శ్రీ విఘ్నేశ్వర నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యోనమః
19, ఆగష్టు 2020, బుధవారము
సమస్య : *చదువు నేర్చు కొనగ చవట లాయె*!
సమస్యా పాదం తేటగీతిలో..
ఇదే పంక్తితో భావంలో పద్య / వచన కవిత
నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు.
కలి కాలమున ముదమున ,
బోధించు గురువులు కరువైరి,
గురుదక్షిణ యని విత్తమును,
నేర్పుగ గ్రహించి - ఇవ్వకున్నచో,
పీడించు భాద గురువు లధికమైరి,
ఆ నేర్పరుల చెంత *చదువు నేర్చు
కొనగ చవట లాయె*రు నిక్కముగ,
కాల మహిమిదియే తెలుసుకునుడు.
కె మల్లికార్జున రావు
****
కాయ కష్ట మందు కలసిరాకుండిరి
కొలువు రాని చదువు కొరకు కోట్లు
ఖర్చు చేసి యప్పు ఘనముగ చేసిరి
చదువు నేర్చు కొనగ చవటలాయె
డా. నాగులపల్లి
****
ఆటవెలది
విత్తమిచ్చి కొన్న విద్య నొసఁగునె వి
నయము? యెటుల నేర్చు నరుడు నేర్పు ?
సత్తు లేని విద్య చంపదే మనుజులన్ ?
చదువు నేర్చుకొనగ చవటలాయె.
అవళూరు సీత
****
ఆటవెలది
కూటి కొరకు నేర్వ మేటి చదువులన్ని
గురువు గూడ మంచి గరుప గలడ!
బ్రతుకు విలువ తెలిపి ప్రతిభ పెంచనియట్టి
చదువు నేర్చుకొనగ చవటలాయె
వాణిశ్రీ నైనాల
****
హిరణ్యకశిపుడు ఛండామార్కులతో పలుకు మాటలు
తెలిపితిని గదా ఆచార్య, తెలుప మనుచు
చక్కని చదువులను మీరు సరస గతిని
మీ గురు కులమున్, హరనామ మిచట పలుక
మనగ పలుకు చుండె హరి నా మంబు ,చదువు
నేర్చు కొనగ చవటలాయె, నేడు తలచ,
నొక్కరై నను పలికిన నొక్క వలయు
వారి నోరును, హరుని విచార మిచట
నేర్ప కున్న మీ తలలను నిజము గాను
ఖండ నమును చేయించెద ఛండ మార్కు
లార యని పలికె నృపతి రౌద్ర గతిని
పూసపాటి
****
చదువు సంస్కారము నేర్పవలయు,
చదువు మనిషిని రుషి చేయవలయు,
చదువు ధర్మతత్వము తెలుపవలయు,
చదువు సేవా భావము పెంచవలయు,
చదువు భగవద్భక్తి బీజమేయవలయు,
చదువు త్యాగనిరతి బోధించవలయు,
ఆ విద్యల నమ్ముట మాని అమ్ముకొనెడి
చదువు నేర్చుకొనగ చవటలాయెరుగా
కె మల్లికార్జునరావు .
****
వేదములుఅభ్యసించిరి,
వ్యాకరణం ఆసాంతమూ నేర్చెరి,
కానీ ఈ ఆధునిక కాలంలో, అక్కరకురాని
చదువు నేర్చుకొనగ చవటలాయె !!
గాంగేయ శాస్త్రి,
****
ఆటవెలది
చెప్పెనపుడు నిటుల చెవిలోన వినుడని
చదువు నేర్చు కొనక చవటలాయె
వాడు వినక వెడలి పలికెనివ్విధముగ
చదువు నేర్చుకొనగ చవటలాయె
ఆటవెలది
వేలు వేలు పెట్టు పెద్ద చదువులిల
కొనిన చాలు నవియె కొంప ముంచు
బుద్ది బలము లేక వృద్ది శూన్యమగు నా
చదువు నేర్చు కొనగ చవటలాయె
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
****
తరువోజ
విదుషి యని తలచి వెలయాల్ని జేర
వెలుగులన్నియు బోయి వేదన మిగులు
మధువు జిందించెడి మంజికన్ జేర
మహిమలన్నియు బోయి మైకము కలుగు
ముదిత చెలిమి తోడ మోహము కలుగ
మొదట నేర్చిన విద్య మొక్కపోయె గద!
చదువులయ్య గణిక సజ్జకన్ జేర
చదువు నేర్చుకొనగ చవటలాయె గద!
విదుషి= విద్వాంసురాలు
వెలయాలి, మంజిక, గణిక = వేశ్య
చదువులయ్య= ఉపాధ్యాయుడు
సజ్జక= పడకిల్లు
వెంకట్. సిహెచ్
*****
ఆటవెలది లో నా తొలి ప్రయత్నం
విద్య ఒసగు వినయ విజ్ఞతల్ అన్న నా
నుడి మరచి బడులను నడిపెడి ఘను
లు విలువలను మరచి వివరములేలేని
చదువు నేర్చుకొనగ చవటలాయె
రమ, కంకిపాడు.
****
వచన కవిత
కరోనా వచ్చింది బడులను మూసింది
విద్యార్థులoతా చదువు నేర్చుకోక చవటలాయే
ఆన్ లైన్ చదువులతో ఆగమాగమవుతుంది
చదువoతా చట్టు బండలయ్యింది
భవిష్యత్తు ఏమిటో అర్ధము కానున్నది
లలితారెడ్డి
****
ఆటవెలది
ఆధునికత కొరకు నంగలార్చి సతము
విలువ నెరుగనట్టి వెడగు తోడ
తరతరాల సంప్రదాయములన్విడి
చదువు నేర్చుకొనగ చవటలాయె!
ఆటవెలది
చేవ తోడ సల్ప జీవన సమరమ్ము
సహకరింపనట్టి చదువు నేర్వ
వెక్కిరించి సతము వేవురనునుగద
చదువు నేర్చుకొనగ చవటలాయె!
చల్లా దేవిక.
****
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి