1, సెప్టెంబర్ 2020, మంగళవారం

చిత్రం పై పద్యం - 43, మంగళవారము, 01 సెప్టెంబర్ 2020,

 


శ్రీ విఘ్నేశ్వర నమః          శ్రీ సరస్వతే నమః            శ్రీ గురుభ్యోనమః

శుభోదయం

01, సెప్టెంబర్ 2020, మంగళవారము

తెలుగు తేనియలు

 శీర్షిక : చిత్రం పై పద్యం  - 43

పై చిత్రానికి తగిన పద్యకవిత / వచనకవిత అందించగలరు

                             


 గేయ రచన,

నా లక్ష్యం నీ కంటి లో పడాలని,

నా లక్ష్యం నీ చెవిలో విన పడాలని,

నా లక్ష్యం నీ మది కి చేరాలని,

నా లక్ష్యం నీకు చేరువవ్వాలని....

 గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 *********************************

 

చెలి చెవిలో నా ప్రేమాభిమానం

తెలుప సాధ్యము కాకున్నదేమి నాకు

క్రీడామైదానంలో అవలీలగా నే

గోల్స్ పదులలో చేసినను

చెలి అభిమానం పొంద సాధ్యమగునా నాకు.

వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత..

ఆర్.వి.రమణమూర్తి

 *************************

 భావ కవిత 

 మిత్రమా మిత్రమా!

మగువల మనసు లోతు లెరుగుట

సృష్టించిన బ్రహ్మకైననూ అసాధ్యం

మనసుల శిఖరము లెగురుట

మరి అంత కన్ననూ కష్ట సాధ్యం

యవ్వని లోలకుల రింగు అందుటే

కైపదమైన  నీకు ఆమెను గెలుచుట

అను పగటి కల కూడా అసంభవం

క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్

అన్నారు కదా మగ పెద్దలు ఏనాడో.

 

CA కె మల్లికార్జునరావు

 **************************

 

చలికాలం  లో

చాయ్ లా

 వర్షాకాలం లో బొగ్గులపై కాల్చిన వేడి వేడి మొక్కజొన్న పొత్తు లా

 ఎండాకాలం మల్లెల నవ్వులా

 చెలికాడు నెచ్చెలి   మనసు దోచే

 వెచ్చని పొగడ్తల

ప్రయత్నాలు ఎన్ని చేశాడో

 అతని తీపి తేనె మాటలకు

ఆమె వెన్న మనసు

పులకించి పరవశించి

కిల కిలా నవ్వితే

 అతని మాటల "గోల్" కరెక్ట్ గా చెలియ వలపుల వలలో పడ్డట్టే..

 

ఝాన్సీ

 ***********


 

నా ప్రేమను నీ చెవినేద్దామని నా గుండెను చేత బట్టి బయలుదేరా...

 దారిమధ్య లో...

 చెంపనున్న పెత్తందారు పుట్టుమచ్చ

మన పెళ్ళికి పెద్దవుతానని

హామీ ఇచ్చింది!!

 చెవినున్న లోలాకును సిఫార్సు కోరితే..వగలాడి ఉయ్యాలూగుతూ నాతో ఆడుకుంది...

 చిన్ని చెవికమ్మ మంచిది

కొడుతూ నా గోడు వింది ,

నేనడ్డం కానబ్బాయని ఒట్టేసింది !!

 హరినీలపు కురులు కూడా చిరుగాలి సాయంతో తలలూపి

తనని తాడుగ మార్చి చెవిని చేరమన్నాయ్ !!

  ఎద సందడి చెవిని చేరి

నీ హృదయపు తలుపు తెరిచి

రా ...రమ్మని పిలిచి  !!

నీ మనసు పొదరింటిన

మన పెళ్ళి విడిది చేస్తావని ఆశ...

పెళ్ళి 'బంతులాటలో' నన్ను  గెలిపిస్తావని దురాశ !!

 

విష్ణుప్రియ

 **************

 

సీసము

తొలిపొద్దు పవనంబు చెలువంపు డోలిక

శృతివిపంచికముల కృతులవోలె

కోమలతంత్రుల కూజితంబులలోన

రాగఝఝరులో విరాజితంబు

కర్ణికమ్ములతోడు కమ్మలు కెంపులు

లోలాకు సొగసు విలోలమాయె

మలయమారుతముల సెలయేటి చిరుపాట

వాంఛించు జవరాలు వలపుకొఱకు

 

తేటగీతి 

ఘనఘనారవంబుల మేటి కర్ణికముల

కుందమందార స్వనముల కోరుకొంటి

మగువ మనసు గెల్వవలెను తెగువజూపి

వలపులు, మునిమాపులవేళ వరమునిమ్ము !

 

కస్తూరి శివశంకర్

 *********************

 

నా యదలో దాగిన ప్రేమను

నీ చెవినెయ్యలన()....

నా మనసులో దాగిన మాటను మూటకట్టి,

పూబంతితో మాటచెప్పి,

చెవి దిద్దికి సర్దిచెప్పి,

సంబరానికి సంగీత కచేరి సమకూర్చి,

నా స్పందన కు స్పందించాలని

లోలాకుకు లంగరవేసి,

ఉవ్వెత్తున ఊగితే....

చెలి సుందర సౌందర్య అందెలకు దిష్టిగా....

పుట్టుమచ్చతో బేరసారాలు

కుదిరినప్పుడు...

నేనాడే జీవిత ప్రాంగణలో

నాతో భాగస్వామ్యం కావాలని

కోరి వేసిన బంతి

 

సూర్య తాడిపూడి.

 ************************

 

చెవికిపెట్టినజుంకాలుచెలికి నచ్చి

యాటలాడుతుబంతిని యతడురింగు

నందువేయప్రయత్నిoచునంద ముగను

వేసినట్టిక్షణముననువేడుకేగ

 

లలితారెడ్డి

 ****************

 

మనసుసంద్రం లోని నెచ్చెలి గూర్చిన మాట

చెలియ చెవి చేర్చుట

చిన్న మాట కాదు

పెద్ద ఆట

 """చ్చ"   ఇచ్చునా చిన్న సాయము నాకు

మది మాట

చెలియ చెవి చేర వేయ

 లోలాకుల లలన

పడునెలా లవ్ లోన

ఏల వేయవలెనొ బుట్టలోన..

 

ఝాన్సీ

 *************

 

మధురాక్కరలో...

 చెవిని దరియించె లోలాకు చేడియ ముద్దు తీర

భువిని జవరాలి మదిజేర భూతల మాంత్రికులు

నవల నైజము కొనియాడ నాతురతోన్ముఖులై

చివరకు వదలరు చెలియ చెవిజేర బంతివోలె.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

 *****************************************************************

 

ఎదను  కదిలించిన  వయ్యారమా

ఎదుట నిలిచిన  నయగారమా

పొంచి పొంచి  పొరలిన  ఆశల అందలమా

 లలిత లలిత సవ్వడులే వినిపించెగా

నీ  కర్ణాభరణములే కరుణ  తోడ,

నా గుండె గడియారమున్నే కదిలించె గా

ఆగిపోయిన ఊపిరులే తిరిగి రాగా

గుండె  లోలకం  కొట్టుకుంది  నీ

నామ జపమే శ్వాసగా,  ఆశ్వాసగా

 ఊసులన్ని  బాసలై  నీ  చెవుల

గుసగుసలాడగ అడుగు పడదు,

మాట  రాదు,  గుండె  గొంతుకలోన

కూరు కున్నదే,  వెలికి  మరి రాకున్నదే

 యెటుల  తెలుపను  నా ప్రేమ

ఏమి తెలుపను   భామ

మలయానిలునే కోరితి,  నా మూగబాసల

ఊసులన్నీ చెలి  చెవుల  చేర్చగా,

చిరు సవ్వడుల అలజడులే  చెవి నున్న

లోలకులే  లలిత లలితముగ వూగుతూ

తెలిపినదియే  ముదముగా ఆమోదమ్మునే

 

అవళూరు సీత

 ******************


క్రీగంట విరిసిన చూపులు

ప్రియుని రాకకై దోబూచులాడే

 అధర మధువు కై చెక్కిలి చుక్క ఎదురు చూసె

 కడలిలోని తరగల వలె గాఢ పరిష్వంగము నకు ముస్తాబయ్యే

 తనువు తపించిపోయే  మనసు  పులకరించిపోయే

 ఊరించే సైగలతో  చిలిపి చిరునవ్వుతో

మిలమిలలాడే  నెలవంకలోలకి ధరించి

 ఎదురు చూసిన ముగ్ధ మనోహర

ప్రేయసి కొరకు

 పూ బంతిని చేతబూని‌ ఆగ మేఘాలతో

తరళి వెళ్లె వెన్నెల రేడు ప్రియుడు

 

డి. నాగమణి

********************

 

లోలాకుల్లారా

మీ జన్మ ధన్యం

మీ అదృష్టం ఆకాశమంత

మీ సౌందర్యం సుందర కాండంత

 స్వప్నంలో కదలాడిన,

సుందరి వదనమును కన లేదు కానీ,

నీవు కనిపించావు   కవ్వించావు,

అవ్యక్త మూర్తిపై ప్రేమ రేపావు.

 మిల మిల మెరిసే నీ మేని కాంతులు,

నన్ను కమ్ముకున్న వింత హాయిలో,

నీ యజమాని యువరాణి చూపుల కై,

నా మది కలవరించేను పరితపించేను.

 నా ఆరాటము ముద్దుగా గోళం చేసి,

నీకు అందిస్తూ అర్థించు చున్న వాడ,

అల్లన  మెల్లన ఊరడిల్లుతున్న వేళ ,

ఆమెకు నా ప్రణయ వార్త వినిపించి,

నాపై మరులు గొను నట్లు చేయవా,

నిన్ను పూజించెద  నిను సేవించెద..

 

CA కె మల్లికార్జునరావు

 ***************************

 

కర్ణాభరణమా కర్ణ శోభితమా

 కవితా సమూహమా కమనీయ కావ్యమా

 రంగుల వలయమా రమణీయ దృశ్యమా

 సౌందర్య రూపమా సాగసులు నీ సొంతమా

 కర్ణాభరణము జూడ మదిలో సరిగమ

 ముఖారవిందమా మమతల సంద్రమా

 చిలిపి సవ్వడి చేసే చెవి లోలాకమా

 

వి.వి.శ్రీనివాస్

 ******************

 

సీసము 

 అమ్మ భుజమునెక్కి యాడుకొనగ నాడు

కమ్మలు నూగగ కధలు వినగ

యవ్వన ప్రాయమున్ జవ్వని జుంక్కీలు

తళుకున మెరిసెను తలుపు లందు

తనయ లోలాక్కును తనివితీరగ జూడ

శుభమును కోరగ సుగుణ రాశి

ముచ్చట గొల్పేను మూడు తరంబుల

నాబరణము జూచి యరుదు గాను

 

ఆటవెలది 

 నగల పేర్లు మారు నతివ ధరించగ

బంద మొకటి యుండు బలిమి తోడ

నాభరణము గాదు నవరసముల నెల్ల

తెలుసు గొనగ వచ్చె తెలుగు నాట

 

ఎం.పద్మలత, విశాఖపట్నం

 *********************************

 

ప్రతి ఒక్కరిది.....

విజయం కోసం ఆరాటం

అందనంత ఎత్తున ...

చేరలేని లక్ష్యం అయినా ప్రయత్నం

తను ....

అందనంత ఎత్తు న 

ప్రేమకై వలచి 

మగువకై ఆరాటం

అచ్ఛాదన లేని 

పురుషుని పోరాటం

మగని ఆలోచన ముందు 

మగువ ఎప్పుడూ ......

అందనంత తారాతీరం 

మదిన మెరిసిన 

ఆలోచనా తరంగం......

లక్ష్యం వైపుకు గురి చూసి 

మగువ మనసు దోచుకోవాలనే ప్రయాణం

శంఖం లాంటి మెడ దాటి 

ఎగసిపడే అలలు లాంటి 

ముంగురులని సవరించి

నీకై నాలో నిక్షిప్తమైన ప్రేమని చాటని.......


-కోవూరి

********** 


#లోలాకులు        లోలాకులేంచేస్తాయని అనుకునే వాణ్ణి...

మహిళామణుల చెవుల గాలినూగేనో..

చూసిన మగవారి మనసులాగేనో..

మహా ఐతే చిత్రకారుల కుంచెనావహించేనో అని..

నిన్నటి తెలుగు తేనియలలో డోలాయమానం చూసాను..

ఒకటి తెలుసుకున్నా..

హమ్మో...

 ప్రపంచాన్నొక్క ఊపు ఊపేది లలనలే కాదు సుమీ... 

ఈ లోలాకులుకూడా తక్కువకాదు...

ఆ ప్రకంపనలు ఇంకా ఆగలేదు చూడండి ...

 

కన్నాజీరావు 

***********  


కందము 

ఈలలు వేసిన కలములు 

లోలాకుల డోలికల పలుకరింపులతో  

హేలానీహారికములు 

గోలగ మధురోహలన్ని కూజితమాయే !! 

 

శివశంకర్ కస్తూరి 

 ****************** 



క్రీడాకారుని వలచిన జవ్వని తన సఖుని మెప్పించుటకై ముచ్చట గొలిపే తన రూపమును లోలాకులుగా ధరించి ప్రేమను తెలుపుతుందనెడి భావనగా  నా ప్రయత్నం


సీసము 

యవ్వన ప్రాయంబు నతివ జేసెడి చిరు

       సందడి తెలుపంగ సంతసంబె

క్రీడాపరుని గోరి గెలవ నెంచెడి తృష్ణ

       తోడ యీప్సితముగ దోస్తు కొరకు

లోలాకులూగంగ లోలాక్షి వైవిధ్య

     భరితముగ హితున్కి వలపు తెలిపె!

ప్రియరమణి యమిత ప్రేమ తెల్పతరమా!

       ఆటగాని సుకృతమబ్బురంబె

తేటగీతి 

వలపు తెలిపెడి సుందరి ప్రణయ భాష

కవి తెలుప గలడె? సఖుని కరుణ తోడ

చెలువ సౌందర్య మెల్లను జిలకరింప

బాపు చిత్రంబు కనిపించు పావనముగ.


 వెంకట్. సిహెచ్

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...