20, అక్టోబర్ 2020, మంగళవారం

పుస్తక సమీక్ష & రచనలు 17 & 18.10.2020

 


 

ఒక కథ:

జ్ఞానము - భక్తి

 

అది ఒకానొక విశాలమైన ఆశ్రమము. అందులో  ఒక చక్కటి పూల తోట ,  దేవాలయం , స్నాన మాచరించుటకు పెద్ద బావి, అతిథులకు విడిది,  మొదలగు సౌకర్యాలు ఉన్నాయి.

 

ఒకరోజు ఆశ్రమములో విడిది చేసిన జ్ఞాన శీలుడు అనే విద్యార్థి ఉదయము బ్రహ్మ ముహూర్తమున లేచి బావి దగ్గరికి స్నానమునకు వచ్చినాడు. అప్పుడు ఇతరులు ఎవరూ లేరు. బావిని ఆనుకొని ఒక ఇంటి గోడ  క్రిందటి రోజే సున్నము వేయించ బడి తెల్లగా మెరుస్తూ ఉండింది. అది చూసి అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది . తనకు తెలిసిన జ్ఞానం  అందరికీ పంచాలి అనుకొని తను రోజూ జపిస్తున్న" సోహం " అను మంత్రమును తెల్లటి గోడపై రాస్తే అందరూ తనలాగే చదివి జపించి తరించి పోతారని భావించి, వెంటనే అక్కడ  పడి ఉన్న ఒక బొగ్గు ముక్క తీసుకొని గోడపై "సోహం" అని పెద్ద అక్షరాలతో రాశాడు. సంతృప్తిగా స్నానం చేసి  తన విడిదికి వెళ్ళిపోయాడు.

 

అతడు వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఆశ్రమంలో విడిది చేసిన  ఒక భక్తి శీలుడు అనే విద్యార్థి  బావి దగ్గరికి స్నానానికి వచ్చాడు. రాగానే గోడ పైన వ్రాయబడి ఉన్న "సోహం " మంత్రాన్ని చూసి మనసులో ఇలా అనుకున్నాడు -"ఎవరో జ్ఞానమునకు సంబంధించిన మంత్రము వ్రాశారు . కానీ జ్ఞానం కన్నా భక్తి గొప్పది . అందుకని మంత్రము మార్పు చేయాలి". అలా అనుకొని, తెలివిగా  సోహం  పదానికి ముందు "దా" చేర్చి "దాసోహం"( దేవా నేను నీ దాసుడను ) అని భక్తిమార్గ మంత్రము గా మార్చాడు. తన తెలివికి తానే సంతోషపడి  స్నానం ముగించుకొని తన కుటీరానికి వెళ్ళిపోయాడు.

 

మరుసటి రోజు యధావిధిగా బ్రహ్మ ముహూర్తం సమయం లో జ్ఞాన శీలుడు బావి దగ్గరికి స్నానానికని వచ్చాడు. ముందు రోజు తను గోడ పై వ్రాసిన మంత్రం పూర్తిగా మారిపోవడం చూసి బాధ పడ్డాడు. తీవ్రంగా అంతరంగాన్ని మధించి ఒక చక్కటి ఆలోచన చేశాడు. తడవుగా గోడ దగ్గరికి వెళ్లి "దాసోహం"  అనే పదానికి ముం దు "" అను చేర్చాడు, ఇప్పుడు మంత్రము "సదా సోహం" ( ఎల్లప్పుడూ సోహం) అని మారిపోయింది. తన సమయస్ఫూర్తికి మిక్కిలి సంతోషించి తిరిగి వెళ్ళిపోయాడు..

 

కొద్దిసేపటికి యధావిధిగా భక్తి శీలుడు  అక్కడికి వచ్చి తను మార్పు చేసిన మంత్రాన్ని మళ్లీ మార్చారే  అంటూ బాధ పడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు అని అంతే తీవ్రంగా ఆలోచించి, గోడ  దగ్గరికి వెళ్లి " సదా సోహం" పదానికి ముందు" దా " అని చేర్చాడు, ఇప్పుడు పదము "దాస దాసోహం" ( దేవా నేను నీ దాసాను దాసుడను) అయింది.. రెట్టింపు ఉత్సాహంతో వెను తిరిగి పోయాడు..

 

పై విధంగా ప్రతిరోజు ఒకరు  ""  ఒకరు "దా" చేర్చుకుంటూ వెళ్లగా గోడంతా నిండిపోయింది, మొత్తం గోడ పాడైపోయింది.

విషయము ఆశ్రమ పెద్దకు తెలియగా వారు ఇద్దరినీ పిలిచి "నాయనలారా! మీరిరువురు మీ మీ మార్గములు గొప్పవని భావిస్తూ మా ఆశ్రమ గోడనంత పాడు చేసినారు. గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ  భక్తి జ్ఞాన మార్గములు సమన్వయం చేసి బోధించ లేదా? రెండు మార్గములు ఒకటే గమ్యం చేరుస్తాయి.  అందుకని మీ మూర్ఖత్వాన్ని మానుకొని ఒకరినొకరు గౌరవించు కొనుడు. అలాగే మీ ఇద్దరు కలిసి  గోడను  పరిశుభ్రం చేయండి." అని ఉపదేశించి ఆదేశించారు.

 

నీతి:

భగవంతుని చేరుకోవడానికి ఎన్నో సిద్ధాంతాలు , ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్నిటి గమ్యము  ఒకటే. ఒకటి గొప్పది ఇంకొకటి తక్కువది అనే అంతరము లేదు. తమ తమ మనో బుద్ధుల స్థాయిని బట్టి అనుకూలమైన మార్గం ఎంచుకుంటారు, అంతే...

 

CA కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు

 

 


 

బొమ్మల కొలువు

 

మూల రచన: డా కోలవెన్ను మలయవాసిని (విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం)

 

 

డా కోలవెన్ను మలయవాసిని గారు నాకు గుర్తుతుల్యులు.

2020 జనవరిలో  విశాఖలో వారిని సన్మానించుకునే అవకాశం కూడా లభించింది  

 

ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని జాతి నిర్వహించే వేడుకలను బట్టి గ్రహించవచ్చు

ఆంధ్రదేశంలో బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. మరికొందరు సంక్రాంతికి కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం, అనే వ్యవహారం ప్రాంతీయభేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు.

 

మరి, బొమ్మల కొలువు ఎందుకు పెడతారు ?

దసరా పండగకు బొమ్మల కొలువు పెట్టడానికి కారణాలు ఇవి:

 

శరదృతువు ఆరంభం ఆశ్వీయుజ మాసంతో. మాసంలో మొదటి రోజు పాడ్యమి మొదలు నవమి వరకు గల తొమ్మిది రోజులూ ఆదిశక్తి, ఆదిమకుటుంబిని అయినా పరమేశ్వరిని పూజిస్తారు. తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు అంటారు.

 

ఋతువు ప్రాధాన్యాన్ని బట్టి శరన్నవరాత్రులు అని కూడా అంటారు. తొమ్మిది రోజుల పాటు పూజ చేయడానికి గల కారణాన్ని భవిష్యపురాణం, దేవీభాగవతం వివరిస్తున్నాయి. జగన్మాత దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి తొమ్మిది నాళ్ళలో తొమ్మిది అవతారాలు ఎత్తింది. తొమ్మిది అవతారాలూ తొమ్మిది రోజులు పూజ చేసే సంప్రదాయం నెలకొంది.

 

అవతారాలు వరుసగా: 1. మహాకాళి, 2. మహిషాసుర మర్దని, 3. చాముండి, 4. మహామాయ, 5. రక్తదంతి, 6. శాకంభరి, 7. దుర్గ, 8. మాతంగిని, 9. భ్రామరీదేవి. దేవీ ఉపాసకులు లలితాపరమేశ్వరిని ప్రధానమూర్తిగా పెట్టి తొమ్మిది మందినీ ఆమె చుట్టూ నిలిపి పరివారదేవతలుగా కొలిచి నియమనిష్టలతో పూజ నిర్వహిస్తారు. దేవతలకు వారు ఇచ్చే రూపం నిర్గుణమే. అంటే ప్రత్యేకించి కన్ను, ముక్కు, చెవి వంటి అవయవాలు కాకుండా పసుపు ముద్దలను తమలపాకుల్లో కుంకుమ బొట్టు పెట్టి కొలుస్తారు. కొందరు మట్టితో శివలింగంగా చేసి పసుపుకుంకుమలు పెట్టి, ఆయా దేవతలను ప్రాణప్రతిష్ఠ చేసి అర్చన చేస్తారు.

 

ఇది ఒక విధంగా అమ్మల కొలువు.

భాద్రపద మాసంలో చివరి పదిహేను రోజులకు, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షమని పేరు. దీనికే యుద్ధ పక్షమని, పితృ పక్షమని కూడా పేర్లు ఉన్నాయి. పక్షం అంటే పదిహేను రోజులు. పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేస్తారు కాబట్టీ పితృ పక్షమన్నారు. పదిహేను రోజులలో, ఎప్పుడో ఒకప్పుడు దేవతలకూ రాక్షసులకూ పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసుల ధాటికి తట్టుకోలేక, యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకుని జీవించసాగారు. తమను అపజయ పరాభవం నుండి గట్టెక్కించమనీ, ఆపద నుండి కాపాడమనీ తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరి కొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు. అలా కొన్ని సంవత్సరాలు నిష్ఠతో పూజలు సాగాయి. ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధ విశేషాలూ ఇచ్చింది. వారి వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఉత్సాహ భరితులై, సాహసోపేతులై రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల నడిమి కాలం. దీనికే అభిజిత్ లగ్నమని పేరు.

 

పురుషులందరూ యుద్ధసన్నద్ధులై వెళ్ళగా, స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒకచోట నిలిపి పూజించారు. విధంగా స్త్రీలు దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది.

 

ఆనాడు స్త్రీలు తమకు లభించిన దేవతావిగ్రహాలను ఒకచోట కొలువుగా పెట్టి పూజించినబొమ్మల కొలువేదసరాకు బొమ్మలను కొలువుగా పెట్టే ఆచారంగా పరిణమించింది. తరతరాల నుండీ నేటిదాకా కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒకచోట చేర్చి అందంగా అమర్చటం. కొలువు అంటే సభ వంటిది. నాయకుడు తన ప్రధానస్థానంలో కూర్చుని, తన వారికి దర్శనం ఇచ్చి, వారి యోగక్షేమాలు కనుక్కుని, తగు నిర్ణయాలు తీసుకునే ప్రదేశం.

 

కొలువై యున్నాడే కోదండపాణి ,

కొలువైతివా రంగశాయీ

 

వంటి కీర్తనల్లో ఈమాట వింటూ ఉంటాం. బొమ్మల కొలువులో ప్రధాన దైవతంగా ఆదిశక్తిని నిలిపి, తక్కిన దేవతలను, సమస్త ప్రాణికోటినీ వరుసగా వాటి వాటి స్థానాల్లో పెట్టడమే కొలువు.

 

శివ శంకర్ కస్తూరి - తెలుగు తేనియలు

 


 

 

ఇదీ దసరాకు బొమ్మలు పెట్టే ఆచారం వెనుక ఉన్న కథ 🙏

 

శరదృతువు పద్యాలు  1️

 

శరదృతువు వచ్చేసింది. వసంత తరువాత శరదృతువు మనోహరం అని చాలా మంది  మహాకవుల అభిప్రాయం. వసంతం మీద ఎన్ని పద్యాలు వచ్చాయో, అలాగే శరదృతువు పైన కూడా అన్ని పద్యాలు వ్రాశారు మన కవులు. కాళిదాసు గారి ఋతుసంహారం ఎలాగూ ఉందనుకోండి  

 

కవిత్వం ఎప్పుడూ వైయుక్తికమే. కానీ కవిత్వపు గమ్యం మాత్రం సార్వజనీనత అయ్యి ఉండాలని మన ప్రాచీన కవులు బలంగా నమ్మారు.

కవి అనుభవం, స్వానుభవం కవిత్వం చదివే పాఠకుడి అనుభవమవడమే సార్వజనీనత అనిపించాలి.  అది సాధించే ప్రక్రియే సిసలైన కవిత్వీకరణ. ఇందులో సిద్ధహస్తులు నన్నయ గారు.

 

నేడు ఆదికవి నన్నయ గారు అందించిన శరదృతువు లోని కొన్ని పద్యాలు మీకు పరిచయం చేయబోతున్నాను 

 

ఉత్పలమాల

శారద రాత్రులుజ్వల సత్తరతారకహారపంక్తులై*_

జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధ బంధు

రోదార సమీరసౌరభము దాల్చిసుధాంశువికీర్యమాణ

ర్పూరపరాగ పాండురుచి బూరములంబరపూరితంబులై  

 


 

 

భావం 

 

మెరిసే నక్షత్ర మాలికలు, పూర్తిగా విరబూసినకలువల గుబాళింపు తో నిండిన గాలి, కర్పూరపు వెన్నెలల నివర్ణించే పదాలలోనే ఎంతటి లాలిత్యం,చల్లదనం ఉందొ చూడవచ్చు.

 

పద్యం అర్ధం కాకుండానే  పద సౌందర్యం దృశ్యం తాలూకు అనుభూతిని మన్సుల్లోనుండి ఆవిష్కరిస్తుంది. లయబద్దమైన సంగీతం లాగా .. పొయెటిక్ ని పరిచయం చేస్తుంది

 

కప్పురపు తావిలా తెల్లగా అంతటా పరచుకున్న చంద్రుని వెన్నెలతో పరిపూర్ణమవుతున్న రాత్రులు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుంది కర్పూరంలాగా. మరి కర్పూరపు సువాసన వెన్నెల కెక్కడిది అని సందేహం కవి గారికి ?

కలువపూల పుప్పొడి నిండిన వెన్నెల కాబట్టి దానికా సుగంధం కూడా అబ్బింది!

 

ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకే రాత్రులలోని మధురిమ, మధురోహలు అనుభవానికి వస్తాయి. 

నన్నయ గారి అక్షర మాధుర్యంలో మునకలు వెయ్యండి.

నన్నయ్యగారు తన కవిత్వానికున్న లక్షణాలు అని చెప్పుకున్నవాటిలో అక్షర రమ్యత ఒకటి అని తెలిసిన విషయమే.

 

 

 

 

రదృతువు పద్యములు  2️

ఇంతకుముందు ఉదహరించిన పద్యం నన్నయ గారి  అరణ్యపర్వంలోని చతుర్థాశ్వాసము ఆఖరి పద్యం.

 

శరత్తులోని వెన్నెలని వర్ణించడం మహత్తరంగా కనిపించింది కదా.

 

ఆ తరువాత సుమారు 300 సంవత్సరాల తరువాత అరణ్యపర్వంలో నన్నయ గారి పద్యాలకు కొనసాగింపు చేయాలనే ఆలోచనతో ఎర్రాప్రగడ శరత్కాలం ఉదయం  (సూర్యోదయం)  గురించి వర్ణిస్తారు 

 

ఈ పద్యం మూడు నాలుగు సార్లు చదవగలరు. చక్కగా అర్ధం అయిపోతుంది. నేను సైతం నన్నయ గారి అనుంగు శిష్యుడని, భావ స్వారూప్యత చాలా గొప్పగా ఉన్నదని చెప్పడమే బహుశా ప్రబంధ పరమేశ్వరుడి ఉద్దేశం 

 

చంపకమాల

 

స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా

వరణము లై దళత్కమల వైభవజృంభణ ముల్లసిల్ల ను

ద్ధురతరహంససారసమధు వ్రతనిస్వనముల్‌ సెలంగఁగాఁ

గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడఁగన్‌

 

శివ శంకర్ కస్తూరి - తెలుగు తేనియలు

 

 

ఈరోజు శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు రచించిన

ప్రేమ నవల ను మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నా

 

పుస్తకం పేరు  :: ప్రేమ

 

రచయిత యండమూరి వీరేంద్ర నాధ్

 

ముఖ్య పాత్రలు

 

వేద సంహిత , అభిషేక్, సోమయాజులుగారు అన్నపూర్ణమ్మ గారు ,

చలపతి ,

జైలర్ హెర్మన్ కార్టస్

 

 కధా పరిచయం :

 

నవల లో కధనాయకురాలైన  వేద సంహిత  ఆదిత్య పురం అనే

 

ఒక పల్లెటూరి కి వస్తుంది. చుట్టూ కాలువగట్టూ ఊరు పూజా పీఠం లా వింది.

ఊరు మొదట్లో వేపచెట్టూ, వేదం  చదువతున్నట్టూ ఉంది . గాలి పెదవులు

నీటి అలలను  సుతారంగా  ముద్దాడుతుంటే, సిగ్గుతో వయ్యారంగా  మెలికలు

తిరిగిన పిల్ల  కాలువ, ఆడపిల్ల నడుము చుట్టూ తిరిగిన  ఓణీలా వుంది .

కాలువ అంచునే  నీటిపైకి వంగిన కొబ్బరి చెట్లు , పనులు ముగించుకుని గంపలెత్తుకుని  ఇంటికి వెళ్తున్న కూలీలు లా ఉన్నాయి

సంజె కింజాయి రంగు  ఎరుపుదనాన్ని  తగ్గించడానికి  గోధూళి పైకి

ఎగురుతోంది . చీకట్లు  ఇంకా బలాన్ని సంతరించుకోలేదు  .

సరిగ్గా సమయానికి ఒక ఎద్దుల బండి ఊరిలో ప్రవేశించింది

దాని  మువ్వల శబ్దపు లయకు నీటిలో వంగిన కొబ్బరాకు పరవశించి  జలతరంగిణి మ్రోగించినట్టు  కదిలింది .

పెరడు అందానికి ముచ్చటపడింది సంహిత  అలానే క్షణం నిలబడిపోయింది.

 

పెరట్లో ముగ్గులు రాబోయే సంక్రాంతి లక్ష్మి నవ్వుల మొగ్గలు

అక్కడ గోబ్బెమ్మలు లచ్చిమి కలికి పచ్చ  తురాయి నిగ్గులు

బాదం చెట్టు పక్కనే నిద్రగన్నేరు ...... క్రింద  పూలు రాలిన నేల

 

నేల ఎలా ఉన్నది ? పన్నాకు విస్తళ్ళ భోగంపు పెట్ట పసుపు కుంకుమాకు పళ్ళాన బోసినట్టుఊరి చివర ఇల్లు ఎలా ఉంది? గొబ్బిళ్ళ కోన నిల్చిన గుమ్మడి పువ్వులా ఉంది

 

బావిలో నీటి తళ తళ ఎలా ఉంది ?

పంట కళ్ళమ్ము చూసిన రైతు కళ్ళ లో సంతోషం లా ఉంది.

అసలా మాటకొస్తే ఇల్లే అందమైన అమ్మాయి లా ఉంది.

ఇంటిముందు వరుసగా ఉన్న బంతి చెట్ల మధ్య సన్నటి దారి, అమ్మాయి  నుదిటి నడుమ పాపిడ..... ఇంటి ముందు ఎర్ర మందారం చెట్టు ఆమె నుదిటి బొట్టు...... గవాక్షాలు విశాలాక్షాలు .... వంట ఇంటి ఆటకపై చూరునంటిన నలుపు అమ్మాయి కంటి కొసల చెదిరిన కాటుక.

 

నూతి గట్టు ఆమె కాలి పటడ! గట్టుఅంచున తడిసిన ఎర్రమట్టి ఆమె కాలి పారాణి....గిలకపైన నులకతాడు, ముద్ద చేమంతి పూలు ముడిచిన ముద్దరాలి ముప్పేట జడలా ఉంది.

