29, అక్టోబర్ 2020, గురువారం

చిత్రం పై పద్యం - 59, 27. 10. 2020

 


ఆటవెలది

 ప్రజ్ఞ ఎవరి సొత్తు? పరిణామ క్రమమున

నిన్న గతము కాద? నేటి కన్న

నేల విడిచి సాము నేర్పుగ జేసిన

గాలి లోన తేలు గౌరవముగ.

 

శిరీష.

 

వచన కవిత

ప్రకృతి ఒక దొడ్డ శస్త్ర వైద్య,

విద్యుత్ స్తంబము మొండెమున్,

తెంచి శిరము బ్రతికించి వెంకయ్య,

నామముల్ వెలుగంగ  జేసె.

CA కె మల్లికార్జునరావు

 

అద్భుతం !

విద్యుత్ స్తంభం కూలి పడినా , విద్యుత్ తీగలు

తెగిపడక , విద్యుత్ ప్రసారం ఆపకుండా వుండగలుగుటే

వింతలకే వింత , ఇది కలిగించాలి యువతలో పులకింత !

ప్రతిదీ కష్టం , ఆమ్మో నాకిష్టం లేదూ అనక స్వశక్తితో సమస్తం

సమకూర్చు కోవాలనే సద్భావన సాధించడమూ అద్భుతం !

జి మురళీ మోహన్ రావు

 

అంతుచిక్కని విజ్ఞానం

విద్యుత్తీగల డోల కట్టిందెవరో

ఆధారం లేకుండా నిలుస్తుందో ఏమో

కొత్తగా పుట్టిన పరిజ్ఞానమేమో

భారతరత్నకై పాటు పనులేమో

పెద్ద ఇంజనీరో లేక సైంటిస్టేమో

నలుగురిలో మేధావెవరో

విష్ణుప్రియ

 

నీవెంత(విద్యుత్తు)ఉపయోగమో,

 అంతే ప్రమాదం కదా అనిఒకరు,

నిర్మానుష్యం లోనూ మొబైల్ ను

వాడొచ్చు అని ఒకరు,

ఇంత సాంకేతికం మనిషి కనిపెట్టిందే కదాని ఆలోచిస్తూ ఒకరు,

ఏదిఏమైనా ప్రకృతి  ప్రకృతే అనుకొంటూ ఒకరు,

వీళ్ళందరి ఆలోచనలు సబబే కదా

అని అనుకుంటూ నేనునూ

ఉష

 

 

 

శార్దూలము

శూన్యంబందున తీవెలై నిలుచుటన్ సూచింపగా స్థేమమున్ !

విన్యాసంబది వ్యోమకేశుడు సదా విస్తీర్ణమున్ జూపగా 

జన్యంబై ప్రతిభాసముల్ తెలుపగా స్థైర్యంబుగాన్పించగా 

ధన్యోహంబు ! వికీర్ణతేజములతో దాక్షిన్యముల్ జూపగా !!

వ్యోమకేశుడు = శివుడు 

వికీర్ణతేజముల్ = విశ్వవ్యాపితమైన శక్తి 

కస్తూరి శివశంకర్

 

తేటగీతి

 వింత జూడ సత్యమొకటి విశద మగును

 కలిసి యుండిన వారికి కలదు బలిమి

 ఉమ్మడి కుటుంబపుబలిమి వమ్ము గాదు!

 వెన్ను విరిగినా యుండును దన్ను గాను!!

 డా. నాగులపల్లి

 

 

 

 

 

వచనకవిత

సాంకేతిక జ్ఞానం సంధించిన రీతి

నూతనప్రక్రియగానొందింపజేయ

తీగలఆధారంగా ఊగిసలాడే

విద్యుత్ స్తంభ పైభాగమమరిక

మానవమేధస్సుకేమచ్చుతునక 

భావికాలముకువినూత్న భావనే.

హేమలత

 

సీసము

విద్యుత్తు గొనిపోయె వీరుధముల కాద రువగు స్తంభము కూలి భువి కొరుగుట

జూడ వింత గొలుపు; చోద్య మేమిటి! తీవెలకు బట్టి విరిగిన రాడు యేల

వ్రేలాడు చున్నదో విద్యుత్తు శాఖ వారి కతిశయము కల్గి రిక్త హస్త

ముల తోడ గాంచుతు రగ్గలికన్  లోపమెక్కడ జరిగినో ఎరుక పడక.

 

తేటగీతి

శాఖ నిర్లక్ష్యమో దైవ సంఘటనగ

సంభవించినో శాఖకు సంకటమగు

చిత్రము కన కబ్బురమయ్యె ; జీవనుండు

తలచ వింత పోకడ లెన్ని వెలయునొ గద!

 

వీరుధము= తీగ, రాడు= స్తంభము, అగ్గలిక= అతిశయం, జీవనుడు= శివుడు

వెంకట్.సిహెచ్

 

వచన కవిత,

తన దేహం పరుల సేవార్ధం,

తనువు ముక్కలై క్రిందికి ఒరిగినా,

తన విద్యుక్త ధర్మం మానలేదు,

తన సేవాపరాయణత్వం ఆగలేదు...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

తేటగీతి

తీగ బలిమి కెదురు నిల్చు తెగువలేక

కంబమిరిగి నేలకొరిగె గండమదియె

మర్మమెరిగి యతుకుబెట్టె మనిషి మేథ

బిడ్డ నందల మెక్కించి చెడ్డ తండ్రి

చందమును చూపు చిత్రము చరుపు వోలె!!

 

రెండు దఫాలుగా కాంక్రీట్ పోస్తారు...స్తంభం బలం ఎక్కువైతే తీగలు తెగి ప్రమాదం తీవ్రమవుతుంది అని..

 

వాణిశ్రీ నైనాల

 

 

 

 

నాసి రకపు కాంట్రాక్టులు నష్ట పరచు,

నాణ్యతలు‌ లేని పనులకు నాంది పలుకు

నేటి సర్కారు నౌకర్లు, పోటి పడుచు

తక్కువ ధరలకే టెండర్లు చిక్క, నిట్టి

రీతిగ పనులు జరుగు చుండు , ఖ్యాతి వలదు

మాకు లంచము లిచ్చిన మీకు మంచి

కూర్చ గలమను నాయకుల్ కోరి మొదలు

పెట్టిన పనులీ రీతిగా బెడిసి గొట్టు

చుండు గా భారతావనిన్,  చోద్య మనగ

నేమి లేదుగా  స్థంభము నెర్రి యిచ్చి

విరిగి పడెను ధరణిపైన బరువు పెరుగ

పూసపాటి

 

తేటగీతి

జాషువాగారి గిజిగాడి సౌధము వలె

గాలి లోనూగు తుండెపొంకపుసొగసుల

మౌని కౌశికు డద్భుత మైన సృష్టి

వలెను కనువిందు జేయును బందురముగ

కాల వైపరీత్యపు వింత    గారడివలె

చిత్ర  మైనుండె వెల్గుల శిఖరమువలె

 

రమ

 

గగన సామ్రాజ్యాన్ని గెలిచిన వింత

తిరు నామము పోలిన స్తంభము చెంత

విధియే వికటించినా, ప్రకృతి ప్రకోపించినా

కర్తవ్య దీక్షలో కదలని నిరాదార వింత

కనిపించని విద్యుత్ ప్రసరణకు ఆధార చిత్రమై

నాకమున ఊగిసలాడే నవ్య భంగిమై

విధినిర్వహణకు నిర్వచనంగా నిలిచెను చిత్రమై

వి. వి. శ్రీనివాస్

 

 

తేటగీతి

ప్రకృతి విపరీతమో మరి పటిమ లేమి

జూపు పనులోనవి తలచ చోద్య మాయె

శూన్య మందున వేలాడు చుండె తీగ

లు తెగిబడిన స్తంభమ్ము నిలుపగ యుక్తి

కొరకు యోచించి నిలిచిరి కూర్మి  తోడ

 

అవళూరు సీత

 

 

 

 

ఆట వెలది

స్తంభ మొరుగు వేళ స్తంభించి బోవుచు

యంతరాయ మదియె గొంత గల్గు

విధియె నిర్వహించె విద్యుక్త ధర్మంబు

వింత జూడు మహిని వేడ్క తోడ

స్తంభము + ఒరుగు = స్తంభమొరుగు

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

వచన కవిత

విద్యుల్లతలే తనకు ఆధారాలు...

మూలస్తంభం నేలబడితే మాత్రమేం

కాసింత సాయం చేసి నిలబెడితే

వెలుగుల జిలుగులు పంచేయదూ...

సుకన్య వేదం

 

ఆధారం వీడి వ్రేలాడిన తీగలు

ఇంజనీరింగ్ వైచిత్రం చూపిరి

ఉద్యోగులు నిర్లక్ష్యపు నీడను

చూపిరి జన రంజక పాలకులు

గిన్నిస్బుక్ ను ఎక్కే అప్రయత్నంగా

 

కోవూరి

 

కందము

వింతగ నున్నది చూడగ

నింతైనను పాలుపోక నివ్విధమేమో?

కొంతైనను జేయ పొదుపు

సాంతము నొక పోలు దీసె సన్నాసెవడో!!

 

ఆట వెలది

స్తంభమూడి పడగ స్తంభించ లేదుగా

తీగ తెగక నిచట నూగుచుండె

వింతవోలె తోచె విపరీత మిదియేను

పాలు పోక వీరు పాగ లాయె

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

కందము

అవరోధమ్ముల దాటుచు

వివరమ్ముగ కార్యసిద్ధి వేగమె గలుగన్

అవనత కంబము గాంచుచు

నెవులు దొలగు మార్గమేదని  జనులె దలచెన్!

 

 

 

 

కందము

చిత్తాగ్ని ప్రజ్వలించగ

నెత్తరి యైన నెదిరించు మిడుములనే; వి

ద్యుత్తీగలె నిల్చెనుగా

నిత్తరి కంబపు సహాయమే లేకున్నన్!

 

చల్లా దేవిక.

 

 

స్థాన బలిమి కూలి సంఘ బలిమి నిలిచే

విధి నిర్వహణ లో విద్యుక్తధర్మాన వింతలెన్నో కనిరి

విధి వైపరీత్యా ల కాంతి కానని జనం

కారు కూతలే కూస్తే కష్టాలకోడ్చి, కాయాన్నిబలిపెట్టి

కార్మికుల క్తి కాంతి పుంజమై నిలిచే

రాజ రాజేశ్వరి

 


 

 

రెండు వేల ఇరవై  సంవత్సరమే ఆశ్చర్యంమౌరా!

సూక్ష్మ క్రిమి ఒకటి కొండంత మనిషి ఉనికి ప్రశ్నించేంనౌరా!

వన్యప్రాణులు,అరణ్యమోదిలి రోడ్డుమీదకొచ్చేనౌరా!

కాలుష్యము తో ఊపిరాడక చేసినపుడు మాస్కులు ధరించకుండెనౌరా!

లోక్డౌన్ వేళ స్వచ్ఛమైన గాలి పీల్చక ముక్కుకి అడ్డు కట్టుకొనిననౌరా!

వరదలొచ్చి,వాగులు పొంగి పడవలే నడక దారి కి సాధనమయ్యే ఔరా!

స్తంభమాధారము లేక్కున్న, విద్యుత్తు తీగలు గాలిలో వేలాడు నౌరా!

 

ఇన్ని జరుగుతున్నా ఆత్మ వంచన తో

 మనిషి బ్రతుకే ఔరా!

 

పద్మలత మున్నంగి

 

భక్త ప్రహ్లాదు రక్షింప భక్త పాతి

కంభ మూలముగను పుట్టె కంబు పాణి

తంత్రి భంధము తోడను తార భ్రాంతి

నిచట కంబమే లేకుండ నిలచె నేడు

కరుణ చూప రా యజునికి కంభ మేది?

 

వెంకటప్పయ్య సూరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...