15, అక్టోబర్ 2020, గురువారం

దత్తపది - 46 ఆస్తి, నాస్తి, జాస్తి, శాస్తి

 


దత్తపది - 46

12.10.2020; ప్రణాళిక

ఆస్తి, నాస్తి, జాస్తి, శాస్తి

 

ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం  పద్యాలు/కవితలు 

************

 

తేటగీతి

కాలకంఠుడా! ధూర్జటి! గాములదొర!

అంజలి ఘటించి వేడెద మగ్గికంటి!

దీవెన లొసంగి రక్షించు త్రినయనుండ!

జోత లివియే మహేశ్వరా! శోభనిమ్ము.

 

వెంకట్ సి. హెచ్ - తెలుగు తేనియలు

 

తేటగీతి

శివశివాయని బిలువగ స్థిరమనమున

శుభములన్గూర్చి కాచెడు శూలపాణి;

నీదు నామ మహిమ నెన్న నీలకంఠ

చాలదుగ నాదు జన్మంబు  ఫాలనేత్ర!

దేవికా చల్లా  - తెలుగు తేనియలు

 

తేటగీతి

వేష భాషలు చూడంగా వగలు జాస్తి

మాట పలుకులు వినంగ మంచి  నాస్తి

అట్టి వానిని  విడుచుటే గట్టి శాస్తి

నీతి నియమాలు మనిషికి నిజము ఆస్తి

 

మాసురేష్ - తెలుగు తేనియలు

 

ఆట వెలది

 

ఆస్తి కొరకు ఆశగాచూచువానికి 

ఆత్మబంధువులు నాస్తిగుండు

అధికధనముపైనఆసజాస్తిగ నున్న

ఆపదలచె గొప్ప శాస్తి జరుగు

 

హేమలత - తెలుగు తేనియలు

 

ఆస్తి వదలుచు వెడలెను నడవి పట్టి

నాస్తి చూడక ముదముగ నాతి తోడ

జాస్తి గర్వము చెందిన చపలు నకును

శాస్తి చేయగ వెడలెను శరము పట్టి

రామ బాణము తోడను రమణి కొరకు

ఆర్. సాయిలక్ష్మి - తెలుగు తేనియలు   

 

తేటగీతి

 

ఆస్తి కులనంగ నెవరన  నార్తి తోడ 

నాస్తి దైవమే యనువారి నలుపు మాన్పి 

జాస్తి గ భగవంతుని సేవ జరుపు జనుల 

శాస్తి లేక శుభము గల్గు మస్తు గాను 

యనుచు ప్రవచించి నివసించు యతులు భువిని.

నలుపు = వైఖరి

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి - తెలుగు తేనియలు

 

 

సంస్కారమే కదా అసలుఆస్తి

సంసారబంధాలు నాస్తినాస్తి

ధనము కూడబెట్ట ఆశజాస్తి

కలదేని జరుగు జీవితాన తగినశాస్తి!...

 

రాంమోహన్ నిజామాబాద్ - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

ధర్మమే తన ఆస్తిగా ధర్మజుండు/

శత్రు భావన నాస్తిగజాత శత్రు/

వని  ప్రపంచమే మెచ్చ కోపమున దురభి/

మాన దుర్యోధనుడి గర్వమతిశయించి/

జాస్తి గాగ రణంబున జరిగె శాస్తి

 

వారణాశి శ్రీలేఖ - తెలుగు తేనియలు

 

 

గేయ రచన,

 

 పుణ్య కార్యములు నాస్తిగను

పాప కార్యములు జాస్తి గ చేసి,

ఆస్తి ని సంపాదించిన వారికి

నరకలోకమందు జరుగును తగు శాస్తి.....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి - తెలుగు తేనియలు

 

 

కలియుగ భారతం NRI అల్లుడు గూర్చి

కందంలో నా సమర్పణ

 

ఆస్తిని చూసివ్వ సుతని

నాస్తి ఎనయు వారచటని  నానా హింసల్

జాస్తిగ అల్లుడు పెట్టన్

శాస్తిని చేయక పరువని సాకులు యేలా

 

ఎనయు : ఎదురు , అడ్డు

 

సతీష్ - తెలుగు తేనియలు

 

 

 

 

నిధి కన్న రాముని సన్నిది గొప్పది అని త్యాగ రాజు పలుకు సందర్భము

 

(ఆస్తి) యున్న సుఖమా యవనిలోననిదుర  నుండబో దెప్పుడు దండి గాను

(నాస్తి(కత్వమువారు నమ్మబో రెప్పుడు గానిట్టి  మాటలు ఖలము లోన

(శాస్తి) కలుగ బోదు  (నాస్తి)క త్వంబున్న వారికి నెప్పుడు వసుధ లోన

(ఆస్తి)కులైనను (నాస్తి)కు లైనను వేల్పు వాకిటియందు వేరు కాదు

 

వినుము రా(జా స్తి)రము తోడ, ఘనత నిచ్చు

దైవ స్మరణ మెప్పుడు దీప్తి నిడును

నిధులు వలదయ్య , నా రాము ని కృప చాలు

ననుచు త్యాగయ్య పలికె భూ నాధుని గని

 

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

ఆస్తిఐశ్వర్యమున జేస్తినమితభోగ

 లాలసల్, యాస్తి నాస్తాయె కాలగతిని!

 జాస్తిగ ననుదోచినవారె శాస్తి జరిగె

 ననుట, చాటెన్ గద  నరుని నాల్కతీరు!!

 

*4 వ పాదయతి అఖండ యతి

 

తే. గీ. డా. నాగులపల్లి - తెలుగు తేనియలు

 

 

తేటగీతి భారతార్థంలో

 

ఆస్తి యంతయు జూదాన హస్తగత ము

కాగ రారాజు ధర్మజు( గదనమందు

నాస్తి చేసెద ననియెంచి,జాస్తి గాను

తలపడగ శాస్తి జరి గె ధర్మ మహిమ.

 

డి.రామ నాగేశ్వరరావు - తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాల

 

నాస్తి క వాదమెంచుదురు నాశము కోరుచు దుష్ట వర్తనుల్

ఆస్తి యె నాది నాదనుచు హద్దు లెరుంగని స్వార్థ బుద్దులన్

జాస్తి గ కుట్ర బూని ధన జాడ్యము పెచ్చగ పిచ్చివారలౌ

శాస్తి ని బొందరే తుదకు సర్వము దానము జేయ పూనినన్!

 

వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు

 

 

నాస్తి కులెల్ల జేరి వింత పోకడలతో

జాస్తి గా వ్యర్ధ ప్రసంగములు జెప్పి, తగిన

శాస్తి గా వితండ ప్రయోగములు జూపి

ఆస్తి కులను మార్చె ఈ కలి భువి లో

 

వి. వి. శ్రీనివాస్ - తెలుగు తేనియలు

 

 

తరువోజ

 

ఆస్తి యందభిమాన మత్యాశ యగునె అర్థమే సర్వస్వ మనెడి తలంపు

జాస్తిగా యుండిన శాంతి కోల్పోయి చరిత హీనుడగునే సంపూర్ణముగను

నాస్తికుని పలుకు నైరాశ్య మైన నవ్వులాటగ యుండి నశ్వర మగునె

శాస్తి గూరినపుడు జ్ఞానము కలిగి సర్వేశ్వర తలంపు జ్ఞప్తికి వచ్చు

 

వెంకట్.సి హెచ్ - తెలుగు తేనియలు

 

 

కందము

ఆస్తి బహుళముగ నుండిన

నాస్తికునిగ దాన మిచ్చు నర్మి లెరుగకన్

జాస్తిగ ధన మోహితునికి

శాస్తి జరిగి తీరవలె విషాదంబు దరిన్

 

వెంకట్.సి హెచ్ - తెలుగు తేనియలు

 

 

కందము

 

ఆస్తిని పొందగ నెల్లరు

జాస్తిగ తగవులు వరించి చంపుచు చచ్చున్

నాస్తికులై మెలగునపుడు

శాస్తిగ బొందురు నరహరి శాపము నిలలో

 

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు

 

 

గోపాలురు వేణువు పింఛము ఆస్తి

కాళింది ఆటలాడు వానికి భయం నాస్తి

పాల మీగడంటి కన్నెరాధ పై మోజు జాస్తి

వెన్నమనసుల దొంగకి అమ్మ తన్నులే శాస్తి !!!

 

దుశ్శకునమున జనియించిన కుపుత్రుని ఆస్తిగ నమ్మి

పుత్రోత్సాహమున అంధుడై వంశ క్షేమమును మరచె

పాపభీతి నాస్తి , ఈసు అసూయలు జాస్తిగున్న

అసూయధనుని తండ్రికి పుత్రవియోగమే శాస్తి

 

జానకి చెర పట్టి , అనుజుని హితవు పెడ చెవిన పెట్టి

అహంకారమే ఆస్తియని చావు భయం నాస్తి యని

స్త్రీ మోహం జాస్తిగ తలకెక్కిన రాక్షస తుచ్ఛుని

అధికార దర్పమణగ కుక్షి పగలగొట్టుటయే శాస్తి

 

తను తెచ్చే లేఖలపై నాకు మోహం జాస్తి

కార్డులు, పెన్నులు, కవర్లకై కరిగించా నాన్న ఆస్తి

ఉత్తరాల మోజున పడి అయింది నా చదువు నాస్తి

పరీక్షల్లో వచ్చిన సున్నాలతో తెలిసింది నా మస్తీ

సున్నాల చీపురుతో చేసింది మా అమ్మ నాకు  శాస్తి

 

విష్ణుప్రియ - తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

 

ఆస్తి కొరకు జనులు అర్రులు జాచును

నాస్తి యన్న నిజము నమ్మ రేల

జగము నందు మనకు జాస్తిగ నుండిన

శాస్తి జరుగ మునుపు సాయమిడుమ

 

ఉత్పలమాల

 

ఆస్తిని నమ్ముచున్ జనులు అద్భుత రీతిన మోసగింతురే

నాస్తిగ దెల్పినన్ వినక నమ్మని మూర్ఖుల నేమి యందుమే

జాస్తిగ సంపదల్ గలిగి సంబర మొందును తోడు వచ్చునా

శాస్తిని బొందగా సతము చక్కగ దానము జేయుచుందురే

 

కందము

 

ఆస్తిగ భక్తిని నింపుకు

నాస్తిగ భవ భోగములను నరులిల గనినన్!

శాస్తికి తావే యుండదు

జాస్తిగ సంతసము బొందు జగమున నెపుడున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి - తెలుగు తేనియలు

 

చంపకమాల - 1️

 

వెలుగులు లేని సంపదల వెల్లువలౌ మరిపించు నాస్తిగా

కలగనవోలె మాధురులు కన్గొన ఓషధులాస్తులాయెని     

శ్చల తపమందు మానసము చల్లని వెన్నెల శాస్తులై సదా    

జిలుగులుకోలుపోక ఒకజీవితకాలము వెల్గు జాస్తియై !!

 

ఉత్పలమాల - 2️

 

ఆస్తులు లేవు సంపదల వాంఛలు లేక విలాసగేహముల్ 

నాస్తి ! సుధాంశుకాంతముల నందనసీమన హాటకంబులౌ  

కస్తురికాపరీమళపుకంజన లెన్నియొ సంభ్రమంబులీ       

శా ! స్తిమితంపుమంజువులు జాస్తులుగా బరిపూరితంబులై !    

 

మత్తకోకిల - 3

 

ఆస్తిపాస్తులు తోటి సంపద నాస్తి !భక్తియు వేదముల్     

మస్తకంబున చెంగలించక  మౌఢ్యముల్ మరి జాస్తియై  

నాస్తికుల్ మది వింత భావమనంత వేదన శాస్తియై    

పుస్తకంబుల జ్ఞానమార్గము పొంకముల్ మరి జూపగా                    

విస్తరించిన సారముల్ కురిపించు చేతన యుక్తమై

 

కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు

 

ఆశ మూరెడు ,ఆస్తి బారెడు

ఆస్తియే  సర్వమూ , పరమావధమని

జాస్తిగా అడ్డదారులతో సంపాదించుచు

నీతి , నియమములకు నాస్తి పలుకుచు , కొందరు

తగిన శాస్తితో కటకటాలను లెక్కించు చుండిరి గదా.

 

మురళి మోహన్  - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

ఆస్తి జాస్తిగ పెరిగిన నహము హెచ్చు

యహము హెచ్చిన జేరును యవగుణములు

జీవితమున శాంతియె నాస్తి చేసుకొనుచు

తగిన శాస్తి పొందితిమని తపన చెంది

మర మనిషి వోలె జీవించు మనుజుడిలను

 

అవళూరు సీత - తెలుగు తేనియలు

 

1.

నాది నాది అనుకున్న నీ ఆస్తి నీది కాదు ఓ మనసా,

నీకున్నదంతా నాస్తి నాస్తి అని తెలుసుకో ఓ మనసా,

స్వాభిమానము నాకు జాస్తి అని చెప్పుకోకు ఓ మనసా,

పాప కర్మలకు తగు శాస్తి పొందుట తప్పదు ఓ మనసా,

అచలుని  అస్తిత్వం  గుర్తించి బాగుపడు  ఓ మనసా,

తెలివి లేక మనిషి జన్మ వృథా యని మేలుకో ఓ మనసా .

2.

ధర్మాచరణమే యుధిష్ఠిరుడి ఆస్తి పాస్తి,

దుష్టచిత్తము దుర్యోధనునికి మహా జాస్తి,

కర్ణునికి సంపదల మీద మోహము నాస్తి,

కురుక్షేత్రంలో అధర్మానికి జరిగిందిలే శాస్తి.

 

కె మల్లికార్జున రావు - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

పరుల ఆస్తిని  కనినంత బాధ వలదు

నాస్తి  నీకని తలవకు, నరుల యాస్తి

జాస్తియన వారి పుణ్యమిచట ఫలించె

యని గనుము, మరచిన శాస్తి యగును నీకు

 

సతీష్ - తెలుగు తేనియలు

 

మన ఇతిహాసాలు మనకు చెబుతున్నాయి....

స్వాభిమానం,దురహకారం కాకూడదని. జాస్తి...

వివేకం, విచక్షణ కాకూడదని నాస్తి...

ధర్మాచరణమే అవుతుంది గా తరగనంత ఆస్తి...

లేకుంటే చేస్తాడు భగవంతుడు మనకు తగిన శాస్తి.

 

ఉష - తెలుగు తేనియలు

 

ఆస్తి కోసం ఆరాట పడువానికి

ఆత్మబంధుత్వం నాస్తి గుండు

అపార ధన సంపాదన మోహం

జాస్తిగైన అపాయములలో చిక్కి శాస్తి జరుగును

 

రచన :డి. వి. హేమలత - తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాల

 

ఆస్తిని పంచి తా నిలిచె నగ్రపథంబున దానకర్ణుడై

జాస్తిగ కౌరవుల్ దరిన సాయము జేయ నధర్మతుండయే

నాస్తిక వాదమున్ నెరపు నల్గురి జెంతన కర్ణ జేరగా

శాస్తి నొసంగినే కడకు శౌబుడు మృత్యువు హేతువయ్యనే!

 

వెంకట్. సిహెచ్ - తెలుగు తేనియలు

 

 

సర్వము జగత్తున నాస్తి  యని తెలిసియు

ఆస్తి పాస్తులను జాస్తి గా పెంచుటకై నాసక్తి చూపి

మస్తిష్కమున నిరతము దురాలోచన సేయ

తగిన శాస్తి  జరుగునే అంత్యమున ! మేలుకొననిచో

 

లలిత దీక్షిత్ - తెలుగు తేనియలు

 

 

కందము

జాస్తిగ నార్జించ దలచి

యాస్తి నొకరుడు దలపెట్ట నన్యాయములే;

శాస్తిని జేయగ దైవమె

నాస్తిగదా నిటను బొందినదనుచు వగచెన్!

 

కందము

నే వేభంగుల జాస్తిగ

నీవే నాకాస్తి యంచు నిరతము గొల్తున్;

నే వలగొని మోహము నీ

సేవల విడువ; తగు శాస్తి సేయుము కృష్ణా!

 

కందము

జాస్తిని జస్తినటంచును

శాస్తిని సస్తినని వ్రాయు ఛాత్రులు దొరికెన్;

ఆస్తిని యస్తి యనునయా

నాస్తి యని బలుక మనంగ నసితను నకటా!

 

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 

నాస్తి కునికి ఎంత ఆస్తి ఉంటేనేమి

దాన ధర్మాలు చేయ లేని నాడు

జాస్తిగా తిని అరిగించుకోలేక

రోగాల పాలయిననాడు

తగిన శాస్తి జరిగిందని అందరూ

తూలనాడిన నాడు

ఎవరూ నీ వెంట రానినాడు

నీ డబ్బు కూడా

 ఉపయోగపడని నాడు

ఎంత వగచి ఏమి లాభం.

 

తనకున్న దానిని పదిమందికి పంచుకున్నప్పుడే కదా తృప్తి.

అది తెలుసు కున్న వాడే కదా జ్ఞాని

 

డి. నాగమణి - తెలుగు తేనియలు

 

 

ఆస్తిని పొందగ నెల్లరు

జాస్తిగ తగవులు వరించి చంపుచు చచ్చున్

నాస్తికులైమెలగునపుడు

శాస్తిగ బొందెదరు దైవ శాపము నిలలో

 

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు

 

 

కరుణించవా..!


అనుబంధాలను జతచేసేది నువ్వే..

అన్ని బంధాలకు దూరంగా

లాక్కుపోయేదీ నువ్వే..!

అన్నీ తెలుసుకోవాలనే

జిజ్ఞాసను రేకెత్తించేది నువ్వే..

ఏమీ తెలుసుకోలేని

అజ్ఞానంలో ముంచెత్తేదీ నువ్వే...

మాయామేయ జగత్తులో

మత్తులో ముంచేదీ నువ్వే..

అన్ని మాయలనూ త్రుంచి

నిరోమయుడను చేసేదీ నువ్వే..!

మాకు బ్రతుకు పాటను

ఆలపించే అవకాశమిచ్చి

నీవు మాత్రం ఆటగా

పాటను చూస్తూ

వినోదిస్తూ ఉంటావు..

పాట కోసం మా పాట్లేమిటో...

నీ ఆట ద్వారా నువ్వు చూపుతున్న

బాటేమిటో..

తెలుసుకోలేని మా అజ్ఞానాన్ని

మన్నించవా మహాదేవా..!

కరుణించవా పరమశివా!!

 

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 

భక్తి సినిమాల ప్రభావం ఇతివృత్తంగా...

 

మత్తేభం

 

మనిషౌ దైవము దివ్యమౌ విధము ప్రేమారన్గనన్, రక్కసుల్

దునిమన్నంత మహీదరుం డురకగన్ దుర్మార్గ సంహారమున్

తనివింతీరగ దైవలీల గన భక్తాగ్రేసరుల్ ముక్తులౌ

సినిమా చూచిన వారికబ్బు నిలలో శ్రేయంబులున్ సౌఖ్యముల్

 

వాణిశ్రీ నైనాల, విజయవాడ - తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

అలకలల్లనాడుచు నా కమలనయనుడు/

నాడు కౌశికు వెనువెంట నడవగానె/

లక్ష్మణుడు తోడుగా తరలగ వలదన/

వెడలె రఘునందనుడు  రక్షగ క్రతువుకు

 

వారణాశి శ్రీలేఖ - తెలుగు తేనియలు 



"అల - కల - వల - నెల"

అలకలను వలచి నెలతి పరుపును వలదని తన కరము లలిత గతిని

తలగడ వలె నిడి దరణిన తెనమణి, కలతను బడిసెను,కలవరము వ

లన నలజడి కలిగెను‌, మది వికలము బడయుచు నిపు డవగడము కలుగు

నని తెలుపుచు ఘురణము లను ఘనముగ సలిపెను,జరుగును కలహ మిపుడు

వలపుల‌ నెలతి కనుల న జలము తడిపె

వలువలను,చెదరె నుదుట నలకము నని

దశరధుడు పడతిని‌ గని‌ తలచుచు నడు

గిడెను నవరుకు హృదయము దడ దడ మన

తెనమణు  = పరుండు

అవగడము=  కీడు

ఘరణములు = ధ్వనులు

అలకము   = ముంగురులు

నవరు= అంతఃపురము

పూసపాటి - తెలుగు తేనియలు

 

 

కందము

 

అలకల సూర్పణక నపుడు

కలవరబెట్టెను విడువక ఘనుడివి రామా

వలలో వేయగ జూచిన

నెలతను తప్పించె నీవు నేర్పుగ నపుడున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు

 

                           సమాప్తం 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...