16, సెప్టెంబర్ 2020, బుధవారం

భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జయంతి

 


స్వేచ్చా సమర్పణలు


ఈరోజు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జయంతి.

 

సంగీత  సామ్రాజ్యానికి మహారాణి.  ఆమె స్వరం దేవదేవునికి మేలుకొలుపు.

ఆమె  పారవశ్య భక్తితత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం.

సంగీత కళానిధి,  సంగీత సరస్వతి,   భారతరత్న

పుణ్యమూర్తికి  శతకోటి నమస్కారములు.

 

ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి గురించి.... 

నక్షత్ర దర్శనం అనే పుస్తకంలో శ్రీ తనికెళ్ళ భరణి ఇలా రాసారు....

ఎమ్ ఎస్ అంటే ....మంగళ స్వరం. ఎమ్ ఎస్ అంటే మెస్మరిజం.

ఆవిడెప్పుడు సుప్రభాతం పాడుతుందా అని , శివ కేశవులు ఇద్దరూ మగతగా నిద్దరోతారు. పరమ శివుని ఢమరుకం లోంచి జాలు వారిన శివ సూత్రం ఆమె గాత్రం. ఆమె భజగోవింద శ్లోకాలు ఆదిశంకరుల మెళ్లో రుద్రాక్షమాలలు....ఆమె విష్ణు సహస్రనామం , ఏడు కొండలవాడికి క్షీరాభిషేకం. ఆమె మీరా భజన్లు గిరిధర గోపాలుడికి వెన్న ముద్దలు. ఆమె భరత ధాత్రి గౌరవ పతాకాన్ని భూగోళం మీద పాతిన త్రివర్ణ గాత్రి.... ఆమె సంగీత త్రయాన్ని అర్చించిన గాయని. ఆమె సంగీత సామ్రాజ్ఞి .....ఆమె సాక్షాత్తు వరవీణా మృదుపాణి


కొప్పర్తి రాంబాబు  

 

 

తెలతెలవారుతూనే దాదాపు ప్రతీ తెలుగు వారి ఇంట్లో వినిపించిన గళం వారిది.‌‌... సుప్రభాతమో,భజగోవిందమో లలితా సహస్రమో లేక కీర్తనలో....

మహా సంగీత ఝరి....పేరు చెప్పనక్కర్లేదు అనుకుంటా.... వారి జన్మదినం సందర్భంగా సవినయంగా స్మరించుకుంటూ...           

2013నాటి నా చిత్ర స్మరణ


కన్నాజీ రావు 


సుబ్బలక్ష్మి గారి సుప్రభాతాలతో తెల్లవారిని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

అపురూప గాయనీ మణి జన్మదిన  శుభవేళ

నా చిరు అక్షర నీరాజనం.

 

ముదిత సుబ్బలక్ష్మీ పాడి మోక్ష మిడెను

భక్తి గీతముల్ వినిపించి భవహరముగ

దైవము కనిపించు నతివ తాను పాడ

మైమరచిపోదు లెల్లరు మాట రాక

 

రమ, కంకిపాడు.


 

రాగ సుధా రస వాహిని

రచన: డా. ఆర్. సుమన్ లత

( శ్రీమతి ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి  పుట్టిన రోజు  సందర్భముగా)

 

'అలకలల్లలాడే రాముని గని'

స్వర"రాగ రత్నమాలిక" లల్లెదనని

దివికేగిన త్రిస్వర సామ్రాజ్ఞి గళం

రాగబ్రహ్మార్చనలో తులసిదళం.

మృదుమధురం ఆమె అపూర్వగాత్రం.

సదాశివార్చనకేతెంచిన బిల్వపత్రం

ఆమె నోట రాగం - తానం,

జన్య- జనక రాగాల మధురసంకీర్తనం

"వసంతో"దయంలో సరస - స్వర "భూపాలం",

సప్తస్వరాల "కదనకుతూహలంహలం",

అష్టపదుల "గానమూర్తి" జీవితం,

"త్రికాలాలూ" స్వరార్చనకే అంకితం.

"భావయామి రఘురామం"

నిత్య-నవరాగమాలికల సమాహారం.

అన్నమయ్య మధుర పద సంకీర్తనం.

భజగోవిందానంద ఆలోక దర్శనం.

"బృందావన సారంగం" లో "శ్రీ"రంగ విహారం

భక్తి భావాల అపురూప సంగమం.

రామభక్తి సామ్రాజ్య సందర్శనం

నాలుగు పురుషార్థాల పరమ పద సోపానం

నిత్యం పల్లవించే రస - రాగ - తాళ త్రివేణి,

సతతం గొంతులో జాలువారే " అమృతవర్షిణి"

ఆమె - ఎల్లరూ ఎరిగిన రసరాగ రంజని,

ఎల్లలే లేని "ఎమ్మెస్" ఒక రాగసుధారసవాహిని.


(స్వర్గీయ శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి అక్షర నివాళి)

మా అత్తయ్య రాసినది

 

 

 

 

భక్తి సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారికి వందనములతో...ఆమెను తలచినంత తళుక్కున మెరియు ఆమె ముక్కెర జ్ఞప్తికి వచ్చునను భావనతో....

 

సుగుణ సంగీత రాజ్ఞియే సుబ్బు లక్ష్మి

సుమధుర గళము గల తల్లి సుగుణ రాశి

కనులు మూసి తలచినంత మనము నందు

ఎల్లరకు సుమధుర గానమెరుక గల్గు

తనదు వదనము మనమున తలచినంత

భక్తి భావము పొడచూపు భాసురముగ

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...