20, అక్టోబర్ 2020, మంగళవారం

చిత్రం పై పద్యం 15.10.2020


 

15, అక్టోబర్ 2020, గురువారము

తెలుగు తేనియలు

శీర్షిక :  చిత్రం పై పద్యం

స్వేచ్ఛా చందము / వచన కవిత, పద్యములు  

*************************

 

మత్తేభము 1️

 

జలమే జీవనమందు రక్ష జలమే సమ్మోదముల్నీయగా

విలయంబాయెను ఖేదనమ్ముల వెతల్ విక్షోభమాయేనులే

కలతల్ తీర్చి విలాస జీవనమునీ కల్లోలమేలా ? జ్వలత్

జ్వలనంబందున జీవకోటికి నిధుల్ శస్తంబులై ప్రాపుమా

 

ఆటవెలది

 

జీవకోటినరయు శ్రీకరంబుగ "నీరు"   

జలము రక్షనిచ్చు కలతదీర్చు 

జలము వాడవలయు జాగరూకత గల్గి    

జగతి పరిఢవిల్లు జలము తోటి !

 

శివ శంకర్ కస్తూరి - తెలుగు తేనియలు

 

 

ఆకటా !

 

బాధ్యతలను మరచుటకో విస్మరించుటకో కొందరు

మత్తు పానీయయములు గుట, గుట తాగుచూ ,పకోడీలు పట పట కొరుకు దురు.

అకటా ! తాగుటకు మంచి నీళ్ళ సీసాలో ఒక చుక్క ,

తినుటకు ఒక మెతుకు కూడా దొరకని సుష్కుమారులెందరో గదా !

 

జి . మురళీ మోహన్ రావు - తెలుగు తేనియలు

 

 

దప్పికవ్వగా దర్పమున్ తాగు చుండె

శుద్ధ జలము నొక్కడు కడు సోకు గాను

రాని నీటి కుళాయిలో రాలు నీటి

కళ్ళ తోడ వేచె నెముకల్ కవచ మౌగ

నీరసించె నింకొక్కడు నింగి నేల

కల్వవెన్నడు. యారీతి కలిమి లేమి

నడుమ బేధము తొలగదు నరుల మనసు

మారనంతవరకు. దైవ మౌదు వీవు

సాటి వారికి కాసింత సాయపడగ

 

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు


 

 

1.

 

నీటికి వెల కట్టే వాడి బ్రతుకు విలాసం

మాటికి కన్నీరు తాగే వాడి బతుకు విషాదం

చిత్రకారుని కుంచె కన్నీరు కార్చింది

కన్నీటి కుళాయి మన గుండెను తడిపింది

 

2.

పేచీలెరుగని ప్రాయంలో పేదరికం వరమైతే

గుక్కెడు నీరడుగుట గారాబు తనమేలే

నవ్వెరుగని బేల కళ్ళు కనే కలలన్నీ కల్లలే

మారాము తెలియని జాలి ఒళ్ళు

తెలిపే కతలన్నీ వెతలే...

 

విష్ణుప్రియ - తెలుగు తేనియలు

 

 

వచన కవిత,

 

గొంతెండి పోతున్నా  కుళాయిలో చుక్క నీరు       

రాక కన్నీరు కార్చుతున్న పసివాడు ఒక ప్రక్క,

విలాసంగా సీసా పైకెత్తి, పరిశుభ్ర మైన నీరు,

గడగడా గ్రోలుతున్నవారు ఇంకొక ప్రక్క....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి - తెలుగు తేనియలు

 

 

వచన కవిత

 

ఇది ఏమి నీ లీల కరుణాంతరంగా?,

దాహము బాధ అందరికీ

ఒకటే కానీ,

కొందరికి మేలైన నీరు అందించావు,

కొందరికి యే నీరూ

లేకుండ చేశావు,

ఆకలి క్లేశము అందరిదీ

ఒకటే ఐనా,

ఒకరికి పరమాన్నాలు ప్రసాదించావు,

ఒకరిని పస్తులతో పడుకోమన్నావు,

 

 CA కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు

 

త్రాగునీటికొరకు తపనపడువాడొక

త్రాగుతూ  నీటితో  తరియించు వాడొకడు

దప్పిక విలువ దరిచేరితేనే

దాహార్తి బాధను దలుపగలడు

 గుక్కెడునీటితో దాహార్తి

గొంతుతడిపినవాడు

నిజమైన మానవతను కలిగినోడు.

జీవరాశికి జలమే జీవాధారం.

 

హేమలత - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

జలము లేక బ్రతక లేక జచ్చె నొకడు

జలము కొనుచు త్రాగి బ్రతికె బలమునొకడు

జలము లేక బ్రతుకలేరు జనము నిజము

జలము నిల్వజేయవలెను జగము కొరకు

జలము జీవనాధారము జగతిలోన

జలము విలువ తెలియజేయి జలజ నయన

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి - తెలుగు తేనియలు

 

 

కందము

త్రాగుట కొకరికి లేకనె

భోగము లకు నీరు దొరుకు భువిలో మనసా!

గడ్డు స్థితిని మన మిక

వేగిరమే ద్రోలవలెను విశ్వము నందున్!!

 

ఉత్పలమాల

కూటికి కష్టమున్ సలుప కొందరి కెంతయొ వేదనౌనులే

నీటిని పొందడం తుదకు దేశము నందున దుర్భరమ్ములే

పూటయు పొట్ట నింపుటకు పుణ్యము చాలదు నేమికాలమో

కోటిని బొందువారలకు క్రొత్తవి బాధలె యర్థమవ్వవే

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు

 

 

నీ స్పర్శతో ఒడలు పులకరించి

ప్రాణము లేచివచ్చునే

నీ పానము లేనిచో

జీవకోటి మనుగడ శూన్యమగునే

జీవము నిలిపే నీటిచుక్క ఎముకలు కోరికే రక్కసి అయితే

మరుగుజ్జును చేసే హాలాహల మైతే

గరళకంటుని వలె గుటకేయక నిలిపేదెట్లు!

 

అతి పవిత్రమని ఆయువు నీవని

అందరిదానివని నమ్మితిమే  గంగమ్మా!

కలిగిన వాడి కంఠము తడుపుతావు

కొనలేని నేను కానివాడైతినా

ఆకశాన్నుండి కిందికి వస్తివే

నేడు నీ శుద్ధత ఖరీదు

అక్కడకే పంపితివా గంగమ్మ!

 

అరుదైన నీటిబుగ్గలు, హిమనదములు,

గగనాల్లో సేకరిస్తిమంటూ

వేలు వెలకడితిరే నీకు

నాడు అమాయక భగీరథుడు

ఈ కిటుకు నెరిగిన  నింగినించి తెచ్చి

నిన్నందరికీ పంచుదుడా!

జడదారి జూటము నుండి

చినుకైనా జారనిద్దుడా!!!!

 

వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు

 

 

సీసము

అమృతధార యిదియై నబ్బురము కలిగిం  చెడి జలమత్యంత శ్రేష్ఠము గద

జగతిన జలమొక సంజీవియై భువి జనుల దప్పిక దీర్చి సారమిచ్చు

గుక్కెడు నీరమే గొల్లుమనెడి పేద జీవి కడుపు నింపి జింత దీర్చు

కలుషిత మెరుగని జలముకై మర్త్యులు కృషి జేయవలెనోయి ఋషుల వోలె

 

తేటగీతి

ప్రకృతి కల్పించిన వనరు ప్రాణమిచ్చు

తీర్థమును భావి తరముకై దివ్యముగను

యిచ్చు స్పృహ తోడ నరజాతి యిచ్చగింప

జలము యందునే జనులకు సమధికముగ

 

తేటగీతి

శుద్ధి చేయబడిన జల శోభ తోడ

సంతసించు ధనిక జాతి జన్మ యేమి?

పేద జీవుల దాహార్తి వేద నేమి?

ప్రభుత వికృత చేష్టలివియే పరికరింప.

 

తేటగీతి

కఠిన శాసనముల తోడ ఘనత గాను

నీరు నిలువ జేసి ప్రభుత నేర్పు తోడ

జనుల కందించు పథకముల్ సాతమిచ్చు

బీద జీవుల కద్భుత పృష్టి వోలె.

 

వెంకట్. సిహెచ్ - తెలుగు తేనియలు

 

 

కలిమి లేముల తారతమ్యములు

సుస్పష్టమై దర్శనమిచ్చె పుడమిలో

శుద్దీకరణ మరలలో శుద్ధి గావింపబడి

శీతలీకరణ మరలో శీతల స్థితిగా మారి

కలిమి గలవాని దాహార్తి తీర్చుటకై

ఆకర్షణీయముగా అందుబాటులో లభించే

కలిమి సూచికగా దాహార్తిని తీర్చు జలాదార

"లేమి గల వానికి త్రాగునీరు దొరకక

నీటి చుక్కయినా రాని జల కొళాయి లోగిట్లో

జిహ్వ తడుపుటకై సాధారణ జలము కొరకు

వేచిన కమల కన్నుల నుండి జలాధార రాలె

అశ్రుధారలే ఆర్తిగా దాహార్తిని తీర్చె కలి లోగిలిలో

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట - తెలుగు తేనియలు

 


 

తేటగీతి

 

మ్రింగ  మెతుకులేక యెముకల్  తొంగి చూసె

త్రాగ నీటి బొట్టొకటి రాదాయె కాని

కనులు చిందించు నీటికి కరవు రాదు

తనువు యారని కన్నుల దప్పి పొరలు

చూపుతో బక్క బుడతడు చూసె నొకని

సొమ్ము లిచ్చి కొన్న జలము సోకు గానె

త్రాగ బిత్తరి  చూపుల తత్తర పడి

యుత్తరము లేని ప్రశ్నల  యోప లేక

 

అవళూరు సీత - తెలుగు తేనియలు

 

 

నీటిబొట్టుకై ఎదురుచూచు జీవి

కళ్ళల్లో చూస్తున్నా చావని ఆశని...

డొక్కలు కన్పించే జీవికి తెలుసా

తన కళ్ళల్లో నీరే ఇంకిపోయిందని...

నీళ్ల సీసాలు కొని తాగే వాడికి

తెలుస్తుందా నీటి విలువ అని...

నాకెప్పుడూ అర్థం కాదు పంచ భూతాలు అందరివే అయినా          తేడాలెందుకో అని.....

 

ఉష - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

చుక్కనీరొక్కమెతుకుకై చూచు బడుగు 

వర్గమొకదెస, భోగులు వ్యర్థ పరచె

డన్నసంపద లొకదెస! హతవిధి యట!

సామ్యమన్నది కరువాయె సమత పోయె

సంఘజీవి కర్థమె నేడు భంగమాయె

 

డా. నాగులపల్లి - తెలుగు తేనియలు

 

 


 

శార్దూలము 1️

 

పానీయంబది మానితంబు జగతిన్ సంప్రార్థితంబౌ సిరుల్    

జ్ఞానంబుల్ కడచెన్ వివేకరహితంబై స్వార్థముల్ హెచ్చగా   

నానాజా తిసమీకృతంబుమయి ఆనందమ్ము కాంక్షింపగన్ 

దీనుల్ ధిక్కరణంబు జేసి వెతలన్ దీర్చేటి వారెవ్వరో ??

 

మత్తేభము 2️

 

జలమే జీవనమందు రక్ష జలమే సమ్మోదముల్నీయగా

విలయంబాయెను ఖేదనమ్ముల వెతల్ విక్షోభమాయేనులే

కలతల్ తీర్చి విలాస  జీవనము నీ కల్లోలమేలాజ్వలత్

జ్వలనంబందున జీవకోటికి   నిధుల్ శస్తంబులై ప్రాపుమా 🙏

 

ఆటవెలది 3

 

జీవకోటినరయు శ్రీకరంబుగ నీరు   

జలము రక్ష నిచ్చు కలత దీర్చు 

జలము వాడవలయు జాగరూకత గల్గి    

జగతి పరిఢవిల్లు జలము తోటి

 

కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు


 

 

పేద బాలుడి చూపులో కనిపించే భావం

. వె.ఉదర మంత త్రాగ నుదకమ్ము దొ రుకదు

స్వచ్ఛ జలము కొనగ శక్తి లేదు

నీరు,తిండి లేని నికృష్ట జన్మంబు

ఎందు కి చ్చె మాకు నీ శ్వరుండు

 

డి.రామ నాగేశ్వరరావు - తెలుగు తేనియలు

 


 

ఆటవెలది

 

పేద గొప్ప లేక పెన్నిధిగ లోకాన

దప్పి దీర్చు తాను దండి గాను

మంచి చెడుల లోన మహిమగా జనులకు

సహకరించు నీరుచక్కగాను

 

గీతాశైలజ - తెలుగు తేనియలు

 

 

కందము

ఎనలేని కరుణ తోడను

మనుజాతుల కొసగెను గద మనుగడ నిల్పన్

యనవద్య జల వనరులే

యనుకూలమ్ముగను దైవ మద్భుత రీతిన్!