 

పరుచుకున్న పచ్చగడ్డి పెరడు అమ్మాయి పరికిణి అయితే, దడి అంచున పాకిన పొగమంచు పూలచెట్లు దాని అంచులు

 

(పల్లె వర్ణన గత వారం  పరిచయం చేశాను కదా! )

 

పల్లెలో  మొదటి రోజే  పరిచయం అయ్యి ఆమెకి వసతి దొరకడానికి సాయపడి ఆత్మీయం గా మెలుగుతున్న  చలపతి  వేద సంహిత పైన తన కున్న ఇస్ష్టాన్ని వెల్లడిచేయడం తో తాను వివాహితని అని అభిషేక్ తో తన పరిచయం గురించి చెబుతుంది. 

 

ఆంత్రో పాలజీ లో   అపాచీ కల్చర్  పైన   రీసెర్చ్ చేసే సమయం లో

మెక్సికోలో అపాచీ  గిరిజన తెగ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉద్యమం నడుపుతున్న  భారతీయ సంతతికి చెందిన ( నవలా నాయకుడు ) అభిషేక్  తండ్రి (అంత్రోపాలజిస్ట్) తో  ఇంటర్ నెట్ లో పరిచయం అవుతుంది. ప్రభుత్వానికీ అపాచీలకు సంధి కుదిర్చే ప్రయత్నం లో భాగం గా అపాచిలదగ్గరకి రాయబారిగా  వెళ్ళిన అభిషేక్ తల్లి దండ్రులను అపాచీలు చంపేస్తారు. అప్పటికే చదువు పూర్తిచేసుకుని డాక్టర్ అయిన అభిషేక్ ,

అబద్రతా భావంతో హింస వైపు వెళుతున్న అపాచిల జీవితల్లో మార్పు తేవాలని వారిలో ఒకడిగా మారి   ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉద్యమం నడుపుతున్నాడనే అనుమానంతో అభిషేక్ పైన ఒక బూటకపు హత్య నేరం మోపి ఉరిశిక్ష వేసి  ఊరి తీయడం కోసం గాజా కాలిఫోర్నియా క్రింద పసిఫిక్ మహా సముద్రం లో ఒక నిర్జన దీవికి తరలిస్తారు. అక్కడ జైలర్ గా ఉన్న  హెర్మన్ కార్టస్  అపాచీల దాడిలో బార్యని కొడుకుని కోల్పోవడం వలన అపాచీల పట్ల ద్వేషం తో ఉంటాడు.  అపాచీల నాయకుడు అభిషేక్( ది లయన్ ఆఫ్ అపాచీ) ని ఊరి తీయాలని ఉవ్విళ్లూరుతూ అతన్ని మాటలతో హింసిస్తూ ఆనంద పడుతూ ఉన్న సమయం లో తమ నాయకుడైన అభిషేక్ ని   దీవి నుండి తప్పించడానికి అపాచీలు వేల సంఖ్యలో వచ్చి జైలు సిబ్బంది పై దాడి చేసే క్రమం లో   హెర్మన్ కార్టస్ కి  విషము పూసిన బాణం తగిలి చావు బ్రతుకుల్లో ఉన్నపుడు డాక్టర్ అయిన అభిషేక్ అతన్ని కాపాడి తన రక్తం ఇచ్చి ప్రాణ దానం చేస్తాడు. సంఘటన తో   హెర్మన్ కార్టస్ మనసులో అభిషేక్ పట్ల కలిగిన అభిమానం తో నీ చివరి కొరిక ఏమిటో చెప్పు అన్నప్పుడు తన ముత్తాతలు నివసించిన భారతదేశం వెళ్లాలని అది కూడా దక్షిణ భారతం లో గోదావరీ తీరం లో ఉన్న పల్లెటూరిలో ఒక నెల రోజులు గడపాలని కలలు కనేవాడిని  అంటాడు. సరే వెళ్లిపో నిన్ను వదిలేస్తాను అంటే అభిషేక్ ఒప్పుకోకపోవడం తో సరే నెల రోజులు అక్కడ గడిపి మళ్ళీ వచెయ్యి. అప్పుడు నా అహం కాస్త అయిన చల్లబడుతుంది అని నచ్చచెప్పి పంపుతాడు.

 

అలా ఆదిత్య పురం వచ్చిన అభిషేక్ ని తన భర్త గా పరిచయం చేస్తుంది వేద సంహిత.

నెల రోజులు ఆదిత్యపురం లో అభిషేక్ సొంతం చేసుకున్న అనుభూతులను యండమూరి గారు తనదైన శైలి లో  భావుకత లో ముంచి లేపుతారు.

( నాకు బయటపడటానికి ఒక వారం పట్టింది. ఇప్పుడు కూడా ఏమి రాయాలో, అసలు  ఏమి రాశానో తెలియకుండానే సమీక్ష ని రాశాను అక్షరాన్ని ఒదలలేను అలాగని అన్నీ రాయలేను కదా !)

 

పుస్తకం లో నన్ను ఎంతో ఆకట్టుకున్న కొన్ని ఆణి ముత్యపు  మచ్చు తునకలు

అంత్రో పాలజీ

 

అల్పజీవకణ పు స్థాయి  నుండి పూర్ణజీవ వికాసం కలిగిన స్థాయి

కెదిగిన మనిషి గురించి పూర్తి గా తెలుసుకోవడమే   అంత్రో పాలజీ.

 

మనిషి యొక్క అంత్రో పాలజీ అంతా ప్రేమ మీదే ఆధారపడింది.

 

ప్రేమ అన్న ఒక్క అర్హతతోనే మనిషి మిగతా జీవుల నుండి విడివడ్డాడు ప్రేమకోసమే కొండ గుహల్లోంచి బయటకొచ్చి సమాజాన్ని నిర్మించాడు .

ప్రేమ చుట్టూ తెలివితేటల పందెం వేశాడు. ప్రేమ కోసం స్పందించే గుండెని హృదయం లో పొందుపర్చుకునాడు . ప్రేమ కోసం యుద్దాలు చేశాడు ప్రేమకోసం శాంతిని స్థాపించాడు.

 

విలువ తెలిసిన వాడి చేతిలో పడి విలువ పెంచుకు నేవి ప్రపం చం లో రెండే రెండు  రెండూ విరీ, వనిత

 

విరివెళితే గుడిలోకిలేకపోతే ముడిలోకి

 

స్త్రివెళితే ప్రేమ పరిష్వంగం లోకిలేకపోతే నిర్లిప్తపు   గృహ్యకం లోకి

 

గాయం వలన వచ్చే  అరుపుకంటేగాయం వలన వచ్చిన మచ్చకే 

గొంతెక్కువ. అది చాలాకాలం  బాధిస్తుంది .

ప్రేమ పరిమళపు ఆహ్లాదం కంటే తరువాత వచ్చే ముల్లు  వియోగపు బాధే ఎక్కువ. వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని , వేదం వెంకట రాయ శాస్త్రిని మర్చిపోయాం కొంతకాలం పోతే విశ్వనాధ సత్యన్నారాయణనీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిని  కూడా మర్చిపోతాం

 

శ్రీనాధుడిని  సీస పద్యాలనూ మర్చిపోయాం కొంతకాలం పోతే ఛందస్సు ని అలంకారాలను లలిత పద పల్లవ కోమల కావ్యాలను తెలుగు పద లలిత్యాన్ని మర్చిపోతాం

 

ఋతు వర్ణన లను పద్య కవితల్నీ ఆస్వాదించే శక్తి ఆసక్తి అనురక్తి ఏమి ఉండదు కేవలం  బ్రతుకుతాం  అంతే

 

 (అని  వేద సంహిత పాత్ర మనసులో బాధ రూపం లో యండమూరి గారు ఆందోళన వ్యక్తం చేశారు గానీ మన సమూహాన్ని, ఇక్కడ పద్యం కోసం తపించే తమ్ముళ్లను , మాలాంటివారిని పిలిచి పద్యం నేర్పించే పూసపాటి గురువుగారిని  చూపిస్తే యండమూరి గారు కాస్త స్థిమిత పడతారేమో అనిపించింది)

 

పండుగల్ని కోల్పోయిన మనం  బాంధవ్యాలను కోల్పోతున్నాం

అటల్ని మర్చిపోయిన మనం స్నేహాన్ని కోల్పోతున్నాం

జీవితాన్ని  యాంత్రికం చేసుకున్న మనం  ప్రేమని కోల్పోతున్నాం

అంత్రోపాలజీ అంత్రోపాలజీ ఎంత నిశ్శబ్దం గా మమ్మల్ని పీల్చేస్తున్నావ్ నువ్వు ప్రేమించ గలిగేవాడు ప్రేమించబడే వాడూ నిత్యం సంతోషం గానే ఉంటారు.

 

నాగరికత అంటే సంప్రదాయాన్ని మార్చుకోవడం కాదు. జీవన విధానం లో మరింత సుఖం కోసం ఏం చెయ్యాలా అని తార్కికంగా ఆలోచించడమే

 

హృదయిం భరిణి తెరిచి, స్నేహపు కుంకుమతో ఒంటరితనం నుదుట బొట్టెట్టినా నా ప్రేమ పేరంటానికి రావేమి ప్రియతమా !

 

అభిషేక్ కి తెలుగు భాషాభిమానం చాలా ఎక్కువ . ఎన్నో గ్రంధాలు చదవడమే కాక మన పల్లెలలో వాడే పదాలు ఆడే ఆటలు అన్నిటిపైనా చక్కటి అవగాహన కలిగిఉంటాడు.

పరీక్షించడానికి చలపతి ఆంధ్ర దేశం  గురించి ఇష్టం కదా మా గురించి చెప్పండి అని అడగగానే అభిషేక్ ఇలా సీసపద్యం లో ఇలా చెబుతాడు.

