23, సెప్టెంబర్ 2020, బుధవారం

అక్షరానికి అంజలి , చిత్రం పై పద్యం - 49, 22 - 09 - 2020


 

శీర్షిక : అక్షరానికి అంజలి 
చిత్రం పై పద్యం  - 49
స్వేచ్ఛా చందము / వచన కవిత


*అకార సాకారం*

అమ్మను చూడు

చూడు అమ్మను చూడు

అమ్మ కడుపును చూడు

తొంగి చూడొక్కసారి

తడిమి  చూడొక్కసారి

తెలుగోడా తెలుగోడా!

మక్కాలో ఉన్నా

బెత్లహాములో ఉన్నా

కైలాసంలో ఉన్నా

కలాడిలో ఉన్నా

వల్లకాడులో ఉన్నా... ...

చీకటి వాటిక వాకిటిలో ఉన్నా

రేపటి తోటల తావుల్లో ఉన్నా

ఆకటి కేకల పాకల్లో ఉన్నా

క్షణంలోనైనా, చివరి క్షణంలోనైనా

ఒక్కసారి కను విందువై, పసికందువై

కనులు మిటకరించి నమస్కరించి

తెలుగమ్మను చూడొక్కసారి

తెలుగమ్మ కడుపును చూడొక్కసారి

చూడు చూడు తెలుగోడా

పంచ భూతాల సాక్షిగా

పంచ్యాక్షరిని మించిన

నీ తల్లి కడుపు అది

నా తల్లి కడుపు అది

తెలుగు తల్లి కడుపు అది.

లయకారుణ్ణి గన్న

విశ్వ మాతకు మారుగా

తొలి అక్షర రూపు అది 

కమ్మని అక్షర మాలలో

తొలి సుమమైన అమ్మ అది

అకార సాకారమది

అమ్మ కడుపు అది.

----.----

అత్తిలి అనంతు 

*************************


 

ఆహ్వానం

ఆమెను చూస్తూన్నంత సేపు

నిచ్చల కొలనులో నీటిలా

ఆమె నడుస్తున్నంత సేపు

చిరుగాలికి కదలాడే కలువలా

నా నుండి దూరమవుతున్నంత సేపు

ఆకాశంలో సాగే పక్షుల వలసలా

నాకు దగ్గరైనప్పుడల్లా కలహంస

పలుకుతున్నా తియ్యని మాటల్లా

నా శ్వాసకు తను ఆధారమైనప్పుడల్లా

ఎద పలికెను తన పేరు సుస్వరంలా

మనసు మీటి సమయం దాటి

ఆవలి గట్టు చేరి

పలుకుతుంది ఎండమావి ఆహ్వానం

 

కోవూరి 

****************** 


"" నుండి మొదలైంది

అక్షర ప్రయాణం

"" నుండి మొదలైంది

మనిషి మేధస్సు

"" నుండి మొదలైంది

విశ్వవ్యాప్త విజ్ఞానం

"" నే ప్రాణం

"" నే జగతికి ఆధారం

"" నే ఆలోచనలకి ప్రాణం

తెలుగు వర్ణ మాలకి ప్రారంభం

అవని లోని మొదటి అక్షరం

అమ్మ అన్న పిలుపికి మూల మంత్రం

"" లోనే అంతం ఉన్నది

"" లోనే లయ ఉన్నది

 

కోవూరి 

******************  


గేయ రచన,

 

అపురూపంగా అమ్మ అప్పుడే అంది అప్పులు అడగొద్దు  అని .

అలా అప్పటినుండి అన్ని అవకాశాలను అనాయాసంగా అదృష్టంతో

అందుకున్నాను.

అక్కరకు రానివి అనుకరించకుండా అమ్మ అనురాగాన్ని

అమలు పరిస్తే అసలు అడ్డంకులే రావు గదా .

క్షరం కానిది అక్షరం,

భాష కు మూలం అక్షరం,

అక్షరాలను అందంగా పేర్చితే కవిత్వం,

అక్షరాలను స్వరబద్ధం చేస్తే సంగీతం....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

********************************** 

 

 అక్షరజ్ఞానం   అమ్మ తో ప్రథమం

అక్షరసత్యం ఇది అమృత సమానం

అక్షరశిల్పం మది మాటల రూపం

అక్షరకావ్యం మధురోహల మధనం

అక్షరయజ్ఞం ప్రబంధాలే యాగఫలం

అక్షరాంజలి ఇది అమ్మభాష పై  మోహం.

 

విష్ణుప్రియ


 

 

 

నేటి విద్యాస్థితి

ఆటవెలది

 

తల్లడిల్లుచుండె తంటాలు బడుచుండె

గమ్యమునకు జేర్చ కలత దీర్చ

()నందజేయుచుండె ఆన్లైను పాఠాలు

బాలబాలికలకు భవితనొసగ

 

ఆటవెలది

 

మేలుగోరి పల్లవించినగాని

టీవి ఫోను కొనగ చేవ లేక

ఇరుగుపొరుగు వారి ఇంటిలో గూర్చుండె

చదువు నేర్వనెంచి శ్రద్ధగాను

 

ఆటవెలది

 

కృత్యపత్రములను నిత్యము వర్క్ షీట్లు

పూర్తి జేయుచుండనార్తితోడ

డెందమందు వారు సందేహములనొంది

అడిగి తెలుసుకొనెను వడిగ జదువ

 

మహేశ్ ముత్యాల

*********************** 

 


అక్షరానికి అంజలి

 

1.

అక్షర సేద్యం

 

అక్షరమనే బీజాన్ని పొలంలో నాటుతాను,

కలం అనే హలంతో పొలం దున్నుతాను,

మధుర భావాలను జల్లులా చిలకరిస్తాను,

ప్రకృతి మాత పరవశించి కరుణించగా,

నా అక్షరములు మొలకలై  పదమనే పైరు అవుతుంది,

పైరు కోతకొచ్చి కవిత్వం

పంటగా మారుతుంది,

నా జీవన ఆధారమైన అక్షరమా నీకు

ఇదే నా హృదయాంజలి.

 

2.

అక్షర నేస్తం

 

నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు

అంతరంగంతో  కలిసి అలజడి సృష్టిస్తాయి

నా అక్షరాలు అంబుధిలో నృత్యమాడే అలలు

తీరం చేరితే చాలు చిలిపి అల్లరి చేస్తాయి

నా అక్షరాలు అక్షరాలా నాకు ప్రియ నేస్తాలు

నా దారినందు ప్రకాశించి సుగమం చేస్తాయి

సిరా తో కలిసి నా జీవితాన సిరి పండించే

అక్షరములారా మీకు వేలవేల  వందనాలు

 

CA కె మల్లికార్జునరావు

**************************** 

 

 

అక్షరముల అమ్మానాన్న

 

అక్షరముల కేది మూల స్థానం?

తాండవ శివుని ఢమరుక నాదములు

పరివర్తన మాయె అక్షర బీజములుగ

బీజము ప్రస్థాన మాయే అక్షరములుగ

అక్షరమాల లాయెను జీవ భాషలుగ

అర్ధనారీశ్వరుడు అమ్మా నాన్న లైన

అక్షరమునకు లే దెన్నడూ నాశనము

క్షరము లేక వెలుగు పంచు నిత్యము

రండు అక్షరమ్మ పూజ సేయుదము

 

 CA కె మల్లికార్జునరావు

 ****************************

 

 

అక్షరం ఒక ఆయుధము

వేల మెదళ్ళను మేల్కొలుపు కార్ముకము...

అక్షరం ఒక సాయుధం

నూతన ఆవిష్కరణలకు మనలో రగుల్చు అగ్నికణం...

అక్షరం ఒక గమనం

మనిషి అంతరంగమందు ఊగిసలాడు ఊసుల శంఖారావం...

 

సి.హెచ్. రజిత,   కరీంనగర్

 *********************************

 

అక్షరం పరమపావనం

తెలుగు అక్షరాబ్యాసం తొలి నాడు తొట్ట తొలి గా శివపంచాక్షరి తో మొదలై ఇంతింతై వటుడు ఇంతితై.. అన్నట్టు సాగుతుంది ప్రస్థానం.

తెలుగు భాష అక్షరముల అమరిక వొద్దిక "నభూతో నభవిష్యతి " లా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం పోతనామాత్యుని విరచితము శ్రీ భాగవతము అని చెప్ప వచ్చు.

సంస్కృతాంధ్ర భాష సమ్మేళనం లోని సౌకుమార్యం వలనే తెలుగు భాష కు ఇంత మాధుర్యం కలిగింది.

అచ్చతెనుగు లో వర్ణాలు 36, సంస్కృతం నుండి తెలుగు లో ప్రవేశించినవి 19 మొత్తం కలిపి 55.

తెలుగు లోని కొన్ని పదాలు చారిత్రక అవశేషాలు గా మిగిలిన పదాలు కూడా ఉన్నాయి. అవి మనలో కొంత మంది తెలియకనే ఉపయోగిస్తూ ఉంటాము.

ఉదా ! పొద +ఇల్లు

మనం టక్కున   పొదరిల్లు అనేస్తాం.

రి ఎక్కడ నుండి వచ్చింది కొంత మంది తెలియదు.

(నిజానికి నాకు తెలియదు తెలుసుకొనే వరకూ).

అంటే పొద యొక్క పూర్వ రూపు పొదరు

పొదరు +ఇల్లు =పొదరిల్లు

కొంత కాలానికి పొదరులో  రేఫ లోపించి

పొదరిల్లు లోని ఆగమం గా నిరూపించారట వైయాకరుణులు.

ఇలా తెలుగు అక్షరము లకు   అభిషేకం

చేసుకుంటూ వెళ్తే ఎక్కడ హారతి ఇవ్వాలో ఎక్కడ మంత్ర పుష్పం చెప్పాలో కూడా తెలియదు. అంతటి

పరమ పావనమైనది మన క్షరం.

 

మాదిరెడ్డి సురేశ్.

********************** 

 

అవధు లెరుగని ఆత్మీయతతో చేయిపెట్టి నడిపించే అమ్మ అక్షరం

అంతులేని జ్ఞానసంపదకు ఆదిమూలం అక్షరం

అజ్ఞానాంభుది దాటించి తీరం చేర్చే దిక్సూచి  అక్షరం

అంధకార అగాదాలను పారద్రోలే దివ్యజ్యోతి అక్షరం

మూర్ఖత్వపు కబంధహస్తాల సంకెలలు చీల్చే ఆయుధం అక్షరం

మనిషి మస్తిష్కంలో కొలువై మనీషిగా మలచే తంత్రం అక్షరం

మాటను మధించి మహిమాన్వితంగా మార్చే మంత్రం అక్షరం

 

వాణిశ్రీ నైనాల

********************* 

 

 

అంటే అమ్మ అని ఆదిగురువు

అమ్మతోనే పలికిస్తుంది అక్షరం

అల్ప అక్షరాలతో అనల్ప అర్థాన్ని

ఇస్తుంది అక్షరం.

అత్యల్ప పొరపాటుతో అన్య

అర్థాన్ని ఇస్తుంది అక్షరం.

అవయవ దారుడ్యం లేనివాడికి

ఆయుధం అవుతుంది అక్షరం.

అక్షర అనంత సాగరం లో ఎంత

జలకాలాడినా అలుపునివ్వద  అక్షరం.

అక్షర సృష్టికర్తను అర్పిస్తోంది

అంజలి అక్షరం.

 

ఉషారాణి

************** 


స్వేచ్చా సమర్పణలు 



 

అక్షరం

 

అమ్మ నేర్పిన తొలి పాఠం అక్షరం

వాగ్దేవి ఓంకార ప్రణవ నాదం అక్షరం

నుండి యాభై ఆరు బండి () రవముల తోరణం అక్షరం

లాక్షణికుల కలమె హలమై పండించు జ్ఞాన సేద్యం అక్షరం

పద్య కవనాల్లో అందంగా ఒడిగిపోవు సాధనం అక్షరం

సుమధుర భావాల సమాహారం అక్షరం

భాష ఏదైనా నేర్చుకోనుటకు మూలాధారం అక్షరం

ఉజ్వల భవితకు వెలుగు కిరణమే అక్షరం

 

ఎం.పద్మలత

 

 

అక్షరమా నీ మూలం ఎక్కడో తెలియదు

కానీ భాషకు బీజం వేసావు

ఆద్యంతాలు లేవు నీకు కానీ జాతి మనుగడకు

నాగరికతకు ప్రాణం పోశావు

నీరూపమది యేమో తెలియదు కానీ

కవుల ఊహాకల్పనకు రూపమిస్తావు

నీ స్వరూపమది యేమో తెలియదు కానీ,

సలలిత సుమధుర సుందర  పద గుంభనలతో

మనసుల వుయ్యాల లూగిస్తావు

నీ పదును ఎంతో తెలియదు కానీ వాడి వేడి, పదాలతో కర్కశుల గుండెలు చీలుస్తావు

నీ దృష్టిపథం ఏమో తెలియదు కానీ

నీతి సూక్తులు వల్లిస్తావు,

మార్గ దర్శనం  చేయిస్తావు

ఏమని పిలవాలి నిన్ను

క్షరం లేని అక్షరమనా

 

అవళూరు సీత

 

 

సర్వ గ్రంథములకు హేతువైన అక్షరానికి అంజలి ఘటించి అక్షర వైభవాన్ని తెలుపు చిరు ప్రయత్నం.  

