23, అక్టోబర్ 2020, శుక్రవారం

“సాగరమ్ము నీరు చప్పనగును”

 

సమస్యా పూరణ

“సాగరమ్ము నీరు చప్పగుండు”

“సాగరమ్ము నీరు చప్పనగును”

 సమస్యాపాదం ఆట వెలది లో.. 

ఇదే పంక్తితో పద్య / వచన కవిత రూపాలలో పూరణలు చదవండి


తేటగీతి

వీణ జేబూని సతతము విద్య లొసగు

శారదాంబ! వందనములు చదువులమ్మ!

తెలుగు తేనియలకు జ్ఞాన దీప్తి నిచ్చి

ప్రాభవము గూర్చు భారతీ! ప్రణతులివియె

 

తేటగీతి

హంస వాహన ధారివి యమ్మ నీవు

విద్య మాకొసగు సతము ప్రియముగాను

పూజ జేయుచు కొల్చును పుడమి నీకు     

జనని కావగ రావె విజ్ఞాన మిచ్చి

 కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

స్కందమాతను పూజించు సర్వ భక్త

కోటి దివ్య కాంతుల తోడ క్షోణి నందు

దొరయు నట్లు వరములిచ్చు దుర్గ! కోటి

ప్రణతులివియె మమ్ము నిలుపు ప్రాభవముగ

 

ఆటవెలది

లవణ మధిక మైన రసము రుచిని జూడ

సాగరమ్ము నీరు చప్పగుండు

గదయని గుటుకుమని కబళభక్షణ సేయ

నాలి మోము వడలి యలకబూనె

 

దుర్భ కృష్ణశాస్త్రి తెలుగు తేనియలు

 

 

మాయ మాట లెన్నొతీయగా చెప్పుచు

మనసు మర్మ మంత మనిషి దాచి

కపట రీతి నొలుకు కన్నీటితో  ప్రేమ

సాగరమ్ము నీరు చప్పగుండు

 అవళూరు సీత తెలుగు తేనియలు


 

 

వచన కవిత

త్రాగు జలము  తియ్యగుండు

సాగరమ్ము నీరు చప్పగుండు

త్రాగు నీరు మలినము జేసిరి

మన జనులు అవివేకమునన్

అంతులేని కాయిలల పాలైరి

 

త్రాగు నీరు ఒక్క బొట్టూ లేని,

ఎడారి ప్రజలు బుద్ధిమంతులై,

సాగరమ్ము నీరు చప్పగుండుట,

మార్చి తియ్యటి నీరుగ శేయరే,

లోకమంతా భళి యని పొగడగా.

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

తెలిసికొని నర జీవులందరు భవ

సాగరమ్ము నీరు చప్పకుండు నని

విశ్వమునాడించు వేద వేద్యుని

సేవించు భక్తియె అమృత నీరమని

మసలుకొనిన ప్రశాంతత నొందగా

చిక్కుకున్న బంధముల్ వీడునులే

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

కలిపురుషుడు మహిని కంపింప చేయంగ

సాగరమ్ము నీరు చప్పగుండు

వేము తియ్యగుండు విధివైపరీత్యపు

వింత లన్ని జూచి బెదర వద్దు

రమ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

అబ్ధి జలము పొంది నంబువాహి భువిపై

వర్ష రూపముగను వదిలి వేయ

లవణ మిశ్రిత జల లక్షణము గతించి

సాగరమ్ము నీరు చప్పగుండు

 

ఆటవెలది

దినదినము యొరిపిడి వెనువెంట నుండగా

చీకు చింత తోడ జిలుగెరుగక

విలువ లేని బతుకు వెలయించు జీవన

సాగరమ్ము నీరు చప్ప గుండు

వెంకట్.సి హెచ్ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది 1️

పద్యములురచించు వ్యాకృతిరీతులన్      

స్వచ్ఛమౌ తలపులజావళీలు 

గాంచకున్న సిరుల కైతలకాంతుల 

సాగరమ్ము నీరు చప్పగుండు

 

పద్యం ఎంత ఘనంగా  వ్రాసినా, అందులో కవిత్వం లోపిస్తే ఆ కవితాసాగరం చప్పగానే ఉంటుంది కదా అన్నభావనలో

 

ఆటవెలది 2️

సరసమందు చెలియసల్లాపములయందు 

కలహమందు మధురకలతలు విహ 

రించు భావములవి లేనట్టి సంసార      

సాగరమ్ము నీరు చప్పగుండు 

 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

రుచియె దెలియకుండె రోగపు వింతిది

తిన్న లడ్డులోన తీపిలేదు!

చింతకాయ రుచియె చేదుగుండుట యేమి

సాగరమ్ము నీరు చప్ప గుండు!!

డా. నాగులపల్లి తెలుగు తేనియలు

 

 

సాగర తీర సమీపాన

తెలుసు కొనఁగ సముద్రము చేయు ఏంతో మేలు, కలిగించు మంచి ఆరోగ్యంబు!

లేవు ఆలోచనలకు అవధులు , అందుచే అవసరంబునకు

శాస్త్రజ్ఞులు సాగరమ్ము నీరు చప్పగుండునట్లును

తీయగనూచేయగలమేధస్సు వాడుదురని తెలుసుకొంటి !

జి.మురళి మోహన్  తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

సాగరమ్ము నీరు చప్పగుండు నటుల

శాస్త్రవేత్త లంత సంవదనము

సలిపి గొప్ప గాను సాధనములతోడ

మార్చగ భువి నందు మహిమ వొందు

 

జన్మమెక్కడైన చలన గమనమైన

కల్మషములనన్ని గలుపుకొనుచు

సరిత పారి చేరి సంగమించిన చోట

సాగరమ్ము నీరు చప్పగుండు.

 శిరీష తెలుగు తేనియలు

 

 

క్రమాలంకారంలో నా పూరణ :

 

రత్న గర్భ యన్నరాణించు నద్దేది?

జలముకొక్క పేరు జగతినేమి?

ఉప్పులేని పప్పు రుచి చూడ ఎట్లుండు?    

సాగరమ్మునీరు, చప్పగుండు.!!

అశ్వని కుమార్ తెలుగు తేనియలు

 

 

కదలలేని వృద్ధ వ్యాఘ్రమొకటి

కానలోన ఉన్నది

బాటసారులనాపి

మాట కలుపుతుంటది

కల్లబొల్లి మాటలతో నమ్మ

బలుకుతుందది

పసిడిమురుగు ఆశచూపి

మాయ చేస్తుందది..

ఉబ్బలిలో తోసి వాని

చంపి మింగుతుందది...

క్రూరమృగపు చేష్టలెటుల సాధువుగా ఉండు

మొసలి కన్నీటి సాగరమ్ము నీరు చప్పగుండు

విష్ణుప్రియ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

సాగరమధనమ్ము సమ్మతించిరిజేయ

సురలసురులు దలచి సుందరముగ

నంతలోన దెలిసె నమృతమ్ము బోవగ

సాగరమ్ము నీరు చప్పగుండు

 

కలత లుండు నట్టి కాపురంబున నిల

కంట నీరు మెండు గలుగు గలుగు

అట్టి విధమునున్న నాలుమగల భవ

సాగరమ్ము నీరు చప్పగుండు

 కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

ఆలుమగల మధ్య అనురాగ సంసార

సాగరమ్ము ; నీరు చప్పగుండు

రీతిగానుయున్న లీలగా గడిపిన

బతుకు దుఃఖ భావ భరిత మగును

హేమలత తెలుగు తేనియలు

 

 

1️ ఆటవెలది

 

ఊరి కొక్క కొలను ఊట కొక్క రుచిరా

నండ లేని నూరి నుండ బోకు

ఊట గుంట కాదు యూరు నాగార్జున

సాగరమ్ము నీరు చప్పగుండు

 

2️ ఆటవెలది

 

వనరులన్ని కరుగు జనత హెచ్చగనిట్లు

వైపరీత్యములవి సైప వలయు

గరిక దిని బ్రతుకులు గడుపునపుడు త్రాగ

సాగరమ్ము నీరు చప్పగుండు

వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు

 

 

నారికేళ జలము‌ కాదె నదుల‌ నీరు,

క్షార జలముతో నొప్పారు సాగరమ్ము,

నీరు చప్ప గుండును గదా బోరు లోన,

తెలుసు కొనగ రాదె తెలుగు తేనెటీగ

పూసపాటి  తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

సార మించుకన్, రసాస్వాదనేలేక

పటిమ చూపి పెక్కు పదము లల్ల

పాఠక హృది గెల్వ పసలేని కవనపు

సాగరమ్ము నీరు చప్ప గుండు

 వాణి తెలుగు తేనియలు

 

 

కలహాంతరిత ఆ-వేదన  💓

ఉత్సాహము :

 

సరసమందు చెలియ నగవు సరణి యందు కినుకతో 

మురిపెమొలకు మందహాస ముత్తెములని పంచునా 

విరహమందు వల్లరులవి పేలవంబు రుచియు  లే    

ని రససరస సాగరమ్ము నీరుచప్పగుండు,      

నిరసనలని తెలిపెనపుడు నిగ్గు నీలవేణియై  

వరములన్ని కోరి లలన పల్కరింపు తావులై

 కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు


 

సమస్యా పూరణ

“సాగరమ్ము నీరు చప్పనగును”

సమస్యాపాదం ఆట వెలది లో.. 

 

ఆటవెలది

 

చుక్క మంచినీరు చూడ దొరకకుండు

సంపదందు వారిసాటి లేరు!

ఆ ఎడారి దేశమందు యంత్రమహిమ

సాగరమ్ము నీరు చప్పనగును!!

 డా. నాగులపల్లి తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

 లవణ మధిక మైన రసమురుచిని జూడ

సాగరమ్ము నీరు చప్పనగును

గదయని గుటుకుమని కబళభక్షణ సేయ

నాలి మోము వడలి యలకబూనె

దుర్భ కృష్ణశాస్త్రి తెలుగు తేనియలు

 


ఇల ను పిచ్చి మాట లెట్టులుండుననిన

 అయ్య!వేప రుచులు తియ్యగుండు

పుట్ట తేనె చేదు పుట్టగా నుండును

సాగరమ్ము నీరు చప్పనగును.

 డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 


 ఇలను వెర్రి మాట లెట్టులుండు ననెడి

తీరు తెలుప వేప తియ్య నుండు

పుట్ట తేనె చేదు పోలిన రీతిగ

సాగరమ్ము నీరు చప్పనగును

 

ఆటవెలది

పిండతీయనగును వేపాకురసములు

మఱ్ఱిపాలు చాల మధురమగును

గంగనీరముప్పగానుండు రీతిగా

సాగరమున నీరు చప్పనగును

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు


 

 

ఆటవెలది

పరమయోగు లెపుడు పావనునామము

స్మరణ జేయు; వితతసంతత మధు

ధార లేని హృదయధామములో భక్తి 

సాగరమ్ము నీరు చప్పనగును

సతీష్ తెలుగు తేనియలు

 

ఆటవెలది

మధుర మంజులమ్ము మహిమాన్వితమ్మగు

పావనమగు భక్తి భావ జలధి

నోలలాడ ; నమృత ముప్పొంగు సంసార

సాగరమ్ము నీరు చప్పనగును!

 

ఆటవెలది

నిత్యమున్ను వెదకి సత్యమౌ పరమాత్మ

కై తపించగ జనులాతతముగ

దైవ నామమొకటి తప్ప; దైహిక సుఖ

సాగరమ్ము నీరు చప్పనగును!


ఆటవెలది

ఆంధ్ర భాష విడచి యన్య భాషల వెంట

పరుగు లెత్తి జనులు పరవశించ;

సురుచిరముగ వెల్గెడు రుచిర సాహితీ

సాగరమ్ము నీరు చప్పనగును!

 

ఆటవెలది

ఆధునికత కొరకు నంగలార్చెడునట్టి

నేటి తరమునకును; నిర్వికల్ప

సంప్రదాయ బద్ధ సంస్కృతీ విభవంపు

సాగరమ్ము నీరు చప్పనగును!

 చల్లా దేవిక  తెలుగు తేనియలు

 

 


శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా /

హారతుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం /

దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా/

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

 

*భావము*

సరస్వతీ దేవిని స్తుతిస్తూ పోతన గారి చెప్పిన అద్భుతమైన పద్యమిది..

శరదృతువులోని తెల్లని కాంతులీనే మేఘాల తెలుపు 

 

కర్పూర చందన కాంతుల హారాలు తెలుపు,

అమ్మవారికి ఇషమైన జాజిపూలు తెలుపు  

రాజహంస తెలుపు,

పారిజాతములు తెలుపు

రాజతాక్షము తెలుపు

మంచు పర్వతాల రజతాచలము తెలుపు

అమ్మ, భారతీ స్వచ్ఛమైన మనసుతో మిరుమిట్లు గొలుపు నిన్ను ఎప్పుడు చూడగలనో కదా

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

 

సరస్వతీ దేవి వైభవం.....

పల్లవి

 

జయతు జయతు శారదా,

సకల కళా విశారదా,

వీణా, పుస్తక ధారిణీ,

జ్ఞాన సంపదా ప్రదాయిని......

 

చరణం 1

 

బోయవాడు నీ కృపతో ఆదికవి అయినాడు,

మత్స్యగంధీసుతుడు నీదయతో వేదవ్యాసుడైనాడు,

మేకలు గొర్రెలు మేపేవాడు కవికాళి దాస యినాడు,

కుమ్మరి మొల్ల నీ కరుణ వల్ల కవయిత్రి గా భాసిల్లె....

 

చరణం 2

 

నీ కృపా కటాక్షములున్న చాలు,

పృథ్వి యందు ఏచటైనా మనగలవచ్చు,

అక్షరానికి నీవే అధిదేవతవు,

అక్షయమైనది నీ కృపా కటాక్షము....

 

చరణం 3

 

నీ అనుగ్రహమంత సులభం కాదు,

అది అందరికీ లభ్యం కాని, అందని జ్ఞానఫలం,

నియమముతో నిను గొలిచినవారందరికీ నీవందింతువు జ్ఞానామృతం....

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...