16, సెప్టెంబర్ 2020, బుధవారం

Naana


బుడి బుడి అడుగులు వేయిస్తాడు,

చేయిఊతం ఇచ్చి పడకుండ కాస్తాడు,

బ్రతుకు తెరువును చూపిస్తాడు,

బ్రతుకు కు గమ్యం సూచిస్తాడు....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

#నాన్నగారు-వచన ప్రయత్నం

తేటగీతి

అమ్మ చేసిన బొమ్మకి  యాయువయ్యి

కామితములు తీర్చునెపుడు కష్టమనక

నేర్పు విలువల్నడవడికల్ నేర్పు తోడ

వెన్ను తట్టినడుపు తాను వెలుగు వైపు

మేరు నగధీరుడైనట్టి మేటి నాన్న

రమ, కంకిపాడు

  

తండ్రిని చూడగానే ఉత్సాహం పెల్లుబికింది...

చేయి పట్టి నడుపు వాడు చేవనిచ్చి నిలుచునే

కాయ కష్టమునకు వేచి కాచి యుండు రేడులే

మోయలేని భారములను మోజు తోడ మోయునే

సాయము కురిపించు వారు సవిత, సోమ, పితరులే....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

  

తరువోజ

నాన్నయే బిడ్డకు నాయకుని వలె నడత నేర్పి సత మానందమందించు

పెన్నిధి తానుగ బిడ్డను గాంచి పేర్మి పంచి శిశువు వేదన దీర్చు

వన్నెతెచ్చు భవిత ప్రభవంబు నిచ్చి పసిబిడ్డను పెనుచున్ వైభవముగను

కన్నతల్లి చెలిమి గారవమందు కన్నతండ్రి మహిమ కనిపింప కుండె

వెంకట్.సిహెచ్.

 

వచన కవిత

శరము నీవైతే... లక్ష్య ఛేధనకు సంధించ  నిత్యసాదన సలుపు విలుకాడతడు

తరువు నీవైతే... విత్తు నాటి,

ఫలములిచ్చు వరకు సంరక్షించు వనమాలి యతడు

జాబిల్లి నీవైతే... తామసము తరిమెడి వెన్నెలలు బంచ

వెనుకనుండు వెలుగురేడతడు

మెప్పు కోరనట్టి మేరు నగము

తనువుపంచినట్టి తీరని ఋణము 

అమ్మ ఇచ్చినట్టి అద్భుత వరము....  నాన్న 

వాణిశ్రీ నైనాల


నాన్న మీద రాసిన ఒక పాత కవిత కూడా మీతో పంచుకోవాలని పించింది.

నా అన్న వారిలో మొదటున్నవాడు నాన్న

ముళ్ళ బాటన నడుస్తూ

పూల బుట్టలో నను మోసావు 

రాజ్యము లేని రాజువయినా

ప్రపంచానికి నను యువరాజులా

పరిచయం చేసావు

అవసరాలు చంపుకుని

అత్యాశలు తీరుస్తావు

బొమ్మవై , మరబొమ్మవై

అందరి అవసరాలకోసం ఆడతావు

మా సర్వ భారమును నీవే మోస్తావు...

నా గెలుపుకు గర్వపడతావు

నా ఓటమికి తప్పులు నీలో వెతుక్కుంటావు

మౌనంగా ముద్దాడే నీ మనసు

తెలియాలంటే నాన్నవ్వాలి

ఆరేళ్ళ నాటి పర్సుఅరిగిన వాచీ

అతికిన కళ్ళజోడు

చెప్పే సిద్ధాంతం తెలియాలంటే నాన్నవ్వాలి

నీకు చేరువ కావడానికి అప్పుడు నీ గాంభీర్యం

ఇప్పుడు నా పెద్దరికం

అడ్డు గోడలై ఆత్మ వంచన నేర్పాయి

మేమే మీ లోకం మరి మా

లోకం మా పిల్లలయ్యారు

రేపు మా పిల్లల లోకం వాళ్ల పిల్లలు!

ఇది కాల చక్రమే  అయితే

మలి వయస్సు నాన్నకు

నేను మళ్ళీ నాన్ననవుతా

పాత ఒరవడిని

నేటి తరానికి నేర్పి తీరుతా నాన్నా.

వాణిశ్రీ నైనాల

  

సీసము

జన్మనిచ్చిన తండ్రి సంతసించు సుతుని తన రూపముగ దల్చి తన్మయముగ

చంటిబిడ్డ వలె తానింటి బిడ్డను జేరిఆడించి, పాలించి హరువునిచ్చు

అమ్మలాలన నివ్వ నద్భుతముగ నాన్న మార్గదర్శకునిగ మహిమ నిచ్చు

సత్పౌరునిగజేయు సంకల్పమందు సమిధై బిడ్డకు ప్రభ నిచ్చి ప్రీతి వొందు

తేటగీతి 

బుడత జెయ్యి బట్టి విశాల పుడమి రూప

మంత వీక్షింప జేసెడి నయ్య చాటు

బిడ్డడు యెదిగి తాకంటే బీరగాడ

వవలె ననెడి నాన్న తలంపు పావనంబె

వెంకట్. సిహెచ్

  

వచన కవిత

వేలు పట్టి నడక నేర్పిన నాన్న

లోకాలు చూపెట్టి నడత నేర్పేను గాదా

ప్రేమ యంతయు హృదయాన దాచి

హృదయ వేదనల కుమిలేను గాదా

మంచి, చెడుల విచక్షణ నేర్పిన నాన్న

మానవత్వపు విలువలు పంచును గాదా

వెన్ను తట్టి వెన్నంటి వుండే నాన్న

బిడ్డల వృద్ధి వెనకనుండి వీక్షించు గాదా

తీర్చును ఏ కోరికలైన తీరుగా నాన్న

భవితకు బంగరు బాటలు వేయును గాదా

అందనంత ఎత్తుకు ఎదిగి అందలమెక్కితే

తన రూపమని తలచుచు మీసం మెలి వేయును గాదా

అవళూరు సీత

 

తప్పటడుగుల బాల్యాన ఊతమై

తప్పుటడుగుల ప్రాయాన స్నేహమై

నీ లోకం వేరైనా తన లోకం నీవుగా

నీ వేలు వీడక , నీ వెంట నీడగా

చీకటి దారిలో తోడొచ్చే చంద్రుడు

మంచుఎడారిలో వెచ్చని సూర్యుడే

 నాన్న !!

విష్ణుప్రియ

 

ఆటవెలది 

ముళ్ల బాట యనిన ముందు తానేగుచు

పూల బాట జేయు పుడమి మనకు

ప్రేమ పంచునెపుడు వేగిరముగ తాను

కష్టమెంత యున్న గాన నీడు


ఆటవెలది

చేయి బట్టి తాను చేదోడుగా యుండి

సంతసమును బంచు సతతమిలను

కష్ట కాలమందు కన్నీళ్లు దాచుచు

పంచు మనకు సుఖము వరము గాను


కందము 

కన్నా యని పిలి చెడి మా

నాన్నకు నేనేమి యిత్తు నద్భుత రీతిన్!

మిన్నంటెడి త్యాగమునకు

వన్నెలు తేవంగ నేను పంచెద ప్రేమన్!!

 

తేటగీతి

నాన్న త్యాగము చూడని నరులు లేరు

అంతులేని యా ప్రేమకు నదుపు లేదు

ముద్దు మూటలు గట్టు తా ముచ్చటగను

ప్రేమ జూపుట తెలియని పేద వాడు

 

తేటగీతి

కంటి రెప్పవోలె మనల కాచు నిలను

తోడు వీడక నుండెడి నీడ యతడు

తండ్రి సాటగు వారలు ధరణి నెచట

అతడి త్యాగ నిరతికిల నంతు లేదు

 

ఉత్పలమాల 

అల్లరి జేయగా మనకు నాశయ సాధన జ్ఞప్తి దెచ్చు తాన్

 చల్లని ప్రేమ పంచి నిల సంతస మొందును కష్టకాలమున్

మెల్లగ భారమంతయును మేటిగ నొక్కడు మోయుచుందునే

ఎల్లలు లేని తండ్రి మన సెంచుట కష్టము నెల్ల వేళలన్

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

శీర్షిక-నాన్న

సీ॥నాన్నయన్న పిలుపు నవరత్న ములమించు విలువైన వరము జీవితమునందు

బిడ్డలన్ బోషించ భేదమెంచని,తోట  మాలివోలె కుదురు మలచి పెంచు

తానెరుగని యెత్తు తనయు లెక్కవలెని  భుజముపై నిడుకొని బుజ్జగించు

కలిమి లేములను యొకవిధము నడిపి  చిరునవ్వు తోయింటి చింతదీర్చు

అగ్ని పర్వతమున్నట్టి యంబుధివలె

బాధల యలలున్ పొంగవు పరిధి దాటి.

బిడ్డయాశలకి చమురుపోసి పెంచి

వత్తియై వెలుగును కడవరకు నాన్న!


ఓలేటి ఉమా సరస్వతి

 

నాన్న గురించి చిన్న కవిత

చిన్నప్పుడు పట్టుకున్న వేలిని

ఎప్పుడు వీడనంటాడు నాన్న.

ఎటువెళ్లినా చీకట్లో నీడలా

వెన్నంటే ఉంటాడు నాన్న.

మన భారం ఎంతో ఉన్నా

భారం లేనట్లే నటిస్తాడు నాన్న.

కనిపించే ప్రేమ ప్రవాహంఅమ్మ అవుతే,

కనిపించని అంతర్వాహిని నాన్న.

సూర్య చంద్రులుఉన్నంతవరకు

నీవు సంతోషంగా ఉండమంటాడు నాన్న.

నీ గురించి చెప్పడానికి ఈ కవిత

ఏమి సపోతుంది నాన్నా?.

ఉషారాణి.

 

వచన కవిత

మన జన్మ కారణమైన నాన్న

జీవితాన మలి గురువౌతాడు

వేలు పట్టి నడక నేర్పిన నాన్న

మన యాత్రకు శ్రీకారం చేస్తాడు


కన్నీళ్లను బాధలను దాచి నాన్న

స్వజనుల కొరకు కష్టపడతాడు

భుజం తట్టి దారి చూపగ నాన్న

మనకు పోరాట విద్య నేర్పుతాడు


మన జీవన దారుల మలుపుల్లో

మన రాకకై నిరీక్షిస్తాడు నాన్న

మనల చూడ గెలుపు పిలుపిచ్చి

మన జయం కోరి ప్రార్థిస్తాడు నాన్న

CA కె మల్లికార్జునరావు

 

నాన్న పిలుపు ఓ అద్భుతం

నాన్న నేర్పిన మొదటి మాట అమృతం

తన కోర్కెలన్నీదాచిపెట్టి బిడ్డల భవిష్యత్తు కోరుకునేవాడు

పిల్లల ఎదుగుదల చూచి ఆనందంతో మురిసిపోయే వాడు

వెన్నెలాంటి మనసు ఉన్న నాన్నకు

పిల్లల అభివృద్ధి ఒక కానుక.

నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.

నాగమణి.డి


ఆనుకుంటాం కానీ

అవనిలా అమ్మ

నీ భారాన్ని మొస్తుందని

కాలం గడిచే కొద్దీ

వేలు పట్టి నడిపించే కొద్దీ

నాన్న గొప్పతనం తెలిసింది!

తొమ్మిది నెలల పంట అమ్మతనం అయితే

వెలిగే కొద్దీ కరిగే కొవ్వొత్తి నాన్న

తన స్వేదం

వెనుక ఊరిన ఉప్పులా

రుచికి చిక్కని

చక్కని వెన్నముద్దలా నాన్న

అందనంత ఎత్తున ఉన్న

మిఠాయి పొట్లం నాన్న

తరచి చూస్తే తెలుస్తుంది

భోళా మనిషి నాన్నని

కోపావేశాన ప్రళయరుద్రుడు

అదే శాంతాన బుద్ధుడు నాన్న

లక్ష్యం వైపు నీ గురి అయితే

ప్రోత్సాహపు బాణం నాన్న

వెన్నెల పంచే వేళ నెలరేడు నాన్న

ఉషోదయపు వేకువ నాన్న

విశ్వ జగతి పై తొలి అడుగు నాన్నతో

అచంచలమైన ప్రేమ నాన్నతో ......

