15, అక్టోబర్ 2020, గురువారం

11.10.2020 అంతర్జాతీయ బాలికల దినోత్సవం...


 

అంతర్జాతీయ బాలికల దినోత్సవం...

11.10.2020


కందము

 

బాలిక పూజింపబడిన

నేల మనది యని దెలుపగ నేరము గాదే?

పోలిక లేదే పనులకు

చాలిక మన డాంబికములు సంతసములిలన్!!

 

ఆటవెలది

 

ముద్దుగాను జడలు ముత్యము వలె బొట్టు

కంటి కింపుగాను కాటుకొకటి

చూడ ముచ్చటాయె సుందర రూపము

వేయి కాంతులింట వెలుగు వెలుగు

 

ఆటవెలది

 

బుల్లి జడల ఆడ పిల్ల లింట దిరుగ

లక్ష్మి యుండినట్టి రక్ష గలుగు

వారి నవ్వులింట వరమౌను తెలుసుకో

వారి బాధ నిలను పాడి గాదు

 

ఆటవెలది

 

పట్టు పరికిణీలు పరుగులు బెట్టంగ

నింట దైవమెపుడు వెంట నుండు

పండుగనిన చాలు నిండుదనము నిచ్చు

వారి నవ్వె మనకు వరము సుమ్మి

 

కందము

చదువగ బాలిక లిలలో

నెదుగును తామున్నతముగ నెల్లలు లేకన్!

పదుగురు మెచ్చెడి రీతిన

మదిలో స్థానంబు బొందు మహిలో నెపుడున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి, తెలుగు తేనియలు

 

కవిత

ఆడపిల్ల ఇంటికి ఆనందాలసిరి అందాలవిరి ఆడపిల్ల నవ్వులు

ఇంట విరియు సిరిపువ్వులు ఆడపిల్ల తిరిగాడు ఇల్లు

హరివిల్లు భువిపైన అలరారు నటులుండు

ఆడపిల్ల  నాన్నను అమ్మగా ఆదరించు

అమ్మకు అండగా అనుసరించు

అన్నదమ్ములకు ఆత్మీయురాలిగా నుండు

ఆడపిల్ల  లేని ఇల్లు జాబిల్లిలేని మిన్ను

 

డి. వి. హేమలత, తెలుగు తేనియలు


 

అంతర్జాతీయ బాలికల దినోత్సవం

 


సృష్టికే సృష్టికర్త అడపిల్లగా

ఈ సృష్టి సుస్థిరం అడపిల్లగా

అందెల రవళి తోటి అల్లారుముద్దుగా

అవనిలో తిరుగాడే అడపిల్లగా

అమ్మతనం అవాహనం తో అడపిల్లగా

అవనిలో ప్రేమామూర్తి మాతృమూర్తేగా

గేహమున వెలుగుకిరణం అడపిల్లేగా

గృహమునకు ఆశాదీపం అడపిల్లగా

అక్కగా ఆదరించేది అడపిల్లేగా

చెల్లిగా అనుసరించేది అడపిల్లేగా

అన్నీ తానై అమ్మయ్యేది అడపిల్లేగా

సిరి సంపదల కొలమానం అడపిల్లేగా

అల్లరి చేసే అడబిడ్డలను అల్లారుముద్దుగా

రక్షించే కవచం అవ్వాలి మన బాధ్యతగా

అల్లరిపాలు చేయకుండా ఉండాలి మన బాధ్యతగా

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట

తెలుగు తేనియలు

 

 

మా అమ్మాయి

 

ఈ రోజంతా ఒకటే హడావిడి

వడివడి పనులు ముగించి అక్షర సేద్యం

చేద్దామని తలచా

శీర్షిక అంటూ ఒకటి వెతికా

బాలికా దినోత్సవమంట ఈ రోజు

ఆలోచనలు తో నా సులోచనాలు వెతికా

దూరంగా ఎక్కడో స్వేచ్చ గా నాతో సంబంధం లేకుండా......

