెరవక

కష్టమును చెమటగా చిందించి

భూమాతను నమ్ముకుని

ఆశ - ఆడియాసల ఊగిసలాటల మధ్య

వరుణుని దయకై ఎదురుచూస్తూ

ప్రాణముగ పెంచుకొను కన్నపిల్లల వోలె

పంట చేతికి వచ్చు పర్వదినముకై ఎదురు చూచుచు

పెండ్లి చేసిన కూతురిని అత్తవారింటికి పంపు

కన్నతండ్రి కి సంతోషము - బాధ కలసి వచ్చినటుల

పంట కోత కోసి అమ్మజూడువేళ

వ్యాపారమృగమునకు బలైన  ఓరైతన్నా

నిస్సహాయుడవైన నీకు అసహాయతతో

అంకితమిస్తున్నా  ఈ కవిత

 

శ్రీలేఖతెలుగు తేనియలు

 

 

అన్నదాత

 

సకల జీవులకు అన్నము నొసగిన

ఈశ్వరుడే అన్నదాత అంటాను నేను.

ఆ అన్నదాత ప్రతినిధి గా ఇలలో,

రైతుఅయి ఉన్నాడంటాను నేను.

దేహము దూరి అన్నము రక్తమై ,

జీవకోటి ప్రాణమును నిలుపగా,

రైతును ప్రాణదాత అంటాను నేను.

దురాశతో దుష్ట బుద్ధులు కొందరు,

ప్రకృతిని బానిసను చేసుకోవాలని,

రైతుని వంచించారంటాను నేను.

ఫలితం రైతు బతుకు దుర్భరమై,

మెతుకు విషమైనదంటాను నేను.

జీవప్రాణం పోతున్నదంటాను నేను.

నాయకుల నీతిలో మార్పు రావాలని,

రైతుల మోముల నవ్వు పూయాలని,

నిండుమనసున కోరుకుంటున్న నేను,

ఆ ఈశ్వరుడిని వేడుకుంటున్న నేను.

 

కె మల్లికార్జునరావుతెలుగు తేనియలు


 

ఏరువాక నాడు  ఎద్దుల పూజించి

కాడిగట్టిదుక్కిదున్ని

సేద్యపు పనులు మొదలిడ

అవనిపూజచేసి

తొలకరిచినుకులు

పుడమిని పలకరించుటకు

అన్నదాత ఆశగా

ఎదురుచూచుచునుండు

అందరికి రైతన్నగానుండి

దేశానికి వెన్నెముకగానిలిచి.

 

డి. వి. హేమలతతెలుగు తేనియలు

 

 

తేటగీతి 

 

అన్న దాతకండగనిల్చు   హలము తోడు 

పంట చేనుని చేవతో  బసవ దున్న

పుడమి తల్లి పులకరించి పురుడు పోసి

వడ్ల గింజలు బిడ్డలై  పసిడి పంట

చేతి కందగా రైతన్న చింత దీరి

సిరులొలుకపల్లె శోభిల్లు శ్రీకరముగ   

 

రమ, కంకిపాడుతెలుగు తేనియలు

 

 

అన్నము పై విసుగు వలదు

అలక చెంది విసర వలదు

అది ఒకరి ప్రాణం ఖరీదు

అన్నదాత అతని బిరుదు

 

విష్ణుప్రియతెలుగు తేనియలు

 

 

చిత్రానికి కవిత

 

ఆరుగాలాల కష్టం అహర్నిశలు

శ్రమజీవనం

బతుకు బాటకై పోరాటం

అందరి ఆకలి తీర్చుటకై ఆరాటం

దేశానికి ఛత్రమై నిలిచే స్ధైర్యం

అకాలమైనా సకాలమైనా

వచ్చే వర్షాధారానికై ఆరాటం

నేలబీటలువారినా ,తిండిలేక

డొక్కలెండుకు పోయినా

చూపులన్నీ గగనాకి చూస్తూ

ఏరువాక సాగించుటకే ఎదురు చూపుల పోరాటం

అందరి ఆకలి తీర్చు ఆపన్న హస్తం

నాలుగు వేళ్ళు లోపలికి పోని

మట్టి పరిమళం

అరక సాయంగా అవనిపై కదులు జీవనం

ఫలసాయమును లేక సాళ్ళలోనే

చట్టవడిన జీవితం

అందరికీ ఆదరువైన అన్నదాతకు జయహో జయహో జయహో

 

గీతాశైలజతెలుగు తేనియలు

 

 

అన్నదాతా సుఖీభవా . . .

 

దేశం పరుగిడుతూంది అభివ్రుద్దివైపు, సాంకేతిక నైపుణ్యం పుణికించుకొని ప్రయానిస్తున్నది గగనము వైపు పరుగు పరుగున.

సాంకేతిక ఎంత పెరిగినా మనిషి ఎంత మారినా దేశానికి వెన్నుముఖ రైతే ఎన్నటికి, తిరుగులేదు అన్నదాతకు.

దేశం, ప్రబుత్వం మరువరాదు ఎన్నటికైనా రైతే రాజు అన్న విషయం, లెకుంటే భవిష్యత్తు లేదు ఏ దేశానికైనా.

రాజులకాలం అంతమొందివుండవచ్చు, కాని ఈనాటికి అంతరించని శ్రమజీవుడు అన్నదాత, అందుకే అన్నారు దేశానికి రైతే రాజు.

వివిద రంగాలలొ మనుషులు కష్టానికి ఫలితం అన్న విధానం ప్రకారమే శ్రమిస్తున్నారు. ఒక్క అన్నదాతే శ్రమకు ఫలితం రాకున్నా సంవత్సరాలుగా భూమినే నమ్ముకొని బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నాడు.

మీరు నమ్మినా నమ్మికపోయినా ప్రక్రుతికి ఎదురొడ్డి దేశంలో అదికంగా శ్రమించేది కేవలం అన్నదాతే.

ప్రశంశలు, బహుమతులు, వేతనసవరణలు అన్న ఆలోచనే లేకుండగా అతని రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి శ్రమనే నమ్ముకొని వస్తున్న లాభ నస్టాలను బేరీజు వేసుకోకుండగా ముందుకు సాగేను ఆ అన్నదాత.

ఈ నాడు బలహీనమైన వ్యవసాయ పరిశ్రమకు మూల కారణం మద్య దళారీ తనం. అన్నదాత కష్టాన్ని దోచుకుంటున్న పెనుభూతం ఈ దళారీ  దోపిడి. ఈ దళారీ వ్యవస్త మారే వరకు లేదు అన్నదాత కు విముక్తి .

అన్నదాతా సుఖీభవా అన్నప్పుడైనా మనిషి ఆలోచించాలి, అన్నదాతకు ఎలా ప్రాణంపోయాలని, ఎలా కాపాడుకోవాలని.అన్నదాతకు డబ్బు సహాయం కాదు ముఖ్యం అతను పాడించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే రైతే రాజు.

అన్నదాతా శుఖీభవా . .  .      

 

మైనేని మురళితెలుగు తేనియలు

 

 

ఆటగాడు ఆడి గెలవాలన్నా

నీటుగాడు నిండుగా ఉండాలన్నా

పసివాడు పాలు తాగాలన్నా

రాజైనా బంటైనా

కోటికి పడగలెత్తిన కోటీశ్వరుడైనా

కూలియైనా

మెతుకు గతకాలంటే,

చివరికి దేవునికి నైవేద్యం పెట్టాలంటే

పంట పండాలి

పంట పండాలంటే

రైతు హలం పట్టాలి

కూడు గూడు గుడ్డల్లో

మొట్ట మొదటి అవసరం తీర్చేరైతు

చిట్టచివరికి నెట్టబడితే...

రుణం తీర్చుకోలేని బక్కజీవిని

రుణ పిశాచి కబళిస్తుంటే...

 

బియ్యం యంత్రాల్లో,

అన్నం డబ్బాల్లో దొరికేస్తుందని

ఆకలి తీర్చేస్తుందని నమ్మేస్తూ

హాయిగా బ్రతికేద్దాం

అవసరమైనప్పుడు

ఒక దండం పెట్టేద్దాం

ఆశాజీవులుగా పుట్టినందుకు

ఆనందపడి పోదాం

 

వాణిశ్రీ నైనాలతెలుగు తేనియలు

 

 

ఆటవెలది

 

ఎడ్లబండ్ల తోడ నెకరాలు దున్నినా

చేతికింత ముద్ద చేర దెటుల

అన్నదాత బాధ లానంద మెవరికి

అతడి కష్ట మిలను అద్భుతమ్ము

 

ఆ వె

 

అన్నదాత యనిన నలుసేల మనకును

ముద్దనోటికిచ్చు ముద్దుగాను

చేతులెత్తి మ్రొక్కు సేద్యంబు నీదిరా

ఋణము నీది దీర్చు రుజువు లేదు

 

కం

 

నిరతము శ్రమనే నమ్ముచు

ధరణిని తా సాగుజేయు ధన్యుడు మనసా!

పురుగుల మందును మ్రింగును

తరగిన తన యాశలన్ని తడబడి పోగా!!

 

కం

 

వరుణుడు కరుణను వీడిన

నిరతము తా శ్రమను జేసి నిర్మల మనసున్!

అరకొర జీవన మైనను

వరమై మన కడుపు నింపు వందన మిదిగో!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయితెలుగు తేనియలు

 

 

ఆశగా రైతన్న ఆకాశం చూసె

పంటలెల్ల పండించి ఆకలి తీర్చాలని

హలము తన బలము గా దుక్కిదున్ని

మేఘనాధుని కరుణ కొరకు మేఘాలొంక చూసి

పుడమిపైన ప్రతి జీవికి పట్టెడన్నం తల్చి

విత్తులెల్ల పుడమిపై విస్తారంగా విసరగా

ఆకాశ గంగమ్మ ఆశిస్సులు కారువాయె

నారుమడి యండగా రైతు డొక్క మండగా

బసవరాజే తన బలమని, నేల తన తల్లియని

అలుపెరుగక ఆశయంతో మరో ప్రయత్నం చేయగా

ఆ సంకల్పానికి విధి సైతం వినమ్రంగా

భువిపైన ప్రకృతి పరవశించి ప్రణమిల్లగా

పండిన ప్రతి పంటను పరులకే ప్రసాదించే

రైత్తన్నా వందనం, అన్నదాత అభివందనం

 

వి. వి.శ్రీనివాస్తెలుగు తేనియలు

 

 

ఏరువాక ఏకరువు పెట్టే

ఏకబికిన పొలం పనులు సాగాలని

ప్రకృతి స్వాగతం పలికే తనవంతుగా

హలం పట్టి వృషభం మూపురం తట్టి

నలుగురికి నాలుగువేళ్ళు

నలు దిక్కులా తానై

పలువురికి క్షుద్భాధ తీర్చే

తన వెతలతో అన్నదాత!

విత్తే విత్తనం కనులలో

కదలాడే ఆనందం

మొలిచే మొక్క ముఖము

విచ్చే సంతోషం

తన స్వేదంతో స్వాగతం

తన ఊపిరితో ఉత్సాహం

కళ్ళ ముందు కదలాడే

ఏపుగా పెరిగిన పంట

కల్లాల లోంచి ఇంటికి వచ్చిన సిరులపంట

ఆనందాల హేల రైతు ఇంట!

 

కోవూరితెలుగు తేనియలు

  

గేయ రచన

అన్నదాత, ఓ అన్నదాత,

గోమతే నీకు తోడు,

నీ కృషి మానవాళి కి పెడుతుంది కూడు,

నిన్ను మించిన పరోపకారి సృష్టిలో లేడు...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రితెలుగు తేనియలు

 

 

జగతి కంతయు తిండిని జాగు లేక

రోజు జనులకు పెట్టును రుజువు గాను

రైతు లేనిరో జునజనం బతుకు లేదు

కూడు పెట్టిన రైతుకు కులము లేదు

 

లలితారెడ్డి, శ్రీకాకుళంతెలుగు తేనియలు

 

 

వరద కష్టాలలో ఉన్న రైతు వేదన

 

మత్తేభము


నిరుడీనాటికి వర్షధారలను కన్నీరొల్కగా యక్కటా 

వరిపైరుల్ కురిపించునే సిరులునీ వాంఛింపగా కష్టముల్ 

వరముల్ నీయుచు మమ్ము కాయుమని ప్రాభాతంబులీయంగనే    

కరుణాసాగరమంజులంబు వరముల్; కారుణ్యమే రక్షయై !!

 

ఉత్పలమాల

 

కాలరధమ్ముపైన తన కష్టము, స్వేదము చిందువేళలో   

నేలను నమ్ముకుంటు తపనీయము జేయుతలంపు తీవ్రమై    

హాలికులెందరో మనకి హాయిగ బువ్వని పంచుచుండగా

పాలనజేయు నాయకుల బాసటలేకయు తల్లడిల్లగా !!!

 

కస్తూరి శివశంకర్తెలుగు తేనియలు

 

 

నేటి చిత్రానికి పద్యం...మరి అన్నదాతను చూస్తే ఉత్సాహ మేగా.....

ముత్యమంటి చినుకు చూచి మురిసి మెరియు హాలికా

సత్యమిదియె రత్నములను సాగు చేయు కర్షకా

భత్యమన్న మాట నీకు పరక సమము కార్షుడా

నిత్య సత్యమేది యన్న నీకు సాటి లేరుగా.....

 

 జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయితెలుగు తేనియలు

 

 

కవిత

 

కలవారికి లేనివారికి

కడుపునింపు ధ్యేయముతో

కాయకష్టముచేసి

కూడుపెట్టుటకు కలవపడు రైతన్న

ప్రకృతి పడగవిప్పి కాటేసినాను

గుండెబలమునే కండబలముగా చేసికొని

కన్నతల్లివంటి భూమిని కాపాడు కొనుచు

నాగాలినే నగగా చేసికొని

బసవన్ననే బాసటగా చేసుకొని

బంగారు పంట పండించి

బతుకుటకు మానవాళికి

మెతుకు పంచిపెట్టు.

"జై కిసాన్ "

 

డి. వి. హేమలతతెలుగు తేనియలు

 

 

తేటగీతి మాలిక

 

పరుల యాకలి తీర్చగా పాటు పడుచు

శ్రమయె తత్వంబుకాగ నాశయమె శ్వాస

కాగ, పుడమిని నమ్ముచు కష్ట పడుట

యిష్టమేనని పంటలే యింట నిండ

సంతసమ్మున జరిపేవు సంబరాలు

 

ప్రకృతి కోపగించుచు చేయు వికృత గతుల

విలయ తాండవానికి బలై వెతలు మూగ

మూగ బోయిన బ్రతుకును మోయ లేక

యుసురు తీసుకొనగనేల ? ముసురు ముంపు

తొలగి పోవ పుడమితల్లి తుష్టి చెంది

పలకరించును పులకలే పలుకులవగ

యన్న దాతవు కాదు మా యార్తి తీర్చు

 

అవళూరు సీతతెలుగు తేనియలు

 

 

ఒక మూడేళ్ళ బుడతడు, ఒంటిమీద నూలుపోగైనా లేదు.. అరకను పట్టుకుని, మాగాణి చేలో, నాన్నకి సాయపడాలనే ఒకే ఒక్క కోరికతో, క్రిందా మీదా పడుతూ.... 


 

ఇదీ నేపథ్యం.. దానికి నేను రాసిన పద్యాలు పంచుకుంటున్నాను..

 

సెహబాష్ రైతు బిడ్డా! వందనం!!

బాల హాలికుడా ! భళా !

  

వేలెడంత లేవు, కానీ  హిమగిరంత ఎత్తైనది నీ  పట్టుదల, మీ నాన్న వృత్తి పట్ల కడలి అంత లోతైన అంకిత భావం !

 

త్యాగం, ఉదాత్తతా నీ రైతు నెత్తురుకే చెల్లింది.

 

మనసు కదిలించి,కంట నీరు తెప్పించావురా ! మా భావి అన్నదాతా !! నువ్వు పెరిగి పెద్దయి, చల్లగా వర్ధిల్లాలి !!!

మా పిల్లలకోసం, మా స్వార్ధం  కోసమేలే !!

చిన్న వాడివైనా, నీకిదే నా కైమోడ్పు !!!

 

రేపటి మా అన్నదాతా !     సెల్యూట్

 

విలువ లే   కొరవడిన మన  సమాజంలో,  వలువ లే కరువైన ఓ కృషీ వలుని  వలపుల

పంట, వట్టిపోయిన ఆ కర్షకుని  "వ్యవసాయ సామ్రాజ్యపు  వారసుడు"...ఒక బుడతడి కథ..

 

వలస పోలేక, కాడునే నమ్ముకుని, ఆడనే  వలవ లా  విల పించే, తండ్రి అయిన ఓ అన్నదాత వ్యధ..

 

నా మనో "వేదనా"   ని"వేదన"

 

సీస మాలిక

 

అరక పట్టుకొనుచు "నరడుగు బుడతడు" దోగాడు వయసునే దుక్కి దున్నె;

పైపైన చూడగా, ఫక్కున నవ్వించెతరచి చూడగనేమొ కరగె మనసు !

ఒడలు కప్పుకొనగ నొక్క చొక్కా లేదు యొడలువిరిచి పాటు పడెడి "పసికి" !

పదుగురి పొట్టకి బట్టెడన్నము వెట్టు "పరమ పావన కృషీవలుని" బిడ్డ 

చనిపోవుచును తాను, జాతినే బ్రతికించు "కర్షకాప్తజనుల" కలల పంట !

కడగండ్ల, వెతల కర్షక లోకంపు భగ్న హృదిని  జూపు ""నగ్న "" నిజము !!

చిరుతడరక బూని చేతను గట్టిగా పడుచును,దేకుచు, బ్రాకుచుండె;

నురకలు వేసేటి యూపుతో, నాన్నకి ఉడుత సాయము సేయఁ  "బుడుత " తొడగె !

హిమగిరినే మించె హెచ్చుగా నీ "పట్టు""అర్ణవాగాధమ్మె" యంకిత మతి !

తాత యప్పుల బాధ తాళజాలక నాయె ఆత్మహత్య వశము; ఆయె శవము;

అక్క పెళ్ళియు కాదు;అమ్మ వేదన పోదుఅన్న చదువు కూడ నటక యెక్కె;

నానమ్మ సుస్తీకి నయపైస కరవాయె నాన్న యొరుల "మేపి", నలిగి పోయె !

ఆరుగాలము నెత్తురావిరౌ రైతుకు నొరిగెనేమి తుదకు నోట మన్నె !

చితికిన బతుకుల చింతల కడలిని పసిగట్ట లేనిదా "పసరు వయసు";

కష్టించు నినుజూడఁ కంట పొంగెను గంగ మల్లె బోలిన నాదు మనసు  చెదరె !

వ్యవసాయ రంగపు వ్యయప్రయాసల నఱయు మేధావులూ ! అగ్రి శాస్త్ర

వేత్తలూ ! అధికార్లు ! వేగిరముగ బాగ రైతుకు లాభించు ""రక్షక కవ

చము"" వంటి ""నవ వ్యవసాయ విధివిధానములను"" నేతల మూలముగనె ""శాస

నములు"" సేసి, కృషకునకు శాంతి, సౌఖ్యముల్ కలుగఁ జేసి తరింపఁ కదలి రండు !!

మన బిడ్డలను సాకి, మంచిగా పోషించు వారసుండా కృషీవలునకతడె.

ఏసీ గదుల పండు ఏలికా ! పాలకా ! బాపుమా "వ్యవసాయి" వ్యధలు, వెతలు;

""వామనుండె'"దిగి  తా వ్యాఘ్ర మవక మున్నె మేలుకో ! కాపాడు హాలికులను !!

మది తలుపు తెరచి, మనుమొక  మనిషిగా "ఆత్మసాక్షికొసఁగి యాస్తికతను !

మనకు మెతుకునిచ్చు మన అన్నదాత మెలగనిండుసురుతోవెలుగనిండు !!

 

తేటగీతి

లోకములను పోషించు నా లోకవిభుఁకు

సాటి మన కృషకుడు; చాల మేటి వాడు;

పేర్మి,, పట్టుబట్టను చుట్టి,పెద్ద పీట

వేసి, రైతు నాదరణమ్ము చేసినపుడె

యుండు పుట్టగతులు; మన కొదవు శుభము !

 

ఓ పాలకులారా ! నేతలరా !

ఓ నిమిషమన్నా ఆలోచించండి...మన "అన్నదాతని ఇప్పటికైనా, మన నిజ వారసుల భుక్తి కైనా..   బ్రతికించుకోగలమా అని !

 

వట్టెం వెంకట రమణతెలుగు తేనియలు

ఎమ్మెస్సీ అగ్రికల్చర్

 

 

సమస్య: గర్భము లోనున్న బిడ్డ గ్రక్కున తుమ్మె

 

ఇచ్చిన పాదము కందము

నా పూరణము సీసములో

 

సుభద్ర కు పద్మ వ్యూహపు మెళుకువలు అర్జునుడు తెలుపు చుండగా ఆమె మెల్లగా నిదుర లోకి జారు కుంటుంది  అది గమనించక అర్జునుడు లోపలికి‌ ఎలా ప్రవేశించాలి ఎలా ఎదుర్కొనాలి అని చెబుతూ ఉంటాడు ఆవిడ నిదుర పోయినా లోపల ఉన్నగర్భస్త శిశువు ఉత్సాహంతో ఊ కొడుతూ వింటాడు బయటకు వచ్చు విధానము తెలియ పరచ బోవు సమయములో చక్రధారి సుభద్ర కు నిదురలో ఒక‌ తుమ్మును సృష్టించు తాడు దానితో అది అప శకునముగా   భావించి అర్జునుడు బయటకు వచ్చే మార్గము చెప్ప లేక తప్పిదము చేస్తాడు అన్న భావన.

 

పద్మము రేకుల వలె నుండు వ్యూహముమొదటి రేకు నడుమ ముఖ్యు డొకడు

కాచుచు నుండును గజ తురం గంబుల పైన యోధ శతము  భయము లేక

కాచుచుండును గాదె, ఘనమైన వామ దిశ  గజమున్ ముందు గా చంప వలయు,

మార్గము కనబడ, భార్గవుని పగిది దక్షిణ గజరాజు తలను నఱుక

దక్షిణ దిక్కున దారి కన్పించుగా ననుచు సుభద్ర కు నర్జునుండు

ఘన పద్మ వ్యూహపు గాధ తెలుపుచుండ యుజ్జు జవాబిడె నూహు యని ప

లుకుచు నా గర్భము లోనున్న  బిడ్డ,గ్రక్కున తుమ్మెనప్పడు కోమ లాంగి

 

నిదుర లోన, శుభము కాదని తలపోయు

చున్ కిరీటి వికల మనస్కుండు నగుచు

పత్ని గర్భస్త శిశువుకు భండనంపు

తంత్రమును తెలుపక చేసె తప్పిదమును

 

ఉజ్జు   = ఉత్సాహము

 

అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. 

 

 పూసపాటి

 

 

చిట్టి చిలకమ్మ

పచ్చని రంగుతో మెచ్చినదై

ఎర్రని ముక్కుతో మక్కువగొలుపుతూ

పిసిపాప పలుకులకు సామెతగా నిలచి

చిన్నపిల్లల పాటలకు చిట్టెమ్మవై ఉండి

పంచ వన్నెలతో పరవశిస్తూ ఉండి

గోరువంక సరసన గౌరవంగా నిలచి

జామకాయలనిన జాగుచేయకతినుచు

బతుకుతెరువు కొరకు బంధించిన వానికై

పరుల భవిష్య చీటీ నెత్తి భవిష్యత్తును పరికింప చేతువు

తాంబూల మడతలకు తరుణి అందాలకు

తగురీతిగా నీ పేరు తలపోయుచుందురు

రామచిలుక యను నామధేయముతో రమ్యముగా నీవు

పిలువబడుచుందువు.

 

డి. వి. హేమలతతెలుగు తేనియలు

 

 

సమాప్తం  
 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...