27, ఆగస్టు 2020, గురువారం

27.08.2020 ప్రణాళిక: చిత్రం పై పద్యం - 42

 


తెలుగు తేనియలు

 27 - 08 - 2020 ; ప్రణాళిక


 శీర్షిక : చిత్రం పై పద్యం  - 42


 పై చిత్రానికి తగిన పద్యకవిత / వచనకవిత అందించగలరు


మహిన సూక్ష్మ జీవులె సాయమంద చేసి

చరిత లోన నిలచి ఘనచరితు లైరి

సీత జాడ కొరకు పూని సేతుకట్టె 

వానరోత్తములు, ఉడుత భక్తి జూపి

రమ, కంకిపాడు

****

 

తేటగీతి

తోటి ప్రాణి రక్షణమున తోడు పడును

అల్ప జీవులు భువిలోన స్వల్ప సాయ

మడిగినను చేత కాదను మనిషి బుద్ధి

జీవి యట సత్య మిదియెగా చిత్తరముగ

అవళూరు సీత 

******************

          మానవ సేవలో స్వ, పర బేధాలు లేకుండా సేవానిరతిలో నిత్యం తరియించె  వారందరికీ పద్యం సమర్పణ.


        శా ర్దూలము  

        రక్షింపన్ స్వ-పరంబులేని తలపారాధించగా మానవుల్  

        పక్షంబెన్నక బంధమెన్నక సదా పాలించుచూ ధర్మముల్;      

        సాక్షీభూతములెన్ని సంఘమున విశ్వాసంబుగా నిల్చినన్        

        మొక్షామార్గములాయె సేవనిరతుల్ మోదంబుగా ధారుణిన్


        కస్తూరి శివశంకర్ 

*********************

కందము

 సాయమునకు లేదు కొరత

కాయము నందున్న బలిమి కలియుగమందున్

చేయుము సరియైన పనిని

పోయుము ప్రాణము జగతిని పొందగ సుఖముల్ !

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే

***********************************


కందము

చీమలు జేసిన సాయము    

ప్రేమని జూపించిగ చివురించిన సేవా 

కామితయోగంబదియే

ధామము జూపుగ జగతిని ధన్యము సుమ్మీ  !!

వై. శ్రీదేవి

************

 

గేయ కవిత 

సాయము చేయు తలపున్న,

కాయపు శక్తి తొ పనిలేదు, సం

దియము ను వీడి మనమ్మున,

రయమున సాయమందించితే చాలున్....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

*********************************


 సాయమొనరించు మనంబున్న

వారలకు, తమ దౌర్బల్యం అడ్డురాదు

సాధ్వి సీతమ్మను రక్షించ వలెనని

మహాబలశాలి దశకంఠుని తో

పోరు సల్పలేదా పక్షి రాజము

గెల్వకున్న నేమి జన్మధన్యమాయే..

అల్పజీవి ఐనను మూషికరాజము

కాలేదా వాహనముగ గణపయ్యకు..

చిట్టి పొట్టి వైనను పావురములు

మోయ లేదా సుదీర్ఘ  ప్రేమలేఖలు

చేర వెయ్యలేదా సుదూర తీరాలకు..

పశువులకున్న  నిస్వార్థ గుణం

నేటి మనుజులకు  లేకపోయెనకటా!

కె మల్లికార్జున రావు

********************** 

 

తేటగీతి( పంచపాది)

క్రిములు కీటకమ్నులకు జాలి, దయ తోటి

చూపె దాక్షిణ్యమును తోటి జీవిపైన

మూగ జీవుల సైతము నొకరి కొకరు

చేత నైనంతలో నిచ్చె చెయ్యి !నిలిచె

చెలిమితో ! మానవత్వముచెప్పు చుండె !

 

 లలితా దీక్షిత్

*****************


అల్పజీవులెల్ల ఉపకారము జేయ

ధరణిజను కనుగొనె దశరధ పుత్రుడు

భక్తి పారవశ్యము తోడ ఉడుత లెల్ల జేరి

సేతు నిర్మాణ క్రతువు లో తోడ్పడె భువిన

 సాయమొసగు మనంబు పొదిగిన జీవి ఏదైనా

ధన్యజీవి కదా ధర్మ ధరణి లొ

 వక్రబుద్ధిని మర్మముగ మనంబున పొదిగి

 తోడ్పడుచుందురు త్వరితముగ దుష్ట జనులు

 జర జాగురూకత లేనియెడల ఇట్టి జనుల పట్ల

ఉపకారముతో అపకారము మెండు అవనిలో

 

వి.వి.శ్రీనివాస్

*****************

 

తరువోజ

స్వార్థ చింతన తోడ సాయపడకనె

    సాగించెడి బ్రతుకు చపలత్వము గద!

వ్యర్థ జీవితమందు వ్యామోహితుడిగ

    వాంఛలు నెరపగ యాతన కలుగు.

వర్థిల్లు తుండెనె ప్రాణులు సాయ

    పడుతు తమకు తాము వైభవమ్ముగను;

స్పర్థనొదలి నీవు సాయపడంగ

     సంఘటిల్లునె సర్వ సంబరాలన్ని!


మధురాక్కర

నలుగురికి సాయపడి నీవు

                  నందన మివ్వవోయి!

వెలుగు పంచవోయి! సతము

                   వేదన దీర్చునోయి!

కలుగునోయి! ఘనము నీకు

                   కౌటిల్య మాపి సాగ

మెలుగవోయి! హితముతోడ

                  మేలు చేకూరునోయి!


 వెంకట్. సిహెచ్

 *******************

 

ఆటవెలది

చిన్న చిత్రమిదియె చిత్తము దోచెను

చిన్న చీమ జేసె మిన్నగాను

సాయమీయ దలచె సంబరముగ తాను

పెద్ద జీవి కైన వేగిరముగ

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 *******************************

నా చేయూత నిచ్చుటకు చిన్నైతె నేమి పెద్ద అయిన నేమి, ఆదు కొనే మనసు ఉంటే అంతకన్నా ఇంకేమి..

        అన్నపూర్ణ, ముంబాయి

**********************


ఆటవెలది

చిట్టి ప్రాణి యైన చేయూతనీయుచు

ప్రాణసంకటమును పారద్రోలి

రక్షణనిడనెంచి రయమున గాపాడి

మనుజ జాతికి నీతి మహిని దెలిపె

మహేశ్ ముత్యాల 

**************** 


తేటగీతి

మానవత్వము తోడను మనుజులెల్ల,

సాటివారికి చేయగ సాయమదియె;

యిహము నెదురగునట్టివౌ యిడుములన్ని,

దాటు నెవ్వారలైన నిద్ధరణి యందు! 


తేటగీతి

వెతను దీర్చిన వారలె వేల్పులనగ

నాప్తులౌను మనకెపుడు నాత్మ యందు;

సాయమందించు వారల సజ్జనులుగ,

జనులు పరిగణింతురు గద యనువు గాను !

చల్లా దేవిక. 

***********


తేటగీతి

ఆదుకొనె నల్పజీవియె   నబ్బురమిది

ఆర్తి నెరిగెను లేవుగదాస్తిపాస్తి

బుద్దిజీవికి స్వార్థము బుర్ర దొలుచు

సాటివాడ్ని చేయు పరాయి సంఘజీవి

వాణిశ్రీ నైనాల 

************** 


చిన్ని చేతులు చేయును పెద్ద సాయం బనుచు ఈ చిత్రము తెలిిపె

సీతమ్మ కై కట్టిన రామసేతు వారధిలో

చిట్టి ఉడుత తన చిన్ని హస్తమందించే

మంచిచేయవలెనని తలంపు ఉంటే చాలు

అది ఎంత కష్టమైనా సుసాధ్యమే.

డి నాగమణి 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...