దత్తపది - 51
29.10.2020, గురువారము ప్రణాళిక
“కలము, హలము, జలము, ఫలము”
ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవితలు అందించగలరు...
******************************
గేయకవిత
మనసున రేగెను కలకలమూ
తెలియగ రానిది
తెలుపగ లేనిది
నా మనసున రేగెను కలకలమూ
నీవు వత్తువని యుగములు పొగిలితి
ఏ జన్మ ఫలమో,
ఈ జన్మ వరమో
నీ రాక తెలిసిన క్షణమే
కన్నులు నిండెను జలముల చెలమలై
మనసు పండెను పరువపు బాటలై
వేదన వీడిన వేకువ నింపెను రాగమునే
అరవిరిసిన
అరవిందాలే
పాడెను స్వాగత గీతులు
ఎదలోయల నిండిన కోలాహలము
వెలికి వచ్చెను వెల్లువ వరదలుగా
మాధవా !మధుసూదనా !
అచ్యుతా !అంబుజ నాభా !
అవళూరు సీత తెలుగు తేనియలు
కందము
కలము వలచి కవి యవ్వగ
హలము దరిన భూమి దున్న హాలికుడు గదా
జలమునకు గమనము వలే
ఫలమునకు యలుపనక గొను పంతము సుమ్మా
దరి - రక్షణ, వలన
నీటికి ప్రవాహము సహజము
ఫలితము కోసం పట్టుదల సహజము కావలె
సతీష్ తెలుగు తేనియలు
కలము పట్టి వ్రాయ
వచ్చింది కవిత జువ్వై
హలము పట్టి దున్న
చేరింది కడుపుకు బువ్వై
జలము ఒడిసి పట్టి
నిలుప రేపటికి మదుపు
ఫలములు తిను జీవులు
రోగము లేక సుఖాన గడుపు
కోవూరి వారి కవిత ప్రేరణతో
జీవిత గమ్యానికి చేరాలంటే
కావాలి చక్కని ఉదయం
సమరం గెలిచి అలసిన
వాని కోసం ఉండాలి తిమిరం
డా.సతీష్ తెలుగు తేనియలు
మాతృభాష పైన మమకారమున్నది
తెలుగుభాష యన్న (ఉన్న) తెలివిమీరు
భాషపైన పట్టు ఎక్కించు నొకమెట్టు,కావున
పట్టుబట్టి భాషను పట్టుకొనుడు.
కవిత వ్రాయగా నేను కలము తీసిచూడ
కలమునందు సిరా అంత కరగిపోయే
శ్వేతపత్రము తీసి కవిత రాయగా చూడ
శ్వేతపత్రము నా ముందు తెల్లబోయే
కాలమంతయు కరగిపోయే
కవిత యేదియు బుర్రకు తట్టదయే
పలుకులమ్మకు నాపైన కారుణలేదు
కవిత యేదియు మదిలో మెదలలేదు.
1
కలము లేక కవికి (కవితకు) అనురక్తి లేదు
హాలము లేక జనులకు భుక్తి లేదు
జలము లేక జీవులకు శక్తి లేదు
2
ఆహా ఏమి నా సుకృతము
కవితా వనమునందు నేను
చిక్కుకుంటి, ఇటుచూడ
కవితా గండభేరుండములు
కవన గర్జలతో కాననము
దద్దరిల్లే. అహో ఏమి నా
భాగ్యము ,కవితా పూతోటలో
తుమ్మెదనై తీయ్యని తెలుగు
తెనియలు జుర్రుకుంటి.
3
అహో కవిత రాక కవిచేతి కలము చిన్నబోయే
వృష్టి లేక హాలము దున్నినను పొలము మూగబోయే
జలము లేక జగతిలో జనుల మనుగడ చిక్కిపోయే
బలము లేకున్న అవనియందు నృపుల చరితలు మాసిపోయే.
భాస్కర వెంకటరమణ శాస్త్రి తెలుగు తేనియలు
తేటగీతి
కలము నొకచేత మరి యొక్క కరము చేత
హలము దాలిచి రైతు గ అన్నరాశి,
సహజ కవిగ పద్యామృత జలము నొసగి
మోక్ష ఫల మొందె పోతన మునియె యతడు.
డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు
సీసము
తెలియక రానిదై తెలుపగ లేనిదై కలకలముగ రేగె కలత మనసు
ఏ జన్మ ఫలమోలె యీ జన్మ వరముగ నీ రాక గనుగొంటి సౌరి రూప
జల ములు చలములై చక్షువుల్ నిండె నిన్ గాంచి మనసు పండి మంచు కురిసె
వేదన వీడగ వేకువ నింపె రాగము స్వాగతపు గీతి గానమయ్యె
తేటగీతి
మాధవా! నిను గాంచగ మనసు మురిసి
వెల్లువ వరదగ మమత వెలికి వచ్చె
ఎదయె కోలాహలము జేయ యింపు తెలిపె
పరితపించెడి మది జేరి వలపు తెలుపు
వెంకట్ సి.హెచ్ తెలుగు తేనియలు
కవుల రచనలకు కలము
భవుని అభిషేకంకు జలము
అవని సాగుకు హలము అవసరమగునట్లు
భగవంతునిస్మరణ పుణ్యఫలమునకవసరమగు.
డి. వి. హేమలత తెలుగు తేనియలు
మధ్యాక్కర
హలము పట్టి చెలిమి జేసి హాలికుడవనిని గాచు
కలము నాయుధము చేసి కవి కవన కదనమును సల్పు
జలము భూమి వరమై జంతు జాలపు యార్తిని దీర్చు
ఫలము లాశించెడి జనులు ప్రతిఫల మేరీతి పంచు!
వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు
వచన కవిత,
హలము కు పట్టిన పొన్నారి స్వయంవరమున,
జలము తో కాళ్ళు కడిగి, తన పూర్వ జన్మ పుణ్య,
ఫలముగా కన్యాదానము జరిపె , కల
కలము రేగ మిధిలలో జనకుని కొలువున...
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు
కలములో ఫలములు
నా కలములోని సిరాతో కవితలు, పద్యముల కోసం రాసుకున్న అక్షయారాలు చల్లి సరిచేసినట్లే
సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రాసుకున్న అక్షరాలను విత్తనములతో మిళితం చేసి చల్లి , నా హలముతో
పొలమంతయు సరిచేసి తగినంత జలము నందిస్తూ అనేక ఫలితములు , తద్వారా ఎన్నో ఫలములు నేను సాధించే!
జి మురళీ మోహన్ రావు తెలుగు తేనియలు
భాగవత ఇతివృత్తం:
కడలి జలమును మధించగ
జనియించెన్ హాలాహలము
కలకలమున సురాసురుల్
మూలమూలలందు చొచ్చిరే
కరుణతో శివుడా గరళము
మ్రింగి అభయమిచ్చిన తరి
మంథనము మరల కొలనిడె,
అంత, మున్నీటి పట్టి పుట్టే,
వెన్నెల రేడు చంద్రుడు మరి
కోరిన ఫలముల నొప్పగించు
కల్పతరువునూ బయల్పడే.
భారత ఇతివృత్తం: 2
కురుక్షేత్ర అవసాన సమయాన
తటాక జలములందు దాగిన
రారాజును బయటికి రమ్మని
పాండవులు గేలి మాటలాడ
స్వాభిమానము భంగ పడగ
వ్యాకులమున తీరము కొచ్చి
భీముతో గదా యుద్ధము సేయ,
హలము చేపట్టిన బలరాముడు
చూచుచుండ , పాప కర్మముల
ఫలముతో ఊరవులిరిగి పడగ
దేహమంత శకలములు కాగా
దిక్కులేని చావు చచ్చే నకటా.
3.
గోపికల ఎదురుచూపు
ఓ కృష్ణా! మధుసూదనా!
నీ రాకకై బృందావనమున,
చక్రవాకములై కన్నులు మూయక,
చూచు అభిసారికలము,
ప్రియతమా? నీ గోపికలము.
నీ వీక్షణముల పన్నీటి జలములన్,
మా తనువు తడవునని,
నీ జత రాసలీల కోలాహలమునన్,
మా మది నాట్య మాడు నని,
నీ పద పీఠికలో మా పూజాఫలము,
హారతిగ సమర్పింతుమని,
నీవు రేపల్లె వీడిన క్షణము నుండి,
ఈ ప్రకృతి అణువణువునందు,
నీ బింబమునే గాంచుతూ,
వేడుతూ కన్నీటి ముద్దలయ్యేము,
వేగమే వచ్చి కరుణించు స్వామి!.
CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు
దెచ్చిన తల్లి
తల హలమున గొట్టి ప్రాణముబోవ,
జలమున కాలుసేతులుగడిగి అన్నమున్ దిన
నదివిషాన్నము, మాతాపుత్రుల జగడమున సంపద
నిష్ఫలమయ్యెనని కలముబట్టి కలి ప్రభావమ్మువ్రాసె కవి ఎన్నడో!
కె.ఎల్.కె.రావు తెలుగు తేనియలు
జలము, హలము, ఫలము , కలము
అన్యార్ధము లో రామాయణ మందు పూరణ
శివుని ధనువును విరువలేక ని(ష్ఫలమ)నుచు నృపతులెల్ల వెను దిరుగగ,
హల్లో(హలము) సుంతనైన బడయక నా దశరధ తనయుడు, తపసి యాఙ్న
పొంది చాపము నెత్త డెందముల్ కంపించు పగిది ఫెళ్లుమని విరిగెను విల్లు,
ఖల్వము పైబడె కార్ముక శ(కలము) లెల్ల నలుదిశలన్ చెల్ల చెదురు
గా సదస్సు లోన క్షణము క(జ్జలమ్ము)
క్రమ్ము కొనెనుగా నచ్చోట, కల(కలము)ల
నడుమ నయన(జలము)కార నారి సీత
కంఠమున వేసె వరమాల కౌతుకమగ
పూసపాటి తెలుగు తేనియలు
అర్ధములు :
హల్లోహలము = తడబాటు, సుంత = కొంత, కార్ముకము = విల్లు, కజ్జలము=చీకటి
ఈ నాటి దత్తపదికి అన్యార్ధంలో కలియుగ భారతంలో నా ప్రయత్నం...తేట గీతిలో...
హరియె నవనీత కలము డై హాయి గుండె
హరుడు హాలా హలము త్రాగి యాద మరిచె
జలము చము కురియుట మాని జాడ తప్పె
ఫలము పాటు లేదు భువిని బాధ మిగిలె
పాడి యున్నరైతు వెతలు పరులకెఱుక.....
కలముడు - చోరుడు
జలముచము - మేఘము
ఫలముపాటు - ప్రయోజనము
పరుల - పార్వతి
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు
అశోక వనములోని సీత దుఃఖం
కలము, ఫలము, జలము, హలము అన్యార్థ ప్రయోగములో నా తొలి ప్రయత్నము - మధ్యాక్కర
కలకల మంతయు వింత కలవర మాయెను లంక
ఫలములు తరువున రాలె పవనాత్మజుని రాక తోడ
జలము కనుల గారె భూమిజకును కోలాహల మంత
వెలుగు యని దెలిపి సుంత వేదన దీర్చెనే త్రిజట
శిరీష తెలుగు తేనియలుis
కలము పలికించు కావ్యను ద్గ్రంథములను
కైత లవిసుధా మాధురుల్ గరిమ దెల్పు
హలము బట్టి యన్నము బెట్టు హాలికుండు
కానవచ్చు దైవము గాదె కలియుగాన
వరుణుడు కరుణన్ కురిపించ వర్ష జలము
పొంద గలమెపెక్కు ఫలముల్ పొలుపు మీర
యిన్ని యిచ్చిన ప్రకృతిని యన్ని గతుల
పాడు జేయు మనుజునికి పాపములవి
కలుగవే ! సత్యమిదియెగా తెలుసు కొనుము
సకల మెఱిఁగిన పరమాత్మ సరస నడుగ
వికలములవియె కల్గించి వింత జూపె
తానె హాలహలమ్మును త్రాగి నందు
కేమొ; గంగాజలము త్రాగి గాముల దొర
శమము నొందగ ధరియించి చంద్ర వంక
మాకు పూజా ఫలమునిమ్ము మరుని సూడు
అవళూరు సీత తెలుగు తేనియలు
సకలము సతతము తలచిన రాముని
వికలము ఉండదు మనసున , హలములు తొలగు..
హలము చివరన పుట్టిన సీతను సుజలములతో
పూజించిన యాగఫలములు కలుగు !!
విష్ణుప్రియ తెలుగు తేనియలు
మధురాక్కర
కలము బట్టి కవిత వ్రాయ ఘంటంబు కదలదాయే
హలము బట్టి సేద్యము జేయ నతివృష్ట నావృష్టియే
జలము ద్రావ తిరిగెడి ప్రజల వెతలెన్నో గదా
కలిమి గల వాని బతుకంత గగనము నందు నిల్చు
కలత గల బీద బతుకంత కటిక చీకటిమయమే
కలిమి సృష్టియంత విధాత కరుణా కటాక్షంబని
తెలుసుకొని మసలు నరుడా! దివ్యత వొందుతువే
కలియుగ స్వభావ రీతిని గణయించి కదిలి నీవు
హలము, జలము, కలము తోడ నద్భుత ఫలము నొందు
వెంకట్.సి హెచ్ తెలుగు తేనియలు
నీ కలము అల్లెను అందమైన అక్షరమాలలను.
కర్షకుని ఆశల మొలకలకై
భూమినిదున్నేను నీ హలము.
మధ్యాహ్నం ఎండ చేయదా
ప్రతినీటిచుక్కను అమృత జలంగా.
చిత్తశుద్ధి కార్యాలకు దైవమిచ్చును
తప్పక మంచి ప్రతి ఫలమును.
ఉష తెలుగు తేనియలు
ఆటవెలది
కల కలము పెరిగెను, నహో
నలవోకగ హలము నెత్తి యద్భుత రీతిన్
పొలమును దున్నుచు, జలమును,
బలమును, తా పొందుపరచి ఫలమును బొందెన్!
చంపక మాల
కలమును బట్టి బాధలను కైతల యందున జూపగల్గునే
హలమును బట్టి దేశమున హాలికులైతిరి యన్న దాతలే
జలముల రక్ష నిర్వురును సాధ్యము జేయ నొకింత నేర్పులే
ఫలమున కాస జూపకనె పట్టును వీడక సేద్యమొప్పునే
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు
చంపక మాల
సఫలము నొంద శౌర్యతనె జాటి స్వయంవర దోహలమ్మునన్;
సుఫలము నొందు దాశరథి శూరతనే సకలమ్ము గాంచ మో
దఫణితి;రామచంద్రు గని హర్షజలమ్మట వెల్లువాయెనే
సఫల మనోరథమ్మిదని జానకి నేత్రములందు నత్తరిన్!
కందము
హలమున్విడకయె పోతన
కలమును బట్టి కవనముల ఖద్యోతుండై
వెలిగి;ఫలముగ నొసగె తా
నలరెడు భాగవత సుమధురామృత జలమున్!
చల్లా దేవిక తెలుగు తేనియలు
సకలమునకు ఆకలితీర్చు
రైతు బాంధవుడు హలము నొదిలి
హాలాహలము పట్టె నేడు
కన్నీటి జలముతో సేద్యమే చేసి
ప్రతి ఫలము నివ్వని పంటలెన్నో పెంచి
విత్తనములు పూయించి
విత్తమును పూరించ లేక అప్పనే అగాధాన్ని
అదిగమించని రోజు సేద్యమనే యజ్ఞము లో
సమిధగా ఆహుతి అవుతున్నడు
అన్నాభిషేకం చేసే రైతన్నకి
కనఖాభిషేకం చేసే రోజు త్వరలోనే రావాలి
రాజ రాజేశ్వరి తెలుగు తేనియలు
కలమున పొంగుభావఝరి కమ్మని కైతగ రూపుదిద్దగా
పలుకులవల్లరీ ఫలము పల్లటి కూతలు పంచినట్లుగా
హలమును పట్టి మానసవిహారము సేద్య జలంబులొల్కగా
జిలుగులనద్దుచూ కవనసింధువులై కురిపించు చల్లగా !!
కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు
తేటగీతి
పోలికను జూడ నిద్దరి పొసగు నొకటె
సాగు జేసె రైతు హలము సాధనముగ
కలము పదును పద్యము లల్లె కవుల జేత
పంచ భూతముల నొకటి పంచె జలము
బలము నిచ్చు నిద్దరికిని ఫలము నొకటె
పద్మలత మున్నంగి తెలుగు తేనియలు
సమాప్తం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి