30 - 09 -
2020 ; ప్రణాళిక
(సమస్యా పూరణ)
సమస్య "
చెలియ ప్రేమలేఖ నిజూచి చీదరింప "
సమస్యాపాదం తేటగీతి లో..
ఇదే
పంక్తితో పద్య / వచన కవిత
నాలుగు నుండి ఆరు
పాదాలలో మీ పూరణ
పంపించగలరు.
_________________________________________
తేటగీతి
తలపులన్ని నే జొప్పించి తన్మయముగ
వ్రాసితి నొకటి, నొందుగా పరవశమ్ము
(చెలియ ప్రేమ లేఖని జూచి, చీఁదఱించు)
కొనగ బోదుగా నెపుడు నా కోమ లాంగి
పూసపాటి - తెలుగు తేనియలు
తేటగీతి
చెలియ ప్రేమలేఖను జూసి చీదఱించు
ప్రేమికుడు ఉండి వ్యర్ధము ప్రేమ జంప
సృష్టి భావన యంతయూ శృతిని జేయ
జగము నందున ప్రియసఖి జంట జేరి !
మాసురేష్ - తెలుగు తేనియలు
వచనము....
అలకతీర్చి తననలరించదలచి,
చిలిపితలపుల ఊహలు అక్షరములు చేశా
చిరుఆలసముగ తన దరిజేరితినని చింతించిన
చెలియ ప్రేమలేఖని జూచి చీదరించు
తేటగీతి
కడు వినీతోత్పలాఛ్చద కాంతిలేక
చుంబనాశ్లేష సంభ్రమ స్ఫురణ లేక;
ప్రణయ దరహాసవీచికా వలపులేక
మధురరీతుల పొంకంపు సుధలులేక
చెలియ ప్రేమలేఖని జూచి చీఁదఱించు
కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు
తేటగీతి
నాకు దెలిసిన పదముల నప్పగించి
రాసె నేనొక లేఖను రాక్షసంగ
చేరి చెంతకు నీయగ చేతిలోన
" చెలియ ప్రేమలేఖని జూచి, చీఁదఱించు"
తేటగీతి
అందమంతయు పొగడక నద్భుతముగ
పేల వమ్ముగ దెలుపంగ ప్రేమ నీవు
రక్తమైనను నేమట రాసియివ్వ
" చెలియ ప్రేమలేఖని జూచి, చీఁదఱించు"
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు
నావలపును కవనముగ నల్లి వ్రాసి
శంక తోడను వెళుతున్న శంక రుండ,
చెలియ ప్రేమ లేఖని జూచి, చీఁదఱించు
కొనన టులనాకు వరమిడు కరుణ గల్గి.
కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు
ఫిర్యాదు చేసేద
ఆకర్షితుడనై తొందరపడి ఆలోచింపక ఆమెకు ప్రేమ లేఖ నిచ్చితి
క్షణంలో ఆ చెలియ నా ప్రేమ లేఖని చదివి
నన్ను జూసి చదువు, జ్ఞాన సంపదల కొర దుకు చేసిన స్నేహమును ఇంత
నీచముగా వాడుదువా అని చీదరించుచు నాపై ఫిర్యాదు చేయ బూనె
మురళీ మోహన్ - తెలుగు తేనియలు
తెలుగు రాదని చెప్పెడి తెగువ లేని
వాడు వచ్చిరాని తెనుగున్ వలపు దెలుప
భావమసలు భోదపడక వంద సార్లు
చదివి, తానలసిన వేళ జాలి లేని
చెలియ, ప్రేమలేఖని జూచి చీదరించు
రమ, కంకిపాడు - తెలుగు తేనియలు
తేటగీతి
ఆంగ్ల భాషలో వ్రాసెద నందముగను
మురిసి ముద్దగునట్లుగా ముగ్ధకు నొక
ప్రేమ లేఖ యనుచు వ్రాసె ప్రియుడొకండు
చెలియకు బహుతప్పుల తోడ, చింత తోడ
చెలియ ప్రేమలేఖని చూచి చీదఱించు
అవళూరు సీత - తెలుగు తేనియలు
వలపుతేనెలు కురిపించునట్లు,
ప్రణయభావాలుకలిగించునట్లు
మధురమైనపదజాలం జొప్పించక రాసినందుకేమో
నా "చెలియ ప్రేమలేఖని జూచి
చీదరించు "కొనెనని ప్రియుడు చిన్నబోయె.
