16, అక్టోబర్ 2020, శుక్రవారం

14.10.2020 సమస్యా పూరణ, రామ నామ జపము రక్ష గాదు


 
సమస్యా పూరణ

 సమస్యాపాదం ఆట వెలది లో..  

" రామ నామ జపము రక్ష గాదు "

సమస్యాపాదం కంద పాదము లో.. 

"రాముని పూజించినంత రక్షణ కఱవై"

ఇదే పంక్తితో పద్య / వచన కవిత రూపాలలో పూరణలు చదవండి

 

నేను దశముఖుడను, లంక నేలు చుంటి,

నీదు భర్త వనము‌ లోన నీరసముగ

తిరుగు చుండెడి  వాడుగా,  దొరక బోదు

తిరిపె మైన వనమునందు,  సరస గతిని‌

నాదు  రాణిగా  నుండిన‌ మోదములను

బడయ గలవు జీవితమున‌, భంగ పడక

రామ,రామ నామ జపము రక్ష కాదు

మాని రావణ జపమునే మనసు‌ బెట్టి

చేయమని పలికె నతడు సీత తోడ

 

పవన సుతుని నోట పలుకు నేమి సతము?

పతి నొసంగు నేమి సతికి‌ నెపుడు?

సీత లక్ష్మణునకు చెల్లెలై నొప్పుగా,

రామ నామ జపము,రక్ష,కాదు

వయసు నీకు మీద బడెను, చేయు మెపుడు

రామ నామ జపము, రక్ష కాదు

నీదు నయనములకు నిపుడు టీ వీ చూడ

ననుచు పలికె సుతుడు యమ్మ  తోడ

 

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

 

"అసారే ఖలు సంసారే

సారం శ్వశురమన్దిరమ్

క్షీరాబ్ధౌ హరిః శేతే

శివః శేతే హిమాలయే"

 

అర్థం:

"సారములేని ఈ సంసారంలో సారమైనది మామగారి ఇల్లే, అందుచేతనే విష్ణువు పాలసముద్రంలో (లక్ష్మి పుట్టిల్లు) శయనించి ఉన్నాడు,  అలాగే శివుడు హిమాలయం లో (పార్వతి పుట్టిల్లైన హిమాలయ మందలి  కైలాసం లో) శయనించి (ధ్యానమున) ఉన్నాడు."

అట్టి హరిహరులు సర్వజనులను  కరుణతో రక్షించుగాక.

 

కె మల్లికార్జునరావు

 

 

తేటగీతి

రామ యనెడి పిలుపు నందు రమ్యమైన

మధురభావ నొదిగియుండు,మహిమ నెరిగి

రామ రామ యని పిలువ రహి కలుగునె

మెండుగను, రామ!శ్రీరామ! దండములివె

 

వెంకట్ సి.హెచ్

 

ఆటవెలది

అరుణకిరణవితతి నరుణార్ణవమ్మైన/

యాకసమును గనినయంత  సొబగు/

తలచినంత యెడద తన్మయత్వమునందె/

నట్టి గొప్పచిత్ర మద్భుతమని

 

వారణాశి శ్రీలేఖ

 

 

తరువోజ

కస్తూరి పరిమళ గంధపు పొడులు

      కవులపై జల్లంగ కైత కురియునె

విస్తు యేమి గలదు ప్రీతిగా పొగడి

      పేర్మి జూపంగ కవిత్వము పొంగు గద

ఆస్తి యిదే గద హరువు కల్గించు

       యభిలాష కవనంబె యబ్బుర మిచ్చు

నేస్తమై జేసెడి నెయ్యపు బోధ

        నింపాదిగ కవితా నేర్పు గూర్చు గద

 

వెంకట్ సి.హెచ్

 

 

శ్రీ రామ

తొలగును భయములు

 కలుగును రాముని పూజించిన నంతనే రక్షణ,కరవైనట్లు ఏదియో అని

మనసును వివిధ రీతుల

భ్రమ పెట్టి బాధ పడుట వలదు,రామనామ జపమే రక్ష

 

రామ రామ

హనుమ లంకలో రామనామ జపముతో సీతను వెతుకు చుండ

అసురులు, రామ నామ జపము రక్ష కాదు

మా లంకలో  రావణ భజనయే నీకు శరణము లేనిచో దొరకును మరణము అనగా,

రామ రామ అనుచు హనుమ వారిని పరివిధముల శిక్షించి ముప్పతిప్పలు పెట్టే

 

భక్తులను రక్షించు రామ నామ జపము , రక్ష కాదు ప్రతి క్షణం

పరి పరి విధముల

విషయ చింతనలతో విధి విస్మరించి

పరివిథముల మనసును భ్రమించుట, రామ నామము మనకు రక్ష !

