8, అక్టోబర్ 2020, గురువారం

దత్తపది - 44, విద్య - సంపద - నేర్పు - కూర్పు

 


 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము  

 దత్తపది -  44

మీరు స్వేచ్ఛా చందము / వచన కవిత, పద్యములు

 విద్య  - సంపద - నేర్పు -  కూర్పు

ఈ నాలుగు పదాలతో ఉపాధ్యాయుల విశిష్టతని తెలుపుతూ మీ పద్య / వచన కవితలని అందించగలరు

 ********************************************

 

తేటగీతి

 ఆదిదేవుడా! జడధారి! యర్ఘ్యములివి

అర్చన సలిపి పూజింతు మద్భుతముగ!

దేవదేవుడా!నటరాజ! దీప్తి నిచ్చి

మమ్ము కాపాడవయ్య సూక్ష్మాత్మ!హరుడ!

 

శ్రీమాత్రేనమః

 

మిక్కిలి శ్రేషమైన (సారతరార్ధ) విద్యలెన్నియో ఛాత్రులకు నేర్పతో, ఓర్పుతో నేర్పుతున్న ఉపాధ్యాయులకు వందనములు

    

నేడు ఎన్నోచోట్ల, కుగ్రామాల్లో తమకు వీలైన మేరకు, ఆర్ధిక ఇబ్బందులున్నా online education (నవకైవడి) మనకి చూపిస్తున్నారు కదా.. అటువంటి ప్రాజ్ఞులకు నమస్కరిస్తూ

 

ఉత్పలమాల

సారతరార్ధ సంపదలు ఛాత్రులకున్ నొసఁగంగ నేర్పుతో !

శారదచంద్రికాస్ఫురిత సన్నుతికోరుచు జ్ఞానధామమున్ 

గారపు మేటివిద్య నవకైవడి లెన్నియొ కూర్పుజేయగా          

భారతి ముద్దుబిడ్డలకు, ప్రాజ్ఞులకున్ వరమీయు వేల్పులై 


కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు

 

మనిషిలోని మనీషిని వికసింపజేయునది విద్య

పరిమితులను చెరిపివేసె అపరిమితసంపద విద్య

నేర్పున నేర్చుకునగ ప్రకాశింపజేయునది విద్య

జీవితానికి సకలకళల కూర్పు మార్పు తీర్పు విద్య!

ఇట్టి మహోత్కృష్టమైన విద్యానహాయజ్ఞం నిర్విరామంగా  చేస్తూ,

ఫలాలను భావితరాలకు దక్షతతో  చేరవేస్తున్న ఆధునికఋషులు.

ఉపాధ్యాయులందరికీ వందలాదివందనాలు!..

 

రాంమోహన్ నిజామాబాద్ తెలుగు తేనియలు


 

ఆటవెలది

విద్య విలువ గనక విజ్ఞుడు కాలేడు

సంపదదియె యనిన సంతసించు

నేర్పు తోడ పొంద నెంతయో నుందిర

కూర్పు నీకుదెలుపు గురువులెపుడు

 కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

విద్య నేర్పును విజ్ఞత వినయ ములును,

విద్య కూర్పును సంపద విజయ లక్ష్మి,

విద్య చూపు బ్రతుకునందు వెలుగు దారి,

విద్య పెంచు ప్ర జ్ఞ మనిషి విలువ తెలుపు,

విద్య గొని పోవు మనుజుల  విఠలు శరణు,

విద్య యనగతె లియబోకు విపణి సరుకు,

విద్య లేనిమ నుజులెల్ల   వింత పశులు,

విద్య నొసగుగు రువునాకు వేల్పు యటుల.

కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

విద్యాసంపత్తు

విపణియందు దొరుకు విలాసవస్తువుకాదు

విత్తముతో కొనిన విరియదు విజ్ఞానము

వినయవిధేయతలతో వివేకముగనేర్వు

వికాసముతోకలుగు గురుకడ గురిగా నేర్చిన

గురుతుగానుండు జీవితపర్యంతము.

డి. వి. హేమలత తెలుగు తేనియలు

 

 

 

విద్య  -  సంపద - నేర్పు - కూర్పు

విద్యనే  సంపద విరజిమ్ము

జ్ఞానసుమ పరిమళాలు

విద్యాధనము నొరులు దోచలేనిది

భాతృజనం పంచుకోలేనిది

నేర్పుగా నేర్వ నెగ్గుదురన్ని

కళలందు జీవనసరళికి జీవం కూర్పును.

డి. వి. హేమలత తెలుగు తేనియలు

 

 

ఆత్మీయులు, ఆదర్శవంతులు, విద్యావినయ సంపన్నులు మా గురువులు.

మా అందరికీ పాఠాలతో పాటు   ఉత్సాహం, విజ్ఞానం మిళితం చేస్తూ చదివించి మమ్ములను తీర్చిదిద్ది

ఆశీర్వదిస్తూ   ప్రపంచం చాలా చిన్నదిరా అంటూ 

భుజం తట్టారు అంతే ।

మా  నేర్పు, ఓర్పులతో సిరిసంపదలే గాక కీర్తి, ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలనూ

సాధించ గలుగుట మా గురువుల దీవెనలు , ప్రేమలే !

 మురళి మోహన్ తెలుగు తేనియలు

 


 

సంపద లెన్నున్న గాని,

విద్య లెన్ని నేర్చిన గాని,

నేర్పు లేని యెడల, సఫలత,

చేకూర్పు పొసగదు జీవితాన...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

మీకు మేధోమధనమేల ? మాకు కవన 

ములని పంచవలెను నేడు మోహనముగ    

వీక హాసించు పదముల వెల్లువలను  

నేడు మీ కరాంచలమందు నింపవోలె  

స్వాదు సంగీతగీతుల పరవశమున   

జిలుగు భావాలవన్నెలు చిలుక వోలె

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

అర్థించు వారికి విద్య నొసంగు వారు ఉపాధ్యాయులు.

విద్యార్ధుల సుగుణా లను కూర్పుగా చేసి

పౌరుడిగా దిద్దు వారు ఉపాధ్యాయులు.

ఎన్నటికీ తరగని సంపదనిచ్చు వారు ఉపాధ్యాయులు.

విద్యార్థుల దుర్గుణాలను నేర్పుగా తరుము వారు ఉపాధ్యాయులు.

ఉషారాణి తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

నేర్పు తోను చదివి నిలుపు విఙ్ఞానము

కూర్మి నంత పంచు కూర్పు తోను

సంపదెంత యున్న సరిపోదు యిలనందు

విద్యయొకటి పొంది విధిని మార్చు

సి.హెచ్. రజిత, కరీంనగర్ తెలుగు తేనియలు

 

 

తేటగీతి

గురువుదీవనల్ తోడైన కరుణతోడు     

వినయసంపదల్ కూర్పుతో గుణములన్ని   

సంస్కరించు గురువు సద్గురుండు నిజము

సంపదలని మనకుపంచు సజ్జనుండు 

నేర్పుతో దీక్షగా విద్య నేర్చుకొనిన 

 వై శ్రీదేవి తెలుగు తేనియలు

 

 

 

"ఆచార్య దేవో భవ "

అజ్ఞానాన్ని తొలగించి

జ్ఞానదీపాన్ని వెలిగించి

ఉన్నతెలివిని పెంచి

ఉన్నతమును పంచేవాడు "గురువు "


మట్టి ముద్దలాంటి బుద్దిని

విద్యనే ఆయుధం తో

వివిధ తీరులుగా దిద్దు

విధాత "గురువు "

 

సామ, భేదములతో

సత్ప్రవర్తనయే సద్గుణమను

సంస్కారమును నేర్పు

సన్నిహితుడు "గురువు "

 

విద్యార్థుల మనసెరిగి

విద్యాసంపదనందించు

విశాలహృదయుడు "గురువు "

 

కులమత భేదములను మరచి కన్నబిడ్డలకన్నా మిన్నగా

విద్యార్థులను జూచుచు సన్మార్గమునుతెలుపు మార్గదర్శి "గురువు "

డాక్టరైన, కలెక్టరైనా, లాయరైనా సాంకేతికనిపుణుడైన

తొలిమెట్టుగా గురువునాశ్రయించి 

ఉన్నతశిఖరాలనధిరోహించవలసినదే

విద్యార్థులజీవిత భవిష్యత్ కూర్పు  "గురువు "

అందుకే గురుస్థానం మహోన్నత మైనది.

డి. వి. హేమలత తెలుగు తేనియలు

 

 

గురువు నేర్పంగ నేర్చితి విద్య లెల్ల సాధన చేసితి ముదమారంగ

అభ్యాసమనే కూసు విద్య తెలియంగా కూర్పు గా పంచితి జ్ఞానమనే సంపద

నేర్పుగా నేర్చిన ఘనులు జ్ఞానులు  కాగా నేర్వని ఘనులు అజ్ఞానులుగా మిగిలిపోయే

డి. నాగమణి తెలుగు తేనియలు


 

పంచు విద్య ను తాను బ్రహ్మగా

పెంచు జ్ఞాన సంపద తాను విష్ణువుగా

మంచిబుద్ధిని నేర్పు మరి శివుడేగా

అక్షరాల కూర్పు నేర్పు మరో  అమ్మగా !!

క్షయము కానీ జ్ఞానఫలము నిచ్చు

ప్రజ్ఞ పెరిగిన నిన్ను చూసి మెచ్చు

వంశమీయని యశము నీకు పెంచు

తాతలీయని ఆస్తి తాను పంచు

స్వార్థమెరుగని మంచి స్వామి తాను

ఫలితమడగని దొడ్డ రేడు తాను  !!!

విష్ణుప్రియ తెలుగు తేనియలు

 

 

ఉపాధ్యాయుడు

విద్య లేనివాడు వింతపశువనుచును

సంపద యన్న విద్యాజ్ఞానమనుచును

నేర్పుగ పిల్లల తానడపించుచును

కూర్పుగ సుగుణసంపదల పెంపొందించుచును

ఓర్పుగ తాపిల్లల తీర్చిదిద్దుటకును

అహర్నిశలు శ్రమించుచు

 

 కన్న తల్లిదండ్రుల వోలె బాధ్యత వహించుచు

తనను తాను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటు

విద్యార్థులను విద్యా, జ్ఞాన, సుగుణ సంపన్నులుగా తీర్చిదిద్దేదివాడే

నిజమైన ఉపాధ్యాయుడు,  అతడే నిజమైన దేశభక్తుడు

వారణాశి శ్రీలేఖ తెలుగు తేనియలు

 

 

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తో

తే. గీ." విద్య" యను దివ్య " సంపద" విరివి గాను

 జాతికే పంచు " నేర్పుతో సద్గు రుండు

భావి తరములకు జ్జ్వల భవిత " కూర్ప "

సతతముం గృషి చేయును సద్గురుండు.

డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 

 

తేటగీతి

విద్య లెన్నియొ గఱపుచు వినయ మనెడి/

సంపద ను కూడబెట్టగ సంతసించు/

నేర్పు తో వృద్ధినొందించు నేర్పరతడు/

కూర్పు జేయును విద్యార్థి కోర్కెలమర/

అవని నొజ్జకు దీటైన యాత్ర గలదె/

వార్కి శ్రద్ధతో భక్తితో ప్రణతులిడుదు/

 

జీవనోపాయమునకు పర్యాయపదము గా యాత్ర ప్రయోగం

దుర్భ కృష్ణశాస్త్రి తెలుగు తేనియలు

 

 

రెండు వేమన పద్యాలు సమర్పిస్తున్నాను-

 

1. కందము:

సద్గురు కృప జ్ఞానంబున,

సద్గతి దీపింపు చున్న  చాలా చదువుల్ ,

సద్గతి గలుగగ జేయును,

సద్గురువే దైవ మనుచు  జాటర వేమ.

 

2. ఆటవెలది:

కస్తురియట చూడ కాంతి నల్లగ నుండు,

 పరిమళించు దాని పరిమళంబు ,

గురువులైన వారి గుణము లీలాగురా,

విశ్వదాభిరామ వినురవేమ.

కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

 

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కవుల మనో ఫలకముల నుండి గొప్ప భావనలు జాలువారాయి...

ఉపాధ్యాయ వృత్తి నందు పని చేయుట మహాద్భాగ్యమని వినమ్ర పూర్వకంగా తెలుపుకుంటూ....

నాకు విద్య నేర్పిన గురువులకు పాదాభివందనాలతో..

మధురాక్కర

సకల సంపద లిచ్చెడి జ్ఞాన స్వరూపుడివే

ప్రకృతి కల్పించిన గురువు పాటవం బెరిగియె పొం

దికగ యున్న యెడల నీవు తేజరిల్లి సతతము

వికసిత మగుచు వెన్నెల వెలుగులు పంచగలవ్

వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు

 

 

 

సీసము

సంపద లేమియు సాటిరాలేవులే  విద్య యొక్కటి జాలు వెలుగు నివ్వ

యోర్పుతోడ గురువు నేర్పులన్నియు నేర్పి గుణసంపదలను తా గూర్ప గలరె

ఛాత్రుల హృదినందు జ్ఞానదీప్తి వెలిగించి, సతము దివ్యతన్ చెంగలించు

గురుకృప యుండిన గొప్ప భవిత గూరి శిష్యుల్ ప్రకాశించు సిద్ధుల వలె

 

 

తేటగీతి

పొటకరించు లేజిగురుల ప్రోది కొరకు

మాలకరి కష్ట రీతిగ, మమత తోడ

ఛాత్రులకు విద్య నొసగెడి చదువులయ్య

జగతికి ద్యుతి నిచ్చునె జగత్సాక్షి వోలె

వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు

 

 

తేటగీతి

సంపదలయందు విద్యకు సాటి గలదె

ఓర్పుగా నభ్యసించిన నేర్పు గురువు

కూర్పు చేయ సుజ్ఞానంబు కూర్మితోను

విద్యతోడుగ సత్గురు వినయమొసగు

వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు

 

 

విద్య యన్నట్టి సంపద వినయ మొసగు

గురువు నేర్పును విద్యను గురుతు గాను

విద్య  యనెడియు విత్తము విలువ గొప్ప

పదము లెన్నియు కూర్పుగా పద్య మల్లు

లలితారెడ్డి, శ్రీకాకుళం తెలుగు తేనియలు

 

 

కందము

 ఓర్పు గ విద్యను నేర్పు చు

మార్పును కోరుకొనెడల్ప మానవుడే తా

నేర్పుగ సంపద తృణమే,

కూర్పు ట వృధ యనుచు బంటు గూడి మురియునే!

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పెముంబయి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

వినుత లావణ్య సంపద కనుగుణంబు

విద్య నేర్వగ విజయము   విశ్వ మందు

నేర్పు గాయుండి మనస్సునిలిపికొలువ

శారదా దేవి సులువుగా సలుపు కూర్పు

కవిత కావ్యాలనిచ్చును  కరుణ తోడ ! 

మా సురేష్ తెలుగు తేనియలు


 

 

చెప్పాలని ఉంది

అంతర్జాతీయ ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో......

 

జాతి భవితకు ఆశాదీపికలైన

భావి భారత పౌరులకు

 చెప్పాలని ఉంది..!

జీవితం నేర్పిన పాఠాలను..

అనుభవాలు నేర్పిన గుణపాఠాలను..

విద్యా పాఠ్య ప్రణాళికతో పాటు చెప్పాలని ఉంది..!

చిన్ని మొక్కలను పోలిన

చిన్నారుల మదిలో

తమను తాము మలచుకోవాలనే

తపనను రేకెత్తించి..

భావి జీవన సమరంలో విజేతలుగా

అవతరించేందుకు అనువైన

పాఠాలను బోధించాలని ఉంది..!

ఎదుటివారికి ఇవ్వడంలోనే

ఎనలేని ఆనందముందని

చేయూత నివ్వడమే జీవన ధర్మమని..

ఈ మర్మాన్ని ,ధర్మాన్ని

అనుభవాలతో బ్రతుకు

అవగతం చేస్తుందని..

చిన్ని మనసులలో చేతన కలిగేలా

చెప్పాలని ఉంది..!

జీవితమన్నది పూలబాట కాదని..

అలా అని కష్టాల కడలీ కాదని..

వివేకం,విచక్షణలతో

విజయ శిఖరాలకు

బాటలు పరచుకోవచ్చునని

చెప్పాలని ఉంది..!

అంతా నాదేనని విర్రవీగినట్లైతే..

అనంతమైన పశ్చాత్తాపం

అంతరాత్మలో మొలిచేరోజు

తప్పకుండా వస్తుందని..,

విజయాలకు గర్విస్తే,

విలయాన్ని సృష్టించే పరాజయం

వెన్నంటే ఉంటుందని..

చెప్పాలనిఉంది..!                

మతంకన్నా మానవత్వం మిన్న అని..

సమాజ శ్రేయమే వ్యక్తి శ్రేయమని..

మనో ధైర్యంతో సమస్యలపై చేసే

నిశ్శబ్ద యుద్ధమనే

పదునైన  ఆయుధం

జీవన పర్యంతం విడువరాదని..

చెప్పాలని ఉంది..!

