22, అక్టోబర్ 2020, గురువారం

దత్తపది - 48, తెలుపు, తెలుపు, కలుపు, కలుపు

 


దత్తపది - 48
19.10.2020; ప్రణాళిక
తెలుపు, తెలుపు, కలుపు, కలుపు


ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవితలు అందించగలరు...
 

తేటగీతి

 

అర్థ చంద్రుని ధరియించి యద్భుతముగ

వెలుగు చంద్రఘంటా దుర్గ వేగిరముగ

కష్టముల నాపి మమ్ములన్ గాంచు, సింహ

వాహిని నిను మ్రొక్కెదమమ్మ పావనముగ

 

వెంకట్ సి. హెచ్ తెలుగు తేనియలు

 

 

 

ఉత్పలమాల

 

శ్రీరమణీయ రూపమును,

           చిత్తమునుంచి, భవాబ్ధిదాటుతూ 

భారతినిండుదీవనల

          భాగ్యమదే మదిలోవిలాసమౌ

చారుతరస్వరూపముల

         చక్కనితల్లిని సన్నుతింపగా   

సారము భక్తిమార్గమని

      సత్యములెప్పుడు తెల్సుకొందురో

చీరల రంగులేల ? 

    మదిసీమన నిల్పగ భక్తిభావమున్  !!  

 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

భక్తి మార్గ మెరిగి యేదొ పట్టుచీర

యనెడి చిత్తము కలిగియుం డతివ మిన్న

కుండున! యిదియే జరిగిన యూరు నిండ

వెలసిన దుకాణముల స్థితి వికటముగను

నీరు కారెడి క్షోభను నెలతు లంత

తట్టుకొని యుండ గలరా! సతతము కాంత

లంత వస్త్రాభరణముల నబ్బురముగ

క్రయము జేసి యానందింప ఘనత కలుగు..

 

వెంకట్ సి. హెచ్ తెలుగు తేనియలు

 

 

చంపకమాల 

సరస కళా స్వరూపమగు

               శారద శోభకు చీర జిల్గులా  ?

వరములు మేటి భూషణపు 

          వన్నెలు జూపవలెన్; విలాసమౌ  

సిరినగవుల్ విభాస మధుశీకర

                  జల్లులు జిల్కరించి; సుం    

దర భవదీయమానసము

           తన్మయమొందగ జన్మధన్యమే  !!

 

శివ శంకర్ కస్తూరి తెలుగు తేనియలు

 


 

భర్త ప్రియమగ తెచ్చిన పట్టు చీర

ముదిత తాను గట్టి మదిన మురియు చుండు

గట్టి గానె ప్రార్థింతుము  గౌరి దేవి

ని, పతి దేవుని జేబులే నిండు గుండ

గుండె  గుడిలో నిలుపుకొని గుట్టు నుండ

నెలత మదినెఱుఁగని వారి నేమి చేయ

గలము ? మా గుండె బండగా గట్టి చేయు

 

అవళూరు సీత తెలుగు తేనియలు

 


 

వచనం,

 

తెలుపు రంగు,

స్వచ్ఛతను తెలుపు ను,

కలుపు గోలు మనిషి,

అందర ను తన మాటలతో కలుపు ను.

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు


 

 

తేటగీతి

 

తరుణు లందరొక్కదరిన తల్లి పూజ

చేయ చిత్తశుద్ధికొరవై చీర రంగు

చెప్పు కొనుచు నధిక మైన చిక్కు లోన

చిక్కుకొనుచు దేవికొలుపు జేయ మరచి

తెలుపు చీరలో పూజింప తీరు కోరి

కలని మురిసి తెలుపుకొనె కాంతలంత

నలుపు చేలము ధరియించిన తొలగు చెడు

యనుచు మనసు నలుపుకొనెన్ యతివ లంత

 

రమ, కంకిపాడు తెలుగు తేనియలు

 

 

తేటగీతి

శ్వైత్యమే సప్త వర్ణాల సమ్మిళితము

తెలుపు వర్ణము స్వచ్ఛతన్ తెలుపు సూచి

నిర్మలమనము గలవారు నెరపు మైత్రి

కలుపుగోరుతనమిలలో కలుపు ప్రజను

 

డా. నాగులపల్లి శ్రీనివాస్ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

 

తెలుపు నీదు మనసు తీయని మాటలన్ (భాషల )

కలుపు జనుల నంత కరుణ తోడ

ఫలము కొరకు తీయు పైరు నందు కలుపు

తెలుపు జీవితమున తిరమునిచ్చు.

 

శిరీష   తెలుగు తేనియలు

 

 

తెలుపు నలుపని మనుజులనందు,

వర్ణ భేదము తెలుపుట పాడి కాదు,

చేయిచేయి కలుపుటయే వివేకము,

మానవ  జన్మ కొక పరిపూర్ణత్వము.

 

భేదమే యని అరచి బల్లగుద్దు వారు,

చేల లోని కలుపు మొక్కలయ్యెదరు,

మనసు తెలుపునే పైవాడు మెచ్చు.

కావాలి మనకీ మాట మేలుకొలుపు,

తెలుగు తేనియలు

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

నా తలపు

 

అది తెలుపు , నీలము లేక ఏ రంగు  అని

మన కనులకు తెలుపును మన మెదడు .

కలుపు మొక్కలను ఏరేసిన ఆకు కూరలతో పప్పు

వండి , అన్నముతో కలుపుకొని తినినచో ఆరోగ్యము

 

G. మురళి మోహన్ తెలుగు తేనియలు

 

 

స్వచ్ఛతకు చిహ్నమని తెలుపు తెలుపు

మనిషి వాక్కులతో వాని మనసు తెలుపు

చిన్నదైననేమి కలుపు మొలకంటి చెడు తలపు

తీయని బంధమున వేపంటి చేదు కలుపు

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు

 

తెలుపువర్ణమంటి

నిష్కల్మష మనసుతో

కలుపుగోలుగనున్న యువతులు

కలుపుమొక్కలవంటి

కాముకులకు బలియైనారని

తెలుపుచున్నవి కొన్నిదుర్ఘటనలీ కలిలో

 

 

 

తేటగీతి

 

కలుపు తీసెడి భామ వగలు గని తెలు/

పుదమని మదిలో మాట, నే ముదమున దరి/

జేరి మాట గలుపుచుండ సిగ్గుపడుచు/

నిల్చొని తెలుపు తామర వోలె తెల్ల/

నగియెన్ తన మనసు దీరునని మురిసి

 

వారణాశి శ్రీలేఖ తెలుగు తేనియలు

 

 

పై పదములు అన్యార్ధములో వడుచు రెండు మార్లు  రామాయణార్ధములో నా పూరణ. సంజీవని పర్వతము శీఘ్రముగా తెమ్మని  హనుమంతునికి వైద్యుడు సుశేణుడు తెలుపు సందర్భము

 

(తెలుపు) వారక ముందుగా తేవ వలయు

నని (తెలుపు) చుంటిని హనుమా నగము నీవు ,

తొలగు నాయువు, చెల్లు నూ(కలు పు)డమిని

లక్ష్మణునకు, కలవు  హిమాలయములోన 

పొడవు  మూలి(కలు పు)రుడు బోయు లక్ష్మ

 ణునకు ననుచు వైద్యుడు సుషేణుండు పలికె

 

పొడవు =  గొప్ప

 

పూసపాటి తెలుగు తేనియలు

 

 

తేట గీతి 

 

తెలుపు వర్ణమెట్లుండునో తెలుప గోర

కలుపు యన్నము యుండునే తెలుపు రంగు

కలుపు గోలు మనసుయందు తెలుపు యుండు

తెలుపుయన్న రంగే కాదు కలల మెరుపు.

