16, సెప్టెంబర్ 2020, బుధవారం

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ

 




తేటగీతి 

పొలయు వజ్రము గల ముక్కుపుడక తోడ

వలచిన మగువ విముఖియై వగపు నివ్వ

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ

తీవ్ర వేదన కలిగించె ధీర వనిత

 

వెంకట్.సిహెచ్

 

 

లిఫ్టు యందొక సింగిల్ కొప్పును జూడంగ

నొక్కుదుటున నేనా లిఫ్టునందు దూరంగ

దగ్గరైన యా కొప్పొక పిడుగల్లె తుమ్మంగ

దాని ముక్కు పుడకెగిరి నా హృదయములో చిక్కుకొనంగ కొరోనా కొరికిిిినదని యేడ్వనా

నా తీటరీతికేడ్వనా యది మాడా యని తెలవంగ!?.....

 

( బాల్డును అని నా యందు దయయుంచి భక్తిగా నే వ్రాసిన యీ తీట గీతిని తేట గీతి అనుకొనుడీ)

ఇట్లు

కు.తో.వం అను నానుడిని మననం చేసుకొనుచూ....

----అ.అ----

అత్తిలి అనంతు

 

 

కాటుక కనులు యెదలోన నాటుకొనగ

హంసనడకలు గమనాన హసితమవగ

నగవు జలపాతాలు మదిని తడిపి సాగ

ముక్కుపుడక హృదయమున చిక్కుపడగ

ప్రేమపుట్టిన తావుల జాడ తెలిసె!.....

 

రాంమోహన్,  నిజామాబాద్

నా మిత్రుడు డా కాసర్ల గారి సహకారం తో

 

 

తేటగీతి 

ముక్కు పుడకవున్నమగువ మోము వెలుగు

చక్క నైన ముక్కునకొక ముక్కు పుడక

నాన్న నడిగితి వలదనెన్! నాదు పతిని

కోర కాదనెన్! తీరని కోరి కయ్యె

ముక్కు పుడక హృదయములో చిక్కు కొనగ

 

రమ, కంకిపాడు.

 

 

ప్రియుడు దూరమైన మగువ విరహ పడుచు

మట్టి బొమ్మనుఁ జేసెనా మగని వోలె

తమకమునఁ గౌగిలించగ తనువదిరెను

ముక్కు పుడక హృదయములో చిక్కు కొనగ

 

చాగంటి చరణ్

 

 

గేయ రచన,

ముక్కు పుడక హృదయమున చిక్కుకున్నది,

మూడు ముళ్ల దాక అది లాగి వేసింది,

ఏడడుగుల బంధమై అది నిలిచి పోయింది,

చుక్కలను ఇప్పుడు అది  చూపిస్తున్నది....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

ఓ అమ్మాయ్..!

నీ ముక్కుకు ముక్కెరే అందం పిల్లా...

చుంబనపు ఎర ఆ ముక్కుతోనే వేస్తారట...

అందుకే నీ ముక్కుకు ఆ ముక్కెరే అందం..

నీ ముక్కెర ఎరలు ఎలా అంటే?...

నీ "అడ్డ బాస" తో అరనీలం కలిపి,

నీ "అడ్డ కమ్మ" తో ఆమోదం తెలిపి,

నీ "దోటి ముక్కెర" కు దాసోహం నా మనసు...

"నత్తు ముక్కెర" నీ నయనాలకు సాయం.

"బులాకి" తో ఈ భువనానికి తెరవేసి,

"బేసరి" తో నీ బంధం తెలుపుతూ...

ఆ "ముంగర" తో మయూర నృత్యం నా యదపై చేస్తావు.

అక్కడితో ఆగుతావ!

"ముక్కఱ “ తో వేసిన ఆ ఎర

నీ సంపెంగ ముక్కుకు "ముక్కుపోగు" గుచ్చి,

కొటేరేసిన(కొటేరం-నాగళి)ముక్కుతో

నా హ్రదయాన్ని దొలుచుతుంటే...

నాశిక నంచే కంచె వేసిన పోగు ధగద్ధాయమవుతుంటే...

నీ ముక్కుపుడక నా హృదయంలో చిక్కుకుందే ఓ అమ్మాయ్...

సూర్య తాడిపూడి.

 

 

గోవిందా ।।। గోవిందా

 

కోరి చూపించిన ముక్కుపుడకను

కొని తెచ్చి ఇచ్చితిని మా అమ్మాయికి

ఆ ఆనందము, తన హృదయంలో చిక్కుగొనగా

ముచ్చటగా మూడు రోజుల చదువు గోవిందుని పరమయ్యే 

 

మురళి మోహన్ 

 

 

కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడక ని దృష్టిలో పెట్టుకుని 

 తేటగీతి లో నా చిరు ప్రయత్నం

 

ముక్తి కలుగును జూడనీ ముక్కుపుడక

ఇంద్ర కీలాద్రి పైనుండి చంద్ర కళల

శోభ తోడసిరులనిచ్చు సుదతి నీదు

ముక్కుపుడక హృదయములో చిక్కు కొనగ

సంత సమ్మున గొల్చెద శంభు సతిని

 

రమ, కంకిపాడు.

 

 

తేటగీతి 

 ముక్కుపుడక చూడ మగువ ముచ్చట పడ

మోజుపడి తెస్తి మువ్వల ముక్కుపుడక

వజ్రము పొదిగి తెమ్మనె వన్నెలాడి

ముట్ట నొల్లదు ముక్కెర పెట్టువరకు

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ!

 

ముక్కెరన మోజు మూన్నాళ్ళ ముచ్చటాయె

రవ్వల నకిలేసు నడిగె రంజుగాను

ముక్కునత్తు నా బ్రతుకుకు ముప్పుదెచ్చె

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ!

 

వాణిశ్రీ నైనాల

 

 

వచన  ప్రయత్నం 

కాటుక కనులచూపుల విరులు పరచావు

నీ అందెలనే నా గుండె రవళిగా మార్చావు!

సరే..

మొన్నటి దాకా నామనసూయల ఊపినది నీ జుమ్కా!         

అంతలోనే ఎంతమాయ! నన్నే చేసావుకదూ నీ

ముక్కుపుడక...!

హృదయంలో చిక్కుకొనగ ఎన్నితంటాలో మరి.....

మున్ముందు ఇంకేం అల్లరుందో చూస్తా మరి..

 

చిన్న వచన గా...

 

ముత్యాల ముక్కుపుడక నీ  అందాన్ని పెంచగా,

కెంపురాయి ముక్కుపుడక నీ  బుగ్గల కెంపులనివ్వగా,

మువ్వల ముక్కుపుడక నీ మురిపాలు పంచగా,

పచ్చరాయి ముక్కుపుడక నిన్ను  పరుగులు తీయించగా,

రవ్వల ముక్కుపుడక తో నన్ను దరిచేరగా,

నీ ముక్కుపుడక నా హృదయాన్ని  గుచ్చుకొనగా.....


ఉషారాణి.

 

తేటగితి

 

చూడ చూడ మాణిక్యముల్ చుక్క లవలె

యమ్మ దరియించె నంతట యంకములను

మణులు కెంపులు ముత్యాల మరకతములు

వజ్రపు కిరీఠము మెరయు పసిడి వేణి

ఏడు వారాల మెరుగుతో యెన్ని యున్న

అయ్యవారల గురితించు యబ్బు రముగ

ముక్కుపుడక హృదయములో చిక్కు కొనగ

 

ఎం.పద్మలత

 

 

ముక్కుపుడక హృదయంలో చిక్కుకొనగ

 

మా అమ్మ దుర్గమ్మ ముగురమ్మల మూలపుటమ్మ,

మా అమ్మయే విశ్వమందలి వెలుగులకు వెలుగు

ఆ వెలుగున అమ్మ ముక్కెర వెలుగు ప్రస్పుటమై

తారకల కాంతిని దిక్కారము చెయ్యగ భాసుర మయ్యె

 

ఆ ముక్కుపుడక  శోభ ఏమని వర్ణించను

ముక్కెర కిరువైపులా రెండు మణు లుండే

ఒకటి ముత్యము ఇంకొకటి మాణిక్యము

మంగళ శుక్ర తారలకు భవ్య సంకేతము,

 

ఆ ముక్కుపుడక హృదయంలో చిక్కుకొనగ

కృష్ణమ్మ వెలుగుల్ దేదీప్యమై ప్రసార మాయే.

 

CA కె మల్లికార్జునరావు

 

 

 తేటగీతి 1 


ధగధగ మెరిసి,  శోభల తళుకు లిడుచు

ముజ్జగముల ముంచు తిమిరములను తేర్చి

జ్ఞాన జ్యోతులే దీపించ నంద! నీదు

ముక్కు పుడక హృదయము లో చిక్కు కొనగ, 

ముక్తి దారుల పయనించ మొదలు పెడితి.

 

 తేటగీతి 2

 

ముక్కు పుడక హృదయము లో చిక్కుకొనగ,

బహుమతిగ నత్తు నిచ్చి చేపట్టె పడతి

ముక్కెర మగని యంతస్తు ముద్ర యనగ,

మగని యాస్తి సరిగ భారమవగ  నత్తు

చిక్కులే తెచ్చె, మగువకు చింత నిచ్చె

 

అవళూరు సీత

  

 

ముక్కు పుడక మెరిసే మెరిసే ...

 

పెండ్లి పేరంటం

వేడుక ఏదైనా కానీ

అందంగా ముస్తాబైతేనె అందం

ఎన్ని నగలు దిగేసిన

ముక్కుపుడక పెడితే

ఆ అందమే అందం.

 

అలంకారప్రాయంగానూ

ఆరోగ్య పరంగాను ముక్కుపుడక

మగువలకు మంచిది

 

మగువ అందములో ముక్కు

ముక్కుపుడక విశిష్టత

పెళ్లిచూపులు నాడు తెలుస్తుంది

 

పెళ్లి చూపులలో అబ్బాయిలు

ముక్కు బాగుంది

ముఖానికే అందం తెచ్చేలా ఉంది అంటుంటారు

 

ముఖానికి కళ్ళు అందం

శృంగారానికి ముక్కు అందం

 

అందాల పోగు ముక్కు పోగు

ముక్కుకే అందం

 

మనసిచ్చిన మగడు

దరిచేరి నపుడు

ఉచ్చ్వాస నిశ్వాసలు పెరిగి

ఆ ముక్కు పోగు

హృదయానికి చిక్కగా

 

మగని మనసుకే గుర్తు గా

మగువ ముక్కుపుడక  కాగా

 

వారి బ్రతుకంతా ఏడడుగుల నడక

ఏడు జన్మల నడక.. కాదంటారా

 

వి. విజయ

 

 

ముక్కుపుడక అనగానే

నిగమశర్మఅక్క అప్రయత్నంగా

గుర్తుకు వస్తుంది నాకు

తమ్ముడిని ఉద్ధరించడానికి వచ్చి

తన కిష్టమైన ముక్కెర పోగొట్టుకుంటుంది పాపం

 

ముక్కుపుడక అనగానే

చిన్ననాటి స్నేహితురాలు

గుర్తుకు వస్తుంది తన ముక్కు కుట్టేటప్పుడు

తను పెట్టిన తిప్పలు ఇంకా గుర్తున్నాయి

 

ముక్కుకు ముక్కెర అందం

ఆ అందం చిక్కెను హృదయమున

ఆశలు రేకెత్తిన సమయాన ఊసులు

చెప్పెను మది నిండుగా.......

 

కోవూరి

 

 

ధవళ వర్ణపు చీర సింగారించి

జడలో మల్లెలు తురుముకొని

ముక్కుకు తళతళ మెరిసే వజ్రపు ముక్కుపుడక ధరించి

గోరింటాకుచేతులనిండా గాజులు,

పాదాలకు  సిరిమువ్వలు గల గల  లాడుతూ

తొలి రాతిరి నవ వధువు

పడకటింటచేర

గాంచిన ఆ నవమన్మధుండు

చెంతచేరి హత్తుకొనగా

ముక్కు పుడక హృదయమందు

చిక్కుకొనెన్.

 

డి. నాగమణి

 

 

తేట గీతి 1

ముక్కు పుడక హృదయములో చిక్కుకునగ

నేరుగ తరుణి మనమును చేరు కొనుము

తగిలిన మధుర గాయము త్వరగ నయము

చేసుకొనెడి   ప్రయత్నము చేసుకొనుము

 

తేట గీతి 2

 ముక్కు పుడక హృదయములో చిక్కుకునగ

మదిని సుందర రూపము మలచి పోయె

వదలక సతి స్మరణ చేయ వెతలు దీర్చి

తుదివరకు నను కాచును దుర్గము వలె


డా.సతీష్

 

రంగు మోము కనులను చేరలేదు

బస్తీ హంగుకి మనసు చెదరలేదు

పల్లెటూరి పడతి వచ్చేను నెచ్చెలై

ముక్కుపుడక హృదయములో

చిక్కుకొనగ !!

 

విష్ణుప్రియ

 

 

తేట గీతి

కెంపు కెంజాయ మెరుపుల కంబుకంఠి

నీలమణియై వెలుగులీను నీరజాక్షి

సమ్మతించి ధరించ పచ్చలు పొదిగిన

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ

 

వాణి 

 

 

గోవిందా ।।। గోవిందా

 

కోరి చూపించిన ముక్కుపుడకను

కొని తెచ్చి ఇచ్చితిని మా అమ్మాయికి

ఆ ఆనందము, తన హృదయంలో చిక్కుగొనగా

ముచ్చటగా మూడు రోజుల చదువు గోవిందుని పరమయ్యే .

 

మురళి మోహన్ 

 

 

ముదముతో పెట్టు నదియేమి ముక్కునకును,

హరి నిడె నెచట స్దానము సిరికి తెలుపు,

కరి మడుగులోన ప్రార్ధించె హరిని యెపుడు

ముక్కు పుడక, హృదయ ములో,చిక్కుకొనగ

 

పూసపాటి  


 

తేట గీతి

కాటుక కనులు యెదలోన నాటుకొనగ

హంసనడకలు గమనాన హసితమవగ

నగవు జలపాత సిరుల సొబగులు తోటి  

ముక్కుపుడక హృదయమున చిక్కుపడగ

  

రాంమోహన్

 

ఈ రోజు సోదరీమణులు ముక్కుపుడక మీద వారి వారి జ్ఞాపకాలన్నీ వెలిబుచ్చారు

 

అతివకు హరువును యిచ్చు నాభరణము

ముదితమనసు మోహనమగు ముదముతోడ

నాభరణములు ధరయించి, నబ్బురముగ

పుడమి నందు భూషణములు భోగము గద.

 

సమూహము లో ఉన్న సోదరీమణుల కొరకు ముఖ్యంగా రమక్క కొరకు ముక్కుపుడక పూరణ సీసం లో   ...

 

వెంకట్.సిహెచ్

 

సీసము 

తానొక యచ్చర ధరణి నందు జనించె నవరత్న శోభిత నవ్య కొమగ

ఆభరణములన్ని యతివకందము గాక ముక్కుపుడక బహు మోహనంబు

పుష్యరాగపు ముక్కుపుడకహృదయములో చిక్కుకొనగ  చెలి జిలుగులన్ని

కనువిందు సలుపుతు గమనమునకు వచ్చి గిలిగింత బెట్టునె చెలిమికాడ్ని

 

తేట గీతి

ప్రియుడు సుకృతము నతివను వివహ మాడి

మురియచుండె, నహరహము మోహనముగ

ముక్కుపుడకన్ ప్రశంసింప ముదిత మనసు

పొంగుగ మగువ ముక్కు పుడక భోగము గదె!

 

వెంకట్.సిహెచ్

 

 

తేట గీతి

చూడ చూడ మాణిక్యముల్ చుక్క లవలె

యమ్మ ధరియించె నంతట యంకములను

మణులు కెంపులు ముత్యాల మరకతములు

వజ్రపు కిరీటము మెరయు పసిడి వేణి

ఏడు వారాల నగలతో వెలుగు చుండె

అయ్యవారల గురితించు యబ్బు రముగ

ముక్కుపుడక హృదయములో చిక్కు కొనగ

 

ఎం.పద్మలత

 

 

తేట గీతి

పోయి వచ్చెను షాపుకు పోజు కొడుతు

చూచి వచ్చెను నగలెల్ల నాచి తూచి

ఏడుపొచ్చెను తరుణికి యెందుకనగ

ముక్కు పుడక హృదయములో చిక్కు కొనగ

 

తేట గీతి

మెరుపు వోలెను కనబడు మేని సొగసు

సుందరమ్ముగ నుండెడి యందమునకు

ముక్కు జూడగ మనసిక నిక్కమనెను

ముక్కు పుడక, హృదయములో చిక్కు కొనగ

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

తేటగీతి 1

ధగధగ మెరిసి,  శోభల తళుకు లిడుచు

ముజ్జగబులలోని తిమిరములను తేర్చి

జ్ఞాన జ్యోతులే దీపించ నంద! నీదు

ముక్కు పుడక హృదయము లో చిక్కు కొనగ, 

ముక్తి దారుల పయనించ మొదలు పెడితి.

 

తేటగీతి 2 

ముక్కు పుడక హృదయము లో చిక్కుకొనగ,

బహుమతిగ నత్తు నిచ్చి చేపట్టె పడతి

ముక్కెర మగని యంతస్తు ముద్ర యనగ,

మగని యాస్తి సరిగ భారమవగ  నత్తు

చిక్కులే తెచ్చె, మగువకు చింత నిచ్చె

 

అవళూరు సీత


  

నా ద్వితీయ ప్రయత్నం:

 

పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయినచ్చేసుకున్నారు.

అబ్బాయి అమ్మ మాత్రం ఒక చిన్న కోరిక కోరింది.

కాబోయే కోడలికి వజ్రపు ముక్కుపుడక చేయించామని

అందుకని అమ్మాయికి తప్పక ముక్కు కుట్టించమని.

చెప్పి వెళ్లిపోయారు అబ్బాయి తరపువాళ్లు

అమ్మాయి రుసరుసలాడింది పాత కాలపు పద్దతి అంది.

తల్లి బతిమాలింది ముక్కు కుట్టించు

వాలని, బెట్టు చేయొద్దని.

అమ్మాయి అసలు తగ్గలేదు- ససేమిరా వద్దంది.

తండ్రి బుజ్జగించాడు - స్టిక్కర్ వేసుకుని చూడమన్నాడు.

అమ్మాయి ఒప్పుకుంది- ముచ్చటైన స్టికర్ ముక్కు మీద పెట్టింది.

అద్దంలో చూసుకుంది- ఆశ్చర్యమునకు లోనయింది

తన అందం పెరిగింది - మూడింతలు అయింది.

ముక్కు కుట్టించుకుంది - అబ్బాయి అమ్మ ఆనందించింది.

మంచి రోజు చూసుకొని-పెళ్లి నిశ్చయం అయింది.

హృదయాకారంలో వజ్రపు ముక్కుపుడక

అమ్మాయి ముఖంలో మెరిసింది.

ఆ ముక్కుపుడక హృదయంలో చిక్కుకొనగ

అబ్బాయి అమ్మాయి మనసున బందీ అయ్యాడు.

అవ్విధంబున ముక్కుపుడక చక్కగ పెళ్ళి కుదిర్చే.

ఇలను దాని  మహిమ వర్ణించ నెవరి తరము?

 

CA కె మల్లికార్జునరావు

 

 

 

సరదా చిరు ప్రయత్నం

సీసము 

 

షాపుకు బోతిరి సాయం సమయమున

కోరగ సతియొక కోర్కె నపుడు

కారునందు నపుడు కనకము దల్చుచు

ముద్దుగ తాసతి ముచ్చటించ

గాభర జూపక ఘనమగు రీతిన

యాపతి నవ్వుచు నటన జేయ

భవితయె కానగ భార్యకు దెల్పక

నేమియు తోచక నెడ్చు చుండె

 

తేటగీతి  

పోయి వచ్చెను షాపుకు పోజు కొడుతు

చూచి వచ్చెను నగలెల్ల నాచి తూచి

ఏడుపొచ్చెను తరుణికి యెందుకనగ

ముక్కు పుడక హృదయములో చిక్కు కొనగ

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి



1️⃣ 

వలపు కురియంగ నెలవంక చెలువమందు   

సిగ్గు పడుతున్నసొబగులు నిగ్గు లవియె  

పలికె భావమెల్ల కనుల భాసములవి 

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ   

2️⃣

తేటవలపులు మొలకలెత్తిన మనసున     

వాలు కన్నుల సొబగులు వాంఛితముగ

చారు ధరహాస సుందర జావళీలు 

స్నిగ్ధ కుసుమమ్ము పొంకపు ముగ్ధ వోలె     

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ   


3️⃣

సోగకన్నులు విప్పారి జూచి చెలియ  

పలుకులందున జావళీల లహరులవి    

వింత మంత్రమేదో జల్లి సాంత్వనమున    

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ


4️⃣

హృదయములలోని గాటంపు నిదురలోన     

మందహాసంపు మగతలో మాధురులవి  

చెలినగవుల పారాణితో జీవితమున   

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ 


శివ శంకర్ కస్తూరి  

2 కామెంట్‌లు:

  1. మిత్రులు చక్కగా పూరిస్తున్నారు...ఆ వచ్చేదత్తపదేమిటా అని ఎదురుచూస్తున్నారు...శ్రీ మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. సుమనోహర భావనలన్ని,సుందరమైన కవితలుగా రూపుదాల్చి,శ్రీ మైనేని మురళి గారి అవిరళ కృషితో
    బ్లాగులో అందంగా కొలువు తీరినందుకు...నమస్సులు, శుభాభినందనలు......
    ......చల్లా దేవిక.

    రిప్లయితొలగించండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...