8, సెప్టెంబర్ 2020, మంగళవారం

చిత్రం పై పద్యం - 45 , 08. 09. 2020

 

 

08 - 09 - 2020 ; ప్రణాళిక
శీర్షిక : చిత్రం పై పద్యం  - 45
 పై చిత్రానికి తగిన పద్య కవిత / వచన కవిత అందించగలరు
 వచన కవిత్వంలో భావన  అందించే వారికి విన్నపం : ప్రతి పంక్తిలోనూ కనీసం 12 అక్షరాలు ఉండాలినాలుగు పాదములు మాత్రమే వ్రాయవలెను.



సురుచిర మనో కాసారంలో మెదిలిన భావనా లహరులన్నీ..

నవ కోమల కవితా కమలములై విరబూసి..

పులకింతల పరిమళాలతో పరవశాన్ని కలిగించి..

రాగ రంజితమైన రంగవల్లిగా ప్రతి హృది ముంగిట కొలువుతీరాలి.

చల్లా దేవిక.

************

 

 మస్తిష్క మైదానంలో

అక్షర బీజాలు నాటాను

అవి చిరు కవితలై మొలకెత్తాయి

ఛందస్సు నీరుపెట్టాను

గణ దోషముల

కలుపు మొక్కలు తీసేసి

కంటి రెప్పలా కాచాను

ఇప్పుడిప్పుడే

పద్య సుమాలు వికసించడం

మొదలయ్యింది

నేనిప్పుడు

అక్షర సుక్షేత్రానికి

వనమాలిని

 

రమ, కంకిపాడు.

*****************

 

భావ కవిత

 అతడొక తెలుగు తేనెల కవి,

భాషాభిమానము తనకు మెండని,

తెలుగంటే  తన ప్రాణ ధనమని,

అంశ మేదైన తీపి కవిత లల్లు మరి.

 

CA కె మల్లికార్జునరావు

 *********************

 

జ్ఞానమును మన ముందుకు తెచ్చేను పుస్తకము

మధించి మనస్సుకు చేర్చేను మస్తకము

మనో మేథకు సక్రమ మార్గమునకు గురువు

వారే జ్ఞానసముపార్జనకు ఆదరవు

 

కన్నాజీరావు

*************

 

వచన కవిత

 ఆలోచనా తరంగాలు

- మానవ మేధస్సున తొలి అడుగులు

 అనుభవాల దొంతరలు

- మానవాభివృద్ధికి మేలి మలుపులు

 మస్తిష్కపు పొరలలో దొరలే రసఝరులు

- కవితా లతా నికుంజములకు దొరలు

 జిజ్ఞాసల మొలకలు

- ప్రగతి రథ చక్రాల ఇరుసున కందెనలు

అక్షర విజ్ఞానములు

- విశ్వశ్రేయో భావనలకు ఊపిరులు

 మితృలకు అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు

 

దుర్భ కృష్ణశాస్త్రి

 ***************

కృష్ణశాస్త్రి గారు, మీ భావనలు సీసంలో బంధించే చిరు ప్రయత్నం.. మీకు సమ్మతమైన మన బ్లాగ్ లో ప్రచురిస్తాను.  

 

సీసము 

ఆలోచనా తరంగాలపై వూయల  

    లూగంగ భాసురమౌ కలములు   

కవితానికుంజపు కాంతుల పొంగార   

    కమనీయ కవనంబు కందళించు

మస్తిష్కపు పొరలో మధురోహలందున  

     చిందులాడగఁ సుధాశీకరములు 

జిజ్ఞాస పెంచు మంజీరపు సుస్వర    

     స్వనముల తారాడు పల్లవములు 

 

అక్షరముల జ్ఞానమునకై దీక్షజేసి;      

ప్రగతి రధచక్రపుటిరుసులు  కదిలించి

విశ్వమానవ శ్రేయముల్ విభవమునకు

మనసులోని తలపులతో మమతపంచు !

 

శివశంకర్ కస్తూరి /  దుర్భ కృష్ణశాస్త్రి

 **********************************

 

అక్షరాస్యతా దీక్ష

అక్షరాల తోటలో అక్షరాస్యతా దీక్షలో

అక్షరాభ్యాసముతో ఆదిగురువు బాటలో

విద్యే విజ్ఞానమంటూ విశ్వజ్ఞాన సూత్రమంటూ

సాగే దీక్షలో నిత్య విద్యను అర్థిస్తూ

నిత్య విద్యార్థిగా సాగాలి పయనం

విద్యేగా విశాల విశ్వానికి మూలం

విద్యతోటే జ్ఞాన జ్యోతి ప్రజ్యలనం

చదువుతోటే సంస్కారానికి ఆజ్యం

జన జీవన న్రవంతికి జీవన   సూత్రం

చదువులమ్మ బడిలోన సంస్కారపు వడిలోన

ఎదిగే యువతరం తోనే భావి భారత నిర్మాణం

అజ్ఞానపు చెరనుండి విజ్ఞానపు బాటలోకి

అందరి మది లోన అక్షరాస్యతను పెంచే దీక్షగా

దారిచూపు దేవాలయం సరస్వతీ నిలయం.

 

శ్రీనివాస్ 

 ******************

 

" యద్భావం తద్భవతి " అన్న వేదోక్తి కి .. నా భావనలో ప్రభవించిన శార్దూలం    

 

శార్ధూలము 

శ్రీభావార్ధము వేదసూచితములై చిచ్ఛక్తి తేజంబులై 
యే భావంబుని గొల్చినన్ ! మరియు తానే కాంతులన్ జూచినన్
స్వాభావ్యంబుగఁ నా తలంపు చెడునాస్వాదింప పోకుండుటే
శోభాలేశములౌ విలాసములతో శోభించు భావంబులై !!

 

 కస్తూరి శివశంకర్

 **********************

 

తేటగీతి

మెదడునందునభావముమేలు చేయ

రాతతోడనుతెలుపుతూరమ్య ముగను

భావప్రకటనచేస్తిరిభవ్య ముగను

జ్ఞానమన్నదిమనిషికిజ్ఞప్తినిచ్చు

లలితారెడ్డి

 ******************


అక్షరం కావాలి ప్రాతిపదిక మనకు

హస్తభూషణం కలం తోడురాగ మనం

కాగితంపై ఆలోచనల మాలలల్లుదాం

మొక్కవలె కలువపూవు వలే అవి

అంతర్వ్యాప్తం కావాలి అందరి యెదలు గెలువగ.

వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత.

ఆర్.వి.రమణమూర్తి.

 ****************************

 

గేయ రచన,

భావాలు చుట్టుముట్టగా,

అనుభవాలు కట్టి పట్టగా,

కలం సాగదు ముందుకు,

గళం విప్పుట ఎందుకు?

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

**********************************

 

వెండి దొర పండు హృదిని తాకెను

మధురోహల పవనము..

నిర్వేదపు పుటల నుంచి పుట్టెను

సరికొత్త ప్రణయ కవనము

జ్ఞాపకాల కలము తీసి

చిలిపితనపు ఇంకు నింపి

త్వరపడమని తరుముతూ పదమును

చకచక టకటక రాసెను ముద్దుగ

తన రాధకు రాయబారము...

విష్ణుప్రియ

******************

 

తరువోజ

 అక్షరము లివియే నబ్బుర పరిచె

          డద్భుత నిధులివి నచలకీలమున

యక్షులు యెరుగని యమృత ధారలివె

          నహరహము నిలుపు నధికులవోలె

వృక్షము వోలె సవినయము నేర్పి

           వికసింప జేసెడి వేద సుధలివె

చక్షువు కింపుగ సంతస మిచ్చు

           చరితకు హేతు వీ సర్వక్షరములు

 

మధురాక్కర

 గురువు మెచ్చెడి విజ్ఞాన  

                 గుణము లీ యక్షరముల్

హరువు నిచ్చెడి జీవిత

                 యక్షర సుధలివియే

గరువ మిచ్చెడి జ్ఞానపు

                  పెన్నిధి ధాతువులై,

పరులు దోచలేని సిరులై,

                  ప్రాభవమిచ్చునివే!

 

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలతో

 

వెంకట్. సిహెచ్

****************

 

తేట గీతి

తలపు వనమున విరబూసె కలలవిరులు

అక్షరములుగ రూపొంది యమర పదవి

పొంది, పద సౌరభమ్ములు పొంకపు గతి

మదికి  హాయి నీయఁగ   పద్య మాల లల్లి

పలుకు జెలి పదముల కిత్తు పద నివాళి

 

***************

 

కాదేదీ కవిత కనర్హం

కవి ఆలోచన తరంగాలలో.

పువ్వు ,లవ్వు ,చెట్టు ,చేమ,

పుట్టా పుడమి ,నేల,నింగి,,ఏదైనా

మస్తిష్కంలో ఇలా ఇమిడిపోయి

కలం చేతబట్టి కవితా సుమ సౌరభాలు

వెదజల్లే.

 

డి నాగమణి.

******************** 

 

సింధు సంస్కృతి నుండి

చంద్రయానం వరకు

అమ్మఒడి , ఆల నించి

ఆర్కిమెడిస్ సూత్రాల వరకు

 

అద్దనా బేడలనించి

ఆదాయపు పన్నుల వరకు

కదిలే చక్రం నించి

కాల చక్రపు నిగ్గుతేల్చే వరకు

 

నా అనే బ్రాంతి నించి

మన అనే మమత వరకు...      

అనాది పరంపరగా

ఆద్యుల అనుభవసారం

 

నిక్షిప్తమైన అపూర్వ నిధి

అజ్ఞాన తిమిరాపహరణం

అక్షర జ్ఞానం...

 

బుద్ది జీవిగా పుట్టినందుకు

పుట్టెడు పుటల్లో పట్టెడు

అక్షరాల్నైనా పోగుచేద్దాం!

 

ఎంత నేర్చినా ఇంతేనా

అనిపించే అనంత విశ్వాన

అంతులేని అక్షరాలను

అంతో ఇంతో ఏరుదాం!

 

ఆప్యాయంగా ఒడినిపట్టే

సాహితీ  ఆస్వాదకులకు

అక్షర పాయసం పంచుదాం!

అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు

 

వాణిశ్రీ నైనాల

*************** 

 

భావ కవిత:

 

మనో భూమి చీల్చి వెడలు తలపుల మొలకల,

మస్తకమున గైకొని పుస్తకము చేర్చి పోషించి,

సుందర కవితా కుసుమములుగ మలచు వాడు,

లోకమున వెలుగు తెలుగు కవి కాక ఇంకెవడు?

 

CA కె మల్లికార్జునరావు

 *********************

 

అందరికి నమస్సులు.

అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు.

కవితా వలపుతో ఖగోళం,భూగోళం

                     అంశం కాగా,

విజృంభించవోయితలపులతో

          కలమే హలము కాగా,

రానన్నానా    అక్షర నీలమణుల

                     ప్రవహముగా,

చేరనా?కవితా కమలముగా,

         నీ కరముల మధ్యగా.

ఉషారాణి.

*******************

 

కందము

 

వనమున పువ్వులు విచ్చన్

()నమున ఆలోచనలను  ()లచి పుటములై

కనగ   తమ భవితను గనెడి

()నులకు  ఆశా కిరణము ()యమును నీవే

డా. సతీష్

*****************

 

ఆటవెలది 

 

మనసు నందు నుండె మంచి యాలోచనల్

పుస్తకంబు నందు పుట్టునెటుల

తట్టు టెటుల వ్రాయ తడబడక నిపుడు

తల్లి సాయమీయ దాస్యమౌదు

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 ************************************

 

కందము

అక్షరమది మేరు నగము,
అక్షరమది పంకజమనియార్యులు మెచ్చన్,
అక్షరమే కావ్యమిలను,
అక్షరమే సకల నిధికియాదియు శాబ్దీ!

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

**************************************************

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...