ప్రకృతి శక్తులను గౌరవించి..

సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఎరిగి..

అనుబంధాలనే అతి విలువైన 

సంపద లను చేజారనీయక..

మానవతాదీప్తితో వెలుగుతూ..

మహోన్నతంగా జీవించమని..

వాస్తవ జీవిత పాఠాలను కూర్చి

మనసుకు హత్తుకునేలా నేర్పుగా

శాశ్వతంగా గుర్తుండేలా ఓర్పుగా..

నేడు గురువుగా శిష్యులకు బోధిస్తూ..

శ్రమైక జీవన సౌందర్యాన్ని 

 ఆరాధించి, ఆచరించే

ఆత్మవిశ్వాసపు మనుజ వృక్షాలుగల

సుందర భావిభారత నందనోద్యాన నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఉంది..!!

 చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

 

విద్య తోడ వివేకంబు విలువ తెల్పి

జీవన మధురిమల వన్నె జిల్గు తెల్పి

దినదిన మెదురగు సమస్య తీరు తెల్పి

సర్వతోముఖునిగ దీర్చు సద్గురుండు

నేటి విద్యావ్యవస్థకు నెరవడి గద

వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు

 

 

సీసము

 

తరగని సంపదల్ విరివిగ నొసఁగుచు చెదరక మాయక యెదుగుచుండు

నేర్పును సుగుణముల్,నేరిమి, కూర్పును వినయ విజ్ఞతల, వివేచనముల

నజ్ఞాన చీకట్లు యంతరించగ జ్ఞాన కాంతుల దీపించు ఖమణి యనగ

విద్యయే కదనిలన్ వెలలేని సౌఖ్య సంపదల నొసఁగి వెల్గు పరికరంబు

 

అట్టి విద్యను బోధించు నయ్య వారు

నిహపరములను దాటించు నేర్పుగాను

గురువు కృపను పొందక ముక్తి దొరక దందు

మహిమ జూపి వెలుగు వేల్పు మహితముగను

 అవళూరు సీత తెలుగు తేనియలు

 

 

ఉపాధ్యాయుడు

 

ఆహార్యంలో ధీర గంభీరం..

ఉచ్ఛారణలో  సౌందర్యం..

విషయ పరిజ్ఞానానికి తోడైన

వివరణా నైపుణ్యం..

అసమాన ప్రతిభతో

 జతకట్టిన ఆత్మవిశ్వాసం..

విసుగెత్తించని వాక్యవిన్యాసం..

గాంభీర్యపు లక్ష్మణ రేఖను దాటని

సునిశితమైన హాస్యం..

తర్కబద్ధమైన తార్కాణాలతో

మెప్పించి ఒప్పించగల ప్రతిభా పాటవం..

సమకాలీన అంశాల మేళవింపుతో

సందర్భోచిత చమత్కారం..

సాటివారితో మెలగడంలో సాత్వికత..

మాట్లాడే విషయంలో ప్రామాణికత...

జ్ఞాన దాహార్తితో కూడిన

నిత్య అధ్యయన శీలత..

అనంతమైన జ్ఞానం కోసం

జ్వలిత చేతనా సంభావ్యత..

మృదుమధుర వక్తృత్వంతో

తరగతి గదిలో ఆహ్లాదపవనాల్ని సృష్టించగల చాతుర్యత కలిగి..

విద్యార్థుల మనోఫలకంపై

చెరిగిపోని శిలాక్షరంగా నిలిచి..

నడతలో నలుగురికీ

ఆదర్శంగా నిలిచేవాడే

నిజమైన ఉపాధ్యాయుడు..!!

చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

ఎందరో విద్వాంసులని జాతికి అందించిన మీ అమేయమైన సంకల్పానికి శిరసానమామి మీతో పాటుగా మన సమూహంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్సులు.

 

శార్ధూలము

విద్యాగంధములెన్నియో కురియగా  విద్వాంసులై వెల్గగా  

సద్యోజాతపు సంపదల్ సరణిలో సారంబు నేర్పించగా     

విద్యావైభవమందు మేటిగరిమల్ వేదాంతభావమ్ములన్         

విద్యావేణిని, వాణినిన్ గొలుచుచూ విద్యార్థి కైమోడ్పులే 

హృద్యంబౌ భవదీయమానసములో హేలా మనోజ్ఞంబుగా !

నిత్య విద్యార్థి తెలుగు తేనియలు


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...