20, అక్టోబర్ 2020, మంగళవారం

స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలామ్ గారి జన్మదినం

 



15.10.2020

స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలామ్ గారి జన్మదినం సందర్భంగా

 

జాతి గౌరవమ్ము జగతికి దెలిపెను

ఘనమగును కలాము ఘనము ఘనము

నీతి తోడ నతడు ఖ్యాతి గడించెను

దేశ మెల్ల మెచ్చు తేజమతడు

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు

 

ఏ.పి. జే.అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా కవితా నీరాజనం.

కలాం! అందుకో సలాం(శీర్షిక)

ఆదర్శ శాస్త్రవేత్త! స్ఫూర్తి ప్రదాతా

 నీ తండ్రికి ప్రథమ పుత్రుడ వు కాకపోయినా

మన దేశానికి ప్రథమ పౌరుడిగా  ఎదిగావు

పదవీ గర్వము చూపక  పసివాళ్ళతో మెలిగావు

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పొందావు స్ఫూర్తి

ఆచార్యుడవై యువతలో రగిలించావు చైతన్య దీప్తి

భారత రక్షణ శాఖ చేసుకున్న పుణ్య ఫలమే మో?

పైలట్ ఉద్యోగానికి అనర్హుడ వైనా వు

దేశం కోసం కలలు కన్న సుందర స్వాప్నికు డివి

కలల సాకారానికి తపించిన నిత్య శ్రామికుడివి

అరుదైన రాకెట్లను, మిస్సైళ్ళ ను రూపొందించి

అద్భుతమైన అణు పరీక్షలు నిర్వహించి

భారత ఖ్యాతిని అంతరిక్షంలో నిలిపావు

భారత శక్తిని ప్రపంచానికి చూపావు

హృద్రోగులకు స్టెంట్లను,వికలాంగులకు కృత్రిమ పాదాలను

పేదలకు చౌకగా అందించ కృషి చేసిన మానవతా మూర్తివి

అగ్ని,పృథ్వి వంటి క్షిపణులను కన్న ఆజన్మ బ్రహ్మచారి వి

మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా

భారతీయు లందరి ప్రేమాభిమానాలు అందుకున్నావు

నీ సౌ శీల్యంతో  పదవులకు, బిరుదుల కే వన్నె తెచ్చావు

నీ వడుగు పెట్టిన రోజు స్విట్జర్లాండ్ సైన్స్ డేగా జరుపుకున్నా

నీకునలభై ఆరు విశ్వ విద్యాలయాలు డాక్టరేట్లు ఇచ్చినా

భారత దేశం పద్మ విభూషణ,భారత రత్నాలతో సత్కరించినా

వాటిని అవి సన్మానించుకొని పొందాయి ధన్యత

నీకు తప్ప ఇంకెవరికి ఉందిలే అర్హత

నిత్య జిజ్ఞాసువు నువ్వు

స్వచ్ఛమైన స్వాతి ముత్యానివి నువ్వు

మచ్చలేని ధన్య జీవివి నువ్వు

రామేశ్వరము నకే కాదు యావద్భారతావని కే ముద్దు బిడ్డ వు నువ్వు

అందుకే అబ్దుల్ కలాం! అందుకో మా సలాం.

 

డి.రామ నాగేశ్వరరావు - తెలుగు తేనియలు

 


 

 అబ్దుల్ కలాం గారిపై కవిత

 

రామేశ్వరం లో పుట్టి రాత్నం లా మెరిశాడు

పేదకుటుంబములో పుట్టినను వున్నతపేరును గడించాడు

అంతరిక్ష శాస్త్రవేత్తగా అందరి అంతరంగాలలో నిలిచాడు

ప్రోక్రాన్ -11అణుపరీక్ష విజయానికి పొంగిపోవు కారణభూతుడయినాడు

మిస్సైల్ మ్యాన్ గా నిలిచి కీర్తి పతాకాన్ని నింగిన ఎగురేశాడు

పదవులెన్ని వరించినా వలదని వారించాడు

రాజ్యపదవికన్నా రక్షణ పరిశోధన ముఖ్యమని చాటాడు

రాష్ట్రపతిగా ఎన్నికై రారాజుగా నిలిచాడు

ఆపద్భాంధవునిగా నుండి ఆశ్రీతులను ఆదుకున్నాడు

టాన్జేనియా చిన్నారుల గుండె చికిత్స చేయించి

వారి హృదయాలను గెలిచాడు

అణ్వస్త్రరాజ్య సరసన భారతాన్ని నిలిపాడు

భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణాల బిరుదుల పల్లకిని ఎక్కాడు.

ఎన్నివున్నాను నిరాడంబర జీవితాన్నే గడిపాడు.

 

డి. వి. హేమలత - తెలుగు తేనియలు

 


 

అబ్దుల్ కలాం

 

"కలలు గను నిజం చేసుకో" మంటూ

స్వప్న సాకారాకాంక్షితులకు

నిత్యస్ఫూర్తి నీవు

యువతను మేల్కొల్పి మొద్దునిద్దర

నొదిలించు చెర్నకోల వైనావు

 

జ్ఞాన వితరణ ఒక వరమంటూ

మేటి ఆచార్యుల కాదర్శం నీవు

భారతరత్న నొంది నిరలంకార

శోభకు నిదర్శనమైనావు

 

జాతి భేద మెరుగని భరతమాత

ప్రథమ పౌరుడు నీవు

భూషణాలకే భూషణమైన

పద్మవిభూషణుడివైనావు

 

కులమతాల రొచ్చులో కొట్టుమిట్టాడుతున్న

మతమౌఢ్యులకు చెంపపెట్టు నీవు

అపూర్వ అస్త్రాలనందించి

దేశమాతను సబలను చేసినావు

 

వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు

 

 

నేడు (15-10-2020) భారతదేశం గర్వించే  మేటి నాయకుడు, శాస్త్రవేత్త స్వర్గీయ అబ్దుల్ కలాం గారి 89 వ జయంతి సందర్భంగా (ఖండిక)  

 

కస్తూరి శివశంకర్

 

ఉత్పలమాల 1️

సత్యము సంస్తుతింప ! మనసార కలాముకు వందనంబిడున్ 

నిత్యము మాకు స్ఫూర్తినిడు నీ హితసౌరభ వాక్కులేను; సాం 

గత్య మహాప్రభావపుప్రగల్భత జీవనయానమందు, సా 

హిత్యము, శాస్త్ర జ్ఞానము; సహేతుకమై వికసించె భారతిన్ ! 

 

Wings of Fire లోని సుప్రలాపములతో

 

శార్ధూలము 2️

 

శక్తిన్ శౌర్యములన్ తలంపున నిరాశా వీచికల్ చేరకున్          

యుక్తాయుక్త విచారముల్, విపులమై  యోచింప విన్యాసముల్    

యుక్తుల్ శాశ్వతమంటు నేర్పితివి ! పీయూషంబు వొల్కంగ;  /

సక్తిన్ జ్ఞానవివేక మార్గముల నీ సంప్రీతి !! అబ్దుల్ కలామ్  

 

 శార్ధూలము 3️

 

ప్రాతఃకాలము ప్రస్ఫురిల్లి,  ప్రతిభా భాస్వంతమౌ తేజముల్

చైతన్యంబులు దీప్తిలే రగిలినన్  సంప్రీతిగా జ్ఞానముల్ 

చేతంబున్ మెదిలేటి శాస్త్రగరిమల్ నే రీతి కొల్వంగనే    

చాతుర్యంబు శతఘ్నులై చెలగు నాశాస్యంబు నీ రూపమై  

 

