9, అక్టోబర్ 2020, శుక్రవారం

సమస్యా పూరణ " చోరుని గని సంతసించి సుందరి వలచెన్ " 07.10.2020

తెలుగు తేనియలు

 సమస్యా పూరణ 07.10.2020

" చోరుని గని సంతసించి సుందరి వలచెన్ "

 ఇచ్చిన పాదం కందము

 

 వీరుడు సద్గుణ శోభిత

శూరుడు రఘు వంశకుల యశోధరు రామున్

ధీరుని సీతా మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్.


కందం లో ప్రయత్నం

పోరాట పటిమ కలిగెడి

ధీరుని మెచ్చని కొమ గలదె వసుధ నందున్

వీరుడయిన తన మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

వెంకట్. సిహెచ్ - తెలుగు తేనియలు

 


హోరున గాలియు తోడై

జోరున వానలు కురియగ సోలిన సఖినే

కోరి, కడతేర్చు మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి - తెలుగు తేనియలు


 

 

కందము

రారాజుల నోడించుచు

కారణ జన్ముడె యతడని ఘనముగ దలచా

ధీరుని వలె విజయమ్ముల

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!!

 

కందము

దారుణ రీతిన ధనమున్

క్రూరులు తా పొందుచుండ కుట్రల తోడన్

ధీరుని వలె పేదల కిడు

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!!

 

కందము

ధీరుడు వీరుడు ఘనుడై

మారణ హోమంబునైన మాపగ  బుద్ధిన్

దారుణ మాపెడి మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు

 

 

శశిరేఖా పరిణయం

అతి క్లిష్ట పరమైన నిఘాలతో అభిమన్యుడు దొంగలాగా శశిరేఖతో ప్రేమకలాపములను సాగించ చుండ ,

ఘటోద్గజుడు తన యుక్తులతో వీరి వివాహం సులభం చేసే .

శశిరేఖ సంతసించే.

చోరుని గని సంతసించి సుందరి, అవ్విధంబున, వలచెన్

అనే భావననే పెక్కు చలన చిత్రములలో వాడుచు రసవత్తరంగా ప్రేమ పెళ్లిళ్లు చేయుదురు గదా

మురళి మోహన్  - తెలుగు తేనియలు

 

వీరత శూరత లేకనె

ధారుణి తిరుగాడు వేష దారుల  తమదౌ

తీరుకు భ్రమసా మానస

చోరునిగని సంతసించి సుందరి వలచెన్

రాంమోహన్, నిజామాబాద్ - తెలుగు తేనియలు

 

 

గేయ రచన,

వార కాంత చింతామణి, భవానీ శం,

కరుడు తోడుకొని వచ్చిన మిత్రుని,

ఓరకంట చూచిన యా వారకాంత తన చిత్త,

చోరుని గని సంతసించి సుందరి వలచెన్....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి  - తెలుగు తేనియలు

 

 

ధర్మ సంస్థాపనార్ధుడై ధరణి పైన

కర్మ వశుడైన దుశ్శీలు కఠిన యాత్ము

గర్వ మణచగా నిర్దయ కంసు, మత్త

గజము నుం జంపెను హరి చక్రమ్ము తోడ

 

శమంతక మణినిచ్చుటకు

తన గేహమునకు విచ్చేసిన

నవనీత  చోరునిగని సంతసించి సుందరి వలచె  నని

గ్రహించిన సత్రాజిత్తు

తన తనయ సత్యభామను

శ్రీకృష్ణునికిచ్చి  పరిణయము గావించె.

డి. వి. హేమలత - తెలుగు తేనియలు

 

 

కోరితి నినుయని కోమలి

సారధి నంపగ, మురారి జయమున చేరెన్

వైరిని గెల్చిన వలువల

చోరుని గనిసంతసించి సుందరి వలచెన్

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు

 

1 వచన కవిత

మూతిని మీసము నద్దుకొని

తస్కరు  వేషము దాల్చిన ప్రియుని

"రారా ప్రియ సుందరా" యంచు ముద్దుల

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

 

2 వచన కవిత

అనార్కలి నక్బరు బంధించగ ,

విరహమోప లేక  మారు వేషమున

చెంత చేరగ సలీము, తన హృదయ,

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

 

3 వచన కవిత

కనులు తెరువగా , ప్రియుడు

కనిపించి కలవరం కలిగించు, కనులు మూయగ కలలోన కొచ్చిన  తన చిత్త

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

 

ఒక మినీ కథ

ఒక శ్రీమంతుని ఇంట్లోనుండి  కుక్క పారి పోయింది.

ఆ శ్రీమంతుడు వెతికి వెతికి చివరకు పోలీసు రిపోర్టు ఇచ్చాడు. ఆ సమయంలో, అతనికి ఒక వృద్ధాశ్రమము నుంచి ఫోన్ వచ్చింది-" మీ కుక్క మా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న మీ తల్లి గారిని వెతుక్కుంటూ వచ్చింది"అంటూ.

కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు

 

 

కందము

బేరములాడుచు చక్కగ

చీరలు కొను బ్రహ్మచార్ని శీఘ్రము గని యా

నారీ మనసులు దోచెడి

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!!

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి - తెలుగు తేనియలు

 

 

చోరుని  గని సంత సించి సుందరి వలచెన్

ఇచ్చిన పాదము  కందము  నా పూరణము  సీసములో

రుక్మిణీ శ్రీ కృష్నుని వద్దకు విప్రుని రాయాభారము పంపగా, అప్పుడు శ్రీకృష్ణుడు “ఓ విప్రవరా  నన్ను ఏమి చూసి వలచినది  మీ రాజ సుత  నల్లని వాడనే  అంద గాడను కాను గదా “ అని అడుగు తాడు అప్పుడు ఆ విప్రుడు పలుకు సమాధానము.

కమనీయ మైనట్టి కస్తూరీ తిలకము కరమున వేణువు , శిరమున శిఖి

పించము ,నుదుటన బిళ్ళ, వక్షస్ధలమున  ఘన కౌస్తుభము ,కర మందు

కంకణము ను,మౌక్తికము ముక్కు కొసలకు, గంధపు దేహము కలిగి సతము

శోభిల్లు నవనీత (చోరుని  గని సంత సించి సుందరి వల చె)న్గద  వసు

 

దేవ తనయుడా, నల్లని దేహము గల

వాడవని రుక్మిణెప్పుడు చూడ లేదు

గిరిధరా నిన్ననుచు క్షితి సురుడు పల్కె

చిరు నగవు తోడ లేఖను చేర వేసి

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

ఆలమందలు ఇంటికి వచ్చే వేళాయే

పక్షులన్నీ తమ గూటికి చేరే  వేళాయే

పగలు నెమ్మదిగా అస్తమించే వేళాయే

ఆకశంలో నక్షత్రాల మిల మిలలు కనపడే వేళాయే

పున్నమి నాటి చంద్రుడు వెన్నెల కురిపించే వేళాయే

మనోహరుడు ఇంకా రాలే దని ఎదురు చూస్తున్న వేళ

కాడెద్దుల గంటల గణగణలు వినబడగానే వచ్చెననుచు తన హృదయ

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

డి. నాగమణి - తెలుగు తేనియలు

 

 

కందము

యధాతధంగా సమస్యా పాదాన్ని అలాగే ఒక పంక్తిలో ఉంచి వచన కవిత అందించినా సగౌరవంగా స్వీకరిస్తాము.

 

మారుని శరముల కోర్చియు

దారుణ తపమున మునిగిన తాండవమూర్తిన్

కోరిన యుమ తన మానస

చోరుని గని సంతసించి సుందరి  వలచెన్

అవళూరు సీత - తెలుగు తేనియలు

 

 

కందము

బారులు తీరిన గోవుల

చేరువ( గూర్చుండి

మధుర మురళి( జెవులకు విందున్

గూరుచు నూదిన మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్.

డి.రామ నాగేశ్వరరావు - తెలుగు తేనియలు

 

 

కందము

కౌరవులు కుటిలముగాను ఖననము సలపిరి గదా/

వీరులైన పాండవుల నివేశములను; భీముడే/

గారవముగ పరిజనమును కానకు కొనిపోయెనే/

ఘారిలో హిడింబి గాంచె గండరీడి తెంపరిన్/

చోరునిగని సంతసించిసుందరి వలచెన్ గదా!

ఘారి= రాత్రి

గండరీడు= వీరుడు

వెంకట్. సిహెచ్ - తెలుగు తేనియలు


 

మది పొరల మాటున మొలచిన మొగలిరేకువో

నీలి నేత్రాల నడుమ నిలిచిన నవ్య సరళివో

అంతరంగమున ఆరని ఉష్టపొరల క్షేత్రానివో

కావ్య కదా కవితల కవి కదానాయకుడవో

నిశీధి వేళలో సవ్వడి చేసే శబ్ద తరంగానివో

శ్రీనివాసా నీ రూప మనోహరము జాడ, మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

వి. వి. శ్రీనివాస్ - తెలుగు తేనియలు

 

 

కందము

వీరత్వంబుగల నరుడు

వైరము లేకను తెలివిగ భామన్ కొలుచున్

ధీరత నెరపెడి మానస

చోరుని గని సంత సించి సుందరి వలచెన్

లలితారెడ్డి - తెలుగు తేనియలు

 


 

రుక్మిణి శ్రీకృష్ణుని చేరి పరిణయ మాడు సమయము...

 

కందము

కోరిన ఫలమును పొందగ

తేరుల పయనించి చేరె తేకువ తోడన్

హారిణి వలపుల మానస

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

 

కందము

బారులు తీరిన జన బా

జారున ఒడుపుగ పరుగిడు చతురత జూడన్

ధీరత చూపెడు హైటెక్

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు

 


కందము  1

శ్రీకృష్ణ తత్త్వం 

 

శ్రీ రుక్మిణేశ ! మాధవ !

కారుణ్యంబుని నిరతము గాపుము ! లీలా 

శౌరిని గని నవనీతపు   

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

 

కందము  2

శకుంతల అంతరంగం

వీరము హాస్యముతో, శృం 

గార, కరుణరసము గాంచి కాంతారములో  

ధీరుని, శూరుని, మానస  

చోరుని గని సంతసించి సుందరి వలచెన్ !

వారిజలోచన హృదిలో   

గారాబుపలుకుల మేటి గంధమలఁదుచూ    

శారదరాత్రుల దోచిన  

చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

 

కందము  3

విరహోత్కంఠిత వేదన  

వారిజలోచన హృదిలో   

గారాబుపలుకుల మేటి గంధమలఁదుచూ    

శారదరాత్రుల దోచిన  

చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

 

కందము  4

నిద్రిత శరద్రాత్రి సమ్మోహనం

 శారద రాత్రులు చెలియా !

స్వైరవిహారపు సరాగ వాంఛలవేళన్ 

కోరిన మృగలోచనకు హృ

చోరునిగని సంతసించి సుందరి వలచెన్

శివ శంకర్ కస్తూరి - తెలుగు తేనియలు

 

 

కలలో వీరుని గని మనసున

తానే పతియని వలచిన వాడే

వరుడుగా నాన్న చూపిన చిత్రమున

చిత్త చోరుని గాంచి సంతసించి సుందరి వలచెన్

విష్ణుప్రియ - తెలుగు తేనియలు

 

 

కందము - 1

దారిని‌ గాచెడి దొంగను

కోరక సతతము‌ ఘనముగ  కోట్ల ధనంబున్

కూరిమిగ దెచ్చు బ్యాంకు ల చోరుని

చోరుని గని‌సంతసించి‌ సుందరి వలచెన్

 