నాకు మొదట పుట్టింది అమ్మాయినే

ఏమి రాయాలి

తను చేసిన అల్లరినా

తను పూనిన అలకలనా లేక

తను చేసిన అఠం నా

నా ఆలోచనల్లా తను పెరుగుతుంది

తనకు కావాల్సిందేదో అమ్మని అడుగుతుంది

ప్రకృతి అంటే తన కిష్టమని నాకప్పుడప్పుడు అర్ధమౌతుంది

పెద్దలంటే గౌరవం అని తెలుస్తుంది

వాళ్ళ తాత తో కబుర్లాడుతుంటే

మురిపెంగా ఉంటుంది తమ్ముడితో

వెళ్లిపోయిన నానమ్మను అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటుంది

మౌనం గా ఉంటుంది

నాతో పయనించేటప్పుడు

నా అంతరంగాన్ని చదివినట్టు

తను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది

తనలోని భావాలని అందరితో పంచుకోవాలని

లౌక్యం తెలియనిది 

అలౌకిక విషయాలు పట్టనిది 

అందరూ ఏదేదో రాసేస్తున్నారు

నేను మాత్రం ఈ మార్గం ఎంచుకున్నాను ఎందుకో....

 

కోవూరి

తెలుగు తేనియలు

 

 

బాలికా.... వర్ధిల్లు

 

నేటి బాలికలే రేపటి మాతృమూర్తులు,

మొగ్గలోనే, మొగ్గగానే తుంచేస్తే సృష్టే ఉండదు,

సమభావం, సమధర్మం, సమానత్వం,

అదే నిజమైన మానవత్వం, ఆ భావన లోనే,

మాతృత్వం వెల్లివిరుస్తుంది,

అదే నిజమైన బాలికల దినోత్సవం....

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

తెలుగు తేనియలు

 

 

 

ఆడపిల్లను బతక నివ్వండి ప్లీజ్

 

లోకంలో సృష్టికి మూలం ఆడపిల్ల

మన ఇంట్లో అమ్మగా చెల్లిగా ఉనికై

మన ఒంట్లో రక్త మైనది ఆడపిల్ల

 

ఎన్నాళ్ళు బతికి ఉంటుందో తెలియదు

ప్రతిక్షణం జీవన్మరణ రణమే

 

కొందరు కడుపులోనే ప్రాణం తీస్తారు

కొందరు పుట్టగానే ఎత్తుకుపోతారు

కొందరు గొంతులో ధాన్యంగింజ వేస్తారు

కొందరు బెదిరించి లొంగ తీసుకుంటారు

కొందరు మాటువేసి కాటు వేస్తారు

కొందరు ఆఫీసులో పీక్కు తింటారు

కొందరు యాసిడ్ పోసి వళ్ళు కాల్చేస్తారు

 

కారణాలు ఏమైతేనేం

పద్ధతులు ఏవైతేనేం

పోయేది ఆడపిల్ల ప్రాణమే

ఆడపిల్లలకు ఆశలు ఉండవా?

వాళ్లకు జీవించే హక్కు లేదా?

 

ఆలోచించండి ఆలోచించండి

అందరూ నిజాయితీగా ఆలోచించండి

కర్కశత్వాన్ని కరుణగా మార్చుకోండి

రాతి గుండెలను పూలవనం చేసుకోండి

ఆడపిల్లలను రక్షించండి గౌరవించండి

ఇదే దేవునికి సమర్పించే అసలైన పూజ.

 

కె మల్లికార్జున రావు

తెలుగు తేనియలు

 

 

బాలికా దినోత్సవ శుభాకాంక్షలు

సీసము

ఆత్మీయ రూపము నవని వెలుగునట్టి బాలిక లార పూబాల లార;

విద్య గూర్చగను వివేక సంపన్నతన్ ఉన్నతులై మీరలొరపు తోడ

తల్లిదండ్రుల కీర్తి తనరారు చందంబు జీవన సమర విజేతలవగ

భావిజీవనమంత భవ్యమౌ నటులను వాగ్దేవి సత్కృప వరలు గాత!

 

ఆటవెలది

ఆకళింపు తోడనన్ని విషయములు

పదిలపరచి సతము మదిని మీర

అప్రమత్తులై   యహరహమ్ము మసలుచు

ఖ్యాతి నొందుడీ విజేతలుగను!

 

చల్లా దేవిక.

తెలుగు తేనియలు

 

లక్ష్మీ సరస్వతి పార్వతి

ముగ్గురమ్మల మూలపుటమ్మ లకు పూజలు చేస్తాం

తల్లి భూదేవి కి ప్రణమిల్లు తాము

గంగా యమునా సరస్వతి నదుల

సంగమా లకు వందనాలు అర్పిస్తాము

భరతమాతకు జేజేలు కొడతాము

మాతృదేవోభవ అంటాము

పురిటి లో పుట్టిన ఆడ పిల్లను

మాత్రము రాక్షసి పుట్టింది అంటారు

ఎదిగిన  బిడ్డను గుండెల్లో కుంపటి  అంటారు.

కర్కశంగా క్రూరమృగాలు నలిపేస్తారు

ఈ చరిత్ర మారదా ఈ మనుషులు మారరా

ఈ ప్రపంచం ఎటువైపు వెళుతుంది

ఈరోజు బాలిక దినోత్సవం . బాలికలందరూ బాగుండాలని కోరుకుందాము.

 

డి. నాగమణి

తెలుగు తేనియలు

 

 

కందము

అలనాడడవికి బొమ్మని

తెలుపగ కలవర బడకనె తెగువనె రామా

విలువల నెరిగిక వెడలగ

వెల వెల బోవదె నయోధ్య  వెన్నెల లేకన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తెలుగు తేనియలు

 

అలతిగ యడుగగ వరముల్

కలతను జెందగ దశరధు కైకేయాజ్ఞన్,

విలవిలలాడుచు, వలపున

నెలతకు రాముని  గుణములు నేర్పుగ తెలిపెన్

 

శిరీష, గుడివాడ.

తెలుగు తేనియలు

 

ఉత్పలమాల

శారద రాత్రులందు సుమ చందన హారతులద్దినట్లుగా   

భారతి నిండుదీవనలు వల్లరులై మదిలోపరాగమై

గారవు వైనముల్ జిలుగు కమ్మనివేళన వెన్నెలున్నచో     

చీరల హోయలేల ? మధుసీమన నిల్పగ భక్తిభావమే !

 

శివ శంకర్ కస్తూరి , తెలుగు తేనియలు

 

 

ఉప్పమ్మా ఉప్పో

 

 ఉప్పమ్మా ఉప్పు ఉప్పో అంటూ

గిరాకీ కోసం గదులన్నీ గాలిస్తుంటే

నా వీపునెక్కిన ఉప్పు బస్తా కూడా

ఉప్పమ్మా ఉప్పో అంటూ సాయపడింది.

అమ్మకం త్వరగా జరగాలనో!

నా వీపు మీద మోత తగ్గాలనో!

 

 దో......బూ......చీ......అంటూ

 నా చేతుల్ని మొహం మీంచి తెరలా తెరుస్తుంటే

 అది తెరలు తెరలుగా నవ్వేస్తూ

 బూచిని మళ్ళీ మళ్ళీ చూపించమంది

 అప్పటికే నశించిన నా ఓపికని పరీక్షించాలనో!

 నాలో లేని బూచి మనసుని పరికించి చూడాలనో!

 

 అది తప్పటడుగులతో తాండవిస్తూ

 కాలి గజ్జలకి తాళం నేర్పుతుంటే

 ఎగిరొచ్చి నా వొళ్ళో ఓ మువ్వ పడితే

 అదీ ఓ గువ్వలా వాలింది నా వొళ్ళో పడింది.

 చెట్టంత నాన్నని నేనున్నాననో

 నీ నీడ ఇంకొన్నాళ్ళే అని ముందే కూయాలనో!

 

----అ.అ----

అత్తిలి అనంతు

తెలుగు తేనియలు

 

 

ఉద్యోగుల మనోగతం

 

తే.గీ.ఏమి పోగొట్టుకుంటిమి?యేల చింత?

