1, అక్టోబర్ 2020, గురువారం

విశ్వనరుడు జాషువా (జాషువా జయంతి శుభాకాంక్షలు)

 

విశ్వనరుడు జాషువా

(జాషువా జయంతి శుభాకాంక్షలు)

1895 సెప్టెంబర్ 28 జన్మించిన జాషువా గారు.... ముందుగా మీకు పుష్పాంజలి......మీరు సృష్టించిన సాహిత్యములో నీ.. కొన్ని పదాలు సృశిం చక తప్పదు...... తెలుగు ప్రజల మనస్సు లో మొలకలు నాటిన... మహాకవి.......... మీ.. సాహిత్యం కులం అనే మురికిని తొలిగించే జీవనది సాగరం................... వర్గసంఘర్షన  , ఆర్థిక వ్యత్యాసలు, దోపిడీ వర్గాల దోపిడీ నుండి సామాన్యుల జరుగు భాటు కావాలంటే తిరుగుబాటు తప్పదు అని భావించిన అభ్యుదయ వాది.....మీ జీవితం 'వాడగల్పు' అని...... మీకవిత్వం' వెన్నెలగా భావించిన.... కవికోకిల...... మీరు.... "చిత్కరాలు".. ఎదురైన చోటే.. "సత్కారాలు"... పొందిన.. కవి చక్రవర్తి... మీ.." కవితా భావాలు"... మిమ్మల్ని చూసి ... సిగ్గు పడుతూ.. నడిచి వచ్చే... జవరాళ్లు.... గబ్బిలం, ఫిరదౌసి . . .

 

రామ్మోహన్ రావు___తెలుగు తేనియలు 

 

సీసము

 

అవమానముల సైచి యగ్ని శిఖగ మారి విశ్వ మానవుడైన వీరుడితడు;

కవితాయుధము దాల్చి ఖద్యోతుడై వెల్గి పోరాడి గెల్చిన పోటరితడు;

ఛీత్కారముల తాను సత్కారములుగాను మలచుకొనిన యట్టి మాన్యుడితడు;

తెన్గు సాహిత్యాంబుధి మధింప బుధజనుల్ తోరంపు కెరటమై తోచునితడు;

 

ఆటవెలది

శారదాంబ కృపను సరిలేక పొందిన

జాషువా యనంగ సహృదయుండు;

నవయుగమ్మునకును నాంది పల్కిన కవి

తా విశారదుండు తరచి చూడ!

 

సీసము

 

ఆవేదనకు జతయైన మేధయె నాడు   సహజ కవిగ మార్చె జాషువాను;

గబ్బిలమ్మును తన కవన మందున జేర్చి దళిత జనాళి బాధలను జాటె;

గిజిగాని సొగసైన గీమునుం బొగడుచు పసిడికైతల తోడ వన్నె గూర్చె;

భరతమాతను పచ్చి బాలెంతరాలుగ భావన జేసెనీ పావనుండు!

 

ఆటవెలది

మానవీయ కవన మాధుర్యమును బంచి

సకల జనుల మానసముల గెల్చి

అవడు నిందలన్ని యాత్మవిశ్వాసియై

అధిగమించినట్టి యమర జీవి!!

 

చల్లా దేవిక___తెలుగు తేనియలు 

 

మీరు చెప్పిన జాషువా గారి పద్యం పూర్తిగా అందిస్తున్నాను

 

ఉత్పలమాల

 

నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే

ఖాకమనీయ వైఖరుల్ గాంచి, భళి భళీ యన్నవాడె మీ

దేకుల మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్

 

శివ శంకర్ కస్తూరి___తెలుగు తేనియలు

 

 

పేరడీ పాట( రంగూన్ రౌడీ చిత్రంలో జాబిలి ట్యూన్ లో)

పల్లవి : జాషువా! కవి బాద్షాయే నీవు కవి కోకిలంటే నీవే

మాది గై పుట్టి చీదరింపుల్నే నీవు పొందావో యీ

వడగాడ్పు నీ జీవితము వెన్నెలే నీ కవిత జోహార్లు జోహార్లు

చరణం : పేదరికము,కులవివక్ష గురువు లైరీ కవిగ ఎదుగ

సంఘ మందు అన్యాయాలు,అసమానత లే కవిత లాయే

ఛీ ఛీ పొమ్మన్న నేల పై నీవు సత్కార మొందావోయి

గాజమునే ఎక్కావు స్వర్ణాభిషేకం జరిగే కవిదిగ్గజమ్మే నీవు జోహార్లు జోహార్లు

చరణం : కులము లన్ని అంతరించి సమ సమాజం ఏర్పడం

కులము పేర నింద చేయక ప్రతిభ నందరు నాదరింప

అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని రూపు మాపగ తలచి

అస్త్ర కవితలు దాల్చి యుద్ధమే చేశావు విష్వనరుడవు నీవు జోహార్లు జోహార్లు

చరణం : దళిత జనుల కడుపు మంటే గబ్బిలంగా గొంతు విప్పె

పేదకవుల హృదయ వేదన ఫిరదౌసి గా రూపుదాల్చె

క్రీస్తు,నేతాజీ,బాపు శివాజి కథలు ముంతాజ్ మహలు

ఖండ కావ్యము లె న్నో కీర్తినే పెంచాయి కవి చక్రవర్తి వి నీవు జోహార్లు జోహార్లు

 

రామ నాగేశ్వరరావు,భీమవరం___తెలుగు తేనియలు  

 

నేడు జాషువా గారి జయంతి సందర్భంగా నాకు నచ్చిన కొన్ని పద్యాలని చిన్న వ్యాఖ్యతో పాటు మీకు అందించే ప్రయత్నం

జాషువా గారి సాలీడు గురించి చెప్పిన చిన్న పద్యం.

ఆయన వైవిధ్యమైన భావనలకు ఒక మచ్చుతునక  మాత్రమే.

 

సహజంగా సాలీడు అంటే ఒక అపశకునం ఎందుకు సాలె పురుగు  అన్న భావన ఉంటుంది(). అసలు నీలాగా ఊలు మరలు, రాట్నాలు లోపల ఉన్న జీవి వేరొకటి ఉందా అని ప్రశ్నిస్తూనే.. సాలీడు లాగా ఉచ్చు బిగిస్తున్నారు అనుకునే వాళ్లకి చెప్పే సమాధానం లాగా కనిపిస్తుంది     

 

ఎంతో గొప్పదైన ఈశ్వర అనుగ్రహం ఉంటే తప్ప ఇంత మనోహరమైన కలనేత ని, అల్లికని మేము బూజు అని కొట్టిపారేస్తాము.  పద్యంలో ఎక్కడా భావం చెడలేదు. అర్ధంకానిదేదీ లేదు. పైగా, అద్భుతమనిపించే భావన. ఇదీ కవిత్వమంటే అనిపిస్తుంది .

 

శార్దూలము : 

 నీలో నూలు తయారుజేయు మరగానీ, ప్రత్తి రాట్నంబు గా

నీ, లేదీశ్వరశక్తి నీ కడుపులోనే లీనమై యుండునో

యేలీలన్ రచియింతువీజిలుగునూ; లీ పట్టు పుట్టంబు ! లో

సాలీడా, నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్ ??

 

శల్యసారధ్యం లోని ఇంకో చక్కని పద్యం

కర్ణుడి రధచక్రం కుంగిపోయినప్పుడు చెప్పే మత్తేభం

శల్యుడు జాషువా గారి  కలంలో దూరి పద్యం చెప్పాడేమో అనిపిస్తుంది.

పద్యాలలో కర్ణుని ఖ్యాతి గురించి చెబుతూ,

అధర్మాన్ని ఆశ్రయించిన వారికి   దుర్గతులు తప్పవు

అని మనందరికీ గుర్తుచేస్తారు.

 

అర్జునుడి గాండీవం తో చేసే విన్యాసాల ముందు

నీ శౌర్యం పాటిది అన్నహేళన కూడా ఎంత చక్కగా

కనిపిస్తోందో చూడండి.

 

మత్తేభం

ఇలకున్ గ్రుంగె రథంబు చక్ర మిపు డేదీ నీకు గత్యంతరం?

బలుక న్నీ ప్రతిపక్షి గాండివధరుండై, చెండు చున్నాఁడు నీ

బలమున్ గాలము లేదు స్యందనము లేవందీసుకొ మ్మేటికీ

తలపోఁతల్శరణంబు వేఁడుకొనరాదా కర్ణ? బీభత్సునిన్!

 

భరతమాత వైభవాన్ని ఒక్క సీసంలో మహత్తరంగా వర్ణించిన కవి జాషువా గారు

భరతమాత మీద, దేశం మీద కొన్ని వందల పద్యాలు, గొప్పగా వ్రాసిన కవులు ఉన్నా కూడా..  

 

పద్యం మాత్రం ప్రత్యేకం.. జాషువా సీసములన్నిటిలో ఎంతో ప్రశస్తమైనది, కలికితురాయి లాంటి పద్యము 

 

సగరుడు, మాంధాత వంటి షట్చక్రవర్తుల వైభవం చెబుతూ వర్ణించే పద్యం ఎప్పుడు స్మరించుకున్నా ఆహా అనిపించక మానదు 

 

సీసము

సగర మాంధాతాది షట్చక్రవర్తుల యంక సీమల నిల్చినట్టి సాధ్వి 

కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూత దేహ 

కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి  కీర్తినొందిన పెద్ద గేస్తురాలు 

బుద్ధాది మునిజనంబుల తపంబున మోద భాష్పముల్ విడిచిన భక్తురాలు 

    

తేట గీతి

సింధు గంగానదీ జల క్షీరమెపుడు 

కురిసి బిడ్డల పోషించుకొనుచు నున్న 

పచ్చి బాలెంతరాలు మా భరతమాత 

మాత లకు మాత సకల సంపత్సమేత

 

నేటి దత్తపది జాషువా గారి 125 జయంతి స్మృతిలో, చంపకమాల

చంపకమాల

తెలుగుపదంబు జావళుల తీయని జానతెనుంగు పద్యముల్       

జిలుగులనద్ధి చీకటులు జీల్చిన వెల్గుల రేడు జాషువా 

పలుకులరాణి పాదమున బంగరు శింజిని నిక్వణంబు, ని 

ర్మలమగు భావలాహిరులు లాస్యముజేయు విరించి జాషువా ! 

వెలుగులవెల్లువై కవనవీధులలోని గభస్తి జాషువా ! 

 

కస్తూరి శివశంకర్___తెలుగు తేనియలు  

 

 


శ్మశానభూమిని వర్ణిస్తూ #జాషువా కవి గారు వ్రాసిన #శ్మశానవాటి #ఖండకావ్యం లోని పద్యాలు ఇవి....  ఎంతో హృద్యంగా గుండె కరిగేలా ఉంటాయి...

చదివినప్పుడు ఎంతో...అవి హరిశ్చంద్ర నాటకంలో విన్నప్పుడు అంతకన్నా ద్రవించి పోతుంది.....

ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్‌

గన్నుల్‌ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్‌ లేచిరాఁ,డక్కటా!

యెన్నాళ్ళీచలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో!

కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్‌

 

#ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,

నిప్పులలోనఁగఱగిఁపోయె !

యిచ్చోటనే భూము లేలు రాజన్యుని యధికారముద్రికలంతరించె!

యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూసలసౌరు,గంగలోఁగలిసిపోయె!

యిచ్చోటనెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ,నశించె!

 

 

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు

గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;

ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ

నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

 

జాషువా గారి కి నమస్సులతో నేను వేసుకున్న చిత్రం....

#కన్నాజీరావు___తెలుగు తేనియలు   


 

జాషువాకు నివాళి

మరుభూమిని భూమిక చేసి,

మరణానికి ఆభరణం తొడిగి,

భువనానికి కవనములల్లిన,

రాతి అడవుల కూసిన కోకిల.

గాయాలను గేయాలుగా మలచి,

అవమానమునాదరముగ మార్చి,

పోరాటము సౌందర్యము కలిపి,

గొంతు విప్పిన కోకిల జాషువా.

 

కవి రాజుకు నా హృదయాంజలి.

కె మల్లికార్జునరావు___తెలుగు తేనియలు  

 

 

నా పూరణ యత్నం..

ఉత్పలమాల

భాషకు ప్రాణమున్ నిలిపి వ్రాతకు చక్కని యందమిచ్చి తా

రోషము జూపునట్టి పలు లోకము మెచ్చెడి కావ్య కాంతులన్

దోషము లేని సంగతులు దోసిట నింపుచు జూపిరే సదా

"జాషువ విశ్వనాథ గురజాడయు తుమ్మల కృష్ణ శాస్త్రియున్ "

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి___తెలుగు తేనియలు  

 

 

ఉత్పలమాల

భాషకు భూషణంబులగు భారతి బుత్రులు లోటు తీర్చగన్

ఘోషను యాలకించి నిల గూర్మిగ పుట్టరె భాగ్యమివ్వగన్

దోషము దిద్దగన్ తెలుగు దుస్థితి మారగ వైభవంబుగన్

జాషువ విశ్వనాథ గురజాడయు తుమ్మల కృష్ణశాస్త్రి యున్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి___తెలుగు తేనియలు 

 

ఉత్పలమాల___తెలుగు తేనియలు 

 

గర్భము నందునైన కనికారము లేకయె నాడబిడ్డలన్

అర్భక భ్రూణముల్ చిదిమి హత్యకు బూనెడి  దుర్మదాందులన్

నిర్భర దుస్థితిన్ వగచి నీచుని వేడగ నిస్సహాయతన్

గర్భము నందునున్న పసికందు గబుక్కున దుమ్మె బిట్టుగన్

 

వాణి___తెలుగు తేనియలు 

 


భగత్ సింగ్ దేశభక్తి    (గేయం)

 

భగభగ మండే నిప్పుకణమురా

భగత్ సింగు సోదరా!

దేశభక్తి చిననాటినుండి యు

నింపుకున్న దా గుండెరా!

 

ఆర్యసమాజం భావనలెన్నో

నాస్తికత్వమును నింపగా

కీర్తి కిసాన్ పార్టీతనలో

విప్లవ జ్వాలను రేపగా

 

అసంబ్లిబాంబు,సాండర్ హత్య

ఉరికంబమునకు పంపగా

ఉరికొయ్యను వేలాడదీసినా

ఇంక్విలాబ్ జిందాబాదంటూ

 

నింగిలోన నినదించెను

భరతమాత విలపించెను

ఆకాశాన తారల నడుమ

విప్లవ జ్యోతియె వెలిగెను

 

భారత మాతను పిండే దొరలకు

భరతం పట్టెన భగత్తు!

దేశంకోసం దేహమునిచ్చిన

నిన్ను మరువదీ జగత్తు!

చెన్న మాధవుని రామరాజు___తెలుగు తేనియలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...