14, ఆగస్టు 2020, శుక్రవారం

10.08.2020 చిత్రానికి పద్యము


 

చిట్టి కవిత

చిట్టి పిచ్చికమ్మా,,
అమ్మ రాలేదా,
బైటికి వచ్చావా,
ఎదురు చూస్తున్నావా....
 
( ఛందో బద్ధం కాదు )

గాంగేయ శాస్త్రి


 కవిత

మామూలు మాటల్లో చెప్పాలంటే ఇది ఒక
చక్కని పక్షి గూడు అంతే.
కానీ మనసు పొరల్లోకి వెళ్తే ఇది మన
బంగరు బాల్యానికి ప్రత్యక్ష సాక్షి.
చెరువుపైకి ఒంగిన కొమ్మల్లో ఆకశ  వీధిలో 
అబ్బురపరిచే ఓ ఆకాశ హార్మ్యం.
భూమ్యాకాశాల మధ్య కట్టిన ఓ వారధిలా అనిపించేది.
ఈనాటి ఆధునిక కట్టడాలకి ధీటుగా గాలివానలకు
చెక్కు చెదరని కట్టడం  ఎప్పుడో కట్టేసిన
ఈ గిజిగాడు
మహాకవి జాషువా చేత భేష్ అనిపించుకుని
గిజిగాడా నీకు దీర్ఘాయువు
అని దివింప చేసుకున్న ఘనుడు.
మనం పోగొట్టుకున్న ఓ మంచి జ్ఞాపకం
ఈ గిజిగాడు.
కాలుష్యానికి  బలైపోయి కనుచూపుమేరలో
కనిపించకుండా పోయి ఇలా కవితా వస్తువై నిలిచిన
ఈ పక్షి రాజుని పరిరక్షించు కుందాం.
కాసింత పచ్చదనం పెంచితే ఇలాంటి ఎన్నో
పక్షి రాజులకు ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం.
రమ 
 

గిజిగాడు పక్షులలో అందమైన బుజ్జి పక్షి.
దాని గురించి నా వర్ణన సీసములో..
 

సీసము

అది, గడ్డిపోచలనద్భుత రీతిగా
పేర్చియల్లిన బుజ్జిపిట్టగూడు
అది, బుజ్జి ఖగములకందమైన భవన
నిర్మాణసొబగుల నిపుణుని కళ
అది, నైగనిగ్యములందు మేటైన వి
హగము నైపుణి చూడ నద్భుత కళ
అది, జాషువా కలమందొదిగి కవనం
బుకు వన్నె తెచ్చిన పులుగు భామ
 
తేటగీతి
అక్కటా! గిజిగాడికి యబ్బిన కళ
కనగ, మేధావి మదినందు కల్గు బ్రాంతి
ప్రథితమైన నిర్మాణపు పక్షిగూడు
చూడ నరులతరముకాని  చోద్యమిదియె!
వెంకట్.సిహెచ్
 
  
తేలిక గడ్డిపోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు
య్యేల గృహంబు, మానవులకేరికి సాధ్యముగాదు,
 దానిలోజాలరు, లందులో జిలుగు శయ్యలు
నంతిపురంబులొప్పగా మేలు భళీ!
పులుంగుటెకిమీడవురా గిజిగాడ! నీడజా!
 
"తెలుగు వెలుగు" మాస పత్రిక లో వచ్చినది.
 
 

కవిత

పొదుపు కు నీవే ప్రతిరూపం
పొట్టి పొట్టి పరకలు ఏరి తెచ్చి
పొందికగా పొదరిల్లు కడ్తావు
పొందితివి నరులెవ్వరు నేర్వలేని విద్య
పొందలేదెవ్వరు ఈ సాంకేతిక నేర్పు
పొగడతరమా మాకు "దైవాన్ని"
పొట్టి పిచ్చుకకు ఇట్టి
పెద్ద విద్య నేర్పినట్టి"జగజ్జెట్టి"ని
 
(వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత..)
 ఆర్.వి.రమణమూర్తి 
 
తే.
పరకలొక్కొక్కటిగ కూర్చి పాటవమును 
ముచ్చటలు గొల్పు విన్యాసములను జూపి 
పిచ్చుకల కల కలములు ప్రీతి గాను   
మురిపెములతోడు గిజిగాడి భువనములవి
 శ్రీదేవి

తే.
గడ్డి పూచను బట్టుకు కష్ట బడుచు
నొకటి నొకటిగ దెచ్చును యోర్పు తోడ
పక్షి బిడ్డల దాచగ ప్రాణ మీయు
కంటి రెప్పల వోలెను కాచుచుండు
 
కం.
పక్షులు గూడును గట్టుచు 
రక్షింపగ దలచు చుండు రాత్రింబవళున్
భక్షించగ వచ్చినచో
శిక్షించును ముందుకేగి చింతించకనే!!
 
.
రాగల కష్ట కాలమున రక్షణ గోరుచు పక్షి పిల్లకున్
వేగము బెంచుచున్ తుదకు వెంటను వీడక నెల్లవేళలన్
తేగల గడ్డిపోచలను త్రెంచుకు వచ్చును తల్లి పక్షి తా
నేగుచు గూడుకట్టుటకు నెంతటి కష్టము సంతసంబుతో
 
.
కాలమదేమి యైనను, , కష్టము గాంచక గూడు గట్టునే
బేలగ నుండనేమియది వెంటను యుండుచు కంట గాంచునే
పాలన జేయుటన్ నెపుడు పాఠము నేర్పరు పక్షి జాతికిన్
ఆలన జూచినన్ సతము నందరి మెప్పును బొందునే గదా

కళ్యాణ్ చక్రవర్తి 

 
కవిత
ఏ లెక్కల సూత్రం నిర్మిస్తుంది నీ ఆవాసం
ఏ పురోగతి వెలకడుతుంది నీతో సహవాసం
అబ్బురమనిపించే ఇంజినీరింగ్ పనితనం
చిటారుకొమ్మన పలువురు మెచ్చిన కౌశలం
గూడంతా కనులు చేసి ఎవరి రాకకై వేచివున్నావు
జాము రాతిరి జాబిలమ్మ జాతర కోసమా!
కరిమబ్బులు కరిగి జాలువారే వర్షపుధార కోసమా!
వేకువ వర్షించే తుషారాల మెరుపుల కోసమా!
అద్భుత సౌందర్యం మాటున దిగులు ఏల
ఏకాంతము న గూడు కట్టిన విషాద ఛాయలు ఏల
ఎదురు చూసిన మనసు దిగులు ఏల నీవు కన్న
రంగుల స్వప్నం సాక్షాత్కరించే సమయం ముందుందిలే
 కోవూరి
 
కం.
 జోడు దొరకంగ కడితివి
గూడునిట నిపుణత చూప గుడ్లు పొదగగన్
మేడల మిద్దెల మ్రగ్గుచు
వేడుక చూదుము విహంగ విద్యల్ నేర్వన్
 
తే.
జోడు దొరక గుడ్లు పొదుగు గూడు కట్టి
సంతతిని పెంచి చాటగ సంతసమును
చిట్టి పిట్ట వైనను దెల్పె చేదు నిజము
ప్రకృతిలో నీ మనుగడయె ప్రశ్న కాగ
అవని నాక్రమించె నరుడు యదుపు లేక
మేడలెన్నొ కట్టెమనిషి మేటిగాను
తరములకు ధనం దాచెడి వరము బొందె
జీవరాశి లేనిదె మనిషి మనలేడు
తెలిసి కూడ తీరును మార్చు తెగువ లేదు
వాణిశ్రీ నైనాల
 
 
 
కవిత
చెరువులో వంగిన
తుమ్మ చెట్టు కొమ్మకు
పుల్లాపుడకా ముక్కున కరచి
గూడు కట్టిన చిట్టి పిచుకమ్మా
నింగీ నేల కి మధ్య                             
వేలాడుతు ఊగుతున్న
నీ చిన్నిపొన్ని  గృహ సౌదం              
ఒక సుందర  త్రిశంకు స్వర్గం
ఎక్కడ నేర్చితివి నీవు                        
ఈ వాస్తు శాస్త్ర విజ్ఞానం?
ఎవరు నేర్పించారు  నీకు                   
ఈ గృహ నిర్మాణ కౌశలం?
వెచ్చగా సురక్షితంగా                          
నీ గూడు లో ఉండక
బయటికెందుకు వస్తివి                       
పనిమీద పొరుగూరెళ్ళిన
సఖుని రాక కొరకే కదా                       
క్షణక్షణపు  నీ నిరీక్షణ
మనోహరం కమనీయం                      
ప్రకృతి కాన్వాసుపై
లిఖించిన ఈ అద్భుత దృశ్యం

కె మల్లికార్జునరావు 

 
సీ.
ఏమని జెప్పెద యసుమంత కాయంబు
బుద్ది ఘనత జూపె బుల్లి పిట్ట
నెవరు నేర్పిరి నీకు యేరి తెచ్చి పరకలతో
గూడు కట్టగ నేర్పు గుణము నీది
పొందిక తోడను పొదరిల్లు గట్టెను
విశ్వకర్మ వరమే విస్మ పరెచె
వింత గొలుపు గదా విద్య యెరుగనట్టి
ప్రాణులు ఘనముగ  పటిమ జూపె