ఏమి దెచ్చుకుంటిమదేమి?యెరుకతోడ

వెళ్ళగొట్టబడినవాడు హేళనంబు

పకపకా నవ్వె పంపించి పరువమొందె

 

తే.గీ.ముందు నమ్మిన నట్టేట ముంచెననుచు

కలిసి రాష్ట్రావతరణకు కాలుమోప

ఎదురు చూపుల జీతాల బెదురుగలిగి

ఆశపడుచున్న జీవితాలాగమాయె

 

తే.గీ.కపటసన్యాసులందరు కలిమినొందె

కనగ కొట్లాడినోల్లంత కానరారె?

ఉంటి(ఉ)ముద్యోగమును జేయుచుంటిమనుచు

సన్నగిల్లెనాశలిలను శాంతి లేదె?

 

తే.గీ.ఆశయంబును నెరవేర్చ నాదరించి

కనికరంబును జూపుచుకలిసి వచ్చి

ప్రభుత చేయూతనీయంగ భవిత గలుగు

(అ)ననుచునుద్యోగులందరు మననజేసె

 

మీ మహేశ్ ముత్యాల

తెలుగు తేనియలు

 

 

 

నిజమే సోదరా..

మీ పద్యాల్లో ఉన్న విషయం అక్షర సత్యం..

ఉద్యోగ సంఘాల పోరాటాలు కూడా ఎంత మాత్రం అక్కరకు రాలేదు.

 

తేటగీతి

మనసు రంజింప జేసెడి మాయ పల్కు

లన్ని జెప్పి యుద్యోగుల నప్పనముగ

వాడుకొని కడకు వెతలు పాటవముగ

జేసెడి ప్రభుత్వ వైఖరి జింత నిచ్చు.

 

వెంకట్  సి.హెచ్

తెలుగు తేనియలు

 

 

కమలం (స్వేచ్ఛా సమర్పణ )

 

పంకిలమునందు పుట్టి

పంకజమను నామధేయముగానున్నను

 

జలజ, తామర, కమల, పద్మములని

నానానామములుగా బడయుచు

హరికి నాభినందుండి

హరిని పద్మనాభునిగా జేసీ

 

సిరికి ఆసనమై

సిరిని కమలవాసినిగా జేసీ

 

అష్టదళాలతో అరవిరిసి

అష్టలక్ష్ములకిష్టమైన పుష్పమై

మురిసి

 

అతివల అందాలను పోల్చుటలో

అందలమెక్కిన దానిగానిలచి

 

భానునికిరణాలతో వికసించుచు

భాగ్యలక్ష్మి చరణాలను చేరుచు

 

భారతదేశ జాతీయ పుష్పమై

భాసిల్లుచున్నది "కమలం "

 

డి. వి. హేమలత

తెలుగు తేనియలు

 

 

నేనడిగిన అంశం

 

పాస్త్యాత్య పోకడలు మీద మోజు పెరుగుతున్న తరుణంలో భారత సంసృతిని ముందు తరాలకు అందించ టంలో ఆడపిల్లల పాత్రను తెలుపుతూ  ఆశువుగా ఉత్పలమాల చందస్సులో పద్యం చెప్పగలరు

 

అవధాని గారి ఆశు పద్యం

 

తీరికబూని సూక్తులును  దెల్పుచు శాస్త్ర పురాణ సత్కథల్

పేరిమితోడ ధర్మములు పెంపు వహించగ‌ నేర్పగోరుచున్

కోరికలెల్ల దుఃఖముల కోరలు చాచునటంచు నేర్పుమా

భారత సంస్క్రృతీ ఝరులు ప్రాకటమౌ గతి మేటి బోధలన్

 

ఉత్పలమాల

భారతి భాగ్యమున్ బడసి భారతి నందవధాన ప్రక్రియన్

ధీరత చూపుచున్ సిరుల దేవియె సిద్ధిని పొంద తధ్యమౌ

ధారణ చేయగన్ కవన ధారల మాధురి మెచ్చ పండితుల్

హారతి గైకొనుండిదియె, హార్దిక జోతలు పృచ్చకాళికిన్

 

