10, సెప్టెంబర్ 2020, గురువారం

కవిసమ్రాట్, కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 125 జయంతోత్సవము

 

10 - 09 - 2020

 మిత్రులారా నేడు ఈ శతాబ్దపు మహాకవి, కవిసమ్రాట్, కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత   శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 125 జయంతోత్సవము...

ఆయన సాహిత్యం పరిచయం లేని తెలుగువాడు లేడు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

 

నేడు ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ, తెలుగు భాషాభిమానులూ, కవులూ, సాహితీవేత్తలూ అందరూ వారి గురించి మీకు తెలిసింది వ్రాయండి.. తెలుసుకుని మరీ  వ్రాయమని విన్నపం.

దత్తపది పదములు (అవసరమైతే ఈ పద ప్రయోగం దత్తపది లాగా ప్రయోగం చేయవచ్చు)

(విశ్వనాధ - కల్పవృక్షం - వేయి పడగలు - ఏకవీర)

 నేడు ఆసాంతం ఆయన కవితా వైభవాన్ని పంచుకోగలరు.


*___________*___________*____________*___________*  


కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ:
వీరి గురించిన కొన్ని విశేషాలు:

 

1) జ్ఞానపీఠ అవార్డు:

 "As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare “range” Mr Sathyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene."

అత్యున్నత సాహిత్య పురస్కారం  “జ్ఞానపీఠ”  అవార్డు అందుకున్న తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇచ్చిన  జ్ఞానపీఠ అవార్డు పత్రం పై వ్రాయబడిన ఆంగ్లేయ పదాలు అవి.

 2) 20 వ శతాబ్దములోని ఆంధ్ర  సాంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కైన వీరు  వ్రాయని సాహిత్య ప్రక్రియలు లేవు .  వీరు రాసిన రచనలన్నీ కలిపితే రమారమి లక్ష పేజీలు ఉంటాయి.

 3) “గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది” అన్న  జి.వి. సుబ్రహ్మణ్యం గారి మాటలు వీరి విలక్షణతను తెలుపుతాయి. 

 4. రామాయణ కల్పవృక్షం : ఇది వాల్మీకిని అనుసరించిన రామకథే అయినా   చాలా చోట్ల తన సొంత ఆలోచనలతో మార్పులు చేసారు వీరు .  ఉదాహరణకు, వాల్మీకి కైక  కొడుక్కి రాజ్యం సంపాదించి పెడదాం అనుకునే స్వార్తపరురాలు . అందుకు ఎంతకైనా వెనుదీయని ఒక తల్లి.. అయితే , విశ్వనాథ వారి కైక ఒక మహా మనీషి. ధర్మరక్షణా కోసం  తెలిసి తెలిసీ అపకీర్తిని మోయుటకు  అంగీకరించిన పుణ్యవతి. ఈ రహస్యం ఆమెకూ, రామునికీ మాత్రమే తెలుసు.  ఈ తేడాకు కారణం ఒక్కటే. వాల్మీకి రాముడు ఒక గొప్ప మనిషి , విశ్వనాథ వారి రాముడు సాక్షాత్తూ భగవంతుడు.

 కారణజన్ముడైన విశ్వనాథ వారి గురించి పై నాలుగు మాటలు పంచుకొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..

CA కె మల్లికార్జునరావు. 

***************************** 


కిన్నెర నృత్యము

 

జిలుగు టందియలతో

కులుకు క్రొన్నడలతో

వెలది కిన్నెరసాని

పలుత్రోవలుగ బోయి

తెలిపూల తేనెవాకలు వారగాచేసి

తెనుగు వాగై పారెనే నెత్తావి

తెనుగు పాటలు పాడెనే.

విశ్వనాధ వారి.కిన్నెరసాని పాటల  నుంచి సంగ్రహించడమైనది

కన్నాజీ

************** 


ఆటవెలది

 వేయి మాట లేల వేయిపడగలందె

జూపె తెలుగు నవల  శోభ నంత

జ్ఞాన పీఠ మొకటి జాతికిచ్చెనుచాలు

విశ్వ నాధుని ఖ్యాతి విశ్వ మెరుగ

 

రమ,కాంకిపాడు. 

*********** 


విశ్వనాధ వారికి పకృతి మీద, నదీమ తల్లులు మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ ఎన్నో పద్యాలలో చాటుకున్నారు. నేడు నాకు బాగా నచ్చిన పద్యాలు కొన్ని అందిస్తాను   

 

గోదావరీ పావనోదకంబుల తరం

       గాలపై నౌకలుయ్యాలలూచి

అరికంఠరక్తచిహ్నములు పోవుటకునై

          పెన్నానదిని కత్తిపొన్ను కడగి

అరినిషూదనకార్యమందు గల్గిన తాప

        మడపఁ గృష్ణాపగయందు మునిగి

తుంగభద్రాసముత్తుంగరావము రిపు

              శ్రీభేదకముగ ఘోషింపజేసి

 

మాటిమాటికి దెసలెల్ల మాఱుమ్రోగ

గడగడవడంకి దిక్కు లుగ్రతఁ జలింప

శత్రుల హృదంతరమ్ములు సంచలింప-

విశ్వమునదించె నాంధ్రుల విజయభేరి

********** 


కవి సమ్రాట్ బిరుదాంకిత కళాప్రపూర్ణ పద్మభూషణ్ స్వర్గీయ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి పాదపద్మములకు నమసులతో.


 సీసము

విశ్వనాథ యితండు వేయిపడగల తొం

      గలి బట్టి తెలుగు నాకమున నిలిపె

కల్పవృక్ష మనెడి ఘంటము బూని క

         విత ఝరి వొలిగించి న్వేల్పుడితడు

మధ్యాక్కర శతక మాధుర్య మెరుగ ప

         రచిన సమ్మోహన రంజకుండు

ఎన్నో రచనలతో ఏకవీరు డయి తె

         లుగు వన్నె లద్దిన లోకజ్ఞాని

 

తేటగీతి.

పాత్ర చిత్రణవైవిధ్య పండితుండు

"ఆంధ్ర పౌరుష" మెరిగించి నద్భుత కవి

"జ్ఞాన పీఠ అవార్డు"యే సంతసించి

విశ్వనాథ జెంత జేరి మురిసి విశ్రుతమయె


వెంకట్. సిహెచ్ 

********** 

తేటగీటులు - వెంకట్. సిహెచ్

1
కథ రచింపగ శోభిల్లె కావ్యము వలె
నవల వ్రాయగ వెలుగొందె కవన సుధగ
పద్యము రచింపగ నది ప్రబంధ మయ్యె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ


 2
వ్యంగ్య ధోరణి, హాస్యపు వాడియైన
పదముల ప్రయోగముల తోడ వైభవంబు
తెచ్చి భాషకు వెన్నెల దీప్తి నిచ్చె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

3
వేయి పడగల నీడలో విశ్వనాథ
వీర పూజ చేసిన ఏకవీర నీల
పెండ్లి చేసిన మా స్వామి వేన రాజు
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

4
వాహిని గమనమెరిగి పాట వ్రాయ
వంపుసొంపుల ద్వీపిని భావమంత
కన్నె కిన్నెరసానియై ఘనత నిచ్చె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

5
శిష్యునిగ చెళ్లపిళ్ల ప్రసిద్ధి నిలిపి
నాంధ్ర భాష చేవ నుడివి నమృతమూర్తి
యద్భుత ప్రతిభకు మురిసె నాంధ్ర జనులు
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

6
పద్య కావ్య సాహిత్యమే పాటవముగ
సలిపి సంప్రదాయ కవిత్వ శక్తి జూపి
తెలుగు భాష గరిమ తెల్పి  విలువ పెంచె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

7
మగువ శక్తినెరిగి వారి మహిమ చాటు
నట్లు కవితాఝరి సలిపె నబ్బురముగ 
నమృత మూర్తుల మానసమందు నిలిచె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

8
చరిత తెలిపెడి కవనంబు శక్తి జూడ
జ్ఞాన సంపద నంతయు శారదాంబ
యిచ్చి యిలకు పంపించినె యిమ్ముగాను
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

9
వేయిపడగల కవనంబు విస్తృతి కని
జ్ఞానపీఠ అవార్డు జేచాచి జెంత
చేరి ఖ్యాతి నొంద తెలుగు చెంగలించె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

10
మధుర మధ్యాక్కర శతక మవ్వమెరిగి 
కేంద్ర సాహిత్యపు యవార్డు కేకరించి
విశ్వనాథ యందు నొదిగి విశ్రుతమయె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

వెంకట్. సిహెచ్

********************

 

 

జ్ఞానపీఠమతను తేనెల తెలుగుకు

కల్పవృక్షమతను కవనమునకు

వెన్నెల పలుకులకు కిన్నెరసానియౌ

వేయిపడగలతనె! విశ్వనాథ!

 

నేడు కవిసమ్రాట్ విశ్వనాథ జయంతి!....  రాంమోహన్ నిజామాబాద్

 

కవిసమ్రాట్ విశ్వనాధ వారిని  స్మరించుకుంటూ

సీసము

 

కల్పవృక్షము నీడ కమ్మని పద్యముల్ నేర్చుకొంటిమి మేము నేర్పుతోడ  

వేయిపడగలందు విప్పారు భావార్థ  దీప్తిలే  గుండెలో తేజరిల్లి        

నవలేతిహాసముల్ కవనముల్ పూయించె తెలుగుతోటలలోన తీయగాను  

శతకసౌరభముల చందనమందించె  విభవంబు వాక్కులై విశ్వనాధ  

 

ఆంధ్ర పౌరుషముని జూపి యశము తెల్పి    

హొయల కిన్నెరసాని మహోత్తరంగ

వైభవంబులు జూపంగ వాంఛితముగ

వివిధరీతుల శ్లాఘింప విశ్వనాధ  !    

 

కస్తూరి శివశంకర్

************ 


శీర్షిక:విశ్వనాధుని విశ్వరూపం

గీతాశైలజ గారి తేటగీతులు 

1

విశ్వనాధుని వృక్షము విశ్వమంత

ఏక వీరగ నిలిచెను ఎదురులేక

వేయి పడగలు రాసిన విజ్ఞుడితడు

కల్ప వృక్షముగ వెలిగె కవనఱేడు

 

 2

విశ్వనాధుని రచనలు విలసితముగ

ఆది దేవుని పూజను ఆత్మ మీర

చేసి కొలిచెను శంభుని చెంగలించి

శతక మాలను వేసెను శర్వునికిని

 

 3

పాత్రచిత్రణ చేసెను ప్రజ్ఞగాను

సంప్రదాయసాహితికిని సాంబుడితడు

వేయి పడగల కావ్యము విశ్వవేత్త

వ్రాసి చూపించె జగతికి వాస్తవముగ

 

 4

శిల్ప చాతుర్య మునుచూపి చిత్రముగను

భావ కవితలు రాసిన భవ్యుడితడు

ఆంధ్ర పౌరుష మునుజూపె అక్షయముగ

నిత్య స్మరణీ యుడుమాకు నిశ్చలముగ

 

 5

జ్ఞాన పీఠము పొందిన జ్యౌతి షికుడు

ఆంధ్ర సాహిత్య మునతాను ఆది గురువు

వివిధ రీతులు వ్రాసిన విప్రుడితడు

మాట లాడు వెన్నుముకగ మాన్యులంత

ప్రాజ్ఞ లంతప్ర శంసించె  ప్రజ్ఞ మీర

 

6

సాహితీ వనమందున సవ్య సాచి

అమృత ముగపాన మునుజేసె యాంగి రసుడు

తెలుగు భాషకు వెలుగులు తేజరిల్ల

ఉద్భవించెను సమ్రాట్టు ఉర్వియందు


7

అశ్వ మేధము కవలలు నారునదులు

చందవోలు యశోవతి చతురిమగను

నవల లన్నియు వ్రాసెను నమసితుడును

ధరణి గర్వించు తనయుడు ధాత్రియందు

పుట్టె పుణ్యది నముతాను పుణ్యమూర్తి


8

ఆంధ్ర పౌరుషము ప్రశస్తి అందముగను

పద్య రీతిగ తెలిపిన పట్టుగొమ్మ

ఇహప రములబో ధించెను  ఇక్షురసము

విలువ లన్నియు రాసిగా వినతితోడ

చాటి చెప్పెలో కమునకు జనకుడుగను


9

మేటి శతకము లన్నియు మేటిగాను

భక్తి సుధలను గురిపించి భర్గుడుగను

నాటకీయత చొప్పించి నాయకుడుగ

ధర్మరీతులు దెలిపెను ధరణియందు


10

జన్మ దినమున స్మరించె జగతి జనులు

తరము లెన్నియు మారినా తలచు చుండు

నీదు ప్రజ్ఞను మేమంత నెలవు కొనుచు

జయము జయమంటు చేసేము జైత్ర యాత్ర


గీతాశైలజ

************

 

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి

నా మధ్యాక్కర నీరాజనం -  డా.సతీష్

 

వేల్పులై  జ్ఞానపీఠాన వేయి పడగలు భాసించ

కల్ప వృక్ష ము గదా రామ కథ మరువక వినినంత

అల్పమా  ఏకవీర  కథ ఆనంద బంధుర మాయె

కల్పనే మైనను  తాను కవులకు సమ్రాట్టు సుమ్మ  

 


డా.సతీష్ గారి తేటగీతులు

1

వివిధ రీతుల రచనల విశ్వనాధ

వీర రసమును కురిపించ విశ్వనాథ

విశ్వమున నిండె నీకీర్తి విశ్వనాథ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

2

విపుల పాత్ర చిత్ర కరణా విశ్వనాథ

విస్తృత  రచనల  వినోది విశ్వనాథ

వివిధ శతక మధ్యాక్కర విశ్వనాథ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

చెళ్లపిళ్ల వారి అనుంగు చేటి యతడు

వివరణము కాదు చరితలే విశ్వ నాథ

విస్మృత రచనల విహారి విశ్వనాథ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

4.

భరత చరితను వివరాన భవ్య రీతి

లోక రీతుల నేర్పున లోప టంపి

విలువలున్న పాత్రలు తాను వెలువరించె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

5

తరతరముల నిలుచు శారద తనయుండు

ముచ్చట  గొలుపు వర్ణల మురిసెనితడు

వివిధ  కథన రీతుల నేర్పు విశ్వనాథ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

6

ఆటలాడు  యతని పద అక్షరములు 

పాటలగు తన రచనలు పాడినంత

కలము కాగితములు తన కరములుండ

విశ్వవిఖ్యాత కవిరాయ విశ్వనాథ


డా.సతీష్

*****************


 

కవిసమ్రాట్ వైభవానికి - తేటగీతుల తోరణం

 

శివశంకర్  కస్తూరి తేటగీతులు

1

వేయి పడగలై విప్పారు విభవమందు 

కల్పవృక్షమే కావ్యాల కల్పవల్లి

ఏకవీర కావ్యమ్మునకేది సాటి   

విశ్వవిఖ్యాత కవిరాయ విశ్వనాధ !

 

2

రామకథ కమనీయమౌర ! యని పల్కె

తెలుగు లోగిళ్ళు కళ్ళాపి వెలుగునింపి   

జ్ఞానపీఠ వైభవముల మానితుడవు 

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ 

 

3

ఆంధ్రతేజమ్ము తెలుపగా యశము తెల్పి    

వాఙ్మయ విభవంబుల మేటి వల్లరులని    

పరిచయమ్ము జేసిన మేటి పండితుడవు  

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ !

 

4

తెలుగు ఋతువుల సొబగులు జిలుగు జూపి 

నీలి మేఘాల దారుల శైలి జూపి

తత సుగంధ సుందరమౌ పదమ్ము నేర్పె     

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ !


అమల మోహనభావంబు సుమములిచ్చి 

చెలగు కిన్నెరసాని మంజీరములను     

విమల కృష్ణానదీ సైకతములయందు 

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ     


6

జిలుగుపూల వనంబున చెంతచేరి 

నాకెదో రహస్యంబుని ప్రాకటితము   

జేసి మధురాక్కర వరమిచ్చి మురిపించె      

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ     


7

ముగ్ధ మధురమైన కవనముల్ మరంద      

రుచిర ప్రతిమంబు రీతులలో మునింగి        

మనసు లోగిళ్ళు మురిపించె మధుర రీతి 

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ 


 8

భావభాసురమగు హృదంబరములందు    

కావ్యసుధల తీయని పానకములు త్రాగి    

పరవశమ్ముతో జాతికి వరములిచ్చె   

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ     


9

భవ్యమైనట్టి చరితను దివ్యరీతి          

చదవగాను మనసులోన సాంత్వనమ్ము    

విభ్రమము పులిముగ్గుతో పెంచగాను    

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ     


10 

ఏకవీర నవలలోన కెంపులోల్కి   

వీరభూపతి మీనాక్షి వేడుకలను  

లలిత లావణ్య రీతులు రంగరించి 

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ !


శివశంకర్  కస్తూరి 

********************* 

  

వళూరు సీత గారి తేటగీతులు

1

ఆత్మ గౌరవము నతని కతడె సాటి

పోటి లేరెవరతనికి దీటు రారు

కోకిలమ్మ పాటల తీపి కూజితమ్ము

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

2

సంప్రదాయములకు పెద్ద , సామ్య వాది,

సంఘ శ్రేయస్సు కాంక్షల  సరస రీతి

చూపు చెలియలి కట్టనించుక కఱకుగ

విశ్వ విఖ్యాత కవి రాయ విశ్వనాథ

 

3

కవన మధురిమ పంచుచు కావ్యమందు

గీత మధురిమ పంచెగ కిన్నెర లయ

పాటల, వివిధ నాటక ప్రజ్ఞలందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

4

గురువుల కొసగి దక్షిణ గొప్పగాను

గురు ప్రసంశ పొందె విశిష్ట గుణము కల్గి

చెళ్ళ పిళ్ల వారి హితవు శిష్యుడనగ

విశ్వ విఖ్యాత కవిరాయ  విశ్వనాథ

 

5

సాహితీ సమరాంగణ సార్వ భౌము

డతడు, యలుపెరుగక చేసె నతడు కావ్య

రచన, వివిధ రంగములందు రమ్య రీతి

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

6

విశ్వనాథ వారి యశము విస్తరించె

విశ్వమంత, నలుదెసల వేయి పడగ

లుగను, కల్ప వృక్షమన వెలుగులు పంచె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

7

నవ్య రీతుల పంచెను నవల మధురి

మలను, మధ్యాక్కరల మహిమలు తెలుపగ

శతకములు పెక్కులు రచించె నితఁడనువుగ

విశ్వ  విఖ్యాత కవిరాయ విశ్వనాథ


8

ఎవ్వడీతడు ? వాగ్దేవి యిలను పంప

వచ్చిన వర పుత్రుడు గదవైభవముగ

జ్ఞాన సుధల నందించగ జ్ఞాన  పీఠ

మెక్కిన తొలి  తెలుగు కవి మిత్రుడనగ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

9

విశ్వనాథుని  గంగమ్మ విడియ భంగి

పాఱు విశ్వనాథ కవన వఱద లుగను

విశ్వమెల్ల సంతసముగ  విస్తుబోవ

విశ్వవిఖ్యాత కవిరాయ  విశ్వనాథ

 

10

మధుర ప్రేమ సుధల తెల్ప మనసు దీర

ఏకవీర కథ రచన యేక బిగిన

చేసి చదువరల కనులు చెమ్మ చేసె

విశ్వ విఖ్యాత కవిరాయ  విశ్వనాథ

 

11

తెలుగు నాడు ధన్యతనొందె, పలు తెఱగుల

గుఱు తెఱిగిన రచన చేయు కోవిదుడగు

విశ్వనాథుని కావ్యముల్  వెలుగు జిమ్మ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

అవళూరు సీత

****************** 

 

చల్లా దేవిక గారి తేటగీతులు 

1

సంప్రదాయపు విభవంపు సౌరు తోడ

వర్ణనా నిపుణత్వపు వాసి చేత

ఒరలు కిన్నెర సానియె పరుగు లెత్త

విభవమున రచియించెను విశ్వనాథ!


2

అనుపమాన ప్రతిభ తోడ నగ్గలించి

తెలుగు సాహితీ క్షేత్రాన తేజరిల్లి

ఆంధ్రజాతి కల్పవృక్షమై యలరగ

విభవమున రచియించెను విశ్వనాథ!


3

భారతీయత కిష్టుడై భవ్య రీతి

ధర్మచక్రము నందున తనరు చుండి

వేయిపడగల తోడను విస్తరించి

విభవమున రచియించెను విశ్వనాథ!  


4

నాటకమ్ము విమర్శలు నవలలున్ను

కథలు వ్యాసమ్ములును పీఠికలును కావ్య

ములు చరిత్రలును శతకములను తాను

విభవమున రచియించెను విశ్వనాథ!


5

ఏకవీరుడై చెలగి తానెలమి తోడ

జ్ఞానపీఠమ్ము సాధించి పూనికగను

ఘనుడటంచు కవికులాన ఖ్యాతి నొంది

విభవమున రచియించెను విశ్వనాథ!


చల్లా దేవిక. 

************ 


విశ్వేశ్వరుని వరప్రసాదు డై !

రచించె విశిష్టమైన కావ్యలు !

వెలిగించె ఆరని జ్యోతిని

తెలుగు  సాహితి రంగమున 

గావించె. పలు ప్రక్రియలు   

 ప్రతిభతో పాండిత్యంతో 

పేరు గాంచె కవిసామ్రాట్ గ 

గ్రహించె తొలి జ్ఞాన పీఠ అవార్డు

నిలిచె పెద్ద దిక్కయై సాంప్రదాయ

సాహిత్యానికి! 


