15, ఆగస్టు 2020, శనివారం

14.08.2020 చిత్రానికి పద్యం / కవితలు


 

కవిత

నీలాటి రేవులో  నీళ్లకొఱకు వచ్చి

నీటిలో తనదు  ప్రతి బింబము

చూసి మురిసేటి  తరుణి

సోయగము  చూసి చుక్కలన్నీ

పక్కుమని నవ్వుతూ నెలరాజా

నీ వెన్నెల చిన్నపోయే రీతిగా ఉంది

అతివ  అందము అని ఆటపట్టించగా

తనకు మారుగా వేరొక జాబిలి

ఉదయించినేమో అన్న  ఆతురతతో

నెలవంక ఇలవంక దిగివచ్చిన రీతి

కనిపించు కమనీయ చిత్ర రాజము

వీక్షించి నంతనే సిరివెన్నెల వంటి మందహాసము

మోమిపై ఉదయించక మానదు ఎవరికైనా

 

రమ

 

 

భావ కవిత

ఓ లలిత లావణ్య విలాసవతీ,

వయ్యారంగా బిందె చేతబూని

వెన్నెల రేయి ఏరువాక కేల వస్తివి,

నీవే సౌందర్య సరోవరము కావా.

 

కళ్ళనిండా స్వప్నాల భారంతో

మోయలేని మోహ విరహంతో

జాబిలంటి నీ ప్రియుడి కొరకు

చకోరివై ఎదురు చూస్తుంటివా.

 

శీతల జలాల చంద్రబింబంతో,

నా సఖుడే నీ కన్నా సుందరుడు,

వాడి ముందు నీ అందం ఏ పాటి,

అను వ్యంగాస్త్రం విసురుతుంటివా.

 

 కె మల్లికార్జున రావు.

 

కందము

అందాల రాక్షసివనిన

బృందావన మేలునట్టి కుందన బొమ్మా

వందనమిదిగో లలనా,

సుందరి, నిను జూడ గోరి చంద్రుడు వచ్చెన్!!

 

 

కందము

లలనా, భామిని, తరుణీ

కలతను చెందెను హృదయము  గాంచగ నిన్నే

సెలయేరు, చందమామలు

తిలకించగ నిన్ను జేరె తిమిరపు వేళన్!!

 

కళ్యాణ్ చక్రవర్తి

 

 

కవిత

ఎవ్వరీ స్నిగ్ధ సుందరి ?

మనోజ్ఞ  మంజరీ,

ఎవరికొరకు  నీవిట చేరితివి ?

ఎవరి వలపు తలపులలో మునకలు  వేయుచుంటివి ?

ఓ  యామినీ  సుందరీ

నీ  ముక్తసరి వరుసకు 

కారణమేమిటమ్మా ?

 

బంగరు  రంగు  చీరకట్టి

మరు మల్లెల మాల  సిగను  చుట్టి

నీటి వంకతోయేటి  చెంతకు  చేరి

ఏల చింతించుచుంటివో

ఓ  ముగ్ధ  సుందరీ

 

పరదేశమేగిన విభుని  రాకకై  చింతించుచుంటివో

వల్ల  కాదని  వీడిపోయిన

విభుని  తలచుచుంటివో

 

చందురుని తోడ  కబురంపుదమన్న

నిండు  చందురుడు నింగినే నిగిడిపోయే

బండ రాళ్లతోటి  మొరపెట్టు కుందమన్న

కరకు రాతి బండలేకానీ ప్రాణము  లేనివాయె

జల జలా పారేటి యేటి గలగలల అలలతో, విరహంపు వెతలు వెళ్లబోసుకుందమన్న

సెలయేటి  అలలే స్నిగ్ధ  సౌందర్యమును గాంచి

నిలిచిపోయే

 

ఎటుల తీరునో  ఈ వ్యధ,  వేచి వేచి  తలపులు వేడెక్క

విసిగి  విసిగిమరు  మాట రాకమరలిపోయెదవటమ్మ

ముగ్ధ  సుందరీ.

 

అవళూరు. సీత

 

 

సీసము

కౌముదివేళ సొగసుసుందరి చెరువు

గట్టుపై చేరెను గాయకముగ

నీరమునందున నీలవేణి తన రూ

పముగని తరియించె పరవశముగ

శశి ప్రతిబింబమున్ సఖుడనే తలపుగ

ప్రణయభామిని యుండె వలపు నెంచి

ప్రియునిరాకకొరకున్ ప్రేమనింపుకొని తాన్

వేచియుండె విరహవేదనమున

 

 

తేటగీతి

ఏమి బాసచేసెనొ గద! నెమ్మి తోడ

కమలవదనసఖి, సఖుని కరుణకొరకు

వెన్నెల వెలుగులందున వేచియుండె

వలపు కౌగిట విరహంబు వెలుగుజిల్గె!

 

 

గురువు గార్కి నమస్సులతో తొలి ప్రయత్నంగా ఉత్పలమాల

 

ఉత్పలమాల

వెన్నెలరేయిలో రమణి వేడుక సల్పుతు వేచియుండెనే;

పున్నమివేళలో ప్రియుని పొందుకు నెచ్చెలి వేచియుండెనే;

చిన్నెలుబోవుతూ మగువజిల్గు వరూధినివోలె యుండెనే;

వన్నెల సుందరీమణి కువాళమెరుంగని ప్రేమదేవతే!

 

వెంకట్. సిహెచ్.

 

సీసము

నీలాటిరేవులో నిండైన జాబిలి

ప్రతిబింబమదియేను భాసురంబు

చుక్కల నగవులు ఫక్కుమనగ వెండి

వెల్గుల చిందించె వెన్నెలందు

నెలవంక దిగివచ్చి కలికి కాంతులుతోడు

మెరుపువై వయ్యారి హరువులాయె

చిత్రరాజంబు గాంచిన చిత్తరువు తీరు

చిందాడునిద్దంపు చిరునగవులు

 

తేటగీతి

అతిమనోహరమూర్తివై యభ్రవీధి

సొగసు సిరులతో కురిసిన సోయగంబు

తళుకు మని మురిపించగ తరళితంబు

మరుల గొల్పు సౌదామినీ మౌక్తికమది

 

రమ & శివ శంకర్ కస్తూరి

 

తేటగీతి

పడతి వచ్చెను నదియందు కడవ నింప

వాలు చూపుల రెప్పలు వాల్చ కున్న

రేయి వెన్నెల చంద్రుడు హాయి గొలుపు

ననుచు బింబము చూడగానంద కరము.

 

తాండవ కృష్ణ

 

కవిత

నీలాటి రేవు కాడ నీలివర్ణపు మేఘమాల

ఆకాశాన పున్నమి చంద్రుడు నిశ్శబ్ద జల

తరంగాల దర్శనం పుడమి పులకరింతల

వయ్యారాల సోయగాలు వర్ణించ తలపుల

 

ప్రియుని రాకకై మధుబని దప్పిక నెపమున

సొగసైన అంచు చీర ధరించి తైలము జుట్టును

పెట్టి కొప్పున మల్లెల చుండు చుట్టి చేతిన

నలుపైన గాజులు తొడిగి రాతిగోడన అలవోకగా

 

నడిజాము గడిచే వలచిన ప్రియుని జాడ కానరాక

తపిస్తున్న తనువును ఓదారుస్తూ అలసిన మనసును

పదిల పరుస్తూ నిండు జాబిలి వంక చూపు చూపుతూ

అదిరే ఆధారాలను మునిపంటి బిగిస్తూ సడలిస్తూ

 

చల్లని వెన్నెలపై విరహపు అగ్ని జ్వాలలు జ్వలింప

చేస్తూ చడిచప్పుడు చేయని నీటి తరంగాలలో విద్యుత్తు

ను ప్రసారింపచేస్తూ ఒంటరి జాజిమల్లి ప్రకృతిని లతలా చుట్టి మనసుని పరిచే వలచిన ప్రియుని జాడకై......

 

కోవూరి

 

 

ఉత్పలమాల

చొక్కపు హాసచంద్రికల సోయగమచ్చట పూచినట్లుగా       

మిక్కిలి మోదమున్ కవన మీసరముల్ కడు పొంగినట్లుగా   

చక్కని వెండి వెన్నెలలు జారిన కాంతుల సంభ్రమంబులే    

మక్కువ మీఱ కోమలికి మౌక్తికమొచ్చట జాలువారగా        

 

ఉత్పలమాల

కన్నలయందు చిందు శశికాంతుల చందము వొల్కినట్లుగన్ 

వన్నెలు గంధమద్దినటు భామిని హాసిక  రువ్వినట్లుగన్   

పున్నమి  వేళలందు చెలి పొంకపు భావము తెల్పునట్లుగన్          

వెన్నెల చిందువేళ మురిపించి సృజించిన భావమాలికల్ !      

 

కస్తూరి శివశంకర్

 

 

కవిత

నిండు కొలను నీటిలో నీలాకాశపు జాబిలి

ప్రకృతి లొగిలి లో పరవశించు జాబిలి

గంగమ్మ వడి లోన జాలువారిన జాబిలి

సంధ్య వేళ సడి లోన సరసమొలొకు జాబిలి

పడతి చేత పాత్ర పట్టి పరవశంగా దరిచేర

పుడమి తల్లి పులకరించే ఈ దృశ్య కావ్యమున

తారా నాధుని మోము జూడ తన్మయముతో ఆ తరుణీ

సిగ్గులొలికె మొగ్గలెన్నో చిగురించె చిద్విలాసమున

ఆ ఒంపు సొగసులతో శృంగారం వొలికింప

రసమయ ధారలతో రసరాజ్య రాణివోలె

తరుణి హొయలను జూడ ఆ తారా నాధుడే

ధరణి గంగ లో చేరే రసరమ్య నాధుడై

 

వి.వి.శ్రీనివాస్

 

కవిత

నయన మనోహర సుందరము

 నండూరి ఎంకి వయ్యారము

బిందె చేతబట్టి నీటిని ఒడిసి బట్ట

సెలయేరు కడకేగిన అందాల రమణీ లలామ

 

 పున్నమి వెన్నెల చంద్రుడు   ఆ అందాల కన్నియను చూడ

నీటిలో తన బింబము తో అరుదెంచే

 

ఆ పగడాల జాబిల్లిని

 చూచి ప్రియుడు  ఎడబాటును క్షణకాలం మరచిపోయే

 

డి నాగమణి

 

 

గేయ కవిత

తలనిండ పూలు బెట్టి,

నీళ్ళ బిందె చేత బట్టి

నీటిలో చందమామ పక్కతన బింబమ్ము పసిగట్టి,

మురిసి పోతున్నది నయగారాల పట్టి...

 

గాంగేయ శాస్త్రి

 

 

కవిత

నీలవర్ణపు నింగి తటాకమున

అద్దపు తాపడం పెడుతూ నిశ్చలంగా ఉంది

పుత్తడి బొమ్మలా పమిడంచు చీరకట్టి

కొప్పున అరవిరిసిన విరుల పరిమళాల

విరుల తెమ్మరలలో నీటికై వచ్చిన వనిత

 

 

గట్టుపైన కూర్చుని తలపుల తరంగాలలో

అలవోకగా చూచే నీటిలోనికి జామురాతిరి జాబిలమ్మ

ముద్దు గుమ్మను చూచి పలకరించగా

 

 

వచ్చిన పని మరచి జాబిలమ్మతో ఊసుల ఊహలలో తేలిపోతూ

నిశ్చలమైన కొలను లాగా తానుకూడా నిశ్చలంగా చూస్తూ

మచ్చట్ల మురిసిపోతూ ప్రశాంత వదనముతో

పడతి వెన్నెలవలే కూర్చొని ఉంది

 

గీతాశైలజ

 

కవిత

సరస్సున దాగి తొంగిచూసు

చలువ రేడునే చకితుని చేయు

అందము నీది చందనపు బొమ్మ!

నిన్ను నిరీక్షింప

చేయు నిర్థయుని

మన్నించు మనోహరీ!

 

పిల్ల తిమ్మెరలు

నీ వెచ్చని శ్వాసను మోసి

విరహవేదనను తెలుపునులే!

 

పండువెన్నెల

నీ మిసిమి ఛాయను చూపి

మది చింతను తెలుపునులే!

 

నిశి రాతిరి

నీ కురులు నలుపు చూపి

నీ కన్నె కలతను తెలుపునులే!

 

కలువరేడు

నీ ముగ్ద మోమును చూపి

మరుల మంత్రమేయునులే!

 

సిగను ముడిచిన మల్లెలు

మన్మథ విరులై మనోహరుని

నీ ముంగిట నిల్పులే!

 

 వాణిశ్రీ నైనాల

                                                                  

తేటగీతి

వెన్నెల మిల మిలాడగవేచె రమణి

ప్రాణ నాధుని రాకకై ప్రణయ భావ

నోచనంబుల తోడనునోచె నంత

నీటి లోన జాబిలి తోడ నీడ గాంచ,

మది పరవశంబుతోడను మరచె జలము,

వెండి వెన్నెల కాంతులు వేడి పెంచె !

 

మైనేని మురళి

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...