వాణిశ్రీ నైనాల

తెలుగు తేనియలు

 

 కూతురు

 

మా అమ్మాయి నాకు కూతురు , స్నేహితురాలు , టీచరు , అమ్మ , అత్తగారు కూడాను చిన్నప్పటి నుండి నాన్న ..నాన్న ..నాన్న అంటూ నా చుట్టూ తిరిగేది 

బడి కెళ్లే రోజుల్లో పలక , బలపంరాతబల్ల కొనిపెట్టా

నాన్న కూర్చోనేను పాఠాలు చెబుతా విను అని చెప్పేది కూడా

పెరుగుతూ స్నేహితురాల్లాగా కబుర్లు చెబుతూ , కావలసినంత పని చేసి పెట్టేది .

కాపురానికి వెళ్ళింది .

నేను వెళ్లిన్నప్పుడల్లా మా అమ్మఅత్తగారి లాగానే

రుచిగాశుచిగా వంటలు చేసి వడ్డిస్తుంది ।

టాటాలు తీసు కెళ్తుంది  . అడిగిన వన్నీ కొనిపెడుతుంది .

కానీ , చేతిలో బెత్తం సిద్ధంగా పెట్టుకునేది

చూపుడు వేలు ఊపుతూ సరైన ఆహారం వేళకి తిని సమయానికి వ్యాయామం

చేయక పొతే వీపు విమానం మోతే అని గట్టిగా చెపుతుంది ।

 

మురళి మోహన్ 

తెలుగు తేనియలు


 

 

పావునై ఒక పావునై  మిగిలాననా ఓ నాన్నా

కని పెంచిన మగువుందని తెలిసిందనా ఇపుడైనా

 అనే  ఓ చిరు పాటని నా బంగారు తల్లి కోసం వ్రాశాను.

నాకు ట్యూనుతోపాటూ ఓ మూడు  లైనుల బ్రీఫ్ ఇచ్చారు. అది చదివాక నా తలా తిరిగిపోయింది.

పాదాల క్రింద నేల బ్రద్దలైపోయిందనిపించింది. పట్టపగలు కళ్ళల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వ్రాయవలసింది నాలుగు లైనులే అయినా.., మూడు రోజులు తీవ్ర  మనోవ్యధకి గురి అయ్యాను. కలం కదల్లేదు. రోడ్డు మీద ఏ అమ్మాయిని చూసినా నా బిడ్డలాగే కనిపించింది. ముఖ్యంగా చౌరస్తాల్లో అడుక్కు తినే ఆడపిల్లల్ని చూసి , భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు ఎలా  ఉంటాయో తలుచుకుంటూ ఉంటే వొళ్ళు గగుర్పొడిచేది. నాలుగో రోజున ఆ ఐదు లైనులూ నాకు తెలియకుండానే పడ్డాయి. ముందు హంసిక స్క్రాచ్ పాడింది. తరువాత శ్రేయా ఘోషాల్ పాడింది.

అత్తిలి అనంతు

తెలుగు తేనియలు

https://www.youtube.com/watch?v=dysVIsL81RA  

 

 

సమస్యా పూరణం,

గేయ రచన,

 

ఒక్క రూపాయి తో కొన్న కుంకుమ,

ఎక్కును నుదుటి పైకే  తప్పక,

ఎక్కువ ధర పోసి కొన్న చెప్పులను కాళ్లకు,

ఎక్కించి అంతా తొక్కేసే వాళ్లే.....

 

గాంగేయ శాస్త్రి, రా

 

నా పూరణ యత్నం..

 

తేటగీతి

 

విద్య లేని వాడొక్కండు విద్యమంత్రి

బుర్ర లేని వాడొక్కండు భువిని నేల

వినగ నివ్విధమ్ముగ నిది వింత వోలె

"కాకికిన్ హంసయే సతిగా లభించె"

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తెలుగు తేనియలు

 

 

కవిత

 

అంతా తొక్కేసేవాళ్లే !