 

కొమ్మ కొమ్మలమీద కమ్మగా గొంతెత్తి పాడేటి కోకిలా పాటవమ్ము

కొండెక్కి క్రిందున్న కోనలో కన్పటి యల్లాడు నడివి చింతాకు సొగసు

ముమ్మాడు మలుపుల మూర్తిగా ప్రవహించు నెర్ర కొండలలోని కుర్రవాగు

ముండ్ల కంపల పొదరిండ్ల శిఖరాగ్ర భాగమ్ముల పుట్టు రకాల పూలు

నునుపు దూరపు కొండ నెన్నుదుటిమీద కానుపించెడి కారుమేఘమ్ము నీడ

కోనసీమ అందాలవి కోటి కోట్లు

పల్కగాలేను నేనేమి వ్రాయగలను?

 

అభిషేక్ ఇంతలో  తెలంగాణ గురించి ఇలా చెప్పాడు.

 

సాలలు వేరులేక, సువిశాలము కానటువంటి కొంపలో..... మూలల కాపురంబు,

మునుముందగు చావిడిలోన గొడ్లు ఇండ్లుండవు మిద్దెలతో

కొండ్లంగల రాలు పేర్చి కుర్చుటెతక్కన్

ముండ్లుండును  పొలములలో కండ్లర0 జూడ నేరు కన్నులపుట్టున్.

 

ఏరులా సోమయాజి గారి గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. అది ఆనందం తో కూడిన దుఃఖం. ఎక్కడో విడేశాలనించి వచ్చి తమ తెలుగు కవితా కన్నియని తన భాషా చారణాలతో పొదుగుతున్న యువకుని అక్కున పొదుగుకోవలన్న ఆకాంక్షని అతికష్టం మీద అణుచుకున్నారు

 

ఇంతలో చలపతి అప్రయత్నం గా రాయలసీమ  గురించి అనగానే అభిషేక్ ఇలా అన్నాడు

 

నాల్గ0గుళ0బుల నడికట్ట మేరకై

కొట్లాడి  నల్వర్ కూలిరిచట

మాటపై మాటచే ఈటె బల్లెము లూని

ప్రాణాలు బలిగొన్న పల్లెలచట

మిరపకాయల కారమరి వారి కళ్ళలో

గుప్పెళ్లతో బట్టి కొట్టి రచట

రక్షణ కార్యా నిర్వాహ ణోద్యోగులన్

శిక్షింపబని పూను దక్షులచట

ప్రాణమన్నచో నొక గడ్డిపరక గాగ

గడ్డి పరకకై ప్రాణంబు లొడ్డిరచట

కడకు రాయలు కట్టిన కంకణాన

పొదిగియున్నట్టి రతనాలు పోయినేమొ

 

సోమయాజిగారిక ఆగలేకపోయారు. చప్పున అభిషేక్ వద్దకు వెళ్లి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ "నాయనా!

 

నా తండ్రి! తల్లి కన్న బిడ్డవో....

 

నిన్ను చూసి గర్విస్తు న్నానురా బాబు బోసిపోతున్న తెలుగు కళామతల్లి గళానికి వినూత్న హారాన్ని అలంకరించడానికి వచ్చావా బాబూ!! నువ్వు చూడని నీకు తెలియని మా గురించి ఎంత గొప్పగా ఆశువుగా చెప్పావ్ బాబూ!!

చిన్న వాడివైనా నీకు చేతులెత్తినమస్కరించాలనిపిస్తోంది. ఇంత కాలం కావ్యం నుండి కన్నీరు పుడుతుందని అనుకున్నాను.

కన్నీటి నుండి కూడా కావ్యం పుడుతుందని ప్రత్యక్ష0గా చూస్తున్నాను. కన్నీరే కాదుఅందము, లావణ్యము, వ్యధ, సంతోషం అన్నిటి నుంచీ పుట్టిన కావ్యానివి నువ్వు.

 

అభిషేక్ తిరుగు ప్రయాణం అయినప్పుడు సోమయాజులుగారు అడుగుతారు

ఏిం చూశావిక్కడ?”

చూడని దేముంది?”

నవ్వేడు  మనసులో అనుకున్నడు

పచ్చ గడ్డి పరికిణి కట్టుకుని రేళ్లుగడ్డి రవిక తొడుక్కుని పొగమంచు ఓణీ కప్పుకున్న పడుచుపిల్లలాటి  పల్లెని చూశాను.

 

కువకువల స్వాగతాల్లోంచి శంకరాభరణాన్ని గాజుల చప్పుళ్ళుతో గంధర్వగానాన్ని , కల్లాపి జల్లుల్లో కాంభోజీని విన్నాను. గుడి అరుగుమిద గుడుగుడు గుంచాలు దానిమ్మ చెట్టు వెనకాల దాగుడు మూతలూ చెరువు గట్టుమీదా చెమ్మ చెక్కలు రచ్చబండ  మీద అచ్చనాగాయలు మనసులోనే మనసుతోనే ఆడుకున్నాను.  వేద సంహిత వెన్ను నిమిరిన అన్నపూర్ణమ్మగారి ఆదరణ చూశాను. సోమయాజి గారి సజ్జన సాన్నిధ్యాన్ని చూశాను. నమ్రత మినహా మరేమీ తెలియని నంగనాచి  పిల్లకాలువని చూశాను మనిషిలోని మలినల్ని గుండెలో దాచుకున్న  తల్లి గోదావరిని చూసాను.

తలారా స్నానించి తపస్సు చేసే గుడిముందు ముగ్ద కోనేటిని చూసాను.

 

అన్నిటికన్నా ముఖ్యం ప్రేమని చూస్తున్నాను.

 

ప్రేమా నువ్వేవరమ్మా ! పద్మ నాభ పైట పైన పసుపుకొమ్మువా !మోహనాంగి స్నేహపు ముక్కెర లో మేలి ముత్యానివా ? కీరవాణి గొంతులో ఆకర్షించే కోకిలమ్మవా?   

 

నీలవేణి నవ్వులో శృంగారించే నాగమల్లివా ! వేదసంహిత వ్యక్తిత్వానికీ వడ్డాణానివా ?

 

అన్నీ చూసి వెళ్లిపోతున్నాను.

 

బాదం చెట్టు  బాధ పడొద్దంటూ , సంక్రాంతి ముగ్గు సముదాయిస్తుంటే,  గుమ్మడిపాదు గుబులొద్దు అంటుంటే నాతో పాటు నా అనుభూతుల్ని తీసుకుని వెళ్లిపోతున్నాను

 

కాలాన్ని కట్టే ఏరు నిదురోయింది

వెన్నెల్ని పక్కేసి ఊరు నిదరోయింది

 

ఎవరో కవి అన్నట్టు నీవు తొలిప్రొద్దు మంచు తీవె సోనవు నీవే నిట్టూర్పు

నీవే కన్నీరు ప్రేయసీ !

 

కొండవెనుక పురుడు పోసుకున్న ఆకాశం మేఘాల పొత్తిళ్ళలో తన బిడ్డను పడుకోబెట్టి పైకెత్తి చూపుతున్నట్టుంది సూర్యుడు పైకివస్తుంటే 

 

ముగింపు :

 

నెల రోజుల తరువాత అభిషేక్ తిరుగు ప్రయాణం అవుతాడు .

వేద సంహిత

ఎస్ కి సెలెక్ట్ అవడం తో శిక్షణ కోసం బయలుదేరుతుంది. వారిద్దరి గురించి ఒక్క చలపతికి మాత్రమే తెలుసు. ఇద్దరు రాల్వే స్టేషన్ లో ఉండగా ఉరినుండి పరిగెత్తుకువచ్చి చలపతి ఒక లెటర్ సంహిత  కి ఇస్తాడు. దాని సారాంశం ఏమనగా వేద సంహిత జైలర్ హెర్ మన్  కార్టస్ కి రాసిన ఒక లేఖ వలన అతను మనసు మార్చుకున్నాని ఇలా రాస్తాడు.  

 

సంహితా!

 నా  ఉద్యోగానికి రాజీనామా చేసి నా గ్రాట్యుటీ డబ్బుతో నా కొడుకు పేరుమీద హాస్పిటల్ పెడుతున్నాను. సంహిత అంటే వేద భాగ మిశ్రమం అని అభిషేక్ చెప్పాడు. హెర్ మన్  కార్టస్ అంటే స్పెనీష్ లో ఓడి గెలిచినవాడు అని అర్ధం అని అభిషేక్ కి చెప్పు.  అభిషేక్ ని ఒదిలేసి ఉద్యోగిగా ఓడి మనిషి గా గెలిచానని.

 

సంహిత

కళ్ళలో నీళ్ళు ఉరిశిక్ష తప్పినందుకు ఆనందం అతను వెళ్లిపోతున్నందుకు బాధ. ఇద్దరు తమ తమ గమ్యాల వైపు బయలుదేరడం తో నవల పూర్తి అవుతుంది.

 

రమ, కంకిపాడు - తెలుగు తేనియలు



గోదావరి సమీరం

 

వంశీ ,పూర్తిపేరు నల్లమిల్లి వంశీ పుట్టింది తూగోజి బలభద్రపురం   పెరిగింది రాంపురం (రామచంద్రపురం)

 పక్కన పసలపూడిలో !!

 

విక్టరీ మధుసూదనరావుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూనే కథలూ, నవలలూ, రేడియో కథలు కూడా రాసారు , మంచుపల్లకితో అరంగేట్రం చేసాకా, తను రాసిన మహల్లో కోకిల అనే నవలని సితార సినిమాగా తీసి తన దర్శక శైలి ప్రజలకు పరిచయం చేసారు. ఇప్పటివరకు 26 సినిమాలు...ఏది చేసినా మనసుతో చేయాలి అనే విషయం ఓషో నుంచి నేర్చుకున్నారట...

 

ఆయన రాసిన మా పసలపూడి కథలు, మా దిగువ గోదావరి కథలు బాగా ప్రజాదరణ పొందాయి..వంశీకి నచ్చిన రచయితలు లత, బుచ్చిబాబు, ఆర్.ఎస్ .సుదర్శనం, ముళ్ళపూడి వెంకటరమణ, నచ్చిన వ్యక్తులు బాపూరమణలు ,నాకు వంశీ నచ్చిడానికి అది కూడా ఒక కారణమేమో , బాపూ గారి బొమ్మల మహిమో, వంశీ కథల మహిమో మరి, పుస్తకం చదువుతుంటే మా సావిట్లో కూర్చుని మా వాళ్ళతో కబుర్లాడుతున్నట్టుంది .

 

ఆయన కథల్లో  కనపడే మనుషులు మనకి తెలిసినోరేనెమో అనిపించేలా నిజాలు, అయ్యయ్యో ఎంతన్నాయం అనేలా మనేదలు(మనోవ్యధ) , మనోడికి కష్టమొచ్చిందే అనుకునేలా కట్టాలు..అప్పుడప్పుడు ఈడు భలేటోడ్రా అనేలా  నవ్వులూ ఉంటాయి!!

 

వాటిల్లో నాకు నచ్చి ముచ్చటగా నేను పదే పదే చదివే కథల్లో ఒకటి :

 

 "శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్" ...

 

 

కూసంత కథ : గుప్త దానాలు చేసే కంటిపూడి ఆనందగజపతిరావు బహద్దూర్ జమీందారు గారి ఊరు తాడిపూడి , ఊరి గోదారి గట్టున కూర్చున్న ముప్పై ఏళ్ళ నూలు శంకర్రావు , సందేల సూరీడు వెళ్ళిపోయాక గోదావరిలో దూకి చచ్చిపోదామనుకుని , ఇంత దుస్థితి రావడానికి కారణం ఆలోచిస్తూ ఉంటాడు..

 

తాతపూడికి చెందిన శంకర్రావు తాత నూకరాజు, తండ్రి సోమరాజు నూరు కౌంటు గుడ్డ నేయడంలో సిద్ధులు, శివరాత్రికి ద్రాక్షారామం అమ్మవారికి చీర మొక్కుకున్న వారంతా వీరి దగ్గర చీర నేయించుకునేవారు !!

 

వీరిద్దరికన్నా మెరికలాంటి వాడైన శంకర్రావు మండపేట లో నూలు నూకరాజువారి బట్టల దుకాణం పేరుతో ఆర్భాటంగా ఒక షోరూమ్ తెరుస్తాడు, కానుకలు , లక్కీ డ్రాలతో జనాలని ఆకట్టుకొని దుకాణం కీర్తి మూడు ఊర్లు ఆరు బ్రాంచీలుగా పెంచి పెద్ద  పేరు తెచ్చుకుంటాడు !

 

పేరుతో పాటు స్నేహితులు పెరిగారు, వాళ్ళలో ఒకడు పూర్ణ , తక్కువ కాలంలో అతి దగ్గరయ్యాడు !!

 

సంపాయించి పిల్లలకి ధారపోయడమే కాదు మనం కూడా సంపాదనని కూసంత అనుభవించాలని మాయచేసి, నెమ్మది నెమ్మదిగా విలాసాల మత్తు శంకర్రావు కి అలవాటు చేస్తాడు పూర్ణ , . మృగరాజు నిద్రపోతుంటే కోతికి కూడా ధైర్యం వచ్చినట్లు ,విశ్వాసంగా పనిచేసేవాళ్ళు కూడా సిగ్గు వదిలేసి షాపులనుంచి వచ్చిన సంపాదన తినేసేవారు !!

 

మైకం లో ఒళ్ళు మరిచిన శంకర్రావు కళ్ళు తెరిచేసరికి మూతబడిన బట్టల షాపులు, ఊరినిండా చీదరింపులు మిగిలాయి....

" గోదాట్లోనో దూకి చావకుండా ఊర్లో మొహం పెట్టుకు తిరుగుతున్నావని" అతనిని అనేంత అసహ్యం జనాలకి పెరిగింది.

 

విరక్తి కలిగిన శంకర్రావు, పొద్దువాలే సమయానికి తను శాశ్వతనిద్రపోదామని, గోదారి గట్టుకు ఇదిగో ఇలా చేరాడు!

 

ఆలోచనల్లోంచి బయటకి వచ్చేసరికి చీకట్లు ముసురుకున్నాయి, ఇక లేచి దూకుదాం అనుకుంటుండగా ఎవరో వచ్చి పక్కన కూర్చుంటారు, ఎవరా అని చూస్తే దాదాపు అరవై వయసు, గ్లాస్కో లాల్చీ, పంచెతో చందమామలా నవ్వుతున్న ఒక అజానుబాహుడు కనిపిస్తాడు...

 

"ఎన్ని కోట్లిస్తే వస్తుంది ఇంత చక్కని వాతావరణం" అని పలకరించిన ఆయన్ని తప్పించుకు పోదామనుకున్న శంకర్రావు వెంటపడి , మాట మాట కలిపి విషయం రాబడతాడు !!

 

"తిరిగి వ్యాపారం మొదలు పెట్టడానికి ఏభైలక్షలవుతుంది, ఏడాదిలో తీరుస్తా , మీరిస్తారా?" అని వెటకారమాడిన శంకర్రావుకి జేబులోంచి చెక్కు తీసి ఏభైలక్షలకి చెక్కురాసిస్తాడు ..ఆశ్చర్యంలోంచి తేరుకుని  , ఇంత దానగుణమున్న మహానుభావుడి పేరు ఏమిటా? అని చెక్కుమీదున్న సంతకం చూస్తే కంటిపూడి ఆనందగజపతిరావు అని ఉంటుంది!!

 

ఎవరికి కనిపించని మహానుభావుని దర్శనం తనకి కలిగిందని కాళ్ళమీద పడబోతుండగా , నాకిలాంటివి అసహ్యం,ముందు డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టుమళ్లీ ఏడాది ఇదే సమయానికి ఇక్కడే కలుద్దామని వెళ్ళిపోతాడు !!

 

అదృష్టం వరించిన శంకర్రావు, ఖాళీ గన్ను కన్నా బుల్లెట్లు ఉన్న గన్ను మనలో ధైర్యాన్ని పెంచుతుంది.  కనుక అనవసరంగా ఖర్చుపెట్టి బాధపడేకన్నా, చెక్  మార్చకుండా కాన్ఫిడెన్స్ ని ఇలాగే ఉంచి, ఏభైలక్షల ధైర్యంతోనే వ్యాపారం మొదలుపెడతాను అనుకుంటాడు.

 

పాతమిత్రులని కలిసి ఇకపై చెడు జోలికి పోనని మాటిచ్చి, తను మళ్ళీ వ్యాపారం మొదలు పెడదామనుకున్న విషయం చెపుతాడు, నీవెనుక మేమున్నామంటూ స్నేహితులు వెన్నుతడతారు!!

 

ఒక ఫ్రెండ్ దగ్గర ఖాళీ షాపు తీసుకుని, పాత పరిచయమున్న బట్టలమిల్లు యజమానులని  కలిసి తనకి బట్టలు సప్లయి చేసేటట్టు ఒప్పిస్తాడు,గతంలో అతని నిజాయితీ తెలిసిన వారంతా 100 శాతం క్రెడిట్ తో బట్టలు పంపుతారు.

 

హంగూలేకుండాఆర్భాటాల బిల్లు మీ బట్టలమీద వేయకుండా నిజాయితీగా వ్యాపారం మొదలుపెడుతున్నానంటూ పాంప్లెట్స్ ప్రింట్ చేసి , వ్యాపారం మొదలుపెడతాడు!!

 

మొదటిరోజే అతను తెచ్చిన బట్టల తాను లన్నీ అమ్ముడవుతాయి, 100 శాతం క్రెడిట్ మీద ఇచ్చిన వ్యాపారులందరికీ వెంటనే బాకీ తీర్చేస్తాడు...

 

.... అలా మొదలైన సెకండ్ ఇన్నింగ్స్ దిన దిన ప్రవర్ధమానమై మరిన్ని బ్రాంచీలతో నూకరాజుగారి బట్టల దుకాణం పూర్వ వైభవాన్ని పొందుతుంది!!

 

తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన చెక్కు ని దేవుని మందిరంలో పెట్టుకున్న శంకర్రావు, రోజూ చెక్కు దేవునికి దణ్ణం పెట్టుకుని కానీ పనికి వెళ్ళేవాడు కాదు....

 

అలా రోజులు, నెలలు గడిచి, ఏడాదయింది...

 

ఏభైలక్షల చెక్కు తిరిగిచ్చేసి కృతజ్ఞతతో ఆయనకి కోటి దండాలు పెడదామని, తన స్కార్పియో లో గోదారి గట్టుకు వెళ్లిన శంకర్రావు కి  జమీందారుగారి దర్శనం కలిగిందా లేదా? ఏం జరిగింది ? అసలు జరిగిందా లేదా ? జరగకపోతే ఏం జరిగినట్టు... అనేది....

 

ఉహు..నేన్ చెప్ప!! ఇప్పటికే చాలా విషయం చెప్పేసాను  ...ముగింపు అనేది భలే బావుంటుంది మరి!! నా సమీక్షకు మంచి సమీక్షలిస్తేనే చెపుతా !!

 

నాకు కథ ఎందుకు నచ్చిందిరా అంటే.....

 

1 మన విజయం మన తలకెక్కితే , మన కళ్ళు నెత్తికెక్కుతాయ్ , మర్రిచెట్టులా ఎదిగినా కూడా వేర్లు నేలకి దిగినట్టు , కళ్ళు ఆకాశాన్ని చూడకుండా, కాళ్ళు భూమిని వదలకుండా చూసుకునే భాజ్జత మనదే!!.

 

2.పెరుగుట విరుగుట కొరకే అని(అతి సర్వత్ర వర్జయేత్) ఎవరికీ పరిచయమైన వెంటనే అతిగా దగ్గరైపోకూడదు..ఫెవికాల్ లా కాకుండా స్టిక్కర్ లా ఉండాలి , నెమ్మదిగా బేరీజు వేసి, తర్వాత అతుక్కుపోవాలి(భోగిపిడకలా..ఛీ ఛీ అనకండి ప్లీజ్)...

(దీనికి .. హన్నన్నా అని ముక్కున వేలేసుకుంటారు, అయినా నేను ఏమీ చేయలేను), బుఱ్ఱ వాచి చెప్తున్న సత్యమిది !!

 

3. ఎవడో ఏదో అన్నాడని తెగ ఫీలయిపోయి ,సచ్చిపోదాం పద అని పద్దాక అస్తమించే సూర్యుడి వెయిపు పోకూడదు, సూర్యుడినే తీసుకోండి, వేసవి వేడికి మంటెక్కి నోటికొచ్చి తెలుగులో తిడతాం ,కుంగిపోడు సరికదా, ఎవ్వరేమనుకున్నా నాకేమని....చెల్లియో చెల్లకో అని ఏడు గుఱ్ఱాలమీద లగెత్తుకుని వస్తాడు !!

 

3+1.మన చేతిలో డబ్బులేకపోయినా పర్లేదు నేనున్నా అని మనిషిచ్చే బలముంటుంది చూసారు...

 

మీ వెనుక నేనున్నా అని కృష్ణుడిచ్చిన ఇలాంటి ధైర్యంతోనే పాండవులు కురుక్షేత్రాన్ని జయించారు ,.

మనవన్నీ బుల్లి బుల్లి భవసాగరాలు, ఎవడో ఒకడు పిచ్చోడయినా సరే దూరంనించి మనని చూసి చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వినా చాలు చిన్న తెప్ప వేసుకుని ఈనుప్పుల్లతో తోసుకుంటూ దాటేయచ్చు!!

సో... కనుక..ఇదన్నమాట వారం నాకు నచ్చిన వారు రాసిన నేను మెచ్చిన కథా పరిచయం !!

 

పోస్ట్ పెద్దది అయినందుకు క్షమించండి , మీ సహనం గురించి తెలిసి చేసిన పెంకితనం అని సరిపెట్టుకోండి

 

వెళ్ళిపోయిన శంకర్రావు ని , చేతిలోని చెక్కుని చూసుకుని... గోదారి గట్టంపటే నడుచుకుని వెళ్తున్న పెద్దాయన పక్కన ఒక మెటాడోర్ వాన్🚑 ఆగుతుంది., అందులోంచి పెనికేరు పిచ్చాసుపత్రి డాక్టర్లు , నర్సులు వచ్చి పెడరెక్కలు విరిచి వేన్ లో తీసుకుపోతారు...

ఆయన తాతపూడి జమిందార్ కాదు() ...దిగువగోదారి కోలంక రాజుగారు ,మోసాలతో నిండిన ప్రపంచ పోకడ పై తెగ ఆలోచించి పిచ్చోడయ్యాడు, ఇసుక కాంట్రాక్టరయిన కొడుకు చెక్కుబుక్కులు దొబ్బేసి బాధల్లో ఉన్నవాళ్ళకి ఇలా కర్ణుడిలా గుప్తదానాలు చేసేస్తూ ఉంటాడు ....

ఏదేమైతేనేం, ఆయనెవరయితేనేం...మంచే చేసారు..మనకి తెలిసి ఒక ప్రాణాన్ని కాపాడాడు...ఇలా ఇంకొన్నాళ్ళుంటే ఇంకెంత మంచి చేసేవాడో...

Ps : పెనికేరు డాట్రారు మా సుట్టాలే, మా పిన్నికి మావగారు, నా ఫ్రెండ్ కి తాతగారు...వివరాలు తర్వాత చెప్తా.

 

విష్ణుప్రియ - తెలుగు తేనియలు


పుస్తక సమీక్ష

పుస్తకం పేరు :--అమ్మ

రచయిత :--మాక్సిమ్ గోర్కీ

(రష్యన్ రచయిత )

 

తెలుగుఅనువాదం --క్రొవ్విడి లింగ రాజు.

 

ముఖ్యపాత్రలు:-1.నీలొవ్నా

 2.పావెల్ 3.అంద్రెయ్ 4సాషా

5.సోఫ్యా 6.నీకొలాయ్ 7.యెగోర్ 8.రీబిన్

 ఇందులో కథానాయిక నీలొవ్నా 'అమ్మ పాత్ర ప్రత్యేక మయినది. సామాన్య కార్మిక స్త్రీ పాత్ర అమ్మ పాత్ర. నవల ప్రారంభంలో చూసినప్పుడూ తన వంటి వేలాది కార్మికుల మధ్య ఆమె కూడా ఒక స్త్రీ. భర్తలు కర్మాగారాల్లో పని చేసి, తప్ప తాగి తందనాలు తొక్కి, ఒకరితో ఒకరు పోట్లాడుకుని, వచ్చి భార్య లను చితక బాదే కుటుంబాలలో తాను బాధిత మహిళ. కానీ తన కొడుకు పావెల్ వ్లాసొవ్ ఎప్పుడైతే ఫ్యాక్టరీ తో తెగదెంపులు చేసుకుని, విప్లవకారుడు అవుతాడో, అప్పుడు భుజం కలిపి నిలబడుతుంది "అమ్మ". నవలలో అమ్మ అనుసరించిన పథం  విప్లవం లో  కార్మికులు అనుసరించే పథం ఒక్కటే.

 ఆనాటి వాస్తవమైన చరిత్ర ఘటనల ఆధారంగా రచించబడిన గ్రంథం అమ్మయాజమాన్య నిరంకుశ ధోరణి పై తిరుగుబాటును కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు   పుస్తకంలో. అక్షరాలు కూడా రాని అమ్మ విప్లవకారులకు తోడ్పాటు నిస్తూ అక్షరాలు నేర్చి తోటి కార్మికుల జీవితం విముక్తి చేయడానికి ప్రాణార్పణ చేస్తుంది. కొడుకు మరియు అతని స్నేహితులతో కలసి ఆమె చేసిన విప్లవ తిరుగుబాటు" అమ్మ" నవలగా ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది."ఆత్మ పునరుత్ధానం" అని అమ్మ పాత్ర ద్వారా గోర్కీ తన గొంతు వినిపించాడు. సోషలిజం, సమసమాజం అనే పదాలు సాహిత్యం లో మొదటి సారి ప్రయోగించి ప్రపంచ మానవాళికి ఆత్మ బంధు వయ్యాడు గోర్కీఒక్క తెలుగు భాష లోనే 10సార్లు ముద్రింప బడిన పుస్తకం అమ్మ. అందుకే మిత్రులారా !చదివేయండి మరి.

శిరీష - తెలుగు తేనియలు

 


 

 

జాషువా గారి పిరదౌసి రెండో భాగం లోని ఒక గొప్ప సీస పద్యము

మానవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ కనిపించడే అనే ధోరణి లో ఉంటే దేవదేవుడు ఎక్కడ కనిపించడు.

నీ జ్ఞాన నేత్రం తెరచి చూస్తే దివ్య రూపుని దర్శనం సాక్షాత్కారం అవుతుందనే భావంలో వ్రాసిన గొప్ప పద్యం.

 సంజ కెంజాయలో జలకంబు సవరించి

 పఱతెంచు సూర్యబింబంబు లోన

 పదనాఱు దినముల పరువు వచ్చిన నాఁటి

 చంద్రుని ధవళ హాసములలోన

 పూల తోటలతోడ ముద్దు ముచ్చట సెప్పి

 చెఱలాడు మొలక తెమ్మరలలోన

 నీలమేఘంబుల నెఱియలలోఁగుల్కి

  పరువెత్తు మెఱపు గర్భముల లోన

 హాయిగాఁ బవ్వళించి బ్రహ్మాండములను

 బల్కరించుచు నున్న దివ్య స్వరూప!

 హృదయమును జీల్చి పూజ లర్పించుకొందు

 నందుకొనిపొమ్ము,వ్యవధి లేదనక రమ్ము.


 

 

సూర్యబింబంలోను, నిండుజాబిల్లి ధవళ హాసములోను,మొలక తెమ్మరలలో,మేఘమాలికలలోని మెరుపుల్లో,అన్నింట్టా నీ వునికి కనుగొన్నానని స్తుతిస్తున్నాడు.తన పూజలందుకోమంటున్నాడు.

 

ప్రకృతి వర్ణన అనగానే   దేవదేవుడు తను సృష్టించిన సకల చరాచర జగత్తు వైభవాన్ని జాషువా చెవిలో చెప్పినట్లుగా కవీశ్వరుడు వర్ణిస్తారు అని చెప్పుట అతిశయం కాదని అనిపిస్తుంది..

 

పదహారు దినముల ఈడు వచ్చిన చంద్రుని ధవళ హాసములట. నీల మేఘముల చీలిక ల్లో కులికి పరువెత్తు మెరుపు గర్భం లో దైవం ఉందట.

జాషువా నీ ప్రకృతి వర్ణనలను చదివి ఆస్వాదించి మైమరచడమే నీకు మేము ఇచ్చే అత్యున్నత గౌరవము

ఇంతకీ పద్యంలో వ్రాయుటలో నా ఆంతర్యం ఏమిటంటే... రేపటి దినమున మన తేనియలకు కవిదిగ్గజుని పిరదౌసి కావ్య ద్వితీయ భాగం పరిచయము చేయు చిరు ప్రయత్నం చేస్తానని విన్నవించుకొంటున్నాను.

 

వెంకట్ సి. హెచ్ - తెలుగు తేనియలు

 

 

 

 

దత్త పది  పవరుటవరు, కవరు ,లవరు   

అన్యార్దములో శ్రీ కృష్ణుని వర్ణన

వసుదేవ చిరుత పాపడు,నవనీత చోరుడు జనాకర్షక  రూ( వరు)డు

 సాత్రాజితీ మానసా కుసుమాలుడు, ఘనుడు జగన్నాటక (టవరు)డు 

 వైదర్భ కోమలి వర రుక్మి  ణీపడ   తు( వరు)డు కటుకు దుక్శ్రుతిమద  

మడచిన శూరుడు, పడతి రక్షకుడు , జనులకు  యుక్తాయుక్తతలన  (లవరు)

 

చుకొన మని తెల్పు  చుండు  శిక్షకుడుగురువు 

సుతుని కాచిన శిష్యుడు, సుందర వద

నుడగు నా శ్రీ కృష్ణు డెపుడు విడువక నను

కాచు చుఁడును నిరతము ఘనత తోడ

దుక్శ్రుతి  =  పాము

 

పూసపాటి - తెలుగు తేనియలు

 

                              ****** 

 

 సమీక్ష 18.10.2020

 దేవదాసు నవల

 

ఏ నవలయితే ప్రచురింపబడిన తర్వాత వందేళ్లు దాటి కూడా కథా రూపం లో పాఠకులను, సినిమా రూపంలో  ప్రేక్షకులను అలరిస్తున్నదోఆ నవలే "దేవదాసు."

 

1901 లో బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ దేవదాసు నవల రాశాడు. 1917 లో అచ్చయింది. 1953 లో చక్రపాణి గారు తెలుగులో అనువాదం చేశారు. అప్పటినుండి శరత్ బెంగాలీ నవలలు ఎన్నో తెలుగులోకి అనువాదమయి ప్రజాదరణ పొందాయి. అప్పట్లో చాలామంది శరత్ చంద్ర తెలుగు రచయిత అనే అనుకున్నారు.

 

వింత విషయం ఏమంటే శరత్ గారు మిత్రులకు రాసిన ఉత్తరంలో దేవదాసు నవల తనకు నచ్చలేదని ప్రచురించవద్దని రాశారట.. అయినాప్రచురించబడి  అసంఖ్యాక పాఠకులను ఆకట్టుకుంది. ఇంతగా ఆకట్టుకున్న ఈ నవలలో ఏమున్నది?

 

కథ విషయానికి వస్తే దేవదాసు, పార్వతి ఇరుగుపొరుగు ఇళ్ల పిల్లలు.  దేవదాసు జమిందారు అబ్బాయి , పార్వతి  పేదింటి అమ్మాయి.  ఇద్దరి మధ్య స్నేహం ప్రణయంగా మారుతుంది.  కానీ ఆర్థిక అసమానతల వల్ల దేవదాసు తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించరు. తల్లిదండ్రులను ఎదిరించే సాహసం లేదు దేవదాసుకు. పార్వతి మరొకరికి భార్య అవుతుంది. దేవదాసు తాగుడుకు బానిస అవుతాడు.

 

యద్దనపూడి సులోచనారాణి నవల లాగా దేవదాసు ధీరోదాత్తుడు కాడు. తనను  నమ్ముకున్న వాళ్ళను మధ్యలో వదిలేసి, తనను తాను హింసకు గురి చేసుకొనిదారి తెన్ను లేకుండా జీవనం సాగించి తనమీద తానే జాలిపడిఇతరుల నుండి జాలిని ఆశించే పిరికివాడు దేవదాసు. ఎలా బతకాలో తెలియక ఒకరి మీద ఆధారపడే వాడు దేవదాసు. ఆఖరి దశలో దేవదాసు స్వగ్రామానికి వచ్చి , పార్వతి ఇంటి ముందు చనిపోతాడు.

 

రామాయణం కథ అంతా సీతమ్మ చుట్టే తిరుగుతుంది.  అలాగే దేవదాసు కథ పార్వతి చుట్టూ తిరుగుతుంది. కథను నడిపించిన పార్వతి , దేవదాసు కంటే బలమైన వ్యక్తిత్వం కలది. పెళ్లి చేసుకున్నాక పార్వతి మంచి ఇల్లాలు అనిపించుకుంటుంది. చివర్లో తన చిన్ననాటి స్నేహితుడు అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడని తెలిసి బాధతో పిచ్చిదవుతుంది.

 

భగ్న ప్రేమికుడైన దేవదాసుకు చంద్రముఖి అనే వేశ్య సేవ చేస్తుంది . ఈ పాత్రను శరత్ గారు చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దారు.  తన సర్వస్వం దేవదాసు కొరకు వినియోగించి ఆ క్రమంలో  తన వృత్తినే మార్చుకొని అజ్ఞాతంలోకి వెళ్లి పోతుంది చంద్రముఖి.

 

 ఈ నవలలో అత్యంతంగా ఆకర్షించే అంశాలు ఇలా ఉన్నాయి.

 

నాటి సమాజ నేపథ్యం:

రచనా కాలంలోని పరిస్థితుల నేపథ్యంలో దోపిడికి గురి అవుతున్న స్త్రీల పక్షాన బలమైన స్వరంలా తన రచనల ద్వారా నిలిచారు .  శరత్ చేత  అలా సృష్టించబడినవే  దేవదాసుపరిణీత లాంటి నవలలలోని  బలమైన స్త్రీ పాత్రలు. దేవదాసు నవల ప్రచురింపబడిన వందేళ్ల తర్వాత కూడా సమాజంలో అంతరాలు మారకుండా ఉండటమే ఈ నవల అంతగా అన్ని తరాల వారిని ఆకట్టుకుంది.  ఈ కారణం చేతనే ఈ నవల సినిమా రూపంలో దాదాపు 15 మార్లు అన్ని భాషల్లోనూ వెండితెర కెక్కింది.  దేవదాసు నవలకు నాటి సమాజ పరిస్థితులు , రచయిత వాటిని ఎండగట్టిన తీరు , ఒక ఆకర్షణ.

 

పార్వతి వ్యక్తిత్వం:

తండ్రి మాట జవదాట లేక  తనను వదిలేసిన దేవదాసు ను ఉద్దేశించి" ఏం తనకేనా తల్లిదండ్రులు ఉన్నది. నాకు మాత్రం లేరా"అని అంటుంది. ఒక మారుమూల గ్రామంలో ఈ మాత్రం ఆత్మగౌరవం ప్రదర్శన పార్వతి పాత్ర ద్వారా శరత్ చేయించడమే ఈ నవల ప్రధాన ఆకర్షణ.

 

దేవదాసు తిరుగుబాటు:

ఇద్దరు బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల మధ్య తేలిపోతాడు దేవదాసు.  ఇది అతని పిరికితనానికి నిదర్శనం అని అనుకున్నా అంతర్లీనంగా అతను తన సమాజం మీద చేసే నైతిక తిరుగుబాటు. గాంధీజీ సత్యాగ్రహం లో లాగా తనను హింసించుకొని తన ఆగ్రహం ప్రకటిస్తుంది ఈ పాత్ర.

 

సినిమా కథ లో కొన్ని మార్పులు చేశారు దర్శకులు.. దేవదాసు పాత్రను పిరికివాడు గా కాకుండా ఒక గొప్ప ప్రేమికుడిగా చిత్రీకరించి కథా నాయకుని చేశారు.. అట్లాగే చివరిలో పార్వతి చనిపోయినట్లు కథనూ మార్చారు.

 

అలా, నిత్య నూతనంగా పాఠకులను అలరించే నవల దేవదాసు.

 

CA కె మల్లికార్జునరావు - తెలుగు తేనియలు

 

 

1️

కావ్య ఖండిక పేరు: పిరదౌసి (ద్వితీయాశ్వాసము)

కవి: నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుఱ్ఱం జాషువా గారు

 

కవి పరిచయం:

 దైవ సృష్టిని చూసి పరవశించి అనేక శ్రేష్ఠమైన ప్రకృతి వర్ణనలతో చదువరుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న కవిదిగ్గజుడు, కవికోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి విశ్వకవి సామ్రాట్ బిరుదాంకిత; కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన ఈ కళాప్రపూర్ణ జాషువా గురించి తెలియని తెలుగు వాడు ఉండడేమో! గండ పెండేరం ధరించి కనకాభిషేకాలు పొంది, గజారోహణం చేసి, పగటి దివిటీల పల్లకిలో ప్రాభవంబుగా ఊరేగిన జాషువా గారి గురించి మళ్లీ పరిచయం చేయడం పద్య రచన చేయు వారికి లఘువులు గురువులు గురించి  వివరించు చందముగా ఉంటుంది.

 

కావ్య ఇతివృత్తం/ నేపథ్యం:

గజనీ మహమ్మద్ తన విజయ గాథలను తెలుపుతూ గ్రంథం వ్రాయమని పిరదౌసి అనే పారశీక కవికి తెలుపగా, పద్యము నకొక బంగారు నాణెం ఇస్తానని నవాబు మాట ఇవ్వగా, పిరదౌసి 30 ఏళ్లు కష్టపడి 60000 పద్యాలతో షానామా అనే గ్రంథం వ్రాసి చక్రవర్తికి ఇవ్వగా సుల్తాన్ మాట తప్పి వెండి నాణేలు ఇవ్వడాన్ని తిరస్కరించి రాజు గారు మాట తప్పడాన్ని ఖండిస్తూ లేఖ వ్రాయగా; రాజు గారు కవీశ్వరుని బంధించి చంపమని ఆజ్ఞాపించడం తెలిసిన పిరదౌసి తన భార్య కుమార్తె తో అడవులకు వెళ్ళడం జరుగుతుంది.

(గతంలో కావ్య ప్రథమ భాగము పరిచయం చేయుటలో ఈ వృత్తాంతం తెలుపుట జరిగింది.)

