7, సెప్టెంబర్ 2020, సోమవారం

దత్తపది - 36 - తెలుగు - వెలుగు - తేనెలు - వానలు 07.09.2020

 

దత్తపది -  36  -  తెలుగు -  వెలుగు -  తేనెలు -  వానలు     ఈ పదములతో, పద్య కవిత / వచన కవిత  అందించగలరు


 

 

వచన కవిత

 

తుంగభద్ర తీరాన

హంపీ నగరాన

కృష్ణరాయ ఛాయన

భువనవిజయం నిలిచె

తెలుగు వెలుగు

చంపావతి నదీసమీపాన

కళింగ విజయనగరాన

ఆనందగజపతి సాక్షి గా

తెలుగుభాష కురిపించె

తేనెల వానలు ధారాపాతంగా


ఆర్.వి.రమణమూర్తి

 

 *************************** 

 

సరససుందరధార సౌమిత్రి తెలుగు

సాహిత్యసౌగంధ సౌశీల్యవెలుగు

పలకరిస్తే చాలు పారేను తేనెలు

పల్లవిస్తే వాలు యెదవలపు వానలు!

 

రాంమోహన్ నిజామాబాద్

 ********************************

 

నిన్నటి మన ఆత్మీయ పరిచయ వేదిక ఇతివృత్తంగా నేటి దత్తపది పదములతో చంపకమాల

 

చంపకమాల

తెలుగుపదమ్ము సౌరభము

          తీయని తేనెల ధారలైనచో              

లలితసుభాషితంబుల

        కులాసల సందడి తీరుజూడగా        

పలుకులపల్లవంబులకు

        వల్లరిలెన్నియొ కూర్చినట్లుగా

కలిసిన మానసంబులకి

              కమ్మని కైతల వెల్గులీయగా

కలికి మనోజ్ఞమైన

     కలకంఠిని జూచిన వ్రాయుశక్యమా ??         

 

కస్తూరి కవనం

******************

 

తెలుగు తేనియలు

మొన్నటి ఎండ వెలుగు చూసి

వానాకాలం పోతున్నదని బాధవేసింది

నిన్నటి సాయంత్రపు తెలుగు తేనెల వానల రాక నాకు ఆహ్లాదాన్నిచ్చింది...

వానాకాలం వచ్చేది వర్ష ఋతువులోనే..

తెలుగు తేనెల జల్లు మాత్రం నిరంతరం...

 

కన్నాజీ రావు   

******************* 

 

గేయ రచన,

 

తెలుగు భాషా సొబగులు,

వెలుగు ను చిమ్ము నలుదెసలు,

తేనెలు ఒలుకు మాధుర్యం,

వెన్నెల వానలు కురిపించు చల్లదనం.....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 ****************************

 

కందము

 

సుధలు  గురిపించును తెలుగు

గదిని వెలుగు నింప దీప కళిక ను తోడున్

వదనమునకు శుభ తిలకము

మధురము కవనముల వాన మనసుకు   విందే

 

డా.సతీష్

 ***********************

 

డా సతీష్ గారు, బహు బాగు..   మీ స్పూర్తితో అవే ప్రాసాక్షరాలతో ఒక కందం 

 

కదళీపాకంబులవలె 

మదినే దోచంగ తెలుగు మాధురి హరువుల్

పదలాలిత్యపు తేనెల

సుధలీ వానల్ ! మధురపు చొక్కపు వెలుగుల్

 

శివ శంకర్ కస్తూరి

 ******************************

 

 రంగుల మయూరివా కొండల జారే  యేరువా ?

 సప్తవర్ణ హరివిల్లువా సప్తస్వర రాగానివా ?

  ఉదయపు వేళలో... మా సంబరాల హేలలో..

  తెలుగు వాకిట్లో  నీ వెలుగు రూపమొచ్చె

 మా తేనెల మనసుల్లో  మధు వానలు కురిపించగ  ఉండిపోవా...

