29, అక్టోబర్ 2020, గురువారం

పుస్తక సమీక్ష - అత్తగారి కథలు - 25.10.2020

 


 

భానుమతి గారి అత్తగారి కథలు 1 అందరూ చదివే ఉంటారు.

అందులో అత్తగారు సీరియస్ గా అంకితభావంతో చేసే కోణంగి పనులు మనకి నవ్వు తెప్పిస్తాయి, ఆవిడ దృష్టిలో సవతులు అంటే నియమం ప్రకారం కొట్టుకోవాలి, దొంగోడు అంటే ఒంటినిండా నూనెరాసుకుని నిగ నిగ మని నల్లత్రాచల్లే ఉండాలి, అరటిచెట్లు గెల వేయలేదంటే అవి కాసే చెట్లు కావు... ఆవిడ జపాను యాత్ర , తోడికోడలీయం ప్రహసనం అయితే పొట్టపట్టుకుని ఉండ్రాళ్ళలా నేల మీద పడి పడి దొర్లెయాల్సిందే....

ఇక అసలు విషయం లోకి వస్తే ...

 

నాకు నచ్చి బాగా నవ్వుకున్న కథల్లో (అన్నీ హాస్యంతో ఉంటాయనుకోండి )

ఆవకాయ్,  అరటికాయ పొడి తర్వాత అంతా నవ్వించినది అత్తగారు vs కూర్మావతారం....

 

కథా-కమామీషు :

 

మా అమ్మణ్ణి గారి అక్కగారి మనవడు వెంకటేశం , తండ్రి పోయిన తర్వాత జబ్బు చేసిన తల్లితో వచ్చి ఇక్కడే కలిసి ఉంటుంటాడు , చెన్నైలో సీట్ దొరక్క నాగపూర్ వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు , వెంకటేశం పెళ్లి బాధ్యత అతని తల్లి అత్తగారి నెత్తిన వేస్తుంది .. అత్తగారి పుట్టింటి తరఫు వాళ్ళైన పిఠాపురం సంబంధం ఖాయం చేసి వెంకటేశాన్ని రమ్మని జాబు రాస్తుంది అత్తమ్మ .. ఉద్యోగం దొరికేదాకా పెళ్ళికి ససేమిరా అంటాడు వెంకడు .

 

ఠా ట్ కుదరదు .... ససేమిరా జీలకర్ర ...అని పెళ్లికి ఒప్పిస్తుంది అత్తగారు , మొత్తానికి వంద శకునాలు, ముహూర్తాలు , గ్రహాలు చూసుకుని వెంకడు, అత్తగారు ఆవిడ వెతికిన చుట్టాల పిల్లని చూట్టానికి పెళ్ళిచూపులకి వెళతారు .

 

రెండ్రోజులకి  వచ్చిన అత్తగారి ఉత్తరం లో  ... మా లావు సమ్మన్ధమ్ లే అని వివరాలు రాస్తుంది... అసలు ఇబ్బందల్లా ఆ పెళ్ళికూతురు ప్రేమగా పెంచుకునే బుజ్జి మెట్ట తాబేలుతోనే... నేలపై పాకే జంతువులంటే భయమున్న వెంకడు ఆ తాబేలు చూసి భయ పడి జడుపు జ్వరం తెచ్చుకుంటాడు, వెంకడికి సాయిబు తాయెత్తు కట్టించి ,బోలెడు ఆస్తి ఉంది కాబట్టి , పిల్ల పెళ్లైతే తాబేలు తో సమ్మంధమ్ ఉండదు కాబట్టి ఎలాగోలా వెంకడ్ని ఒప్పించి రాగల పదిహేను రోజుల్లో (ముందుంది తాబేటి పండగ అని ) పెళ్లి ముహూర్తం పెట్టించుకుని వెనక్కి వస్తారు అత్తగారు .

 

 ఇంటికి వచ్చిన అత్తగారు , స్వయంకృతాపరాధమ్ వల్ల పాకుడు కట్టిన నీళ్ళ తొట్లో  పడి మణికట్టుకి దెబ్బ తగిలించుకుంటారు, .వెంకడు తీసుకొచ్చిన డాక్టర్ ఆఁ ... ఏం పర్లేదని నాలిక ఎగరేసి , కట్టుకడతాడు...

 

ఏఁవిటా స్వయం...... అంటే ఆవిడ ఎవరికీ చెప్పద్దన్నారు !!

 

పెళ్లి కూతుర్ని అలకరించే బాధ్యత తీసుకున్న అత్తగారు ట్లో ఉన్న పాతనగలని పెళ్ళికూతురు కి వేయబోతే వీలు కుదరక .... పా....తనగలు కదా అని తిరిగి పెట్టెలో పెట్టేస్తారు  .  

 

రమణారెడ్డి ,సూర్యకాంతం లా  పీటలమీద కూర్చున్న వాళ్ళని చూసి పెళ్ళివారంతా చెవులు కొరుక్కుంటూ , ముక్కు మీద వేలేసుకుని , ఇంకో చేత్తో చెంపలు నొక్కుకుంటూ నవ్వుకుంటుంటారు ,ఈ హడావిడిలోనే  పెళ్లి కూతురి మెడలో తాళి కట్టబోయి కెవ్వున కేకేసి యాఙీకుని మెడలో వేస్తాడు వెంకడు ,...

 

 మన కథలో విలన్ అయిన కూర్మావతారం గారు.  ఎక్కడినుంచి వచ్చారో ముద్దుగా పెళ్ళికొడుకుని కొరికి  పెళ్ళికూతురు పక్కన చక్కగా పెళ్లి పీట అధీష్టిస్తారు ,నానా తిప్పలు పడి ముహూర్తం దాటే లోగా తాళి కట్టిస్తారు ..

 

శోభనానికి  భయపడుతున్న పెళ్ళికొడుకుని బ్రతిమాలి గదిలోకి పంపితే , పెళ్లికొడుకు కన్నా ముందే మంచం మీదకి ఎక్కిన మిస్టర్. కూర్మ చిద్విలాస దర్శనం ఇచ్చి మళ్ళీ వెంకణ్ని భయపెడతాడు ...

 

అత్తారింటికి మిస్టర్. కూర్మా అసలు రావడానికి వీల్లేదని మామ గారి దగ్గర మాట తీసుకుని ఇంటికి తీసుకొస్తూనే ఇద్దరికీ ఫోటో తీయించాలని నిర్ణయిస్తుంది మన అమ్మణ్ణి, ఫోటోకోసం మామగారిచ్చిన సూట్ వేసుకుని వచ్చిన వెంకడు ఫోజ్ ఇవ్వబోగా మన కూర్మి గాడు. కోటు జేబులోంచి బయటకొచ్చి హాయ్ చెప్తాడు....., మళ్ళీ... గొడవ స్టార్ట్,  పోస్ట్ వెడ్డింగ్ షూట్ రద్దయ్యి...... అత్త గారి తిట్లు , పెళ్లి కూతురి విసురు మాటలు, వెంకటేశం పాట్లు ,ఇవన్నీ చూసిన పెళ్ళికూతురు అన్నగారు , తాబేలు ని సంచిలో మూట కట్టుకుని అప్పటికప్పుడు టాక్సీలో ఊరికి తీసుకుపోతాడు ..

 

ఓరోజు... చిలకా గోరింకలా తిరిగి రండని బీచ్ ప్రయాణం పెడుతుంది అత్తగారు , బీచ్ కి దగ్గర్లో ఉండగా మళ్ళీ కెవ్వ్ మని కేకేసి వెంకటేశం కార్ లోంచి దూకి కోపంగా వెళ్ళిపోతాడు .. ఏఁవిటా అని చూస్తే ఎప్పుడు తప్పించుకుందో ...  వెంకడ్ని కొరికి పిల్ల పక్కన దూరుతుంది ..  కార్ డోర్ లో వేలు నలగ్గొట్టుకున్న అత్తగారి "మోసం చేసిన కుటుంబం" దండకం విని.. ఆ బాధ- కోపం కలిసి కూర్మాన్ని కార్ లోంచి  బయటకి విసిరేస్తుంది పెళ్ళి కూతురు .. , మంచిదైంది అని ఇంటికి వచ్చేసరికి పెళ్ళి కూతురి అన్నగారు "తాబేలు తప్పించుకు పారిపోయింది, దొరికితే చంపేయండి" అనే టెలిగ్రాము ఇంట్లో ఉంటుంది!!

 

ఓ పక్క కార్లోంచి దూకి కిందపడి దెబ్బలు తగిలించుకుని కట్లు కట్టుకుని , భయం ,బాధ, అవమానంతో వెంకటేశం  , ఇంకోపక్క ఏడుస్తూ తిండి మానేసిన హీరోయిన్ .. ఈ లోగా వీధి లో గేట్ బయట సందడి మొదలవుతుంది,  ఏమిటా అని చూస్తే .....

 

ఆ.. తర్వాత ఏం జరిగిందంటే .. మీ కాడ పుస్తకాలున్నాయి గా సదూకోండి మరి .. ఆఁయ్ ..

నా పుస్తకం మాత్రం ఆడక్కండి .. మా అమ్మ దానగుణంతో , నా నిర్లక్ష్యం తో రెండుసార్లు తప్పిపోయిన .. అః కాదు కాదు అపహరించబడిన పుస్తకమిది.. ఇప్పుడు నా దగ్గర మూడో పుస్తకం ఉంది (నాటకాలలో రెండో ,మూడో కృష్ణుడిలాగ ) .. అందుకే ఈ పుస్తకం మొదటి పేజీలో “నన్ను చదివిన తర్వాత మర్యాదగా తిరిగి నా ఓనర్ కి ఇచ్చేయండి, లేదా మీకు ------- “ అని ఒక శాపం కూడా ముందు మాటలో కలిపేశా .. అప్పటినుంచి పుట్టింటికి వెళ్లొచ్చిన ముద్దుల ఆడపడుచులా జాగ్రత్తగా ఇంటికి వస్తోంది ..

 

అదన్నమాట అత్తగారు-కూర్మావతారం కథ, ఇది అత్తగారి కథలు రెండో భాగంలోని ఐదవ కథ !!!

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు

 

 ***************

 

అత్తగారి కధలు 2 - లోకానికి తెలియని ఇంకో కథ  2️ (రెండవ భాగం)

 

సెటైర్ తో కొడుతోందని ముళ్ళపూడి వారి చురుకైన బుర్రకి అర్ధమయిపోయింది...

వెంటనే లాల్చీ  జేబులో చెయ్యి పెడితే చార్మినార్ సిగరెట్ తగిలింది...

హమ్మాయ్య అనుకున్నారు.

ముళ్లపూడి :  స్ ...స్ .....సారీ మేడం...  క్..క్..క్షమించాలి !!

 

అంటూ చేతి రుమాలు తో మొహం మీద కారుతున్న చెమట్లు 

తుడుచుకున్నారు. టేబుల్ ఫ్యాన్ తిరుగుతోంది కానీ ఈ ఆసిలేషన్ పనిచేయడం లేదు మరి.

 

క్షమించండి మేడం. మా అయ్యవారు వద్దంటూనే ఉన్నారు ... సుతరామూ కూడదన్నారు..   నేనే ఆయన మాటలు వినిపించుకోలేదు.. పైగా కొండత దేముడికి అంత పత్రీ ఇవ్వలేము కదా అని వాగేశాను.

 

అవతల నుండి ఏమీ మాటలు వినబడట్లేదు. ముళ్ళపూడి వారికి ఇంకా టెన్షన్ మొదలయింది.. హలో మేడమ్ ... హలో    

ఊఁ ఊఁ... వినబడుతోంది .. చెప్పండి ఆవిడ తరహాలో

మేడమ్ మీరు ఆ చెక్కు తిరిగంపెయ్యండి అన్నారు 

పంపడమా  ...  వ్వాట్ .. ????

 

అదే... మేడమ్ ఆ చెక్కు తిరిగి మీరు పంపించేస్తే మేము మీకు తగిన రీతిలో సత్కరించుకుంటాము.  పంపండమేమిటండీ .. అంతా ఖర్చయిపోతే,  

ముళ్ళపూడి వారికి ఇంకా టెన్షన్ పెరిగింది.

ఇరవై రూపాయలు తనలాంటి సాధారణ జీతగాడికి చాలా ఎక్కువ డబ్బే.. ఆవిడకు కాదు కానీ నా కధలో హీరోయిన్ అత్తగారే కదా.  మీరిచ్చిన ఆ ఇరవైలో  రూపాయలు పెట్టి ఆవిడకు సైను పంచె కొన్నాను ఆవిడ చీరలు కట్టరు కదా... హ్హహ్హ  మిగతా ఎనిమిదిలో నాకో జాకెట్ గుడ్డా, మా వారికీ ఆరు కర్చీఫులు, మా భరణి కి (ఆవిడ కొడుకు) రెండు పిప్పర్మెంట్ లు కూడా కొన్నాను.

 

ముళ్ళపూడి వారికి ఇంకా భయం పెరిగిపోయింది. తన ఉద్యోగం ఉష్  కాకీ అనుకున్నారు ... జోకులనుకుని  మేడమ్... మీరు నిజంగానా.... మీరు నిజం చెబుతున్నారా.... నిజంగా మని ఆర్దర్ తీసుకున్నారా.. మీరు ఇన్సుల్త్ గా అనిపించలేదా భలే వారే , చక్కన్న (చక్రపాణి గారు)  యువ పత్రికలో వేసినా ఇవ్వరు, ఆయన కూడా ఇన్సుల్ట్ అనే అంటారు. 

 

అసలు ఆంధ్ర పత్రిక వారిచ్చే ఆ ఇరవై ముందు సినిమాలో వచ్చే లక్షలు కూడా దిగదుడుపే కదండీ ... ఈ రుచికి సాటి లేదు. నా డబ్బు నేను సొంతంగా కథ వ్రాసి గడించిన డబ్బు ప్రతి  అక్షరం నా అంతరాంతరాల్లోంచి పుట్టినదే... అది సంపాదించిన డబ్బు ఎంత తృప్తిగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా పెద్ద రచయితే కదా

  

(అప్పటి వరకు నిల్చుని ఉన్న ముళ్లపూడి వారు వేంఠనే ఆ మెచ్చుకోలుకి ఉబ్బి తబ్బిబ్బయి కూర్చున్నారు)

 

నేను సొంతంగా వ్రాసిన కథ .. ఆ కథతో గడించిన డబ్బు అన్నారు ఆవిడ ఉత్సాహంగా  తాంక్యూ ... తాంక్యూ మేడమ్ ... ఇప్పుడే ఈ సంగతి మా అయ్యవారు, శంభుప్రసాద్ గారికి కూడా చెప్పండి దయచేసి (ఇంకొంత ఆనందంగా) వింటున్నాను వింటున్నాను రమణ గారు  అన్నారు ఎక్స్టెన్షన్  ఫోన్ లో …

 

సంతోషం  భానుమతి గారుమీ వ్రాసిన  కథ బాగుంది. 

మీరు వ్రాస్తూ ఉండండి. నాకు పరమానందం అయిపొయిందిమరీ ఎక్కువగా కూడా పొగడకుండా జాగ్రత్త పడ్డారు..

ఆవిడకుండేదావిడకుంటే.. మరి మేము మేమే .. పత్రికల వాళ్ళం    

వెంటనే సీట్లోకొచ్చి ఒకే దమ్మున రెండు చార్మినార్ సిగరెట్లు వెలిగించి జాయింటుగా గాఢంగా పొగ లాగారు ముళ్లపూడి వారు    

 

ఇంతలో అయ్యవారు కూడా నా సీట్ దగ్గరకు వచ్చారు.. అందరూ సీట్లోంచి లేవబోయినట్లు నటించి మళ్ళీ అలాగే కూర్చున్నారు దీక్షగా వ్రాసేసుకుంటూ.   

 

అయ్యవారు మామూలుగా క్రావెన్ -ఏ సిగరెట్లు కాలుస్తారట.

చాల ఖరీదయినవి మరి . ఒక్కొక్కటి అర్ధ రూపాయి. స్టీలు టిన్నులో ఉంటాయి.. కానీ ఆయన కూడా నా అణాన్నర పాకెట్ లోని ఒహ చార్మినార్ ఆయన కూడా ముట్టించారు.

ఆనందంతో ఆఫీసు వాళ్ళు జలదరించింది 

 

కానీ, ఇంతలోనే.... కుర్రతనప్పొగరు .. అహంకారం ... అజ్ఞానం తో ఒక పిచ్చి పని చేశారు ...  మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాము.

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు


 ***********

 

ఒకరోజు నేను ఆరో తరగతికి వచ్చేముందు ,.మా బామ్మ గోరింటాకు పెడుతూ చెప్పింది,

ఇంట్లో వాళ్ళు తప్ప బయటవాళ్లంతా ధుర్యోదండు, రావణాసృడు అందుకే వాళ్ళతో మాట్లాడకూడదు, మంచినీళ్లు కూడా ఇవ్వకూడదు సరేనా!!

సరే..సరే...కానీ మరి...నాకో అనుమానమ్..సర్లే తర్వాత అడుగుదాం లే

ఈలోగా మా హన్ను గాడి సుబ్బుబాబాయ్ వచ్చాడు , ...

అమ్ములూ ...బాబాయ్ ఉన్నాడా ??

ఉన్నాడు కానీ, నువ్వు దుర్యోదండు గారా లేక రావణాసృడు వా??

నేను ధుర్యోదండేంటే నీ మొహం,

పిన్ని ...ఏంటిది ఏంటో అంటోంది??

ఇప్పుడే మా బామ్మ చెప్పింది లే , నాకు తెలుసు.. ;) ;)

ఏమి చెప్పిన్దేవిటి , మీ బామ్మ?

 

ఒరేయ్, పిల్ల దానికి జ్వరం వచ్చి ఇప్పుడే తగ్గిందిలే ,అప్పారావు గారి డోసు కొంచం ఎక్కువయ్యి ,అందుకే పైత్యపు వాగుడు,  వాడు వసారాలో ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్లు.

 

ఒసేయ్ ,ఒసేయ్ , నీ తెలివితేటలతో కొంపముంచేలా ఉన్నావ్ , నేను చెప్పింది వీళ్ళ గురించి కాదు, వాళ్ళు అంటే మీ బాబాయ్ ఫ్రెండ్స్ అంతా మంచివాళ్లే , వాళ్లలో రావండు వాడు ఉండరు, సరేనా?వాళ్ళని నీ ప్రశ్నలతో విసిగించకు !!

 

సరే సరే!!

మూడు నాల్రోజుల తర్వాత , మిట్టమధ్యాహ్నం ,...

ఒక్క వంకాయ

రెండు రోకళ్ళు

మూడు ముక్కంటి

నాల్గు నారాయణ...

అని పైన వాసాలు నోటితో లెక్కపెడుతూ....అరుగుమీదున్న పడక్కుర్చీకి కఱ్ఱ తీసేసి లోపాల  కూర్చుని ప్రపంచాన్ని బాగుచేసే  ఆలోచనలు బుర్రలో ఉండగా... చేతిలో పెద్ద కేను, ఇంకో చేతిలో పెద్ద సంచీ , దూరపు చుట్టం దగ్గరి బంధువు అయిన మా జన్నిమాయ్య చెమటలు కక్కుతూ వచ్చాడు..

 

ఏఁవేవ్ ..అమ్ములూ బాన్నావా? ఏదో ఘనకార్యం చేస్తున్నట్టున్నావే ??  నువ్వెలా ఏడిస్తే నాకేం కానీ ..  మీ బామ్మని వాళ్ళని పిలు!! మధ్యాహ్నం పూటేమో ఒక్క సన్నాసి రిక్షా వాడూ లేడు , తాతలు దిగొచ్చారు !!

 

అదేమిటి ఇంటికొచ్చి చెప్పుంటే అబ్రహం ని పంపేవాళ్ళం కదా ??ఇంతకీ నువ్వొక్కడివే ఉన్నావ్, తాతలేరి??

 

నీ తెలివికి ముచ్చట పడ్డానులే కానీ...ఎండనపడి వచ్చాను కాస్త మంచినీళ్లివ్వు !!

నీకు నీళ్లివ్వాలంటే నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి !!

అబ్బో మొహం లో మేధావితనం తాండవిస్తోంది , సర్సర్లే త్వరగా అడుగు , కుర్చీకి కఱ్ఱ తగలెట్టు కాస్త కూర్చుంటా, నీరసం వచ్చేలా ఉంది!!

ముందిది చెప్పు నువ్వు రావనాస్రుడా, ధుర్యోదండా??

ఆఁ , అంటే ఏఁవిట్ట్హా?

ఏదో ఠాహ్ ..ముందు చెప్పు నువ్వు ధుర్యోదండా? రావనుండా ?

 

ఆఁ నా మొహంమండా.. చనగపప్పున్డే , తింటావా ఇందా ఇదిగో సంచినిండా బోలెడు అప్పచ్చులున్నాయ్, మొత్తం నువ్వే మెక్కేయకు, కొన్ని ఇంట్లోవాళ్ళకి ఉంచు,ఇదిగో కేన్ నిండా జున్నే, ఎంతకావాలిస్తే అంత తిని, మిగతాది ఒళ్ళంతా పాముకో.. ఇప్పుడెళ్లి నీళ్లు తే !!

(మంచోడిలా ఉన్నాడు , నీళ్లిచ్చేదామా ? అమ్మో!! బామ్మ తంతుంది)

 

లంచాలేవి నా దగ్గర కుదరవు ..అడిగిన వాటికి చెప్పకపోతే నేను నీళ్లివ్వను పెహ్!!

 

పెద్ద పీషాణం లా ఉన్నావే, ఇదిగో శ్రద్ధగా విను  ... నేను ధుర్యోదండూ , రావనుండు కాదు వాళ్ళన్ద్హ రి కన్నా గో.....ప్ఫ కీచుకుడ్ని.. ఇప్పుడైనా తిరకాసు వేషాలు మాని , కాసిన్ని నీళ్ళట్రా నీరసం వచ్చి కళ్ళుతిరుగున్నాయ్!!!

 

కీచకుడివా ? నువ్వింకా చచ్చిపోలేదా.? మా బామ్మేమో భీముడి చేతిలో కుక్క చావు చచ్చాడంది ?

 

ఆసినీ అఘాయిత్యం మండిపోనూ ...రావండు, దుర్యోదండు కూడా చావలేదా ?

వాళ్లు వీరమరణం పొందారు, కీచకుడు కుక్క చావు చచ్చాడు !!

ఒసేయ్ ఒసేయ్..ఇంక నోర్ముయ్ అన్ని సార్లు కుక్క కుక్క అనకు...పోనీ నేను జాంబవంతుడు అంటాను...పోయి నీళ్ళు తీసుకురా

జాంబవంతుడా ? ఆయన మంచోడేకదా ??అయినా నీలా పీలగా ఉంటాడేంటి?  ఓసి నీ యమ్మ కడుపు బంగారుకాను ముందు నీళ్లియ్యవే

గొంతెండిపోతోంది !!  అంటే , మరి కాల్వల్లో నీళ్ళఆపేశారుగా అందుకే నీ గొంతు కూడా ఎండిపోయిందంటావా?

 

ఓసినీ దుంపతెగా , ఏఁవీ తోచటల్లేదల్లే ఉంది నీకు ,నన్ను తినేస్తున్నావ్ , నీళ్లియ్యవే , లేదా నన్ను లోపలికన్నా ఏడవని !!

అది కాదు మామా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు , నువ్వెవరో చెప్తే కానీ నాకు కుదరదు!!

 

ఒసేయ్ ..ఒసేయ్ ఒసేయ్..నువ్విప్పుడు ఇస్తావా? నేనే మీ అమ్మని పిలిచి పేకావారి పెళ్ళికొడుకుతో పెళ్ళి చేయించమంటావా?

 

నువ్వు సీరియస్ అవ్వకు మామా ఆగు, మన మధ్య అమ్మని తెస్తావెందుకు ?...ఆగు ,మా బామ్మని అడిగి నీళ్ళిస్తా !!

 

అదే నోటితో ,లోపలున్న ఇంట్లో వాళ్ళని లేపు , అరుగుమీదే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయ్ !!

 

బామ్మోయ్, (లోపలికి పరుగు)  జన్ని మాయ్య జాంబవంతుడుట మరి, వీడి గురించి నాకు చెప్పలేదు...మంచినీళ్లివ్వనా వద్దా??

 

పరాయివాళ్ళు రావణాస్రులు

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...