భరత భూమిలో జనియించు పాజ్ఞుడీవు 

శాస్త్ర సాంకేతిక ప్రగతి సారధివయి 

సామరస్యభావంబులే సంతసమ్ము   

పరమశాంతియు,సహనముల్ బాటజూపి 

మౌని "అబ్దుల్ కలాము" సమ్మానితుండు 

 

కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు

 


 

మిస్సైల్ మనీషిగా ఎదిగి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండిన స్ఫూర్తిప్రదాత

శ్రీ అబ్దుల్ కలామ్ గారికి నా అభిమానాపూర్వక అక్షరార్చన

 

రమేశ్వరము నందు ఉదయించేనొక చిన్ని బాలుడు

తల్లి దండ్రుల కలల సాకారముగ

ఎదిగి  తాను మహోన్నత వ్యక్తిత్వ శిఖరమై

సందేశమిచ్చే యువతకు కలలను

సాకారము చేసుకొనుట కొరకు కృషి చేయమని

 

ప్రధమ పౌరుడైనను ఆడంబరమసలు లేక

చిరునవ్వుతో విద్యార్ధులకు చక్కని చుక్కానిలా

నిలచిఎన్నో సందేహములు తీర్చెను దిక్శ్చుచిలా

 

వచ్చిన పని అయినట్టు శలవ్  అంటూ

హడావిడిగావెళ్లారు

 

జనన మరణాలు మామూలు మనుషులకు

మీరు మనిషి  కాదు కదా మహాశయా మహా మనీషి

 

రమ,కంకిపాడు - తెలుగు తేనియలు

 

 

 

సలాం చేస్తున్నాం కలాంజీ

 

సలాం చేస్తున్నాం నీకు కలాం జీ,

గులాం లై పోయాము నీ వ్యక్తి త్వానికి...

 

కలలు కనమన్నావు దేశ యువతను,

కలల్ని సాకారం చేసె ప్రయత్నం చేయమన్నావు,

నిజాయితీకి నీవు నిలువుటద్దానివి, ఇజాలు భేషజాలు తెలియని మేధావివి, నీ నిరాడంబరత

నేటి యువతకు ఆదర్శం..

 

నీ మేధా సంపత్తి దేశానికి తిరుగులేని ఆయుధం,

భారతీయ సైనిక అంబులపొదిలో క్షిపణి ని పొదిగి,

శత్రువుల గుండెల్లో మిసైళ్లను పరిగెత్తించావు,

పదవికే అలంకారమైన ఓ భారతమాత ముద్దు బిడ్డా,

భారత రత్నమా నీ జీవితం మానవాళి కే ఆదర్శం...

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి - తెలుగు తేనియలు

 

 

 

మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాంకు విజయ వందనం.

 

శాస్త్ర సాంకేతిక  పరిశోధకునివై,

భారత  ప్రజా రాష్ట్రపతి వై,

విద్యార్థుల మార్గనిర్దేశకునివై,

ప్రేరణ గ్రంథాల రచయితవై,

మేయ ప్రతిభావంతుడివైన,

మహోన్నత వ్యక్తివి నీవు.

   

భారతదేశ సామర్థ్యమును, విశ్వమునకు  చాటి చెప్పిన,

అసామాన్య ప్రజ్ఞాశాలివి నీవు.

 

రామేశ్వరం నుంచి రాజధాని  వరకు,

పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ,

సాగిన నీ జీవన ప్రస్థానం మాకు స్ఫూర్తిదాయకం.

 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న, నీ స్వభావం మాకు   మార్గనిర్దేశం.

 

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి

అన్న  నీ నినాదం మాకొక  ఆత్మవిశ్వాసం .

 

అగ్ని, పృథ్వీ  వంటి మిస్సైల్స్ ను నింగిలోకి విసిరావు,

పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర వై నిలిచావు .

 

పదవి కాంక్ష లేక   అడంబరత లేక,

విద్యార్థి లోకానికి  చేరువయ్యావు.

విశ్వ విద్యాలయాల్లో ఉపన్యసించి ,

విద్యార్థులను ఉత్తేజపరిచావు నీవు,

బోధిస్తుండగనే ప్రాణములు విడిచి.

సుదూర దూరాలకి వెళ్లిపోతి వీవు.

 

నిరంతర కృషీవలుడా  భారతరత్న,

నీవు గడ్డపై పుట్టడం ,

మాకొక గర్వకారణం, విశిష్ట గౌరవం,

సాటిలేని నీ ఉనికికి నా లాల్ సలాం.

 

CA కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు

 

సామాన్యుడిగా పుట్టి నీవు

మాన్యుడిగా ఎదిగావు

 

వార్తలు పంచే బాల్యం నుంచి

వార్తల కెక్కే ఖ్యాతి వరకూ

నీ బాట బాగుంది , పాఠంగా మారింది

 

ధనమంటే డబ్బు కాదోయ్,ధనమంటే జ్ఞానమని

మస్తక ఖజానాని విజ్ఞానంతో నింపుకున్నావ్

 

మింటి కెగసే క్షిపణుల తో తారాతీరం తాకిన

నీ కీర్తి శిఖరం ఎవరెవ్వరెస్టులకి అందనంత దూరం

 

విష్ణుప్రియ - తెలుగు తేనియలు

 

ఆదర్శమూర్తి, కారణజన్ముడు, భరతమాత ముద్దు బిడ్డడు స్వర్గీయ అబ్దుల్ కలామ్ గారి జయంతి సందర్బంగా వారికి పాదాభివందనాలతో...

 

సీసము

తానొక యోగియై ధర యందు జన్మించె భరత మాత ప్రతిష్ఠ పరిఢవిల్ల

జిజ్ఞాస కలిగిన జినుడువలె చదువు లన్ని నేర్చి మెరిసె నబ్బురముగ

శాస్త్రవేత్తగ కల సాకార మొనరించి దేశ కీర్తి నయించె దీక్ష తోడ

అంతరిక్ష క్షిపణై హరువు తెచ్చుకొనియే అబ్దుల్ కలామయ్య యవని యందు

 

తేటగీతి

బ్రహ్మచారియై నంకిత భావమెరిగి

వృత్తిసలిపిరాష్ట్రపతిగ కృతముఖుడయి

భరత జాతి కాదర్శమై పావనముగ

దైవ సన్నిధి జేరె ప్రస్థాన మాపి.

 

వెంకట్.సి హెచ్ - తెలుగు తేనియలు

 

కందము

 

సామర్థ్యము విలసిల్లన్

ధీమంతుడుగా విభవము తెలిపె కలామే    

ప్రేమ స్వరూపము;  భారతి 

ధామంబున దివ్యమైన ధన్యత పొందెన్

 

 

మజిలీ

 

రాయివో రప్పవో

గింజవో  మెతుకువో

రూపానివో దృశ్యానివో

మనసున శిలవై

మరుపున జ్ఞాపకానివై

రాయంచ నడకవో

రతనాల సీమ రత్నానివో

అల అలలా ఎగిసే

ఇల కలలో మెరిసే

నా గొంతుకలో పాడే పాటవో

నా ఆధరాలపై తారాడే అక్షరాలవో

నే పాడే పాటలో పల్లవివో

నే ఆడే ఆటలో భంగిమవో

విచ్చుకున్న మల్లెల సుమగంధానివో

అరవిచ్చిన అందానికి దాసోహానివో

ప్రణయ రాగంలో మునిపంటి గాయానివో

విరహపువేళలో ఎదురుచూసే అభిసారికవొ

కనులను దాటిన స్వప్నానివో 

మనసు ఎల్లలు చెరిపిన మురిపానీవో

నీలవేణివో నింగిన మెరిసిన జాబిలివో

జారిన కురుల ధారల ఆర్ద్రతవో

నే మరిచిన వింజామరవో

సాగే జీవనయాత్రలో చివరి మజిలీ నీవే

 

కోవూరి - తెలుగు తేనియలు


***********

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...