డి. వి. హేమలత - తెలుగు తేనియలు
తేటగీతి
నీదు ప్రేమ కోరగ వ్రాస్తి నెత్తురోడ్చి
సమ్మతించ మనుచు నామె నమ్మబలుక,
కోడి నెత్తురని దెలిసి క్రోధముగను
చెలియ ప్రేమ లేఖని జూచి చీదరించు
వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు
కచుడు నేర్వగ విద్యను కరుణతోడ
అసుర గురువును యర్ధించి ఆజ్ఞగాను
సేవలన్నియుజేయుచు శీఘ్రముగను
యావుకునుమేతకునుదాను యడవికేగ
అసురు లందరు గలిసియు యలుకబూని
కచుని జంపియు బూడిద కర్కశముగ
మధ్య పానము నందున మైకముగను
కలిపి త్రాగించె యసురులు కావ్యుడుకును
దివ్య దృష్టిలో నిజమును దెలిసికొనియు
గురువు సంజీవని జదువు గురుతుగాను
నేర్పె శిష్యున కునుదాను నేర్పుగాను
విద్య బడసిన తోడనె వింతగాను
ఆహికుడు దేవపురికిని యరుగుచుండ
కనియు దేవయానియులేఖ కనుగు తోడ
చెలియ ప్రేమలేఖని జూచి చీదఱించె
గీతాశైలజ - తెలుగు తేనియలు
తేటగీతి
చెలువుడి ప్రేమలేఖను చెలియ జూసి
జేతి వ్రాత మరులుగొల్పు చెలగు చుండె
సంతకమ్ము పరులదని సార మెరిగి
చెలియ ప్రేమలేఖను జూసి చీదఱి0చు
ఎం.పద్మలత - తెలుగు తేనియలు
గేయ రచన,
చెలియ ప్రేమ లేఖను చూచి,
చీదరించు కొనుచు నర్ధాంగి,
బుసలు కొట్టుచు, విసవిసా నడచి,
పెట్టె సర్దుకుని పుట్టింటికిపోయే....
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి - తెలుగు తేనియలు
ఎన్ని మార్లు ప్రార్థించిన నేమి మాట
లాడలేదని నే ప్రేమ తోడ రక్త
ధార కురిపించి వ్రాసితి ధైర్య మొప్ప
చెలియ ప్రేమ లేఖను జూచి చీదరించు.
రచన: డి.రామ నాగేశ్వరరావు- తెలుగు తేనియలు
తెలిసీ తెలియని వయసున రాసితి చెలికొక ప్రేమలేఖ
తడబడు భాషను చూచి అలిగి తాను
నీకిదియే శాస్తియని వేయిసార్లు వ్రాయమనెను
నా గురువిణి 'చెలియ, ప్రేమలేఖని జూచి చీఁదఱించు'చూ
విష్ణుప్రియ - తెలుగు తేనియలు
తేటగీతి
సఖుని వలపును చెలికి విశదపరచగ
విముఖురాలుగా దూషించె; పేర్మి విలువ
తెలిసి ప్రియమైన నెయ్యము తెలియజేయ్య
చెలియ ప్రేమలేఖని జూసి చీదరించు
కొనక మగువ నక్కున జేర్చుకొనె సఖుండు
వెంకట్.సిహెచ్ - తెలుగు తేనియలు
తేటగీతి
మగువకు తగదిటుల జేయు తెగువనుచును
మాయమర్మ మెరుగక ప్రేమను పలికిన!