లలిత దీక్షిత్ 

************* 


చంపకమాల

వెలసెను విశ్వనాథ కవి వేదనదీర్చెను తెన్గుభాషలో

నిలిపెను జ్ఞానపీఠమును నిండుగ తేజమునందజేసె నా

తలపును దీర్చి కీర్తినిడె ధామమునై వెలుగీయ బీజమున్

వెలుగులునింప నాటెను కవిత్వ వనాంతర తోటమాలియై

 

మహేశ్ ముత్యాల 

********************* 

 

తేటగీతి 

విశ్వ ప్రధిత మాయెను విభు విశ్వనాథ

మేటి శిల్ప సౌందర్యపు మేరు కృతులు

నిత్య సజ్జిత వీణయై నిగ్గు చూపి

జ్ఞాన పీఠము నందించె జ్ఞానదనుడు

 

వాణిశ్రీ నైనాల 

****************** 


తెలుగు సాహిత్యపు అన్ని పార్శ్వలను స్పృశించిన విశ్వనాథ వారు అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. ప్రతి రచనలో వారి ప్రత్యేకత ప్రస్పుటంగా కనిపిస్తుంది. నవలా సాహిత్యమైనా, పద్యకావ్యమైనా, విమర్శ గ్రంథమైనా, నాటకమైనా, శతక సాహిత్యమైనా దానికి విశిష్ఠ స్థానము కల్పించిన ఎకైక కవి సమ్రాట్  విశ్వనాథ వారు. పట్టిన దానిని బంగారము చేసే పరుషవేది విద్యను అధ్యయనము చేసిన వారిలా తాను చేపట్టిన రచనకు ప్రశస్త్యము కల్పించడములో ఈ కళాప్రపూర్ణునికి సాటి మరొకరు లేరు.

 

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి రచనల గురించి చెప్పకలిగిన ప్రతిభాపాటవాలు లేకపోయినప్పటికి వారి నవలల గురించి ఒక పాఠకుడిగా నా అనుభూతిని తెలియజేయు చిరు ప్రయత్నము.

విశ్వనాథ నవలల్లో పాత్ర చిత్రణ వైలక్షణ్యంగా ఉంటుంది. సన్నివేశాలను కల్పించడంలో వీరికి వీరే సాటి. ప్రతి నవలలోను లోక సంబధ విషయాలను యిమిడ్చి రచనలను రక్తి కలిగించడములో వీరిది అందివేసిన చెయ్యి. అన్ని నవలలను ఆశువుగా చేపుతుంటే శిష్యులు లిపిబద్ధం చేయడము వారి విలక్షణమైన సరస్వతి కటాక్ష పాండిత్యానికి తార్కాణము. ఎన్నుకున్న పాత్రకు గొప్ప విశిష్ఠతను కల్పించడము వారి నవలలను చదివిన వారికి అబ్బురమును కలిగిస్తుంది. పురాణ వైర గ్రంథమాల లో వారు ఎరుక పరిచిన వేద సంబంధమైన విషయాలను చదివి తెలుసుకోవాల్సిందే. నేపాల రాజ వంశ నవలల్లో కాశ్మీర రాజుల చరిత్రను ఆనాటి కాల పరిస్థితులను కళ్ళకు సాక్షాత్కరింప చేసిన విధానము అద్భుతము. ఆనాటి భారత చరిత్రకు ప్రత్యక్ష సాక్షి వలె భారత జాతి ప్రాభవమును ప్రపంచానికి తెలియపరచడము వీరి నవల సాహిత్యములో ఒక గొప్ప కోణము. అసలు వీటిని నవలలు అనుట కంటే జ్ఞాన సముపార్జన గ్రంథాలు అనుట సమంజసమెమో.

నవలలన్నిటిలో లోకానుభవము తొంగి చూడడము గమనిస్తే మనిషి వ్యక్తిత్వ వికాసానికి కావలసిన పూర్తి ముడి సరుకు వీటిలో ఉంటుందని సవినయంగా విన్నవించుకొనుచున్నాను. వారికే సాధ్యమైన పదప్రయోగాలతో, వ్యంగాస్త్రాలతో రచనకు సొబగులద్దే అద్భుత వర్ణనలతో ఆద్యంతము పఠితులకు ఆసక్తి కలిగించుటలో బహు నేర్పరి.

నేను చదివిన భ్రమరవాసిని లో నవల ప్రారంభంలో వరుడైన కాశ్మీర రాజు శోభన గదిలో నిరీక్షించెడి సన్నివేశ వర్ణన దాదాపు 45 పేజీలు సాగుతుంది. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలలో పరభాషలో ఉన్న లోటుపాట్లను తెలియజేస్తూ మాతృ భాష అవశ్యకతను తెలియజేసెడి వారి దార్శనీయతను ప్రశంసించని  తెలుగు వాడు ఎవరు ఉండరేమో. హేలీనా నవలలో గ్రీకు దేశాల గురించి చెప్పెడి విషయాలు, కాశ్మీర దేశ వర్ణనలు, సాంఘిక నవలల్లో మనుషుల ఆలోచనా సరళిని, లోకోక్తులను చదివి ఆస్వాదించవలసినదే.

 

కొన్ని వర్ణనలు

 

నిఖిల దేవతా పరిభుక్త శేషామృత బిందు సంతానములు నెమ్మది నెమ్మదిగా జారినట్లు మార్గశిర మాసాధిదేవత తెల్లపట్టు వలిపము మేలి ముసుగు దాల్చినట్లు శక్తి యుడిగిన వర్షా మేఘపటలి ధారపాతముగా భూమిని తడుప గల స్వామర్థ్యము పోయి చిలుప చిలుపుగ బుప్పొడివోని గాలి దుమారము వోని యల్ప జలరేణువులను వదిలినట్లు సన్న మంచు కురిసెను. అని మార్గశిర మాసములో కురిసే మంచు గురించి వర్ణిస్తారు.

 

నల్లని చీర కప్పికొని, సర్వ జగము నందు ఎవ్వరికిని తెలియకుండా ఏదో రహస్య కార్యము సాధించుచున్నట్లు గుట్టు బయలు గాకుండ యామినీదేవి ఒక గూఢ ప్రయత్నము మీద ఉన్నట్లు కనిపించెనని కృష్ణ పక్షము గురించి వర్ణిస్తారు.

ప్రాచీదిశా పిశంగచ్చవి రమణీయ వక్షోభాగ నిహిత కుంకుమ లేపము వలె సూర్యుడు ఉదయించినప్పుడు నిశాదేవి తన నల్లని మైముసుగును తొలగించుకొని దూరపు తావులకు పోనవచ్చునని సూర్యోదయ వర్ణన.

 

యౌవనావిర్భావము నందలి శరీరము సర్వాణుగతమై నిత్య జాగ్రదవస్థాభూతమైన వాంఛాభిముఖముగా ఉండునని యవ్వన దశ వర్ణన.

పరస్పరానురాగ ప్రదర్శనములు, అన్యోన్య తనూస్పర్శ సంజనిత్వ తనూపులకాభిరామ మధురహేలలు, అన్యోన్య దర్శన సమయ మందహాసములు, చేలాంచలాకర్షములు, అల్పాల్ప చపేటములు కపోల స్పర్శములు, చిబుకోన్నమ్వనములు, హస్తాంగుళ్యంతకృత నేత్ర పక్ష్మోన్మీలనములు, అలక పరిమార్జనములు, ప్రశంస్వా కృతాంస హస్తాస్పాలములు…. ఇలా ప్రణయ భాషను తెలుపడము విశ్వనాథ వారికే సాధ్యము.

 

పద్మపత్ర విశాలలోచన, చంచరీక చాకుర మందహాస సుందర వదనారవింద సర్వాభరణ భూషిత సౌందర్యవతి చెక్కిలిమీద వెన్నెలలు నిగనిగ లాడుతున్నవి; శరీర చ్చాయ వైఢూర్యము ఇంద్రనీలమణులు మరకతములు నూరి తేనెలో కలిపి చేసిన వన్నీయుల విగ్రహము అని స్త్రీ లావణ్యాన్ని చెపుతారు.

 

నాగసేనుడు నవలలో ఒక సన్నివేశము:

ఆమె హేలవిశేషము, అప్పటి యామె స్పృహణీయవకృతి, ఆమె యరమోడ్పు కన్నులు, అంతలో బలహీనములైన యామె అంగకములు, రాచఠీవి పెడబాసి వంగిన ఆమె మూపు, రెండుపాదములు సరిగా ధాత్రిమీద మోపక యొకపాదము మీద నిలిచిన నిలుకడ, సన్నని గాలికి సుంత బుజము మీద్వ జారిన చీర సర్దుకొనక పోవుట, శిరోజములు మొగము పైభాగము నారంభించిన చోటి చిరుచెమట వలన రాచిన నూనెను తిరస్కరించి సన్నగాలి కెగురుచున్న ముంగురులు, ఆలోచనా స్ఫోరకముగా తనకు తెలియకుండ క్రీపెదవిని స్పృశించుచున్న వామహస్త తర్జన్యంతము, నాగసేనుని హృదయమునకు హత్తుకొనెను.

ఇద్దరు మిమేషైక భాగమున తమ్ముదాము విస్మరించిరి. తన్నిమేషాపర భాగమున నాగసేనునకు స్మృతి కలిగెను. ఒక మహాపర్వతము మీది నుండి జోరున వాన కురియచుండగా నొకవాగు క్రిందికి పడుచుండెను. ఆ వాగుతో తజ్జలాధిదేవత పరమ సుమధురాకృతి, మందహాససుందర్స వదనారవింద, లాస్య ప్రచండ చరణాంబుజ, అనిరూపిత వక్షోభాగ సూక్ష్మశరీర, దీర్ఘీకృత దోర్యుగాభిరామ- ప్రవాహము మీద జారునట్లు, వసంతోదయ మైనంతనే యొక మధురభోజనము యొక్క త్రేపువచ్చినట్లు, మృగమద పరిమళ మిళిత తాంబుల సేవన మైన తరువాత, ఆవులించిన వేళ గుప్పుమని ఊర్పు వచ్చినట్లు, ఎప్పుడు వెలివడెనో తెలియని సన్నని తెల్లని రసాల కిసాలయము తోచి, దాని మొదటి క్షారకమును దర్శించి రమ్మన్న భర్త్రాజ్ఞ సమాగత యైన కుసుమ ధన్వుని ముద్దు పెండ్లము కన్పించినట్లు, నాగసేనుడు భావించి బమ్మెరవోయి, వెంటనే తెప్పిరి, నిర్వ్యవసాయుడై నిలుచుండెను. తన్నిమేషము పూర్తియై మరునిమేష మారంభించు వేళకు గౌతమీదేవికిని స్మృతి కలిగెను. ఆమె మరల రాణి యయ్యెను. అతడు నాగసేను డయ్యెను.

 

ఈ విధంగా విశ్వనాథ వారి అబ్బురపరిచెడి అద్భుత వర్ణనల కోసమైన వారి నవలలను చదివి మైమరచవలసినదే.

 

విశ్వనాథ వారికి ప్రణమిల్లుతూ వారి గురించి తెలియజేసే మహద్భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ.....

వెంకట్. సిహెచ్

*********************** 

 

విశ్వనాధ

 

తెలుగు సాహితీ వాజ్ఞ్మయానికి ఆయన "కల్పవృక్షం",

సనాతన ఆర్ష ధర్మానికి "వేయి పడగల "రక్షకుడు,

చారిత్రక నవలా రచనలో సాటిలేని మేటి "ఏకవీర ",

వారి సాహిత్య ప్రక్రియలకు లేదు "చెలియలి కట్ట",

నిజంగా ఆయన"పునర్జన్మ" నెత్తినపుంభావసరస్వతి.

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 ******************************


తేటగీతి 1


విశ్వ మెరగంగ కిన్నెర వెల్గు పంచె

విశ్వనాధుడు లలితమౌ రీతి లోన

విశ్వ సాహితీ వేదికన్ వెలిగె తాను

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వ నాధ


తేటగీతి 2


నందమూరులో నుదయించె నవల లెన్నొ

సృజన చేసేను లక్షపుటలు  స్పూర్తి నింప

సవ్య సాచిలా సాహితీ సమర మందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వ నాధ


రమ, కంకిపాడు 

*******************

 

 తేటగీతి

 

ఆంధ్ర సాహిత్య నీలోపలాంబరమున,

కావ్య జ్యోతులు నెరపెడి కోట్ల వెల్గు,

జ్ఞాత నీవెపొ కవిరవీ జ్ఞానపీఠ,

విశ్వవిఖ్యాత కవి రాయ విశ్వనాథ.

 

CA కె మల్లికార్జునరావు

 ************************** 


 తేటగీతి

నందమూరున పార్వతి నందనుడిగ

పుట్టి తలిదండ్రులొసగిన  పుణ్య ఫలము

తోడ చదువులన్నిట గొప్ప దోవ పట్టె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ!


మైనేని మురళి 

***************** 


 తేటగీతి

కలము చేతను బట్టియు కావ్య సాగు

కాగితం పైన అక్ష ర గమకములను

పాట పాడుచు చల్లియు పంటలన్ని

యాటలాడుచు పండించె యలుపు లేక

కవన సామ్రాజ్య మునమేము కవితలల్లి


గీతాశైలజ 

************** 


తేటగీతి మాలిక .. వాణిశ్రీ నైనాల 

 1

మేటి శిల్ప సౌందర్యపు మేరు కృతులు

వేయపడగల నీడలై విస్తరించ

విభుడు తానయ్యె సాహితీ విభవమందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

2

విమల భావంబు విలసిల్ల విపుల రీతి

పాత్ర లెన్నియొ సృష్టించె ప్రాకటముగ

వివిధ ప్రక్రియలన్ జూపె  విరళి శైలి

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

3

అపర వాల్మీకియై హరి యాజ్ఞ మేర

రామకథ రచియించగ రమ్యరీతి

కల్పవృక్షమై తనరారు కల్పములకు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

4

నిత్య సజ్జిత వీణయై నిగ్గు జూప

నిరుపమాన కావ్యంబుల విరులవనము

నెగడెను తెనుగు సొబగుల జగము నందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

5

సాంప్రదాయపు రీతుల సొంపు లందు

వెనుక చూపంటు నవకవు ల్వెలితి చూప

వేగు చుక్కయై సాహితీ వెల్గు బంచె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ


 6

వాణి తనయుడై వర్ధిల్లు వాగ్మయమున

కవి కులంబున రవియై కాంతులీను

జ్ఞాన పీఠము నొందిన జ్ఞాతుడితడు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

వాణిశ్రీ నైనాల 

****************** 


తేటగీతి మాలిక - దుర్భ కృష్ణశాస్త్రి  

 1

కల్పవృక్షమై విలసిల్లె కవితిలకుడు
కల్పనా చాతురీ ధీర కావ్య సృష్టి
చేసె, తెలుగు భాష యశస్సు చిరముగాగ
విశ్వ  విఖ్యాత కవిరాయ విశ్వనాథ


2
జ్ఞానపీఠమ్ము నేలిన జాను తెలుగు
కవిని గనుగొని మురిసెగా కావ్య జగతి
రసన కవితా ఝరుల నోలలాడినాము
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ


3
ఏక వీరుడితడు సాహితీ జగాన
సకల ప్రక్రియలందెల్ల సవ్యసాచి
తెలుగు కావ్యాల సొబగులు తీగ సాగె
విశ్వవిఖ్యాత కవిరాయ విశ్వనాథ


4
తెలుగు పౌరుషమ్మిదెయని తేటపరచె
మధుర మధ్యాక్కర శతక మధువులొసగె
స్ధిర సాంప్రదాయములకు జీవగర్ర
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ


5
భవ్య లోకానుభవమెల్ల బందిజేయ
నవ్య రీతులందున చాల నవలలల్లె
కావ్య మాధురీలెల్ల లోకాన జాటె
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ


6
వేయిపడగల మణిపూస విశ్వనాథ
వేయి కావ్యావధానాల విశ్వనాథ
విశ్వ ప్రఖ్యాత కథకుడీ విశ్వనాథ
విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

దుర్భ కృష్ణశాస్త్రి  

********************** 


 విఖ్యాత కవిరాయ విశ్వనాథ మకుటముతో పావు శతకము

పూసపాటి కృష్ణ సూర్య కుమార్

 

1

అంత రాత్మతో మాట్లాడె నమర జీవి

అమృతపు వల్లి తో సుధ నారగించె

అశ్వ మేధము చేసిన యాజి గాదె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వ నాధ

 

2

 ఆరు నదులలో జలకము లాడె యీవు

ఏక వీరతోశిఖరములెక్క కీర్తి

కడిమి చెట్టెక్కెగానీదు కావ్య కన్య

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

3

 కవలల మధురిమలు కాంచి కనుల‌లోన

సరసమైనకుణాళుని శాపమలను

పేర్మి బడసెగా గంగూలీ ప్రేమ కథన

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

4

 దమయంతీ సుందరి జూచు చుండ

చేరితివి స్వయంవరమున చిత్రగతిని

మంచి దంతపు దువ్వెన మరులు గొల్ప

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వ నాధ

 