 

జి మురళీ మోహన్

 


 

ఆటవెలది

ధనము మూటగట్టి ధార్మికత మరచి

ధర్మవర్తనమను తలపు లేక

పాపభీతి తోడ పాహిపాహి యనిన

రామనామ జపము రక్షగాదు

 

కందము

భామిని లాలస హెచ్చిన

కాముక రావణు పోకడ కాదను భ్రాతౌ

నామిత విభీషు, లంకన్

రాముని పూజించినంత రక్షణ కరవై

 

నామిత=వినయసంపన్నుడు

 

ఆటవెలది

 

నిలువ మనసు మధుర నీరటి యందునన్,

కనుల ముందు తిరుగు కళల యందు

పలుకు నోట మొక్కుబడి భజనలు చేయ

రామనామ జపము రక్షగాదు

 

నీరటి=నైవేద్యం

 

ఆటవెలది

 

నలత లేక మందు నయము చూపగలదె

క్షుత్తు లేని తిండి సత్తువిడదు

భక్తి లేని మనసు భజన చేయగనేమి

రామనామ జపము రక్షగాదు

 

వాణిశ్రీ నైనాల

 


 

కందము 1

హేమాహేమీలనుచూ   

సామేధికులమనుచూ, విచకులై భువిలో 

శేముషిలేని పలుకులవి       

రాముని పూజించినంత రక్షణ కఱవై  !

 

కందము 2

కోమలి కోర్కెల వలలో

నీమములు మరిచినవాడు నీతిని విడిచెన్

భామాకలాప సదమున 

రాముని పూజించినంతరక్షణ కఱవై

 

కందము 3

ప్రేమావేశపు మోజుల   

భామాసంగతము తోడు బంధము మఱచెన్     

కామితమెఱుఁగఁగ బ్రతుకున    

రాముని పూజించినంత రక్షణ కఱవై

 

కస్తూరి శివశంకర్

 

 

క్రమాలంకారముతో నా పూరణము:

మాత సీత ఎవరి నామ జపము జేసె?

నీళ్ళు బోసి తల్లి ఏమి బెట్టు?

"అవును" కెదురు పదము అరసి చూడగనేది?

రామనామ జపము,  రక్ష, గాదు.

 

అశ్వనీ కుమార్

 

 

సమస్య ను రెండవ పాదంలో ఉంచి పూరించాను


రామదాసు కంచెర్ల గోపన్న గురించి.

కం.రాము డె సర్వమని  తలచి

రాముని పూజించి నంత రక్షణ కరవై

 రాముని దాసుడు చెరలో

రాము డె రక్షించు నంచు రాముని పిలిచెన్.

 

ఆటవెలది

 

అశోక వనంలో రావణ నియమితులైన రాక్షస స్త్రీలు సీతతో అంటున్నారు

రమణి! లంక యందు రావణ భజనచే

స్వర్గ సౌ ఖ్య సిరులు వచ్చు నమ్మ!

ప్రాణ రక్షకుండు రావణుం డే సుమ్ము

రామ నామ జపము రక్ష కాదు.


డి.రామ నాగేశ్వర రావు

 

 

కందము 1

రామ నామ జపము రక్షణ గాదు

యనుచు తలవగ చేసిన  యదియె  కాదు 

వ్యర్ధ మగు,పని తెలుసుకో వమ్మ నీవు

నెరిగి చేయగ మరికొంత  నెమ్మి కలుగు.

 

కందము 2

నిదుర  నందు  కూడ నిటు,కల కనరాదు

రామ నామ జపము రక్ష గాదు

వ్యర్ధ  చింత,  నెరిఁగి  వదలక చేయగ

నెంత  శ్రద్ధ  గాను, నెమ్మి కలుగు.

 

కందము 3

రాముని తలచుచు సీతయు

రాముని పూజించి  నంత  రక్షణ కరవై

కాముని ధాటికి లొంగిన

సోముని భక్తుని వధించె  సొంపుగ కనరే

 

రేవూరు సాయిలక్ష్మి

 

 

 

ఆటవెలది

 

అంతులేని రోగమెంతయో వేధించ

 మందులేమిజేయు మంచియనుచు

 వైద్య మన్నదొదలి, భక్తి మేలని జేయు

 రామనామ జపము రక్ష గాదు!!

 

 డా. నాగులపల్లి

 

 

ఆటవెలది

 

బాధ పెట్టు పరుల పన్నాగములు పన్ని

పెద్దలనిన నేమి ప్రేమకల్ల

చేయు పాపములను చింతయు లేకను

రామ నామ జపము రక్ష గాదు

 

కందము 1

 

ఏమని చెప్పెద నేనిక

కోమల మైనట్టి బనులు కొంతయు లేకన్

నీమము దప్పిన బ్రతుకున

"రాముని పూజించినంత రక్షణ కఱవై"!!