చెలియ ప్రేమలేఖ నిజూచి చీదరింప
చెలిమి దొరకునే వానికి చింత దక్క!
డా. నాగులపల్లి శ్రీనివాస్ - తెలుగు తేనియలు
మరదలే ప్రియసఖి కాగా
తీరని ముచ్చటకై ప్రేమలేఖ వ్రాయగా...
మంద బుద్ధితో మంది లో ఇవ్వగా....
చెలియ ప్రేమలేఖను చూసి చీదరించేగా......
ఉషారాణి - తెలుగు తేనియలు
కందము
సంచిత కర్మలు వీడగ
గాంచని దైవమును గొలువ గన్నుల కెదురౌ
వంచన యెరుగని హృదయపు
కాంచన పుష్పాంజలిని బికారి హరికిడెన్
వాణి - తెలుగు తేనియలు
తేటగీతి
చిరుత ప్రాయాన లేవెట్టి చీకుచింత
సోకు, డాబులొద్దని యాడు సోలు వరకు
కపట మెరుగక కలయును కలిమిలేమి
తిరిగి రాని బాల్యమదియె వరము గదర!
వాణిశ్రీ నైనాల, విజయవాడ - తెలుగు తేనియలు
తేటగీతి
ప్రేమలేఖ వ్రాయవలెనే ప్రేమ తోడ
భావజాలము నింపంగ భావుకతను
సఖియను పొగడ్తలందున సమకొనవలె
ఉలిపిరిని పోలు జాబుకు ఉనికి లేక
చెలియ ప్రేమలేఖను జూచి చీదరించు
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి - తెలుగు తేనియలు
తేటగీతి
నాకు నిత్యము యిష్టము నాప్రి యసఖి
ప్రేమ తోడను లేఖను పేరు తోడ
రాసి వాణికి బదులు రాణి యన్న
చెలియ ప్రేమలేఖని జూచి చీద రించు
లలితారెడ్డి, శ్రీకాకుళం - తెలుగు తేనియలు
తేటగీతి
నావలపును కవనముగ నల్లి వ్రాసి
శంక తోడను వెళుతున్న శంక రుండ,
చెలియ ప్రేమ లేఖని జూచి, చీఁదఱించు
కొనన టులనాకు వరమిడు కూర్మి తోటి.
కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు
తేటగీతి
లలితముక్తాకలాపమై లలనజూచి
ప్రణయభావనంబది నను పలకరించె
శోణితమ్ము సిరా నింపుచు మురిపించ
తలుపులావిష్కరించగ వలపు నింపి
కస్తురియు జేర్చి వ్రాయు లేఖయని పల్కె
భావనా శూన్యమైనలేఖ వలదనుచు
వలపు బాస తెలియదంటు వగచి వగచి
చెలియ ప్రేమలేఖని జూచి చీఁదఱించు
కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు
రాసాను రాయలేక లేఖ.........
అక్షరాలు ఏరుకొని పదాలు కూర్చుకొని
చెలి తో ప్రేమ ఫలప్రదం కావాలని
నిచ్చెలితో జయప్రదం జరగాలని
ఓం తో మొదలెట్టా ఓంకారం పలికా
ప్రేమ సాకారం కోసం
కృష్ణమ్మ ఒరవడి చూపా
గోదారమ్మ పరవళ్లు చూపా
వంశధార ఒంపుసొంపులు రాసా
నాగావళి హొయలు పోయా
చివరాఖరకు నచ్చక
"చెలియ ప్రేమలేఖ ని జూచి చీదరించే"
కోవూరి - తెలుగు తేనియలు
తేటగీతి
అలకల కలకంఠిని జూచి వలపు వాన
ల మొలకలు చిగురింప లలంతికమును
చిలకలకొలికి కీయంగ చింతదీర్చు
మిసిమి కాటుక వన్నెల శశిని గాంచి
కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు
జాము కుస్హ్మాండ అబ్రకము జాజి పూల
మల్లెమాలలు తెచ్చిన జల్లె అంత
రాత్రి రెక్కలు విరిచిన పాత్రి గాదె
ఇట్టి పదముల తో లేఖ ఇచ్చి చదువ
చెలియ ప్రేమలేఖని జూసి చీదఱించు. !
మా సురేష్ - తెలుగు తేనియలు
తేటగీతి
పురుష ద్వేషియై సతతము పరగునట్టి
వనిత యొకతె ప్రణయము వలదనంగ
వలపు మైకమునను పరవశము నొందు
చెలియ ప్రేమలేఖని జూచి చీదరించు!
చల్లా దేవిక - తెలుగు తేనియలు
నేనెన్ని కల్పనలు కల్పించిన..
తన పలుకుతో నా పాప పంకిలములు బాసిపోవును
నేనెన్ని చిత్ర పైత్యములు చూపిన
తన మౌనంతో నన్ను మార్చివేయును...
నేనెన్ని కట్టుకధలు అల్లిరాసిన
నా చేతి పట్టు విడువదు...
నేనెన్ని రాయభారములు లేఖలో ఇమిడ్చిన నా
" చెలియ ప్రేమలేఖని జూచి చీఁదఱించు"ట జరుగునా...
వల్లమాలిన ప్రేమ తనకి నేనంటే...
నా అదృష్టము తను నా వెంటుంటే....
సూర్య తాడిపూడి - తెలుగు తేనియలు
సమాప్తం
స్వేచ్చా సమర్పణలు
బాలు గారు ఆలపించిన ఆఖరు గేయం... ఈ నాటి మనిషి ని స్పష్టంగా వ్యక్తం చేసిన గేయం..
విశ్వం నాకోసమే విస్తరించి ఉందని,
పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులూ నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను. అవనిని అమ్మంటాను నేను. ఆదిత్యుణ్ని నాన్నంటాను నేను.
నడక వచ్చేదాకే అణిగిమణిగి ఉంటాను .
నేను ఎగిరితే మేఘం అడ్డురాకూడదన్నాను. అడుగేస్తే అడవి దారి విడవాలన్నాను.
పడవెక్కితే అలలు తలొంచాలన్నాను.
అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను. సాగరగర్భంలో చమురుందని చిలికేశాను .
మరి రేపటికో అంటే, నేనుండనుగా అని నవ్వేశాను. నేల మీద గీతలు గీసి నీదీ నాదని పంచేసుకున్నాను.
నా ముందూ నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను .
నేనే రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నాను .
నా కొట్లాటలు చరిత్రన్నాను. రుజువు కోసం రాళ్లు పాతాను. నేను చెప్పినట్టు నడిచే, నేను చెక్కినట్టు కనిపించే నాలాగే ఉండే దేవుణ్ని సృష్టించుకున్నాను.
నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను .
ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను.
దాన్ని చంపి దీన్ని చంపి కూరొండుకు తిన్నాను . వింతరోగమంటించుకుని ఊరంతా యేగాను .
గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను, గుమ్మం దాటనన్నాను.
నే స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా.
నా స్వగతం వినబడకపోతే ఆమని పాటాపిందా.
నే చతికిలపడగానే భూభ్రమణమాగిందా.
నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా.
రాజు కాదు బూజు కాదు, కిరాయికి నేనుంటున్నాను.
బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను .
నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను.
బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబోశాను.
మందో మాకో దొరకంగానే మళ్లీ గద్దెనెక్కుతాను .
ఒళ్లు చక్కబడంగానే నువ్వెంతని అంటాను .
నాకేదీ సాటిరాదంటూ మళ్లీ మొదటికొస్తాను.
మనిషిని నేను మాయదారి మనిషిని నేను . –
రచయిత: తంగెళ్ల రాజగోపాల్ - తెలుగు తేనియలు
*****
గూడెం TO కైలాసం
పెళ్లి పందిరి బిల్వ పత్ర తోరణాలతో కళకళలాడుతోంది.
అమ్మలక్కలు హిమసుమాలను తల్లో తురుముకుని తెగ మురిసిపోతున్నారు.
శివగణాలు కొత్త కొత్త కాస్ట్లీ తోళ్ళు కట్టుకుని అటూ ఇటూ హాడావిడిగా తిరుగుతున్నారు.
కొందరు చిల్డ్ అమృతాన్ని దొన్నెల్లో పోసి అందరికీ సర్వు చేస్తూంటే, మరికొందరేమో వైకుంఠం నుంచి తెప్పించిన పుల్ల ఐస్క్రీముని చిట్టి దేవతలకిచ్చి సంతోషపెడుతున్నారు.
పెళ్లి పందిట్లో సన్నాయి మోగుతోందేకానీ....అబ్బే! చిట్టి దేవతల జుర్రుడు జోరులో, ఆ సన్నాయి మోత మ్యూట్ అయిపోయింది. పనికిమాలిన పెద్దరికరంతో పోజులు కొడుతున్న కొంతమంది ముసలి దేవతలు, ఆ చిట్టి దేవతల్ని చూసి మనసులోనే కుళ్లిపోతున్నారు, ఇంతలో... ...
నాకెవరూ పనివ్వడంలేదు అంబా అంటూ నందిగాడు మారాం చేస్తూంటే, ఏర్పాట్లలో మునిగి ఉన్న లక్ష్మీ నారాయణులు, అలకతో ముడుచుకున్న నందిగాడి తోకట్టుకుని ప్రేమగా బైటికి లాగి సుతారంగా నిమురుతూ, బుజ్జగించి, వాణ్ణి రిసెప్షన్ కౌంటరు ఇంచార్జీగా నియమించడంతో, యమ హ్యాప్పీగా రంకెలేసుకుంటూ పోయి , కొమ్ములకి కట్టిన పన్నీరు బుడ్డీని ఆహ్వానితులపైన విదిలిస్తూ రిసీవు చేసుకోవడం మొదలెట్టాడు.
ముహూర్తం దగ్గరపడింది.... తన చతుర్ముఖ గళాలతో బ్రహ్మయ్యగారు డిఫెరెంట్ పిచ్ లలో వేద మంత్రాలు శ్రావ్యంగా చదువుతూంటే, సరస్వతమ్మగారు మాత్రం ఆయనగారి అష్ట నేత్రాల గారడీ చూపులను ఓ కంట కనిపెడుతూ, మధ్య మధ్యలో బ్రహ్మయ్యగారికి ప్రాంపుటింగు చేస్తూ ఉన్నారు.
వధూవరులు ముచ్చటగా హిమ పీఠికల మీద కూర్చున్నారు.
తాళి కట్టే సమయం రానే వచ్చింది.
గౌరమ్మ తల వంచి రెడీగా ఉంది.
శివయ్య తాళి కట్టడానికి లేచి నిలబడి ఉన్నాడేకానీ...
ఎందుకో కట్టడంలేదు.
భూలోకం నుంచి తెప్పించిన దృశ్య బంధన యంత్రాలు
ఫ్ల్యాషుల మీద ఫ్ల్యాషులతో, క్లిక్కుల మీద క్లిక్కులతో
బిజీ బిజీగా ఉన్నాయి శివయ్య తాళి కట్టే శీను కోసం. కానీ గౌరమ్మ మెళ్ళో తాళి కట్టడే శివయ్య ?
అటూ ఇటూ బోళాగా దిక్కులు చూస్తున్నాడేకానీ, గౌరమ్మ మెళ్ళో తాళి కట్టడే శివయ్య ?
బ్రహ్మయ్యగారు సైగ చేస్తున్నా, తిక్క తిక్కగా చూస్తున్నాడేకానీ, గౌరమ్మ మెళ్ళో తాళి కట్టడే శివయ్య? ప్చ్!?!
ఇంతలో నందిగాడు అవతల రంకెలు వేస్తూ దొర్లి దొర్లి నవ్వుతున్నాడు.
అప్పుడు అర్ధమయ్యింది శివయ్యకి.
అందరూ అటువైపు చూశారు.
కానీ ఎవ్వరికీ విషయం అర్ధం కాక బుర్ర గోక్కున్నారు.
శివయ్య మాత్రం శాంతించాడు.
తాను ఎదురు చూస్తున్న సరస్వతుల వేంకట రమణమ్మగారు ఏకంగా తాడేపల్లి గూడెం నుంచి కైలాసానికి విచ్చేశారని తెలిసి!
రమణమ్మగారు ఫారినరు కాబట్టి, ఆవిడ వీజాలో శివయ్యగారి సంతకం చూసి రూఢీ చేసుకున్నాక,
అన్ని ఫార్మాలిటీసూ పూర్తైపోయాక, రమణమ్మగారిని లోపలికి ఆహ్వానిస్తూ ఎందుకో అనుమానం వచ్చి, స్టాప్ అని గ్యాట్టిగా రంకె వేసి, రమణమ్మగారు తెచ్చిన గిఫ్ట్ ప్యాకెట్టు ర్యాపరు విప్పి చెక్ చేయగా
వాళ్ళబ్బాయి సరసి కార్టూను పుస్తకాలను చూసీ చూడగానే రంకెలేస్తూ నవ్వుతున్నాడు..., నవ్వుతూ రంకెలేస్తున్నాడు నందిగాడు ....
అదీ విషయం మరి!
అప్పుడు సరాసరి శివయ్య హిమ పీటిక మీద నుంచి లేచి రమణమ్మగారి దగ్గరకొచ్చి,ఆవిణ్ణి మన సరసిగారి మాతృదేవతే అని గుర్తుపట్టి, సాదరంగా చేయిపట్టుకుని లోపలికి తీసుకొస్తూ ఉంటే,
ఏమాత్రం బిడియపడకుండా పెళ్లికుమార్తె అయిన గౌరమ్మ ...కూడా వచ్చి సరస్వతుల వేంకట రమణమ్మగారి మరో చెయ్యి పట్టుకుంది మర్యాదపూర్వకంగా.
అనుకున్న పెద్ద దిక్కు రావడంతో శివయ్య, గౌరమ్మ మెళ్ళో ఆనందంగా తాళి కట్టేశాడు.
ఆతరువాత ఈవినింగ్ రిసెప్షనులో నందిగాడు మన సరసిగారి కార్టూను ప్రదర్శన ఘనంగా ఏర్పాటు చేసి, రమణమ్మగారి మన్ననలు పొందాడు.
అదర్రా! మన ప్రఖ్యాత కార్టూనిస్టు సరసిగారి మాతృదేవత అయిన
శ్రీమతి సరస్వతుల వేంకట రమణమ్మగారు శివరాత్రి రోజున
తాడేపల్లి గూడెం TO కైలాసం టూర్ విశేషాలు.
----అ.అ----
అత్తిలి అనంతు - తెలుగు తేనియలు
****
తొలిపరిచయ భావన నేను మరువలేదు
ఆ మధుర క్షణాలను మణిపూసలుగా గుచ్చి
మందార మకరంధాల జల్లులు పన్నీరుగా జల్లి
నా మనసును నేను ఎప్పుడో నీ దోసిట విడిచాను
మేఘధవళ వర్ణాలు నా కనురెప్పలను తాకుతున్న
నీసుందర ముఖ చిరు మందహాసం ఎదురొస్తోంది
నీలాల వర్ణపు మరోప్రపంచంలో ఉషాకిరణాలు
నాకు వెలుగు చూపిస్తుంటే, ఉజ్వల కాంతి విరభూసిన
పారిజాతమై ని నవ్వులో ఉదయరవి రెపరెపల
నీ కనుపాపకు మధ్యగా ఉదయిస్తుంటే...
అస్తమించే వరకు నీ పాపిట వెలుగు ఇస్తూనే ఉంటా
సూర్య తాడిపూడి - తెలుగు తేనియలు
*****
సమాప్తం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి