యవనవ్వనం _ గుడిపాటి వెంకటాచలం
ఈ రోజు నేను పరిచయం చేయాలానుకునే పుస్తకం. ఆరు కథల సంపుటి ఈ పుస్తకం. రచయిత చలం గారి గురించి విశ్లేషించే అంతటి పరిణితి నాకు లేదని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆయన ఆలోచనలు నాకర్థమైనంత వరకు మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను.
మొదటి కథ యవనవ్వనం
ఒక తాసిల్దారు గత మధుర స్మృతి_ ఆయన ఫిఫ్త్ ఫారం చదువుతున్నప్పుడు కల్గిన ప్రేమ భావాన్ని స్నేహితులతో పంచుకునే సందర్భం. నాటకాల్లో రాజకుమారుని పాత్ర పోషించే ఆమె మీద తనకు కలిగిన అనురాగం, వారి స్నేహం, ఆమె దీన స్థితికి కదిలిపోయి ఆమెను పెళ్లి చేసుకునీ ఉద్దరిస్తాను అన్న పిల్లాడి అమాయకత్వానికి ఆమె నవ్వుకోవడం, పిల్లాడు ప్రేమను చూపిన ప్రతిసారీ ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకోడం ద్వారా ఆ పసిమనసు లో నిష్కల్మషమైన అనురాగాన్ని, ఆమె అసహాయతను, పిల్లల అభిప్రాయాలకి పెద్దలు ఇచ్చే విలువనూ... అద్భుతంగా ఆవిష్కరిస్తారు చలం.
ఆ రోజుల్లో నాటకాలు వేసే స్త్రీలు సమాజంలో ఎంత చులకనగా చూడబడేవారు, వారి జీవన శైలి చిన్న చిన్న సంఘటనల ద్వారా కళ్ళకు కడతారు. ఆ పిల్లాడి అక్క గారు నాటకాల వారితో
మాట్లాడడం, వారిని భోజనానికి పిలవడం చిన్నతనంగా భావిస్తుంది. బావగారు, తన అత్తింటి వారు వొప్పుకోరు అని అడ్డుపడుతుంది. కానీ చివరకు ఆ బావగారితో తన నాటకాల రాకుమారిని చూసి పసి హృదయం తల్లడిల్లుతుంది. చివర్లో తన ఖరీదైన చీర నాటకాల ఆమె దగ్గరనించి తీసుకురమ్మని అక్కగారే తమ్ముడిని పంపడం కొసమెరుపు.
మేకపోతు గాంభీర్యం చూపే పురుషుల అంతరంగం ఆవిష్కరించడంలో చలం గారిది అందెవేసిన చేయి.
కొంతమంది పెద్దమనుషులు సమాజంలో గౌరవమైన స్థాయిలో ఉండీ ఆంతర్యం ఎంత నీచమైనదో చెప్పడంలో చలం గారు చూపిన సాహసం ఆనాటి సమాజాన్ని గడగడ లాడించింది అనడంలో సందేహం లేదు.
మరోసారి మిగిలిన కథల గురించి చర్చిద్దాం. ఓపికగా చదివినవారికి ధన్యవాదములు
వాణిశ్రీ నైనాల
18th July, 2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి