22, ఆగస్టు 2020, శనివారం

దత్తపది (పూజ - రోజు - మోజు -  తేజ); 21-08-2020 


 కం

పూజలు జేసెడి మనసుకు

రోజులు బహు సుందరముగ లోకము నుండున్

మోజు పడక సుఖముల నా

తేజసు కనుగొను నిరతము దేవుని గొలువన్!!


కళ్యాణ్ చక్రవర్తి; ముంబాయి

-------------------------------------------------------------------------------------------------------------------

పూజ లు చేయగ గేహము నందు 

రోజు లు గడవగ మోదము నందు 

మోజు లు కొరవడి పొందు ముక్తి మార్గమున

తేజ ముగా వెలుగొందు ఆ గేహము కలిలో 

వి.వి.శ్రీనివాస్


------------------------------------------------------------------------------------------------------------

ఏకలవ్యుడు అధర్మము వైపు యుండు ననెడి భావనతో ద్రోణాచార్యుడు గురుదక్షిణగా బొటనవ్రేలు యివ్వమనెడి యితివృత్తము ఆధారంగా నా ప్రయత్నము

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

సీ.

శూరులు యెంద(రో జు)వ్వరించిన మహా

     భారత కథయందు, పావనుడగు

ఏకలవ్యుడొకండు శోకమాపుకొని తా

      నేర్చెను విలువిద్య నేర్పు తోడ

(పూజ)నీయులయిన (తేజ)స్వి ద్రోణుని

       తలపు నిలుపుకొని తన్మయతన

సాధించె నిపుణత సవ్యసాచి నెదిరిం

     ప నటుల; యొకనాడు వనము నందు

గీ.

ద్రోణుడు కలిసె శిష్యుణ్ణి, దొట్రుపడని

దంబ(మో జు)త్తునవ్రేలు దక్షిణగను

యివ్వమని యడుగ, నరికి యిచ్చి యేక

లవ్యుడు చరితార్థుడయే సలక్షణముగ


                                      వెంకట్. సిహెచ్

-----------------------------------------------------------------------------------------------------------------

పూజ-రోజు-మోజు-తేజ


ఉ.

పూజలు జేయుచుండ విరబూయు మనంబు వసంతగీతమౌ

రోజు శుభంబుగల్గు జయ రోకనమై దరిజేర్చు విశ్వమున్

మోజులు దీరునట్లుగను మోదము గూర్చును ధర్మపద్దతిన్

తేజమొసంగు మానవుల దీనత మాన్పును నిష్టదైవమే!


మీ మహేశ్ ముత్యాల

--------------------------------------------------------------------------------------------------------------------

ప్రపంచ యుద్ధాల ఇతివృత్తంలో నేటి దత్తపది.. ఉత్పలమాలిక  


ఉ ll

రాజుకొనంగ కాష్టముల రవ్వలు నాడు ప్రపంచయుద్ధమున్ !

తేజము జూపి కోరికలుదీరక వాంఛలు తీవ్రమైనచో 

వ్యాజములన్ని రేపి బలవంతపు రాజ్యములన్ని మూర్ఖులై 

మోజులు, స్వార్థముల్ చెలఁగి మోహపు కాంక్షలు తీవ్రమైనచో

రోజుకొకండు ధూర్తుడు మరో రణమందున ద్రోహచింతనల్ 

పూజలు యెన్నిచేసినను భూతలమందున శాంతి సాధ్యమా ?? 


కస్తూరి శివశంకర్

-----------------------------------------------------------------------------------------------------------

నేటి దత్తపది కందము లో...


పూజ లు చేసిన ఫలితము

రోజు ను అనువుగ మలచును రోదన లేకన్

మోజు లు తీరగ రాయుచు

తేజ ము లలరగ తెనుగున తేనియ లూరన్.....


--- జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

---------------------------------------------------------------------------------------------------------

అందరికీ నమస్సులు. నేటి దత్తపదికి నా పూరణ కందము లో


కం /

రోజూ నీకొనరింతును /

పూజ వినాయక ! గణేశ భూతలమందున్ /

తేజము మా పాపమ్ముల

మోజును నడతను మరల్చి మోక్షమునీయుమ్ 


శ్రీదేవి 

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఈ రోజు దత్తపది కి నా చిరు ప్రయత్నం


ఇహము పైన మోజు వీడి చేసే పూజ

చేత తేజ రిల్లు, చిత్త శాంతి

రోజు నీవు చేయు పూజ ఫలితమిచ్చు

తెలిసి నడుచు కొనిన తీరు వెతలు


✍️రమ, కంకిపాడు

--------------------------------------------------------------------------------------------------------------------------------


ఉ.మా


రోజులు సాగుతున్నవని రూఢిగ నమ్మగ నైహికంబునన్

మోజుల వాంచలన్ సతము మున్గగ దేవుని ధ్యాస లేకయెన్

పూజల సేవలన్ మరచి భోగములందు వసించు వారికా 

తేజము గాంచు భాగ్యములు దీరక జీవితమే వృధా యగున్


వాణిశ్రీ నైనాల

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

పూజ   రోజు   మోజు     తేజ


ఈ   పదములు ఉపయోగించి  నా  పూరణము సీసములో


ఆదిదేవుడు  కృష్ణుడగ్ర (పూజ)ల నందుకొనుట భావ్యము గదా, కొలుచు చుందు

రన్ని  లోకములలో  రమ్య గతిగ  నెల్లరు శిశుపాలుడ,   యెగ(రోజు)   పడగ  

వలదు    మై(మోజు)ను గలిగించు చుండెను గా   నీదు పలుకులు, ఘనులు  మాత్ర

మే  కాంచ గలరుగా శ్రీకాంతు (తేజ)మున్ ముదముగల్గి,  న(తేజ)పు నయనముల


వారు కాంచగ లేరుగ  వాజ సనుని 

గరిమను, కుపితపు పలుకుల్ దొరల వలదు,

నిచ్చట సభల నెవ్వరున్ మెచ్చ బోరు

నిన్ననుచు   పలికె  కిరీటి  నిగ్రహముగ  

  

పూసపాటి

----------------------------------------------------------------------------------------------------------------------------


ఈ నాటి దత్తపది... రోజు, మోజు, పూజ,   తేజ 


పూజ ను త్రికరణ శుద్ధిగ ప్రతి 

రోజు  ఒనరించిన, ఒనగూడు ముఖము పై 

తేజము, ప్రశాంత చిత్తము చేకూరు, 

మోజులు, మోహములు,ఈర్ష్యలు పటాపంచలగు... 


గేయ రచన, 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి


-------------------------------------------------------------------------------------------------------------------------------------


పువ్వుల వేదన-


పరమాత్మ పూజనందు  సేవకులమై

ధన్యమునంద  పుట్టితిమి

ఆయన కంఠ పూల మాలలో నొకటిగ

తేజరిల్లుటకని  విరిసితిమి

ఆ నెపమున రోజు రోజుకు మేము

నిర్మలురమైతిమి

ప్రకృతి మాత ముద్దు బిడ్డలు మేము

కుసుమ బాలలము..

అకటా!

ఈ మనుజులు మమ్ము  తామసిక 

మోజులకు వాడి చంపుదురే..

భగవాన్!

నీకు విన్నపము చెప్పుకొనుట తప్ప

ఏమన లేని  కోమల జీవులము .


కె మల్లికార్జున రావు

----------------------------------------------------------------------------------------------------------------------------------------

కం


పూజలు జేసెడి మనసుకు

రోజులు బహు సుందరముగ లోకము నుండున్

మోజు పడక సుఖముల నా

తేజసు కనుగొను నిరతము దేవుని గొలువన్!!


కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

---------------------------------------------------------------------------------------------------------------


అందరికీ నమస్సులు 🙏🙏

నా  పూరణ 


హరుని పూజించినన్ భవ  హరమగునట 

పూజ ప్రతి రోజు చేయగ  తేజము లిడు 

మాయ మోహము  మోజులు మాయమవగ

చిత్తము సుఖ శాంతుల నొందె చిత్రముగనె  


అవళూరు సీత

----------------------------------------------------------------------------------------------------------------------------------------



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...