22, ఆగస్టు 2020, శనివారం

 కావ్యం పేరు చెఱువు వారి సత్తిబాబు పావు శతకం(నక్షత్రమాల)
రచయిత:  కీ.శే. గాడేపల్లి సీతారామమూర్తి, విశ్రాంత జిల్లా జడ్జి. 
 అచ్చ తెలుగు గ్రామ్యభాషలో, ఛందోబద్ధముగా వృత్తాలలో వ్రాయబడిన కొన్ని పద్యాలు, నిన్న మీతో  పంచుకున్నాను...ఇటువంటి మాండలిక రచనలు బహు అరుదు... 
ఆబాల్య కవి, పండితులు, అష్టావధాని, సమగ్ర సంస్కృత శతావధాని అయిన శ్రీ చెఱువు సత్యనారాయణ శాస్త్రి గారు, తన (ఒక)  ఊహా సుందరి "సుబ్బలక్షి" ని సంబోధిస్తూ, ఆయన, సుబ్బలచ్చి శతకాన్ని గ్రామ్య భాషలో "చల్లా వెంకట సుబ్బలచ్చి బతుకేలా నీవు లేకుండినన్" అనే మకుటంతో వ్రాసారుట. దానిని చదివిన మన  ప్రస్తుతకవి, కీ.శే. గాడేపల్లి సీతారామమూర్తి గారు, ఆ కథానాయక సుబ్బలక్ష్మి, ఆ చెఱువు సత్యనారాయణ శాస్త్రి గారికి, తానూహించిన సుందరునిగా, ఉత్తరము, తనకి వచ్చిన బాసలోనే  వ్రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి, ఈ "చెఱువు వారి సత్తిబాబు పావు శతకము" ను రచించాను అని చెప్పుకున్నారు.  
 నాయిక సుబ్బలచ్చి.. సత్తిబాబు !, సత్తు !సత్తులు ! సత్తెమా ! అంటూ  నాయకుడు సత్యనారాయణ గారిని ముద్దుగా పిలుస్తుంది ఈ ఉత్తరంలో.
శాస్త్రి గారి బాల్యం, బాల్యక్రీడలు, బడి సంఘటనలు, కలలు తదితర అంశాలు వర్ణనలు, కల్పితం. కానీ, వారి కవిత్వం, అష్టావధానం, సమగ్ర సంస్కృత శతావధానం మాత్రం సహజాలు. అయన దివంగతుడయ్యాడంటే, సుబ్బలక్ష్మి నమ్మదు. ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు అని ఆమె భావన. 
 ఆమె వ్రాసే ఉత్తరాన్ని  ఆసాంతం, శుద్ధ మాండలికంలోనే  కొనసాగించారు కవి.మొత్తం ఇలాంటివే  27 పద్యాలున్నాయి. 
రోజుకి 2, 3 పద్యాలుగా, మీతో  పంచుకుంటాను.. ఈ రోజు, 5 పద్యాలతో
***********
నెం.1/27
శార్దూలం.
'గుంటా, యెల్దమె గడ్డి' కంటివి బలే గున్నాది నీ యెత్తు, ఏం
ఒంటో తిమ్మిరి గున్నదేంది ? అరె, మంచోడంటె ఊర్లోని వా
రెంటే తిర్గితి నమ్మకంతొ, చెయి మీదేశావొ దుల్పేస్త; బా
గుంటే బాగనె ఉంట చెయ్యి పడితే ఊర్కుంటనా ? రానుపో !
***********

 

2/27
శార్దూలం.
ఏందో కోపముమీద వాగుతను గానీ, నీవు లేకుంటె నా
కేందో గుంటది, యాడ ఉండవొ ? దినా మెట్లే గుతుండావొ ? నీ
పొందేదో మడమెత్తు సెప్పులది సూపుల్ తోటె కోరేస్తే, బా
గందం గుందని, సత్తిబాబు ! పడవద్దా ఉచ్చులో పిచ్చిలో.
(మడమెత్తు సెప్పులది = హైహీల్ చెప్పుల టక్కులాడి)
***********

 

3/27
శార్దూలం.
నువ్వేమో కలలోకి వస్తవు దినాం;నోరూరుకోదాయె, నా
నవ్వుల్ మల్లెల మల్లె ఉంటవని అంటాఉంట;వానాడు నీ
కవ్వింపుల్ విని రేత్రి నవ్వినది కన్కమ్మిన్క పోయుంటె న
న్నివ్వాళ్ళెందుకు సత్తిబాబు ! అతిగా ఏడ్పిస్త దీతీరుగా.
(నీ కవ్వింపు మాటలకి, రాత్రి నేను నవ్వినది ఆ కనకమ్మ వినకపోయుంటే, నన్నీవేళ ఇంత అతిగా ఎందుకు ఏడిపిస్తుంది ? )
***********

 

4/27
మత్తేభము
కలలోకొస్తవు, చెయ్యి గిల్లుతవు;చొక్కా యిప్పి కూకుంట;  వా
కులలో వక్కలు సున్నమెట్టుకొని సిగ్గుల్ బోత నేవస్తె సూ
పుల సంకెళ్ళ బిగించి గుంజుతవు "ఛీ ! పో, పాడుపొ"మ్మంటె  ము
ద్దులు కుర్పిస్తవు;సత్తిబాబు ! కనకంతో పెద్ద సావొచ్చెనే
***********

 

5/27
శార్దూలం.
సుట్టాలింటికిబోయి నే తిరిగివస్తూ చూస్తె నావంక  ఏ
లిట్టా సూపుతు నవ్వుతాది కనకం యెల్లమ్మతో ఉండి;  ఓ
రెట్టారా ! మన గుట్టు బట్టబయ లయ్యిందేమొ; ఊరిడ్సితే
ఎట్టా ఉంటది ? సత్తిబాబు ! మతికేమో తోపుకున్నదిరా.

ధన్యవాదములు.
పరిచయము చేస్తున్నది 
వట్టెం వెంకట రమణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...