కందము - 2

మారదు నాజీ తమెపుడు

తీరవు నా వాంఛలెపుడు  దేహము కోరన్

నేరము చేసెడి బ్యాంకుల

చోరుని‌ గని‌ సంతసించి సుందరి వలచెన్


కందము - 3

జారిన మదనుని బాణము‌

కోరిక లనురేపుచుండ గోపతి మోమున్

నోరగ జూచుచు మానస

చోరుని గని సంతసించి‌ సుందరి వలచెన్

 

కందము - 4

జారిన పయ్యెద నడుగున‌ చనులను ఘనతన్

నోరగ వదలక జూచెడి

చోరుని గని సంతసించి సుందరి‌ వలచెన్

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

కందము

దారి వెదుకుచూ పురికిన్/

తారసపడి నా ప్రవరుని దాలుపురూపున్ /

చారెడు గన్నుల మానస/

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

వారణాశి శ్రీలేఖ - తెలుగు తేనియలు

 

 

మానసాచోరుడు

సుందరి చేసెను వంటలు ఘుమఘుమలాడగ

జరగబోవు సాయంత్రపు విందుకై

ఆహ్వానితుల రాకయె ఇక ఆలస్యమనగ

బిడ్డలుమొదలిడె ఆకలియని గోల

అంతకంతకు జనుల రాక ఆలస్యమౌతుండ, పతిదేవుడు

చాటుగ బిడ్డల ఆకలి తీర్చిన వైనమున కా భోజన

చోరుని గని సంతసించి సుందరి వలచెన్

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

కందము – 1

రారా కన్నయ్యా యని

నోరార బిలువగ రాధ నునుపుగ తానే

చేరెడు రాకా దీధితి

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!

 

కందము – 2

చోరుని పాత్రను ధరియిం

చే రాజిత వదను తోడ చెలిమిని సేయన్

తార యొకతె ; క్రమముగ నా

చోరుని గని సంతసించి సుందరి వలచెన్!

 

కందము – 3

వీరునికి నిత్తు రాజ్యము

నూ, రాజకొమరిత నంచు నుడువగ రాజే;

శూరుడొకరుండు బట్టగ

చోరుని ; కని సంతసించి సుందరి వలచెన్!

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 

పరుల పసిడిని దోచి

పడతి మెడనచేర్చి

తనకై గొనివచ్చెనని మోసపు

మాటలు పలికిన

చోరుని గని సంతసించి సుందరి వలచెన్.

రచన :డి. వి. హేమలత - తెలుగు తేనియలు


 

 సమస్య

గజమునుం జంపెను హరి చక్రమ్ము తోడ

ఇచ్చిన పాదము తేట గీతి,  నా పూరణ సీసములో

సిరికిని‌ చెప్పక,కరమున శంఖు చక్రమ్ములను ధరించ కసతతంబు

వెన్నంటి కాచెడి  ప్రియ పరి వారమున్ వెంట తోడ్కొనకవిక్కిజ ఘను

వాహనం బెక్కక వదనపు తిలకము సరిచూసు కొనక  కేశములను ముడి

పెట్టి బిగించక వేలి నఖ ములలో దూరిన పద్మాక్షి చీరను విడ

వక ,పరుగును బెట్టుచు నా  భువనము‌ లోని సరసు వద్దకు జేరి మకరపు బంధి

యైన గజమును కాంచి రయముగ  అంబుగజము నుం జంపెను హరి చక్రమ్ము తోడ

పూసపాటి - తెలుగు తేనియలు 



తేటగీతి

నిన్ను మ్రొక్కని కరములు నిష్ఫలములు
నిన్ను ధ్యానించని మనసు నీరసంబు

చిన్ని కృష్ణానిను దలచి జెంత జేరి

పూజజేయ మమ్మున్ గాంచి పొంగునిమ్ము 

వెంకట్. సిహెచ్ - తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...