 

 


ముద్దుముద్దుగా మెరిసిపోతున్న నన్ను

ముచ్చటగా తీర్చిన రంగవల్లిక మీద

పసుపు కుంకుమలతో పవిత్రంగా అలరారే

గుమ్మానికి చెంత

సింహద్వారము ముందు నాకు పీఠమిస్తే..

గౌరవంగా భావించా ! గర్వంగా తలంచా..!

 

దర్జాగా కుర్చీలో కూర్చుని

నిత్యం పేపర్ చదివే ఇంటాయన చెంత

అంతే దర్పాన్ని వెలిగించొచ్చని ఆశించా..

 

ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానించేందుకు

 నన్ను నియోగించారని భావించా..

నా  అదృష్టానికి పదేపదే పులకించా..

 

తీపి తీపి తలపుల ఊహల్లో

ఊయల లూగుతున్నానోలేదో..

విసుగుతో విసవిసా బయటనుంచొచ్చిన

ఇంటాయన నన్ను కాళ్లతో కసకసా తొక్కేస్తుంటే

విస్తుపోయి చూసా..

వెనువెంటనే..ఆటలు కట్టిపెట్టి

పరుగెత్తుకొచ్చిన కుర్రాడు

మురికి కాళ్లతో నాపై కథాకళీ చేస్తుంటే..

హృదయం కకావికలైంది..

 

షాపింగ్ చేసుకొచ్చిన కూతురు

హీల్స్ తో  నేరుగా నాపై శివతాండవం చూస్తుంటే

ఒళ్ళంతా గాయమై

మనసు శివాలెత్తి పోయింది..

ఇంట్లో వాళ్ళు,ఇంటికొచ్చిన అతిథులు

అందరిదీ ఇదే తంతు..

 

నిట్టూర్పులతో నిత్యం నీరసిస్తున్న నన్ను

నేల తల్లి ఊరడించింది..

నేలబారుగా ఉన్నోళ్లను

తొక్కేయడం

నిలబడ్డవాళ్ళందరికీ అనాదిగా ఉన్న అలవాటేనని..

సమస్యను సహనంతోనే సంహరించాలని..

 

మెరుపులతో మెరిసిపోయినదాన్ని..

మరకలతో గబ్బు కొట్టిపోతున్నానని

కుమిలిపోతున్న నాముందు..

గాజుల గలగలతో నెమ్మదిగా నిలబడ్డ ఆమె

నా ముందు వంగి..సుతారంగా నన్ను పైకి తీసింది..

ఆ స్పర్శలో ఎంతటి మధురానుభూతో..

మున్నెన్నడూ ఎరగనిదిది...

వెచ్చని నీటిలో నన్ను ముంచి

సున్నితంగా నన్ను స్వచ్చంగా ప్రక్షాళన చేసి..

నీరెండలో ఆరేస్తే ఎంత హాయిగా ఉందో..!

నా మదిలో ఆవేదనని  ఎలా కనిపెట్టిందో ఏమో మరి

ఇట్టే పట్టేసింది..

ఎంతైనా అమ్మకదా మరి!

ఓదార్పుగా నను స్పర్శిస్తూ అంది..

లోకాన్ని సంస్కరించేందుకు

దేవుడు పంపిన సేవకులం మనం..

గడప లోపల నేను..!

గడప బయట నువ్వు !

మనకు శాపం కాదిది

ఇది దేవుడి శాసనం.. పాటించడం మనధర్మం!

నాలో ప్రశాంతత..

హింసించే ఇందరి మధ్యన..

హితబోధ చేసే అమ్మ దొరికిందని. !

ఆవేదనను శాంతిoప చేసి, సానుభూతిని పంచే

ఆత్మీయత లభించిందని...

"వసుధ"

తెలుగు తేనియలు



ఆశుకవితా పృచ్ఛకులైన వాణి గారికి శుభాభినందన చందనాలు తెలుపుతూ .

ఉత్పలమాల

 

ఆశుకవిత్వసంపదల హాయిని మెచ్చినయట్టి వారు మీ 

పేశల వాక్సుధాగరిమ పృచ్ఛకుఁలైనను వాణివేణితో  

దోసెడు పారిజాతములతో; అవధానముమే వికాసమౌ 

కాసిని మంజులంబులనికమ్మని కైతలు మాకు పంచుమా !!

 

కస్తూరి శివశంకర్

తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాల

 

చీకటి లోకమందు నిక చేసెడి దేమని దుర్బలత్వమున్

పోకిరి చేష్టలన్ చెడక బుద్దిగ మెల్గుదుడంచు, నిల్లునున్

వాకిలి లేక దీనుడగు వాడిని చేరెను చిన్నదొక్క నే

కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్

 

వాణిశ్రీ నైనాల, విజయవాడ

తెలుగు తేనియలు

 

 

కందము

 

సత్సంగమ స్నేహితులిల

ఉత్సవములు చేయ దలచి ఊతము నియ్యన్!!

ప్రోత్సాహము నీయ దగును

ఉత్సాహమ్మున్న యెడల ఉర్విన వాణీ!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తెలుగు తేనియలు

 

 

రుచులజండ

నాలుగుదారుల కూడలిలో 

నలుగురి ఆకలితీర్చేందుకు  నాలుగుచక్రాలబండి ,

నిత్యం ఉపాహారయజ్ఞాన్ని

 పొద్దున్నే మొదలెట్టేది....,

పనులవేటలో శ్రమాయుధాన్ని ధరించి బయలెల్లె వారికి

అది బలం కూర్చే మజిలి,

 ఉద్యోగనావ మీద దూరదూరతీరాలకు వెళ్ళేవారికి అది

 సద్దిమూటకట్టే అమ్మచేయి,

చిరుసంపాదనాపరులకు

ధరతక్కువలో కడుపునింపే ధర్మక్షేత్రం,

నిరుద్యోగపొదుపులకు

 అనుకూల ఆకలితీర్చే ఆదరణాచోటు, చిన్నపిల్లల ఆకలితొందరలకు అది అప్పటికప్పటి కమ్మనిఓదార్పు మంత్రం...!

 

వెండిజాబిలీల ఇడ్లీల పై వెన్నెలంత చట్నీవేయించుకొని తినగ,

ఆకలిసెగల ఉదరాకాశం చల్లనికుండయ్యేది, బంగారుముద్దల వడలు ,

వేడి సాంబారుపోతతో కరగగ నోటికి మేటిరుచులపండుగయ్యేది,

పొద్దుటిసూరీడులాంటి దోశె ,

గోరువెచ్చనిఎండరంగుల ఆలుకూరతో గొంతుదిగగా ఆ సమయం ఎదురుస్వర్గమయ్యేది,

నూనెస్నానం చేసిన బుజ్జాయిల్లా పూరీలు నిగనిగలాడుతుంటె పొంగనిహృదయముండేదా?

ఇట్లా ఎన్నో ఉదయాలకు ఆకలిని తీర్చి

ప్రతిరోజుకూ తాజాతేజాన్నిచ్చిన

 ఆ నాలుగుచక్రాలటిఫినుబండి

 కరోనదెబ్బకు నిలువునా కూలిపోయింది,

కనీసం తన ఆకలిని కూడా తీర్చుకోలేక కుదేలై కుమిలిపోయింది,,

ఆరునెలల గడ్డుకాలాన్ని

భారమైనగుండెతోబిక్కుబిక్కుమంటు వెళ్ళదీసింది..,

మళ్ళీ ఇన్నాళ్ళకు

ఇపుడిపుడె తెరిపిస్తున్న కరోనావాన కు

ఆశతో  బండి రోడ్డెక్కి నడవలేక నడవలేక నడుస్తున్నది... ..,

అప్పటి ఆకలి తీర్చిన కృతజ్ఞతతోనైనా, కరోనాజాగ్రత్తలు పాటిస్తూనే

తలోచేయి వేసి నడిపిద్దాం రండి!

మళ్ళీ మనచౌరస్తాలో రుచులజండాను నిలబెడదాం రండి !

 

రాం మోహన్, నిజామాబాద్

తెలుగు తేనియలు



సమాప్తం  

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...