6, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక రచనలు , 05 సెప్టెంబర్ 2020, శనివారము

 


ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
గురు పూజోత్సవ  శుభాకాంక్షలు
 

 తరువోజ

 

గురువుయే శిష్యుల గుణముల నెరిగి

      గొప్పభవిత నిచ్చె క్షోణి దేవుండు

తరువుల వోలె సతము నీడ నిచ్చు

      దైవరూపంబైన ధన్యజీవుండు

హరిహరుల సరణి నందు జన్మించి

      హరువునిచ్చెడి దివ్య యవతారమూర్తి

గరువ మెరుగక గగనమణి వోలె

      కాంతి నిచ్చెడి సర్వకాల తేజుండు

          

వెంకట్.సిహెచ్

 *********************************


ఉపాధ్యాయ దినోత్సవం

 

సరస్వతి స్వరూపమైన దేవుళ్ళారా

సరస్వతి నిలయంలో దేవుళ్ళారా

ప్రత్యక్ష దైవాలైన గురువుల్లారా

జ్ఞానభోద చేసేటి జ్ఞాన ప్రభోదకుల్లారా

సర్వేపల్లి వారసత్వ సరస్వతి పుత్రుల్లారా

చక్కనైన చదువు చెప్పే ఉపాధ్యాయుల్లారా

విజ్ఞాన భోద చేసేటి విజ్ఞానుల్లారా

అక్షర మాలను బిక్షగా పెట్టే అధ్యాపకుల్లారా

జీవిత సత్యాలను తెలిపేటి జ్ఞాన జీవుల్లారా

యువత భవిత నిర్దేశించే నిర్ధేశికుల్లారా

దేశ భవితను మార్చే మార్గ దర్శికుల్లారా

అనంత జ్ఞాన బిక్ష పెట్టే అధ్యుక్షుల్లారా

సర్వేపల్లి రాధాకృష్ణ మార్గంలో మసలే సర్వ జ్ఞానుల్లారా

 

వి.వి.శ్రీనివాస్ , షార్.శ్రీహరికోట

****************************************


గురు బ్రహ్మ, గురు విష్ణు

గురు దేవో మహేశ్వరహ

గురు సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః

 

గురు పూజోత్సవ సందర్భంగా గురువులు మాతా పితరులకు వందనములతో.....


ఉపాధ్యాయ దినోత్సవం

 

ఇంగ్లీషు వరదలో కొట్టుకు పోతూ

కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతూ

బ్రతుకుతున్నామని భ్రమిస్తూ బ్రతుకు జీవుడాయని

ఉరకలు పరుగులు పెడుతూ

తప్పక అమ్మచేయినొదలి

తెలియకనే  అమ్మ భాషనొదలి

"అమ్మా చూడాలీ..

నీ ప్రేమలో మళ్ళీతడవాలీ"

అని హ్రుదయాంతరాళంలో

తపన చెందుతున్న తెలుగు బిడ్డలకు

ఏడవకండేడకండి

నేనున్నా నేనున్నానంటూ

చరవాణిలోనే చరిద్దాం

మృతభాష అవుతున్న

అమృతతుల్య అమ్మభాషకు

మెరుగులు దిద్దుదాం

పదాలునేర్చి పాదాలు పేర్చి

పద్యగద్య శుశ్రూషలతో

"తెలుగుపాద"సేవ చేసుకుందాం అంటూ అక్కున చేర్చుకుని

మా జీవితంలో మళ్ళీ

తెలుగు వెలుగులు నింపిన "సూర్యుడు"

భాష తృష్ణ తీర్చతున్న "కృష్ణుడు"

అనునిత్యం వినూత్న ప్రయోగాలు చేసే యవ్వన "కుమార్"

గురువులు

"పూసపాటి కృష్ణ సూర్యకుమార్"

ఆచార్యులకు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో

శిష్య పరమాణువు

 

యల్లాప్రగడసాయి

 ****************************** 



గురు బ్రహ్మ, గురు విష్ణు

 

గురు పూజోత్సవ సందర్భంగా నా ప్రధమగురువులు మాతా పితరులకు

విద్యాబుద్ధులు నేర్పిన సద్గురువులకు వేవేల వందనములతో.....

 

గురువుయనగ వారు గుడిలేని దేవుడు

గుర్తు పట్టి మనకు గుణము నేర్పి

శేష జీవితమున శ్రేయస్సు గోరుతూ

మనమెదిగినయంత-తనియు!తాను!

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

 **************************************************


గురువుగారి దివ్య చరణములకు వినాయపూర్వకముగా ఈ చిరు పద్య సుమాలు

 

పద్య రచనలు చేయంగ  పాఠములను

నేర్పె తనదైన రీతిలో నేవళముగ

పూజ్య గురుని పదములకు పూజ చేసి

మ్రొక్కెదన్ నీ శుభదినమున్ ముదము తోడ

మంచి చెడ్డ దెల్పి మంచి నడత నేర్పు

గురువు చెంత విద్య గుడుపు వాడె

భాగ్యశాలి కాదె; పద్య రీతులు నేర్పె

పూర్తి గాను  పూజ్య పూస పాటి

 

తెలుగుమొలక నుండి తెలుగు వనములోకి

తెచ్చి పలుకు నేర్పె తేనె చిందు

రీతి పద్య కాంతి లీను చుండ చదువు

లమ్మ మెచ్చు మధుర రవళి లాగ

 

రమ, కంకిపాడు

 *************************** 


 

ఎందరో గురువులు అందరికీ వందనములు

ఊయల తొట్టిలో మొదలైన మన ప్రయాణం

ఊపిరి ఆగేవరకు

కొనసాగే ఈ పరిణామ క్రమం లో అను నిత్యం ఎవరో ఒకరు ఎదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు.

ఈ లోకం లోకి వచ్చాక

నాకు మాటలు వచ్చేవరకు

అడగకుండానే

అవసరాలు తీర్చి

అపురూపం గా చూసుకుని

నాకు ఈ లోకాన్ని పరిచయం చేసిన

అమ్మ, అమ్మమ్మ, నానమ్మ

తాతయ్య, నాన్నలు,

బుడి బుడి అడుగుల వయసులో

చేయి కలిపి అడుగులు నేర్పె అక్కా,

నా అల్లరికి తోడై

ఆటల్లో మెలకువలు నేర్పిన

తమ్ముడూ,

బడిలో పలకలు బలపాలు పంచుకుని

పాతవి పగలకొట్టి

కొత్తవి ఎలా కొనిపించుకోవచ్చో

నేర్పించిన అల్లరి నేస్తాలు,

చెట్లెక్కడం

చెరువులో ఈతలు

నేర్పే తుంటరి మిత్రులు,

పరీక్షకు చదవకుండా

జనరంజని పాటలు వింటుంటే

చెవులు మెలేసి

తమతో కూర్చో పెట్టి

చదివించిన

చదువుల సరస్వతులు

నా చెలులు,

చందమామ కథలు చెప్పి

పుస్తక పఠనం

నేర్పించిన పిన్ని

ఉన్నదాంట్లోనే

కాస్త లేనివారికి సాయపడాలి

అని సాయం చేసి

నేర్పించిన

మా యింటి పెద్దలు,

పాటలతో పనిలో కష్టాన్ని

ఇష్టం గా ఎలా మార్చుకోవచ్చో

నేర్పిన తాతయ్య,

బస్సు పాస్ రెన్యూవల్ చేయించుకోవడం

మర్చిపోతే అలా ఎలా మర్చిపోతావ్

పాపా అంటూ

సమయపాలన గురించి సున్నితం గా చెప్పిన R T C కండక్టర్,

యూట్యూబ్ లు అందుబాటు లో

లేని రోజుల్లో

వైవిధ్యం గా వంటలు

చేయడం లో సూచనలిచ్చే

ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు,

నవీన సాంకేతిక

పరిజ్ఞానాన్ని నేర్పించే

నెను కన్న నా బంగారు తల్లులు,

అను నిత్యం సానుకూల దృక్పధాన్ని

నూరిపోసే  నా నెల్లూరు నేస్తాలు,

ఆరు నెలలుగా తెలుగు తేనియల్లో

నిత్యం అక్షరార్చన చేస్తూ

తెలుగు తల్లికి  పట్టం కట్టాలనే

తపన పడే ఈ సమూహ సభ్యుల రాసే ప్రతి అక్షరం నుండి

ప్రేరణ పొందుతునే ఉన్నాను.

మీ సమయం

ఎక్కువ తీసుకోవడం

భావ్యం కాదని

ఇంకా చాలా నేర్పించిన చాలామందిని

గూర్చి ఇక్కడ రాయకపోయినా

వారు మనసులో నన్నంటే ఉంటారు.

 

రమ, కంకిపాడు.

***********************

  


గురుపూజోత్సవ శుభాకాంక్షలు

 

పూజ్య గురుదేవులకు

నమస్సులతో......

గురుదేవా...!!

మీరు.....

అక్షర కిరణాలతో మేలుకొలుపు పాడే బాలభాస్కరులు..

అజ్ఞాన తిమిరాన్ని సంహరించే విజ్ఞానపు కరవాలాలు...

బండరాళ్లను శిల్పాలుగా

మలచగలిగిన

అభినవ జక్కన్నలు...

కటికచీకటి లోనూ కాంతి రేఖలకై అన్వేషించే

ఆశా వాదులు....

విధిరాతను తలదన్ని

మీ ప్రతిభతో తలరాతను

రాయగల గురుబ్రహ్మలు...

మీ అద్భుత మనోనేత్రంతో

మా భవితను దర్శించగల

మహేశ్వరులు...

చదువు సంస్కారాలను

వినయము వివేకాలను

అలుపెరుగక నేర్పించే

ఆదిగురువులు...

గమ్యం వైపు మము నడిపించి విజయతీరాలకు చేర్చే చుక్కానులు...

తప్పులన్ని మన్నించి

కరుణ చూపి కరిగిపోయిన

శీతల హిమగిరులు...

మా హృదయాలలో ఎల్లపుడు ఉన్నతంగా నిలిచిఉండే

మేరుగిరి శిఖరాలు...

మంచితనము మానవీయత తప్ప

కులమత భేదాలెంచని

సంఘ సంస్కర్తలు...

నాస్తికులు సైతము కరములు మోడ్చి నమస్కరించే

ప్రత్యక్ష దైవాలు...

మిమ్ము మించి మేము ఎదగాలని పరితపించి

శ్రమించిన నిస్వార్థపరులు...

జాతికి జవజీవములు గూర్చే జ్ఞాన సంపన్నులైన

భావిభారత

భాగ్యవిధాతలు...

మీ గళం నుండి జాలువారిన మాటలు

మా కెన్నెన్నో రతనాల మూటలు..

మీరు నేర్పిన విలువల పాఠాలు

మా యెదలో నిత్యమూ

ప్రతిధ్వనించే వేదమంత్రాలు..

మీ ఆశీస్సుల పుణ్యఫలం

ఫలప్రదమైన మా జీవితం...

ఎన్ని వత్సరాలు గడిచినా

మా హృదయాలలో మాసిపోని మధురజ్ఞాపకాలతో ఎల్లపుడు నిలిచిఉండే

దేవతా స్వరూపులైన

గురువులకిదే

మహిత వందనం.