 

కందము 2

 

ప్రేమగ జెప్పిన వినకన్

శ్రీమతి తో తగవులాడి చింతలు బెరగన్

నీమము దప్పక నప్పుడు

"రాముని పూజించినంత రక్షణ కఱవై"!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

రామ కథను విన్న రాజ్యాలు వచ్చునా

యన్వయించు కున్న ననువు గాని

కర్మ యోగమదియె కష్టాలుఁ గడతేర్చు

రామ నామ జపము రక్ష గాదు

 

చాగంటి చరణ్

 

కందము

 

సామజవరగమనాయని

భామల వెంబడి తిరుగుచు వంచన మునిగే

సోమరి నామము బెట్టుచు

రాముని *పూజించినంత రక్షణ కఱవై

 

 

 

ఆటవెలది 1

 

జోరు వాన లందు సోయలేకజనులు

ఆలయముల జేరి హారతులిడి

పూజ లెన్నొ సల్పి  రోజంత భక్తిగా

రామ నామ జపము రక్ష కాదు

 

ఆటవెలది 2

 

వాగు  వంకలన్ని వరదలై పొంగంగ

వైరసుపెరిగేను వాన లందు

వేడుకలని జనులు వీధుల తిరిగిన

రామ నామ జపము రక్ష కాదు

 

రమ, కంకిపాడు.

 

 

ఆటవెలది

 

విద్య నేర్చునపుడు  వివరమరయవలె

బద్దక  చదువులిక వదల వలెగ

చేతులార విద్య చేజార్చినంతట

రామనామ జపము రక్ష గాదు

 

 

కందము

కోమలి సీతను తెచ్చిన

కాముక భ్రాతను వలదని ఘనమౌ లంకన్

ఓము కు విభీషనడ్డన్

రాముని పూజించినంత రక్షణ కరవై

 

ఓము= రక్ష

 

సతీష్

 


 

ఆటవెలది

కష్టపడుట మరచి యిష్ట రీతి గడుపు

పాఠకుండు విద్య పఠన మొదిలి

దైవ ప్రార్థ నందు తరియించు దోషమై

రామ నామ జపము రక్ష గాదు

 

కందము

ప్రేమగ ప్రతిదిన మందున్

రాముని పూజించినంత; రక్షణ కరవై

స్వామి యని తలచినంతనె

పామరుల మది పులకించు పరిపూర్ణముగా

 

 

పర్వమందు మ్రొక్కి మూఢ భక్తి నెరపు నటులకున్

గర్వితులుగ పూజ జేయు కపట భక్తి జనులకున్

పర్వు లెట్టి గొప్ప కొరకు పాకు లాడధములకున్

సర్వముగను రామ నామ జపము రక్ష గాదులే

 

వెంకట్. సి హెచ్

 

 

 ఆట వెలది

1.

మంచి విడచి పరుల వంచన చేయుచు

మాయ మాట తోడ మనసు గెల్చి

మోసగించి బ్రతుకు మ్రుచ్చు మనుజులకు

రామ నామ జపము రక్ష కాదు

 

2.

వయసు పైబడినను వదలని కోర్కెల

వట్టి పనుల గడుపు వారు దైవ

స్మరణ సుంత లేక సంసిద్ధి తలచిన

రామ నామ జపము రక్ష కాదు

 

 కందము

రాముని పూజించినంత రక్షణ *కఱవై

సామముల మరచి విడువక

కామన లమునిగి తెఱకువ గానక హఠముల్

గోముల స్వకామి కాగా

రాముని పూజించినంత రక్షణ కఱవై

 

అవళూరు సీత

 

 

ఆట వెలది

దుడుకు తనము తోడ దుష్కృత్యముల్ జేసి

మాట లాడ దొడగె మౌని వోలె

నంగనాచి వోలె నాటక  మాడంగ

రామ నామ జపము రక్ష గాదు

 

కందము

భామలు కోరిన చీరను

ఏమరచు కొనక తిరిగెడు యేలిక యైనా

యామము జేయుచు కూర్చొని

రాముని పూజించినంత రక్షణ కఱవై

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి



 

కందము 1

 

సేమంబేయని దలచిన

క్షామం దీర్చగ తరంబె?  కరొనా వ్యాధిన్,

నామం లేకుండ జేయున్

రాముని పూజించి నంత రక్షణ కరవై.

 

కందము 2.

తామసము బోవఁగ పరం

ధాముని మనసున దలచిన  ధైన్యము బోయెన్.

కామిత మీడేర్చును,

యారాముని పూజించి నంత, రక్షణ కరవై.

 

శిరీష.

 

 

తేటగీతి

 

నాడు, రాముని పూజించినంత, రక్ష//

కరవైన కాకాసురునకు దొరికెను//

గాదె రక్షణ. "బ్రహ్మాస్త్ర కంపితుండ //

నాకిక బ్రహ్మ, రుద్రుడు నాది గాను//

సకల దేవత లెవ్వరు శరణ మనుచు"//

తిరుగ రాముడే యాతని దిగులుతీర్చె

 

2️ వచనం

 

" రామ నామ జపము రక్ష గాదు" యన్న వారికి,

చెంపపెట్టుగా నాడు నాదబ్రహ్మ త్యాగరాజు

"రాముడి సొమ్ముకి రక్షకులులెవరు" యనుచు,

రామనామ స్మరణ సల్ప, స్వయముగ రాముడే వచ్చె

రక్షకుండై, లక్ష్మణుని తోడ రక్షింపగ, చోరుల బారినుండి

తన భక్తుని, అతని నమ్మికని, "శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష" యనుచు

 

వారణాశి శ్రీలేఖ

 

 

రామ నామ జపము రక్ష గాదు

 బుద్ది హీనత తోటి ధర్మాచరణ మరచి

కండ కావరముతో కారుణ్య మెరుగక

పరివారము నెల్ల హింసించే నరులకున్

రామ నామ జపము రక్ష గాదు

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట.

 

 

 

ఆటవెలది

 

శక్తి కొలది యుద్ద మాడె కర్తవ్యము

నని కరి, హరి వచ్చె నాదు కొనఁగ!

పెట్టి గాలి లోన దీపము ,దిక్కన్న,

రామ నామ జపము రక్ష గాదు!

లలిత దీక్షిత్

 

1 .

రమ్యమైనది భవ్య మైనది రామనామము,

మహా మునులు నమ్మినది రామనామము,

సద్భక్తి తో పలికిన భయమన్నది దరి రాదు,

శ్రద్ధ లేకను రామ నామ జపము రక్ష కాదు.

 

2.

బలరాముని పూజించినంత రక్షణ కరవై,

పాండవ మధ్యముడు భీముని కరమున్,

ద్వంద్వ యుద్ధమున దుష్ట సుయోధనుడు,

ఊరువులు విరగొట్టుకొనెన్ మరి చచ్చెన్.

 

కె మల్లికార్జునరావు

 

 

 

1. రామనామజపము రక్షకాదు

ఆటవెలది

 

పరుల బాధ పెట్టి పండుగ చేయుచు

చెడ్డపనులతోనె చెలిమి చేయు

వాడు కీడుచేయు వానిగ నేనున్న

రామనామ జపము రక్షకాదు

 

2.సమస్య : రాముని పూజించినంత రక్షణ కఱవై

కందము

 

రాముడు దేవుడు కాడని

రామాయణమూ మనుష్య రచనే గదనీ

నామము జపించకుండీ

రాముని పూజించినంత రక్షణ కఱవై

 

డి. వి. హేమలత

 


 

1

గాలి లో దివ్వె పెట్టి దేవుడా అన్నట్టు

పరీక్షలే రాసాను క్లాసు లెగ్గొట్టి

చదువు చట్టుబండాలాయె నాది

ఇక రామ నామ జపము నాకు రక్ష కాదు

2

ద్రౌపదిపై వలపన్నిన కీచకుని మదము అణగదొక్క వచ్చిన

మాయా ద్రౌపదిని చూచి

తన మనసున అనుకునె ఇక

నాకు బల రామ జపము రక్ష గాదు

 

విష్ణుప్రియ

 

(అడవిలో రాముని కనిన భరతుడు...)

కందము

నా మనమె నుపశమించెను

రాముని పూజించినంత ; రక్షణ కఱవై

సేమము లేక నయోధ్యా

సీమ పరితపించు చుండె శ్రీరామునికై!

 

 

 

(త్రిజట సీతతో...)

కందము

 

మాయావి కడను నీ

రాముని పూజించినంత రక్షణ కఱవై

కామిత మీడేరదుగా;

నీ మనికి నిలుపు కొనంగ నెవులును విడుమా!

 

ఆటవెలది

కాలము విలువ నెరుగక తాను వ్యర్థము

చేయు వాని తోడ చెప్ప దగును;

పనుల సేయకుండ బద్ధకిం చెదవు; వి

శ్రామ నామ జపము రక్ష కాదు!

 

ఆటవెలది

భక్తి తోడ సతము పావన మనమ్మున

హనుమ జేయునట్టి వినుతి ఏది;

శత్రు బలమెరుగక సాహసించిన గాని;

రామ నామ జపము; రక్ష కాదు!

 

 

ఆటవెలది

తానిషా ప్రభువట  దయమాలి గోపన్న

నుంచ ఖైదు నందు; సంచితముగ

కీర్తనల తెగడుచు నార్తిగ బల్కె ; శ్రీ

రామ నామ జపము రక్ష కాదు!

 

చల్లా దేవిక

 

 

 

సమాప్తం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...