25, అక్టోబర్ 2020, ఆదివారం

దత్తపది - 49, “బాల, త్రిపుర, సుందరి, దేవి”

 


దత్తపది - 49

23.10.2020; ప్రణాళిక

దసహోర సందర్భంగా

“బాల, త్రిపుర, సుందరి, దేవి”

 

 

బాలాత్రిపుర సుందరీ దేవి

 

నవదుర్గ రూపులలో నొక రూపమైన

బాలాత్రిపుర సుందరి

బహు చక్కనైన బాలికారూపం

బంగారువన్నెగలసింగారముతో

చిగురాకుపెదవులచిద్విలాసముతో

మొగలిరేకుల జడతో ముద్దుగానుండు

కమలవాసినియై కనిపించు బాల

కాటుకద్దినకలువ కన్నులతో

కరుణనుకటాక్షించు కల్పవల్లి

అభయహస్త ముద్ర, అక్షరమాల

ధరించిన కరములతో కొలువుండి

కొలిచి నంతనే కోరికలు తీర్చుచు

మానసిక రుగ్మతలను మదినుండితొలగించి

నిత్యసంతోషమునిచ్చునీ బాల

శ్రీచక్రములోని త్రిపురాత్రయములో ఆదిదేవతయేగాక,

షోడశవిద్యలకు అధిష్టానదేవతయిన

ఆమెనర్చిస్తే జ్ఞానమునుకలిగించు

శివస్వరూపముతో ఛైతన్యమునిచ్చి

పరబ్రహ్మత్వం వైపు నడిపించు.

 

హేమలత తెలుగు తేనియలు

 

 

కందము

బాలా త్రిపురః సుందరి

నీ లీలలు మమ్ముగాచు నిరతము దేవీ

లాలన పాలన జూచుచు

కోలా హలమును నిలుపుము కూరిమి తోడన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

అక్షరమాలా ధారిణీ బాల,కన్యకా హంస వాహినీ

త్రిపురాసుర సంహారిణీ , త్రిపురాంతక పురవాసిని

త్రిశక్తి స్వరూపిణీ  రాణి , సుందరి షోడసి భామిని

మనోవికార నియంత్రిణీ అమ్మ, ఆయురారోగ్య ప్రదాయిని !!

శ్రీ లాలితాంబిక రూపిణి , శ్రీ బీజాక్షర నివాసిని

శ్రీ రాజరాజేశ్వరీ దేవీ, వరములివ్వు  వరదాయిని

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు

 

 


కందము

శైలసుత త్రిపుర సుందరి

మాలిని చండిక భవాని మంగళ దేవీ

యేలిక నీవని పిలిచెద

బాలవు నీవని కొలిచెద పార్వతి నిన్నే

రమ తెలుగు తేనియలు

 

 

లలితా బాల త్రిపుర సుందరీ దేవి కి నమసులతో

సీసము

జ్ఞాన, యిచ్ఛా, క్రియా శక్తి రూపముగ ప్రభవించి శోభిత బాల త్రిపుర

సుందరి దేవియై శోభ నిచ్చి నిలిపె డాది పరాశక్తి! యభవ మిమ్ము

సృష్టి, స్థితి, లయల నేలెడి లలితాంబ! ముల్లోకములు గాంచు మూర్తి నీవె!

స్థూల, సూక్ష్మ, పరమ్ము షోడసి రూపమై వెలుగొందెడి భవాని! వెలుగు లిమ్ము

పావనంబైన రూపంబు బాల త్రిపుర

సుందరీ దేవి నామమై జ్యోత్స్న మొసగి

దేవతలచే కొలవబడు దేవి! మమ్ము

గాంచి కాపాడ వోయమ్మ! కరుణ జూపి

 

వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు

 

 

 

తేటగీతి

బాల! త్రిపుర సుందరి! దేవి! భక్త తతుల

కోరికలు దీర్చి సర్వదా కూర్మి మీర

జగముల సుఖ శాంతులు నింపు పగలు లేక

అసదృశ కరుణ శుభము ల నొసగు మమ్మ!

 

డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 

 

తేటగీతి

హంస వాహిని! లలితాంబ! హరువు నిచ్చి

దీప్తి నిమ్ము రాజేశ్వరీ దేవి! త్రిపుర సుంద

రీ! మనో వికారపు నియంత్రిణి సతతము

మము నిలుపు వరదాయినీ! మహిమ జూపి

 

వెంకట్ సి. హెచ్ తెలుగు తేనియలు


 

 

వలదు విచారము ద్రౌపదీ,అడ(బాల)  రూపమందున్నశూరుడు సతతము

పగతోటి రగులుచు సెగలు కక్కుచు నుండె, దుష్ట కీచకునికి కష్ట కాల

మొచ్చెను, తెలుపు  నీ యిచ్చ  నతనికి రా(త్ర్రి   పుర)ము నిదురలో తేలి యాడు

సమయాన నర్తన శాలలో (సుందరీ)  నాతనిన్ ఘనముగా నాదరించ

వలయు (దేవి)రించిన నీవు వ్యర్ధమగును

మనదు పన్నాగము, తెలుసు కొనుము దేవి

భీముడా తనిన్ చంపి నీ బెడద తీర్చు

ననుచు పలికె రమణితోడ నర్జునుండు

 

సందర్భము:  కీచకుడు బాధించు చుండగా  అర్జునుడు పలుకు సందర్భము 

సుందరి  అను  పదము అన్యార్ధములో కుదర లేదు.