 

చల్లా దేవిక.

 *******************


  

గురు బ్రహ్మ గురుర్ విష్ణు

గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై

శ్రీ గురవే నమః

 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు

మూర్తిభవించిన సాక్షాత్ పరబ్రహ్మ

గురువు.

 

మంచి విద్యాబుద్ధులు , సంస్కృతి సంప్రదాయాలు మంచి  నడవడికలు

 నేర్పించి

 

సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో తన విద్యార్థిని నిలబెట్టిన ఆ మహోన్నతమైన

గురువుగారికి

 

ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా శుభాకాంక్షలు

 

డి. నాగమణి

*******************

 


మానవతా విలువల  పునాదిరాళ్లు

విశాల దృక్పధం స్ఫూర్తి పాకుడురాళ్లు

అజ్ఞాన నిశీధిలో వెలుగెత్తి పాడే కీచురాళ్లు

భావితరాలకు ఉజ్జ్వల భవిత చూపే మైలురాళ్లు

ఉన్నత శిఖరాలను అధిరోహింపచేసే మాస్టార్లు

 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

 

కోవూరి

***************


 

నిత్యవిద్యార్థి

 

జీవితం ఇచ్చిన వారు..

జీవించడం నేర్పిన వారు...

విద్యను ఇచ్చినవారు

వివరములను నేర్పిన వారు

ఆటలు నేర్పిన వారు

ఆడించడం నేర్పిన వారు

సంతోషం ఇచ్చినవారు

సంతోషం పంచడం నేర్పిన వారు

అమ్మనాన్న తోబుట్టువులుపెళ్ళాంబిడ్డ

 గురువులు మిత్రులు బంధువులు

నిత్యం ఎదురయ్యే ప్రతి వ్యక్తి గురువే

మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం

ఇది నిత్య సత్యం...

 

అందరికీ నా నమస్సులు

 

కన్నాజీరావు

*******************

 

ఈ ప్రపంచం

ఓ విశ్వవిద్యాలయం. ఇందులో మనకు తారసపడే ప్రతి వ్యక్తి మనకు

ఓ ఉపాధ్యాయుడే.

 

కాబట్టి  ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం మాత్రం మరచిపోవద్ధు.

ఈ స్థాయికి మనం చేరుకున్నామంటే

దానికి కారణం 

మన గురువులే

(మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,

కుటుంబ సభ్యులు,

మిత్రులు,

శ్రేయోభిలాషులు). సాధిస్తాననే నమ్మకం

మనకు లేకపోయినా..

సాధించాలనే ఆసక్తి లేకపోయినా..

ములుగర్రలా మనలను పొడుస్తూ

ముందుకు నడిపి స్తారు.

మన గమ్యం మనకు చూపిస్తారు.

దాన్ని చేరుకునేలా చేస్తారు.  మనలను ఉన్నత స్థానంలో నిల్చోబెట్టిన మన గురువులందరికీ

నా శిరసాభివందనం.

 

 

ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు

 

విజయ

 *********************

 


త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవినమ్ త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవ దేవ.

 

ఉష

 ******************

 

గురుదేవుళ్లుకు నమస్కారములు

 

అడుగడుగునా గురువులు

నేర్చుకుంటే చదువులు

వాడ వాడలా వెలుగులు

అందిపుచ్చుకొంటే కొలువులు

తట పటాయింపులు తగవు

జీవితాలు ముందుకు సాగవు

గురువుంటే దరిచేరదు తిమిరం

ప్రతివారికి ఇది జీవిత సారం

విద్య ఉంటే విలువ వేరు

అది ఎన్నటి కి తరగని మేరు.

విద్య లు నేర్పే గురువు లందరికి

వినయపూర్వక నమస్సులు.

 

మాదిరెడ్డి సురేష్.

 ***********************


జీవితమేలిమలుపుల్లో మనం విజయకేతనాలుగా యెగురుతున్నపుడు గుర్తుకువచ్చే అక్షరం -గురువు,

కీర్తిశిఖరాగ్రభాగాన మన పేరు ఇంద్రధనుసై విరుస్తున్నపుడు

జ్ఞప్తికొచ్చే పదము-గురువు,

మనజీవనకావ్యపు ప్రతిపుటలో సంస్కారం సంతకమై మెరుస్తున్నపుడు

యాదికొచ్చే వాక్యం- గురువు

బ్రతుకుబాల్యపుస్తకం లో దాచుకున్న నెమలీక గురువు

యవ్వనస్వర్గపుటంచుల్లో

జిరిపడకుండా ఆపిన పాఠాల అభయహస్తం-గురువు

మధ్యవయస్సు మాయాపరుగుల్లో

మానవతానీడై మనతో నడిచేది గురువు

వృద్ఢాప్య మలిమజిలిలో

తత్త్వదర్శన తేజం- గురువు

 

అమ్మ లోని ప్రేమను

నాన్నలోని  గారాబాన్ని

తోబుట్టువుల మమకారాన్ని

స్నేహంలోని మాధుర్యాన్ని

తనలో నింపుకొని ....   

బుడి బుడి అడుగుల బాల్యాన్ని

భావి భారతికి వారధిగా మలచే

గురువర్యులకు వందనం...

 

జి. రామ మోహన రావు

 ******************************

  


గురుపూజోత్సవ శుభాకాంక్షలు

తేటగీతి

అక్షర కిరణమ్ముల తోడ నగ్గలించి

మేలుకొల్పును బాడును మేటిగాను

బండరాళ్లను సైతము పటిమ జూపి

శిల్పముగ మార్చు యభినవ శిల్పి యతడు;

 

తేటగీతి

లక్ష్యసాధన కొరకు మెలకువ తోడ

ఛాత్రుల నెపుడు నడిపించు సహనశీలి;

మంచితనము మానవతయె మానితమని

కులమతములరయని గుణ కోవిదుండు;

 

తేటగీతి

తనను మించుచు శిష్యులే తనరు చుండ

ద్వేషమన్నదెరుగకుండ దీవెనలిడి

సంతసమ్ము నొందునతడు సమధికముగ

గురువు కన్న నెవరు మిన్న గురుతు గాను!

