15, సెప్టెంబర్ 2020, మంగళవారం

దత్తపది - 38, గెలుపు - తలపు - పిలుపు - మలుపు, 14.09.2020

 

 


దత్తపది -  38
 

గెలుపు - తలపు - పిలుపు - మలుపు

 

ఈ పదములతో మన పురాణేతిహాసాలు , భారత దేశచరిత్ర పై  పద్య కవిత / వచన కవిత  అందించగలరు

 

పద్యం : స్వేఛ్ఛా ఛందము

వచన కవిత :

నాలుగు పాదములు; ప్రతి పాదము 12 అక్షరాలు మించకుండా ఉండాలి.

*********************************** 

 

 సత్యాగ్రహము తలపుకి రాగానే

 పిలుపుమేరకు జనులందరూ మద్దతివ్వగా

ఉద్యమము మలుపు తిరిగి గెలుపు బాట పట్టగా

గాంధీజీ కన్న కలలు నిజమాయే

డి. నాగమణి

 *****************

 

శ్రీకృష్ణ దేవరాయల వైభవము గురించి తెలుపు ప్రయత్నం . . .  మధురాక్కర

 

గెలుపులచ్చి రాయల జెంత క్రీడింప రాజ్యమంత

తలపురతనము వలె వెల్గి తలమానికముగ నిల్చె

పిలుపుగలుగు సామంతులే  భీతి నెరుగక యుండె

మలుపుగొనె రాజ్య మెల్లను మరునయ్య దీవెనతో

గెలుపులచ్చి= విజయలక్ష్మి

తలపురతనము= దివ్య రత్నము

పిలుపుగలుగు= సంబంధ బాంధవ్యాలు

మలుపుగొనె= నర్తించు

మరునయ్య= విష్ణువు

వెంకట్.సిహెచ్

 ***********************

 

కందము

మలుపులు తిరుగుచు కథలును

పిలుపుగ వివరించు మనకు పిట్టకథలతోన్

గెలుపుకు గమ్యము దెలుపుచు

తలపున యితిహా సములును తథ్య ముగానున్

 

గీతాశైలజ

 *************

 

మద్యాక్కర

తలపులం జంప విధవల తలలు బోడులుజేయ నాడు

పిలుపు నిచ్చెన్ కందుకూరి  పెకలించ జాఢ్యంబు, పెక్కు

మలుపులం దాటి పోరాడి మాన్యుడయ్యె మగువ పాలి

గెలుపు గాద మగజాతి కిది గేలికానీయకం గాచ

 

వాణిశ్రీ నైనాల

******************** 

 

చిరు కవిత

ఆశయసిద్ధికై నీకు రావాలి తలపు,

ఆ తలపులే నీకిస్తాయి ఆశయ

మార్గపు పిలుపు,

ఆపిలుపులే మారుస్తాయి నీ

జీవితాన్ని మలుపు,

ఆ మలుపు నిశ్చయం గా

నీ కిస్తుంది గెలుపు.

 

ఉషారాణి.

 *************

 

1. 

భరత జనుల తలపుల స్వేచ్ఛ బీజము,

నాటి స్వాతంత్రోద్యమ చివరి మలుపు,

నందు క్విట్ ఇండియా పిలుపు నొసగి,

గెలుపు సుగమము చేసెను బాపు కదా!

2.

ప్రేమికుల మదిలోని వలపు తలపులకు

తీయని పిలుపులకు పెళ్లి ఒక గెలుపు

కాదాజంట జీవన మలుపులధిగమించి,

గమ్యం చేరుకొనుటయే అసలు గెలుపు.

3.

మీరు నా గెలుపు కాంతుల నే  చూశారు

ఆ వెనక దాగి వున్న కలతల తలపులను

తాక లేదు, వేదనా పిలుపులను వినలేదు,

నాకడ్డుపడిన  మలుపులను చూడలేదు.

 

CA కె  మల్లికార్జునరావు

************************************

 

 

తలపులలో సీతపై మరు లిడి 

స్వయంవర  పిలుపుపై మిథిల

కేగి గెలుపుకై శివ ధనువెత్త

ఓడి భంగ పడగ లంకేశ్వరుడు

 

జానకి యెడ మోహము విడక

ఆయమను పొందుటకై పరి పరి

విధముల యత్నించ  రామ కథ

పలు పలు మలుపులు తిరిగెగా

 

CA కె మల్లికార్జునరావు

 ******************************

 

కన్నెవాగు మలుపులు తిరుగుతు ప్రవహిస్తుండంగా

ఆ సవ్వడుల పిలుపులకు సన్నజాజి కన్నె హృదియందు

ప్రియుని తలపులన్నియు వలపులు రేగ

గాఢ పరిష్వంగన గెలుపు కై  ఎదురుచూసే

 

డి ..నాగమణి

 *****************

 

తేటగీతి

పిలుపు కందని దూరము విశిదమవగ

తలపు లందున్న రాముని తలచె సీత

మలుపు తిరిగిన భవితలో మార్పు రాగ

రాము నిగెలుపు జూడంగ రమణి సీత

 

రమ, కంకిపాడు.

 ********************

 

1.

కౌరవ జ్యేష్ఠుని జూదం గెలుపు

శకుని మామ కుటిల తలపు

కురు సంగ్రామ శంఖం పిలుపు

గీత బోధ తో కథ మలుపు !!

2.

హా సీతా ,హా లక్ష్మణా పిలుపు

తిరిగెను రామ కథ మలుపు

వలచిన సీతపై  తలపు

ఇంటిగుట్టు తెచ్చెను గెలుపు

 

విష్ణుప్రియ

 **************

 

ఇతివృత్తం :పార్వతి  శివునకై  చేసిన  తపస్సు

తేటగీతి

శర్వుని వలపున మునిగి శైల తనయ  

తలపులందు హరుని యుంచి పిలుపు కొరకు

మలుపుల తిరిగి నిశ్చల మనము తోడ

తపము జేయగ  గెలుపుల దరిని  జేరె

 

అవళూరు సీత

 ******************

 

ఆటవెలది

మలుపు లన్ని చూసి మరవకు నెరవును

గెలుపు కొరకు మదిన గీజు సల్పు

తలపు లెన్ని రాని తలవంచక నడువు

పిలుపు వచ్చు వెంట గెలుపు మెచ్చి

 

సి.హెచ్. రజిత, కరీంనగర్

 *********************************

 

మంజరీ ద్విపదలో తొలి ప్రయత్నం...

 

గెలుపు కై చూడని గిరిజన ఋతుడు

తలపు న భరతమాతను గొని నడచె

పిలుపు నిచ్చె జనుల పేరిమి తోడ

మలుపు త్రిప్పె దేశ భవితనల్లూరి.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 *************************************************

 

దీనినే తరువోజ గా వ్రాసేయ గలరు..

గెలుపుకై జూడని గిరిజన ఋతుడు కినుక వహించి తా ఘీంకృతి సలిపి

తలపున భరత మాతను యభీష్టించితన్మయంబొందగన్ తరలి వెడలెనె

పిలుపు నిచ్చి జనుల పేరిమి తోడ విద్వేషుల నణచ భీకరుడు వలె

మలుపు త్రిప్పె భరత మాత భవితను మార్తుల నోడించి మైమరపించె

 

వెంకట్. సిహెచ్

 *******************

 

మనుచరిత్ర గురించి దత్తపది పూరణ మధురాక్కర లోనే.

 

తలపు నందున మనుచరిత్ర కదలాడ వరూధిని

వలపు తెలిపెడి ఘటనయే ప్రభవముగ గనిపించు

గెలుపు కోరి వరూధిని కీలికించితగ తెల్పు

వలపు పిలుపుకు ప్రవరుడు పరితాపమున్ బొందెనె!

మలుపు తిప్పె పెద్దన్న సౌమంగల్య కవితాఝరి

జిలుగు లెన్నియో ప్రసవింప జేసి నబ్బుర పరిచెన్.

 

వెంకట్. సిహెచ్

 *******************

 

మలుపుల గెలుపులు

 

 మా అమ్మ చెప్పేది, పాఠాలన్నీ చదువుకోవాలి నాన్నా అని

  మా నాన్న గారు, నువ్వు అన్నీ చదివితే గెలుపు నీదే కదురా కన్నా అనేవారు

  వారి మాటలు వదిలాను, జీవితమే  భారమైంది.  కాల గమనం లో

 నాలో నాకే ఓ తలపు వచ్చివరుస మలుపులతో నాకు గెలుపులే గెలుపులు

 

మురళి

 *********

 

చిరు వచనం కవిత

రావణుని  నాశ నానికి అయ్యెను

హేతువు సీతపై తలపు,

రావణుని అహంకారమే అయ్యెను

అతని వినాశానికి పిలుపు,

రావణుని పరివారం మాట వినకే

అయ్యెను అతని వినాశ మలుపు,

రావాణా సోదర బహిష్కరణ

అయ్యెను రాముని గెలుపు.

ఉషారాణి.

******************

 

మధ్యాక్కర

మలుపు తిప్పగ దేశ గతిని మార్చె నెందరి త్యాగ ఫలము

గెలుపొందె తెల్ల పాలకుల గెంటి వేయంగ నిందరికి

పిలుపు నిచ్చి సమర సల్పు ప్రేరణ గల్పించు నరుల

తలపునుంచిన భాగ్యమేగ తరములు తరియించె గాన

 

ఎం.పద్మలత

 ********************

 

గెలుపు ను లక్ష్యంగా శాంతి మార్గము నెంచి

తలపు ను ధృఢసంకల్పంతో గాంధీజీ

పిలుపు ను ఇవ్వగా జనులెల్ల అనుసరించి

మలుపు త్రిప్పి సాధించె స్వాతంత్ర్యమున్

 

వి. వి. శ్రీనివాస్, షార్. శ్రీహరికోట

 *************************************

 

కందము

 

గెలుపది తథ్యము మనకని

తలపున ధైర్యంబు బెంచి తనదగు రీతిన్

పిలుపుని తానిచ్చి మనకు

మలుపని అల్లూరి బలికె మంచిని నెంచన్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 ************************************

 

తేటగీతి

యుక్త వయస్సు తో నుండు వలపు  తలుపు

పసుపు పారాణి పట్టించి పెండ్లి పిలుపు

భార్య మెచ్చిన భావము భర్త గెలుపు

సరిగ సంసారసల్పు సొగసరి మలుపు !

 

మాదిరెడ్డి సురేశ్

 ********************

 

నా ప్రయత్నం వచనం:

చెడ్డవారి కథ మలుపేనని చెప్పినది భారతం

మంచివారిదే గెలుపన్నది ప్రవచించెను రామాయణం

నవరసాల తలపులచే ప్రభవించెను భాగవతం

పురాణేతిహాసాల పిలుపే కద  జీవితం

కన్నాజీరావు

****************

 

వచన కవిత

తలపు తీవ్రమై విరిసేను  స్వేచ్ఛా గీతిక

పిలుపు ఉగ్రమై ఉరికేను దేశ యువత

మలుపు సూత్రమై తిరిగేను రాజ్య భవిత

గెలుపు తధ్యమై ఎగిరేను జాతి పతాక

 

దుర్భ కృష్ణశాస్త్రి

 *************************

 

గేయ రచన,

శకుని మదిలోని కుటిల తలపు,

ధృతరాష్ట్రుని జూదానికి పిలుపు ఐ,

దుర్యోధనుని గెలుపుగా సాగి,

పాండవుల జీవితంపెద్ద మలుపు తిప్పింది ..

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 *******************************

 

కందము

తలపున తేజీ నెక్కియు

మలపుల తీరములు నెంత మరలిన గానీ

పిలుపల తోడ మనసులను

గెలువను  మనము జగములను గెలుతుము  కదరా

 

డా.సతీష్

*******************

 

 

గెలుపు సారమునుఁ దెలుప గీతఁ జెప్పి

మలుపు తిప్పెనా రధమును మాధవుండు

తుదకు భ్రాతల పుత్రులఁ దునిమి పిలుపు

నిచ్చె ధర్మ యుద్ధమునకై యిలను మనకు

 

చాగంటి చరణ్ 

******************** 




                 స్వేచ్ఛా సమర్పణలు 


 తేటగీతి

వెన్నెలవిరిదాల్పు! విధుడ! వేడికంటి!

విశ్వమూర్తి! విషధరుడ! విశ్వనాథ!

నీలకంఠుడ! నటరాజ! కేలుమోడ్పు

లివియె మమ్మునాదుకొనుమో యీశ్వరుండ!

 

వెంకట్.సిహెచ్


కందము

శూలధరుండై పరగుచు

కైలాస గిరుల చరించు గౌరీ నాథున్

వాలారెడు భక్తుడినై

ఆలము సేయకనె గొల్తు నార్తిగ మనమున్

 

దేవిక చల్లా


ఈనాటి తెలుగు తేనియల‌ దత్త పది

గెలుపు,తలపు,మలుపు, పిలుపు

పై పదములు ఉపయోగించి ‌అన్యార్ధములో

భారతములో  పూరణము

 

సందర్భము   అర్జునుడు బృహన్నల. గా మారిన‌ సమయాన. కించిత్ వేదన చెందుతాడు    ఆ సమయములో కృష్ణుడు ఓదార్చి విరాట నగరమునకు పంపు సందర్భము.

 

 

 

 

జడలోన కుప్పెలు సవ్వడి నిడుచుండె, పాపిట పతకము పరవశించె,

నడుమ వడ్డాణంబు నటన మాడుచు నుండె, చరణ యుగళమున‌ సంత సముగ

పొంకించె జం(గెలు,పు)త్తడి కమ్మలు కర్ణ ద్వయముపైన కాంతు లిచ్చె,

తిలకము ముఖమున దీ(పిలు, పు)రుష  రూప మిపుడు మారెను ఫల్గుణా, మరులు  గొల్పు

(తలపు) చూలికి నైన సుందర వదనము, మూతి (మలుపు) వలదు మనమున బడయగ

రాదు శంకను,చనుము విరాటుని నగ రమున కని పల్కె కృష్ణుడు రమ్య గతిని

 

జంగెలు =  గజ్జెలు,  తలపు చూలి =  మదనుడు, దీపిలు = ప్రకాశించు

మూతి మలుపు  = అసంతృప్తి

 

పూసపాటి



 

"తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్..

మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్..

కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు..

పార్వతీ తనయా ఓయి గణాధిపా! నీకు  మ్రొక్కెదన్"

గణనాధుడు ప్రతి సంవత్సరం అలా వచ్చి ఇలా వెళతాడు...వెళుతూ వెళుతూ ఒక తోబుట్టువో  స్నేహితుడో   మనల్ని విడిచి వెళ్తున్న అనుభూతిని వదిలి వెళతాడు... చిన్నప్పటి నుంచి అదే భావన అదేంటో....అది ఒకరోజు కానీయండి మూడు రోజులైనా పది రోజులైనా...అలాగే .... ప్రతిరోజూ మ్రొక్కుతాం మొదటనే ఆయనకు...అయినా అదేం విచిత్రమొ అదేం అనుబంధమో....కదూ??? ఈ పద్యం నాకు మా మామ్మ వారసత్వంగా అందించిన  కథలూ పద్యాలు పాటల ఊట మూట తో నాతో వచ్చింది...ఈ పద్యకర్త ఎవరో తెలుసా మిత్రుల కెవరికైనా?          

 

ఈ చిత్రం 2001 లో హైదరాబాద్ లో  నిమజ్జనం దృశ్యాన్ని చూసి వేసినది.

కన్నజీ రావు




విడవకుండా ముసురుపట్టి వర్షము పడుటకు కారణమిది ఏమో.

తేటగీతి

వరుణుడు తన కర్తవ్యము మరచి పోయి

వర్ష ఋతుధర్మమును వీడి హర్షముగను

ఆట లాడుచుండ విసిగి నగ్నిజుండు

ఆగ్రహింప, వరుణుడు తా నంతరంగ

మందు చింతించి వ్యథ తోడ నశ్రువులను

కార్చగ నవియె వర్షమై గంధవతిని

తడుపుచుండె విస్మయముగ విడవకుండ

 

అగ్నిజుడు= బ్రహ్మ,   గంధవతి= భూమి

 

వెంకట్.సిహెచ్

 

 

అల్లసాని వారికి, ఒక చిన్న నివాళి ... ఉత్పలమాలలో

 

ఉత్పలమాల

 

నీ ఘనమైన భావనలు నిండిన మానసమందు కోర్కెలై    

శ్రీ ఘటనాప్రకారములు జిల్కు  సుగంధవిలాసయుక్తమై

రాగసుధాఝరుల్ వలపు రంజిలుగా ప్రవరాఖ్యడాయెనో  

గోఘృత మాధురుల్ తలపు కూజితరాగపుభావనమ్ములై   

  

కస్తూరి శివశంకర్




 

ఆటవెలది  1

 

బడిని తెరిచెననుచు  వడివడిగ నడచి

నిక్కరూడ నేమి నిలువకుండె

చేత బట్టి బుడత చెడ్డీని ముద్దుగ

తరలుచుండె నిపుడు తడబడకనె

 

ఆటవెలది  2

 

బుక్కు ముఖ్య మనుచు చొక్కాను వీడెనే

బుడత బడికి వెళ్ళ వడివడిగను

నిక్కరూడి బోవ నిలుపుచు చేతను

వాడి శ్రద్ద జూడ వందనమ్ము

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి



 


ఒక చిన్న హాస్య కథనం.

నా#వంట...మీ తంటా...

 

హాయండీ...నేను మీ షికంఢి....

ఈరోజు "నావంట మీతంటా" లో  మనతో పాటు ప్రముఖ తెలుగు నటి దేభ్యశ్రీ వచ్చారు.

షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ కుకింగన్నమాట...

హాయ్ "దేబ్" హౌవ్వార్యూ....

హాయ్ "షిక్ " హౌవ్వార్యూ...

సో వాట్ యూ గోయింగ్ టూ డూవండీ?!

ఓ యాఁ....నేనూ మీకూ వంకాయ హల్వా ఎలా కుక్ చెయ్యాలో ఐ విల్లెక్స్ ప్లైన్ అన్నమాట‌...

ఓ య్యా య్యా...

ఫస్టూ మనం కొన్ని నైసు బ్రింజాల్సు తీసుకుని ఫుల్లు వాషు చెయ్యాలీ...దెన్నెక్స్టూ  స్మాలు పీసెస్ గా కట్ చేసుకోవాలీ...

య్యా య్యా నైస్ ‌..

మీన్ వైల్ వుయ్ బాయిల్ మిల్కండీ...

యా యా యా...మే ఐ హెల్ప్ ‌..

షూర్ షూర్...

జస్ట్ హాఫ్ బాయిల్ చేసి ఇన్ దాట్ వి పుట్ సమ్ జాగెరీయండీ....

వావ్.....

దట్టూ బెటర్ టూ గో విత్తూ ఆర్గానిక్కన్నమాట....

వావ్ ఐసీ...

ఆఫ్టర్ జాగెరీ బాగా స్టిర్ చెయ్యాలి...బిసైడ్ బ్రింజాల్ పీసుల్ని కీప్ ఇన్ ద మిల్క్ మిక్చర్ అండీ....    ఓ‌....

ఎగైన్ మిక్స్ వెల్లన్నమాట...

ఎండ్ నౌ వి ప్రిపేర్ సమ్ టాపింగండీ...     అహో....

టేక్ సం ఇలాయిచీ ...లాంగ్....బ్లాక్ పెప్పర్...స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సేఫ్రన్....

వ్వావ్ ఆన్ యువర్ టెల్లింగిట్ సెల్ఫ్....ఐయ్యామ్ గెట్టింగ్ దట్ ఫ్లేవరండీ యమ్మీ ‌..ఐ కాంట్ వైట్ యున్నో....    హ హ హ హ హ....

జస్ట్ సీయండి బ్రింజాల్ మిల్క్ తో బాగా మిక్సాయిందా??

యా...యా...వాట్టే ఫ్లేవరండీ‌‌..య్యా‌....

నౌ ఇట్సాల్ డన్నండీ...ఐయామ్ డెకరేటింగ్ విత్ టాపింగండి....సీ......

వ్వావ్... బ్యూటిఫుల్లండీ...

నౌ ...వి విల్  సీ ద టేస్టాండీ....     డెఫ్నీట్లీండీ‌‌..

అబ్బా....సూపరుందండీ....ఐ కాంటెక్స్ప్లైనండీ....

వెరీ వెరీ తేంక్ ఫుల్లండి.‌   ఇట్స్ మై ప్లెజరండీ‌...

ఇదండీ మన దేభ్యశ్రీ గారు నేర్పిన వంకాయ్ హల్వా!!

మీరూ కూడా ఇది చూసి లెర్న్ చెసారు కదా....సీ యూ ఎగైనండీ ...విత్ లవ్...మీ షికంఢి ..నావంటా మీ తంటా లో‌‌ మళ్ళీ మీటౌదాం..........

ఓ....క్......డో....క్......

ఏంటేకరమ్మా.....మరీ అంత మొహమాటవైతే  ఎలా....ఏక్టింగ్ కాకండానీ...నిజంగా తింటే మరి ఇదే తంటా!!!!

 

( ఖచ్చితంగా మన తెలుగు  ఏంకర్లూ నటీమణులను కొంత చాలా మంది ని దృష్టిలో పెట్టుకొని వ్రాసిందే...ఏ మోమాటం లేదు)


కన్నాజీ రావు

 

 

సమాప్తం 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...