 

తరువోజ

 

అక్షర మొక్కటే యవని నందుండె యఖిల ప్రాభవమున కాధారము గద

రక్షణగ నిలిచి రమణీయ మిచ్చి రాక్షస ప్రకృతి మార్చగ లౌషధ మిదె

అక్షర సేద్యమే యావత్తు గ్రంథ యవతరణమునకు యాది బిందువయె

మోక్షము నిచ్చు సమ్మోహనాస్త్రముగ మొదటివేల్పు జొనిపి ముదముగ నిచ్చె

 

 

మధురాక్కర

 

అక్షరజ్ఞానమే సత మబ్బురము కలిగించు

అక్షర సుధ ధారలె సర్వ హరువు నిచ్చి నిలుపునె

యక్షునిగ నిన్ను దిద్దెడి యక్షరమాయుధంబె

బిక్షగాడిని మార్చి వివేకుని చేయునిదే

అక్షి దేవతల యనుగ్ర హైశ్వర్య మిచ్చు నిదే

దీక్షగా నక్షరము నేర్వ తేజరిల్ల గలవోయి!

 

(అక్షి దేవతలు: కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి)                       

 

వెంకట్.సిహెచ్

 

 

అక్షరం ఆలోచనవరదైతే

అహం గట్టు తెగాల్సిందే

అక్షరం చిరువెలుగైతే

అంధకారం జడవాల్సిందే

అక్షరం చిరునవ్వైతే

దయావర్షం కురువాల్సిందే

అక్షరం ఆశయమైతే

అందరి కై తపియించాల్సిందే!....

 

రాంమోహన్

 

శీర్షిక.....అక్షరానికి అంజలి

 

అక్షరాలు విత్తులుగా పుడమిపై పర్చగా

వత్తులతో మొలకెత్తె పదాంజలి ప్రసవంలో

అక్షరాభ్యాసంతో అంకురార్పణ గావించి

అక్షరాల తోటలో అక్షరాస్యతే దీక్షగా

అక్షరాల అవనిలో లక్షణాలు చూడగా

పుడమి ప్రగతి పొదిగి ఒదిగె

అక్షరాకృతి బడిలో దివ్వెలై వెలిగె

అక్షరాగారంలో జాగారం చేయాలని

కలము పట్టి వెన్నెల్లో ఊహకెలితే

అందరాని ఆశలాయె కుదురుకోని కూర్పులాయె

నీ వత్తుల పొత్తులతో అక్షర అమరికలో

వెల్లువైన భావాలే వెల్లివిరిసి వెన్నెలాయె

ఆర్తి గా నే చూశా నీ గమనం లో గమ్మత్తు

నిత్యం నీ అన్వేషణ లో సాగాలి నా గమనం

అజ్ఞానపు చెదలు నుండి విజ్ఞానపు సుధల వరకు

అక్షర జ్ఞానమంటూ విశ్వ జ్ఞాన సూత్రమంటూ

అర్పిస్తున్నానే అక్షరంతో అక్షరానికి అంజలి

 

వి. వి. శ్రీనివాస్

 

 


 

వచనం లో నా భావన

 

అక్షరం ఒక అక్షయ పాత్ర

పదాలు,పాటలు,

పద్యాలు, కవితలు, కావ్యాలు ఇలా ఎన్నెన్నో పంచభక్ష్య పరామన్నాలను

మనకు వడ్డించి

తెలుగాకలి తీర్చుతుంది

అక్షరం ఒక పరిమళ పుష్పం

అక్షర సుమాలను

వరుసగా పేర్చి మాలలు కడితే అదొక సాహితీ సుమహారమై

తెలుగుతల్లి

మెడను చేరి

భావ సౌరభాలను

వేదజల్లుతుంది

 

అక్షరం ఒక ఆకాశం

వేల వేల నక్షత్రాల మణిహారమై

మనోహరమైన పదాల వెలుగుల జిలుగులతో మెరిసిపోతుంది

అక్షర ప్రేమికుల

మది మురిసిపోతుంది

 

రమ, కంకిపాడు

 

 

 


 

నిన్న మహాకవి గురజాడ వారి స్మృతిలో నేను వెంకట్ గారు ముత్యాల సరాల్లో లో గేయ ఛందస్సు పరిచయం చేశాము.

 

నేడు కూడా అందరూ అందించిన చక్కని వచన కవితలు చూసి ఒక ప్రయత్నం 

రగడలో, ఉత్కళిక చాలా సులభమే.

 

ప్రతి రెండు పాదాలకూ ప్రాస నియమముంటుంది...    

అంత్యప్రాస కూడా తప్పనిసరి గుణాలు 3 -3 -3 -3 (ప్రతి పాదమునందు నాలుగు 3 మాత్రలు గణములు అవసరం)

తెలుగు అక్షరానికి అంజలి

 

కస్తూరి శివశంకర్

 

పుణ్యపురుషుల చేతిలో

ధన్యజీవుల వ్రాతలో 

మహాకవుల తలపులలో

విహారముల మధుపములో    

కుహరముల నిరీక్షణలో

విహగములై  భ్రమణములో  

 

సలలితంబు సుధల వోలె

చెలియ నూపురముల వోలె 

కలికి చిలుక రవళి వోలె  

తెలుగు భాష వెలగ వోలె  

అలతి పదముల ద్యుతి వోలె   

మలయజ తీరముల వోలె   

మొలక నగవుల శృతి వోలె   

వెలయు తెలుగు భాషవోలె

 

తాళపత్రాల మీద తళుక్కున

మురిపిస్తూ 

కవుల కరాంచలంబుల 

మాటున మెరుస్తూ ఉంటాను...

 

జనుల నాల్కలపై నాట్యమాడుతూ

అంతటా నేనే.. ఎక్కడ చూసినా నేనే

 

తెల్లని కాగితంపై నీలి నక్షత్రాల వోలె

చల్లని మనసుపై చిరు వెన్నెల వోలె

మెల్లగ వీచిన మధూదయపు పవనము వోలె

కల్లాకపటము తెలియని పసిపాప వోలె

 

నన్నయ నుండి శ్రీశ్రీ వరకు

పెద్దన నుండి పోతన వరకు

శ్రీనాధ నుండి విశ్వనాధ వరకు

వేమన నుండి యండమూరి వరకు

అందరికీ ఆప్త బంధువుని

నవ్విస్తాను , కవ్విస్తాను

లాలిస్తాను, ఊరడిస్తాను

అలిచింపచేస్తాను

 

వాసి తగ్గకుండా

ఇక నా దశను, దిశను 

మహర్దశను నిర్దేశించేది 

మీరే..మీరే

పాఠకులారా !!!!!

 

కస్తూరి శివశంకర్

ముత్యాల  సరాలు  ఛందస్సు, నా  చిరు  ప్రయత్నము

 

తలపు మధురిమ కథల నిండగ

వలపు పిలుపుల వగపు యేలర

మలుపు మాటున నిన్ను గానక

అలసినదిరా మది

 

పిలుపు వినబడి కనులు వెదికెను

చెలుని రాకతొ యెదలు పొంగగ

కలువ తావుల  సేద తీరెను

చిలిపి బాసలె విని

 

పిలుపు వినగా వ్యధలు  తీరెను

అలుపు సొలుపుల మనము మరిచే

కలలు వెలుగుల అలగ కదలగ

వలపు సుధలు కురిసె

 

అవళూరు సీత

 

 

ఇంత చక్కగా...

అక్షర అల్లికలు అల్లిన

అక్కలకు, అమ్మలకు

అన్నలకు, అయ్యలకు

అభినందన అందిస్తున్న....

 

అక్షర ప్రేమికుడు - సూర్య తాడిపూడి.


 

నాటి శంకరాభరణం వారి సమస్య

లక్ష్మీ పతి భర్త యయ్యె లలన నగజకున్

విష్ణువు పార్వతీ దేవి భర్త అని‌ అసమంజసముగా సమస్య ఇచ్చారు

ఇచ్చిన పాదము కందమునా పూరణము సీసములో

 

ఒక గురు కులములో  ఒక‌ముని‌ తన‌ శిష్యులకు దేవతల బంధుత్వాలు తెలియ పరచుట.

 

వాసుదేవుడు సత్యభామ వల్లభుడుద్రౌపదికి భర్త కిరీటి,పాండురాజు

మనువాడె గా కుంతి మాద్రులన్,కోదండ రాముడు నాధుడు రమణి సీత

కు తరచి చూడంగ,నతివ సరస్వతి బ్రహ్మ పట్టమహిషి,పైడి నెలత

ప్రభువు లక్ష్మీపతి,భర్త యయ్యెలలన నగజకు  నా వైద్య నాదుడు ,సతి

గాదె వల్లి యా గుహునకు, కరిముఖునకు

సిద్ది బుధ్ధులు పత్నులు చెలిమి బడసి,

ననుచు వివరములను తెలిపె నొక తపసి

తనదు శిష్యులకు కడు ము‌దమ్ము తోడ

పూసపాటి

 

 

తేటగీతి

అంజలి ఘటించి వేడెద మాంజనేయ!