 

చల్లా దేవిక.

 *******************

 

శుభోదయం గురువులెల్లరకు

 

తేటగీతి

తెలుగు పదము లాట తెలియజేసెను భళి! /

గణముల మొదలిడెను కవనము, యతి, /

ప్రాస యతుల తెరగు పరిచయమ్మొనరించి /

పొంకమైన రచన ప్రోత్సహించె /

 

తేటగీతి

ఓర్మితో నేర్పు ఛందము, కూర్మితోడ /

తెలియపరచు కిటుకులను, తిరుగులేని /

మా గురువరేణ్యుల కరుణ మాకు శక్తి, /

చోదకము పద్య రచనలు సుంతజేయ /

 

తేటగీతి

పద్య రచన సౌరభముల పంచ నెంచి /

దీక్ష చేకొనె ముదమున దేవతాంశ /

లీల ప్రతిఫలాపేక్షయే లేక తెలుగు /

పొలపు నిలుప, నమస్సులు పూసపాటి! /

కృష్ణ సూర్య కిరణముల సృష్టి సోక /

మొలకలన్నియు వనములై మూర్తినొందె /

 

గురుపూజోత్సవ శుభ సమయమున గురువుగారి పాదపద్మములకు సభక్తికముగ

 

క్రిష్ణ శాస్త్రి

**************** 

 

గేయ రచన

గురు దేవో భవః

గురువులు విజ్ఞాన తరువులు,

గురువులు సామాజిక నెరవులు,

గురువులు ఆధ్యాత్మిక నెలవులు,

గురువులు పాండిత్య కొలువులు...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 **********************************


ఉపాధ్యాయులు – స్ఫూర్తిప్రదాతలు

పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో మన చిన్ననాటి విలువైన జ్ఞాపకాలను మనం ఎన్నటికీ మరువలేము. ఆ రోజులను తలచుకొన్నపుడు మనం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనౌతాం. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో, కళాశాలల్లో ఉపన్యాసకులతో మనం పెంచుకున్న ఆప్యాయత, గౌరవాభిమానాలు అందుకు కారణం కావచ్చు.

మన జీవిత ప్రారంభదశలో వాళ్ళు మనలో వెలిగించిన జ్ఞానదీపాల వెలుగు మన బ్రతుకుబాటను ఇప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంది. బహుశా అందుకేనేమో మనకు స్ఫూర్తి నిచ్చిన గురువులను తలుచుకోగానే, మన మనసు మ్లానమౌతుంది.  అప్రయత్నంగా కళ్ళు చెమరిస్తాయి.

జీవనసాగరయానంలో ఎన్ని ఆటుపోటులున్నా,  మన జీవితనౌకకు దిశానిర్దేశం చేసేందుకు భగవంతుడిచ్చిన దీప స్తంభాల (light house) వంటి గురువులకు ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక కృతఙ్ఞతలు, శుభాకాంక్షలు.

అశ్వని కుమార్

 **************************

 

 "గురువులు" అంటే   "ఇలాంటి వారే" కదా...

 

శీర్షిక ..గురుమూర్తి

ఆటవెలది

ఓర్పు తోడ నీవె యోంకార మునుదెల్పి

శిష్యు లందు కరుణ చెలిమి నిడుచు

కన్న బిడ్డలవలె కనుసన్న లనిలిపి

జ్ఞాన బిక్ష నొసగు కనిక రమున

 

 

వేద వంద్యుడీవు వేదాంత మూర్తివే

జనుల మాయ గప్పి జాడ దెలుప

చింత చేతు నేను చిన్మయ మూర్తిని

ధ్యాన ముద్ర లోన ధ్యాస చేత

 

మేడి చెట్టు మొదట మేలుగా కొలువైన

గురువు నీవె  యనుచు గురుతు గాను

చిత్త మందు  నిల్పి శ్రీపాద చరణాలె

పావ నముగ కొలిచె పాదు కలను

 

వసుధ లోన మమ్ము వాతల్య ముగవారు

తీర్చి దిద్ది నారు తీరుగాను

తెలుగు వనములోన తేనెలూ రుతుమేము

విప్పి మురిసినాము విరుల వలెను

 

అంధ కారము బాపి అఖిలా త్మజుడుగను

తాత్వి కతను బెంచు తత్త్వ వేత్త

యాత్మ నెరుక పరచు యాంగిర సుడుతాను

గురువు బోధ జేసె గురుతుగాను

 

జైశ్రీకృష్ణ . . . .

శ్రీగురు చరణారవిందార్పణమస్తు

 

గీతాశైలజ

********************* 


గోరుముద్దల రుచి చూపి ,చిట్టి చిలకమ్మ పాటలతో చిలక పలుకుల తొలి పాఠం అమ్మ నేర్పి, ఒక మట్టి బొమ్మకి తన ప్రాణం పోసి , ఆ బొమ్మని గురువు చేతిలో పెడుతుంది..

ఉప్పుకి , కర్పూరానికి తేడా చూపి , చిలక పలుకుల బొమ్మతో 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమనే' మాటని వల్లెవేయించి మనిషిని చేస్తాడు గురువు.

పుట్టి మనం ప్రపంచాన్ని చూస్తామంతే , మనకి ప్రాపంచిక వి'జ్ఞాన'మిచ్చి లోకాన్ని మనకి పరిచయం చేస్తాడు ..

