దత్తపది - 39
వేగము - యాగము - రాగము - త్యాగము
మీకు నచ్చిన ఇతివృత్తంలో
పద్య కవిత / వచన కవిత అందించగలరు
పద్యం : స్వేఛ్ఛా ఛందము
వచన కవిత : నాలుగు పాదములు;
ప్రతి పాదములోనూ కనీసం 12 అక్షరాలు కనీసం ఉండాలి
గుండె వేగం
నిన్ను చూడాలన్న తపనతో నా గుండె వేగము పెరిగితే...
మౌనంగా ఒక రాగము చేసింది నా మనసు..
నీవు కనిపించక నా నయనాలకు
ఎర్రటి నెత్తురు ఎగబాకి
అగ్నిగోళమయ్యెను..
ఆత్మనే యస్వాహా... ఆత్మనే ఇదం నామమ...
అంటూ యాగం చేయకోరింది...
నీను ఆవాహన చెయ్యడానికై...
నీకోసం ప్రేమను అవబోసన పట్టిన నేను
నీ దోసిట అర్పించడానికై...
నీ బాసిట అలంకారానికై...
నా జీవిత క్షణాలను నీకోసం త్యాగం(ము) చెయ్యడానికై...
ఇంకా ఎన్ని యుగాలు, క్షణాలు ఎదురుచూడాలో...
నా గుండె వేగం మితిమీరుతోంది.... రావే ...
ఫక్కున నవ్వుతూ చెంగున ఎగురుతూ...
దేవకన్యలా నా మనసున నిలయం ఒకటి నీకు...
ఉషోదయకాతులు నాపై కురిపించడానికి...
ప్రత్యుషోదయమై నా కోసం రావే..
నా గుండె వేగము రాగము తీస్తూ
యాగము చేస్తూ త్యాగము చెయ్యడానికి..
సిద్ధపడిపోతోంది...
సూర్య తాడిపూడి.
కందము
యాగమునే తలపించగ
వేగముగా పద్యరచన వెల్లువలేవీ ?
త్యాగముతో కవనముల ప
రాగములను పంచువేళ ప్రాజ్ఞత జూపుమ్ !!
కస్తూరి శివశంకర్
తేటగీతి
యజ్ఞయాగాలు పూజల ప్రజ్ఞ లేదు
నీలిమేఘాల రాగాలనీయమంటి
వేగముగ కవిత్వపుధార వీలుకాదు
త్యాగములు నాకు గావించు యశములేదు
వై. శ్రీదేవి
బుజ్జగింపు
వేగము పడక నిదానంగా ఆలోచించుమా
చదువు కూడా ఒక యజ్ఞయాగము కదా
రాగముల వలె పాఠాలను వల్లించుమా
పరధ్యానం పక్కకు మళ్లించే త్యాగము చేయుమా !
మురళి మోహన్
యాగ రక్షణ చేయు రాముని తలచి కంద పద్యం లో నా సమర్పణ
వేగము తను శరములతో
యాగము రామా ద్దికమున యలజడి రేపన్
రాగము తీయుచు నసురుల్
త్యాగము చేసిరి యసువులు తనువులు కూలన్
డా.సతీష్
నీవొస్తావని
నీవొస్తావని తెలిసి వద్దన్నా గుండె పెంచుకొంది వేగం...
నీ వొస్తావని తెలిసి నా మనసు తీస్తోంది రాగాలు...
నీవొస్తావని తెలిసాక నన్ను నేను
అడుపుచేసుకోడం అవుతోంది యాగం....
నీవొస్తావని ఎదుచూపుల్లో ఎంతని
చేయను కాలాన్ని త్యాగం....
ఉషారాణి
సరస్వతీ దేవి దీవెన వేడుతూ నా ప్రయత్నం
తరువోజ
త్యాగము జేసి పద్య రచన తోడ ధన్యులైన కవుల క్దండము లివియె
యాగముగ దలచి నక్షర దీక్ష నాచరింపగ వాణి యానతినిమ్ము
వేగము తోడ కవితలన్ని వ్రాయ విద్యాతల్లి మము దీవింప వోయమ్మ
రాగము గూర్చి నే రమణీయ కవిత ప్రణుతింప దీవెన బ్రాలు వాగ్దేవి!
వెంకట్. సిహెచ్
గేయ రచన
యాగము కాచగ కౌశికునితో,
వేగము తన కుమారులిద్దరిని,
అను రాగము నావలకు నెట్టి పంపె,
పుత్రప్రేమ త్యాగము చేసె దశరధుడు....
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
మునుల యాగము కాచు నెపమున
రాఘవు నడవికంపమని కోరె కౌశికుడు
అశక్తుడై దశరథుడు గారాల అనురాగాల
తన ముద్దు పట్టికి కానలకేగ నానతినిచ్చే
అంత నాతపసి వేగమున రఘు రామ
వెంట గొనిపోవ నా చక్రవర్తి చింత నొందే
మనోవ్యధ నధికము కాగా రామా రామా
యని విలపించుచు దేహత్యాగముచేసే.
ద్వితీయ ప్రయత్నం
తన జనకుని జంపిన నాగుల వంశ నాశ,
మాశించి జనమేజయుడు సర్పయాగము, సంకల్పించ,వలదన్న హితవులు వినక,
ప్రతీకార రాగములు లోలోన ధ్వనించగ,
నా యాగము నారంభించి కొనసాగించగ,
మంత్ర వశమై వాయు వేగమున సర్పము
లెల్ల నట జేరి యజ్ఞకుండమున పడినవై,
ప్రాణ త్యాగముచేసి మోక్షము బడసేనుగ.
CA కె మల్లికార్జునరావు
వచనం లో నా భావన
తెలుగును వెలిగించుటను యాగము తలపెట్టి వాయు వేగము తో
తెలుగు తేనియలను సమూహము నెలకొల్పి
భాష యందు మిక్కిలి అనురాగము తో
వారి విలువైన సమయము కొంత త్యాగము చేసి
అక్షర సేద్యం చేస్తున్న నిత్య కృషీవలురందరికి
యిదె వందనం.
రమ, కంకిపాడు.
తేటగీతి
గానమున నిను గొలువ త్యాగయ్య గాను
రాగమది యేమొ తెలియగ రాదు, భక్తి
తోడ యజ్ఞ యాగములు చేతుమనిన గడు
శక్తి చాలదు, నీవె నా సర్వ మనుచు
త్యాగ మొనరించగా నొక దారి జూపు
అవళూరు సీత
ఉత్పలమాలిక
వేగమువేగమన్న సుమ పేశలమౌ కవితాసుగంధముల్
రాగముయోగముల్ కలిపి, రంజిలజేయగ ముక్తిమార్గమే
త్యాగము ! భక్తిభావమున ధన్యతపొందుచు దివ్యయాగమై
మోగవలెన్ స్వనంబు; మధు మోహన భావము పల్కినట్లుగా
తాగవలెన్ మరందముల ధారలు నిండిన తేనియల్ సదా
సాగుచు పోవలెన్ విరుల శాఖలు తెల్గులవెల్గు నింపుచున్
కస్తూరి శివశంకర్
పిలవని వేడుక చూడగ వేగముగా
సతి చేరెను దక్షుని యాగమునకున్
అనురాగము కరువై అవమానము పొంది
ప్రాణత్యాగము చేసెను పరాభవపు భారము పెరిగి...
విష్ణుప్రియ
ఉత్పలమాల
రాగమునన్ కవుల్ రచనలం దరియించగ, జీవితంబులన్
త్యాగము జేయగన్ ఫలము వ్యర్ధము జేయుట దారుణంబగున్
వేగము సేవల న్నెరపి విజ్ఞులు ప్రజ్ఞను బెంచ సాహితీ
యాగములందునన్ తెలుగు యక్షర దీక్షల బూనగాదగున్
వాణిశ్రీ నైనాల
వేగము యాగము రాగము త్యాగము
వేగము గా వరుణ దేవుని కటాక్షము కోరి, వరుణ
యాగము తుటుముగా జనులెల్ల నిర్వహించగా
రాగము ల సుస్వరముతో సవ్వడి జేయుచూ
త్యాగము గా గంగ దివి నుండి భువి కి జాలువారె
వి. వి శ్రీనివాస్
ఇతివృత్తం:పర్యావరణ పరిరక్షణ
కందము
వేగమె నశింప జేయక
యాగము వోలె దలపోసి యవనము జేయన్
రాగము జూప ప్రకృతిపై;
త్యాగము జేయు వనరులనె యనుకూలముగన్ !
(అవనము --- కాపాడుట)
చల్లా దేవిక.
వేగముననంతరించు బహుభాషల ఆంధ్రముందంచు భయమున,
భాషా పరిరక్షణకున్ త్యాగముల్ చేయశక్తినిమ్మని అమ్మనిగొల్తు శ్రీరాగమున!
చమత్కారకవి.
ఏకాంతం
మౌనం నీశీధిని చీల్చుకుంటూ
ఎద లోతుల్లో గాయం చేస్తూ ఒంటరిగా.....
నీవంటూ ఒక రూపం
నీదంటూ ఒక భాష
అంతరంగాలలో నీకంటూ ఒక స్థానం.....
నీ పిలుపే వర్షించే మేఘం
నీ చూపే నిర్మలాకాశం సాగే కాలంలో నీ వరవడి ఒక ప్రస్థానం......
నీతో కలిసి నడిచిన దూరం
నీతో అలసి కూర్చున్న వైనం
సాయంసంధ్యలలో తరుగుతున్న సూర్యం....
ఏకాంతం అంటూ ఒకటుంటే
అది నీకే అంకితం.......
కోవూరి
రైతులగోడు
చం.వనచర జీవులన్ని యిల వచ్చుచు పంటలు పాడుజేయ నా
ఘనతర నష్టమున్ గనుచు కన్నుల నిండుగ నీరుపారుచున్
ఘన పరితాపమొంది చని గట్టున కూర్చొని దేవదేవునిన్
మనమున దల్చునే యపుడు మాతకు (ఓ)నోగిరమీయు హాలికుల్
మీ మహేశ్ ముత్యాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి