దత్తపది - 22
రామాయణ, భారత పురాణేతిహాసాలలో
ఒక అంశం ఇతివృత్తంతో
పద్య కవితలు / వచన కవితలు అందించగలరు.
అశోకవనములో శోకించు చున్న సితమ్మకు రాముని అంగుళికము చూపి హనుమ ఈ రీతిగా ధైర్యము చెప్పెను.
జయము - రయము - భయము - నయము
భయము వలదు తల్లీ
రయమున రాముడొచ్చి రావణనుని సంహరించి
జయముగ నిను అయోధ్యకు కొనిపోయి
నయముగ పెట్టాభిషిక్తుడై రామరాజ్యమునకు
శ్రీకారము చుట్టును
రమ
***
కౌరవ పాండవులు సంధి విఫలమై ఐదూళ్ళు కూడా ఇవ్వడానికి ఒప్పుకోని కౌరవులను ఉద్దేశించి భర్తలతో ద్రౌపది మాటలు....
చంపకమాల
నయమగు రీతినన్ నడుగ న్యాయము చేయని దూర్త కౌరవుల్
భయమున సంధి కోరితిరి బాండవు లంచును గేలి చేయరే!
రయమున సిద్దమవ్వ, రణరంగమె దేల్చును ధర్మ వర్తులన్
జయమిక తద్యమౌ మనకు చక్రధరుండిటు తోడు నిల్వగన్
వాణిశ్రీ నైనాల
***
రయమున వచ్చిన యాగాశ్వము కని,
సహ బాలురు భయమున బెదరగ,
అనునయముగ అశ్వము పట్టినారు,
లవకుశులు విజయము వరించగోరి.
కె మల్లికార్జునరావు
***
వచన కవిత
భయము పెట్టగ పాండవులను
రయమున దుర్యోధనుడు
ఘోషయాత్ర చేసి పరాజితుడౌగ
భీమార్జునుల దయచేతన్
బంధరహితుండై చేరె హస్తినకు
నయము చావు తప్పెకదా యనుకొనుచు.
ఆర్.వి.రమణమూర్తి
***
అన్యర్థముగా కాళీయ మర్దనం.
సీసము
కాళిందిమడుగున కాళీయుడనబడు
సర్పపు విషముకు సర్వజనులు
భయపడి మొక్కె న భయము నిచ్చెడి యప
జయమె రుగని ధీర చక్రపాణ్ణి
రోషముగ పనిచెరుపుదొ ర యము నా త
టాకమందు దుమికెన్ టక్కులాడు
కాళీయుడి నెదుర్చి గర్వమణిచె గద!
వి నయము న మ్రొక్కె విషము కల్గు
తేటగీతి
కాళియుడె కృష్ణుడినమిత కరుణ తోడ
విడిచిపెట్టి, హితముపల్కె విస్మయముగ.
భాగవతమందు రమణీయ పావనుడిని
తలచు కథలెన్నొ వివరించె తనివినొంద
వెంకట్.సిహెచ్
గేయ రచన
రయమున లంకకు చొచ్చి హనుమ
భయము గొలుప లంకిణి పై లంఘించి
నయమున రావణు కొలువున ప్రవర్తించి
జయము కలుగ లంకాదహనము చేసె...
గాంగేయ శాస్త్రి
***
నేపధ్యం : రుక్మిణి దేవి బ్రాహ్మణునితో శ్రీకృష్ణునికి సందేశమంపుట అంత ఆ బ్రాహ్మణుండు రుక్మిణీదేవి సందేశమును తెలుపుట కు శ్రీకృష్ణుని సమీపించి, ఆతడొసంగిన అర్ఘ్యపాద్యములకు, కుశల వచనములకు మిగుల సంతసించి, ఈ రీతిగా పలికెను.
జయం కృష్ణా, నీకు జయము
రుక్మిణీ దేవి సందేశము తెచ్చినాడను. జాగరూకతతో
ఆలకింపుమోయి అనుచు,
"నయముగ నే పలుకు చుంటి
ప్రాణేశు నీవే యని తలంచితి
నిను వీడి క్షణమైనా మనజాల
మనంబున సందేహములెన్నియో పొడసూపే
ఆతురతతో భయము హెచ్చాయె
కలికి చేయి పట్టంగ రయమున రావోయీ
జయంబు కలుగు నీకు జయంబు కలుగు నీకు
అవళూరు సీత
***
కందము
జయమిక నీదే యర్జున
రయముగ నే జెప్పు గీత రక్షణ యగునే!
భయములు విడుమిక తగదు వి
నయమింకను పాడిగాదు నరుకుట మిన్నౌ !!
కళ్యాణ్ చక్రవర్తి
***
వినయము గా రామ నామ జపము జేయ
రయము గా రాముడొచ్చి అభయ హస్త మొసగునని
జయము కల్గు నీ జీవన సరళి యందని సెలవిచ్చెనే
భయము ఎరుగని భక్తుడు అంజనీ పుత్రుండు
వి.వి.శ్రీనివాస్
***
భావ కవితలు
1.
ముకుందా హే గోవిందా నీ పై మరులుగొన్న దాన
నిను పెండ్లాడ దలచితిని వేగమే వచ్చి నను చేపట్టవే
అని నిర్మల భక్తితో వేడుతూ విప్రవర్యుతో కబురంపగా
భక్త సులభుడు వాసుదేవుడు రయమున విధర్బ కేతెంచి
నయమున రమణి రుక్మిణి నాదరించి అ"భయమొ*సగి
తోడ్కొని పోవ సురు లెల్లరు జయము జయము శ్రీకృష్ణ
విజయమంచు కొనియాడెరె.
2.
కురుక్షేత్ర మున కురికన కిరీటి స్వజనుల గాంచి
విహ్వలుడయి రయమున అస్త్ర శస్త్రముల విడిచి
రణము సేయజాలనని సారధి శ్రీకృష్ణ భగవాను
చరణముల సాగిలపడ అంత నందనందనుడు
నయమున గీతోపదేశం సేసి అభయ మొసగినంత
గాండీవి యుద్దోన్ముముఖుడై విజయమునకుద్యుక్తుడాయె
కె మల్లికార్జునరావు.
***
రణ భూమిలో రామునకు ఆగస్త్య మహా ముని ఆదిత్య హృదయము విసిష్టత తెలుపు సందర్భము
భయము పడగనేల రామ భద్రా శుభము కాదునీకు
నయమునిడెడి మంత్రమిదియె నమ్మి భాస్కరుని పూజించ
రయమున కలుగుగా జవము రణమును ఘనముగా జేసి
జయమును పొందగలవని సంయమి బోధించె నపుడు.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కురుకేత్రములో కృష్ణార్జున సంవాదము. అర్జున విషాదయోగం లోని ఒక చిన్న భావం.
కందము
జయమపజయమున గానక
రయముగ కార్యము నిరతము రవితేజమువై
నియమముగ శ్రమించగనే
భయమేల వలదు త్వదీయ భావంబదియే
చంపకమాల
జయజయ ధ్వానముల్ చెలగు సంసరణామృతమందు యోచనల్
రయముగ కుంజరంబులు తురంగపు సంగరమందు దీక్షతో
నియమము నీవు జూపినను నేర్పుని జూపుట సాధ్యమే సుమీ
భయమును వీడుచున్ వెలయు పాండితి శాస్త్రనిగూఢతత్వ చిం
తయు మదిలో ! తలంపులన ధర్మము నిత్యము ఆశయంబదే !
కస్తూరి శివశంకర్
***
కందము
రయముగ కర్మలు జేసియు
భయమున వేడుచు మనమును భగవం తుడినిన్
నయముగ బాధలు దీర్చగ
జయమును యివ్వగ నువచ్చె జగధా ధారిన్
గీతాశైలజ
***
తేటగీతి
భయము లేకుండ రాశాను పామ రునిగ
రయము నగురువే చెప్పెను రమ్య ముగను
నయము యగుటయే మాకును న్యాయ మైన
జయము కలుగగ దీవించి సాగ నంపె.
తేటగీతి
భయము వలదని చెప్పెను పామరులకు
నయము నగునని యోదార్చె నాయకునిగ
జయము కలదురావణునిపై రణము నందు
రయమునపలికె దృఢముగ రాముడిటుల.
తాండవ కృష్ణ
***
(వనవాసంలో నున్న శ్రీరాముని భరతుడు దర్శించి,మాట తప్పాననే భయాన్ని వీడి,అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యపాలన చేయమని కోరుట)
చంపకమాల
భయమునె వీడి మజ్జనకు పంక్తిరథున్ దలపించు రీతిగా
నయముగ రాజ్య పాలన ననారతమౌ విధి నీవె చేకొనన్
రయము నయోధ్య కేగుటయె రాణువ తోడ మదీయ కోర్కెయౌ;
జయము గలుంగు నీకెపుడు జాగును సేయక రమ్ము సోదరా!
చల్లా దేవిక
***
రయముగ పవనుజు వనమున
నయముగ జానకిని గనిన నాదరణముగన్
భయమును తొలగన్ సీతకు
జయముగ రాముని పలుకులు జాబుగ జెప్పెన్
పద్మలత
***
అన్ని పద్యాలు, కవితలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండి