19, ఆగస్టు 2020, బుధవారం

దత్తపది - 30, కవి - రవి - భువి – దివి 17, ఆగష్టు 2020, సోమ వారము


17, ఆగష్టు 2020, సోమ వారము

దత్తపది -  30
కవి - రవి - భువి – దివి

(ఈ పదములతో, ఇతివృత్తం తెలియచేస్తూ పద్య కవిత / వచన కవిత అందించగలరు)

తపము చేయుచు నుండగన్ తలపు చూలి

బాణముల నొదలి తపము భంగ పరచ

కాల్చె నతని మందరమణి కన్ను తెరచి

భూతి నిడు శుభోదయమనె పూసపాటి

 

ఉత్పలమాల

లింగ! శుభాంగ!శ్రావణము లీలగనంత్యపునిందువారమున్

గంగ జలాభిషేకమును గంధము పుష్పమునర్చనాదులన్

రంగుగ నామకీర్తనలు ప్రార్థన జేయుదునుల్లమందునన్

మంగళరూప! శాంతినిడు మమ్ముల బ్రోవుము పార్వతీపతీ!

 

మహేశ్ ముత్యాల

****

భావ కవిత-

దివిన  నున్న దేవతలు కనుగొన లేరు,

నింగిన విహరిస్తున్న రవి గాంచ లేడు,

భువినందు వెలసిన కవి దర్శించగలడు,

క్షణక్షణముల్ మారు జవరాండ్ర చిత్తముల్.

 

కె మల్లికార్జున రావు.

****

 

రాసి కంటే వాసి గొప్పదనుటకు

చక్కని తార్కాణము గా కిరాతార్జునీయం

అనెడి గొప్ప కావ్యమును రచించి

భువి లోన సత్కవి గా మన్ననలు పొంది

దివికేగిన ధీరకవి మన భారవి

 

రమ, కంకిపాడు.

****

 

దుర్వాసుని మంత్ర మహిమచే, దివి

నుంచి ఏతెంచినాడు భువికి,

కుంతీకుమారి పిలుపు మీర రవి,

కన్నెబ్రతుకు న ఇంకేమిజరుగు  కా"క, వి "కలము!!!

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

****

ఎవరివి నీవు, ఎవరవు నీవు

దివి నుండి దిగి వచ్చిన పారిజాత పుష్పమా,

భువిలో విరిసిన కలువల కన్నుల కాంతివా,

కవితావేశమే పల్లవించిన రమ్య ప్రేమ కావ్యమా,

భావావేశమే రచించిన ఆనందభైరవి  రాగమా,

 ఎవరివైన నేమి,

నీవు ఎవరవైనను ఏమి,

అనుక్షణం తన అరమోడ్పు కన్నుల

వీక్షణముల మత్తులో నను ముంచెత్తి

మురిపించే  నా ఎంకికి సాటి రారు మీరు?

 

కె మల్లికార్జునరావు

 

****

నేటి దత్తపది కవి - రవి - భువి - దివి  తో శ్రీకృష్ణదేవరాయుల ఘనతను తెలుపు చిరు ప్రయత్నం

 

సీసము

(దివి)ని పాలించెడి దేవేంద్రుడు నరుడై (భువి)నందు యుండెడి భోగము గన

భువికొచ్చి తా నాంధ్ర భోజుడయ్యెన్, యష్ట (కవి)దిగ్గజుల తోడ ఘనతవొంది;

ఆముక్తమాల్యద నద్భుతముగ వ్రాసి, భువనవిజయము వైభోగముగను

నిర్వహించి, సతము నిపుణత  జూపె నా రసరమ్య రమణీయ (రవి)వరుండు

తేటగీతి

కృష్ణ తేజము తోడ శ్రీకృష్ణ దేవ

రాయలు పుడమిన్ పాలించె రంజకముగ,

ధన్యజీవుడి వలె చరితంబు నయ్యె

సాహితీ సమరాంగణ చక్రవర్తి.

 

వెంకట్.సిహెచ్

****

 

సీసము

మో(దివి) వాసనల్ మోదము నిడుచుండ  గ్రోలిన  శీధువు తూలుడు  నిడ

ఆము(కవి)యు మది కామము తో నతి శయము నిడుచు నుండ సారసాక్షి

పొందును కోరుచు, డెందము పొంగ  వెంబ(రవి)త్తు  శయనము పైన వనిత

ను కర(దివి)య వెల్గున  కనుచు నర(రవి)ష్కంభిని బెట్టి కీచకుడు కులుకు

 

నడక నడచుచు  కూర్చున్న నాతి దరికి

చేర ,వలలుడు   కట్టిన  చీర విడచి

ముష్టి యుధ్ధము తో రుద్ర (భువి)కి పంపి

ద్రౌపదీ సతికి నిడె మోదంబు  నపుడు 

 

మోదివి  =    కస్తూరి,   గంధము ,  శీధువు =   మధువు, అమికవియు + మదించు

సారసాక్షి  =స్త్రీ ,వెంబరవిత్తు+ దుష్టుడు,  కరదివియ= దివిటీ ,అరరవిష్కంభి = ఘడియ

రుద్రభువి =శ్మశానము

పూసపాటి

****

ఇతివృత్తం : కవితా కాంతుల వైభవం

మత్తేభము :

దివిలోచందన తావులన్ కలములో దివ్యంబుగా వొల్కినన్  !     

రవితేజమ్ములు రంగరించి మనసుల్ రంజిల్లు మాధుర్యమే       

కవితాకాంతుల వైభవంబు జిలుగుల్ గారాబు మాధుర్యమే      

నవభావంబుల రాగమాలికల స్వానంబీయు మాధుర్యమే  

భువిలో శాంతిని ధర్మదీక్ష గరిమన్ బోధించు ఘంటంబదే !

కస్తూరి శివశంకర్

****

చంపకమాల

తనభావమంతటను కావ్యముగా రచియించి పంచులే

రవి తనవెల్గుతో భువిని రక్షణ జేయుచు కాచి బ్రోచులే!

భువి మనభారమంతటను మోయుచునన్నమునిచ్చి పెంచులే

దివి మన పుణ్యమంతయును దీరుటకై సుఖశాంతులిచ్చులే !!

డా. నాగులపల్లి

****

దివి లో వెలసిన ధ్రువతారా

భువి కి వాయు వేగమున జాలువారా

రవి కిరణములతో రమ్యమై మనసారా

కవి కలమున పొదిగిన శృంగార నయనతారా

వి.వి.శ్రీనివాస్

****

కందము

 

కవిగా తన కవితలతో

రవిగా  భాగవత సుధ కురయ చేసినాడు

భువిలో పోతన కవిగా

దివినే తాకెటి  ఘనతన దివ్యుడు గాడే

 

డా.సతీష్

****

రవికుల తిలకుని గాంచిన  రమణి సీత

పులకిత మనస్కయై వింటినీత డెక్కు

బెట్టవలెనని దివిజులమ్రొక్కె నంత

వింటిని విరిచిన రాముని చూసిన జానకి

సిగ్గుల మొగ్గయై పెండ్లాడగ  సురులు,

నరులు, కిన్నరలు పుష్ప వృష్ఠి కురిపించిరపుడు

భువి అంతయు పండుగ కోలహలము

ప్రభవించ, కవి శ్రేష్ఠులు రచన చేయ

సంబారం దొరికెనని సంబరపడిరి

 

అవళూరు సీత

****

 

దివిలో సురలును వేడిరి

రవికాం తునినడ్డగించె రాకడ వింధ్యన్

కవియును కపర్ధు నాజ్ఞన

భువిలో గర్వము నణచగ బుద్నుడు వెడలెన్

 

గీతాశైలజ

****

తరువోజ

 

రవివర్మ కుంచెయే రంజిల్లు నట్లు  రాజసముగ నవరసమొలిగించె

కవిఘంటము లిఖించు కమనీయ కావ్య కైత నవనియందు కౌశలముగను

భువినందు గల కళా పోషకులైన భూవరుల కరుణే పూర్ణత గూర్చె.

