25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

చిత్రం పై పద్యం - 50, శీర్షిక : గోరింటాకు 24.09.2020

 


శీర్షిక : గోరింటాకు; చిత్రం పై పద్యం  - 50

మీరు స్వేచ్ఛా చందము / వచన కవిత, పద్యములు పంపగలరు

 

తేటగీతి

కొమ్మ లేకుండా పూచేటి కుసుమ మిదెగ

తరుణ లరచేత పూయుమందార పువ్వు

మగని మదిలోని ప్రేమకి మచ్చు తునక

యనుచు నతివలు గౌరింటి యాకు నూరి

దిద్దు కొనిదెరు తమదైన తీరు నందు

 

రమ, కంకిపాడు_______ తెలుగు తేనియలు

 

 

గోరింటాకు

సుందరాంగనలరచేత పూసింది ,

గోరింట అందమంత,

రవి వర్మ కుంచియ చిత్రించె

పగడపు వింత నంత,

ఆషాడ మాస నెలవంక చంద్రికా

అదృష్ట రేఖ లంత

కనగ  నా మనసు మయూరమై,

నృత్యమాడేనంత.

 

CA కె మల్లికార్జునరావు______తెలుగు తేనియలు


 

గేయ రచన,

పాదముల కలువలు పూచెనుగా,

అరచేతుల కెంపులు కాచెనుగా,

మునివేళ్లకు రత్నాల కాంతులరయగా,

ఇంతి డెందమున మందారము విరిసెనుగా....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి________ తెలుగు తేనియలు

 

 

తులాభారం

నీ లేత అరచేతులకు ఆషాడపు గోరింటాకులా లేదా రసాయనాల ' గోరింట పసరా ' ?

సవ్యము గా ఆలోచించు మా .

చెట్టు గోరింటాకు ఇచ్చు అరచేతికి అలంకరణ,

కనులకు ఆనందము ,సంతోషాల చల్లదనం

 

మురళి మోహన్________ తెలుగు తేనియలు

 

 

తెల్లని అరచేతిన చందమామ చుక్కలుగా

పచ్చని పాదాల మీద పారాడు పారాణిగా

గంటకి మందారమై మరు గంటకి

సింధూరమై ...

మెరుస్తూ ఎర్రగా పండెను నా  గోరింటాకు...

 

విష్ణుప్రియ_______ తెలుగు తేనియలు

 

 

గోరింటాకు

చిన్నప్పటి గోరింటాకు చేతులు

చూసి చిట్టి మందారాలన్నావు,

ప్రాయమ్మప్పటి గోరింటాకు చేతులు

చూసివిరబూసిన ఎర్ర మందారం అన్నావు,

పెళ్లి నాటి గోరింటాకు చేతులు

చూసి పగడాలు పూచాయన్నావు,

ఇప్పటి నా గోరింటాకు చేతులు

చూసి ఎలాఉందో చెప్పకఎందుకు

వెళ్ళావమ్మా...అందనంత దూరంగా......?

 

ఉషారాణి_________తెలుగు తేనియలు

 

 

గోరింట

ఆషాఢమాసాన అరవిచ్చిన గోరింట...

చక్కని చిలకలకొలికి  చేతుల

సింధూరపు చుక్కలు

లేడీకళ్ళ లలితాంగి  చేతుల

లతిక తిలకపు గీతలు

పరువాల పడతి చేతుల

పగడాల పొగడలు

మల్లెవంటి పిల్ల చేతుల

మంకెన మాణిక్యాలు

ముత్యమంటి ముగ్ధ చేతుల

మందార మొగ్గలు

కులుకులొలుకు కన్నె చేతుల

కెంజాయ కెంపులు

పుత్తడిపూబోడి చేతుల

పుష్యరాగపు రాశులు

సిరులొలుకు సీమంతిని చేతుల

సీమబంతుల వన్నెలు

కుదురైన కుందనపుబొమ్మ చేతుల

కుంకుమ రేఖలు

గారాల పట్టపురాణి చేతుల

గన్నేరు మెరుపులు

సుకుమారి శంపాంగి చేతుల

చమేలి తళుకులు

అలరించు అలివేణి చేతుల

అంబుజపు సోభలు

కొంటెచూపుల కోమలాంగి చేతుల

కోటి కలువల ముద్రలు

గడుసరి గుబ్బలాడి చేతుల

గులాబి గుత్తులు

తీరైన తామరకంటి చేతుల

తామ్రపు తారలు

పసిడివన్నెల పల్లవోష్టి చేతుల

ప్రత్తిపూల పూతలు

అపురూప కప్పురగంధి చేతుల

కపిల వర్ణపు సోయగాలు

శాంతచిత్త సధ్యుపాస్య చేతుల

సంధ్య కాంతుల సింగారాలు

చక్కెరబొమ్మ చంద్రవదన చేతుల

చంద్రకావి చిత్తరువులు

ముద్దుగుమ్మ మృగలోచన చేతుల

మంజిష్టపు మురుగులు

మగని ప్రేమకు గురుతు  మగువ అరచేతి గోరింట

తెలుగు పడతుల సిరుల పంట

 

 వాణిశ్రీ నైనాల________ తెలుగు తేనియలు

 

 

తేటగీతి

ఎర్రని పంట చేతినంట ఔరా !ననుచు

పెండ్లి కుమార్తె పెట్టిన పండుటాకు

వరము వలె వచ్చు సొగసరి వన్నెగాడు

అంతు లేదయా గోరింట అందరింట

చేయు కార్యము లెన్నియో సరస తీరు !

 

మాదిరెడ్డి సురేశ్________ తెలుగు తేనియలు


 

 

ఆకు హరిత మైనను

అందమిచ్చు అరుణముతో

పడతి అరచేతి సింగారానికి

ప్రకృతి ఇచ్చినవరము

 

అతివ హస్తమున

గుండ్రముగా అద్దిన

అరుణోదయ భానుని

అందమునూతలపించు

 

నఖములందముకు

నాణ్యముగా నుండి

నారీ డెందమున

నవ్వులు కురిపించు

 

పడతి పాదాల

పారాణిగా నిలిచి

పదముల అందమును

పెంపుచేయు

 

ఆషాఢ మాసమున

అతివల అరచేతి అలంకరణకు

ఆనవాయితీగా అలరారును.

 

డి. వి. హేమలత_______ తెలుగు తేనియలు

 

 

గోరింటాకు

ఆషాడ మాసాన

తొలకరి వానల లో

అరుణ వర్ణపు ముగ్గులు కొలువు తీరగా

చేతిలో భానుడు అస్తమించి ఉంటే

మరో చేతిలో చంద్రుడు చుక్కలు  తోసుకుంటూ తొంగి చూడగా

 

కొమ్మల్లేని గోరింటాకు

అందాల అతివల

మురిపాల కర తామరల లో

సిగ్గుల మొగ్గలు వేసింది

 

గోరింట ఎరుపుతో

మెరిసిన అందాలతో

మురిసిన అతివ చేతులు

చూసి  వెన్నెల చిరునవ్వులు కురిపించె

వెండి జలతారులలా....

 

వి.విజయ_______ తెలుగు తేనియలు

 

 

సోదరీమణులందరికీ గోరింటాకుని చూసి

గల్గిన పరవశానికి ఆనందంగా ఉంది. 

 శార్దూలం

స్వాదుత్వంబిడు మంజులమ్ముల మనోజ్ఞంబైన గోరింటతో 

సేదన్ దీరగ నీవె నెచ్చెలివియై చెల్వంపురాగంబువై !  

మోదంబొందగ నీ సలాపముల సమ్మోహంబుమాధుర్యమే 

దేదీప్యంబగు నీదు వెల్గుగనగా తీయందనంబేమిటో

 

కస్తూరి శివశంకర్________ తెలుగు తేనియలు

 

 

మీ శార్దూలమ్ చూసాక ఇంకొకటి వ్రాయాలనిపించి చిరు ప్రయత్నం

 

నీ గోరింట చేతుల మధ్య నీ కనుదోయి తొలిసారి నన్ను చూడగా...

నీ బుగ్గలు కెంపులయి కనరాగా..

నీ తల మురిపెంగా అంగీకారంతో ఊగగా....

నీ తొలిస్మృతి నన్ను గ్రుచ్చు చుండగా....

నీకై,ఆషాడ ముగింపుకై నేను వేచి చూడగా....