5

 కని చెలియలి కట్టను కనుల లోన

జేబు దొంగల డాబును చిత్తు చేసి

తెరచి రాజును మనమును‌ విరచి యీవు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

6

చందవోలురాణినిబట్టి చిందులాడి

చంద్రగుప్తుని స్వప్నము జయము‌నిడగ

కాంచితివిచిట్లి చిట్లని గాజులన్ని

విశ్వవిఖ్యాత కవిరాయ విశ్వనాధ

 

7

ధర్మచక్రమున్ జూపుచు ధరణి లోన

ధూమ రేఖను గీసెగా తొట్రుబడక

నంది గ్రామరాజ్యమునేలినావు యీవు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ

 

8

పుట్దె గా దిండు క్రిందన  పోక చెక్క

దూత మేఘమ్ము హదయము దోచు చుండ

దేవతలయుద్ధమును చేసి తిరుగు లేక

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాద

 

9

నంద రాజ భవిష్యత్తు డెందమలర

నాగసేనుడు మదిలోన దాగియీవు

దొరలితివిగాదె నాస్తిక ధూమమందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాధ

 

10

వెదకుచూ పునర్జన్మను విసుగు లేక

మహిని పులిమ్రుగ్గు కాంచుచు మహిమ తోడ

పులుల సత్యాగ్ర హములోన కులుకు లాడె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

11

శోభ తోడ నివేదితన్ చూచు కొనుచు

నీల పెండ్లిని ముదముగా నీవు కాంచి

సతతము పరీక్ష లెన్నియో వెతను గూర్చి

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

12

 ప్రళయ నాయుడు మదిలోన భయము సల్పి

చిట్టి బధ్ధన్న  సేనాని చెలిమి చేసి

మహిని‌ బాణావతిని పట్టిమట్టు బెట్టె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

13

 భయపడి భగవంతుని మీద పగను జూపి

భ్రమర వాసిని దరిజేరి మమత జూపి

మురిపె ముగనిన్ను మాబాబు ముద్దు లాడ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాద

 

14

మిహిర కులుని వ్యక్తి త్వము మెచ్చుకొనుచు

మ్రోయు తుమ్మెదల్ పూలపై ముసురు చుండ

సుందరియశోవతి మదికి‌ సొగసులద్దె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాద

 

15

 సు లలితా పట్ట ణపురాణి శుభము లిడగ

ఘనుడు వల్లభ మంత్రికి కరుణ జూపి

వీర పూజలు చేయించె బెదురు లేక

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

16

 వీర వల్లడు శౌర్యము విశద పరచి

వేదవతిమనసునుదోచి మోదమిడుచు

వేయి పడగలు జాచుచు విశ్వ మంత

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

17

 చని సముద్రపు దిబ్బను‌ కనుల జూచి

గట్టి సంజీవ కరణిని కరము‌ బట్టి

స్నేహ ఫలము గొప్పదనుచు చెలిమిచేయ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

18

 ఆంధ్ర పౌరుషమును జూసి నాద మరచి

గొప్ప దగుఆంధ్రుల ప్రశస్తి కూర్చి పేర్చి

ఝాన్సి రాణి గాధను తెల్పె సంతసముగ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

19

 దేవి త్రిశతిని కాంచుచున్ దివ్య గతిని

ధర్మ పత్నిపై సతము‌మో దమును జూపి

భ్రష్ట యోగిని సతతము కష్ట బెట్టె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

20

 రురుచరిత్రము వీక్షించి‌ సరస గతిని

సతము మాస్వామి‌యనుచు నా శంభు గొలిచి

గుప్త పాసుపతము తోడ కోర్కె తీరె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

21

 తల్లి లేని పిల్ల నుకాంచి దరికి చేర్చి

శంకరుని త్రిశూలమ్మును సంహరించి

ధన్య కైలా సమునుచేరి తనువు వదల

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

22

 ‌లోపల బయట నేనంచు కాపు కాసి

వేన రాజు పాలనలోన వెతను బడసి

నీతి గీతను భారత జాతి కిచ్చె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

23

తలచి‌‌ శృంగార వీధిలో వలపు పంచి

ఘనత తోడ రామాయణ కల్పవృక్ష

ఛాయ లో సేద తీరెగా శాస్వతముగ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

24

 కోకి లమ్మ పెండ్లి ముదమున్ కోరి చేసి

పాము పాటలు గొప్పగా పాడు కొనుచు

ఆత్మ కధను సృష్టించిన అమర డవుగ

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

25

 చెప్ప నలవికాదెప్పడు  శీఘ్ర గతిని

విశ్వ నాదుని గొప్పను‌

విడువ కుండ

యెవరి‌ తరముకాదు‌ తెలుప భువనమందు

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

26

సాహితీనభమున యీవు శశివి గాదె

తెలుగు జాతికి నిరతము‌ వెలుగు నిడిన

పరమ హంస నిడుదు నుతుల్ శిరము‌ వంచి

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

27

 తెలుగు నాటను బుట్టిన‌ దివ్య మూర్తి

తెలుగు వాని కీర్తి జగతిన్ తెలిపె నతడు

తెలుగు బిడ్డల కునిడెను వెలుగు బాట

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

*************************************** 

 

వివిధ రీతుల వైవిధ్య విశ్వ కవిగ

తెలుగు నేలకు ప్రత్యేక వెలుగునిచ్చి

తెలుగు కీర్తిని దిశలెల్ల తెలియ జేసె

విశ్వ విఖ్యాత కవిరాయ విశ్వనాథ

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

************************************************ 


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...