 

ఆ తర్వాత అడవుల్లో కవీశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈశ్వరుని వేడుకొని తన వేదనని తెలుపు ప్రయత్నం రెండవ భాగంలో ఇతివృత్తం గా ఉంటుంది. జాషువా గారు స్వతహాగా ప్రకృతి ఆరాధకుడు. పిరదౌసి తానై ప్రకృతిని వర్ణించు సన్నివేశాలు బహు హృద్యంగా ఉండి మనసుని ఆనంద డోలికల్లో విహరింప జేస్తాయి.

 

ప్రధాన అంశం అయిన కావ్య పరిచయం......

2️

పిరదౌసి ద్వితీయా శ్వాసము పరిచయం

 

సుల్తాన్ పిరదౌసిని బంధించి చంపమని ఆజ్ఞ ఇచ్చిన విషయం పిరదౌసి కి తెలిసి భార్య, కుమార్తెతో అడవికి పారిపోవడం జరుగుతుంది. సూర్యాస్తమయం అయ్యి నింగి నేల పాత పడిపోయి, తారకలు దీపాలు వెలిగించగా మన దౌర్భగ్యపు కవీశ్వరుడు పత్ని, పుత్రికతో బోలెడంత నిరాశతో అడవికి చేరారు. క్రూర మృగాల ధాటికి తట్టుకొని బిగ్గు బిగ్గు మంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వారు పయనిస్తుండగా ధరణి లలనా మణికి జలకాలాడించు యిచ్చతో ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి చలిగాలులు వీచడం మొదలైంది.  శాకుంతల పక్షులు  రెక్కలు విప్పి వాటి బిడ్డలుగా రక్షనిస్తున్నాయి.  ఆ నిశీధిలో  కాలు బయటి పెట్టని వనితా మణులు అలా అడవుల్లో నడవడం చూసి కవి కన్నీళ్ళు కార్చడం చూసి చలించిన గర్భిణీ మేఘాలు( ఏమీ ఉపమానం కవీశ్వరా) సుల్తాను మీద కోపంతో గర్జిస్తున్నాయట.

(పిరదౌసి కానలకు వెళ్ళాడా జాషువా వెళ్ళాడా అనిపించడం సహజం)

 

ఆ రాజుకి కనికరం లేకపోయినా ప్రకృతి కవి కుటుంబాన్ని కరుణించిందట.

 చిట్టి పొట్టి చినుకులు మాత్రమే కురిశాయి. చిన్న గాలులే వీచాయి కానీ ఈదర గాలులు లేవు. ఆ కారు మొయిలు తేలిపోయి కవి మార్గానికి అడ్డు రాలేదు.

ప్రకృతికి ఉన్న మానవత్వం మనిషికి లేకపోవడం ఏమిటి.

ఆ రాత్రి నింగిలోని తారాలే దివ్య కిరణాలు వెదజల్లుతూ కవికి మార్గాన్ని చూపడం ఆ జగద్గురు కరుణయే అని ఈ క్రూరమైన అడవిలో నన్ను రక్షింప యిచ్చతో దేవుడు ఉన్నాడని కవి ఈశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతిస్తారు. (జాషువా ప్రకృతి గురించి వర్ణించిన ఒక్కో పద్యము ఒక్కో అణిముత్యమై మళ్లీ ఒకసారి చదివి తనివి చెందవోయి అన్నట్లు ఉంటుంది)

చిన్ని విత్తనం లో మహావృక్షాన్ని  యిమిడించి గారడీ చేయువాడా; కడుపులో శిశువును కల్పించి పది నెలలు మోయించి ప్రాణం పోసే వాడా; సద్భక్తులకు దర్శనం కల్పించి నీవున్న చోటు తెలుపు వాడా; చిగురించక ముందే పుష్ప జాతులకు రంగులు అద్దే వాడా అందమైన పుడమి సృష్టించి అనుభవించమని మాకు ఆనతి యిచ్చి నిలువ నీడ లేని వాడా, నన్ను కన్న నా ప్రభువా! నేను పిలుస్తుంటే పలుకమేమి. నువ్వు ఎక్కడ ఉన్నావు.

నీ మహిమలు చెప్పగలమా ఆస్తమిస్తున్న సూర్యబింబం లో, చంద్రుని ధవళ హాసములో పూలతోటలో ని మొలక తెమ్మెరలో, నీలి మేఘాల చీలిక ల్లో కులుకుతూ మెరుపు గర్భంలో హాయిగా బవళించిన దివ్య స్వరూపా! హృదయము చీల్చి పూజ చేయుదును రమ్ము స్వామి

 

ప్రకృతిలో నీ సృష్టి గొప్పదనం నాకు చూపించి నన్ను మైమరపించితివి.గిజిగాని గూడు లో , కొండలు మీద తేలిన మబ్బుల్లోగిలిగింతలు పెట్టే అలసట లేక హోరుమని వచ్చే నదీ తరంగాల లో నీవు ఉన్నావని నిన్ను మొక్కిన కిలకిల నవ్వుతావు నన్ను తిలకింప వేమి స్వామీ. నీవు సృష్టించిన ఈ ప్రకృతి నన్ను పరవశం చేయిస్తుంది. ఇందుకేనా నన్ను ఇలా రప్పించావు.

ఓ కృపానిధి! గుండెలు క్రుమ్మరించెదను( ఎంత ఆర్తితో కూడిన దైవము మీద భక్తి ఉంటే గుండెలు క్రుమ్మరించెదన్ అనే భావం కవి నుండి వస్తుంది.)

మునుపు ఒక నాడు నా కనుల ముందు సుందరి గానవచ్చి పెద్ద పర్వతాగ్రము మీద నుండి నన్ను కులద్రోసి నట్లు నాటి దృశ్యము నేడు ఈ సుల్తాను గాథ లో ఉత్పన్నం చేసి చూపితివా దైవమా నేటికీ నాకు జ్ఞానం వచ్చింది.

ఈ విశ్వం మొత్తం నీ అనుగ్రహంలో ఉంది కదా నీవు కన్నెర్ర చేస్తే తెల్లవారడం జరుగునా? సూర్యుడు పుడమి గల పదార్థములను హేమ రసముతో మొలాము చేసె, నీకు కోపమున్న ఉదయ సుప్రభాతం జరుగునా? ఆగడపు మబ్బు శయ్యల మీద బుడత చంద్రుడు( నెలవంక) నిద్రపోవు చుండ, ఈ చెఱువు నీట అతనికి ఉయ్యాల కట్టి జోల పాడుతూ నన్ను జూడవేమి స్వామీ?( ఇది చదివాక అక్కడ పిరదౌసి లో జాషువా కనిపించకుండా ఉంటాడా?)

 

చీమ చిటుక్కుమన్నా ప్రతిదీ నీకు తెలియును. ఈ ప్రశాంత తావుల యందు నీ కోమల పాద సేవనము చేయుచూ పూజ చేయుదును తండ్రీ మొగము యింత చూపించు ఇచ్చట పరాయి వారెవరు లేరులే. ఈ సర్వ భూతము లందు  మునిగి తేలు తున్న నీ అనంత శక్తి నిజముగా నాకు వజ్ర కవచం. ఈ అడవిలో నాకు పూర్తి రక్షణ ఉంది.

 

మబ్బుల చాటున సూర్యుడు నక్కినాడు ఏమి అపచారం చేసేనని ఎక్కుబెట్టావో యింద్రధనుస్సును;( ఇంద్రధనుస్సు ను శివుని విల్లు గా పోల్చడం గొప్పగా ఉంది) నీవు పరాక్రమిస్తే ఎవరైనా నిలుచునా భువన మోహన!

సరదాగా నీ భుజశక్తి చూప భూమిని బొంగరం వలె తిప్పితివట. ఈ పరిభ్రమణం చల్లారితే జగము ఏమగునో ఏ ఉపద్రవం జరుగునో ....( ఇది యేమి.. ఈశ్వరుడు భూమిని బొంగరం లా తిప్పాడా. ఈ భావాలు మా జాషువా సామికే వస్తాయి) అని కవీశ్వరుడు ఈశ్వర సృష్టి ప్రాభవమును వర్ణిస్తూ స్తుతిస్తాడు.

 

ముగింపు: పిరదౌసి కావ్యంలో అడుగడుగునా జాషువా జీవిత గమనం కనిపిస్తుంది. అసలు తానే పిరదౌసి గా పరకాయ ప్రవేశము చేసి రచన చేశాడని పిస్తుంది.

 గొప్ప భావుకత గల కవి తన అంతరాత్మ నుండి భావాలను వెలికితీసి తాదాత్మ్యం చెంది రచన చేస్తాడు.

 ప్రస్తుత కావ్యము లో ఎవ్వరూ ఊహించని పోలికలతో పిరదౌసి గా తనను తాను ఊహించుకొని తన స్వానుభవం తో తన చుట్టూ ఉన్న దైవ సృష్టి అయిన సుమనోహర రమణీయ ప్రకృతి దృశ్యాలకు తనకున్న గొప్ప సృజనను మేళవించి అత్యద్భుత ఉపమనాలతో సొంపైన పద విన్యాసాలతో ప్రకృతిలో మానవీయ కోణాన్ని చూపిస్తూ ఒక గొప్ప ప్రకృతి ఆరాధకునిగా పద్య రచన చేయడం చదువరులకు గొప్ప అనుభూతి నివ్వడం తో పాటు వారు ప్రకృతి ప్రేమికులుగా మారి ఆ అనంతుని లీలలకు మురిసిపోతూ చేతులు జోడించి ప్రణతు లందిస్తారని విన్నవించుకుంటూ.....

 

జాషువా గారి కావ్యం పరిచయం చేసినందుకు మిగుల సంతసాన్ని వ్యక్త పరుస్తూ.... ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.. మీ అమూల్యమైన స్పందనల కోసం వేచి ఉంటాను...

 

వెంకట్. సి హెచ్ - తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...