కోవూరి

 

నా(న్న)కేం తెలీదు

నాన్నకేం తెలీదు

నాయన్నమ్మ ఒడిలో పడినప్పటి  నుంచీ 

నిన్నటి దాకా నాన్నకేం తెలీదు.

అవును!

నాన్నకేమీ  తెలీదు.


డిస్టింక్షన్లు కొట్టి కొట్టీ కలెక్టరయినా

డింకీలు కొట్టి కొట్టీ గుమస్తా అయినా

గంట కొట్టీ కొట్టకనే  లగెత్తుకొచ్చే ప్యూనైనా

మానవుడైనా  దానవుడైనా

పురుగైనా పురప్రముఖుడైనా

లోకాలనేలే ఆదిదేవుడైనా

నాన్న అనేవాడు ఎప్పుడూ బోళాగాడే!

నాన్నకేం తెలీదు!

నిజమే!

నాన్నకేమీ తెలీదు.

నిన్నటి దాకా ఏం తెలీదు. 

కానీ........

కానీ ఇవాళ పెరట్లోకొచ్చి

నాన్న కూర్చున్న కుర్చీలో

తొలిసారిగా వాలాను.

ప్రాణం లేని ప్రహారీ 

పెరట్లో వాలిన  గువ్వలూ

నేలను రాలిన పువ్వులూ 

చెట్లను వీడీ ఇంటిని వీడక

కొత్త చైతన్యాన్ని పుంజుకుని

గాలికి ఎగిసిపడుతున్న

ఎండిన పండుటాకులూ

అచేతనం ఆవహించిన నాతో...

పగటి చీకటి వెక్కిరిస్తున్న నాతో...  

మాట్లాడుతున్నట్టే ఉంది..... 

నీకేం తెలీదన్నట్టూ! 

రేపు నువ్వూ ఒక నాన్నవే అన్నట్టూ!!

----అ.అ----

అత్తిలి అనంతు

 

తేటగీతి 

అమ్మ చేసిన బొమ్మల కాయువయ్యి

కామితములు తీర్చునెపుడు కష్టమనక

నేర్పు విలువల్నడవడికల్ నేర్పు తోడ

వెన్ను తట్టినడుపు తాను వెలుగు వైపు

మేరు నగధీరుడైనట్టి మేటి నాన్న

రమ, కంకిపాడు.

 

నాన్న పైన నా స్వేచ్ఛా సమర్పణ

ఒకప్పుడు కుటుంబ బాధ్యతలు మోయు వాడు నాన్న ఒక్కడే

అమ్మ ఇంటి పనులతో పిల్లల ఆలన పాలన చూసుకునే స్త్రీ మూర్తి.

ఒక రకంగా చెప్పాలంటే ఇంటి సంరక్షణ బాధ్యతను, పూర్తిగా నిర్వహించే తల్లి.

తండ్రి సంపాదనతో ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలు

కానీ ఇప్పుడు  సమంగా

సంపాదించి పిల్లల ఉన్నతికి పాటుపడే

తల్లిదండ్రులు.

కనుక అమ్మ నాన్న అన్న భేదము

లేదు. ఇదినా అభిప్రాయం మాత్రమే.

డి నాగమణి

 

నాకు తెలిసిన విజ్ఞాన సర్వస్వం

నా చేయి పట్టి నడపుతున్న సత్వం

ఏ నొప్పి  తెలియనివ్వని మెత్త

నాన్నగారే  నాకు కొండంత ఊత

కన్నాజీరావు


నా యన్న జీవానికి భీజం నాన్న

నా కున్న ఆయువుకు ఆయుపట్టు నాన్న

నా జీవన గమనానికి మార్గదర్శి నాన్న

నా ఆత్మ జ్ఞానానికి ఆది గురువు నాన్న

నా కంట కన్నీరోడక కాపు కాసే నాన్న

నా ఉజ్వల భవితను ఊహించిన నాన్న

నా కన్న స్వార్ధమేరుగక సర్వం సమర్పించు నాన్న

నా లోకపు లోగిలిలో లౌక్యం తెలుపు నాన్న

నా జీవన జ్యోతికి ఆజ్యమయ్యె నాన్న

నా జ్యోతి కాంతిపుంజములో మెరిసే నాన్న

నా వెలుగు రేఖలకై నిశీధిలో నిల్చిన నాన్న

నా న్న యన్న రూపానికి ప్రతిరూపం నేనే నాన్న

 

వి.వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట.

 

నాన్నా

మా నాన్న చిన్నప్పటి నుండీ బిళ్ళలు బెత్తాలు చూపిస్తూ

ఎలా చదవాలో చెప్పలేదు

చదువుకుంటే నీకే పేరు , మేలు అనేవారు

అయన విజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకుంటూ

అడిగిన వారందరికీ , వారి సమస్యలను బాధలను అధికమించే పరిష్కారాల్ని

ఆత్మీయులుగా విశదీక రించేవారు .

అయన ఆశీర్వాదంతో.  సుఖ,సంతోషాలతో

ఉన్న మామ అందరికీ నాన్న ఓ ప్రాణ స్నేహితులుగా మసిలారు , మిగిలారు !

మురళి మోహన్ 

 

నేటి చిత్రానికి పద్యం కోసం ఆలోచిస్తుంటే ఒక చిన్న కథ నాకు దొరికింది. మనభావాలను అది  కుదిపికడుపుతుంది అనిపించింది. ఈ భావాలను ఒక పద్యం గా మలిచాను.

కానీ కథ పూర్తిగా చదవక పొతే సస్పెన్సు పోతుంది అని నా పద్యాన్ని  ఈ పోస్టు లో ఆఖరున ఇసున్నాను,

ఈ కథ వ్రాసిన వారికి మొదటగా  నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను

ఇక కథ చదవండి

ఓం

…........... మనోడు 13………

"ఈ పూట మీరేమీ రాయలేదు కనుక నాకేం పనిలేదు. ఏదైనా

కథ చెప్తారా" అన్నాడు మనోడు. 

"కథ కాదు గానీ నిజంగా జరిగిన చిన్న సంఘటన చెప్తా విను"

 "చెప్పండి సార్" అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. నేను ఏం చెప్పినా రికార్డు చేసుకోవడం మనోడికి అలవాటు.

"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను... నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."

"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి విశేషం" అడిగాను.

"మా అమ్మాయి సుధ తెల్సుగా సుధ. దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు.

అందుకని.. దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.. "అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న  మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది.

సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగి పోతోంది.

క్షణం తర్వాత లోపల్నించి మాటలు వినబడుతున్నాయి.

" తొలి జీతం కదా. నాన్న గారికి ఇవ్వమ్మా"

"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది.

అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది.

" తప్పే.. అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు

ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు.వెళ్ళు.. వెళ్ళి జీతం ఇచ్చిరా పో"

"ఏంటమ్మా.. ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను.

ఆ టేబుల్ మీద పెడతా.. వచ్చి తీసుకోమను."

ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు. చెంప ఛెళ్ళుమన్న శబ్దం.

"అమ్మా"

"ఛీ..ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకో లేకపోతోంది తల్లి.

" అమ్మా.. ఎంతసేపూ.. నీ వైపునుండి ఆలోచించడమేనా.. నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…"

"చెప్పేడు .."

"అమ్మా.. చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న

ఆఫీస్ కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా.. అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ.

అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో " అమ్మా సుధా.. నా తల్లీ " అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు.

అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళనిండా నీళ్ళు. తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు.

"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మనకన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు దేవుడికి పువ్వులు, పత్రి  లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అది మన సంస్కృతి. మన సంప్రదాయం.

నా భావాన్ని ఒక కందంగా మలచాను 

మొదటి  పరమమును గురువే ,

ముదమును జనకుని శయముల మొదటన ఇవ్వన్

మొదటి నెల జీతమిదియని,

అధిపతి  చరణముల నేను  అర్పింతునుగా


డా. సతీష్

 

నాన్న గురించి తెలియజేసే ప్రయత్నం సీసములో

 జన్మనిచ్చిన తండ్రి సంతసించు సుతుని  తన రూపముగ దల్చి తన్మయముగ

చంటిబిడ్డ వలె తానింటి బిడ్డను జేరి, ఆడించి, పాలించి హరువునిచ్చు

అమ్మలాలన నివ్వ నద్భుతముగ నాన్న మార్గదర్శకునిగ మహిమ నిచ్చు

సత్పౌరునిగజేయు సంకల్పపు సమిధై   బిడ్డకు ప్రభ నిచ్చి ప్రీతి వొందు

తేటగీతి 

బుడత జెయ్యి బట్టి విశాల పుడమి రూప

మంత వీక్షింప జేసెడి నయ్య చాటు

బిడ్డడు యెదిగి తాకంటే బీరగాడ

వవలె ననెడి నాన్న తలంపు పావనంబె

వెంకట్. సిహెచ్

 

వచన కవిత

చీకటి వెలుగుల ఆనవాలు తెలిపే వెన్నెలఱేడు -

బుడిబుడి నడకలకు నడతను అలదే వెలుగుదొర -

లోకరీతి, వ్యవహారం, సంస్కారం, లౌక్యం నేర్వాలన్నా,

అడుగు ముందుకెయ్యడానికి ధైర్యం నూరాలన్నా,

కన్నా నేనున్నా అని ఆదుకునే ఆత్మబంధువెవరన్నా,

నిజ జీవిత కధానాయకుడు నా...యనే... నాయనే...నాన్నే

దుర్భ కృష్ణశాస్త్రి

  

తేటగీతి 

నాన్న యనెడి మాట నిలలో నమ్మబలికె

మారు పేరుగ యుండెగ మమత నిలిపి

గమ్యమును జూపగను వచ్చె కామితమును

దీర్చి లోపాల వెతలెల్ల దీరు వరకు

యూత మిచ్చి మిగులజేయు యూత కర్ర

యెన్ని జన్మలెత్తగ తండ్రి ఋణము తీరు

ఎం.పద్మలత

 

నా ద్వితీయ ప్రయత్నం

పిల్లలను నవమాసాలు మోస్తుంది అమ్మ,

ఆ పిల్లలను జీవితాంతం మోస్తాడు నాన్న,

లోకాన్ని మనకు ఎరుక పరచును అమ్మ,

ఆ లోకానికి మనను ఎరుక చేయును నాన్న. 

CA కె మల్లికార్జునరావు


సినిమాల్లో హీరోయిన్లు వేసుకునేలాంటి 👠👡 చెప్పులు కొను నాన్నా  బావుంటాయి .

ఏఁవి , ఆ ఎత్తు చెప్పులేనా నువ్వడిగేది ? వెధవది... ఆనక ఏమైనా కాలు మెలితిరిగిందా , జీవితాంతం కుంటుకోవాలి, ఎంచక్కా ఈ పారగాన్ చెప్పులేసుకో , కావాలంటే ఒక పది డజన్లు కొంటా, రోజుకో జత వేసుకుని మా నాన్న బోలెడు కొన్నాడహో అని మహ గొప్పహా  మీ ఫ్రెండ్స్ కి చూపించుకోవచ్చు !! చెప్పులు తెంపుదామనే దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకోకు, మళ్ళీ మళ్ళీ ఇవే కొంటా చూసుకో.


ఫొటోస్ లో బాగోదు నాన్నా!!


కావాలంటే ఓ జత🧦 మేజోళ్ళు కొనిపెడతా అవి తగిలించుకో , పారగాన్ మాత్రమే వాడాలి అంథ్తే. .. ఉమ్మ్ ఉమ్మ్..ముందా ఏడుపాపి ఫోటో కి పోజ్ ఇవ్వు ,ఎక్కువసేపాగితే డబ్బులెక్కువడుగుతాడు శుంఠ , నా దగ్గర చదువుకున్నాడని కృతజ్ఞత కూడా లేదు కుంకకి!....హ్మ్ ఏదీ నవ్వు హీ ..హీ అనూ !!! 

మా నాన్న

నాన్న


మం. ద్వి.

క్రమశిక్షణగ బెంచ కఠినుడన్పించు

మందలింపు వెనుక మమతను దాచి

అవసరముల దీర్చు ననువుగ తాను

తండ్రియే గద భవితకు మార్గదర్శి!

చల్లా దేవిక.


నీ  చిటికిన వేలుని చూశా

పొడవాటి నీ నీడనీ చూశా

గుడ్లురిమితే అమ్మనే  చూశా

నిన్ను మాత్రం ఇప్పుడే... 

 ఇప్పుడే చూస్తున్నా నాన్నా

నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి...

గోడ మీది నీ ఫోటోని

నా వొళ్ళో పెట్టి....  

----అ.అ----

అత్తిలి అనంతు


నాన్నా నిన్నన్నానా,

నిన్నైనను నేను నిన్ను నన్నన,

 నాన్నా నిన్నని నానే,నానీ

నిన్న ని నేననని నిన్న ‌నేన న్నానే

పూసపాటి 

 

పరమ పూజ్యనీయులైన మా తండ్రి గారి శ్రీ కస్తూరి సీతారామబ్రహ్మంగారికి నమస్సులత


శార్దూలము:

యుక్తాయుక్త విచారముల్, విపులమౌ యోగాది విన్యాసముల్ 

నక్తాదుల్, జపహోమముల్, చదువులున్, స్నానాదులున్, యాత్రలున్ 

శక్తిన్ నాకు నితాంతమౌ సిరులనే సంప్రాప్తి జేయంగ, నా

సక్తిన్ తోటి వివేకమార్గముల నీ సంప్రీతి తండ్రీ !!! నమః !!! 

కస్తూరి శివశంకర్

 

నాన్న

(ఛందో బద్దం కాదు...పేరు మీరే పెట్టుకోవాలి)..

నాన్న కు నా రూపం ఆపురూపం..

నా అల్లరికి తాను ము నేను కొత్త బట్టలు కట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటే  తన మోము లో ఆనందం చూసి నేను ఇంకా నర్తిస్తూ ఉంటే నను దగ్గరకి తీిసుకుని ముద్దాడే వేళలు ఎన్నటికి మరువలేను.. 

నాకు కోపంవచ్చి పడుకుంటే తాను  బుజ్జగించేవారు..

నాకు తెలియని ఎన్నో  విషయాలు నేర్పించిన నా గురువువే నాన్న.. 

నాకు మార్గదర్శి గా నిలిచారు...

అట్టి మా నాన్నకు నమస్సులతో

అన్నపూర్ణ 


 

దారీ తెన్ను కానక తిరుగాడుతున్న

నీ ఆత్మ ను  సున్నితముగ గ్రహించి

అమ్మ కడుపున స్థిరము చేసినవాడు

మరో దేవుడే అవుతాడు కదా నాన్న.

తొమ్మిది నెలలు నిను మోయు అమ్మ

అన్ని నాళ్లు ఆమెను కంటికి రెప్పలా

చూచుకుంటూ కాపాడుతు ఇరువురి

భారం మోస్తూ ఆనందిస్తాడు నాన్న

ఆ నవమాసాలు నీ భవిష్యత్తు కోసం

ఎన్నో ప్రణాళికలు  రచిస్తాడు  నాన్న

ఈ లోకం లోనికి నీవు వచ్చు వరకు

క్షణం క్షణం ఎదురు చూస్తాడు నాన్న


అమ్మను చీల్చుకుని బయటికి వచ్చి

నిన్ను ప్రకటించుకున్న మధుర క్షణాలు

నాన్నకు జీవితంలో అతి సుందరమైన

అమృతమయమైన  తీపి జ్ఞాపకాలు


అపుడు మొదలౌను నాన్న త్యాగ పర్వం

నీకు సుఖమయమైన జీవితమివ్వాలని

నీ దారిలో అవరోధాలు ఉండకూడదని

తనకన్న ఉన్నత స్థాయిలో నీవుండాలని 

తన కోరికలను కలలను హత్య చేస్తాడు

తన అవసరాలను సదా సర్దుకుంటాడు

నీకు కొత్తబట్టలు కొనాలని తను పాత

బట్టలు పాడు పడకుండా చూస్తుంటాడు 

నీకు స్కూటర్ కొనాలని తన  సైకిలు

ప్రయాణం స్టాప్ పెట్టక కొనసాగిస్తాడు

నీవు  హైక్లాస్ స్కూళ్లలో చదవాలని

ఆస్తులు అమ్మేందుకు సిద్ధపడతాడు 

పిల్లలు తప్పుదారి పడకూడదని

లోన  అంతులేని ప్రేమ దాచి కూడా

పైకి కఠినంగా కనిపిస్తాడు ఫలితంగా

పిల్లల అసంతృప్తికీ గురౌతాడు నాన్న 

కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా

సుఖంగా ఉండాలని ఆరా ట పడగ

తన వ్యక్తి త్త్వాన్ని కూడా బలి చేస్తాడు

అంతటి త్యాగి నాన్నకి సరిలేరెవ్వరు. 

CA కె మల్లికార్జునరావు


నాన్నగుండెలమీదపాపాయి దీనికిసాటివచ్చేభరోసాలేదోయి    

నాన్న ఒక అందమైన గతంప్రతీ స్త్రీ కి. 

సృష్టి లొకోయిల పాట , వీణా నాదం వీటికి సాటి వచ్చే సొగసైనసంపూర్ణ మైన ధ్వని  లేదు. 

అలాగే ఆడబిడ్డ పట్ల కన్న తండ్రి కి సాటి వచ్చే స్వచ్ఛమైన ప్రేమ మరొకటి లేదు. 


మాదిరెడ్డి సురేశ్


స్వేచ్చా సమర్పణలు 

 

ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న సరస్వతీ పుత్రులు శ్రీమాన్ గరిక పాటి వారి కి శుభాకాంక్షలతో . . .

 

ఆటవెలది

గరిక పాటి వారి గంభీర తత్వము

చురక పెట్టు రీతి సుందరమ్ము

అద్భుతమ్ము వారి యవధాన సంపతి

వారి జ్ఞాన నిధికి వందనమ్ము

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

సరస్వతీ పుత్రులు

మహాసహస్రావధాని

శ్రీ గరికపాటి నరసింహారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

 

ఘనత నొందిన మేటియా గరికపాటి

తాను చెప్పు పలుకువిన్న ధన్య మౌను

మంచి చెడ్డలు తెలిపెడి మార్గ దర్శి

మాట తోటితెచ్చు మదిలో మార్పు తాను

రమ, కంకిపాడు.

 

 

అనాథ నాథులు

 

నా అన్నవాళ్ళే లేని

చిన్ని నాన్నల్లారా, చిట్టి అమ్మల్లారా

రారండర్రా రారండర్రా..!

అనాధలైనారు అమ్మానాన్నలు

ప్రేగు బంధం కోసం పడిగాపులుకాస్తూ....

కుక్కా మేకా పిల్లీ చిలుకా

చెలిమైపోతాయ్ చచ్చేదాకా....

రారెందుకు మీరే వారి తలపునా

వాటన్నింటి కన్నా మీరు కారా మిన్న....?

చెప్పండర్రా చాటండర్రా

ఇంటికి వెలుగైపోతామంటూ

ఒంటరి జంటకు అమ్మానాన్నల

పదవులిస్తామంటూ ఇస్తామంటూ....

రారండర్రా రారండర్రా..

నా అన్నవాళ్ళే లేని

చిన్ని నాన్నల్లారా చిట్టి అమ్మల్లారా....!

 

----అ.అ----

అత్తిలి అనంతు

  

 

 

నిరీక్షణ

 

నా కనులు వెతికేను నీ రాకకై

నేను కనే కలలు వెచేను  నీరాకకై

మదిలోన రెగేను అలల అలజడి నీవనే

తీరం తాకే వరకే మనసు చెపుతుంది

నీవేదో దాస్తున్నావని ఆ మనసే చెపుతుంది

నీవో తుంటరవని అల్లికల అల్లకల్లోలం లో

కాగితపు ఖడ్గపు పడవవని సుతి మెత్తని మంచు కత్తివని

పైపై కెగిరే పతంగానివని కరిమబ్బు తునకవు నీవని

జడివాన జావళి నీవని పొన్నచెట్టు సాక్షిగా

ఎదురుచూసేను నా మనసు!

 

కోవూరి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...