 
ఆవే.
బుడుగు  పిట్ట వచ్చి భువనము పోలిన
నిల్లు కట్టి వెగడు నిలప లేదు
మనిషి గొప్ప బోవు మాయను విడువక
పక్షి కబ్బెనిట్టి పరమ జ్ఞాని
 
ఎం.పద్మలత
 
ఆసక్తి కలిగించే విషయం...
ఈ పక్షుల్లో మగ పక్షులు నైపుణ్యంతో గూడు కట్టి
ఆ గూటికి ఆకర్షితమైన  పక్షిని తోడుగా పొందుతాయి...
 ఇంపుగ ఇల్లు కట్టు ఇంపైన ఇల్లాల్ని పట్టు... సూత్రం


తే.
ఆకు యాకు నల్లితి  యందమయిన రెల్లు
గూడు గట్టి యుంచితి నన్ను గూడు మమ్మ
అండ గుందును నీకమ్మ యాడ పక్షి
జోడు కొరకు నా యాశను వాడ నీకు
డా. నాగులపల్లి 


ఇంపుగ ఇల్లు కట్టి
ఇంపైన ఇల్లాలిని పట్టి నాక
ఇంటి దైవాన్ని వేడుకొంటే
ఇంపైన "గిజిగాని గూడు"
ఇంటి చూరు కు వచ్చి చేరునేమో ?
 
ఆర్.వి.రమణమూర్తి
 
 
కవితఅవనిలో నిలిచిన అద్భుత క్రియ
శాస్త్రములకందని నిర్మాణ ప్రక్రియ
పరకల సమీకరణతో సాగే ఈ క్రియ
శాస్త్ర సాంకేతిక రంగాలకందని ఈ సుందర క్రియ
గ్రుడ్లు పొదిగి బిడ్డల సంరక్షణా క్రియ
ప్రకృతిలో ఒదిగి పోయె నీ నివాస ప్రక్రియ
తడి పొడి పలుకుల ప్రకృతి నేస్తం
అన్యోన్య దాంపత్య ప్రతి రూప సాక్ష్యం
అందం అందానికే అందం అవనిలో ప్రేమల భందం
చిలుకా నీ నిజరూప సాక్ష్యం నీ గమనం గగనానికే అందం .

వి.వి.శ్రీనివాస్

 
కవిత
పుల్ల పుల్ల ఒకటిగా చేర్చేన్
అల్లిబిల్లి అల్లికగా
చిన్ని గూడునుగట్టెన్
అందాల సౌధమని మురిసెన్
గిజిగాడు అందుదూరి మురిసెన్
 తన గళముతో కిచకిచ మంటూ పలికెన్
తలచుకుంటే సాధ్యమైనది
ఏదీకాదు ధరణిలోన అని తెలిపెన్
 
డి నాగమణి
 
ఉ.కొల్లగ ఖ్యాతినే బడసె కుంఠితమే విడి పీచులెన్నియో
మొల్లపు సంచయమ్మున ప్రమోదము నొందుచు నీ పులుంగు తా
నల్లన గట్ట గూడునిట; నచ్చెరువొందు జనాళి కాదటన్
యుల్లము నుల్లసిల్లెనట నూయల బోలెడు గీమునే గనన్!
 చల్లా దేవిక

 
కవిత
తుమ్మ కొమ్మల  నీ గూడు
ముచ్చటగొలిపె  చూడ చూడ
పచ్చని  కొమ్మల  వెచ్చని  నీ గూడు
మరి మరి నచ్చినదె  నిజము  నిజము
నీ  జిగిబిగి  అల్లిక  మాకు  గజిబిజిగా  తోచు,అయినా
నీ  హర్మ్యమే మాకు  అలంకార వస్తువు                              
తీసుకొచ్చితిమి నీ  గృహమిలా
తగిలించితిమి మా గృహముల
నేర్పితివి మాకు చిన్నదయినను
పొందికయిన ఇల్లు  ముచ్చటనుచు
ఆకసము నంటు మేడలు మిద్దెలు ఎన్ని యున్న నేమి
చివరకు ఆరడుగుల నేలే గతి
యని మరచితిమి మరియు  నేర్పితివి  మాకు
జంటగ నున్న  తోడు ఎగిరిపోయినను
ఒంటరి బ్రతుకు లోని మధురిమ కూడా  రుచి  చూడమంటు
రాకపోకల గమనము  నె వరెరుగుదురనుచు
తుమ్మ ముళ్ళతోటి నీ సహవాసం
నేర్పేనదే మాకు జీవిత గుణపాఠం
కష్టమైనను ఇష్టంగా  బ్రతకడం
 అవళూర్ సీత


 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...