15, ఆగస్టు 2020, శనివారం

15-07-2020 సమస్యా పూరణం, "తప్పుజేయువాడె ధర్మవిదుడు" - ఇచ్చిన పాదము ఆటవెలది లో.. పద్య కవితలు / భావములు

 

15-07-2020 

సమస్యా పూరణం

 "తప్పుజేయువాడె ధర్మవిదుడు" 

  ఇచ్చిన పాదము ఆటవెలది లో.. పద్య కవితలు / భావములు


ఆటవెలది

పాండవులనొడించె వక్రమార్గమునెంచి,

తప్పుజేయు వాడె ధర్మవిధుడ

నుచు సుయోధనుండు నుడివినా, భీముని

చేతిలో మరణము జెందె తుదకు.

 

తేటగీతి

ధర్మమున్ వీడి నోట్లిచ్చి ధరణినేలు

మెప్పుపొందిన సతతము తప్పుజేయు

వాడె ధర్మవిధుడు వోలె నేడు మెలుగు

చిత్రము గనిన, మదినందు చింతకలుగు

వెంకట్. సిహెచ్

 

భావ కవిత

1.

అశ్వత్థామ హతః యంచు ఉచ్చ స్వరమున,

కుంజరః యంచు లఘు స్వరమున పల్కి,

ద్రోణుని వంచించిన తప్పు చేయువాడు ,

ధర్మవిదుడుపాండవాగ్రజుడు వినరే.

 

2.

తరువు వెనుక దాగి వాలిని,

దునుమాడి మిత్రు గెలిపించిన,

తప్పు చేయువాడు ధర్మ విదుడు,

పరమ శూరుండు శ్రీరాఘవుడు.

కె మల్లికార్జున రావు

 

ఆటవెలది

ధీరుడైన వాడు స్థిరముగా నిలుచును

ధర్మమార్గమిదని దారి జూపు

ధర్మరక్ష కొరకు మర్మము లెఱుగుచు

తప్పు జేయువాడె ధర్మ విదుడు!

శ్రీదేవి

 

 

ఆటవెలది

జనుల హితము గోరి జంపుచు ధరణిన

పరుల రక్ష గాంచ ప్రాణమిచ్చి

హీన చరితులనిన హింసాయుధముబట్టి

తప్పు జేయువాడు ధర్మవిదుడు

 

ఆటవెలది

జనుల మోసగించి సంతసించెడి వాడు

ఓటు వేయు జనుల వేటు దలచు

నట్టి మాయగాళ్ల నంతమొందించగ

తప్పుజేయువాడు ధర్మవిదుడు

 

కళ్యాణ్ చక్రవర్తి

 

నా భావములో....

జనహితము కోసము కరోనా వ్యాధిని సయితం లెక్కచేయక

ఏమాత్రము భయపడక లక్డౌన్ వేళయందు

విధులు నిర్వహిస్తూ నిబంధనలు  అతిక్రమించిన వారిని

లాఠీలతో కొడుతున్నారని కఠినంగా శిక్షిస్తున్నారని

వారిపైన నిందలు మోపుతున్న వేళ

 తప్పు జేయువాడె ధర్మవిదుడు అనిపించింది. క్షణం లో మన్ను తిన్న కన్నయ్యను శిక్షించే యశోదమ్మలా కనిపించారు నాకు రక్షకభటులు.

రమ

 

ఆటవెలది పద్యములు

1.                                  

కోర్కెలెప్పుడైన గుఱ్ఱాలు కారాదు

కోరరాని కోర్కె కోరినపుడు

చెక్కబడెను ముక్కు చెవులు శూర్పణఖకు

తప్పు జేయువాడె ధర్మ విదుడు

 

2.        

తప్పులేనివాడు ధరలోన గనరాడు

ధర్మసూక్ష్మమెరిగి ధరణిలోన !

ద్రోహచింత లేని దోవ జూపినపుడు  

తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

 

3.        

ప్రజల కొరకు తాను పరితపించెడువాడు

పేద వారి యెడల ప్రేమ జూపి

సంపదలను కొంత సంగ్రహించినపుడు   

తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

 

4.        

రణము కన్న ముందు రాయబారము మేలు !

దారి దొరకదన్న తప్పదపుడు !

యుద్ధభూమిలోన యోచనలేకుండ

తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

 

5.        

తరచి తరచి విద్య దర్శింప గావలె 

అడిగి అడిగి జ్ఞాన మరయవలయు 

సత్యమెపుడు పలికి సద్భావముని గనుచు      

తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

కస్తూరి శివశంకర్

 

గాడి తప్పిన జీవన సరళిని

గాడి లో జొప్పింప దేవదేవుడు

దాడి గా కరోనాను ప్రయోగించె

తప్పు జేయు వాడె ధర్మ విధుడు 

వి.వి.శ్రీనివాస్

 

ఆటవెలది పద్యములు

1.        

ఉత్తమోత్తముడగు యుర్వీపతిగ పూని

దోషమెరుగనట్టి దొడ్డ సతిని

కానలకును బంపు కల్యుని దలపగ

తప్పు జేయు వాడె ధర్మవిదుడు!

 

2.        

స్త్రీల సంహరింప సెబ్బర యౌగాని

దుష్ట మనము గల్గి దురిత యైన

తాటకను వధింప దమనుడా రాముడు

తప్పు జేయు వాడె ధర్మవిదుడు!

 

3.        

అన్నదమ్ముల విడి యన్యుల జేరగ

దోషమైననూ విభీషణుండు

రావణునినె వీడి రాముని జేరగ

తప్పు జేయు వాడె ధర్మవిదుడు!

చల్లా దేవిక.

 

భక్త రామదాసు భద్రాచల గుడికిన్

శిస్తు సొమ్ము దోచి శిక్ష పడగ

గుడిని గట్టి ముక్తి గూడగట్టగ నాడు

తప్పు జేయు వాడె ధర్మ విభుఁడు

ఎం.పద్మలత

 

ఆటవెలది

అష్ట భార్య లొంద నాంతర్య మేమిటో

కృష్ణ లీల లెరుగ క్లిష్ట తరము

నాలుమగల బంధ మర్ధము నెరిగించ

తప్పు జేయు వాడె ధర్మ విధుడు

వాణిశ్రీ నైనాల

 

వక్ర మార్గ మందు వాసి కెక్కిన వారు

సంఘమందు నలరె సజ్జనులుగ

పాప కర్మతోను పరగు వారి కెపుడు

తప్పు జేయు వాడు ధర్మవిదుడు

డా. నాగులపల్లి

 

ఆటవెలది

ధర్మ జీవన విధముయె తనకు చాలు

నన్న మానవునకు నష్ట పరచు

వారె వరయినా శిక్షింప వశము గాక

తప్పుజేయువాడె ధర్మవిదుడు.

తాండవ కృష్ణ

 

నీతులెన్నియో వివరించినను

వినక పెడదారి పట్టు  విద్యార్థుల

దారి మళ్లించుటకై కఠినుడైన  గురువు

తప్పు  చేయువాడె ధర్మవిదుడు

అవళూరు సీత

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...