అడబాల=  వలలుడు  వంటవాడు(భీముడు)

దేవిరించు+ విలపించు

 

పూసపాటి తెలుగు తేనియలు

 

బాలకాండమున నెలబాలునికై మారాముజేసిన రాముని జనక పుత్రి పురవీధులనడచు  చుండ ఓరకంటన్  జూడ నా సుందరి మనమెఱింగి శివదనుర్భంగముగావించి భూ దేవిసుతన్ జేపట్టిన రామచంద్రా వందనమిదె!

 

కె ఎల్ కె రావు తెలుగు తేనియలు

దత్త పది వచన కవిత

 

అమ్మా బాలా త్రిపుర సుందరీ దేవీ,

వేడుకొనగ నీ చెంతకు చేరినాము.

 

సొంపైన తేటగీతుల గీతములతో,

సొగసైన ఆటవెలదుల భంగిమలతో,

నీ ఆస్థాన రంగమంటపము నందు,

నాద నాట్య నీరాజనము చేసెదము.

 

చంపకమాలల ఉత్పలమాలలతో,

సౌభాగ్య సుందరిగా నిన్నలంకరించి ,

హృదయమంత మురిసి పోదుము.

 

శార్దూల మత్తేభముల కవనముల,

వారువుములపై  నిను ఊరేగించి,

పులకించేము పరవశించేము దేవి.

 

తరువోజలు సీసములు అక్కరలు,

దీర్ఘ ఉత్సాహములతో నిన్ను కీర్తించి,

నీ భక్తిధారలలో  మునిగిపోయేము.

 

శ్రీచక్ర త్రిపురాత్రయ ప్రథమ దేవతా,

ఓ షోడశ విద్యల అధిష్ఠాన దేవతా,

శ్రద్ధతో బాలార్చన పూజ చేసెదము.

 

 

 త్రిపురాంతకు సతివై సంప్రకాశించ,

గౌరీ దేవీ త్రిపుర సుందరీ, కరుణను,

అభయ హస్త మందించుమా మాకు.

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు


 

తేటగీతి

బాల  త్రిపురసుందరి దేవి ! బాల చంద్ర!

యభయ ముద్రతోజగతికి నభయ మొసగి

వరద ముద్రతో  దయ జూపి వరము లిచ్చి

జ్ఞాన సంపద నొసగునె సంతసముగ

 

బాల !నీపూజ లిచ్చును ప్రాణ శక్తి

త్రిపురములకు నధిష్టాన దేవి నీవు

సుందరి! దరి జేరగ నిమ్ము సుఖము, శాంతి

దేవి! ముక్తిని పొందగ దీవెన లిడి

గాచుము త్రిపురసుందరి ! గౌరి ! శరణు

 

అవళూరు సీత తెలుగు తేనియలు

 

 

తేటగీతి

బాల త్రిపుర సుందరి దేవి! ఫలము నియ్య

మమ్ము రక్షించ రయముగ రమ్ము నీదు

లీలలెరుగ నీ నామాల మాల లల్లి

యర్చనను జేసి రూపంబు యార్తి తోడ

మనము నందున నిలిపెదన్ మర్మ మెరిగి

దశను మార్చగ రావమ్మ దశిమి రోజు

 

పద్మలత మున్నంగి తెలుగు తేనియలు

 

 

 

 బాల, త్రిపుర, సుందరి , దేవి లెండి రండి తలస్నానమాడి

శుభ్రమైన దుస్తులను ధరించి, పరిశుభ్రమైన మనసుతో కూర్చోండి .

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మని భక్తితో పూజించి

బాల త్రిపుర సుందరీ దేవి పాటలన్నీ పాడుదాము !

హారతిచ్చి అందరినీ ఆదరించమని వేడుకుందాము.

 

జి మురళీ మోహన్ తెలుగు తేనియలు

 

 

రామాయణ ఇతివృత్తంగా..)

ఉత్పలమాల

 

కట్టుబడేనదే విశద కర్కశ మానసి కైక కోరగా

పట్టుగ రామభద్రుడట; వారిజ నేత్రి! పురాకృతమ్మిదే

నిట్టుల బోవగా యనగ; నీకొని సుందరి సీత కానకున్

గుట్టుగ తాగమించె ననుకూలముగా పతి తోడ బాలయై!

 

చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

 

కలికి మంజులపదమందు కురిపించు కరుణాకటాక్షకాంతులలరగన్  

లలితకు విరిమాలల స్వరరాగముల కొలిచె సేవంతికాభూషిత 

కలితమౌ మరాళంబు భవచ్చితకల్లోలమాధురీ సంగతమై 

కలిమిని, ఘనకీర్తిని చిరకాలము  కాంతిపుంజముల మనోహరంబై 

వెలయు బాలాత్రిపురసుందరీ దేవి  విభవమునెంచిన మానసమున్ !

కొలిచిన యొసగున్ జననిగ కోరిన కోర్కెలు సౌమ్యకటాక్షములన్ 

 

కస్తూరి శివశంకర్  తెలుగు తేనియలు

 

గేయ రచన,

 

జనక రాజ పుత్రి పురమందు తన సోదరునితో,

తిరిగాడు నవయువ బాలకుని గాంచి ఆ

సుందరి మనంబునందేవిషయమో,

కదలి ముప్పిరి గొనసాగెన్...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు

 

సమాప్తం


1 కామెంట్‌:

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...