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

తెలుపు వర్ణము తమదని తెగము ఱియుచు

అందరిని కలుపుకొనక యతిశ యించి

మేఘ మాలికలు పుడమి మీద తామె

యనుకొనుచు నడ యాడని యతివ కెపుడు

నాత్మ సౌందర్య శోభయే నంద మిడును

వనిత బిడియమ్ము తోడనే వలపు తెలుపు

నెవ్వరి నెపుడు కలుపునో నీశ్వ రేచ్ఛ

 

రమ, కంకిపాడు తెలుగు తేనియలు

 

 

 

తేటగీతి

 

తెలుపు వర్ణము స్వచ్ఛత తెలుపు మనకు

కలుపుగోలుతన మెపుడు కలుపు మనసు

సర్వ వ్యాపక రవికాంతి సాక్ష్యమదియె

తెలుపు వర్ణము స్వచ్ఛత తెలుపు మనకు

కలుపుగోలుతన మెపుడు కలుపు మనసు

కలుపు వంటిది మనిషికి కలుష మనసు 

సర్వ వ్యాపక రవికాంతి సాక్ష్యమదియె

కలసి మసలిన జనులకు కలదు సుఖము

 

వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు

 

 

గురజాడ కవితా మాలికలు

పురోగతికి తొలి మెట్టులు,

విశ్వనాథు తెలుపుడు జేయు

పద్యములు ప్రబంధాలు,

వేమన తెలుపు ఆటవెలదులు

జ్ఞానమునకు పునాదులు,

తెలుగు తేనెల  ప్రహేళికలు

పుదీనా నెత్తావులు.

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

పల్లె భారతం

మధురాక్కర మాలిక

 

కలుపుగోలు తనపు పల్లె  కపట మెరుగని సీమ

తెలుపువాఱు వేళకు పల్లె ధీరులంత కదిలిరే

పొలము పనికి వెళ్లెడి రీతి పుడమి దీవెనొసంగునే

కలుపుచీల జే బూనిన  గడుసరి శ్రామికులే

అలుపు యెరుగక భువనము కన్నము నొసగుతురే

వెలుగు నిచ్చెడి పల్లెలే విశ్వమం దబ్బురంబు

తెలుపువాఱు తుండెడి పల్లె దీప్తి కాపాడ వోయి!

 

తెలుపువాఱు= తెల్లవారు

తెలుపువాఱు= వెలవెల పోవు

కలుపు చీల= కలుపు తీసే కత్తి

 

వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు

 

 

తేట గీతి

 

ధవళ వర్ణంబది మెఱియు ధగ ధగలుగ

తెలుపు వర్ణంబు స్వచ్ఛతన్ తెలుపు గాద

కల్మషమను కలుపు మొక్కొకటియె చాలు

కలుపు కొనకందరిని కుల క్షయము కాగ

 

అవళూరు సీత తెలుగు తేనియలు

 


 

 

బారతీయ వాజ్గ్మయ ఔచిత్యం తెలిపే ప్రయత్నం 

చంపకమాల

 

తెలుపును భక్తిమార్గమును, దివ్యమహోపనిషద్రహస్యముల్ 

తెలుపగ, సత్కవిత్వముల  తీరులునే తెలుపంగ; భారతీ       

తెలుపుమరాళమందు కడు తీయనిరాగము మీటినట్లుగా 

కలుపులు లేని మానసము కల్మషమే మరిపించు భావనల్ 

చిలుకుచు చీకు-చింత విడి  జీవనమాధురి గైకొనంగనే 

కలలసుమంబులై వెలుగు  కాంతితరంగ ప్రభాసముల్వలే    

కలుపుకుపోవలెన్ ! హృది  వికారములేని పటీరసంద్రమై 

కలమునధారలే కురిసి కాంతులుచింది శుభంబులీయగన్

 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

తెలుపు శాంతికి చిహ్నమని

తెలుపు వారందరూ నలుపు విచారమని రూఢి చేయుదురు మంచి చెడ్డలను

కలుపు భావసంపత్తి మనమునకే గాని

కలుపు మొక్కల గుంపు ధరించు వర్ణము సైతము

కనులకు హాయి గొలుపు

 

రాజ రాజేశ్వరి తెలుగు తేనియలు

 


 

 

మహిమాన్విత గాయత్రి దేవి

 

విశ్వ అదిదేవతా విశ్వంలో పరదేవతా

పంచమోములు కల్గిన ఆది పరదేవతా

పంచ వర్ణాలుగా శోభిల్లే మా శక్తి దేవతా

ముత్య పగడ స్వర్ణ నీల శ్వేత వర్ణ దేవతా

 

వరద అభయ హస్తాలతో అభయమిచ్చు దేవతా

అంకుశ కొరడా కాపాలపాత్రా గద శంఖు చక్ర ధారణి

ద్వి హస్తముల తో పద్మాలు పొదిగిన పర దేవతా

పంచ భూతాత్మక శక్తితో పంచముఖ దేవతా

సూర్య దేవ సంచారిణి సకల శుభ ప్రదాయిణి

హంస వాహన ధారిణి మణిద్వీప నివాసిని

24అక్షరముల బీజాక్షర మంత్ర దేవతా

శంకర విష్ణు భగవానులఆరాధ్య దేవతా

బ్రహ్మ విష్ణు మహేశ్వర విశ్వామిత్ర బీజాక్షరాలతో

విశ్వమందు సంచరించే గాయిత్రి దేవతా

శరణుకోరి వేడుకొంటే అభయమిచ్చు దేవతా

ప్రణామం, ప్రణామం, ప్రణామం

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట తెలుగు తేనియలు

 

 

కందము

 

తెలుపు వర్ణపు తోలున

కలుపును మనసున నాటి కలివిడిగానున్

కలుపుకు పోవలె మనుజులు

తెలుపును హృదిలోననింపి తెలివిగ నరులున్

 

గీతాశైలజ తెలుగు తేనియలు

 

 

కందము

 

దీనముగా రైతు దెలిపె

వానలు పుడమిన బెరుగగ వరదలు ముంచెన్

కానగ రావే కలుపులు

చేనున్ వరదలు కలుపుకు సేద్యము బోవన్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

తే.గీ.

మురుకు చేవి(కలు పు)లుగము గని యొడలు

మెండు పుల(కలు పు)రికొని మెక్కగ, కను

గొని (తెలుపు)డు చేయగనత్త, కొసరి మామ

నాపై బడి(తెలు పు)టుకుమన రుష జూపె!

 

చేవికలు= భక్ష్యములు, పులుగము = పొంగలి,

 

దుర్భ కృష్ణశాస్త్రి తెలుగు తేనియలు

 

 

 

తేట గీతి

 

కలుపు తీసెడి భామ వగలు గని తెలు/

పుదమని మదిలో మాట, నే ముదమున దరి/

జేరి మాట గలుపుచుండ సిగ్గుపడుచు/

నిలుచుని తెలుపు తామర వలెను తెల్ల/

గ నగియెన్ తన మనసు దీరునని మురిసి

 

వారణాశి శ్రీలేఖ తెలుగు తేనియలు

 

 

చంపకమాల

 

తెలుపు మరాళ వాసిని యతీవ సుమేధ విలాస విద్యలన్

కలుపు తెలుంగు సంస్కృత సుకావ్య విచారములి వ్విధంబుగా

తెలుపు సుధారసాబ్ధిమము  దేల్చగ సారము రమ్య  మాధురిన్

కలుపు హరించి చిత్తము వికాసమునొంద నొసంగు నీ కృపన్.

 

శిరీష తెలుగు తేనియలు


సమాప్తం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...