 


 

 కందము

మచ్చిక గొని భోగమ్ముల

యుచ్చయముగ వాడు మనుజు డొకరుని కనగా;

నిచ్చలు దాహార్తిని తా

చిచ్చర కంటి యొకడుండ చిత్రము గాదే!

 

కందము

అచ్చెరువు గల్గును గనగా

చెచ్చెరముగ నాశమొంద జేయగ నరుడే

విచ్చలవిడి వాడకమున

పొచ్చెముగను నీటి కరువు బొడగట్టె నిటన్!

 

తేటగీతి

జీవజలమవని దరిగి పోవకుండ

మెలకువను గల్గి జనులెల్ల మెలగుచుండి

బద్ధులై పొదుపును సేయ; భావితరము

మేలుగూర్చు జలము బొందు వీలుగాను!

 

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 


కందము

ఎరుకను గల యుత్తములే

పరితాపమ్మొంది తాము పరిపరి దెల్పెన్;

నిరతిగ జలరక్షణయే

కరువును దూరమ్ము సేయ కారియ తొలగున్!

 

కందము

దైవ మొసంగిన జలమును

పావనముగను దలపోసి వావిరి ముదమున్

యావచ్ఛక్తిని జనులే

జీవజలమ్మందరకును జేర తలచరే!

 

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 

అన్నమో రామచంద్రా యని  అలమటిం  

చు, నొకడు చోద్యము  చూడ నచట

 

అన్నియు కల్గిన యాశకు అంతము లేదుగా?

త్రాగును స్వఛ్చత ధార ధరకు-

 

వున్నది యంతయు ఊరికే  పడియుండ,

ఆర్తుల కివ్వగా నార్పు  మంట

 

సన్నని ఎముకల సంతతి ధైన్యపు

బతుకుల చరితలు భారమవగ

 

.వె. కన్నులున్న గాని కానగ లేమని

జనులు బ్రతుకు చుండె జాలి లేక

తాను తినుట కాని దాన మివ్వగ లేరు

మానవత్వమనగ మనుజ హితము

 

శిరీష - తెలుగు తేనియలు

 


జీవంలేని కళ్ళతో

ధైన్యముచూపులతో నిలిచెనొక్క బాలుడు

 వచ్చి పోవు వారిని చూస్తూ

 శ్లధ  శైశిర తనువుతోడ-

 

ఆకలి మంటలు ఆర్పగ  గుక్కెడు నీరే కరువై

గుటకలు మింగుతూ  తీరని దాహం కోరిక-

బక్కచిక్కిన బడుగు బతుకది చక్కజేయుట నెవరి తరమో

 

స్వచ్ఛపు జల ధారలకాశ  లేదు.      

ఉన్నదల్లా కడుపుమంటే.

కోరి తినగా కూడు దొరకక జీవచ్ఛవమై బతుకునీడ్చగ

దోషం ఎవ్వరిది?


 

ఆరని మంట లొకరివితీరని దాహ మొక్కడిది -

ఎంచి చూడగా --

అన్నం తింటే అరగని వారు

తిందామంటే దొరకనివారు.

పారేయక పోతే ఇవ్వరాదా?

వీరికైనా.

 

కోటాను కోట్ల జనాభా లో

కూటి కోసం వెంపర్లాటలు.

 

ఎముక గూటి లోని గుండె మండి తిరగ బడితే !

మారడా? మరి విద్రోహ శక్తిగా !

నిక్క బొడిచిన గాజు కళ్ళకు

కలలుండవా?

గుప్పెడు అన్నం తిని, గుక్కెడు నీరైనా త్రాగి బతకాలని?

అంతు లేని దారిద్య్రానికి

సమాధి కట్టే జవాబు ఏది?

అతని బ్రతుకొక ప్రశ్నే  అయితే సమాధానం వెతకండి.

 

 

******


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...