నా మనసును నువు మెచ్చి   నీ భంగిమకి దీర్ఘమిచ్చి

'నా' దానివై..........       

( భంగిమ తెలుగు అక్షరం '' లా అనిపించింది

 

విష్ణుప్రియ

 *******************************

 

 వెలుగుల తెలుగు

 

సరళము, సుకుమారము లయిన 

తెలుగు పదములు, పద్యములు,కవితలు,

శతకములు,గీతములు,కావ్యములు...

చదువు చున్న  కొలదీ,

చదువు కొన్న కొలదీ  అనిపించున్, తినిపించున్, కురిపి పించు న్ , చూపించున్

వెలుగు లు, తేనెలు,వానలు !

 

మురళీకృష్ణ

 ******************

 

తేటగీతి

 ధీటుగనిలన్ వెలుగు మేటి తెలుగు భాష

తేనె వానలు కురిపించు తీయనైన

తల్లి భాష పలుకువాడె ధన్యుడౌను

వెలుగు పూలు పూయింపగన్ వేడ్క తోడ

రమ కంకిపాడు.

 *******************

 

హోరు వానలు కురియంగ నదులు పొంగిపొరలి కడలిని చేరంగ

 

అలల సవ్వడులలో

వినిపించు సప్త స్వర సంగీత ఝరులు

మన తెలుగు పదాలు వెలుగును

తీయ తేనియ మధురిమలను రుచిచూపె.

 

డి. నాగమణ

 *********************

 

మధురాక్కర

 

తెలుగుతేనియ బృందమిదియె, రమ్యకవనంబులే

వెలుగు దివ్వెలై వెలుగంగ వెన్నెల ధార లెన్నో

వొలికి తేనెల వానలు యొడలంత కురియగనే

తెలుగు భాష వైభవముగ దీప్తి వొందె ప్రథితమై

 

మరొక పూరణ

 

సీసము

 

ఏమి నోము ఫలమో! యెంత సుకృతమో! తె

      లుగు బిడ్డగ జనయించి గుణ మెరిగి

భవ్య వెలుగులద్ది ప్రాభవంబున్ కల్పిం

      చిన కవనంబు రుచి కనుచుంటి!

తేనె లక్షరముల తెలుగు, కవుల ఘంట

       ముల నుండి ప్రవహించి మోహనముగ

కావ్యరూపము దాల్చె, భవ్య రీతిగ మధు

        వుల వానలు కురియ తెలుగుతల్లి

 

తేటగీతి

 

పులకరించి తెలుగు భాష భువన మందు

కీర్తి వొందె; ఘనత నిచ్చి మూర్తు లెంద

రో యమరజీవులయ్యితిరో! విబుధుల

ప్రౌఢిమ కివియే పాదాభివందనములు!!

 

వెంకట్. సిహెచ్

 ************************

 


 

 

ఆహ్వానించి ఆదిశక్తిని, అందరి మదిలో భక్తి భావన నెలకొల్పి, సంగీతామృత ధారలు కురిపించె !

 

తేటగీతి

 

తేనె  లూరించుమాబాస తెలుగు బాష

అక్షరములు నక్షయముగ నమృత ధార

లు కురిపించు, మధుర కైతలు కురి పించె

తేనె వానలు, మురిపెము దీర తీపి

తెలుగున తడిసి పోయితి, వెలుగు నిండ

 

అవళూరు సీత

 ********************

 

మన తెలుగు తేనీయల గణము గుణ గానము...

నా ప్రయత్నం కందంలో...

 

తెలుగు తేనీయ వానలు,

వెలుగు ను నింపుచు తురంగ వేగము తోడన్

కలుగున దాగిన విడువక

విలువల తేనెలు యెసంగు విశిష్ట గణమే.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

 **************************************************

 

మొన్నటి ఎండ వెలుగు చూసి

వానాకాలం పోతున్నదని బాధవేసింది

నిన్నటి సాయంత్రపు తెలుగు తేనెల వానల రాక నాకు ఆహ్లాదాన్నిచ్చింది...

వానజల్లు వచ్చేది వర్ష ఋతువులోనే..

తెలుగు తేనెల జల్లు మాత్రం నిరంతరం...

నా చిత్రం జోడించి మరోసారి

 

కన్నాజీరావు

 *********************

 

తెలుగు వారలనగ నెవరు?

తెల్లవారి వెలుగు లా ప్రగతిని పంచువారు,

సుందర కవితలల్లు బలిమి కలుగు వారు,

మనసున మెండుగ తేనెలు   కురియు వారు,

నిత్యమూ నవ్వుల వానలు వర్షించు వారు,

పంచ కట్టు, కోర మీసంతో  మెరియు వారు,

ప్రశంస పదములకు భోళ శంకరులగు వారు,

ఆరంభశూరులన్న  నిందలు మోయు వారు.

 

CA కె మల్లికార్జునరావు

***************************** 

 

ఉత్పలమాల

 

తేనెలు సోనలం దెలుగు తీయని పొంకపు పద్య శోభలౌ

వానలు కుర్వగన్ మురియ వాణియె వేచెను యమ్మ భాషకై,

పూనిక కావలెన్ వెలుగు పూవులు గాంచగ వాంగ్మయంబునన్

కానుక కారె సాహితి ప్రకర్షను బెంచెడి పండితోత్తముల్!

 

వాణిశ్రీ నైనాల

 *****************************

  

 కందము

 అనువుగ తేనెల వానల

ననవరతమ్ము కురిపించ నభిరుచి తోడన్;

తనరగ వెలుగుల బంచుచు

కనువిందయె నిటను తెలుగు కవితా ఝరియే!

 

చల్లా దేవిక.

************************** 

 

తెలుగు వెలుగు తేనెలువానలు

 

తెలుగు అంటేనే తెగులు అనే

కలి కాలంలో

మన శివ గారు

 తెలుగు మన జీవితాలకు వెలుగంటూ  కస్తూరి సౌరభాలు వెదజల్లారు.

తెలుగు తేనీయల సమూహంలో

మన గురువు  పీకే ఎస్ కుమార్ గారు మకరందాల మధువును పంచారు

మకరందాల మధువును గ్రోలి

సమూహ సభ్యులు

తెలుగు తేనె వానలో తడిసి మురిసి ముద్దయ్యారు

తెలుగు తేనెల సౌరభాలను

గుమాళింప చేశారు...

 

వి. విజయ

 ***************************


 

లోక భాషలందు లెస్స మన తెలుగు

ఆదికవి మొదలు ఎందరో కవుల

కలముల సత్తా చూసినది మన తెలుగు

లెక్కకు మిక్కిలి ప్రబంధ కావ్యముల

నవరసములు పండించినది తెలుగు

వీరగంధం పూసుకుని విప్లవముల

బాట లేసి వెలుగు చూపినది తెలుగు

అక్షర మక్షర మునందు భ్రమరముల

తేనెలు మెండుగా నింపినది తెలుగు

రచయితల పాఠకుల శ్రోతల మదిల

వెన్నెల వానలు కురిపించినది తెలుగు

 

CA కె మల్లికార్జునరావు

 *********************** 

 

దత్తపది

 

పెక్కు ప్రశంసలు అందుకొన్న నా బాష తెలుగు

తేట తేనీయలు దానికి ఇచ్చు చున్నది వెలుగు

తేనెల వానలకు సంతోషంతో నా మదిపొంగు

 

ఉష

 ************


 

తేటగీతి(పంచపాది)

 

ముదముతోటి తెలుగు న్ముచ్చటించ

పూల వానలై  కురియగ పలుకులు మధు

రమగు భాష తేనీయ మైమధుర సుధలు

పంచి కధలు కవితలని పదిగురికిని

భావి భాలలకు వెలుగై బాట చూప!

 

లలిత.దీక్షిత్

 ********************

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...