ఆ శిల్పి రాళ్ళని మలిచి దేవుడిని చేస్తాడు, మనని ప్రయోజకులుగా మలిచిన వారిని ముమ్మూర్తుల ఆ త్రిమూర్తుల రూపం అన్నారందుకే పెద్దలు.

మా బిడ్డని ఎందుకొట్టావని దండెత్తుకువస్తారని తెలిసినా, 'దండం దగుణం భవేత్' అని ఓ రెండు దెబ్బలేసి ముళ్లదారిన పోతామన్న మూర్ఖుల్ని చెవిపట్టి లాగి కొంచం రాళ్ళుంటాయ్ పర్లేదు ,ముందు పూలతోట ఉంటుంది నడవమని , మావటి వాడిలా  , రాజల్లే తిరుగాడే బంటులా దిశానిర్దేశం చేస్తాడు .  దండలేసినా, పొర్లు దండాలు పెట్టినా తక్కువేమరి..

శిష్యుల్లో దుర్యోధనుడు ఉండవచ్చు గాక, గురువుల్లో ధృతరాష్ట్రుడు ఉండడు , శ్రద్ధ పెట్టే అర్జునుడుకి ప్రతి గురువూ ద్రోణుడే.

ప్రతిఫలమడగని నిస్వార్థ సేవ వారిదే , మనం కాలంతో ఎదిగి ఒదిగి వారి ముందు నిలబడి "బాగున్నారా?" అని అడిగితే చాలు ...తడి నిండిన కళ్ళతో మసకబారిన కళ్ళజోడు సరి చేసుకుంటూ "వారి వారి ఎంత ఎదిగిపోయారు రా ? చాలా సంతోషం , ఇంకా ఎదగాలి " అని మన అమ్మ-నాన్నలానే స్వచ్ఛమైన దీవెనలిస్తారు !

బ్రతక లేక బడిపంతులు అనే నానుడి తప్పు "బ్రతుకిచ్చేవాడే బడిపంతులు " అనేది నిజం ..

కొన్ని బలమైన కారణాల వల్ల , మా ఇంట్లో వారంతా టీచర్లే అయినా వాళ్ళ స్కూల్స్ లో నన్ను చేర్చకుండా ఉన్నాకూడా ,  కొన్ని విధి వైపరీత్యాలు జరగడం వల్ల , కొన్ని బలహీన క్షణాల ఫలితంగా నేను వేరు వేరు స్కూల్స్ మారి నా ఒకటవ తరగతి నుంచి 17వ తరగతి వరకూ నా జైత్రయాత్రలో దాదాపు 30 మంది ద్రోణాచార్యులని ,కలాం లాంటి వారిని కలిసాననే చెప్పాలి...

 

నాకు నచ్చిన వారిలో ముఖ్యులు నాకు అ, ఆ లు నేర్పిన మైలవరపు సావిత్రి గారు ఈవిడ కొడితేనే పలకలు విరిగేవి.. పాఠం చెప్పడం మొదలు పెట్టిందంటే మూడేళ్ల పిల్లకి కూడా మూడో ఎక్కం వచ్చేస్తుంది !!

తెలుగు నేర్పిన వారు శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పద్యాలు పాడుతుంటే ఘంటసాల గారు కచేరి చేస్తున్నట్టే, ఆఖరి బెంచీలో మూలన కూర్చుని కునికిపాట్లు పడుతున్న రంగయ్య కూడా సర్డుకుని కూర్చునేవాడు,ఈయన కుడిచేతి వేలి ఉంగరం ఎడం చేతికి మార్చాడంటే ఎవడి వీపుకో ముహూర్తం పెట్టినట్టే, జస్ట్ వీపున హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టనిపించేది , ఒక్కసారి నా  వీపు కూడా రుచి చూసింది.

 

కంప్యూటర్ సైన్స్ పాఠాలు నేర్పిన వారు గోపాలరావు గారు. శాంతమూర్తి ,మహానుభావుడు , జస్ట్ పాఠం ఆపేసి అందరికేసి చిరునవ్వుతో చూసేవాడంతే 

 

అల్లరి చిల్లరి వేషాలేసే నన్ను చెల్లు రూపాయి గా మార్చిన మా "పద్మక్క" ,నా కజిన్ ,ఇప్పుడు టీచర్ కూడా

 

లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్........ మా శ్రీవారు  చెంగల్పట్ శాంతరాం లా కనిపించే రావుగోపాల్రావ్ ..

ప్రొఫెసర్ అవుదామనుకుని ఇంజనీర్ గా సర్దుకున్నారు  , పెళ్ళైన కొత్తల్లో వంట  పాఠాలు నేర్పి , ఇప్పుడు నాతో పాటూ మావాడికి కూడా రోజూ ప్రైవేటు చెప్పేస్తూ ఉంటారు ,రోజుకో కొత్త గుణపాఠం.

 

బడుద్ధాయ్ కి విద్యా-బుద్ధులు నేర్పి ప్రబుద్ధుడిగా చేసి "ఇదిగో మీ బుద్ధుడు" అని అమ్మ చేతికి భద్రంగా అందించే ప్రతి అక్షరప్రదాతకు ఇవే నా నమ్మాస్సుమాంజలులు.

 

ఉపాధ్యాయదినోత్సవం

 

విష్ణుప్రియ

*******************

 

గురువులకు నా సమర్పణ:

సర్వసాధారణంగా గురువులంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది స్కూల్ / కాలేజీ టీచర్లు.. వాళ్లను దృష్టిలో ఉంచుకొనే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు/ వందనములు సమర్పింపబడతాయి... నా ఎరుక లో జీవన యానంలో తోడ్పడే గురువులు పైన చెప్పిన వారే కాకుండా ముఖ్యు లింకనూ ఉన్నారు... క్రింది భావ కవితలో  నా అభిప్రాయం పంచుకుంటున్నాను...

 

అనంత లోకాల్లో ఏ లోకము నుండో,

దారి తెలియక  ఈ భువికొచ్చినాము,

తొమ్మిది నెలలు మోసి కడుపులో దాచి,

కాచి, కని, పాలామృతము  తాగించి,

ముద్దుగను  గోరుముద్దలు  తినిపించి,

జీవశక్తి మెండు జేసి, మాటాపాటా నేర్పి,

నడక నడత నేర్పి, మన జీవన యాత్రకు

శ్రీకారం చుట్టు తల్లిదండ్రులాది గురువులు.

 

తడి భూముల లాంటి పసి మనసులలో,

జ్ఞాన బీజం నాటి నారు పోసి నీరు పోసి,

మొలకలు చేసి వృక్షములుగను పెంచి,

చూసి ఆనందించు ద్వితీయ గురువు.

 

నిస్వార్థ సేవకు చిహ్నమై అలరారగ,

నేల నీరు నిప్పు గాలి నింగి తరులూ,

పశుపక్ష్యాదులు , త్యాగశీలం నేర్పిన

సమస్త ప్రకృతి నిత్య బోధ గురువు

 

ఈ ముగ్గురు గురువుల పరిచయము

ముదముగ చేసి భవబంధముల పీడ

మాన్పు ప్రణాళిక వేసిన పరమాత్మయే

అవ్యక్తముగ యున్న  పరమగురువు

 

ఆ గురువులందరకు నా భక్తిపూర్వక

వందనములు పాదాభివందనములు


CA కె మల్లికార్జునరావు

 *****************************

 


నేటి కవిత

రచన: కంకటి సవిత,  అంశం: గురువు,   స్వరం: కంకటి సవిత

 

వందనం వందనం వందనమందాం....

వందనీయమైన గురువులకు..

అభివందనమందాం‌...

                   ‌||వందనం||

శిలలవంటి మనలను శిల్పాలుగ మార్చిన..

రాళ్ళవంటి మనలను రత్నాలుగ మార్చినా...||2||

 మౌనమైన మన మనసులలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించిన..

వారికివే ఇవే ఇవే ఇవే వందనాలు...

వందనాలు..హరిచందనాలు...

                  ||వందనం||

 

విజ్ఞానాన్ని పంచేటి విష్ణుమూర్తి అవతారం...

సన్మార్గంలో నడిపించే సదాశివుని తేజం....||2||

భవితకు బాటలు వేసే...

మన భవితకు బాటలు వేసే

పరబ్రహ్మ స్వరూపం...

                        ||వారికివే||

 

గురువే విద్యార్థికి విలువైన పాఠ్యగ్రంథం......

అదే మనకు బాపూజీ ఇచ్చిన ప్రియసందేశం...

తెలియనివి తెలుసుకొని...

తెలిసినవి మరి మలచుకొనీ..||2||

సాగాలి మనమంతా ప్రగతి బాటలో......

                   ||వందనం||

 

కంకటి సవిత, జగిత్యాల

 ********************************

 


సర్వేపల్లి..............................

 

ఒక కవి... ఒక బోధకుడు,

ఒక తాత్వికుడు.. ఒక దార్సనికుడు,

ఉప కులపతి ... తొలి ఉప రాష్ట్రపతి,

తొలి తెలుగు రాష్ట్రపతి,

అతడే అతడే సర్వేపల్లి,

తెలుగు తల్లి కి ముద్దుల తనయుడు,

మహాత్ములకే గురుతుల్యుడు.

హిందూ ధర్మం గురించి ప్రపంచానికి,

ఎలుగెత్తి చాటిన పుణ్య పురుషుడు,

తెలుగు తనం మూర్తీభవించిన భారత రత్నం,

గురు కులాలంకారుడైన  తన జన్మదినం,  

గురువులందరికి  అది ఆదర్శదినం

శిష్యులందరికి అది పర్వదినం......

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

********************************************

 

 తెలుగు పద్యాలు నేర్పుతూ పద్యాలు రాసే అదృష్టం కలిగించిన గురువులు శ్రీ పూసపాటి గారికి శుభాకాంక్షలు

 

తేటగీతి

పద్య లక్షణములు నేర్పి పలుకు తేనె

తెలుగు నాట నెందరికినో వెలుగు పంచె

మకటమాయె సేవలు మీదు మనసు మంచి

గంధము వలె పరిమళాల బంద కవులు

పూసపాటి వందనములు పూజ్యులకును

 

సమూహం లో ఉన్న ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

 

అమ్మ లా లాలించి

నాన్న లా ఆదరించి

బోధన లో తమదైన సైలి తో మెప్పించ్చి

గణితం లో సమస్యలను పర్సకరింప జేసి

తర్కము నెటులుండునో తర్క శాస్త్రం యందు జెప్పి

సామాజిక శాస్త్రమే సమాజమని తెలిపి

తెలుగు లో చందస్సును అందాముగ అందజేసి

ఆట పాటల యందు ప్రోత్సహించి

అజ్ఞాన చీకటిలో జ్ఞానజ్యోతిని వెలిగించి

సన్మార్గమున ముందుకు నడిపించి

వేలు ముద్రని సంతకం కాకుండ జేసిన

ఉపాధ్యాయలందరికి వందనములు

విద్య యొక్కటె గాకను విలువలన్ని

నేర్పి సన్మార్గ త్రోవలో నీతి నియమ

నడట యుంచె నుపాధ్యాయ నందరికిని

వందనము జేతు భక్తీగ వంగి వంగి

ఎం.పద్మలత

 ****************************************


గురువు

గురువు ఆజ్ఞ పాటించిన మేధిలో

గురువును మించిన శిష్యులగుదురు ॥

అజ్ఞానపు తిమిరములు అదృశ్యమై

విజ్ఞానపు కాంతులు ఉదయించగా

వినయముతో వివేకశీలముతోడ

ప్రకాశించు శిష్యుడు ఈ ధరణిపైన ॥ 

 

జగమును నడిపించు జగన్నాధుడైననూ

ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నెంచి

గురువులేని విద్య గుడ్డివిద్యని తలచి

కీర్తినొందె ఏకలవ్యుడు గురువును గైకొని॥

 

గురువు చెప్పిన త్రోవ కరదీపముగానెంచి

అతనిపలుకులే శిరోధార్యముగ తలచి

నడచిన మానవుడు మహనీయునిగా

యశమునొందును ఇహమూపరమూ॥

 

ఓలేటి ఉమా సరస్వతి

************************************ 

 


గురువులుగా నన్ను ప్రభావితం చేసిన ఆచార్యులు

అవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) చదివే రోజులు. కళాశాల మొదటి రోజు: అప్పటివరకు నిక్కర్ వేసుకొని ఒక్కసారిగా ప్యాంట్ తో కళాశాల లో ప్రవేశించడం ఒక అనుభూతి. (ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి ప్యాంట్ వేసేస్తున్నారులే)

సాధారణంగా నాకు మొదటి బెంచిలో కూర్చోవడం అలవాటు. (ఎత్తుని బట్టి అనివార్యం)

పిజిక్స్ క్లాస్ ప్రారంభమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు క్లాస్ చెబుతున్నారు. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తున్నారు. ఈయనగారితో వచ్చిన గోల ఇదే. ముందు బెంచి వారిని టక్కున లేపుతారు. నాకు జవాబు తెలిసిన చెపితే తప్పు అవుతుందేమో అనే భయం. అందరూ నవ్వుతారనే యౌవనారంభ బిడియం తో మౌనంగా ఉండేవాడిని. మౌనమేల నోయి అనే పాట పాడుకోడానికి బాగానే ఉంటుంది కానీ ఇక్కడ మౌనంగా ఉంటే ఆచార్యుని ముఖంలో మారే రంగులు భయాన్ని రెట్టింపు చేస్తాయి. ఆ గాబరాలో జవాబు తెలియకుండానే తప్పు అవుతుంది. ఇక చూడండి ఆచార్యుని ముఖంలో హావభావాలు. అదేంటో మిగిలిన వారికి ఇలా ఉంటుందో లేదో... నాకు ఆ  హావభావాలు లో వంద భావాలు కనిపిస్తాయి. అసలే అప్పుడే కళాశాల ప్రవేశం. ఏదో యవ్వన కువకువలతో ఏమి అర్ధం కాని పరిస్థితి. మితులు గతులు అని స్థితిశక్తి, గతి శక్తి అని ఫార్ములా లని అప్పటి వరకు తెలియని పదజాలంతో తలనొప్పి పుట్టేది. ఇక లాభం లేదనుకొని సార్ దగ్గర ట్యూషన్ చేరిన తర్వాత విషయవగాహన బాగా వంట పట్టింది.

 ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు రోల్ మోడల్. భౌతిక శాస్త్రము ను అవపోసన పట్టిన ఉద్దండ మూర్తి. భౌతిక శాస్త్రము నుండి నైతిక విలువల ను, వ్యక్తిత్వ వికాస నిపుణుడు వలె భౌతిక పరిసరాలలో కి అలా ఎక్కడి కెక్కడికో తీసుకొని వెళ్ళి...  వెళ్ళినంత కాంతి వేగంతో విషయంలోకి తీసుకువస్తారు. ఒక్కసారైనా పాఠ్యపుస్తకములోకి తొంగి చూస్తారేమో అని చూస్తాను. అసలు పుస్తకమే తీసుకు రారు. పాఠ్య బోధన నుండి నోట్స్ ఇచ్చేవరకు అలా అలా అల్లుకుపోవడమే... అలా విన్న పాఠాలతో క్లాస్ రూం లో ప్రశ్న అడిగితే నన్ను అడిగితే బాగుండు అనే స్థాయికి చేరాను.

క్రమశిక్షణ కు మారుపేరుగా చెప్పే ఈ ఆచార్యుని క్లాస్ అంటే నాకు అమిత ఇష్టం. నన్ను అత్యంత ప్రభావితం చేసిన గురువుగా  అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎప్పటికైనా గుర్తుండి పోతారు.

ఇప్పుడు సార్ కనిపించిన అనుకోకుండా ఆ ఆచార్యుని పట్ల గౌరవ మర్యాదలు అపారంగా కనిపిస్తాయి. ఏదైనా పని మీద ఆ కాలేజీ కు వెళ్ళిన సార్ ఎదుట కూర్చోవడం అంటే భయం. ఏమోయి వెంకటేశ్వర్లు కూర్చో అనిన.. అలా కూర్చునే ధైర్యం నాకు లేదు.

 

 ఆ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ లో DIET principal..KPA చౌదరి గారు.ఈ ఆచార్యుని ముఖారవిందం లోకి తొంగి చూస్తే చాలు విద్యా కిరణాలు మన మనోకుహరాల లోకి ప్రవేశిస్తాయి అన్నట్లు గొప్ప తేజస్సుతో ఉంటారు. దాదాపు 140  మంది విద్యార్థులు ఉన్న తరగతిలో చౌదరి గారు సైకాలజీ సబ్జెక్ట్ చెపుతుంటే pin-drop silence. ఇంటర్ లో అంకురించిన క్రమశిక్షణ ఇక్కడ మొక్కై వృక్షములా ఎదిగి శోభితంగా నేడు నేను పిల్లలకు బోధించడం లో ఎంతో ఉపయోగ పడుతుంది. చౌదరి గారి హయాంలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నాము అంటే అదొక గొప్ప విషయం. భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో నా విద్యుక్తధర్మమును నిర్వహిస్తున్నాను అంటే వీరి ఆదర్శ భావాల నుండి పుట్టిన ఉపాధ్యాయుడిని నేనని సగర్వంగా చెప్పుకొగలను. గురుపూజోత్సవం అంటే నాకు ఈ ఆచార్యులే జ్ఞప్తికి వస్తారు.

 

ఇక పద్యాలు నేర్చుకునే క్రమంలో పూసపాటి వారి గురించి చెపితే.. ఏదో పూర్వ జన్మ సుకృతము వలన గురువు గారి కరుణ దొరికింద నుట అతిశయ మేమి కాదు. నాలో ఉన్న ఔత్సహం గమనించి మొలకుల నుండి వనంలోకి డైరెక్ట్ మెట్రిక్యులేషన్ తో కళాశాల ప్రవేశం లా నాకు కల్పించి కొంచెం కఠిన గైహికాలతో తీర్చిదిద్దారు.

 మొదటిసారిగా మధురాక్కర లో ఒక పద్యము వ్రాస్తే ఆ రోజు నాకు వ్యక్తిగతంగా కాల్ చేసి అభినందించడం మరచిపోలేని అనుభూతి.

గురుపూజోత్సవం రోజు వీరిని తలచుకుంటే అదొక దీప్తి నాలో ప్రవేశించిన అనుభూతి కలుగుతుందని తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన శివ గారికి ధన్యవాదాలతో.....

 

నన్ను తీర్చి దిద్దిన గురువులందరికీ పాదాభివందనాలు...

వెంకట్. సిహెచ్

 *******************************

  


మానోమాలిన్యం

 

మనసులో ఏ మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి.

 

ఆ ఆలోచనల ఫలితంగా సత్కర్మలు ఆచరించి మనిషి దైవత్వానికి చేరువవుతాడని, దైవానుగ్రహాన్ని పొందుతాడని వేద సారమైన భగవద్గీత బోధిస్తోంది.

 

కాలుష్యాలతో అల్లకల్లోలంగా ఉండే అంతరంగం ఎన్నో అనర్థాలకు మూలం అనడానికి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలున్నాయి.

 

రామాయణంలో సీతామాతను చెరబట్టిన రావణాసురుడు,

భారతంలో స్వార్థంతో గర్వాంధుడై పాండవులకు సూదిమొన మోపినంత నేల కూడా ఈయనన్న దుర్యోధనుడు.. ..

ఆ కోవలోనివారే.

 

అందుకే మనసు ఎప్పుడూ సత్సంకల్పాలు చేయాలి.

అప్పుడే హృదయం విశాలమవుతుంది.

ఇరుకైన అంతరంగం అపరిశుభ్రంగా మారుతుంది.

 

ఇదే విషయాన్ని తన రెండు పంక్తుల పద్యంలో కబీరుదాసు హృద్యంగా చెప్పారు.

 

" నహాయే ధోయే క్యా హువా, జో మన్‌ కా మైల్‌ నజాయ్‌

 మీన్‌ సదా జల్‌ మేఁ రహై, ధోయే బాస్‌ న జాయ్‌"

 

ఎప్పుడూ నీటిలో ఉండే చేపని ఎంత కడిగినా దాని వాసన పోనట్లుగా,  మనిషి సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని దీని భావం.

 

వ్యక్తికి శరీరసౌందర్యంపై ఉన్న పట్టింపు, శ్రద్ధాసక్తులు.. మనసును ఏ చెడు భావాలూ లేకుండా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకోవడంపై ఉండదని కబీరు పద్యంలోని అంతరార్థం.

 

మనసు పరిశుభ్రత అనేది భగవద్భక్తితో సమానమైన అంశం. భగద్భక్తికి శరీరం ఒక్కటే శుచిగా ఉంటే చాలదు.

 

 మానసిక మాలిన్యం ఉంటే భగవద్భక్తి అంటదు. అందుకే నిర్మలమైన అలోచనలకే చోటివ్వు. వ్యర్థమైన కలుషిత విషయాల్ని మనసులోకి రానియ్యకు’ అంటూ ఆత్మపరిశుభ్రత గురించి ప్రబోధించాడు మహాత్మా గాంధీ.

 

ఓ సందర్భంలో శ్రీరామచంద్రుడు ‘మోక్షసాధనకు ఏమి చేయాలి’ అని వశిష్ఠుడిని అడిగాడు.

 

 అందుకు వశిష్ఠ మహర్షి.. ‘మనసును నిర్మలంగా ఉంచుకోవడమే’ అని జవాబిచ్చారు.

 

 జై శ్రీమన్నారాయణ

శ్రామికులు

 

మట్టి ముద్దలుగా ఉన్న బిడ్డలను

మణి పూసలుగా తీర్చి..

 

అగాధంలోంచి  వారిని

అంతరిక్షానికి చేర్చి..

 

అల్లరి, తుంటరి పనులకోర్చి

తప్పటడుగులను మార్చి

 

అడుగడుగునా  కాచి

అన్నిటా ముందుంచేందుకు  శ్రమించి

 

ఏమీ ఆశించని శ్రామికులు

ఉపాధ్యాయులు

అమ్మ నాన్నలను మించిన దైవాలు

 

కళ్ళు తెరిపించే గురువులు!

 

" వసుధ "

 ****************************


 


సమాప్తం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...