 

కవిత వచనం

 

గోరింట ఆకై పూచెను వృక్షమున

పువ్వై నిలిచెను అతివ కరమున

ఆషాఢపు ఆనవాయితీగా

ఇంతి కరముల చేరెనుగా

 

కొమ్మలేకుండా పూచే కుసుమం

అతివల అరచేతిన మందారం

చూసే కనులకు ఆనందం

అమరిన చేతుల చల్లదనం

 

ఇంతి పాదముల కలువలు

అరచేతుల మెరిసే కెంపులు

రవివర్మ  చేతి కుంచెలు

వెలుగులు చిమ్మే పగడాలు

 

కూడిన గంటకు మందారం

వచ్చే గంటకు సింధూరం

చిన్న చేతుల చిట్టి మందారం

పెద్ద చేతుల ఎర్ర మందారం

 

 

తేటగీతి

కలికి కనులకు అందము కాటుకేను

 నింపును వెలుగు గోరింట నింతి మదిని

ఇంతి ముఖమున కాంతులీ స్మితము గావ

అతివ అపురూప రత్నమే అవనియందు

 

డా.సతీష్________ తెలుగు తేనియలు

 

 

ఆట వెలది

గోవు లేని వూరు గోరింట లేనిల్లు

కానరాదు భువిని కలచి చూడ

పడతి చేతి పైన పగడపు రాశిలా

మెరియు కరము జూసి మెరిసి బోవ.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే________ తెలుగు తేనియలు

 

చేత  పెట్టెను గోరింట చెల్లి బాగ

మంచి రంగున మెరిసెను మరియు చేత

వచ్చు మంచియు  భర్తను వలచి నిన్ను

నిత్య  సంతసము తోనను నిన్ను పొంద

 

ఆర్. శాయిలక్ష్మి_______ తెలుగు తేనియలు

 

 

కందము

అరవిరిసిన గోరింటన్

తరుణి కరములన్ మెరిసెను తామెర కాంతిన్

నిరతము తలుపుల వాకిట

మరులను గొల్పుచు నతివలు మగనిన్ తలచన్

 

ఎం.పద్మలత_______ తెలుగు తేనియలు

 

ముచ్చటతో ముద్దు పెట్టే వారొకరు

మొట్టుతూ ముద్ద పెట్టే వారొకరు

ప్రేమగా మురిసి చూచే వారొకరు

పిచ్చిదని ఫక్కున నవ్వేవారొకరు

విసుగుతో చెంప గోకేవారొకరు

గారంగా వింజామరల సేవ ఒకరు

కరచాలనమిమ్మని ఒకరు

కొంటెగా కాలు తొక్కేవారొకరు

పుట్టినింట యువరాణి వి మెట్టినింట మారాణి గా అని

దీవిస్తూ పచ్చగా తాకి కెంపు రంగాయె నా అరచేత గోరింటాకు ....

 

విష్ణుప్రియ_______ తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాల

తెల్లని జేతిలో మెరయు దివ్వెల వన్నెలు పల్కరించగా      

వల్లరి నిండుపున్నములు పండినవేళన జూపఁగావలెన్ 

వెల్లువలాయె ! దివ్యమగు వెల్గులకాంతులు మంజులమ్ములై     

చల్లని రాగరంజితపు సంబరముల్ సరదా మనోజ్ఞమై !!   

 

కస్తూరి శివశంకర్_________ తెలుగు తేనియలు

 


 

సీసము

గోరింట పూచింది గున్నమావి చిగురై చిన్నారి చేయంత చిత్త మలర,

కన్నియ మనసులో కలలు డోలిక లూగ మందారమైపూసె మనసు మురియ

విభుని భావనలన్ని వీచికలై మూగ మంకెన పూలైన మానిని మృదు

హస్తముల్ ముద్దుమో మడచగ ; పండు సీమంతిని కరముల మానికముగ

 

తేటగీతి

 

పండె గోరింట తానెన్ని పాట్లు పడిన

మగువల మనసు నలరించ తెగువ జూపి

ముద్ద గామారి మురిపించు ముద్దు గుమ్మ

మగని ప్రేమ తెలుపు కొల మానమనగ

 

అవళూరు సీత________ తెలుగు తేనియలు

 

ఓపికల అమ్మ

ఆకు ఆకునీ తుంపుతూ

అన్ని ఆకులు కడుగుచూ

కడిగిన వన్నీ రుబ్బుతూ , రుబ్బినదంతా

అక్కల చేతులకు  సున్నితంగా పెడుతూ

తరవాత రోకలి,  గోరింట గిన్నె కడిగి

అక్కలకి అన్నం కలిపి 

 

ముద్దు ముద్దుగా , ముద్దలు పెట్టేది

చివరికి మూతులూ, చేతులు కడిగేది మా అమ్మ

పండిన చేతులు చూసుకుంటూ , చూపిస్తూ

అక్కల ఆనందం హద్దులు దాటేది .వాళ్ళ

అవధులుదాటే సంతోషంతో

అమ్మ కళ్ళలో సంతృప్తి

 

మురళి మోహన్________ తెలుగు తేనియలు


 

 

పెళ్ళికూతుర్ల అరచేతుల అందాల పంట గోరింటాకు,

ముత్తయిదువుల ఐదోతనం గురుతు గోరింటాకు,

 

పండువర్ణాలతో- వచ్చు మొగుని గుణం

చెప్తుంది గోరింటాకు,

ఇంతులకు దివ్య ఆయుర్వేద ఔషధ

సాధనం గోరింటాకు,

 

అశోకవనమున వెలసి సీతమ్మకు తోడై

సాంత్వన నిచ్చింది గోరింటాకు,

అతివల మోముల నగవు చూడాలని

వరమడిగిన త్యాగి గోరింటాకు,

 

పురాణాలందు" గౌరింటాకు" ఇలకుదిగి

అయినదిలే  గోరింటాకు.

 

CA కె మల్లికార్జునరావు________ తెలుగు తేనియలు


 

 

 

గోరింట పూచింది కొమ్మలే లేకుండా మురిపము‌న్  ముదితల కరము‌లందు,

మొగ్గలు తొడిగింది‌ మోజుగా పండింది, ఎర్రని చుక్కగా కుర్ర దాని

కెప్పుడు రక్షగా మెప్పును బడయుచు శ్రీ రామ‌ రక్షను‌ స్త్రీల కిడుచు

నుండుగా నెప్పుడు పండిన గోరింట, మామిడి చిగురులు మంకె నంపు

పువ్వులన్ని యెరుపు,రవ్వల లోనమా ణిక్యములు యెరుపు, నెమ్మదిగ

దులు మేఘము లెరుపు వెలుగు లిడెడి సందె జిలుగులన్,పడతి యధర

ము లెరుపు భర్తను ముట్టగన్,మందారమువలె పండగ హస్త ము‌న ఘనుడగు

పతి వచ్చు నందురు, పడతి కరములోన గన్నేరు లా పండ కలిమి‌ గల్గు

వాడు ధరణిలోన వల్లభు డగునట, సింధూరము పగిది చిట్టి చేతు

లందు పూయుచునుండ గా నంద మైనట్టి చందమామయె వచ్చు సంబరముగ

తరుణుల కరముల్ సతము నీట నానుచు నుండగన్ కల్గును  హాని  యనుచు

గోరింట దాల్చిన కూర్మి తోడన వర్ష ఋతువు లందు మహిలో నతివ లెల్ల

 

దరిని చేరవు వ్యాధులి ధ్దరణి ననుచు

పూర్వ కాలపు జనులంత మురిసి చేతు

లందు పెట్టు గోరింటాకు లక్షణముగ

నిడును స్వస్తత నిలలోన  నెమ్మితోడ

 

పూసపాటి______ తెలుగు తేనియలు

 

 

గోరింటాకు

 గోరింట పూసింది అరచేతి నిండా

మెరుపల్లె మెరిసింది కళ్ళ నిండా

చిరుప్రాయం తోటే తొలకరి బంధం

ప్రాయం లోనైనా వెంటాడే బంధం

కన్యల ఊహాలకే ఊతమిచ్చే బంధం

ఊహల రేవుల్లో ఊగిసలాడే బంధం

పండి పండేకొద్ది పడతి లోని ప్రణయం

రాబోయే రాకుమారుని రూపమే రమ్యం

పాదాల మునివ్రేళ్ళకు పండే గోరింటాకు

అరికాలిన నాధుని తో బంధం పండేటాకు

హస్తముల దశ వ్రేళ్ళకు దర్శనమిచ్చే ఆకు

దశ దిశలు దివ్య రూపంతో దర్శనమిచ్చే ఆకు

అంది అందని అందం అరచేతిలో చూపేటాకు

ఉష్ణ నివారిణిగా ఉద్భవించిన ఆకు

ఋతువు నందైనా ఋతురాగాలొలికే ఆకు

దేహమునందెందైన పసిడి పండేటాకు

పడతుల మది పొరలలో పవిత్రమైన ఆకు

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట______ తెలుగు తేనియలు

 

 


జ్ఞాన కాంతిని మేలుకొలిపే సూర్య బింబము అరచేతిలో  మందారంలా పూచే గోరింటాకు

శాస్త్రీయంగా గర్భాశయ దోషాలు, వేడిని తగ్గించే సింధూర వర్ణ గోరింటాకు

ఆషాడంలో అతివల చేతుల అందానికి మెరుగులు దిద్ది మనసు దోచె గోరింటాకు

మగని   హృదయము రంజింపజేసి మోహ తాపమును రేకెత్తించే మురిపాల గోరింటాకు

పార్వతీదేవి రుధిరాంశతో  జన్మించి కొమ్మ లేకుండ సౌభాగ్యానికి తెచ్చే గోరింటాకు

మగువల కరముల పాదముల అందాలను తీర్చిదిద్దే లేత ఆకుల గోరింటాకు.

 

 డి నాగమణి______ తెలుగు తేనియలు

 

 

కందము

గౌరీ పూజల వేళల 

తీరిచి దిద్దిన కరముల దీప్తుల నిడగా

వారిజలోచన మురియగ

గోరింట విరిసె లతాంగి కోరిక తీరన్

 

గాంగేయ శాస్త్రి________ తెలుగు తేనియలు

 

గాంగేయ శాస్త్రి గారి రచనలోని పదములు గణాలలో

 వొదుగుతూన్నాయని మరొక ప్రయత్నం.

 

కందము

పూచెను పదముల గలువలు

కాచెను కెంపులు వధూటి కరముల నమరెన్

తోచెను పగడముల పగిది

వేచెను మధురోహల యలివేణీ పతికై

 

దుర్భ కృష్ణశాస్త్రి_______ తెలుగు తేనియలు

 

                             

వికసించిన పద్మం

విరబూసిన మందారం

ఆకుపచ్చని తోరణం

పసుపు పచ్చని వస్త్రం

చెవి జారిన లోలోకులు

మెడను అమరిన ఆభరణం

కోడె త్రాసు పూనిన వాల్జడ

గోరింట తో ఎరుపెక్కిన చేతులు

అరవిచ్చిన స్నిగ్ధ బేల చూపులేల!

 

కోవూరి_______ తెలుగు తేనియలు

 

 

నషాఢ మాసమున కై తెలుగింటి పడుచు.వేచి వుండె

మురిపాల నరచేతిన నెర్రని మందారమై పూసి

బతుకు పండించు భర్త వస్తాడే ! ననుచు

నెదురు చూచు కన్నె పిల్ల సిగ్గు నెరుపెక్కించె!

 

డా. లలితా దీక్షిత్_______ తెలుగు తేనియలు

 

 

గోరింటాపూసింది ఆ కొమ్మ పైన

కానీ అది అదపండింద అరచేతి పైన

మందారం మై వీరబుసే పడతి మదిలోన

అది కాంచి అతని మనసు ఉప్పొంగే సంద్రం వోలె

 

ఉప్పల మంజూషా‌‌‌‌‌‌_______ తెలుగు తేనియలు

 

 

నుదిటిన మెరిసె సింధూర నుదయ కాంతి

కరమున వెలిగె మందార కాంతి  రేఖ

పదమున కురుసె లత్తుక పగటి వెలుగు

పడతి యందము మురిసెను ప్రకృతి శోభ.

 

వెకటప్పయ్య సూరే________ తెలుగు తేనియలు

 

అవటానికి ఆకే అయినా ........

చిట్టి పాపాయి చేతిలో చిరు మొగ్గై నవ్వేస్తుంది

కన్నె కరములలో కలల కనకాంబరమై కవ్విస్తుంది

ప్రౌఢ పాదములపై మంకెన యై మురిపిస్తుంది

వధువు దోసిళ్ళలో ముద్ద మందారమై విరబూస్తుంది

వరుడి మనసును దోచేస్తుంది

పండగలెన్నో చేయిస్తుంది

ఆపదమస్తకాన్ని పండిస్తుంది

ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది

 తెలుగు తేనియలలో ఎన్నో  కవనాల జల్లులను కురిపిస్తుంది.

 

(ఆపాదమస్తకం .........Henna గా  వాడుతున్నారుకదా )

(ఆబాలగోపాలన్ని .......గోరింటాకు 2సినిమాలు వచ్చాయీ ,1 సీరియల్ ఇంకా కొనసాగుతుంది ).

 

రామా దేవి______తెలుగు తేనియలు



 

స్వేచ్చా సమర్పణలు 

సమస్య

అయ్యను గని యా యమ విరహాతుర యయ్యెన్

ఇచ్చిన పాదము కందము‌, నా పూరణ తేటగీతిలో

 

బ్రహ్మ కుమార్తె సరస్వతి    బ్రహ్మ సతతము‌ సృష్టి కార్య క్రమాలలో ముణిగి తనకు శయ్యా సుఖము నివ్వని కారణము‌ సరస్వతి దేవి అతనిని‌ చూచు నప్పుడల్లా విరహాతుర అయినది‌ అని భావన.

 

సతతము‌ జగతి సృష్టిపై మతిని‌ పెట్టి

తనకు శయ్యా సుఖమిడక  తనదు కోర్కె

ను తలచని ఘనుడా యయ్యను గని‌ యాయ  

మవిర హాతుర యయ్యెన్ తమకము పెరుగ

 

పూసపాటి______తెలుగు తేనియలు

 

 

జ్ఞాపిక

సంధ్యాసమయాన

నా ప్రయాణం తన కోసం

చాలా కాలం నిరీక్షణ తర్వాత........

కొండల్లోకి సూరీడు దిగుతున్న వైనం

చిక్కగా అలుముకుంటున్న తిమిరం

ఆలోచనలు గతం వైపుకు.............

మనసుకు కాసింత  ఓదార్పు

పరుగులు తీసే కాలంలో

ఒకింత విరామం

రూపం కదలాడుతుంది

తను అలానే వుందా!

మనసు అడిగిన ప్రశ్నకు

నా అంతరంగం చిన్నగా నవ్వింది

సంవత్సరాలు గడిచాయి........

ఇప్పుడు మరలా

పొద్దు పొడిచింది

వికసించే తామరలా

తన హృదయ ఆహ్వానం లా

రాత్రి పగలు వస్తున్నాయి పోతున్నాయి

తను గుర్తుకొచ్చినప్పుడల్లా......

కాలం కాసేపు అలా ఆగితే

మధుర జ్ఞాపకాలు మననం

చేసుకుంటే ఆహా!

తన నవ్వు వర్ణించ తరమా!

తన మాటలు మరువ గలనా!

చేరాల్సిన గమ్యం తరుగుతుంది

హృదయ స్పందన లయ తప్పుతుంది

తనపై కప్పిన వస్త్రం నాకు బాగా గుర్తుంది

కడకు నా జ్ఞాపిక ఇలా మిగిలింది

ఆగక పొంగే కన్నీరు ధారగా వర్షిస్తుంది

 

 

గేయ రచన 

పాదముల కలువలు పూచెనుగా,

అరచేతుల కెంపులు కాచెనుగా,

మునివేళ్లకు రత్నాల కాంతులరయగా,

ఇంతి డెందమున మందారము విరిసెనుగా....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి______తెలుగు తేనియలు

 

 

పూరణ...

సమస్య: అయ్యను గాంచి యామె విరహాతురమయ్యెను సాజమే కదా

ఉత్పలమాల

కయ్యపు కేళులన్నిశిని గాటపు టల్కల దవ్వు నుంచగన్

చయ్యని మేల్కొనన్ వెదకె సత్య ప్రదోషపు వేళ నాధునిన్

నెయ్యపు బల్కులన్ సఖుని నెమ్మిక పర్చగ బూనినంత

న్నయ్యను గాంచి యామె విరహాతురమయ్యెను సాజమే కదా

 

వాణిశ్రీ నైనాల______తెలుగు తేనియలు

 

చెప్పాలని ఉంది

జాతి భవితకు ఆశాదీపికలైన

భావి భారత పౌరులకు చెప్పాలని ఉంది..!

జీవితం నేర్పిన పాఠాలను..

అనుభవాలు నేర్పిన గుణపాఠాలను..

పాఠ్య ప్రణాళికతో పాటు చెప్పాలని ఉంది..!

చిన్ని మొక్కలను పోలిన

చిన్నారుల మదిలో

తమను తాము మలచుకోవాలనే

తపనను రేకెత్తించి..

భావి జీవన సమరంలో విజేతలుగా

అవతరించేందుకు అనువైన

పాఠాన్ని బోధించాలని ఉంది..!

ఎదుటివారికి ఇవ్వడంలోనే

ఎనలేని ఆనందముందని

చేయూత నివ్వడమే

జీవన ధర్మమని..

అనుభవాలతో బ్రతుకు

అవగతం చేస్తుందని..

చిన్ని మనసులలో చేతన కలిగేలా చెప్పాలని ఉంది..!

జీవితమన్నది పూలబాట కాదని..

కష్టాల కడలీ కాదని..

వివేకం,విచక్షణలతో

విజయ శిఖరాలకు

బాటలు పరచుకోవచ్చునని

చెప్పాలని ఉంది..!

అంతా నాదేనని విర్రవీగినట్లైతే..

అనంతమైన పశ్చాత్తాపం

అంతరాత్మలో మొలిచేరోజు

తప్పకుండా వస్తుందని..,

విజయాలకు గర్విస్తే,

విలయాన్ని సృష్టించే పరాజయం

వెన్నంటే ఉంటుందని..

చెప్పాలనిఉంది..!                 

మతంకన్నా మానవత్వం మిన్న అని..

సమాజ శ్రేయమే వ్యక్తి శ్రేయమని..

మనో ధైర్యంతో సమస్యలపై చేసే

నిశ్శబ్ద యుద్ధమనే

పదునైన  ఆయుధం

జీవన పర్యంతం విడువరాదని..

చెప్పాలని ఉంది..!

ప్రకృతి శక్తులను గౌరవించి..

సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఎరిగి..

అనుబంధాలకు విలువనిచ్చి..

మానవతాదీప్తితో వెలుగుతూ..

మహోన్నతంగా జీవించమని..

వాస్తవ జీవిత పాఠాలను

మనసుకు హత్తుకునేలా

శాశ్వతంగా గుర్తుండేలా..

నేడు గురువుగా శిష్యులకు బోధిస్తూ..

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించి, ఆచరించే

ఆత్మవిశ్వాసపు మనుజ వృక్షాలుగల

సుందర భావిభారత నందనోద్యాన నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఉంది..!!

 

చల్లా దేవిక______తెలుగు తేనియలు


 

నిండైన రూపమ్ము; నిశితమౌ పరిశీల

నమ్ము; సదవగాహనమ్ము తోడ

సరిలేని వాగ్ధాటి; సంకల్ప బలమున్ను

అచ్చెరువును గొల్పు నధ్యయనము;

సహకార భావమ్ము ;సద్బుద్ధి సత్త్వమ్ము;

శిష్టమై వెల్గొందు చిత్తశుద్ధి;

ఔన్నత్యముంజూపు నాత్మ విశ్వాసమ్ము;

మేలొన గూర్చెడు మేల్మి గుణము;

 

ఆటవెలది

అట్టహాస మెరుగనట్టి సచ్ఛీలమ్ము

హితము గూర్చగా మహితముగాను

కమ్ర మానసంపు కస్తూరి వారల

కీర్తి పరిమళమ్ము కెరల వలయు!

 

ఆటవెలది

మంజులముగ నిడుచు మధురమైన నుతులు

సుధలు జిల్క పదము పదము నందు

శివుని సహృదయతయె చిరయశమ్మును గూర్చ

తెలుగు తేనియలిట తేజరిల్లు!

 

ఆటవెలది

జీవన సహచరుని చిగురొత్తు రాగమే

హరితకు నరచేత నందగించి

కలలు పండెనంచు నలర గోరింటగా

శ్రీకరమగు గాత సిరుల తోడ!

 

శ్రీ కస్తూరి శివశంకర్ గారికి

ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలతో...

సోదరి

 

చల్లా దేవిక______తెలుగు తేనియలు

 

 

సమస్య: అయ్యను గాంచి యామె విరహాతురమయ్యెను సాజమే కదా

 

 

ఉత్పలమాల

 

కయ్యపు కేళులన్నిశిని గాటపు టల్కల దవ్వు నుంచగన్

చయ్యని మేల్కొనన్ వెదకె సత్య ప్రదోషపు వేళ నాధునిన్

నెయ్యపు బల్కులన్ సఖుని నెమ్మిక పర్చగ బూనినంత

న్నయ్యను గాంచి యామె విరహాతురమయ్యెను సాజమే కదా

 

వాణిశ్రీ నైనాల______తెలుగు తేనియలు

 

 

చెప్పాలని ఉంది

జాతి భవితకు ఆశాదీపికలైన

భావి భారత పౌరులకు చెప్పాలని ఉంది..!

జీవితం నేర్పిన పాఠాలను..

అనుభవాలు నేర్పిన గుణపాఠాలను..

పాఠ్య ప్రణాళికతో పాటు చెప్పాలని ఉంది..!

చిన్ని మొక్కలను పోలిన

చిన్నారుల మదిలో

తమను తాము మలచుకోవాలనే

తపనను రేకెత్తించి..

భావి జీవన సమరంలో విజేతలుగా

అవతరించేందుకు అనువైన

పాఠాన్ని బోధించాలని ఉంది..!

ఎదుటివారికి ఇవ్వడంలోనే

ఎనలేని ఆనందముందని

చేయూత నివ్వడమే

జీవన ధర్మమని..

అనుభవాలతో బ్రతుకు

అవగతం చేస్తుందని..

చిన్ని మనసులలో చేతన కలిగేలా చెప్పాలని ఉంది..!

జీవితమన్నది పూలబాట కాదని..

కష్టాల కడలీ కాదని..

వివేకం,విచక్షణలతో

విజయ శిఖరాలకు

బాటలు పరచుకోవచ్చునని

చెప్పాలని ఉంది..!

అంతా నాదేనని విర్రవీగినట్లైతే..

అనంతమైన పశ్చాత్తాపం

అంతరాత్మలో మొలిచేరోజు

తప్పకుండా వస్తుందని..,

విజయాలకు గర్విస్తే,

విలయాన్ని సృష్టించే పరాజయం

వెన్నంటే ఉంటుందని..

చెప్పాలనిఉంది..!                

మతంకన్నా మానవత్వం మిన్న అని..

సమాజ శ్రేయమే వ్యక్తి శ్రేయమని..

మనో ధైర్యంతో సమస్యలపై చేసే

నిశ్శబ్ద యుద్ధమనే

పదునైన  ఆయుధం

జీవన పర్యంతం విడువరాదని..

చెప్పాలని ఉంది..!

ప్రకృతి శక్తులను గౌరవించి..

సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఎరిగి..

అనుబంధాలకు విలువనిచ్చి..

మానవతాదీప్తితో వెలుగుతూ..

మహోన్నతంగా జీవించమని..

వాస్తవ జీవిత పాఠాలను

మనసుకు హత్తుకునేలా

శాశ్వతంగా గుర్తుండేలా..

నేడు గురువుగా శిష్యులకు బోధిస్తూ..

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించి, ఆచరించే

ఆత్మవిశ్వాసపు మనుజ వృక్షాలుగల

సుందర భావిభారత నందనోద్యాన నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఉంది..!!

 

చల్లా దేవిక______తెలుగు తేనియలు

 

సీసము

నిండైన రూపమ్ము; నిశితమౌ పరిశీల

  నమ్ము; సదవగాహనమ్ము తోడ

సరిలేని వాగ్ధాటి; సంకల్ప బలమున్ను

అచ్చెరువును గొల్పు నధ్యయనము;

 సహకార భావమ్ము ;సద్బుద్ధి సత్త్వమ్ము;

  శిష్టమై వెల్గొందు చిత్తశుద్ధి;

ఔన్నత్యముంజూపు నాత్మ విశ్వాసమ్ము;

  మేలొన గూర్చెడు మేల్మి గుణము;

 

ఆటవెలది

అట్టహాస మెరుగనట్టి సచ్ఛీలమ్ము

హితము గూర్చగా మహితముగాను

కమ్ర మానసంపు కస్తూరి వారల

కీర్తి పరిమళమ్ము కెరల వలయు!

 

ఆటవెలది

మంజులముగ నిడుచు మధురమైన నుతులు

సుధలు జిల్క పదము పదము నందు

శివుని సహృదయతయె చిరయశమ్మును గూర్చ

తెలుగు తేనియలిట తేజరిల్లు!

 

ఆటవెలది

జీవన సహచరుని చిగురొత్తు రాగమే

హరితకు నరచేత నందగించి

కలలు పండెనంచు నలర గోరింటగా

శ్రీకరమగు గాత సిరుల తోడ!


శ్రీ కస్తూరి శివశంకర్ గారికి

ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలతో...

సోదరి

చల్లా దేవిక______తెలుగు తేనియలు

1 కామెంట్‌:

  1. ఎంత మనోహరం....గోరింటలో ఎన్ని వర్ణాలో....
    అందరూ అన్ని సందర్భాలనూ స్పృశించారు....
    చెట్టాకు రుబ్బి పెట్టిన చందమామంత అందంగా ఉన్నాయి అన్ని కవనాలూ....
    ధన్యవాదాలు మురళి గారు

    రిప్లయితొలగించండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...