2, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్యా పూరణ - 02 - 09 - 2020 , సమస్య : "బుద్ది లేని వాని వృద్ది మెండు" !

 02 - 09 - 2020 ; ప్రణాళిక (సమస్యా పూరణ)


సమస్య :  "బుద్ది లేని వాని వృద్ది మెండు" !


సమస్యా పాదం ఆటవెలది లో.. 

ఇదే పంక్తితో భావంలో పద్య / వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు.


ఆటవెలది

తరిమి గొట్టుచుండె, పరిపరి విధముల  

విషము పంచుచుండ, వివిధ రీతి   

హీనగతిని దోచి! దానవులైనయున్    

బుద్ధి లేని వాని వృద్ధి మెండు!

 

 లలిత దీక్షిత్

**************

 

 సుగంధి

పాడి నంటి పెట్టుకున్న పామరుండు నేర్పరే

వీడి బాధలన్ని తాను వేల్పు దీవె నొందగన్

వేడుకయ్యె జీవితంబు వేదనంత దీరగా;

పీడ బుద్ధి లేనివాడి వృధ్ధి మెండు పృథ్విలో!

 

పాడి= ధర్మము

 

వెంకట్. సిహెచ్

*****************

 

ఉత్సహము, సుగంధి పద్య లక్షణాలు దాదాపు ఒకే విధంగా  ఉంటాయి.

 

4 పాదములు ఉండును

ప్రాస నియమము గలదు. ప్రాస యతి చెల్లదు

ప్రతి పాదము 5 వ గణము యతి మైత్రి ఉంటుంది.

ప్రతి పాదము నందు ఏడు సూర్య గణములు( lll, Ul), చివర ఒక గురువు ఉండును.

 

సుగంధి ఉత్సాహ నియమాలను కలిగి  ఏడు "హ"(Ul) గణములు చివర ఒక గురువు ఉంటుంది.

అనగా ప్రతి పాదము ఈ క్రింది విధంగా ఉంటుంది.

Ul- Ul- Ul- Ul- Ul- Ul- U

హ–హ– హ -హ-హ –హ–గు

********************************

సుమ "సుగంధి" మొల్లములను సుందరముగ జూపినన్         

తమరి కవనమందహాస తంత్రిశింజితమలో           

కొమరు వల్లరులును పంచి కూజితములు మ్రోగగన్ 

మమతపంచు "బృందమిదియె" మధురమైన రీతిగా )

కస్తూరి కవనం

****************************************************** 

మంచివారిని పొగడ నోరురాదు

సాయమడిగిన ఇవ్వ చేయిరాదు

పొరుగువాడిని చూసి ఓర్వలేవు

మైత్రి చేయ మంచి మనసులేదు

ఏల  ఈవంటి "బుద్ధి లేని వాని వృద్ధి మెండు "

 

విష్ణుప్రియ

*********** 

 

ఆటవెలది

 శుద్ధ మొద్దు వాడు శూన్యపు బుద్ధితో

ఎటుల బ్రతుక గలడు యిటుల జగతి

యనుచు గేలి సేయ వినుచు మంత్ర్యాయెరా

బుద్ధి లేని వాని వృద్ధి మెండు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

********************************************************

 

వేదములు వేలు చదివిన

మార్గము కాదు మానవతకు

చదువుల సారము తెలిసిన

తోడు పడదు వివేక వృద్ధికి

తన స్వార్థము తలచక దుష్ట

బుద్ధిలేని వాని వృద్ధి మెండు

 

CA కె మల్లికార్జునరావు

**********************

 

ఆటవెలది

పెద్ద వారి యందు ప్రేమను జూపుచు

మంచి వాని వలెను మనసు గల్గి

సాయమిడుచు నెపుడు సంతస మొంది దు

ర్భుద్ది లేని వాని వృద్ది మెండు

 

ఆటవెలది

చదువు తోడ మంచి సంస్కారమున్ గల్గి

పెద్దలందు నెపుడు ప్రేమ నిలిపి

విలువ నిచ్చు జనుల వీడెడి యా చెడు

బుద్ది లేని వాని వృద్ది మెండు

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

******************************


క్రీడాకారుని వలచిన జవ్వని తన సఖుని మెప్పించుటకై ముచ్చట గొలిపే తన రూపమును లోలాకులుగా ధరించి ప్రేమను తెలుపుతుందనెడి భావనగా  నా ప్రయత్నం


సీసము 

యవ్వన ప్రాయంబు నతివ జేసెడి చిరు

       సందడి తెలుపంగ సంతసంబె

క్రీడాపరుని గోరి గెలవ నెంచెడి తృష్ణ

       తోడ యీప్సితముగ దోస్తు కొరకు

లోలాకులూగంగ లోలాక్షి వైవిధ్య

     భరితముగ హితున్కి వలపు తెలిపె!

ప్రియరమణి యమిత ప్రేమ తెల్పతరమా!

       ఆటగాని సుకృతమబ్బురంబె

 

తేటగీతి

వలపు తెలిపెడి సుందరి ప్రణయ భాష

కవి తెలుప గలడె? సఖుని కరుణ తోడ

చెలువ సౌందర్య మెల్లను జిలకరింప

బాపు చిత్రంబు కనిపించు పావనముగ.


వెంకట్. సిహెచ్ 

 *************************


సాటి వారి కెపుడు సాయము చేసెడి 
మనసు,  కష్ట  సమయ మందు కరుణ 
చూపి, జనుల పీడ మాపు చేయుచు, చెడు 
బుద్ధి  లేని వాని  వృద్ధి మెండు 
 
అవళూరు సీత

**********************


ఆటవెలది

వేదముల నొడువుచు విద్యలు నేర్వంగ     

మానవత్వమద్ది మానితంబు            

పంచుచు ధనమందు పైత్యములేనట్టి   

బుద్ధిలేని వాని వృద్ధి మెండు

 

ఆటవెలది

చదువు సంధ్యలందు సారము నేర్చుచు      

జ్ఞానమదియె నింపు జాగృతులని;  

స్వార్థ బుద్ధి వీడి సాయముజేయు, దు  

ర్భుద్దిలేని వాని వృద్ధి మెండు  

 

కస్తూరి శివశంకర్  (మల్లికార్జునరావు)

****************************************************** 


గురువు  నేర్పని విద్యఅయినను

మొక్కవోని దీక్షతో ఏకలవ్యుడు పట్టు సాధించి

దుర్బుద్ధిలేని వాని వృద్ధి మెండ

ని లోకానికి చాటి చెప్పె

 

డి.నాగమణి 

*********************** 


ఆటవెలది

మంచి చెప్పి మార్చ మందబు ద్దుoడిన

వినడు వాడు నెపుడు వీరు డనుచు

హితము చేయ చూడ హీనము గనుచూచు

బుద్ధి లేని వాని వృద్ధి మెండు

 

లలితారెడ్డి

 ***************** 


ఆటవెలది


రుద్ధి చెయ్యి ,కట్టి శుద్ధిచేసిన మాస్కు

నింట స్వచ్ఛ మైన నీరు త్రాగి

నొదలి మొద్దు తనము, నొద్దికగా , మంద

బుద్ధి లేని వాని వృద్ధి మెండు

 

లలిత దీక్షిత్ 

*********************  


 

వచన కవిత.

 

అమ్మమ్మ చెప్పింది నాకు

తాత చెప్పారు నాకు

అమ్మ చెప్పింది నాకు

నాన్నమ్మ చెప్పింది నాకు

తాతగారూ చెప్పారు నాకు

నాన్నాగారూ చెప్పారు నాకు

గురువులూ అదే చెప్పారు నాకు

పరులకు ఏరోజూ  ద్రోహం చేసే

"బుధ్ధి లేని వాని వృద్ధి మెండు"యని

 

ఆర్.వి.రమణమూర్తి

**************************

 

 

శుచి శుభ్రత నెరిగి మసలు మనుజుండు

భౌతిక దూరమెఱిగి భద్రత నెరిగి మెదలు

సమయస్ఫూర్తితో సమాజములో నడయాడు

మంద బుద్ది లేని వాని వృద్ధి మెండు

 

వి.వి.శ్రీనివాస్

******************* 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...