వజ్రకంఠుడా! పాదాభివందనంబు

కరొన పీచమణచవయ్య గాడ్పుపట్టి!

కరుణజూపి మమ్ము నిలిపి ఘనతనిమ్ము

వెంకట్ సి.హెచ్

జర లైట్ తీస్కో

(లైటుగానే తీసుకుంటావులే! ఎంతైనా తెలుగోడివి కదా సోదరా)

 

 ఎవడికైతే, కడుపులో కాలో... ఇంకెక్కడో కాలో...  అసలు కాలో, కాలకో...కాలీ కాలకో.... ఎదుటివాణ్ణి  అణగద్రొక్కే  ప్రోసెస్సులోనో ...కుళ్ళు బుర్రలో బూతుల దండకాన్ని అనాయాసంగా అనర్గళంగా అనంతంగా ''నీయమ్మ'' అనే హూంకారాక్షరితో మొదలుపెట్టి పెట్టి పెట్టీ అది బేసులో పుట్టి పుట్టి పుట్టీ , ఫేసులోని నోటి  దాకా తెగ ఎగ బ్రాకి బ్రాకి బ్రాకీ...  ఒక్క ఎముకైనా లేకుండా అడ్డమైన ముక్కలూ తిని తిని తినీ... బలిసి బలిసి బలిసీ   తైతక్కలాడుతూ  కనిపించే నాలుకాలకూట విషాయుధంతో  వెళ్లగక్కుతాడోవాడికే అమ్మ నాలుక దినం జరుపుకునే హక్కు ఉందని నేను ఏదీ నొక్కి వక్కాణించకుండానే బాహాటంగా చెప్పేస్తున్నాను మమ్మీల్లారాడ్యాడీల్లారా

 

మన యూతుకేమో భాషా సరిగ్గా రాదు మరి! ఇంక తెలుగు బూతులేం వస్తాయ్ నా బొంద?? ఒరే ఇవాళ అమ్మ నాలుక దినంరా! తెలుగులో ఒక్కటి ఒక్కటంటే ఒక్క బూతైనా చెప్పారాఅంటే ... షిట్ యా  అంటాడొకడు  లేదా మన  మాటని పెడ చెవిన పెట్టి  ''ఫక్కుమని'' కాస్త గట్టిగా నవ్వేసో/అనేసో  వెళ్ళిపోతుంది ఇంకోత్తి.

అసలు ఎవర్నని  ఏం లాభం ఇప్పుడు ? నిరక్షురాస్యులైన తెలుగు  పేద ప్రజలు కొందరు, ఇళ్లల్లో భక్తిగా బూతులు మాట్లాడేసుకుంటూ ఉంటారువాళ్ళండి బాబూ...  అసలు సిసలైన తెలుగోళ్లంటే! వాళ్ళు మాట్లాడే బూతుల్లో తెలుగు భాష పట్ల  ప్రేమ అపారంగా కనిపిస్తుంది. కావలిస్తే మీరు చెవులు రిక్కించి వినండి.

  కాన్వెంటు మమ్మీలూ డ్యాడీలూ కొందరు ఉన్నారు చూశారూ! ఇంగ్లీషోళ్ళకి సైతం గ్రమాటికల్ ఇంగ్లీషు నేర్పించే రకం. పొరపాటున బిడ్డ తెలుగు మాట్లాడితే నాలుగు వడ్డించే రకం కూడానూ. అంతెందుగ్గానీ, ఓసారి, అమ్మమ్మ తన  మనవరాలికి తెలుగు పద్యాలు నేర్పిస్తూడడం చూసిన

డాట్రిల్లా, పెద్దావిడకి తలంటు పోసేసింది.

 హు! లాభం లేదు .. ఇంకొక్కటే మార్గం మరి!

అయ్యా వేటూరిగారూమీరు లోకాన ఉన్నారో కానీ... ఏడాదికోసారైనా ఎవరో ఒకరిలో పరకాయ ప్రవేశం చేసేసి,   * అంటే అమలాపురం లాంటి  పాటలు వ్రాయించేయండి. తెలుగు ప్రొడ్యూసర్ల కోరిక భరించలేక కసి కొద్దీ తెలుగు జనాల మీదికి వదిలిన బూతు పాటని...  ఆహా ఓహో ! తెలుగు అక్షరం ముక్క రాని తెలుగు యూతు మాత్రమే కాకుండా తెలుగేతర యూతు సైతం భక్తిగా బట్టీ కొట్టేసి చిందులేశారు.... మీరు  కళ్లారా చూశారు కూడానూఅంతెందుకూ! శంకరాభరణం పాటలను సైతం పామరుల బుర్రలకెక్కించిన మహాత్ములు మీరు పాటలతోటేగా రోజుల్లో సంగీత కళాశాలలు కళకళ్ళాడిపోయాయ్... పాటలు మ్రోగని ఇళ్ళూ లేకుండా పోయాయ్ కూడానూ!

బాబ్బాబూ మీకు  పుణ్యం ఉంటుంది ఏడాదికో తెలుగు బూతు పాటైనా  వ్రాయించరూ.... ఉన్నోళ్ల  బుర్రలోకి దూరి... కాసింత బూతు దయ ప్రసాదించండి మహాప్రభో!

విధంగానైనా తెలుగు అబ్బుతుందేమో!

 

ఇట్లు తెలుగు భౌభౌదీయుడు

 

----.----

అత్తిలి అనంతు


 

#హన్నుగాడి_సుబ్బుబాబాయ్ . . . . .            విష్ణుప్రియ

 

 

ఊర్లో ఆంజనేయస్వామి బొమ్మ దగ్గర బస్సు దిగి , దారిలో అందరిని పలకరించుకుంటూ మా వీధి మొదలుకి వచ్చేసరికి..  ఏఁవే అమ్ములూ వచ్చావా ? ప్రయాణం బా జరిగిందా ? నువ్వూ పిల్లాడే వచ్చారా ? అల్లుడు బాగున్నారా ? ప్రశ్నలు సంధిస్తూ చిరునవ్వుతో ఎదురొస్తాడు సుబ్బు బాబాయ్ !

 

యాదృచ్చికమో , మా అనుబంధం వల్ల ముందే తెలిసి ఎదురుచూస్తూ ఉంటాడో తెలియదు ,తన చల్లని ఆహ్వానంతో హమ్మయ్యా పుట్టింటికి వచ్చేసాననిపిస్తుంది!!

 

మా శీను బాబాయ్ ఫ్రెండ్స్ అంతా నాకు బాబాయ్ లు , మావయ్యలు, పుట్టినప్పటి నుంచి వెయ్యిళ్ళపూజరిలా పెరిగిన నాకు మా వీధిలో ఉన్న హెడ్మాస్టార్ బామ్మ నుంచి సుబ్బు బాబాయ్ వరకూ అందరూ ఫ్రెండ్సే !!

 

నేను, హన్నుబాబు , గణేష్  ,ప్రసాద్ ఆడుకునే అల్లరి ఆటల్లో ,పెద్దవాళ్ళు వేసే వీపప్పచ్చుల నుంచి తప్పించి వాళ్ళింట్లో దాచి ఆదుకునేవాడు మా హన్నుగాడి సుబ్బు బాబాయ్ !

 

ఆదివారం 4 గంటలకొచ్చే సినిమాకోసం 3.30 కల్లా సుబ్బు బాబాయ్ వాళ్ళ అరుగుమీద సెటిల్ అయ్యేదాన్ని , బామ్మ గారు అడిగేవారు ఏఁవిటే రోజు ఆదివారమా? అని , అవును బామ్మ గారు, అయినా ఇంకా టైం ఉందిలెండని , ఆవిడ పక్కన కూర్చుని పిచ్చాపాటి మాట్లాడేదాన్ని , ఆవిడకి నాకు రెండుతరాల అంతరం ఉన్నట్టు ఎప్పుడూ అనిపించేది కాదు , నా వీరగాథలన్నీ విసుక్కోకుండా వినేవారు, మా వల్లత్త ప్రేక్షకపాత్ర వహించేదివాగి వాగి అలిసి పోయుంటావ్ ఇందా .. ఈరోజు నేను చేసిన మైసూర్ పాక్ తిను అని అదేదోలా ఉండే పసుపు ముద్ద చేతిలో పెట్టేవాడు, వారమన్నా వదిలేయ్ బాబాయ్ అని లోపల అనుకుంటూ ..హి హి హి అని నవ్వి జై శ్రీరామ్ అని నోట్లో వేసుకునేవాళ్ళం , పర్లేదు డాబర్లాల్ బానే పని జేస్తోంది అనుకుని, టివి లో సినిమా అనే అంశానికి వెళ్ళే వాళ్ళం ఆసక్తిగా అనిపిస్తే మాతో కూర్చుని చూసేవాడు , లేదంటే నీట్ గా రెడీ అయ్యి సైకిలెక్కి , సినిమా క్లైమాక్స్ టైమ్ కి సైకిల్ దిగేవాడు , మా మొహాల్లో ఆత్రుత కనిపిస్తే సైలెంట్ గా పక్కకి వెళ్ళేవాడు, లేదంటే ఏంటి తుస్సా? అంటూ నవ్వుతూ వచ్చేవాడు !!

 

మా వీధి మొత్తానికి , అహ ,మా ఊర్లో మహా అందగాడు మా సుబ్బు బాబాయ్ , క్రమశిక్షణ అయిన జీవితం తన లక్ష్యం , తన నడక కూడా ఎంత మెత్తగా ఉంటుందంటే నేలమీదున్న మట్టి కూడా మా బాబే అని దణ్ణం పెడుతుంది !

 

పెద్ద బాబయ్యలు , అత్తలు .. పెళ్ళి చేసుకోరా అని చెప్తున్నా వినకుండా , బామ్మ కోసం పెళ్ళి చేసుకోకుండా బామ్మ తోనే ఉండిపోయాడు, ఆవిడ మాత్రం తనని అన్యాయం చేసి మూట ముల్లె ఇక్కడే వదిలేసి దేవుడ్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది !!

 

రెండేళ్ళు గడుస్తున్నా .. వయసులో నాకు పెళ్లేమిటి ? వద్దని , పోనీ మాతో ఉండరా అని అన్నా-వదినలు చెప్పినా వినకుండా  , భోజనానికి మాత్రం వాళ్ళింటికి వెళ్లి , రాత్రికల్లా బామ్మగారు ఖాళీ చేసిన ఇంట్లో తనే నిండు దీపం పెట్టి , నలుగురితో కాసేపు లోకాభిరామాయణం , అప్పుడప్పుడు ఒంటరిగా వంటింట్లో ప్రయోగం !!

 

వీధిలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే రోజూ వెళ్లి వాళ్ళని పలకరించడం , ఏదైనా అవసరం ఉందేమో అని గమనిస్తూ ఉండటం తన దినచర్యలో భాగం , మొన్నామధ్య సెలవుల్లో నాకు ఒంట్లో బాగోకపోతే ఇంట్లో మనిషిలా రోజూ పలకరించేవాడు , ఇన్నాళ్ళైనా తగ్గట్లేదు తాయెత్తు కట్టించుకోవే ఏదైనా గాలి సోకిందేమో అని ప్రేమగా బాధపడేవాడు , ఓరోజు మా పాపత్తకి ప్రాణం మీదకొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లబోతుంటే....

పెద్దన్నయ్యా !! డబ్బులేమన్నా అవసరం పడతాయేమో నా దగ్గర రెడీగా కొంతుంది ,ఇమ్మంటావా? అని నేనుకూడా ఉన్నానని నాన్నగారికి భరోసా ఇచ్చేవాడు ..

 

ఉద్యోగాలయ్యి చిన్నవాళ్ళు, వయసయ్యి పెద్దవాళ్ళు వీధి వీధంతా ఖాళీ చేసేస్తే, నేనున్నాగా అని మెరుపు నవ్వులతో కనిపిస్తాడు !!

 

ఒక నెల క్రితం మధ్యాహ్నం భోజనాల సమయానికి మా చెల్లి నుంచి మెసేజ్ సుబ్బు బాబాయ్ లేడు అని, ముందు అస్సలు నమ్మబుద్ధి కాలేదు, హెడ్మాస్టార్ తాతయ్య గారి బుజ్జి కి ఫోన్ చేసి అడిగితే వాడికి తెలియదు సరికదా, జోకులేయకు, సుబ్బరంగా ఉండే సుబ్బుబాబాయ్ కి ఏం కాదు అన్నాడు,... ఇలాక్కాదని అమ్మకి చేస్తే ఫోన్ చెల్లి ఎత్తి చెప్పింది , అందరూ అక్కడే ఉన్నారు , హార్ట్ ఎటాక్ వచ్చిందిట అంది !!

 

ఇల్లు-వీధి ఒకేసారి ఖాళీ చేసి , బామ్మగారిని వెతుక్కుంటూ తనూ వెళ్ళిపోయాడు మా హన్నుగాడి సుబ్బు బాబాయ్ !!

 

 విష్ణుప్రియ 


 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...