దివినందెవరు కైత దీర్చిదిద్దితిరి? దీవెన లన్నియు ధిషణిపైనె గద!

 

వెంకట్.సిహెచ్

****

కందము

కవి కవనపు వెలుగులిడును

రవియును తేజంబునొసగు రమణీయముగా

భువినేలును శాంతినొసగు

దివిసౌఖ్యములందజేయు స్థిరమునుగూర్చున్

 

మహేశ్ ముత్యాల

****

కందము

రవికై నను సాధ్య మగున

కవి కలమున నున్న శక్తి గాంచిన నిజమున్

భువిలో స్వర్గము జూపుచు

దివి నైనను దింపునిలకు దివ్యముగ నహో!!

 

కందము

రాదిక విపత్తు నికపై

సోదర విశ్వమ్ము గెలుచు సొగసుగ నిపుడున్

పోదును కరోన ప్రభువిక

గాదివి రోజులు నిరతము ఘనముగ వచ్చున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

****

కవికి కంటికి చిక్కని కధనముo

రవిని చూడని మనుషులు రాజ్య మందు

దివిని నుండిభు వికికేను దిగిన దేవి

భువిన చేరిన తల్లిరా భుక్తి నిచ్చు

 

లలితారెడ్డి

****

 

స్వేచ్ఛా సమర్పణలు

“రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్”

నా పూరణ

 

సతతము వీణా వాదన

చతురత్వమున తన రత్న సభను సకల శో

భితమును చేసెడి నా భా

రతిని  గొలిచి  కావ్యములను వ్రాయగ  నొప్పున్

 

పూసపాటి

****

 

"రోగము మంచిదే యగును రోజు సుఖమ్ముగ సాగుచుండినన్ "

నా పూరణ యత్నం

ఉత్పలమాల

 

వేగము గాను పైకమును వేదన చెందక గట్టుచుండగా

రాగల కష్ట కాలమున లాలన జేయుచు చూచు వారలై

నాగక నొక్కరున్ మనకు నద్భుత సేవలు జేయుచుండినన్

రోగము మంచిదే యగును రోజు సుఖమ్ముగ సాగుచుండినన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

****

 

ఆటవెలది

బెల్లు దెచ్చి యిటుల భేషుగ్గ గేటుకు

కట్టి వేసె జూడు ఘటికుడతడు

వీడి తెలివి కద్దు వీక్షించ ముద్దురా

బెల్లు గొట్టి పిలువ థ్రిల్లు గదర

ఆటవెలది

గంట గుడిన గొట్టు కాలమ్ము గాదిది

వీని యింట నుండె ప్రియముగాను

గేటు కైన నేమి గ్రేటుగా నున్నది

మ్రోగు నదియె జూడు ముద్దు గాను

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

****

కందము

గేటుకి సైకిలు బెల్లిక

దాటెడి పనిలేదు తలుపు దబదబ బాదన్

ధీటుగ కరెంటు లేకనె

మేటిగ మ్రోగంగ, నతడి మేధను మెచ్చన్

 

వాణి

****

మా "స్పందన" అనే మరో .తెలుగు సమూహం లో " నవరసాలు" అనే శీర్షికన  నేను రాసిన నా స్వీయనుభవం "వీర రసం" లో ప్రచురితమైంది.

 

ఆ పత్రిక యాజమాన్యం అనుమతి తో,  ఆగస్ట్ మాసం మన స్వాతంత్ర దినోత్సవం సందర్భం గా ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాను..

 

రావర్తి ఝాన్సీ లక్ష్మీ శర్మ 

 

****

                       


 

 

దత్త  పది

రిన్,   డెట్,   నిర్మ  ,  ఘడి

ఇవి సబ్బుల పేర్లు

  పై పదములు వాడుతూ  భారతార్ధము లో  స్వేచ్చా

 నా పూరణ   సీసములో

కీచకుని చంపుతాను అని  భీమసేనుడు  పలుక ధర్మ రాజు  అనునయించు సందర్భము.

 

వచ్చితి మిచటకు వనవాసము ముగియ, మనయుని కి విదిత మగు గొడవను

జేయ సింహబలుడ జేయుడుగా, నధికా(రిన్) సతతము పొగడగ  వలయు

వా(డెట్టు) లమనల బాధించ నన్కొంత కాలమి చటనోర్వగవలయు  విను

మా, యీ  సకటుని (నిర్మ)క్షికం బుగ మట్టు  బెట్టగా వలయును భీమ సేన

 

(ఘడి)య  చాలుగా కీచుకున్ గావు పెట్ట

నీకు యో  న(రిన్)దమ విను,(నిర్మ)లమగు

మనసు తో డ,వా(డెట్ల) యిమ్మహిని మనగ

గలడు ,కినుక వీడ మనెను  కంకుడపుడు

 

సకటుడు= దుర్మార్గుడు

నిర్మక్షికం    =   రహస్యము

గావుపెట్ట  = చంప

అరిందమ=   శత్రువులను జయైంచువాడు

కంకుడు   = ధర్మరాజు

 

పూసపాటి

****

 

దత్త పది : రిన్, డెట్, నిర్మ, ఘడి

భారతార్థం లో.

నా ప్రయత్నం..

కందము

కావగ నీవా (రిన్) నిట

రావలెనని పలుకు(డెటు)ల సభలో కృష్ణా?

దేవా! (నిర్మ)ల మనమున.

బ్రోవగ నీ (ఘడియ) మెండు త్రోవ నొసగుమా!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

****

ఎవ (రిన్)ట శుభ ఘడియలలోదేవకీ సుతుడుఅడుగిడ

నిర్మలమైన మనసుతో గోపికలు పూజింప గైకొని సంతషమంది

ఆ మువ్వ గోపాలుడు  అంతర్థానమాయె అయ్యో

ఆ నంద గోపాలుడెటు పోయెనో యనుచు

ఆ రమణీలలామలు తల్లడిల్లిపోయె.

 

నాగమణి

****

 

 

 

దత్త పది : రిన్, డెట్, నిర్మ, ఘడి

 

దశరథ మహారాజు శ్రీ రామ

పట్టాభిషేకము ఘోషించగా

అయోధ్య వాసు లెవ్వ(రిన్)

చూచినన్ వారి కన్నుల

కాంతులు వెలయుచుండ

సింహాసనమలంకరించినప్డు

మా రాము( డెట్)లుండునో

యనుచు జిజ్ఞాస భరితులై

మది ని(ర్మల)భక్తి పూరితులై

(ఘడి)యలు యుగములుగ

భావించి లెక్కించు చుండిరే.

 

కె మల్లికార్జునరావు

****

 

 

 

రమ అక్కయ్య, మీ భావం మనోహరం. నాకు చేతనైన రీతిలో చిన్న మత్తేభంలో మీ పద మంజీరములని

మత్తేభము

ఉరిమే మేఘమువోలె ఘల్లుమనచూ వొయ్యారమెల్కించగా        

మెరిసేకాంతులరీతి మేటి హరువుల్ మీ పాదమంజీరముల్       

కురిసే భావములందు పల్కు సొబగుల్ కోటీరమౌ భావనల్   

సరికొత్తంగ పదంబు నిక్వణములో చామీకరంముల్ సుమీ !!!

 

కస్తూరి శివ శంకర్

 

****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...