20, అక్టోబర్ 2020, మంగళవారం

దత్తపది - 47, దేవి, వాణి, సీత, రమ



 ప్రణాళిక: దత్తపది - 47

దేవి, వాణి, సీత, రమ   

దసహోర ప్రారంభం అవుతున్న సందర్భంగా 

అదే అర్థంలో గాని, అన్యార్థంలో గాని..

ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవితలు అందించగలరు...


దసరా ప్రారంభ శుభ సందర్భంగా

తేటగీతి

వాణి చదువుల దేవేరి వరము లిడగ

శ్రీ రమ కలుములకు తల్లి సిరుల నొసగ

సీత భూజాత ప్రజ కీయ శీల ధనము

" తెలుగు తేనియ" సభ్యుల దీక్ష పెంచి

వసుధ లో కరోనాసుర వధ నొన ర్చి

దేవి దుర్గమ్మ జనబాధ తీర్చుగాక!

(ఆరు పాదాల తేటగీతి)

 

డి.రామ నాగేశ్వరరావు - తెలుగు తేనియలు

 

 

కందము

దేవికి పూజలు జేయన్

శ్రీ వాణి ని కొలిచినంత సిద్ధించునుగా

బ్రోవగ సీతను మనసున

కావరె రమణీయముగను కలియుగమందున్!!

 

కందము

ఏ సీ తరగతులందున

చూసినదే విద్య యనుచు సొంపుగ దెలుపన్

ఆ సొబగులు వాణిజ్యము

వాసిగ రమణీయమైన పాఠము వినుమా!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి - తెలుగు తేనియలు

 

దసహోర...హో దసరా

గత సంవత్సరం దాకా చెల్లి దేవి , అమ్మవారి అలంకారాలతో

వాణత్తయ్య రోజు వారి ప్రసాదాలతో,

రమపిన్ని తాంబూలాలు పంచడంతో

సీత రమ్యంగా భక్తి  పాటలు పాడటంతో

అమ్మ వారే అలా ఇంటింటికీ  వచ్చి కూర్చునే వారు !

ఈ దసరా ఎవరికీ వారే నవరాత్రులు చేసుకోవాల్సి వస్తోందని

అమ్మవారే స్వయంగా ఇంటి ఇంటి నుంచి ప్రతి ఇంటికీ

దీవెనలు, ఆశీర్వాదాలు అందజేయాలని ప్రార్థిస్తున్నా మహో  !

 

జి . మురళీ మోహన్ రావు - తెలుగు తేనియలు

 

తేటగీతి

 

ధరణి జాతగ వెలసేను తరుణి సీత

రామ మానస పత్నిగా రమ ణి యుండె

పత్ని వాణియే పావనం బనియు తలచె

పరమపురుషుని దేవిగ పరిఢ విల్లె

 

డి. వి. హేమలత - తెలుగు తేనియలు

 

సీసము

రామ నామము తోడ రమణీయ సీతయే పులకరించి మహిమ పొందినట్లు

రమ దీవెనల తోడ రహి కల్గి సిరులన్ని ప్రాభవముగ గూరి ప్రబలు నట్లు

వాగ్దేవి కరుణయే పావనంబైన పద్య రచన హేతువై తనివి నిచ్చు

శర్వాణి యని వేడ శస్త మయిన జీవన మొసంగి సతత మానంద మిచ్చు

 

తేటగీతి

ధరణి యందు సీతాదేవి తల్లి యయ్యి

దీవెన లొసంగు, వాణియే దివ్యత గల

జ్ఞాన మిచ్చు, రమ సిరుల సౌఖ్య మివ్వ;

జగతియంత మురియచుండె సంతసముగ

 

వెంకట్.సి హెచ్ - తెలుగు తేనియలు

 

తేటగీతి

 

సీత దాటిన యాగీత జెప్పు రామ

గాధ రమ ణి తా వగచెను కాల మంత

జనని భూ దేవి  వాణి తో జానకమ్మ

తరలెనవమాన భారము తాళ లేక.

తల్లి యొడిచేరి  తానైను  ధన్యురాలు

 

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు

 

(సీత  - అనగా పార్వతి అనే అర్థంలో ప్రయోగించుట జరిగినది.)

(దేవీ త్రయము -లక్ష్మి, సరస్వతి, పార్వతులు)

 

మధురాక్కర

 

దేవిలేని భాగవతము దీవసమది పాపము

భావములు ప్రకటింపగన్ వాణి దీవెనల తోడ

దోవ జూపి మానవులకు తోడాయె సీత గాధ

కావగ పిలిచిన పలుకు కారుణ్య రమణులేను.....

దీవసము = ఆలోచన

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి - తెలుగు తేనియలు


 

కందము

వాణియె విద్దెల నొసగెడు

రాణిగ; కలుముల నొసంగు రమ తోడ విభన్

క్షోణికి సీతయునూ, గీ

ర్వాణా దేవీత్రయమ్ము వాసిగ తరలెన్!

 

తేటగీతి

అతుల శుభముల నొసగు దేవి! తిరముగ శ

రత్తు నందున కలుషహరణము జేసి

శివము గూర్చగ వాణివై, సీతయు, రమ

వై యరుదెంచ నాదు భవము పావనమయె!

 

కందము

అనయము దేవీ రూపుల

మనమున నిల్పుచు వినమిత మతులై ప్రజ వా

ణిని సేవింపగ, రమ కరు

ణను జూపగ, సీతయున్ను నందన మొసగున్!

 

తేటగీతి

సాహితీ క్షేత్రమనియెడు సత్పథమున

మాన్యులెల్లరు జతకూడ మైత్రి తోడ

సీతయు,రమ, వాణియను దేవీ తరుణులు

కృతమతులుగ సేయుచునుండె కృషిని తాము!

 

 

కందము

దుగ్ధ యెఱుంగని రమయూ

స్నిగ్ధముగను మదిని దోచు సీతయు; హసితా

ముగ్ధ మనోహరి వాణి; సం

దిగ్ధమె లేదు తెలుపంగ దేవీ త్రయమే!

 

చల్లా దేవిక - తెలుగు తేనియలు

 

 

దేవి వరములీయ దాసు జ్ఞానమందె

వాణి శుభములీయ మొవ్వ కవిగ మారె

సీత దీవించ హనుమ లంక దాటె

రమను కీర్తించ  కనకధారలే కురిసె

నవనాయికలను కొలువ భక్తితోడ

మంగళము కలుగింట నిక్కమిదియే

 

విష్ణుప్రియ - తెలుగు తేనియలు


 

 

సీసము

 

దేవిక శైలూషి తీరైన రీతినన్,

సురుచుల స్పందనల్ శోభ నిడగ

రమ కవనమ్ములు రసరమ్య భావముల్

పండించి ప్రేమార పలుకరించ

సీతక్క పద్యముల్ సిరివాన ప్రౌడిమ

గాన్పట్టు శ్వాదించ ఘనత గొల్పు

వాణి కలము దిప్పు వాటంబు జూపుచున్

జుంటి తేనె నిచట జుర్రనెంచి

 

తేటగీతి

తేనియల మిత్రులెల్లరు తెల్లబోవ

నల్వురమ్మల ధాటికి నల్గునకట

కాదు కాదందురా కృతజ్ఞత దెలుపుదు

మందుకొనుడి మా హృదయాభివందనములు

 

వాణిశ్రీ నైనాల - తెలుగు తేనియలు

 

 

 

వచన కవిత

సరదా సరదాల  బొమ్మల కొలువే

దసరా సరదాల బొమ్మల కొలువే

మెరిసే మెరిసే కోకల కోమలాంగులే

మురిపాల మురిసే చిట్టి తల్లులే

ఏర్చి కూర్చి  కొలువుంచిన  బొమ్మల కొలువే

 

అగ్రపూజల  బొజ్జ గణపతి ముందు నిలువగా

ఆది దంపతుల అర్ధనారీశ్వర తత్త్వం

సీతా రాముల దాంపత్య సుందర తత్త్వం

ఏకధాటిగా  నిల్చిన శివ కుటుంబం

తెలిపే  సుందర  జీవన రహస్యం

 

వీణా పాణి వాణి దేవి

సురుచిర సుందర రూపము

జగతిని బ్రోవగ జగదంబ చేసిన

మహిషాసుర  మర్దనం

రమ్య రమణీయ నందన వనము

తెలిపే  జీవన విరుల సౌరభం

 

రకరకాల రంగు  బొమ్మలే అవి

అందాల కుందనపు  బొమ్మలే

ఏర్చి కూర్చిన  బొమ్మల  కొలువే

చాటెను  సమైక్యతా భావము

సరిగమల రాగ సరాగం

తెలిపే జీవన రాగ మాధుర్యం

 

అవళూరు సీత - తెలుగు తేనియలు

 

 

సీస మాలిక

 

అలశారదాదేవి నర్తించు జిహ్వపై కరుణాతరంగిత సిరులనిచ్చి   

సీతమయూఖమౌ సితతామరల్ గొల్చు చరమాంకశోభిత చందనములు 

భావార్ధముల దివ్యపరిపాకములు నింపు  భావచమత్కృతుల్ వరములిమ్ము 

మలయానిల ప్రభావిలసనంబులని గూర్చు సరణి విష్ణుప్రియంబైన వరము

వాగ్దేవివరములు వాణీవిలసితమై మంజులపదములు శింజితములు  

సుమశిరీషలతల కుసుమ పేశలములు వల్లరులై పొంగు వరములిమ్ము  

లలితాంగుళీదళంబుల శోభలై నిండు  హేమకుంభములౌ మహిమలనిమ్ము  

ప్రత్యూష కలితమౌ పవనంబు పిల్చినన్  కవితామణుల నవ్య గరిమ గాంచె 

శ్రీదేవి కృపతోటి సిరులను కురిపించి  ప్రజ్ఞాసరస్వతి వరములిమ్ము 

 

తేటగీతి

సలలిత పపదల్లవములు విలసితంబు 

బహుళ నవరసాలంకృత భరిత కవిత 

మరులు గొల్పంగ ప్రౌఢిమ కురిసెనిపుడు 

స్నేహదీప్తుల కాంతులు నిండినపుడు   

 

కస్తూరి శివశంకర్ - తెలుగు తేనియలు

 

 

మొవ్వ వరదయ్య : మహాకవి క్షేత్రయ్య

తేటగీతి

వాణి  కారుణ్య దృక్కుల వాక్కు విరియ

దేవి భగవతి శర్వాణి దీవెనలవి

హసిత భావనల్ పొంగార యనవరతము

రమ్య రమణీయ కైతల రాగములుగ

రూపు దాల్చి సీత యెదను రుక్కుమెఱియ

 

అవళూరు సీత - తెలుగు తేనియలు

 

 

దేవీ నవరాత్రులందు

శ్రీవాణి గా కొలువై

దుర్గామాత గా నెలవై

అమ్మ భవాని గా వెలు గై

అన్నపూర్ణగా అవతరించి

మా మీద సీతకన్ను వేయక

కాపాడ రావమ్మా, ఏడువారముల

నగలతో నిండుగా కొలువై

రమణి గా వెలుగొంది

మదిని మురిపించగా విచ్చేయవమ్మా.

డి .నాగమణి - తెలుగు తేనియలు

 

 

కవిత

 

వర్షాధారాన సకల వర్ణాల సొబగులతో

శోభిల్లు ధరణి

శరన్నవరాత్రులకు సిద్దమంటూ

దేవీ పూజలందుకొనుటకై

తంగేలుపూలతో ,బంగరు రంగుల

జిలుగు బంతిచేమంతుల అలరారుతూ

 

రమ ణి రమ్యంగా ముస్తాబవుతోంది

తెల్లవారిన చాలు

తెలిమంచు తెరలలో

 వాణి వీణను మీటుతూ

శ్వేతవర్ణపు వలువల వయ్యారంగా

విధ్యాధరియై

అంబరం నుండి దిగివచ్చు సంబరాలు దేవీ నవరాత్రులు

 

సీత మ్మైనా ,పార్వతమ్మైనా ,అవనిపైన అంబయై రక్షించు మనలను

అమ్మగా  శరత్ కాలపు వెన్నెల

కాంతుల సౌరభాలలో కోర్కెలు

దీర్చుటకై కొలువుదీరగా

తెలుగు తేనియలందున మధువు లొలులుకుతూ మధు మాసమున మహంకాళీ రాజరాజేశ్వరిగా నవవిధ భక్తుల నవరాత్రుల విలసిల్లు తూ కోర్కెలను దీర్చుటకై ముందుగానే పయనమైంది

 

గీతాశైలజ - తెలుగు తేనియలు

 

 

అమ్మా..జగజ్జనని..

సమస్యలకు వీగక దేవి లా నిలబడే ధైర్యమును,

బాధ్యత లను రమణీయంగా నెరవేర్చే ఓర్పు ను,

పరులనొప్పింపక మాట్లాడే వాణి లా వాక్ పటిమను,

రావణుని చెరలో ఉన్నావీడని సీత ఆత్మస్తైర్యం ను,

నాకు ఇచ్చి ఆశీర్వదించుమమ్మా

 

ఉష - తెలుగు తేనియలు

 

పాడ్యమి రోజు బాలా త్రిపురగా,

విదియ రోజు శ్రీ గాయత్రీదేవిగా,

తదియ రోజు అన్నపూర్ణేశ్వరిగా,

చతుర్థి రోజు శ్రీ లలితా త్రిపురగా,

పంచమి రోజు శ్రీ రమాదేవి గా,

షష్టి రోజు వాగ్దేవి శ్రీ వాణి గా,

సప్తమి రోజు శ్రీ దుర్గాదేవిగా,

అష్టమి రోజు మహిషాసుర మర్దినిగా,

నవమి రోజు రాజరాజేశ్వరి దేవి గా,

అమ్మలగన్న అమ్మలనందరినీ,

దసరాలలో భక్తిన పూజించెదమని,

దేవుల్లారా మిమ్ముల మరచితిమని ,

కరుణతో మాపై సీతకన్ను వెయ్యద్దు.

 

CA కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు


 

 

ఆహార దినోత్సవం సందర్భంగా.....

అన్నం విలువ

అన్నం పరబ్రహ్మ స్వరూపమంటూ అనవరతము కీర్తిస్తాం..

అపరిమితంగా వృధా చేసి చెత్తబుట్టలో పారేస్తాం..!

 

అన్నమయములే అన్ని జీవములు అన్న మాటను

అందరం నిశ్చయంగా అంగీకరిస్తాం..

జీవం నింపే అన్నాన్ని అర్ధంతరంగా కంచంలో వదిలేస్తాం..!

 

కోటివిద్యలు కూటి కొరకే అన్నమాట అబద్ధం కాదంటాం..

ఆకలి తీర్చే అన్నాన్ని అనాలోచితంగా వృధా చేస్తాం..!

 

రైతును అన్నం పెట్టే దేవుడంటాం.. అన్నదాత అంటూ కీర్తిస్తాం

ఆ దేవుడి శ్రమను లెక్కచేయక విసిరేస్తాం..!

 

అమ్మ లేకున్నా బతకగలం కానీ అన్నం లేకుండా బతకలేమంటాం..

అమ్మ కన్న మిన్నగ తలచిన అన్నాన్ని అగ్గువగా చూస్తాం..!

 

ఇంట్లో శుభకార్యమైతే పదిమందికి అన్నం పెట్టి

ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని,

ఆర్భాటంగా వడ్డించి అభిమానం చూపిస్తే,

అపరిమితంగా వడ్డించుకొని అన్నిటిని వదిలేస్తాం..!

విందుభోజనంలో అన్నీ రుచి చూడాలన్న ఆరాటంతో

విస్తరిలో చోటిస్తాం కానీ ఉదరంలో చోటివ్వలేక

చెత్తబుట్ట పాలుచేస్తాం..!

 

తినడానికి తిండిలేక ఆకలికి అలమటించే

అనాథలు, అభాగ్యులు, అన్నార్తులకు

లోటులేని మన భారతంలో

అందరికి అన్నం పెట్టలేకపోయినా,

అన్నం విలువ నెరగడం అందరి కర్తవ్యం...!

 

వృధా చేసే బదులుగా పరబ్రహ్మ స్వరూపాన్ని

అవసరమైన మేరకే వండుకుందాం, వడ్డించుకుందాం..!

విందు భోజనాల్లో వృధాను నివారిద్దాం..

కొందరు అన్నార్తులకైనా ఆకలి తీర్చుదాం..!

అన్నాన్ని మనకొసగిన అంతర్యామికి అంజలి ఘటిద్దాం!!

 

చల్లా దేవిక తెలుగు తేనియలు



బొమ్మలకొలువు

 

మా ఊళ్ళో #దసరా అంటే ఒక సందడి ఉండేది.

చిన్నపిల్లలూ పెద్ద పిల్లలూ అమ్మ నాన్నలూ మామ్మ తాతలూ అత్తా మామలూ పక్కింటి బంధువులు...ఇలా అందరూ కలిసి చేసుకునే పండుగ.... నా జ్ఞాపకాలు చిన్నప్పటి దసరా సరదాల పండుగవి... తరం తలచుకోనివి...నా తరం మరచిపోనివి.....

ఇప్పుడు బొమ్మలకొలువు ఎంతమంది పెడుతున్నారో తెలియదు.నా జ్ఞాపకాల కొలువు లోని ఒక తలపు.....

 

#దసరాకొలువు

"అందుకూరి మామ్మ వాళ్ళింట్లో  చెక్కలున్నాయి అడిగి తీసుకురా...

నర్సమామ్మింట్లో చిన్న బల్ల ఉందిట తాతగారు చెప్పేరు....

రమేషు వాళ్ళింట్లో టీపాయి అడిగేను...పీటలు కూడా....ఉన్నాయిట...ప్రసాదు వాళ్ళింట్లో మడత టేబులుంది...సాయం పట్టి తేవాలి....

అటుకు మీద కిటికీ తలుపుంది రాజాగాణ్ణి ఎక్కించు...

స్టూళ్ళు రెండూ కడగాలి....

డ్రాయరు లో పుస్తకాలు ఖాళీ చెయ్యి...సొఱుగుని తిరగేసి పెడదాం....

నాన్నగారి కొట్టుగదిలో పుస్తకాలున్న సొఱుగు కూడా పెట్టాలి....ముందు నాన్నని అడిగి పుస్తకాలు తీయ్...

ఒరే బుజ్జీ సీరియల్ లైట్లు తీసి చెక్ చేయి ...టేపు పని చేస్తుందా??లేకపోతే మూలా ప్రకాషుకి చూపెట్టిప్పుడే....

ఒసే పాపా బొమ్మలు తీసిస్తా జాగ్రత్తగా తుడవాలి...

ఒరే బట్టల పెట్టి తీస్తే... కింద చెక్క పెట్టిలో బొమ్మలున్నాయి...

మొన్న సంబరంలో కొన్న బొమ్మలు ఎలా ఉన్నాయ్? కాలు చేయి చక్రం కీళ్ళున్నాయా....లేదా???

ఎందుకే సెఖాళీ నవ్వులూ......

సుబ్బరంగా పజ్జ్యాలు పాటలూ నేర్చుకొండి...అందరికీ పోటీలు పెడతాను...

అల్లరి చేస్తే శొంటిపిక్కలే...అర్ధమయిందా."

ఇవన్నీ నవరాత్రుల ముందు మా మామ్మ పురమాయింపులు....

బొమ్మలకొలువు పెట్ఠడానికి సంరంభం....

కనీసం ఒక తొమ్మిది మెట్ల.కొలువు లేకుండా నవరాత్రి వెళ్ళలేదు...

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని శాఖలూ మా మామ్మ తన దగ్గర ఉంచుకుని మిగిలిన శాఖలు మా అమ్మ , ఇంకా మేం పిల్లలు నలుగురికీ ఇచ్చేది....

మా మామ్మకి అన్ని బోగట్టాలు ముందే ఉండేవి...ఎక్కడనుంచి ఏం తేవాలో ...ఎవరి సాయం ఎక్కడ తీసుకోవాలో....ఏం సామాన్లు కావాలో...ఎంత మంది రోజూ పేరంటానికి వస్తారో...ఎంతమంది పిల్లలో  ఎంతమంది పెద్దవాళ్ళో....అల్లరి చేసేవాళ్ళెంతో...పాటలు పాడేవాళ్ళెవరో...పీకి పాకం పట్టేదెవరో...అందర్నీ దృష్టిలో ఉంచుకునేది....

తొమ్మిదిరోజులలో ఆఖరి మూడురోజుల్లో ఒక రోజు పెద్దవాళ్ళకి పేరంటం పిలుపు,మిగిలిన రోజులన్నీ చిన్నపిల్లలందరికీ ఆహ్వానాలు...పేరుకి ఆడ పిల్లల ప్రోగ్రామైనా...మా అందరి స్నేహితులనీ పిలిచేవాళ్ళం. ఆ తొమ్మిది సాయంత్రాలూ మా అరుగు ఓ బృందావనం...ఓ తీర్థం...ఓ జాతర...ఓ వేడుక....ఓ పాటల పందిరి...ఓ నృత్య విభావరి...ఎవరికి వచ్చినవి వాళ్ళు చెప్పేవారు...టేపురికార్డర్లో నా కళ్ళు చెప్తున్నాయీ దగ్గర్నుంచీ...వేదం అణువణువున నాదం దాకా పాటలు పలికేవి...ఎవరికొచ్చిన రీతిలో వాళ్ళు గెంతేవాళ్ళం...

తెయ్యిమని గెంతే నేలాబండ నుండీ కుదురుగా కూర్చుని ఆడే అష్టాచమ్మా బిజినెస్ లదాకా అన్నీ ఆడేవాళ్ళం...

ఇపుడు మళ్ళీ లోపలకెళ్దాం...

కొలువు మొదటి మెట్టు మా ఇంట్లో టేబుల్ తో మొదలయ్యేది,తర్వాత మెట్లు వేరే వేరే సెట్టింగులతో చేసేవాళ్ళం మడత టేబల్,స్టూల్ళు,తిరగేసిన సొరుగులు,పనికిరాని తలుపు చెక్క,బెంచీ బల్ల అబ్బో...రాజమౌళీ రాఘవేందర్రావులు బలాదూర్ మా మామ్మ సెట్టింగ్ ల ముందు....

పక్కనుంచి ఓ రెండు మూడు దుప్పట్లతో కవర్ చేసి,బొమ్మలు పెట్టే ప్రాంతమంతా ఓ మంచి పొడుగైన డిజైన్లున్న చీర కప్పించేది.

కదలకుండా మేచింగ్ దారంతో కుట్టేసేది.

ఉఠ్టి బొమ్మలే కాదు...పార్కులు...జూ పార్కు...స్విమ్మింగ్ పూలు...గుడి...పక్కనే ఇసుక వేసీ పెట్టే వాళ్ళం.

మరి పార్కులలో మొక్కలు కావాలి కదా!!మరి మెంతులు ఓ రెండ్రోజుల ముందు వేసి ఉంచే వాళ్ళం...చక్కగా మొక్కల ఎఫెక్టు వచ్చేది...

ప్లాస్టిక్ ప్లేటుని ఇసుక లోపలికి నొక్కి నీళ్ళు పోసుంచే వాళ్ళం...దానిలో చిన్న చిన్న బాతులు (అప్పట్లో టూత్ పేస్టుతో  ఫ్రీ గా వచ్చేవి)...చిన్న చిన్న పువ్వులు వేసేవాళ్ళం...అట్టలతోనో..థెర్మాకోల్ తో నో గుడిని తయారు చేసేవాళ్ళం...

సీరియల్ లైట్లు చెక్ చేసి మాడిన బల్బులు మార్చి వేయటం,టేపు రికార్డర్ పని, స్టీరియో డబ్బాల కనక్షన్  నా డ్యూటీ...

ప్రసాదాలు తయారు చేయటం కావాల్సిన సామానులు తేవటం మా అమ్మ పని...మిగిలిన చిన్నా చితకా పన్లు మాతమ్ముడూ చెళ్ళెళ్ళవే...

మేం ఈ మహాకార్యంలో సైనికులం మాత్రమే...సర్వ సైన్యాద్యక్షురాలు మా మామ్మే!!ఓపికున్నన్ని రోజులూ చక్కగా మా చెళ్ళెళ్ళ తో చేయించింది...మరి తర్వాత మగ పిల్లలం ఉద్యోగాలకి ఆడ పిల్లలు చదువులకి పెళ్ళిళ్ళకి అంకితమైన తరువాత ఆ బొమ్మలు పెట్టె లోనించి బయటకు రాలేదు...మా మామ్మ తోనే ఆ హడావిడి మాయమైంది

ఆ బొమ్మల కొలువు రోజులు మళ్ళీ రావు...ఆ

 కోలాహలం మరవలేం....ఆ కార్యదక్షత కలివిడితనం ఇక ఎక్కడా చూడలేం....

అలాగని ఆ గుర్తులనీ మాపలేం....మా నలుగురితో పాటే అలాగే ఉంటాయి.....

కన్నాజీరావు.

 

                                            ****** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...